12 – బ్రహ్మచర్య - వానప్రస్థ ధర్మముల వర్ణనము

నారద ఉవాచ

బ్రహ్మచారీ గురుకులే వసన్ దాంతో గురోర్హితమ్

ఆచరన్ దాసవన్నీచో గురౌ సుదృఢసౌహృదః

బ్రహ్మచారి ఇంద్రియనిగ్రహముతో గురుకులములో నివసిస్తూ గురువునకు హితమునాచరించవలెను. సేవకుడు వలె గురువు యెడల నమ్రుడై గురువునందు మిక్కిలి దృఢమగు అనురాగమును కలిగియుండవలెను.

సాయం ప్రాతరుపాసీత గుర్వగ్న్యర్కసురోత్తమాన్

ఉభే సంధ్య చ యతవాగ్ జపన్ బ్రహ్మ సమాహితః  

బ్రహ్మచారి ఉదయము సాయంకాలము గురువును, అగ్నిని, సూర్యుని, శ్రీహరిని పూజించవలెను. మితముగా మాటలాడవలెను. రెండు సంధ్యలయందు కూడ ఏకాగ్రమగు చిత్తముతో గాయత్రిని జపించవలెను.

ఛందాంస్యధీయీత గురోరాహూతశ్చేత్సుయంత్రితః

ఉపక్రమేఽవసానే చ చరణౌ శిరసా నమేత్  

గురువు పిలిచినప్పుడు బ్రహ్మచారి మిక్కిలి సావధానుడై వేదమంత్రములను అధ్యయనము చేయవలెను. అధ్యయనమునకు ముందు వెనుక కూడ గురువు పాదములకు సాష్టాంగనమస్కారమును చేయవలెను.

మేఖలాజీనవాసాంసి జటాదండకమండలూన్

బిభృయాదుపవీతం చ దర్భపాణిర్యథోదితమ్  

బ్రహ్మచారి శాస్త్రములో విధించిన పద్దతిలో మౌంజి, మృగచర్మము, వస్త్రములు, జటలు, దండము, కమండలము, యజ్ఞోపవీతములను, చేతిలో దర్భలను ధరించవలెను.

సాయం ప్రాతశ్చరేద్భైక్షం గురవే తన్నివేదయేత్

భుంజీత యద్యనుజ్ఞాతో నో చేదుపవ సేత్క్వచిత్

ఉదయము సాయంకాలము బ్రహ్మచారి భిక్షాటనను చేసి ఆ ఆహారమును గురువునకు సమర్పించవలెను. గురువు అనుమతితో ఆ ఆహారమును భుజించవలెను. ఒకప్పుడు (అపరాధము చేసినప్పుడు) గురువు అనుమతినీయనిచో, ఆతడు ఆనాడు ఉపవాసమును చేయవలెను.

సుశీలో మితభుగ్దక్షశ్శ్రద్దధానో జితేంద్రియః

యావదర్థం వ్యవహరేత్ స్త్రీషు స్త్రీనిర్జితేషు చ

బ్రహ్మచారి చక్కని శీలము గలవాడై మితముగా తినవలెను; దక్షుడుగా ఉంటూ శ్రద్ధను కలిగియుండవలెను; స్త్రీలతో మరియు స్త్రీలకు వశులైన పురుషులతో పని ఉన్నంత వరకు మాత్రమే వ్యవహరించవలెను.

వర్జయేత్త్ప్రమదాగాథామగృహస్థో బృహద్ర్వతః

ఇంద్రియాణి ప్రమాథిని హరంత్యపి యతేర్మనః

గృహస్థుడు కానివాడు, బ్రహ్మచర్యవ్రతము గలవాడు స్త్రీలకు సంబంధించిన ప్రసంగమునకు దూరముగా నుండవలెను. ఎందుకంటే, ఇంద్రియములకు దొడ్డ బలము గలదు. అవి యతియొక్క మనస్సునైననూ లోగివేయును.

