14 - గృహస్థుల ధర్మములు

యుధిష్ఠిర ఉవాచ

గృహస్థ ఏతాం పదవీం విధినా యేన చాంజసా

యాతి దేవఋషే బ్రూహి మాదృశో గృహమూడధీః

ధర్మరాజు ఇట్లు పలికెను --- ఓ దేవర్షి! గృహమునందు వ్యామో హమును పొందిన బుద్ధిగల నావంటి గృహస్థుడు ఈ ఆత్మసాక్షాత్కార మును తేలికగా పొందే విధానమెయ్యది? చెప్పుము.

నారద ఉవాచ

గృహేష్వవస్థితో రాజన్ క్రియాః కుర్వన్ గృహోచితాః

వాసుదేవార్పణం సాక్షాదుపాసీత మహామునీన్  

నారదుడిట్లు పలికెను --- ఓ రాజా! గృహస్థుడు ఆ ఆశ్రమము నకు చెందిన కర్మలను సాక్షాత్తుగా వాసుదేవునకు అర్పించే భావనతో చేస్తూ, మహాత్ములను సేవించవలెను.

శృణ్వన్ భగవతోఽభీక్ష్నమతారకథామృతమ్

శ్రద్దధానో యథాకాలముపశాంతజనావృతః

గృహస్థుడు నిత్యకృత్యములను చేసుకుంటూ సమయము లభించి నప్పుడు. విరక్తజనులచే చుట్టువారబడి భగవానుని అవతారగాథలు అనే అమృతమును మరల మరల శ్రద్ధతో వినుచుండవలెను.

సత్సంగాచ్చనకైస్సంగమాత్మజాయాత్మజాదిషు

విముచ్యేన్ముచ్యమానేషు స్వయం స్వప్నవదుత్ధితః

దేహము, భార్య, సంతానము మొదలైనవి ఏదో ఒకనాడు తమంత తాముగా విడిచి పెట్టేవే. అయిననూ, వ్యక్తి వాటియందు నాది అనే అభిమా నమును కలిగియుండును. నిద్ర లేచిన వ్యక్తి స్వప్నమును వలె, సాధకుడు సత్పురుషులతోడి సంగముయొక్క ప్రభావము వలన వీటియందలి ఆసక్తిని మెల్లగా విడిచి పెట్టవలెను.

యావదర్థముపాసీనో దేహే గేహే చ పండితః

విరక్తో రక్తవత్తత్ర నృలోకే నరతాం న్య సేత్  

వివేకి దేహముతో, ఇంటితో ప్రయోజనము ఎంతవరకో అంత మాత్రమే వాటిని సేవించవలెను. సాధకుడు విరక్తుడైననూ ఆ జనుల మధ్యలో ఆసక్తి కలవాడు వలె సామాన్య మానవుడు వలెనే వ్యవహరించ వలెను.

జ్ఞాతయః పితరౌ పుత్రా భ్రాతరస్సుహృదోఽపరే

యద్వదంతి యదిచ్ఛంతి చానుమోదేత నిర్మమః  

సాధకుడు మమకారము లేనివాడై, బంధువులు తల్లిదండ్రులు సంతానము సోదరులు మిత్రులు ఇతరులు దేనిని చేస్తే దానిని, దేనిని కోరితే దానిని, అంగీకరించవలెను.

దివ్యం భౌమం చాంతరిక్షం విత్తమచ్యుతనిర్మితమ్

తత్సర్వముపభుంజాన ఏతత్కుర్యాత్స్వతో బుధః  

వర్షములు కురిసి పంటలు పండి లభించే సంపద దివ్యము. బంగా రము మొదలైనవి భూమినుండి లభించే సంపద. ఇవి గాక అకస్మాత్తుగా సంపదలు వచ్చి పడవచ్చును. ఈ మూడు విధముల సంపద తనంత తానుగా అచ్యుతునిచే సమకూర్చబడినదియే. వివేకియగు సాధకుడు ఈ విషయమును గుర్తించి, ఆ సంపదనంతనూ అనుభవిస్తూ, పైన చెప్పిన ఈ సత్కర్మలను చేయవలెను.

