భాగవత మహా పురాణము
15 - సదాచార నిరూపణము
నారద ఉవాచ ।
కర్మనిష్ఠా ద్విజాః కేచిత్ తపోనిష్ఠ నృపాపరే ।
స్వాధ్యాయేఽన్యే ప్రవచనే యే కేచిజ్ ఙ్ఞానయోగయోః ॥
నారద మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! వేదవేత్తలలో కొందరు కర్మలయందు, కొందరు తపస్సునందు, మరికొందరు వేదమును వల్లించుటయందు, ఇంకొందరు బోధించుటయందు, ఎవరో కొందరు ఆత్మ జ్ఞానమునందు, ఇంకా కొందరు భగవద్ధ్యానమునందు నిష్ఠను కలిగియుం దురు.
జ్ఞాననిష్ఠాయ దేయాని కవ్యాన్యానంత్యమిచ్చతా ।
దైవే చ తదభావే స్యాదిత రేభ్యో యథార్హతః ॥
శ్రాద్దమునందు, దేవపూజయందు అనంతమగు ఫలమును కోరే వ్యక్తి క్రమముగా కవ్య (పితృదేవతలకు సమర్పించేది)-హవ్య (ఈశ్వరు నకు అర్పించేది) ములను జ్ఞాననిష్ఠుని కొరకు సమర్పించవలెను. అట్టి వ్యక్తి లేని పక్షములో ఇతరుల కొరకు వారి అర్హతను బట్టి దానము చేయవ లేను.
ద్వౌ దైవే పితృకార్యే త్రినేకైకముభయత్ర వా ।
భోజయేత్సుసమృద్ధోఽపి శ్రాద్ధే కుర్యాన్న విస్తరమ్ ॥
ఎంతటి సంపన్నుడైననూ శ్రాద్దములో విశ్వేదేవ స్థానమునందు ఇద్దరిని, పితరుల స్థానమునందు ముగ్గురిని, లేదా రెండు స్థానములలో ఒక్కొక్కరిని భోక్తలను భుజింప జేయవలెను. అంతేగాని, భోక్తల సంఖ్యను ఇంతకు మించి పెంచరాదు.
దేశకాలోచితా శ్రద్ధా ద్రవ్యపాత్రార్షణాని చ ।
సమ్యగ్ భవంతి నైతాని విస్తరాత్స్వజనార్పణాత్ ॥
శ్రాద్ధాదులయందు విస్తారము చేయుట వలన, తన బంధువులను జమ చేసి వారికి భోజనాదులను సమర్పించుట వలన, ఆ దేశకాలములకు ఉచితమైన శ్రద్ద లోపించును. ద్రవ్యములు, భోక్తల యోగ్యత, వారికి చేసే పూజాదికము ఇత్యాదులు కూడ చక్కగా ఉండవు.
దేశే కాలే చ సంప్రాప్తే మున్యన్నం హరిదైవతమ్ ।
శ్రద్దయా విధివత్పాత్రే న్యస్తం కామధుగక్షయమ్ ॥
యోగ్యమగు దేశమునందు యోగ్యమగు కాలములో అడవి బియ్యముతో వండిన అన్నమునైననూ శ్రీహరికి నివేదించి శ్రద్దతో యోగ్యు డగు వ్యక్తికి సమర్పించినచో, అది ఆ దాతయొక్క కామనలను ఈడేర్చు టయే గాక, అనంతఫలమగు మోక్షమునకు కూడ దారి తీయును.
దేవర్షిపితృభూతేభ్య ఆత్మనే స్వజనాయ చ ।
అన్నం సంవిభజన్ పశ్యేత్సర్వం తత్పురుషాత్మకమ్ ॥
సాధకుడు దేవతలకు, మహర్షులకు, పితృదేవతలకు, ఇతరప్రాణు లకు, తనకు, తనవారికి కూడ ఆహారమును చక్కగా పంచి ఇస్తూ, వారందరిని పరమేశ్వర స్వరూపులుగా భావన చేయవలెను.
న దద్యాదామిషం శ్రాద్దే న చాద్యాద్దర్మతత్త్వవిత్ ।
మున్యన్నైస్స్యాత్పరా ప్రీతిర్యథా న పశుహింసయా ॥
ధర్మముయొక్క స్వరూపమునెరింగిన సాధకుడు శ్రాద్ధమునందు మాంసమును వడ్డించరాదు; తాను కూడ తినరాదు. మునులు తినే అడవి బియ్యపు ఆహారమును వడ్డించిననూ, పితృదేవతలకు ఎట్టి మహాప్రీతి కలు గునో, అట్టి ప్రీతి పశువులను హింసించి మాంసమును సమర్పించుట వలన కలుగదు.
నైతాదృశః పరో ధర్మో నృణాం సద్ధర్మమిచ్ఛతామ్ ।
న్యాసో దండస్య భూతేషు మనోవాక్కాయజస్య యః ॥
ధర్మము పరమేశ్వరుని రూపమే. అట్టి ధర్మమును కోరే సాధకుల కు, మనోవాక్కాయముల ద్వారా ఇతరప్రాణులకు కలిగే హింసను పరిత్యా గము చేయుట సర్వోత్కృష్టమైన ధర్మము.
ఏకే కర్మమయాన్ యజ్ఞాన్ జ్ఞానినో యజ్ఞవిత్తమాః ।
ఆత్మసంయమనేఽనీహా జుహ్వతి జ్ఞానదీపితే ॥
యజ్ఞముయొక్క స్వరూపమును తెలిసినవారిలో అగ్రేసరులగు కొందరు నిత్యానిత్యవస్తువివేకము గలవారై కామనలను పారద్రోలి, కర్మ రూపములోనుండే యజ్ఞములను జ్ఞానముచే ప్రజ్వలితము చేయబడిన మనోనిగ్రహము అనే అగ్నియందు హోమము చేయుదురు.(అనగా బాహ్యకర్మలనుండి విరమించేదరు).
ద్రవ్యయఙ్ఞైర్యక్ష్యమాణం దృష్ట్వా భూతాని బిభ్యతి ।
ఏష మాఽకరుణో హన్యాదతజ్ ఙ్ఞో హ్యసుతృబ్ ధ్రువమ్ ॥
ద్రవ్యములతో చేసే యజ్ఞమునకు పూనుకున్నవానిని చూచి ప్రాణులు ఈ విధముగా భయపడును -- ఈతడు దయలేనివాడు, ధర్మస్వ రూపము తెలియనివాడు, తన ఇంద్రియముల తృప్తియే లక్ష్యముగా గల వాడు. ఈతడు నిశ్చయముగా నన్ను చంపును.
తస్మాద్ధైవోపపన్నేన మున్యన్నేనాపి ధర్మవిత్ ।
సంతుష్టాఽహరహః కుర్యాన్నిత్యనైమిత్తికీః క్రియాః ॥
కావున, ధర్మరహస్యమునెరింగిన సాధకుడు మునులు తినే హవి స్సుతోనైననూ సంతోషమును పొంది, ప్రతిదినము సంధ్యావందనాది నిత్య కర్మలను, దానము మొదలగు నైమిత్తిక కర్మలను చేయవలెను.(కామ్యక ర్మల కొరకై హింసను చేయరాదు).