కేశప్రసాధనోన్మర్దస్నపనాభ్యంజనాదికమ్

గురుస్త్రీభిర్యువతిభిః కారయేన్నాత్మనో యువా

యువకుడగు బ్రహ్మచారి యువతులగు గురుభార్యలచే తనకు జుట్టునకు అలంకారము, శరీరమునకు మర్ధనము, స్నానము, నలుగు పెట్టి స్నానము చేయించుట మొదలగువాటిని చేయించుకొనరాదు.

నన్వగ్నిః ప్రమదా నామ ఘృతకుంభసమః పుమాన్

సుతామపి రహో జహ్యాదన్యదా యావదర్థకృత్

యువతి నిప్పు వంటిది కాగా, మగవాడు నేతి కుండవంటివాడు. ఇది నిశ్చయము. కావున, వ్యక్తి తన కుమార్తెతోనైననూ ఏకాంతమునందుండరాదు. బ్రహ్మచారి యువతితో ఏకాంతము కాని సందర్భములలో కూడ పని ఎంతవరకో అంతవరకే వ్యవహరించవలెను.

కల్పయిత్వాఽఽత్మనా యావదాభాసమిదమీశ్వరః

ద్వైతం తావన్న విరమేత్తతో హ్యస్య విపర్యయః  

మానవుడు తన స్వరూపమును తెలుసుకొని దేహాదులతో సహా ఈ సర్వము కేవలము ప్రతీతి (కనబడేదే గాని ఉన్నది కాదు) మాత్రమేనని నిశ్చయించుకొనవలెను. అంతవరకు వానికి స్త్రీ-పురుషుడు అనే భేదబుద్ది దూరము కాదు. అట్టి భేదబుద్ది వలన వీనికి స్త్రీయెడల కామన కలుగును గదా!(కావున, పై నియమములను పాటించవలెను అని యర్థము).

ఏతత్సర్వం గృహస్థస్య సమామ్నాతం యతేరపి

గురువృత్తిర్వికల్పేన గృహస్థస్యర్తుగామినః

ఈ శీలమును రక్షించుకొనుట మొదలైన ఉపదేశమంతయు గృహస్థునకు, సన్న్యాసికి కూడ విధించబడినది. భార్యతో కలిసి కాపురము చేసే గృహస్థునకు గురుశుశ్రూష మొదలైనవి వికల్పము, అనగా వీలుంటే చేయ వచ్చును, లేకపోతే అక్కర లేదు.

అంజనాభ్యంజనోన్మర్దస్త్ర్యవలేఖామిషం మధు

స్రగ్గంధలేపాలంకారాంస్త్యజేయుర్యే ధృతవ్రతాః  

ఎవరైతే బ్రహ్మచర్య వ్రతముననుష్ఠించెదరో వారు కళ్లకు అంజనమును, అభ్యంగన స్నానమును, శరీరమునకు మర్ధనమును, స్త్రీల చిత్రములను చూచుటను, మాంసమును, మద్యమును, పుష్పమాలలను ధరించుటను, సుగంధద్రవ్యములను అలముకొనుటను, అలంకారములను విడిచి పెట్ట వలెను.

ఉషిత్వైవం గురుకులే ద్విజోఽధీత్యావబుధ్య చ

త్రయీం సాంగోపనిషదం యావదర్థం యథాబలమ్

దత్త్వా వరమనుజ్ఞాతో గురోః కామం యదీశ్వరః

గృహం వనం వా ప్రవిశేత్ప్రవ్రజేత్తత్ర వా వ సేత్

ఉపనయనసంస్కారము గల వ్యక్తి ఈ విధముగా గురుకులములో నివసించి తన శక్తికి, ఆవశ్యకతకు అనురూపముగా మూడు వేదములను, వాటి ఉపనిషత్తులను, వాటి అంగములను (శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, కలము. జ్యోతిషము. నిరుడము) వేదాద్యయమును కూడ  విచారణ చేయవలెను. తరువాత, ఆతడు గురువు కోరిన వరమును ఆయనకు సమర్పించి, ఆయన అనుమతితో గృహస్థాశ్రమములో ప్రవేశించవలెను; లేదా, అడవికి వెళ్లి తపస్సు చేయవచ్చును; లేదా, సన్న్యసించవచ్చును; లేదా, గురుకులములోనే కొనసాగవచ్చును.

