భాగవత మహా పురాణము
7 - ప్రహ్లాద చరితము - ప్రహ్లాదుని జన్మవృత్తాంతము
నారద ఉవాచ ।
ఏవం దైత్యసుతైః పృష్టో మహాభాగవతోసురః ।
ఉవాచ స్మయమానస్తాన్ స్మరన్ మదనుభాషితమ్ ॥
నారద మహర్షి ఇట్లు పలికెను --- ప్రహ్లాదుడు రాక్షసుల వంశ ములో జన్మించిననూ, గొప్ప భగవద్భక్తుడు. ఆ రాక్షసపుత్రులే విధముగా ప్రశ్నించగా ఆయన నా ఉపదేశమును స్మరిస్తూ, చిరునవ్వుతో వారిని ఉద్దే శించి ఇట్లు పలికెను.
ప్రహ్లాద ఉవాచ ।
పితరి ప్రస్థితేకస్మాకం తపసే మందరాచలమ్ ।
యుద్ధోద్యమం పరం చక్రుర్విబుధా దానవాన్ ప్రతి ॥
ప్రహ్లాదుడిట్లు పలికెను --- మా తండ్రి తపస్సు కొరకై మందర పర్వతమునకు వెళ్లినప్పుడు, దేవతలు రాక్షసులకు వ్యతిరేకముగా యుద్ధ ము కొరకై పెద్ద ఉద్యమమును చేసిరి.
పిపీలికైరహిరివ దిష్ట్యా లోకోపతాపనః ।
పాపేన పాప్వోభక్షితివాదినో వాసవాదయః ॥
ఇంద్రుడు మొదలగువారు ఇట్లు పలికిరి -- హిరణ్యకశిపుడు జను లను హింస పెట్టేను. చీమలు పామును భక్షించినట్లుగా, దైవవశముచే ఆ పాపీని వాని పాపమే భక్షించినది.
తేషామతిబలోద్యోగం నిశమ్యాసురయూథపాః ।
వధ్యమానాస్సురైర్భీతా దుద్రువుస్సర్వతోదిశమ్ ॥
కలత్రపుత్రమిత్రాప్తాన్ గృహాన్ పశుపరిచ్చదాన్ ।
నావేక్షమాణాస్త్వరితాస్సర్వే ప్రాణపరీప్సవః ॥
వారి మహాబలపూర్వకమగు యుద్ధప్రయత్నమును చూచిన రాక్షస సేనానాయకులు అందరు భయపడిరి. దేవతలు వారిని సంహరించ మొద లీడిరి. భార్య, పిల్లలు, మిత్రులు, ఆప్తులు, ఇళ్లు, పశువులు, భోగసాధన ములు అనువాటిని పట్టించుకోకుండా, వారు కేవలము ప్రాణములను మాత్రమే రక్షించుకొనగోరి, వేగముగా అన్ని దిక్కులకు పరుగులెత్తిరి.
వ్యలుంపన్ రాజశిబిరమమరా జయకాంక్షిణః ।
ఇంద్రస్తు రాజమహిషీం మాతరం మమ చాగ్రహీత్ ॥
విజయమును కోరే దేవతలు రాజనివాసమును తగులబెట్టిరి. ఇంద్రుడైతే మా తల్లియగు మహారాణిని చెరబట్టెను.
నీయమానాం భయోద్విగ్నాం రుదతీం కురరీమివ ।
యదృచ్ఛయాగతస్తత్ర దేవర్షిద్దదృశే పథి ॥
భయముతో కలవరపాటు చెందియున్న ఆ మహారాణిని ఇంద్రుడు తీసుకొని పోవుచుండగా, ఆమె కురరి (లకుముకి పిట్ట) వలె రోదించుచుం డెను. ఆ సమయములో దేవర్షియగు నారదుడు అనుకో కుండా ఈశ్వరే చ్ఛచే అచటకు వచ్చి, దారిలో ఆమెను చూచెను.