విధర్మః పరధర్మశ్చ ఆభాస ఉపమా చలః ।
అధర్మశాఖాః పంచేమా ధర్మ ఙ్ఞోఽధర్మవత్యజేత్ ॥
విధర్మము, పరధర్మము, ఆభాస, ఉపము, ఛలము అనే అయిదు అధర్మము (ముళ్లచెట్టు) యొక్క శాఖలను ధర్మము తెలిసినవాడు అధర్మ మును వలే విడిచి పెట్టవలెను.
ధర్మబాధో వీధర్మస్స్యాత్పరధర్మోఽన్యచోదితః ।
ఉపధర్మస్తు పాఖండో దంభో వా శబ్దభిచ్ఛలః ॥
ఏ పనిని చేయుటచే తన ధర్మమునకు ముప్పు వాటిల్లునో, అది విధర్మము (వామాచారము మొదలైనవి). అన్యునిచే అన్యుని కొరకు' విధిం చబడినది పరధర్మము (క్రైస్తవము మొదలైనవి). వేదవిరుద్దమగు ఆచా రము (తనను తాను హింసించుకొనుట మొదలైనవి), డాంబీకము ఉపమ లు. శాస్త్రవచనమునకు తప్పుగా వ్యాఖ్యానించుట (భేదమే సత్యము ఇత్యాది బోధలు) ఛలము (మోసము).
యస్త్విచ్చయా కృతః పుంభిరాభాసో హ్యాశ్రమాతృథక్ ।
స్వభావవిహితో ధర్మః కస్య నేష్టః ప్రశాంతయే ॥
మానవులు నాలుగు ఆశ్రమధర్మములకంటె విరుద్దముగా తమ ఇచ్చవచ్చినట్లుగా కొన్ని ఆచారములను కల్పించుచుందురు. అట్టి కల్పన ధర్మముయొక్క ఆభాసమే గాని, ధర్మము కాదు. మానవుని స్వభావమును బట్టి విధించబడిన ఆశ్రమధర్మము ఎవనికి ప్రశాంతిని కలిగించ సమర్థము కాదు?(అనగా, అందరికి పరమశాంతిని చేగూర్చును).
ధర్మార్థమపి నే హేత యాత్రార్థం వాఽధనో ధనమ్ ।
అనీహానీహమానస్య మహాహేరివ వృత్తిదా ॥
సాధకుడు బీదవాడైననూ ధర్మమును చేయుటకు గాని, జీవనయా త్రకైననూ ధనమును యాచించరాదు. కామనలు లేనివానికి వాని నిష్కాము తయే (దానిచే సూచించబడిన దైవమే), కొండ చిలువకు వలే, బ్రదుకుదెరు వును కల్పించును (కొండ చిలువ తన వద్దకు నడచి వచ్చిన ప్రాణిని తిని బ్రదుకును).
సంతుష్టస్య నిరీహస్య స్వాత్మారామస్య యత్సుఖమ్ ।
కుతస్తత్కామలోభేన ధావతోఽ ర్ధేహయా దిశః ॥
కామనలు లేకుండా సంతుష్టితో తన స్వరూపమునందే విశ్రాంతి నీ, ఆనందమును పొందే వివేకికి లభించే ఆనందము -- భోగవస్తువుల యందలి లోభముతో, ధనమునందలి కామనతో దిక్కులలో పరుగులు తీసే వానికి ఎక్కడ లభించును?(లభించదు).
సదా సంతుష్టమనసస్సర్వాస్సుఖమయా దిశః ।
శర్కరాకంటకాదిభ్యో యథోపానత్పదశ్శివమ్ ॥
చెప్పులు ఉన్న పాదమునకు గులకరాళ్లు, ముళ్లు మొదలగువాటి వలన దుఃఖము కలుగదు. అదే విధముగా, అన్ని కాలములలో సంతృప్తిని చెంది ఉండే మనస్సునకు చుట్టూ దిక్కులు అన్నీ సుఖముతో నిండియుం డును.
సంతుష్టః కేన వా రాజన్న వర్తేతాపి వారణా ।
ఔపస్థ్యజైహ్వ్యకార్పణ్యా ద్గ్ర హపాలాయతే జనః ॥
ఓ రాజా! సంతృప్తి గలవాడు నీటిని త్రాగియైననూ సుఖముగా జీవించగలడు. అట్లు కాకుండుటకు హేతువు ఏమియు లేదు. మానవుడు ఇంద్రియభోగములయందు, జిహ్వయొక్క చాపల్యమునందు ఉండే లోభము వలన ఇంటి కుక్క వలె ప్రవర్తిల్లును.
అసంతుష్టస్య విప్రస్య తేజో విద్యా తపో యశః ।
స్రవంతీంద్రియలౌల్యేన జ్ఞానం చైవాపకీర్యతే ॥
సంతృప్తి లేని విప్రునకు వర్చస్సు, విద్య, తపస్సు మరియు కీర్తి క్షీణించిపోవును. ఆతని జ్ఞానము కూడ నిశ్చయముగా తొలగిపోవును.
కామస్యాంతం చ క్షుత్తృడ్బ్యాం క్రోధ స్యైతత్ఫలోదయాత్ ।
జనో యాతీ న లోభస్య జిత్వా భుక్త్వా దిశో భువః ॥
ఆకలి దప్పికలు తీరగానే తినాలనే కోరిక, త్రాగాలనే కోరిక అంత మగును. కోపము కూడ దాని పని పూర్తియే ఫలము ఉదయించగానే అంత మగును. కాని, మానవుడు భూలోకములోని దిక్కులనన్నిటినీ జయించి భోగించిననూ, వాని లోభము అంతము కాదు.
పండితా బహవో రాజన్ బహుఙ్ఞాస్సంశయచ్చిదః ।
సదసస్పతయోఽప్యేకే అసంతోషాత్పతంత్యధః ॥
ఓ మహారాజా! కొందరు పండితులు చాల తెలిసి సందేహ ములను పోగొడుతూ సభలకు అధ్యక్షులై యుండి కూడ సంతుష్టి లేని కారణముగా అధఃపతితులగుదురు. ఇట్టి వారి సంఖ్య చిన్నది కాదు.
అసంకల్పాజ్జయేత్కామం క్రోధం కామవివర్జనాత్ ।
అర్థానర్ధేక్షయా లోభం భయం తత్త్వావమర్శనాత్ ॥
భోగ్యములను సంకల్పించుట మానివేసినచో, కోరికలపై విజ యము లభించును. కోరికలను విడిచి పెట్టినచో, కోపముపై జయము కలు గును. ధనమును ప్రోగుచేసుకుంటూ పోతే మిగిలేది ఆపదయేనని గుర్తించి నచో, లోభము దూరమగును. వస్తుస్థితిని జాగ్రత్తగా పరిశీలించినచో, భయ హేతువు దూరమై భయము దూరమగును.