అగ్నౌ గురావాత్మని చ సర్వభూతేష్వధోక్షజమ్

భూతైస్స్వధామభిః పశ్యేదప్రవిష్టం ప్రవిష్టవత్  

బ్రహ్మచారి అగ్నియందు, గురువునందు, తనయందు, సకలప్రాణులయందు కూడ సర్వప్రమాణములకు అతీతుడైన శ్రీహరిని దర్శించవలెను. శ్రీహరి సర్వత్రా వ్యాపించియే యున్నాడు గనుక, కొత్తగా దేనియం దైననూ ప్రవేశించబని లేదు. అయిననూ, సర్వమునందు తన అంశలే యగు జీవుల రూపములో ప్రవేశించినాడా యన్నట్లు భాసించును.

ఏవంవిధో బ్రహ్మచారీ వానప్రస్థో యతిర్గృహీ

చరన్ విదితవిజ్ఞానః పరం బ్రహ్మాధిగచ్ఛతి  

ఈ విధముగా నియమబద్దముగా జీవించే బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్న్యాసి కూడ తెలియదగిన ఆత్మతత్త్వమును తెలుసుకున్నవారై పరబ్రహ్మను ఆత్మరూపముగా పొందెదరు.

వానప్రస్థస్య వక్ష్యామి నియమాన్మునిసమ్మతాన్

యానాతిష్ఠన్ మునిర్గచ్ఛేదృషిలోకమిహాంజసా  

మహర్షులచే ప్రవచించబడిన వానప్రస్థ ధర్మములను చెప్పెదను. ఈ లోకములో మననశీలుడై ఈ ధర్మములనాచరించు వ్యక్తి మహర్షుల లోకమగు మహర్లోకమును పొందును.

న కృష్టపచ్యమశ్నీయాదకృష్టం చాప్యకాలతః

అగ్నిపక్వమథామం వా అర్కపక్వముతాహ రేత్

భూమిని దున్ని పండించిన ఆహారమును గాని, నిప్పులలో కాల్చిన ఆహారమును గాని, పచ్చి కాయలను గాని, వానప్రస్థుడు తినరాదు. సహజముగా లభించే ఆహారమునైననూ కాలము కాని కాలమునందు తినరాదు. కాని, సూర్యుని వేడికి పండిన ఫలములు మొదలగువాటిని తిన వచ్చును.

వనైశ్చరుపురోడాశాన్ నిర్వ పేత్కాలచోదితాన్

లబ్ధే నవే నవేఽన్నాద్యే పురాణం తు పరిత్యజేత్

వానప్రస్థుడు అడవిలో లభించే ధాన్యములతో అన్నమును పురోడాశములను తయారు చేసి వాటితోనే, ఆయా కాలములయందు విధించబడిన (నిత్య నైమిత్తిక) హోమములను చేయవలెను. తినదగిన ఆహారధాన్యములు కొత్త కొత్తవి లభించుట తోడనే, పాతవాటిని విడిచి పెట్టవలెను (ఇతరులకు, లేక పశుపక్ష్యాదులకు సమర్పించవలెను).

అగ్న్యర్థమేవ శరణముటజం వాఽద్రికందరామ్

శ్రయేత హిమవాయ్వగ్నివర్షార్కాతపషాట్ స్వయమ్  

వానప్రస్థుడు అగ్నులను రక్షించుట కొరకు మాత్రమే పర్ణశాలను గాని, కొండ గుహను గాని ఆశ్రయించవలెను. తనకై తాను చలిని, గాలిని, అగ్నిని, వర్షమును, సూర్యుని వేడిని సహించవలెను.