ప్రాహ మైనాం సురపతే నేతుమర్హస్యనాగసమ్ ।
ముంచ ముంచ మహాభాగ సతీం పరపరిగ్రహమ్ ॥
నారదుడు దేవనాయకుడగు ఇంద్రునితో ఇట్లు పలికెను -- ఓ మహానుభావా! పతివ్రతయగు ఈమె నిర్దోషి. పరభార్యయగు ఈమెను నీవు తీసుకొనిపోవుట తగదు. ఈమెను విడిచి పెట్టుము, విడిచి పెట్టుము.
ఇంద్ర ఉవాచ ।
ఆస్తేస్యా జఠరే వీర్యమవిషహ్యం సురద్విషః ।
ఆస్యతాం యావత్ప్రసవం మోక్ష్యేవర్థపదవీం గతః ॥
ఇంద్రుడిట్లు పలికెను --- ఈమె గర్భములో దేవవిద్వేషియగు హిరణ్యకశిపుని వీర్యము ఉన్నది. భవిష్యత్తులో ఆ శిశువు పెరిగి పెద్దయైన చో, వాని ప్రతాపమును దేవతలు సహించలేరు. కావున, ప్రసవము అయ్యే వరకు ఈమె నా వద్దనే ఉండుగాక! నా ప్రయోజనము (శత్రు శేషము ఉండ కుండా చేయుట) సిద్ధించిన తరువాత, ఈమెను నేను విడిచి పెట్టెదను.
నారద ఉవాచ ।
అయం నిష్కిల్బిషసాక్షిన్మహాభాగవతో మహాన్ ।
త్వయా న ప్రాప్యతే సంస్థామనంతానుచరో బలీ ॥
నారదుడిట్లు పలికెను --- ఈ శిశువులో దోషము ఉండదు. ఈతడు సాక్షాత్తుగా గొప్ప భగవద్భక్తుడు, గొప్పవాడు, శ్రీహరి సేవకుడు కాగలడు. అట్టి ఈ బలశాలి కాబోయే పిల్లవానిని నీవు చంపలేవు.
ఇత్యుక్తస్తాం విహాయేంద్రో దేవర్షేర్మానయన్ వచః ।
అనంతప్రియభక్త్యేనాం పరిక్రమ్య దివం యయౌ ॥
దేవర్షియగు నారదుడు ఇట్లు చెప్పగా, ఇంద్రుడు ఆయన మాటను మన్నించి, మా తల్లిని విడిచి పెట్టెను. అనంతునకు ప్రియుడనైన నేను గర్భ మునందుండుటచే, ఇంద్రుడు మా తల్లికి ప్రదక్షిణము చేసి, స్వర్గమునకు వెళ్లాను.
తతో నో మాతరమృషిస్సమానీయ నిజాశ్రమమ్ ।
ఆశ్వాస్యేహోష్యతాం వత్సే యావత్తే భర్తురాగమః ॥
తరువాత నారద మహర్షి మా తల్లిగారిని తన ఆశ్రమమునకు తీసుకు వచ్చి ఆమెను ఓదార్చి ఇట్లు పలికెను - అమ్మాయీ! నీ భర్త వచ్చేవరకు నీవు ఇచట నివసించుము.
తథేత్యవాత్సీద్దేవన్డేరంతి సాప్యకుతోభయా ।
యావద్దైత్యపతిర్ఘరాతపసో న న్యవర్తత ॥
ఆమే సరే అని పలికి, రాక్షసరాజగు హిరణ్యకశిపుడు కఠినమైన తపస్సును మాని తిరిగి వచ్చేవరకు, దేవర్షి నారదుని వద్ద నివసించేను. ఆమెకు అచట దేనినుండియైననూ భయము లేదు.
ఋషిం పర్యచరత్తత్ర భక్త్యా పరమయా సతీ ।
అంతర్వత్నీ స్వగర్భస్య క్షేమాయేచ్ఛాప్రసూతయే ॥
పతివ్రత, గర్బిణి అగు మా తల్లి అచట ఉంటూ, తన గర్భములోని శిశువుయొక్క క్షేమము కొరకు మరియు తాను కోరినప్పుడు ప్రసవము అగుట కొరకు, నారద మహర్షిని గొప్ప భక్తితో సేవించెను.