యావద్భ్రిబ్యేయేత్ జఠరం తావత్స్వత్వం హి దేహినామ్

అధికం యోఽభిమన్యేత స స్తేనో దండమర్హతి

ఎంతటి సంపద మనిషి పొట్ట నిండుటకు సరిపడునో, అంతటి సంపదపై మాత్రమే ఆ వ్యక్తికి హక్కు గలదు. అంతకుమించిన సంపదపై తన హక్కును స్వీకరించే వ్యక్తి చోరుడగును. కావున, ఆ వ్యక్తి శిక్షార్హుడు.

మృగోష్ట్రఖరమర్కాఖుసరీసృప్ఖగమక్షికాః

ఆత్మనః పుత్రవత్పశ్యేత్రైరేషామంతరం కియత్  

మృగములు, ఒంటెలు, గాడిదలు, కోతులు, ఎలుకలు, ప్రాకే జంతువులు, పక్షులు, ఈగలను వివేకి తన సంతానముగానే భావించవలె ను. వాస్తవములో ఈ ప్రాణులకు, సంతానమునకు తేడా ఎంతటిది?

త్రివర్గం నాతికృచ్ఛ్రేణ భజేత గృహమేధ్యపీ

యథాదేశం యథాకాలం యావద్ధైవోపపాదితమ్

గృహస్థుడైననూ అతిశయించిన క్లేశముతో ధర్మార్థకామములనే పురుషార్థములను సాధింప బూనరాదు. దేశకాలములకు అనుగుణముగా దైవము 'సంపన్నము చేసినంతవరకు మాత్రమే గృహస్థుడు ధర్మార్థకామ ములను సేవించవలెను.

ఆశ్వాఘాంతేఽవసాయిభ్యః కామాన్ సంవిభజేద్యథా

అప్యేకమాత్మనో దారాం నృణాం స్వతహాగ్రహో యతః  

గృహస్థుడు భోగ్యవస్తువులను కుక్కలకు, పాపులకు, పతితులకు కూడ వారి అర్హతకు తగ్గట్లుగా పంచి ఈయవలెను. మానవులకు భార్య యందు, ఈమె నా వ్యక్తి అనే అభిమానము ఉండును. గృహస్థుడు అట్టి తన భార్యను కూడ కలుపుకొని సకలప్రాణులకు సేవను చేయవలెను.

జహ్యాద్యదర్ధే స్వప్రాణాన్ హన్యాద్వా పితరం గురుమ్

తస్యాం స్వత్వం స్త్రీయాం జహ్యాద్యస్తేన హ్యజితో జితః  

మానవుడు స్త్రీయందు, ఈమె నా భార్య అనే అభిమానము గల వాడై, ఆమె కొరకై ప్రాణములనైననూ విడిచి పెట్టును; తల్లిదండ్రులను, గుర వునైననూ హతమార్చును. కాని, ఎవడైతే స్త్రీయందలి అట్టి అభిమాన మును విడిచి పెట్టునో, వానికి అపరాజితుడగు భగవానుడు కూడ వశుడగును.

కృమివిడ్బస్మనిష్ఠాoతం క్వేదం తుచ్ఛం కలేవరమ్

క్వ తదీయరతిర్భార్యా క్వాయమాత్మా నభశ్చదిః  

ఆఖరుగా క్రిములు, మాలిన్యము, బూడిదలయందు పర్యవసా నము చెందే ఈ తుచ్ఛమగు దేహము ఎక్కడ? ఆ దేహమునందు ప్రీతి గల భార్య ఎక్కడ? ఆకాశమునకు కూడ కారణము (ఆకాశము కంటే సూక్ష్మము, వ్యాపకము) అగు ఈ ఆత్మ ఎక్కడ?

సిద్ధైర్యజ్ఞావశిష్టార్దైః కల్పయేద్వృత్తిమాత్మనః

శేషే స్వత్వం త్యజన్ ప్రాజ్ఞః పదవీం మహతామియాత్

దైవానుగ్రహముచే లభించిన సంపదతో పంచయజ్ఞములను (దేవ, పితృ, ఋషి, మనుష్య, భూతయజ్ఞములు) చేసి, ఆపైన మిగిలిన ద్రవ్య ములతో గృహస్థుడు తన జీవికను నిర్వహించుకొనవలెను. మిగిలిన సర్వ మునందు, ఇది నాది అనే అభిమానమును విడిచి పెట్టిన వివేకి మహా త్ములు పొందే ఆత్మసాక్షాత్కారము (మోక్షము) ను పొందును.