ఆన్వీక్షిక్యా శోకమోహౌ దంభం మహదుపాసయా ।
యోగాంతరాయాన్ మౌనేన హింసాం కాయాద్యనీహయా ॥
ఆత్మానాత్మవివేకముచే శోకమును వ్యామోహమును జయించవ లెను. మహాత్ములను సేవించినచో డాంబీకము తొలగిపోవును. నలుగురు కలిసి కబుర్లాడుచున్నచో, సాధనకు విఘ్నము కలుగును. ఇట్టి విఘ్నము లను మౌనముచే జయించవలెను. దేహమును, ఇంద్రియములను నిశ్చే ష్టగా ఉంచినచో, హింసపై విజయము లభించును. .
కృపయా భూతజం దుఃఖం దైవం జహ్యాత్సమాధినా ।
ఆత్మజం యోగవీర్యేణ నిద్రాం సత్త్వనిషేవయా ॥
ఇతరప్రాణుల వలన దుఃఖము కలిగినచో, దుఃఖమును కలిగించిన ఆ ప్రాణుల పైననే దయను చూపినచో, ఆ దుఃఖమును జయించవచ్చును. ప్రారబ్దవశముగా వచ్చే దుఃఖమును ఆత్మనిష్ఠ (అంతర్ముఖత్వము) చే జయించవలెను. దేహములో వ్యాధులు మొదలగువాటి వలన కలిగే దుఃఖమును యోగాభ్యాస బలముచే దూరము చేసుకొనవలెను. సత్త్వగుణ మును పెంపొందించే ఆహారము మొదలగువాటిని సేవించినచో, అధికనిద్ర దూరమగును.
రజస్తమశ్చ సత్త్వేన సత్త్వం చోపశమేన చ ।
ఏతత్సర్వం గురౌ భక్త్యా పురుషో హ్యంజసా జయేత్ ॥
మానవుడు రజోగుణము (భోగపరాయణత్వము) ను, తమోగు ణము (సోమరితనము) ను సత్త్వగుణము (వైరాగ్యము, జ్ఞానమునందలి ప్రీతీ) చే జయించవలెను. సాధకుడు సత్త్వగుణమును కూడ ఉపశమము (శాంతమైన మనస్సు) చే జయించవలెను. ఈ దోషములనన్నింటినీ మాన వుడు గురువునందలి భక్తిచే తేలికగా నిశ్చయముగా జయించవచ్చును.
యస్య సాక్షాద్భగవతి జ్ఞానదీపప్రదే గురౌ ।
మర్త్యాసద్ధీశ్శ్రుతం తస్య సర్వం కుంజరశౌచవత్ ॥
జ్ఞానమనే దీపమును అనుగ్రహించిన గురువు సాక్షాత్తుగా భగవా నుడే. అట్టి గురువునందు ఎవనికైతే, ఈయన మామూలు మనిషే అనే ధారణ ఉండునో, వానికి చేసిన శాస్త్రశ్రవణమంతా ఏనుగు చేసిన స్నానము వలె వ్యర్థము (ఏనుగు స్నానము చేసి బూడిదను చల్లుకొనును),
ఏష వై భగవాన్ సాక్షాత్ప్రధానపురుషేశ్వరః ।
యోగేశ్వరైర్విమృగ్యాం ఘ్రిర్లోకో యం మన్యతే నరమ్ ॥
ఈ శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా ప్రకృతికీ, జీవులకు ప్రభుడగు భగవా నుడే. ఇది నిశ్చయము. యోగిపుంగవులు ఈయన పాదములను తమ హృదయములో ధ్యానించెదరు. కాని లోకము ఈయన సామాన్యమానవు డని తలపోయును. అదే విధముగా, గురువు కూడ భగవానుడే.
షడ్వర్గసంయమైకాంతాస్సర్వా నియమచోదనాః ।
తదంతా యది నో యోగానావహేయుశ్శ్రమావహాః ॥
శాస్త్రములో బోధించబడిన నియమములన్నింటికీ పరమప్రయోజ నము కామక్రోధలోభమోహమదమాత్సర్యములనే ఆరు శత్రువుల వర్గమును (అయిదు జ్ఞానేంద్రియములను, మనస్సును) వశము చేసుకోను టయే. ఇట్లు వశము చేసుకున్న తరువాత కూడ ఆ నియమములు భగవా నుని ధారణను, ధ్యానమును, సమాధిని ఈయలేకపోయినచో, అవి కేవ లము నిష్పలమగు శ్రమను మిగిల్చేవి మాత్రమే.
యథా వార్తాదయో హ్యర్థా యోగస్యార్థం న బిభ్రతి ।
అనర్థాయ భవేయుస్తే పూర్తమిష్టం తథాఽసతః ॥
మానవుడు వ్యవసాయము మొదలగువాటిని చేసి వాటి ఫలములు పొందుచుండును. ఈ కర్మలు, వాటి ఫలములు వ్యక్తికి సంసారము కొనసా గుటకు మాత్రమే పనికి వచ్చునే గానీ, మోక్షమును సంపాదించి పెట్టలేవు. అదే విధముగా, దుర్బుద్ధి గలవాడు చేసే పూర్తకర్మలు (ప్రజలకు ఉపయో గించే చెరువులను త్రవ్వించుట మొదలగు పనులు), ఇష్టకర్మలు (యజ్ఞ ములను చేయుట) కూడ సంసారమును కొససాగించునే గాని, మోక్షమునకు దారి తీయవు.
యశ్చిత్తవిజయే యత్తస్స్యాన్నిస్సంగోఽపరిగ్రహః ।
ఏకో వివిక్తశరణో భిక్షుర్భిక్షామితాశనః ॥
ఎవడైతే చిత్తమును జయించుటకు పూనుకొనునో, ఆతడు సంగ మును పరిగ్రహము (భోగవస్తువులను ప్రోగుచేయుట) ను విడిచి పెట్టవలె ను. పవిత్రమగు స్థానమునందు ఏకాంతముగా నుండవలెను. భిక్షుకుడై భిక్షాన్నమును కూడ మితముగా భుజించవలెను.
దేశే శుచౌ సమే రాజన్ సంస్థాప్యాసనమాత్మనః ।
స్థిరం సమం సుఖం తస్మిన్నసీతర్జ్వంగ ఓమితి ॥
ఓయీ మహారాజా! సొధకుడు స్వచ్చమైన సమతలస్థానము నందు తన ఆసనమును చక్కగా వేసుకొని, దానిపై స్థిరముగా సమముగా సుఖముగా నిటారైన అవయవములు గలవాడై కూర్చుండి ఓంకారమును జపించవలెను.
ప్రాణాపానౌ సన్నిరుధ్యాత్పూరకుంభకరేచకైః ।
యావన్మనస్త్యజేత్కామాన్ స్వనాసాగ్రనిరీక్షణః ॥
మనస్సు కామనలను (సంకల్పములను) విడిచి పెట్టేటంతవరకు సాధకుడు తన ముక్కు కొనపై ధ్యాసను ఉంచి, పూరక కుంభక రేచకము లనే ప్రాణాయామమును చేయవలెను. గాలిని నిండా పీల్చుట పూరకము. పూర్తిగా విడిచి పెట్టుట రేచకము. గాలిని లోపల, బయట నిలిపి యుంచుట కుంభకము.