ఋషిః కారుణికస్తస్యాః ప్రాదాదుభయమీశ్వరః ।
ధర్మస్య తత్త్వం జ్ఞానం చ మామప్యుద్దిశ్య నిర్మలమ్ ॥
నారద మహర్షి దయాళువు, సమర్థుడు. ఆయన తన మనస్సులో నన్ను కూడ పెట్టుకొని, ఆమెకు నిర్మలమైన ధర్మస్వరూపము మరియు జ్ఞానము అనే రెండింటినీ అనుగ్రహించెను.
తత్తు కాలస్య దీర్ఘత్వాత్ స్త్రీత్వాన్మాతుస్తిరోదధే ।
ఋషిణానుగృహీతం మాం నాధునాప్యజహాత్ స్మృతిః ॥
చాల కాలము అగుట వలన, స్త్రీకి ఉండే ఇబ్బందుల వలన, ఆ ఉపదేశమును మా తల్లి మరచెను. కాని, నేను నారదుని అనుగ్రహమును పొందినవాడనగుటచే, ఆ స్మృతి ఇప్పటికీ కూడా నన్ను విడిచి పెట్టలేదు.
భవతామపి భూయాన్మే యది శ్రద్దధతే వచః ।
వైశారదీ ధీశ్శ్రద్దాతః స్త్రీబాలానాం చ మే యథా ॥
నా మాటపై మీకు శ్రద్ధ ఉన్నచో, మీకు కూడ ఆ జ్ఞానము కలుగు గాక! శ్రద్ధ వలన దేహాభిమానమును పోగొట్టే వివేకబుద్ధి నాకు కలిగినట్లు గానే స్త్రీలకు, పిల్లలకు కూడ కలుగును.
జన్మాద్యాష్టడిమే భావా దృష్టా దేహస్య నాత్మనః ।
ఫలానామివ వృక్షస్య కాలేనేశ్వరమూర్తినా ॥
ఈశ్వరుని రూపమే అయిన కాలముయొక్క ప్రభావముచే దేహ మునందు పళ్లయందు వలె పుట్టుక, ఉండుట, పెరుగుట, పరిణతి జెందు ట, క్షీణించుట, నశించుట అనే ఆరు వికారములు మనకు అనుభవములో నున్న విషయములే. పండు వికారములు చెట్టుకు లేనట్లే, దేహముయొక్క వికారములు ఆత్మకు సంక్రమించవు.
ఆత్మా నిత్యోకవ్యయశ్శుద్ధ ఏకః క్షేత్రజ్ఞ ఆశ్రయః ।
అవిక్రియస్స్వదృగ్ హేతుర్వ్యాపకోకసంగ్యనావృతః ॥
కాలమునకు అతీతమైన ఆత్మయందు క్షీణించుట అనేది ఉండదు. ఆత్మకంటే భిన్నముగా రెండవది లేనందు వలన, ఆత్మయందు రాగద్వేష సులకు తావు లేదు. దేహేంద్రియమనస్సంఘాతము అనే క్షేత్రము విష యములో ఆత్మ నిత్యసాక్షియై ఉండును. సర్వజగత్తునకు ఆధారమైన ఆత్మయందు వికారములేవియు ఉండవు. స్వయంప్రకాశమగు ఆత్మయే సర్వజగత్కారణము. ఆత్మ సర్వవ్యాపకమే అయిననూ, దానికి దేనితోనై ననూ సంగము లేదు. ఆత్మ ఆవరణములు లేని పూర్ణతత్త్వము.
ఏతైర్ద్వాదశభిర్విద్వానాత్మనో లక్షణైః పరైః ।
అహం మమేత్యసద్భావం దేహాదౌ మోహజం త్యజేత్॥
వివేకి ఆత్మయొక్క స్వరూపమును సూచించే ఈ పన్నెండు శ్రేష్ఠ లక్షణములను అనుసంధానము చేయవలెను. దేహము ఇంద్రియముల యందలి వ్యామోహము వలన మనకు వాటియందు నేను, నాది అనే మిథ్యాభిమానము ఉండును. దానిని వివేకి పరిత్యజించవలెను.