దేవానృషీన్ నృభూతాని పితృనాత్మానమన్వహమ్

స్వవృత్త్యాగతవిత్తేన యజేత పురుషం పృథక్

గృహస్థుడు తనకు తన వృత్తిచే లభించిన సంపదతో, దేవతలు ఋషులు మానవులు పశుపక్ష్యాదులు మరియు ఆత్మ అనే వేర్వేరు రూప ములలోనున్న పరమేశ్వరుని ఆరాధించవలెను.

యర్హ్యాత్మనోఽధికారాద్యాస్సర్వాస్స్యుర్యజ్ఞసంపదః

వైతానికేన విధినా అగ్నిహోత్రాదినా యజేత్

గృహస్థుడు తనకు యోగ్యత మొదలైన యజ్ఞమునకు ఆవశ్యక మైన సంపదలు అన్నీ సమకూరిన పక్షములో, అగ్నిహోత్రము మొదలైన కర్మలను కల్పసూత్రములలో చెప్పబడిన విధానముతో చేసి పరమేశ్వరుని ఆరాధించవలెను.

న హ్యగ్నిముఖతోఽయం వై భగవాన్ సర్వయజ్ఞభుక్

ఇజ్యేత హవిషా రాజన్ యథా విప్రముఖే హుతైః  

ఓ రాజా! యజ్ఞభాగములన్నింటికీ భోక్తయగు ఈ భగవానుడు వేదవేత్తకు ఆహారమును సమర్పించుట అనే యజ్ఞముచే ఎంత బాగా ప్రస న్నుడగునో, అగ్నియందు హోమములతో చేసే ఆరాధనతో అంత బాగా ప్రసన్నుడు కాడు. ఇది నిశ్చయము.

తస్మాద్బ్రాహ్మణదేవేషు మర్త్యాదిషు యథార్హతః

తైస్తైః కొమైర్యజస్వైనం క్షేత్రజ్ఞం బ్రాహ్మణానను  

కావున, దేవతలను, వేదవేత్తలను, ఇతర మానవులను, పశుపక్ష్యా దులను వారి వారి అర్హతకు తగ్గట్లుగా ఆయా భోగ్యవస్తువులను సమర్పించి ఆరాధించుము. ఆ విధముగా వీరందరియందు దేహేంద్రియమనస్సంఘా తమునకు సాక్షియై ఉండే పరమాత్మను ఆరాధించుము.

కుర్యాదాపరపక్షీయం మాసి ప్రౌష్ఠపదే ద్విజః

శ్రాద్ధం పిత్రోర్యథావిత్తం తద్బంధూనాం చ విత్తవాన్  

సంపద గల బ్రాహ్మణుడు ఆశ్వయుజ కృష్ణపక్షమునందు తల్లిదం డ్రులకు, పితామహ మాతామహులకు తన సంపదకు తగ్గట్లుగా మహాలయ శ్రాద్ధమును చేయవలెను.