యతో యతో నిస్సరతి మనః కామహతం భ్రమత్ ।
తతస్తత ఉపాహృత్య హృది రుంధ్యాచ్ఛనైర్బుధః ॥
కామనలచే చేడగొట్టబడి పరిభ్రమిస్తూ ఉండే మనస్సు ఎక్కడెక్క డికి పరుగులెత్తునో, అక్కడక్కడనుండి దానిని మెల్లమెల్లగా వెనుకకు మరల్చి (అనగా ఇంద్రియవ్యాపారములను ఉపసంహరించి), హృదయము నందు స్థిరముగా నిలుపవలెను.
ఏవమభ్యసతశ్చిత్తం కాలేనాల్పీయసా యతేః ।
అనిశం తస్య నిర్వాణం యాత్యనింధనవహ్నివత్ ॥
ఈ విధముగా నిరంతరముగా అభ్యాసము చేసే ప్రయత్నశీలి యగు అట్టి సాధకుని చిత్తము, ఇంధనము లేని నిప్పు వలె, తక్కువ కాల ములోనే ఉపశమమును పొందును.
కామాదిభిరనావిద్దం ప్రశాంతాఖిలవృత్తి యత్ ।
చిత్తం బ్రహ్మసుఖస్పృష్టం నైవోత్తిష్ఠేత కర్హిచిత్ ॥
ఎప్పుడైతే సాధకుని చిత్తము కామక్రోధాదుల సంక్షోభములో పడ కుండా సకలవృత్తులు ఉపశమించి యుండునో, అప్పుడు ఆ చిత్తము బ్రహ్మానందముయొక్క సంస్పర్శను పొంది, మరల ఎన్నటికీ బహిర్ము ఖము కాబోదు.
యః ప్రవ్రజ్య గృహాత్పూర్వం త్రివర్గావపనాత్పునః ।
యది సేవేత తాన్ భిక్షుస్స వై వాంతాశ్యపత్రపః ॥
గృహాశ్రమము ధర్మార్థకామములకు మూలము. దానిని ఎవడైతే ముందుగా విడిచి సన్న్యసించునో, అట్టి భిక్షువు సిగ్గు విడిచి అవే ధర్మార్థకా మములను సేవించే పక్షములో, ఆతడు నిశ్చయముగా వమనమును భక్షిం చువాడు అగును.
యైస్స్వదేహస్స్మృతో నాత్మా మర్త్యో విటమిభస్మసాత్ ।
త ఏనమాత్మసాత్కృత్వా శ్లాఘయంతి హ్యసత్తమాః ॥
కొందరు పరమదుష్టులు ముందుగా ఈ దేహము అనాత్మ, మర ణించే స్వభావము గలది, మాలిన్యము గాని క్రిములు గాని బూడిద గాని అయ్యేది అని చింతించి, తరువాత వారే మరల ఆ దేహమును ఆత్మరూప ముగా స్వీకరించి ప్రశంసించెదరు.
గృహస్థస్య క్రియాత్యాగో వ్రతత్యాగో వటోరపి ।
తపస్వినో గ్రామ సేవా భిక్షోరింద్రియలోలతా ॥
ఆశ్రమాపసదా హ్యేతే ఖల్వాశ్రమవిడంబకాః ।
దేవమాయావిమూఢాంస్తాను పేక్షేతానుకంపయా ॥
బ్రహ్మచర్యవ్రతమును విడిచిపెట్టిన బ్రహ్మచారి, నిత్యకర్మలను విడిచి పెట్టిన గృహస్థుడు, తపస్సును విడిచి పెట్టి ఇంద్రియభోగములను సేవించే వానప్రస్థుడు, ఇంద్రియభోగముల ఆకర్షణకు వశుడయ్యే సన్న్యా సి -- వీరు ఆయా ఆశ్రమస్థులలో అధములు. వీరు కేవలము ఆశ్ర మస్తులను అనుకరించువారు మాత్రమే (ఆశ్రమస్థుల పవిత్రత వీరిలో ఉండ
దు). వీరు ఈశ్వరుని మాయలో పడి వ్యామోహితులై యున్నారు. వీరియందు దయను మాత్రమే చూపవలెను. కాని, వీరిని ఉపేక్షించవలెను (అనగా, వీరితోడి సంగము తగదు).
ఆత్మానం చేద్విజానీయాత్పరం జ్ఞానధుతాశయః ।
కిమిచ్ఛన్ కస్య వా హేతోర్దేహం పుష్ణాతి లంపటః ॥
వివేకజ్ఞానముచే శోధితమైన అంతఃకరణము గల వ్యక్తి తన స్వరూపము పరబ్రహ్మ (పూర్ణము) అని తెలుసుకొనును. అట్టి జ్ఞానియందు భోక్తృత్వము ఉండదు. ఆ జ్ఞాని మరల ఇంద్రియలోలుడై దేనిని కోరి ఏ భోక్తను తృప్తి పరచుటకై దేహమును పోషించును?
ఆహుశ్శరీరం రథమింద్రియాణి
హయానభీషూన్ మన ఇంద్రియేశమ్ ।
వర్త్మాని మాత్రా ధిషణాం చ సూతం
సత్త్వం బృహద్బంధురమీశసృష్టమ్ ॥
ఈశ్వరునిచే సృష్టించబడిన దేహము రథమనియు, ఇంద్రియ ములే గుర్రములనియు, ఇంద్రియములకు ప్రభువగు మన స్సే కళ్లామని యు, శబ్దస్పర్శరూపరసగంధములు ఇంద్రియములనే గుర్రములు నడిచే మార్గములనియు, బుద్ధియే సారథి అనియు, అంతఃకరణమే పెద్ద కట్టు త్రాడు అనియు మహాత్ములు చెప్పెదరు.
అక్షం దశప్రాణమధర్మధర్మౌ చక్రేఽభిమానం రథినం చ జీవమ్,
ధనుర్షి తస్య ప్రణవం పఠంతి శరం తు జీవం పరమేవ లక్ష్యమ్।
ప్రాణ (శ్వాసక్రియ)-అపాన (విసర్జనక్రియ)-వ్యాన (బలవత్కర్మకు మూలము)-ఉదాన (వమనము ఇత్యాది ఊర్ధ్వగతికి ఆధారము)-సమాన ము (ఆహారము జీర్ణమగుట, రక్తప్రసారములకు ఆధారము)లు, నాగ (త్రే నును కలిగించునది)-కూర్మ (కన్నులను తెరుచుటకు ఆధారము)-కృకల (ఆకలిని కలిగించునది)-దేవదత్త (ఆవులించుటకు ఆధారము)-ధనంజయ ము (దేహమునకు పుష్టినిచ్చునది) లు అనే పది ప్రాణవృత్తుల సముదా యమే దేహము అనే రథమునకు ఇరుసు; ధర్మాధర్మములే చక్రములు; దేహాదులయందు నేను-నాది అనే అభిమానము గల జీవుడే రథస్వామి; ఓంకారమే ఆ జీవుని ధనుస్సు; జీవుడే బాణము; పరబ్రహ్మయే లక్ష్యము అని మహాత్ములు చెప్పెదరు.