స్వర్ణం యథా గ్రావసు హేమకారః
క్షేత్రేషు యోగైస్తదభిజ్ఞ ఆప్నుయాత్ ।
క్షేత్రేషు దేహేషు తథాత్మయోగైః
అధ్యాత్మవిద్బ్రహ్మగతం లభేత ॥
బంగారమును తయారుచేసే వ్యక్తి బంగారము దొరికే గనుల యందలి రాళ్లలోని బంగారమును అనేకములైన ఉపాయములతో వెలికితీయును. ఆ ఉపాయములన్నియు ఆతనికి ఎరుకయే. అదే విధముగా, ఆత్మానాత్మవివేకము గల సాధకుడు ఆత్మజ్ఞానమునకు సహకరించే ధ్యానము మొదలైన ఉపాయములననుష్ఠించి, చైతన్య క్షేత్రములనదగిన దేహములయందే బ్రహ్మను ఆత్మరూపముగా సాక్షాత్కరించుకొనవలెను.
అష్టా ప్రకృతయః ప్రోక్తాస్త్రయ ఏవ హి తద్గుణాః ।
వికారాషోడశాచార్యైః పుమానేకస్సమన్వయాత్ ॥
సాంఖ్యాచార్యుల పరిగణనమిట్లున్నది -- ప్రకృతులు (జగత్తునకు మూలమునందున్న తత్త్వములు) మూలప్రకృతి, మహత్తత్త్వము, అహంకా రము, పృథివి నీరు అగ్ని వాయువు ఆకాశము అనే అయిదు సూక్ష్మభూత ములు వెరసి ఎనిమిది. మూలప్రకృతి సత్త్వరజస్తమస్సులు అనే మూడు గుణములు గలది. అయిదు కర్మేంద్రియములు, అయిదు జ్ఞానేంద్రియములు, అంతఃకరణము, అయిదు స్థూలభూతములు వెరసి పదహారు వికార ములు (మూలతత్త్వములనుండి ప్రకటమైన కార్యములు). దృశ్యమగు ఈ సర్వమునందు వ్యాపించియున్న చైతన్యస్వరూపుడగు పురుషుడు ఒక్కడే.
దేహస్తు సర్వసంఘాతో జగత్తస్థురితి ద్విధా ।
అత్రైవ మృగ్యః పురుషో నేతి నేతీత్యతత్త్యజన్ ॥
అన్వయవ్యతిరేకేణ వివేకేనోశత్వాత్మనా ।
సర్గస్థానసమామ్నా యైర్విమృశద్భిరసత్వ రైః ॥
ప్రకృతి-వికృతుల సమాహారమైన ఈ దేహము కదిలేది, కదలనిది అని రెండు విధములుగా నున్నది. పురుషుడు కాని దేహము, మనస్సు మొదలగువాటిని, ఇది కాదు, ఇది కాదు అంటూ నిరాకరించి పరమాత్మను ఈ దేహమునందు మాత్రమే అన్వేషించవలెను. కారణము కార్యప్రపంచ మునంతనూ వ్యాపించియున్ననూ (అన్వయము), కారణము కార్యము కంటే విలక్షణమైనది (వ్యతిరేకము) అనే వివేకమును ఆత్మవిచారమును. చేసే సాధకులు ప్రసన్నమైన మనస్సుతో అభ్యసించవలెను. ఈ జగత్తు దేనినుండి ఉదయించి దేనియందు నిలిచి దేనియందు విలీనమగునో అట్టి పరబ్రహ్మ సకలప్రాణులలో ఆత్మరూపముగానున్నది అని చక్కగా బోధించే శ్రుతివాక్యములను సాధకులు పరిశుద్ధమగు అంతఃకరణముతో వివేచించవ లెను. ఈ విచారములో తొందరపాటు పనికి రాదు.
బుద్ధేర్జాగరణం స్వప్నసుషుప్తిరితి వృత్తయః ।
తా యేనైవానుభూయంతే సోధ్యక్షః పురుషః పరః ॥
తెలివిగా నుండుట, కలలను గనుట, నిద్ర అనే మూడు అవస్థలు ఏ చైతన్యము ద్వారా అనుభవమునకు వచ్చుచున్నవో, అట్టి సాక్షి చైత న్యమే దేహేంద్రియాదులకంటె అతీతమైన పరమాత్మ.