అయనే విషువే కుర్యాద్వ్యతీపాతే దినక్షయే

చంద్రాదిత్యోపరాగే చ ద్వాదశీశ్రవణేషు చ

తృతీయాయాం శుక్లపక్షే నవమ్యామథ కార్తికే

చతసృష్వప్యష్టకాసు హేమంతే శిశిరే తథా

మాఘే చ సితసప్తమ్యాం మఘారాకాసమాగమే

రాకయా చానుమత్యా వా మాసర్ క్షాణి యుతాన్యపి

ద్వాదశ్యామనురాధా స్యాచ్ఛ్రవణస్తిస్ర ఉత్తరాః

తిసృష్వేకాదశీ వాఽఽసు జన్మర్క్షశ్రోణయోగయుక్

కర్కట మకర సంక్రాంతులు, మేష తులా సంక్రాంతులు, వ్యతీపా తము (ఆదివారమైన అమావాస్య), దీనక్షయము (సూర్యోదయము తరు వాత వచ్చిన తిథి మరునాడు సూర్యోదయమునకు ముందే అంతమగుట), చంద్ర గ్రహణము, సూర్య గ్రహణము, శ్రవణము ధనిష్ఠ అనూరాధ నక్షత్ర ములు వచ్చిన ద్వాదశి, వైశాఖ శుక్ల తదియ (అక్షయ తదియ), కార్తీక శుక్ల నవమి (అక్షయ నవమి), హేమంత శిశిర ఋతువులలోని (కార్తీక పుష్య మాఘ ఫాల్గున మాసములలో) నాలుగు కృష్ణాష్టములు, మాఘ శుక్ల సప్త మి, మఖా నక్షత్రముతో కూడిన పూర్ణిమ, మాస నక్షత్రము (చిత్ర, విశాఖ మొదలగునవి) తో కూడిన శుక్ల చతుర్దశి పూర్ణిమలు, అనూరాధ శ్రవణము. ఉత్తర ఫల్గుని ఉత్తరాషాఢ ఉత్తరాభాద్రలతో కూడిన ద్వాదశి, ఉత్తరఫల్గుని ఉత్తరాషాడ ఉత్తరాభాద్ర జన్మనక్షత్రము శ్రవణములతో కూడిన ఏకాదశి -- ఈ దినములలో పితృశ్రాద్ధమును చేయవలెను.

త ఏతే శ్రేయసః కాలా నృణాం శ్రేయోవివర్ధనాః

కుర్యాత్సర్వాత్మనైతేషు శ్రేయోఽమోఘం తదాయుషః

ఈ పైన చెప్పిన దినములు మానవులకు కల్యాణమును వర్ధిల్ల జేసే కల్యాణ దినములు. కావున, మానవుడు ఈ దినములయందు సర్వప్ర యత్నముచే పుణ్యకార్యములను చేయవలెను. అట్లు చేయుట జీవితము నకు సాఫల్యమును చేకూర్చును.

ఏషు స్నానం జపో హోమో వ్రతం దేవద్విజార్చనమ్

పితృదేవనృభూతేభ్యో యద్దత్తం తద్ధ్యనశ్వరమ్

ఎందుకంటే, ఈ దినములలో చేసిన తీర్థస్నానము, జపము, హోమము, వ్రతము, దేవపూజ, బ్రాహ్మణపూజ, పితృశ్రాద్ధము, దేవతలకు నైవేద్యాదులను సమర్పించుట, మానవులకు దానమును చేయుట, పశుప క్ష్యాదులకు ఆహారమునిచ్చుట అనే ఈ కర్మలు అక్షయఫలమునిచ్చును.

సంస్కారకాలో జాయాయా అపత్యస్యాత్మనస్తథా

ప్రేతసంస్థా మృతాహశ్చ కర్మణ్యభ్యుదయే నృప  

ఓ రాజా! భార్యకు చేసే పుంసవనము మొదలగు సంస్కారముల యందు, సంతానమునకు చేసే జాతకర్మ మొదలగు సంస్కారములయం దు, గృహస్థుడు తనకు చేసుకొనే యజ్ఞోపవీతధారణము మొదలగు సంస్కార కాలములయందు, ప్రేతకార్యములయందు, వార్షిక శ్రాద్ధము నందు మరియు ఇతరములగు మాంగళిక కర్మల (వ్రతములు మొదలైనవి) యందు చేసిన దానము అక్షయమగును.

అథ దేశాన్ ప్రవక్ష్యామి ధర్మాదిశ్రేయఆవహాన్

స వై పుణ్యతమో దేశస్సత్పాతం యత్ర లభ్యతే  

ఇప్పుడు ధర్మము మొదలైన కల్యాణములను కలిగించే స్థానము లను గురించి చెప్పెదను. ఎచ్చటనైతే దానమునకు యోగ్యుడైన వ్యక్తి లభించునో, అదియే నిశ్చితముగా మిక్కిలి పవిత్రమైన దేశము.

బింబం భగవతో యత్ర సర్వమేతచ్చరాచరమ్

యత్ర హ బ్రాహ్మణకులం తపోవిద్యాదయాన్వితమ్

సకలచరాచరజగత్తునకు అధిష్టానమైన భగవానుని మూర్తి గల స్థానము, తపస్సు శ్రద్ద దయ అనే గుణములతో కూడియున్న బ్రాహ్మణుల సముదాయము ఉన్న స్థానము మిక్కిలి పవిత్రమైన స్థానములు.