రాగో ద్వేషశ్చ లోభశ్చ శోకమోహౌ భయం మదః ।
మానోఽవమానోఽసూయా చ మాయా హింసా చ మత్సరః ॥
రజః ప్రమాదః క్షున్నిద్రా శత్రవస్త్వేవమాదయః ।
రజస్తమఃప్రకృతయస్సత్త్వప్రకృతయః క్వచిత్ ॥
రాగము, ద్వేషము, లోభము, శోకము, మోహము, భయము, గర్వము, అభిమానము, అవమానము, ఇతరుల గుణములలో దోషమును చూచుట, మోసము, హింస, ఇతరుల అభివృద్ధి యెడల ఓర్వలేని దనము, దురాగ్రహము, మరుపు, ఆకలి, నిద్ర మొదలగునవి సాధకుని శత్రువులు. వీటిలో కొన్ని రజోగుణ తమోగుణ ప్రధానములు కాగా, అప్పుడప్పుడు కొన్ని (ఆసక్తిగా మారిన ప్రేమ మొదలైనవి) సత్త్వగుణప్రధానములుగా కూడ ఉండును.
యావన్నృకాయకొయరథమాత్మవశోపకల్పం
ధత్తే గరిష్ఠచరణార్చనయా నిశాతమ్ ।
జ్ఞానాసిమచ్యుతబలో దధదస్తశత్రుః
స్వారాజ్యతుష్ట ఉపశాంత ఇదం విజహ్యాత్ ॥
సాధకుడు ఇంద్రియములనే పరికరములతో గూడియున్న ఈ మానవదేహము అనే రథము ఎంతవరకైతే తన వశములో నుండునో, అంతవరకు మహాత్ముల చరణములను సేవించి అచ్యుతుడే బలముగా గలవాడై, వివేకజ్ఞానమనే కత్తికి పదును పెట్టి దానితో అంతశ్శత్రువులను జయించవలెను. ఆతడు తన స్వరూపభూతమైన ఆనందమును పొంది సంతుష్టుడై కామనలు చల్లారిన చిత్తము గలవాడై ఈ దేహమును విడిచి పెట్ట (ఉపేక్షించ వలెను.
నో చేతమత్తమసదింద్రియవాజిసూతా
నీత్వోత్పథం విషయదస్యుషు నిక్షిపంతి ।
తే దస్యవస్సహయసూతమముం తమోఽoధీ
సంసారకూప ఉరుమృత్యుభయే క్షిపంతి ॥
సాధకుడు ఆదమరచియున్న పక్షములో, దుష్టములైన ఇంద్రియ ములనే గుర్రములు మరియు బుద్ధి అనే సారథి కలిసి ఆ వ్యక్తిని (దేహాము. అనే రథమును) తప్పు దారిలో నడిపించి విషయభోగములనే దారిదోపిడీ గాండ్రివద్ద పారవేయును. అపుడా భోగములనే దారి దోపిడీగాండ్రు గుర్ర ములతో మరియు సూతునితో సహా ఈ రథయజమాని (వ్యక్తి) ని సంసార మనే నూతిలో పారద్రోయుదురు. అజ్ఞానము అనే చీకటితో నిండియున్న ఆ నూతియందు మరణభయము అధికముగా నుండును.
ప్రవృత్తం చ నివృత్తం చ ద్వివిధం కర్మ వైదికమ్ ।
ఆవర్తే ప్రవృత్తేన నివృత్తేనాశ్నుతేఽమృతమ్ ॥
వేదవిహితమగు కర్మ రెండు రకములుగా నున్నది. కామవల పరి పూర్తీ కొరకై చేసేది ప్రవృత్తి రూపమగు కర్మ. దాని వలన వ్యక్తి సంసార ములో పరిభ్రమించుచుండును. కావనలను విడనాడి ఆత్మనిష్టుడై యుండుట నివృత్తి రూపమగు ధర్మము. దాని వలన సాధకుడు మోక్షము (అమరణ భావము) ను పొందును.
హింస్రం ద్రవ్యమయం కామ్యమగ్నిహోత్రాద్యశాంతిదమ్ ।
దర్శశ్చ పూర్ణమాసశ్చ చాతుర్మాస్యం పశుస్సుతః ॥
ఏతదిష్టం ప్రవృత్తాఖ్యం హుతం ప్రహుతమేవ చ ।
పూర్తం సురాలయారామకూపొజీవ్యాదిలక్షణమ్ ॥
ప్రవృత్తి అనబడే కర్మ ఇష్టము, పూర్తము అని రెండు రకములు. అగ్నిహోత్రము (వైదికుడు ప్రతిదినము చేసే హోమము), దర్శ (అమావా స్యనాడు చేసే ఇష్టి), పూర్ణమాస (పూర్ణిమనాడు చేసే ఇష్టి), చాతుర్మాస్య ము, పశుయాగము, సోమయాగము (ఇవి విస్తారమైన యాగములు) మొద లగునవి ఇష్టము. ఈ కర్మలు హింసతో కూడినవి. వీటిలో ద్రవ్యబాహు ళ్యము అధికము. కామనచే ప్రేరితములైన ఈ కర్మలు అశాంతిని కలిగిం చును. దేవాలయము, విశ్రాంతిగృహము, బావి, చలివేంద్రము, అన్నస త్రము మొదలగువాటిని నిర్మించుట పూర్తకర్మ అనబడును.
ద్రవ్యసూక్ష్మవిపాకశ్చ ధూమో రాత్రిరపక్షయః ।
అయనం దక్షిణం సోమో దర్శ ఓషధివీరుధః ॥
అన్నం రేత ఇతి క్ష్మేశ పితృయానం పునర్భవః ।
ఏకైకశ్యేనానుపూర్వం భూత్వా భూత్వేహ జాయతే ॥ నిషేకాదిశ్మశానాంతైస్సంస్కారైస్సంస్కృతో ద్విజః ।
ఓ మహారాజా! ప్రవృత్తి పరాయణుడగు వ్యక్తి మరణించి వైదికక ర్మలలో సమర్పించిన ఆహుతుల పరిణామమైన సూక్ష్మరూపమును పొంది పితృయానమార్గములో చంద్రలోకమును పొందును, ఆతడీ మార్గ ములో క్రమముగా ఒక్కొక్కటిగా పొందే స్థితులేవనగా -- హోమధూమము ( ఆ అభిమాని దేవత), రాత్రి, కృష్ణపక్షము (కొలాభిమాన దేవతలు), మరియు చంద్రలోకము. పుణ్యము క్షయమైన తరువాత ఆ జీవుని ఆ దేవ దేహము పూర్తిగా క్షీణించును (అమావాస్య. ఆ జీవుడు సూక్ష్మరూపముతో వర్షజలముల ద్వారా మొక్కలలో ప్రవేశించి, ధాన్యమునందు సూక్ష్మరూప ముగా నుండి పురుషునకు ఆహారమై వాని శరీరములో రేతస్సు రూప మును పొంది, స్త్రీ ద్వారా మరల ఈ లోకములో జన్మించును. గర్భాధా నముతో మొదలిడి అంత్యేష్టి వరకు ఉండే సంస్కారములచే సంస్కరించ బడే వైదికుడు ఈ మార్గములననుసరించును.