ఏభిస్త్రివర్ణైః పర్యస్తైర్బుద్ధిభేదైః క్రీయోద్భవైః ।
స్వరూపమాత్మనో బుధ్యోద్గంధైర్వాయుమివాన్వయాత్ ॥
సత్త్వగుణప్రాధాన్యముచే జాగ్రదవస్థ, రజోగుణముచే స్వప్నావస్థ, తమస్సుచే నిద్ర కర్మఫలరూపముగా బుద్ధియందు కలుగుచుండును. ఆ బుద్ధియందు ఆత్మ సాక్షి చైతన్యరూపముగా అనుగతమై యున్నది. బుద్ధి తోడి తాదాత్మ్యముచే ఈ అవస్థలు ఆత్మకేనా యని అనిపించును. అట్టి తాదాత్మ్యమును నిరాకరించి, గంధమును బట్టి దానికి ఆశ్రయమగు వాయువును తెలుసుకున్నట్లుగా, బుద్దిలోని అవస్థలను ప్రకాశింపజేసే సాక్షి
చైతన్యస్వరూపముగా పరమాత్మను తెలుసుకొనవలెను.
ఏతద్ద్వారో హి సంసారో గుణకర్మనిబంధనః ।
అజ్ఞానమూలోకపార్టోపి పుంసస్స్వప్న ఇవేష్యతే ॥
ఆత్మానాత్మవివేకము లేకుండా ఈ బుద్దితోడి తాదాత్మ్యము వల ననే ఆత్మకు ఈ జననమరణప్రవాహరూపమగు సంసారము ప్రాప్తమై త్రిగు ణములచే మరియు కర్మలచే స్థిరము చేయబడుచున్నది. ఈ సంసారము కనబడుటయే గాని, వాస్తవము కొదు; ఇది కలవలె మిథ్య.
తస్మాద్భవద్భిః కర్తవ్యం కర్మణాం త్రిగుణాత్మనామ్ ।
బీజనిర్హరణం యోగః ప్రవాహోపరమో ధియః ॥
కావున, సాధకులు మూడు గుణముల పరిణామరూపములైన కర్మల బీజము ఆత్మానాత్మవివేకము లేకపోవుటయేనని గుర్తించి, అజ్ఞాన మనే ఆ బీజమును నశింపజేయుటకు యత్నించవలెను. అదియే యోగము. బుద్ధియొక్క ప్రవాహము ఉపశమించుటయే యోగము.
తత్రోపాయసహస్రాణామయం భగవతోదితః ।
యదీశ్వరే భగవతి యథా యైరంజసా రతిః ॥
అజ్ఞానమనే బీజమును నశింపజేసే విషయములో వేలాది ఉపా యములు గలవు. కాని, భగవానుడు ఒక్క ఉపాయమును చెప్పినాడు. దేనితో వివిధధర్మముల ననుష్ఠించుచుండగా, జగన్నాథుడగు భగవానుని యందు ప్రేమ ఉదయించునో, అది (భక్తి) యే ఆ ఉపాయము.
గురుశుశ్రూషయా భక్త్యా సర్వలబ్ధార్పణేన చ ।
సంగేన సాధుభక్తానామీశ్వరారాధనేన చ ॥
శ్రద్ధయా తత్కఠాయాం చ కీర్తనైర్గుణకర్మణామ్ । తత్పాదాంబురుహధ్యానాతల్లింగేక్షార్హణాదిభిః ॥
భక్తితో గురువును సేవించుట, తనకు లభించిన సర్వమును భగవా నునకు సమర్పించుట, సత్పురుషులైన భక్తులతో సత్సంగము, ఈశ్వరుని ఆరాధించుట, ఈశ్వరుని గాథలయందు శ్రద్దను కలిగియుండుట, ఈశ్వ రుని గుణములను లీలలను కీర్తించుట, ఆ భగవానుని పాదపద్మములను ధ్యానించుట, ఆ భగవానుని మూర్తులను దర్శించి పూజించుట మొదలగు సాధనలచే భగవానునియందు ప్రేమ ఉదయించును.
హరిస్సర్వేషు భూతేషు భగవానాస్త ఈశ్వరః ।
ఇతి భూతాని మనసా కామైస్తైస్సాధు మానయేత్ ॥
సర్వేశ్వరుడైన శ్రీహరి సకలప్రాణులలో ఉన్నాడు అనే భావనతో ఆ ప్రాణులకు అభీష్టములగు వస్తువులను సాదరముగా సమర్పించవలెను.