కేశరోమనఖశ్మశ్రుమలాని జటిలో దధత్

కమండల్వజినే దండవల్కలాగ్నిపరిచ్చదాన్

వానప్రస్థుడు జటాధారియై జుట్టు, రోమములు, గోళ్లు, గడ్డము, మీసములయందలి మాలిన్యమును ఉపేక్ష చేయవలెను. ఆతడు కమండలమును, మృగచర్మమును, దండమును, ముదక వస్త్రములను, అగ్నిహోత్ర మునకు చెందిన స్రుక్కు మొదలగు సామగ్రిని ధరించవలెను.

చరేద్వనే ద్వాదశాబ్దానష్టౌ వా చతురో మునిః

ద్వావేకం వా యథా బుద్ధిర్న విపద్యేత కృచ్చ్రతః  

వానప్రస్థుడు మననశీలుడై పన్నెండు, ఎనిమిది, నాలుగు, రెండు, లేక ఒక సంవత్సరము వానప్రస్థ ధర్మములను పాటించవలేను. కాని, ఆ ప్రయత్నములో క్లేశముల ఆధిక్యముచే బుద్ధి వినష్టము కాకుండ చూచుకొనవలెను.

యదాఽకల్పస్స్వక్రియాయాం వ్యాధిభిర్జరయాఽథ వా

ఆన్వీక్షిక్యాం వా విద్యాయాం కుర్యాదనశనాదికమ్  

ఎప్పుడైతే సాధకుడు వ్యాధుల వలన గాని, ముసలిదనముచే గాని, నిత్యకర్మలను అనుష్ఠించుటకు గాని ఆత్మవిచారమునకు గాని సమర్థుడు కాడో, అప్పుడు నిరాహారము మొదలగు వ్రతములను చేయవలెను.

ఆత్మన్యగ్నీన్ సమారోప్య సన్న్యస్యాహంమమాత్మతామ్

కారణేషు న్యసేత్సమ్యక్ సంఘాతం తు యథార్హతః

వానప్రస్థుడు మూడు అగ్నులను తనయందు సమంత్రకముగా భావనారూపముగా ఆరోపించుకొనవలెను. ఆతడు దేహేంద్రియ మనస్సంఘాతమునందలి అహంకార (నేను)-మమకారము (నాది) లను విడిచి పెట్టి, వాటిని యోగ్యతననుసరించి వాటి వాటి కారణములయందు విలాపము (భావనారూపముగా) చేయవలెను.

ఖే ఖాని వాయౌ నిశ్శ్వాసాం స్తేజసూష్మాణమాత్మవాన్

అప్స్వసృక్ శ్లేష్మపూయాని క్షితౌ శేషం యథోద్భవమ్

సాధకుడు జితేంద్రియుడై దేహేంద్రీయమనస్సంఘాతమును వాటివాటికి చెందిన ప్రకృతి తత్త్వములయందు భావనారూపముగా విలీనము చేయవలెను. ఇంద్రియములను ఆకాశమునందు, ప్రాణాపానములను వాయువునందు, దేహపు వేడిని అగ్నియందు, రక్తము శ్లేష్మము మూత్రము మొదలగువాటిని జలములయందు, మిగిలిన దేహమును పృథి వియందు విలీనము చేయవలెను.

వాచమగ్నౌ సవక్తవ్యామింద్రే శిల్పం కరావపి

పదాని గత్యా వయసి రత్యోపస్థం ప్రజాపతౌ  

పలుకులతో బాటుగా వాగింద్రియమును అగ్నియందు, పట్టుకోనుట మొదలగు పనులతో బాటుగా చేతులను ఇంద్రునియందు, నడకతో బాటుగా కాళ్లను కాలస్వరూపుడగు విష్ణువునందు, ప్రీతితో బాటుగా జన నేంద్రియమును ప్రజాపతియందు విలీనము (భావన) చేయవలెను.