యత్ర యత్ర హరేరర్చా స దేశశ్శ్రేయసాం పదమ్

యత్ర గంగాదయో నద్యః పురాణేషు చ విశ్రుతాః  

శ్రీహరియొక్క పూజ జరిగే ప్రతి స్థానము, పురాణములలో అధిక ముగా వర్ణించబడిన గంగ మొదలైన నదులు ఉండే స్థానము మిక్కిలి పవి త్రమైనవి, మరియు కల్యాణములకు నిధానములు.

సరాంసి పుష్కరాదీని క్షేత్రాణ్యర్హా శ్రితాన్యుత

కురుక్షేత్రం గయశిరః ప్రయాగః పులహాశ్రమః  

పుష్కరము మొదలైన సరస్సులు, మహర్షులు సిద్దులు మొదలైన పుణ్యాత్ములు నివసించిన క్షేత్రములు, కురుక్షేత్రము, గయాసురుని తల పడిన గయాక్షేత్రము, ప్రయాగ, పులహుని ఆశ్రమము (సాలగ్రామ క్షేత్రము) లు మిక్కిలి పవిత్రములైన స్థానములు.

నైమిషం ఫాల్గునం సేతుః ప్రభాసోఽథ కుశస్థలీ

వారాణసీ మధుపురీ పంపా బిందుసరస్తథా  

నైమిశారణ్యము, ఫాల్గున క్షేత్రము, సేతుబంధము, ప్రభాసము, ద్వారక, కాశి, మథుర, పంపాసరము, బిందుసరము పవిత్ర స్థానములు.

నారాయణాశ్రమో నందా సీతారామాశ్రమాదయః

సర్వే కులాచలా రాజన్ మహేంద్రమలయాదయః  

ఓ రాజా! బదరికాశ్రమము, అలకనంద, సీతారాముల ఆశ్రమము లైన చిత్రకూటము మొదలైనవి, మహేంద్ర-మలయ-సహ్య-శుక్తిమత్-ఋ క్షవత్-వింధ్య-పారియాత్రములు అనే కులపర్వతములు మిక్కిలి పవిత్ర మగు స్థానములు. 

ఏతే పుణ్యతమా దేశా హరేరర్చాశ్రితాశ్చ యే

ఏతాన్ దేశాన్ నిషేవేత శ్రేయస్కామో హ్యభీక్ష్ణశః

ధర్మో హ్యత్రేహితః పుంసాం సహస్రాధి ఫలోదయః

శ్రీహరియొక్క అర్చామూర్తులకు ఆశ్రయములగు స్థానములు మిక్కిలి పవిత్రములు. కల్యాణమును కోరే వ్యక్తి ఈ స్థానములను నిశ్చయ ముగా మరల మరల సేవించవలెను. ఈ స్థానములలో చేయబడిన ధర్మము మానవులకు వేయి రెట్లు అధికఫలమునిచ్చును.

పాత్రం త్వత్ర నిరుక్తం వై కవిభిః పాత్రవిత్తమైః

హరి రేవైక ఉర్వీశ యన్మయం వై చరాచరమ్

ఓ మహారాజా! స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తు అంతా శ్రీహరిచే వ్యాప్త మై యున్నది. కావున, ఈ లోకములో శ్రీహరి ఒక్కడే పూజకు పాత్రుడు, అని పాత్రస్వరూపమును తెలిసినవారిలో అగ్రగణ్యు లగు మహాత్ములు నిర్దేశించినారు.

దేవర్ష్యర్హత్సు వై సత్సు తత్ర బ్రహ్మాత్మజాదిషు

రాజన్ యదగ్రపూజాయాం మతః పాత్రతయాఽచ్యుతః

ఓ మహారాజా! ఎందుకంటే, అక్కడ నీ రాజసూయయాగసభలో బ్రహ్మగారి పుత్రుడగు నారదుడు మొదలైన మహర్షులు, దేవతలు, సిద్దపు రుషులు ఉండగా, అందరికంటే ముందుగా చేసే పూజకు శ్రీకృష్ణుడు అర్హమైనవాడుగా స్వీకరించబడినాడు.