ఏవం నిర్జితషడ్వర్గైః క్రియతే భక్తిరీశ్వరే ।
వాసుదేవే భగవతి యయా సంలభతే గతిమ్ ॥
సాధకులు కామక్రోధలోభమోహమదమాత్సర్యములనే ఆర్గురు అంతశ్శత్రువులను జయించి జగన్నాథుడగు వాసుదేవ భగవానునియందు ఈ విధముగా భక్తిని చేసినచో, భగవానునియందు ప్రేమ ఉదయించును.
నిశమ్య కర్మాణి గుణానతుల్యాన్
వీర్యాణి లీలాతనుభిః కృతాని ।
యదాతిహర్షోత్పులకాశ్రుగద్గదం
ప్రోత్కంఠ ఉద్గాయతి రౌతి నృత్యతి ॥
యదా గ్రహగ్రస్త ఇవ క్వచిద్ధస-
త్యాక్రందతే ధ్యాయతి వందతే జనమ్ ।
ముహుశ్శ్వసన్ వక్తి హరే జగత్పతే
నారాయణేత్యాత్మమతిర్గతత్రపః ॥
తదా పుమాన్ముక్తసమస్తబంధనస్తద్భావభావానుకృతాశయాకృతిః,
నిర్దగ్ధబీజానుశయో మహీయసా భక్తిప్రయోగేణ సమేత్యధోక్షజమ్ ।
భగవానుని సాటిలేని గుణములను, భగవానుడు లీల కొరకై అవ తారములనెత్తి చేసిన కర్మలను చూపిన పరాక్రమములను విని భక్తునకు గొప్ప హర్షముచే గగుర్పాటు కలిగి కన్నీరు ప్రవహించి కంఠము డగుత్తికను పొందును. ఆతడు ఎలుగెత్తిన కంఠముతో బిగ్గరగా పొడి శబ్దమును చేసి నాట్యమాడును. భక్తుడు దెయ్యము పట్టినవాడు వలె నవ్వుతూ ఏడుస్తూ ఈశ్వరుని ధ్యానిస్తూ జనులకు నమస్కరించును. ఆతడు ఆత్మరూపుడగు ఈశ్వరునియందు లగ్నమైన మనస్సు గలవాడై బిడియమును విడనాడి, పదే పదే నిట్టూర్పులను విడుస్తూ, ఓ హరీ! జగన్నాథా! నారాయణా! అని పిలుచును. భక్తుడు ఇట్టి స్థితిని చేరుకున్నచో, ఆతని సకలబంధములు తొల గిపోవును. ఆతని అంతఃకరణము, దేహము కూడ భగవానుని లీలయొక్క భావనకు అనురూపముగా తయారగును. ఈ విధమైన గొప్ప భక్తిని చేయు టచే ఆతని అజ్ఞానబీజము, వాసనలు పూర్తిగా దగ్ధమగును. అట్టివాడు ప్రత్యకాది ప్రమాణములకు అందని శ్రీహరిలో శాశ్వతముగా ఐక్యమగును.
అధోక్షజాలంభమిహానుభాత్మనః
శరీరిణస్సంసృతిచక్రశాతనమ్ ।
తద్బ్రహ్మ నిర్వాణసుఖం విదుర్బుధాః ।
తతో భజధ్వం హృదయే హృదీశ్వరమ్ ॥
ఈ లోకములో అమంగళకరమగు మనోవాసనలు గల మానవునకు సంసారచక్రమును నివారణ చేసేది ప్రత్యక్షాది ప్రమాణములకు అందని శ్రీహరిని పొందుటయే. ఆ శ్రీహరినే పరబ్రహ్మ అనియు, మోక్షానందమనియు మహాత్ములు వర్ణించెదరు. మీరు మీ హృదయములో హృద యేశ్వరుడగు ఆ పరమాత్మను ఆరాధించుడు.