ఇంద్రియేషు క్రియాయజ్ఞాన్ జ్ఞానదీపేషు జుహ్వతి ॥
ఇంద్రియాణి మనస్యూర్మౌ వాచి వైకారికం మనః ।
వాచం వర్ణసమామ్నాయే తమోంకారే స్వరే న్యసేత్ ।
ఓంకారం బిందౌ నాదే తం తం తు ప్రాణే మహత్యముమ్ ॥
నివృత్తి పరాయణులగు సాధకులు యజ్ఞము మొదలగు క్రియలను జ్ఞానశక్తితో ప్రకాశించే ఇంద్రియములయందు, ఇంద్రియములను సంకల్ప ముల రూపములోనుండే మనస్సునందు, వికారములను పొందే మన స్సును వాక్కునందు, వాక్కును అక్షరముల మాతృకయందు, అక్షరమాతృ కను ఓమ్ (అ, ఉ, మకారములు) నందు, ఓంకారమును బిందువు (అను నాసిక ధ్వని) నందు, బిందువును నాదము (దీర్ఘమగు ప్రతిధ్వని) నందు, నాదమును సూత్రాత్మ (సర్వజగద్వ్యాపకమగు ప్రాణతత్త్వము) నందు, ఈ సూత్రాత్మను పరబ్రహ్మలో (భావనారూపముగా) విలీనము చేయవలెను.
అగ్నిస్సూర్యో దివా ప్రాహ్ణ్ శ్శుక్తో రాకోత్తరం స్వరాట్ ।
విశ్వశ్చ తైజసః ప్రాజ్ఞస్తుర్య ఆత్మా సమన్వయాత్ ॥
నివృత్తిపరాయణుడగు సాధకుడు మరణించిన తరువాత క్రమ ముగా అగ్ని, సూర్యుడు, పగలు, సాయంకాలము, శుక్లపక్షము, పూర్ణిమ, ఉత్తరాయణము (కాలాభిమాని దేవతలు), హిరణ్యగర్బలోకములను పొంది అచట భోగములననుభవించును. ఆతడు క్రమముగా స్థూలోపాధియగు దేహమునకు అభిమానియగు విశ్వుని సూక్షోపాధియగు తైజసునియం దు, మరల తైజసుని కారణోపాధియగు ప్రాజ్ఞునియందు విలీనము చేసి, ఈ మూడు ఉపాధులకు అధిష్ఠానముగా ఉంటూనే వాటికి అతీతమైన శుద్ద ఆత్మను తన స్వరూపముగా తెలుసుకొని మోక్షమును పొందును.
దేవయానమిదం ప్రాహుర్భూత్వా భూత్వానుపూర్వశః ।
ఆత్మయాజ్యుపశాంతాత్మా హ్యాత్మస్ధ న నివర్తతే ॥
దీనిని మహాత్ములు దేవయానము అని నిర్దేశించెదరు. కామనలు చల్లారిన అంతఃకరణముతో ఆత్మను ఉపాసించిన నివృత్తి పరాయణుడగు సాధకుడు క్రమముగా ఆయా దేవతలను పొంది హిరణ్యగర్భ (సత్య) లోక మునందు ఆత్మనిష్ఠుడై మోక్షమును పొందును (మరల సంసారములో జన్మించడు).
య ఏతే పితృదేవానామయనే వేదనిర్మితే ।
శాస్త్రీణ చక్షుషా వేద జనళోఽపి న ముహ్యతి ॥
వేదముచే నిశ్చయముగా బోధించబడిన ఈ పితృయాన, దేవ యాన మార్గములను ఎవడైతే శాస్త్రమే కన్నుగా గలవాడై తెలుసుకొనునో, అట్టి వివేకి దేహముతో జీవించియున్ననూ వ్యామోహితుడు కాడు.
ఆధావంతే జనానాం సద్భహిరంతః పరావరమ్ ।
జ్ఞానం జ్ఞేయం వచో వాచ్యం తమో జ్యోతిస్త్వయం స్వయమ్ ॥
ఈ జ్ఞాని స్వయముగా -- దేహములకు ఆదిలో కారణమై అంత ములో దేహములు విలీనమయ్యే అవధియై బయట భోగ్యముగను, లోపల భోక్తగను ఉన్న అఖండసదనమగు -- ఆత్మయే. గొప్పది, తక్కువది, తెలు సుకునే బుద్ది, తెలియబడే విషయము, నామము, రూపము, చీకటి, వెలు తురు అనే సర్వము ఈ ఆత్మయే.
ఆబాధితోఽపి హ్యాభాసో యథా వస్తుతయా స్మృతః ।
దుర్ఘటత్వాదైంద్రియకం తద్వదర్థవికల్పితమ్ ॥
యుక్తిపూర్వకముగా విచారించినచో, ప్రతిబింబము యథార్థముగా ఉన్నది కాదని తెలియుచునే యుండును. కాని, అదీ యథార్థవస్తువా యన్నట్లు కనబడును. అదే విధముగా, ఇంద్రియగోచరమగు ఈ జగత్తు లోని భేదము యుక్తికీ, ప్రమాణమునకు మరియు అనుభవమునకు విరు ద్ధమే అయిననూ, అవివేకులు ఆ భేదమే యథార్థమని స్వీకరించెదరు.
క్షిత్యాదీనామిహార్ధానాం ఛాయా న కతమాపి హి ।
న సంఘాతో వికారోఽపి న పృథజ్ నాన్వితో మృషా ॥
ఈ లోకములో పృథివీ మొదలగు అయిదు భూతముల సమాహార మగు దేహము మొదలగు పదార్థములు నీడ వలె మిథ్యయే. అవి అయిదు భూతముల కలయిక గాని, వాటి వికారము గాని కావు. అవి పంచభూతము లకంటే భిన్నముగా గాని, వాటితో జతగూడి గాని లేవు. కావున, పంచభూత ముల కలయిక యగు దేహాదులు కేవలము మిథ్య మాత్రమే.
ధాతవోఽవయవిత్వాచ్చ తన్మాత్రావయవైర్వినా ।
న స్యుర్హ్యసత్యవయవిన్యసన్నవయవోఽoతతః ॥
పంచమహాభూతములు జగత్తునకు మూలమునందలి ధాతువులు. కాని, అవి కూడ పంచతన్మాత్రల (సూక్ష్మభూతముల) కలయికలే అగుట వలన, అవయవములు లేకుండా అవయవియొక్క ఉనికి సిద్ధించదు. అంతి మముగా అవయవి లేకున్నచో, అవయవముల ఉనికి సిద్ధించదు.