జీవరాశిభిరాకీర్ణ ఆండకోశాంఘ్రిపో మహాన్  

తన్మూలత్వాదచ్యుతేజ్యా సర్వజీవాత్మతర్పణమ్  

బ్రహ్మాండకోశమనే మహావృక్షము జీవుల సమూహములచే వ్యాప్తమై యున్నది. దానికి మూలము అచ్యుతుడే. కావున, అచ్యుతుని ఆరాధించినచో, సకలజీవుల ఆత్మకు తృప్తి కలుగును.

పురాణ్యనేన సృష్టాని నృతిర్యగృషిదేవతాః

శేతే జీవేన రూపేణ పురేషు పురుషో హ్యసౌ

ఈ ఈశ్వరుడు మానవులు, పశుపక్ష్యాదులు, మహర్షులు, దేవ తలు మొదలగు ప్రాణుల శరీరములను సృష్టించి, వాటియందు జీవరూప ముగా ప్రకటమగుచున్నాడు. పురములనదగిన శరీరములయందు ప్రకటన గుచుండుటచే ఈ ఈశ్వరునకు పురుషుడు అనే సార్థకనామము కలిగినది.

తేష్వేషు భగవాన్ రాజంస్తారతమ్యేన వర్తతే

తస్మాత్పాత్రం హి పురుషో యావానాత్మా యథేయతే

ఓ మహారాజా! అట్టి ఈ ప్రాణులయందు భగవానుడు చైతన్యాంశ ములోని తరతమభావముతో ప్రకటమగుచున్నాడు. కావున, మానవమా త్రుడు దానాదికమునకు యోగ్యుడే. మనుష్యులలో ఎవనియందు చైతన్య రూపమగు జ్ఞానము ఏ విధముగా ప్రకటమగునో, దానిని బట్టి ఆ వ్యక్తి యొక్క యోగ్యత నిర్ధారితమగును.

దృష్ట్వా తేషాం మిథో నృణామవజ్ఞానాత్మతాం నృప

త్రేతాదిషు హరేరర్చా క్రియాయై కవిభిః కృతా  

ఓ మహారాజా! త్రేతా మొదలగు యుగములలో మానవులకు పర స్పరము అవమానించుకోనే లక్షణము అధికముగా నుండును. ఈ విషయ మును గమనించియే, మహర్షులు పూజాకర్మ (ఉపాసన) కొరకు శ్రీహరి యొక్క ప్రతిమను కల్పించిరి.

తతోఽర్చాయాం హరిం కేచిత్ సంశ్రద్ధాయ సపర్యయా

ఉపాసత ఉపాస్తాపి నార్థదా పురుషద్విషామ్

తరువాత కొందరు ప్రతిమయందు చక్కని శ్రద్దగలవారై పూజలను చేసి శ్రీహరిని ఉపాసించుచున్నారు. కాని, ఇతరమానవులను ద్వేషిస్తూ ప్రతిమయందు శ్రీహరిని ఉపాసించిననూ, దానివలన పురుషార్థము సిద్ధించబోదు.

పురుషేష్వపి రాజేంద్ర సుపాత్రం బ్రాహ్మణం విదుః

తపసా విద్యయా తుష్ట్యా ధత్తే వేదం హరేస్తనుమ్

ఓ మహారాజా! మానవులయందు కూడ వేదవేత్తయగు బ్రాహ్మ ణుడు దానాదికమునకు మంచి యోగ్యుడని మహాత్ములు చెప్పెదరు. ఎందుకంటే, అట్టి బ్రాహ్మణుడు సంతుష్టి గలవాడై, తపస్సు మరియు ఉపా సనల ద్వారా శ్రీహరి రూపమగు వేదమును వల్లించి నిలబెట్టుచున్నాడు.

నన్వస్య బ్రాహ్మణా రాజన్ కృష్ణస్య జగదాత్మనః

పునంతః పాదరజసా త్రిలోకీం దైవతం మహత్  

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే

 గృహస్థధర్మవర్ణనం నామ చతుర్దశోఽధ్యాయః

ఓ మహారాజా! జగద్రూపముగా ప్రకటమైయున్న ఈ శ్రీకృష్ణునకు కూడ బ్రాహ్మణులు గొప్ప దైవము. ఇది నిశ్చయము. ఇట్టి బ్రాహ్మణులు తమ పాదధూళిచే ముల్లోకములను పావనము చేయుదురు.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో

 గృహస్థుల ధర్మములను వర్ణించే పదునాల్గవ

అధ్యాయము ముగిసినది (14).