కోఽతిప్రయాసోఽసురబాలకా హరేః
ఉపాసనే స్వే హృది ఛిద్రవత్సతః।
స్వస్యాత్మనస్సఖ్యుర శేషదేహినాం
సామాన్యతః కిం విషయోపపాదనైః ॥
ఓ అసురబాలకులారా! శ్రీహరి సకలప్రాణుల హృదయములో ఆకాశమువలె ఉండి సమానరూపముగా హితమును చేయుచున్నాడు. ఆ విధముగా తనకు ఆత్మరూపుడే అయి ఉన్న శ్రీహరిని ఉపాసించుటలో పెద్ద ప్రయాస ఏమి గలదు? భోగములను ఆర్జించుటలో ప్రయోజనమేమి గలదు?
రాయః కలత్రం పశవస్సుతాదయో
గృహా మహీ కుంజరకోశభూతయః ।
సర్వేఽర్థకామాః క్షణభంగురాయుషః
కుర్వంతి మర్త్యస్య కియత్ప్రియం చలాః ॥
ధనములు అస్థిరములు. భార్య, సంతానము, ఇల్లు, పశుసంపద, భూమి, ఏనుగులు, ధనాగారము, భోగసాధనములు మొదలైన అర్థకామములన్నింటియొక్క ఆయుష్షు క్షణకాలములో నశించేది మాత్రమే. ఇవి మానవునకు చేసే ప్రియము ఎంతటిది?(అల్పము).
ఏవం హి లోకాః క్రతుభిః కృతా అమీ
క్షయిష్ణవస్సాతిశయా న నిర్మలాః ।
తస్మాదదృష్టశ్రుతదూషణం పరం
భక్త్యైకయేశం భజతాత్మలబ్ధయే ॥
ఇదే విధముగా యజ్ఞములను చేసి సంపాదించే ఈ స్వర్గాది లోకములు కూడ నశించే స్వభావము గలవియే. వాటిలో దోషములు లేవని చెప్పుటకు వీలులేదు. పైగా, వాటిలో ఒకదానిని మించి మరియొకటి ఉండుటచే అవి సాపేక్షములు. కావున, మీరు ఆత్మలాభము కొరకై అనన్యమగు భక్తితో ఆ పరమేశ్వరుని ఆరాధించుడు. ఆయనయందు దోషము కనబడదు; వేదములలో వినబడదు.
యదధ్యర్థ్యేహ కర్మాణి విద్వన్మాన్యసకృన్నరః ।
కరోత్యతో విపర్యాసమమోఘం విందతే ఫలమ్ ॥
ఈ లోకములో మానవుడు తనకే అన్నీ తెలుసునని భావిస్తూ సుఖమును కోరి పదే పదే కర్మలను చేయుచుండును. కాని వానికి అవశ్యముగా విపరీత ఫలము, అనగా దుఃఖము, లభించుచున్నది.
సుఖాయ దుఃఖమోక్షాయ సంకల్ప ఇహ కర్మిణః ।
సదాఽఽప్నోతీహయా దుఃఖమనీహాయాస్సుఖావృతః ॥
ఈ లోకములో మానవుడు సుఖమును, దుఃఖమునుండి విముక్తిని కోరి కర్మలను చేయుచుండును. కాని, అన్ని సందర్భములలో మానవుడు దుఃఖమునే పొందుచున్నాడు. వాస్తవములో కామనను ఆపై ఆ కామన కొరకై కర్మను చేయుటకు ముందే మానవుడు నిండా సుఖమును కలిగియు న్నాడు.
కామాన్ కామయతే కామ్యైర్యదర్థమిహ పూరుషః ।
స వై దేహస్తు పారక్యో భంగురో యాత్యు పైతి చ ॥
ఈ లోకములో మానవుడు దేహము కొరకై భోగసాధనములను కోరి కామ్యకర్మలను చేయుచుండును. కాని, ఆ దేహమైతే నిశ్చయముగా నశించి క్రిమికీటకాదులకు ఆహారము అగును. ఆ దేహము జీవుని విడిచి పెట్టి, మరల జీవునకు సంప్రాప్తమగును.