స్యాత్సాదృశ్యభ్రమస్తావద్వికల్పే సతి వస్తునః ।
జాగ్రత్స్వపౌ యథా స్వప్నే తథా విధినిషేధతా ॥
ఉన్నది ఒక్కటి మాత్రమే. అయిననూ, అజ్ఞానముచే వస్తువు (ఉ న్నది) నందు భేదము గోచరించుచుండగా, మనముందు కనబడే ఈ పదా ర్థములన్నీ సర్వకాలములలో ఏకరూపముగా ఉన్నవి అనే భ్రాంతి కలుగు చునే యుండును. స్వప్నములో కూడ జాగ్రత్తు-నిద్ర అనే అవస్థల అనుభ వము కలుగుచుండును. స్వప్నకాలములో అవి సత్యములే అనే భ్రమ కొన సాగును. అదే విధముగా ఈ జగత్తు, దానియందలి వ్యక్తియొక్క జీవిత ము, ఆ జీవితమును నిర్దేశించే విధిని షేధములు అనే ఈ సర్వము అజ్ఞాన కాలములో వాస్తవములే యన్నట్లు అనుభవమునకు వచ్చుచుండును.
భావాద్వైతం క్రియాద్వైతం ద్రవ్యాద్వైతం తథాఽఽత్మనః ।
వర్తయన్ స్వానుభూత్యేహ త్రీన్ స్వప్నాన్ ధునుతే మునిః ॥
ఆత్మయొక్క మూడు అద్వైతములను, అనగా భావాద్వైత-క్రీ యాద్వైత-ద్రవ్యాద్వైతములను మననము చేయు సాధకుడు ఆత్మనిష్ఠ యొక్క అనుభవముచే జాగ్రత్తు-స్వప్నము-నిద్ర (లేదా, జ్ఞాత-జ్ఞానము-జేయము అనే మూడు స్వప్నములను తొలగించుకోనును. అనగా, ఈ అవ స్థలకు అతీతమైన ఆత్మతత్త్వమునందు నిష్ఠను కలిగి యుండును.
కార్యకారణవ స్త్వైక్యమర్శనం పటతంతువత్ ।
అవస్తుత్వాద్వికల్పస్య భావాద్వైతం తదుచ్యతే ॥
మనకు కనబడే భేదము యథార్థము కాదు. వస్త్రము, నూలు వంటి కార్యకారణభేదము కనబడేదే గాని యథార్థము కాదు. కార్యకారణ ముల కనబడే భేదము రెండవది లేని తత్త్వమునందు విలీనమగును. ఈ దర్శనము భావోద్వైతము (పదార్థముల ఐక్యము) అనబడును.
యద్బ్రహ్మణి పరే సాక్షాత్సర్వకర్మసమర్పణమ్ ।
మనోవాక్తనుభిః పార్థ క్రియాద్వైతం తదుచ్యతే ॥
కుంతీపుత్రుడవగు ఓ ధర్మరాజా! మనము మనోవాక్కాయము లతో చేసే కర్మలనన్నింటినీ సాక్షాత్తుగా పరబ్రహ్మయందు సమర్పించు టయే క్రియాద్వైతము (క్రియకు సంబంధించిన అద్వైతము) అనబడును.
ఆత్మజాయాసుతాదీనామన్యేషాం సర్వదేహినామ్ ।
యత్స్వార్థకామమోరైక్యం ద్రవ్యా ద్వైతం తదుచ్యతే ॥
సాధకుని దృష్టిలో తాను, తన భార్య, తన సంతానము, తన బంధువులు మొదలగువారికీ, ఇతరులైన సకలప్రాణులకు అర్థకామముల (సంపదను సంపాదించి ఇంద్రియసుఖములననుభవించుట) విషయములో (నాది పరాయి అనే తేడా లేదు అనే దృష్టి యేది గలదో, అది ద్రవ్యాద్వై తము (పదార్థములకు సంబంధించిన ఏకత్వము) అనబడును.
యద్యస్య వానిషిద్ధం స్యాద్యేన యత్ర యతో నృప ।
స తేనేహేత కర్మాణి నరో నాన్యైరనాపది ॥
ఓ ధర్మరాజా! ఏ ఉపాయముచే ఎక్కడనుండి పొందబడిన ఏ వస్తువు ఏ వ్యక్తికి ఏ దేశకాలములయందు నిషిద్దము కాదో, ఆ వ్యక్తి ఆ వస్తువుతోనే తన పనులను నిర్వహించుకొనవలెను.' ఆపదల సందర్భ ములలో తప్పించి, ఆ వ్యక్తి ఇతర నిషిద్ధపదార్థముల జోలికి పోరాదు.
ఏతైరన్యైశ్చ వేదోక్తైర్వర్తమానస్స్వకర్మభిః ।
గృహేఽ ప్యస్య గతిం యాయాద్రాజంస్తద్భక్తిభాజ్నరః ॥
ఓ ధర్మరాజా! ఆ భగవానుని భక్తితో ఆరాధించే మానవుడు ఇట్టి కర్మలను, వేదముచే తనకు విహితములైన ఇతరకర్మలను చేస్తూ గృహస్థా శ్రమమునందే ఉన్ననూ, ఆ ఈశ్వరుని స్వరూపము (మోక్షము) ను పొందును.
యథా హి యూయం నృపదేవ దుస్త్యజా-
దాపద్గణాదుత్తరతాత్మనః ప్రభోః ।
యత్పాదపంకేరుహ సేవయా భవా-
నహార్షీన్నిర్జితదిగ్గజః క్రతూన్ ॥
ఓ మహారాజా! రాజులు, దేవతలు కూడ విడిపించుకొన శక్యము కాని ఆపదల సమూహములనుండి మీరు మీ ప్రభుడగు శ్రీకృష్ణుని కారణ ముగా గట్టెక్కితిరి. నీవు ఆయన పాదపద్మములను సేవించి ఆ శక్తితో దిగ్గజ ములను (భూమండలమును) జయించి అనేక క్రతువులను అనుష్ఠించితివి.
అహం పుర్వాఽభవం కశ్చిద్గoధర్వ ఉపబర్హణః ।
నామ్నాతీతే మహాకల్పే గంధర్వాణాం సుసమ్మతః ॥
గడచిన మహాకల్పమునందు పూర్వజన్మలో నేను ఉపబర్హణుడనే పేరు గల ఒకానొక గంధర్వుడను. అప్పుడు నేను గంధర్వులలో గొప్పవా డిగా ఉండెడివాడను.
రూపపేశలమాధుర్యసౌగంధ్యప్రియదర్శనః ।
స్త్రీణాం ప్రియతమో నిత్యం మత్తస్తు పురులంపటః ॥
అప్పుడు నేను రూపము, సౌకుమార్యము, మధురభాషణము, పరిమళభరితుడై యుండుట అనే లక్షణములచే ప్రీతికరమైన దర్శనము. గలవాడనగుటచే, స్త్రీలకు మిక్కిలి ప్రియుడుగా ఉండెడివాడను. నేను అన్ని కాలములయందు అధికమగు భోగాసక్తి గలవాడనై గర్వించి యుండే డివాడను.
ఏకదా దేవసత్రే తు గంధర్వాప్సరసాం గణాః ।
ఉపహూతా విశ్వసృగ్బిర్హరిగాథోపగాయనే ॥
ఒకనాడు ప్రజాపతులు దేవతల సత్రయాగమునందు శ్రీహరి గాథ లను పాడుట కొరకై గంధర్వులు, అప్సరసల గణములను ఆహ్వానించిరి.