మృత్యౌ పాయుం విసర్గం చ యథాస్థానం వినిర్దిశేత్

దిక్షు శ్రోత్రం సనాదేన స్పర్శమధ్యాత్మని త్వచమ్  

ఆయా ఇంద్రియశక్తులను వాటి వాటి అనుగ్రాహక దేవతలయందు విలీనమగుటను సాధకుడు భావన చేయవలెను. విసర్జనేంద్రియమును విసర్జనక్రియను మృత్యుదేవతయందు, శ్రోత్రేంద్రియమును శబ్దముతో సహా దిక్కులయందు, స్పర్శేంద్రియమును చర్మమును వాయువునందు విలీనము చేయవలెను

రూపాణి చక్షుషా రాజన్ జ్యోతిష్యభినివేశయేత్

అప్సు ప్రచేతసా జిహ్వాం ఘ్రేయైర్ఘ్రాణం క్షితౌ న్య సేత్

ఓ ధర్మరాజా! రూపములను కన్నుతో సహా సూర్యునియందు, రసనేంద్రియమును అధిదేవతయగు వరుణునితో (మనస్సును ఆకర్షించే రుచులతో) సహా జలములయందు, ఘాజేంద్రియమును ఆఘ్రాణించబడే గంధములతో సహా పృథివియందు విలీనము చేయవలెను.

మనో మనోరథైశ్చంద్రే బుద్ధిం బోధ్యైః కవౌ పరే

కర్మాణ్యధ్యాత్మనా రుద్రే యదహంమమతా క్రియా

సత్త్వేన చిత్తం క్షేత్రజ్ఞే గుజైర్వైకారికం పరే  

కామనలతో సహా మనస్సును చంద్రునియందు, తెలియబడే విషయములతో సహా బుద్దినీ సర్వోత్కృష్టుడగు బ్రహ్మగారియందు, అహంకారముతో సహా క్రియలను రుద్రునియందు, సత్త్వగుణకార్యమగు ప్రకాశముతో సహా చిత్తమును క్షేత్రజ్ఞుని (జీవుని) యందు, సత్త్వరజస్తమోగుణములతో సహా వికారములు కలవానివలె కన్పట్టే జీవుని పరబ్రహ్మయందు విలీనము చేయవలెను.

అప్సు క్షితిమపో జ్యోతిష్యదో వాయౌ నభస్యముమ్

కూటస్థే తచ్చ మహతి తదవ్యక్తేఽక్షరే చ తత్

పృథివీ తత్త్వమును జలములయందు, జలములను అగ్నియందు, అగ్నిని వాయువునందు, వాయువును ఆకాశమునందు, ఆకాశమును వాస్తవముగా వికారములు లేని జీవునియందు, జీవుని మహత్తత్త్వము నందు (మహదభిమానియగు హిరణ్యగర్భునియందు), మహత్తును మూల ప్రకృతియందు, మూలప్రకృతిని కాలాతీతమైన పరబ్రహ్మయందు విలీనము చేయవలెను.

ఇత్యక్షరతయాఽఽత్మానం చిన్మాత్రమవశేషితమ్

జ్ఞాత్వాఽద్వయోఽథ విరమేద్దగ్ధయోనిరివానలః  

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే బ్రహ్మచారి-వానప్రస్థ ధర్మవర్ణనం నామ ద్వాదశోఽధ్యాయః

ఈ విధముగా తన స్వరూపమునందలి అనాత్మలనన్నింటినీ నిషేధించగా మిగిలేది శుద్ధచైతన్యస్వరూపమగు ఆత్మయే. అది వినాశము లేని పరబ్రహ్మకంటె భిన్నము కాదు అనియు, దానియందు రెండవది లేదనియు తెలుసుకొని, తరువాత ఆ వానప్రస్థుడు, ఇంధనమును తగులబెట్టిన అగ్నివలె, సర్వకృత్యములనుండి విరమించును.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో బ్రహ్మచర్య-వానప్రస్థ ధర్మములను వర్ణించే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).