అహం చ గాయంస్తద్విద్వాన్ స్త్రీభిః పరివృతో గతః ।
జ్ఞాత్వా విశ్వసృజస్తన్మే హేలనం శేపురోజసా ।
యాహి త్వం శూద్రతామాశు నష్టశ్రీః కృతహేలనః ॥
ఆ ఆహ్వానము సంగతి తెలిసిన నేను స్త్రీలు చుట్టువారియుండగా విలాసగీతములను పాడుతూ అచటకు వెళ్లితిని. నేను చేసిన ఆ అవ హేళన మును చూసిన ప్రజాపతులు కోపవేగముతో నన్ను ఈ విధముగా శపించిరి -- అపరాధమును చేసిన నీవు వెంటనే సంపదలనన్నింటినీ పోగొట్టుకోని శూద్రుడవు కమ్ము
తావద్దాస్యామహం జఙ్ఞే తత్రాపి బ్రహ్మవాదినామ్ ।
శుశ్రూషయానుషంగేణ ప్రాప్తోఽహం బ్రహ్మపుత్రతామ్ ॥
వెంటనే నేను దాసికి పుత్రుడనై జన్మించితిని. ఆ జన్మలో కూడ బ్రహ్మవేత్తలను సేవించితిని. ఆ సేవయొక్క ప్రభావముచే మరుజన్మలో బ్రహ్మగారి పుత్రుడనై జన్మించితిని. .
ధర్మస్తే గృహమేధీయో వర్ణితః పాపనాశనః ।
గృహస్థో యేన పదవీమంజసా న్యాసినామీయాత్ ॥
నేను నీకు గృహస్థుల ధర్మమును వర్ణించితిని. ఈ ధర్మము పాప ములను నశింపజేయును. దీనిని పాటించే గృహస్థులు సన్న్యాసులు పొందే గతి (మోక్షము) ని సునాయాసముగా పొందేదరు.
యూయం నృలోకే బత భూరిభాగా
లోకం పునానా మునయోఽభియంతి ।
యేషాం గృహానావసతీతి సాక్షాద్
గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగమ్ ॥
ఆహా! మానవలోకములో మీరు గొప్ప భాగ్యవంతులు, రహస్య మగు పరబ్రహ్మ మనుష్యరూపముతో మీ ఇంటియందు నివసించియున్నది. కావుననే, లోకమును పావనము చేసే మహర్షులు మీ ఇంటిని వెతు క్కుంటూ వస్తూ ఉంటారు.
స వా అయం బ్రహ్మ మహద్విమృగ్యం
కైవల్యనిర్వాణసుఖానుభూతిః ।
ప్రియస్సుహృద్వః ఖలు మాతులేయ
ఆత్మార్హణీయో విధికృద్గురుశ్చ ॥
మహాత్ములు బ్రహ్మానందముయొక్క అనుభూతిని అన్వేషించు చుందురు. రెండవది లేని ఆ ఆనందములో ఉపద్రవములు సుతరాము లేవు. అట్టి ఆ పరబ్రహ్మయే మీకు ప్రీతిని, హితమును కలిగించే శ్రీకృష్ణు డు. ఇది నిశ్చయము. ఆయన మీకు మేనమామ కొడుకు మాత్రమే గాక, మీ ప్రాణము, గురువు కూడ ఆయనయే. మీచే పూజించబడే ఆయన మీ ఆదేశమును కూడ పాటించును.
న యస్య సాక్షాద్భవపద్మజాదిభీ
రూపం ధియా వస్తుతయోపవర్ణితమ్ ।
మౌనేన భక్త్యోపశమేన పూజితః
ప్రసీదతామేష స సాత్వతాం పతిః ॥
ఆ ఈ భక్తపాలకుడగు శ్రీకృష్ణుని స్వరూపమును సాక్షాత్తుగా రుద్రుడు, పద్మసంభవుడగు బ్రహ్మగారు మొదలైన వారు కూడ తమ బుద్దితో ఇదమిత్తముగా వర్ణించలేకపోయిరి. ఆయనను మౌనపూర్వకమగు భక్తితో మరియు సకలకామపరిత్యాగముతో ఆరాధించవలెను. ఆయన మన పై ప్రసన్నుడగు గాక!
శ్రీశుక ఉవాచ ।
ఇతి దేవర్షిణా ప్రోక్తం నిశమ్య భరతర్షభః ।
పూజయామాస సుప్రీతః కృష్ణం చ ప్రేమవిహ్వలః ॥
శ్రీశుకమహర్షి ఇట్లు చెప్పెను --- దేవర్షియగు నారదుడు చెప్పిన ఈ మాటలను విని, భరతవంశ శ్రేష్ఠుడగు ధర్మరాజు చాల సంతోషించి ప్రేమపారవశ్యముతో నారదుని, శ్రీకృష్ణుని కూడ పూజించెను.
కృష్ణపార్థావుపామంత్య్ర పూజితః ప్రయయౌ మునిః ।
శ్రుత్వా కృష్ణం పరం బ్రహ్మ పార్థః పరమవిస్మితః ॥
నారదుడు పూజలనందుకొని శ్రీకృష్ణుని వద్ద మరియు ధర్మరాజు వద్ద సెలవు తీసుకొని వెళ్లాను. శ్రీకృష్ణుడే పరబ్రహ్మ అని విని ధర్మరాజు గొప్ప అచ్చెరువును పొందెను.
ఇతి దాక్షాయణీనాం తే పృథగ్వంశాః ప్రకీర్తితాః ।
దేవాసురమనుష్యాధ్యా లోకా యత్ర చరాచరాః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే సదాచార
నిరూపణం నామ పంచదశోఽధ్యాయః ॥
॥ ఇతి సప్తమః స్కంధః సమాప్తః ॥
ఓ పరీక్షిన్మహారాజా! నేను నీకు దక్షుని పుత్రికల వంశములను వేర్వేరుగా వర్ణించి చెప్పితిని. దేవతలు, అసురులు, మానవులు మొదలైన కదిలే మరియు కదలని ప్రాణులు ఈ వంశములలో జన్మించినవే.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో
సదాచారమును నిరూపించే పదునైదవ అధ్యాయము ముగిసినది (15).
సప్తమ స్కంధము ముగిసినది.
॥ హరిః ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు ॥
Summary of chapter 15 of the Bhāgavata Mahā Purana is as follows:
In the concluding chapter of the Seventh Skanda, Devarshi Nārada detailed the methods by which human beings can overcome the subtle enemies of the soul—lust, anger, greed, illusion, pride, and envy—through the cultivation of spiritual knowledge and devotional service. He contrasted genuine spiritual practice with pseudo-religious hypocrisy (*Dharma-dhvaja*), warning against fruitive rituals that cause harm to living entities. Nārada glorified the absolute fortune of King Yudhishṭhira and the Pāṇḍavas, noting that Svayam Bhagavān Śrī Kṛshṇa lived directly among them in Hastināpura as their intimate relative, guide, protector, and supreme worshipful deity, concluding the Seventh Skanda with a grand glorification of Bhāgavata-dharma.