కిము వ్యవహితాపత్యదారాగారధనాదయః ।
రాజ్యం కోశగజామాత్యభృత్యాప్తా మమతాస్పదాః ॥
దేహముయొక్క గతి ఇట్లుండగా, దేహమునకు బయట ఉండి, ఇది నాది అనే అభిమానములో విషయములయ్యే సంతానము, భార్య, ఇల్లు, ధనము, రాజ్యము, కోశాగారము, ఏనుగులు, అమాత్యులు, సేవకులు, ఆప్తులైన బంధువులు కూడ దూరమయ్యేవే అని వేరుగ చెప్పవలెనా?
కిమేతైరాత్మనుచ్చైస్సహ దే హేన నశ్వ రైః ।
అనర్థైరర్థసంకాశైర్నిత్యానందమహోదధేః ॥
తుచ్చములగు ఈ ఇంద్రియభోగములు శరీరముతో బాటే నశించును. ఇవి పురుషునకు అభీష్టములుగా భాసించిననూ, వాస్తవములో ఆపదలను కొని తెచ్చును. సర్వకాలములలో ఆనందమునకు మహాసముద్రమైయున్న ఆత్మకు వీటితో పని యేమున్నది?
నిరూప్యతామిహ స్వార్థః కియాన్ దేహభృతోఽసురాః ।
నిషేకాదిష్వవస్థాసు క్లిశ్యమానస్య కర్మభిః ॥
ఓ అసుర బాలకులారా! మీరే ఆలోచించండి. తల్లి కడుపున పడుటతో మొదలు పెట్టి వేర్వేరు అవస్థలలో ప్రారబ్ధకర్మానుసారముగా కష్టములను పడుచున్న దేహధారికి ఈ లోకములో లభించే వాస్తవమైన ప్రయోజనము (ఫలము) ఎంతటిది?
కర్మాణ్యారభతే దేహీ దేహేనాత్మానువర్తినా ।
కర్మభిస్తనుతే దేహముభయం త్వవివేకతః ॥
దేహధారియగు జీవుడు తనకు వశమై యుండే దేహముతో కర్మలను చేయును. ఆ కర్మలచే ఆ జీవుడు మరియొక దేహమును పొందును. ఈ విధముగా జీవుడు తన స్వరూపమునకు దేహాదులకు ఉండే తేడాను గుర్తించకపోవుటచే దేహము-కర్మలు అనే రెండింటినీ విస్తరింప జేసుకొనును.
తస్మాదర్థాశ్చ కామాశ్చ ధర్మాశ్చ యదపాశ్రయాః ।
భజతానీహయాఽఽత్మానమనీహం హరిమీశ్వరమ్ ॥
కావున, మీరు జగన్నాథుడై ఆత్మస్వరూపుడుగా ఉన్న శ్రీహరిని నిష్కామముగా భజించుడు. ఆయన కామనలు లేని పూర్ణుడు. ధర్మార్థకా మములు ఆయననే ఆశ్రయించి ఉన్నవి.
సర్వేషామపి భూతానాం హరిరాత్మేశ్వరః ప్రియః ।
భూతైర్మహద్బిస్స్వకృతైః కృతానాం జీవసంజ్ఞితః ॥
తనచే సృష్టించబడిన పృథివి మొదలైన మహాభూతములతో నిర్మితమైన సకల దేహములకు జీవుడని పిలువబడే ప్రియమైన ఆత్మ శ్రీహరియే. ఆయనయే ఆ జీవులలో అంతర్యామియై ఉన్నాడు.
దేవోఽసురో మనుష్యో వా యక్షో గంధర్వ ఏవ చ ।
భజన్ముకుందచరణం స్వస్తిమాన్ స్యాద్యథా వయమ్ ॥
దేవత గాని, అసురుడు గాని, మానవుడు గాని, యక్షుడు గాని, గంధర్వుడు గాని ఎవరైననూ మోక్షప్రదాతయగు శ్రీహరియొక్క పాదమును సేవించువాడు, మనవలెనే మంగళములను పొందును.
నాలం ద్విజత్వం దేవత్వమృషిత్వం వాసురాత్మజాః ।
ప్రీణనాయ ముకుందస్య న వృత్తం న బహుజ్ఞతా ॥
న దానం న తపో నేజ్యా న శౌచం న ప్రతాని చ ।
ప్రీయతేఽమలయా భక్త్యా హరిరన్యద్విడంబనమ్ ॥
ఓ అసుర బాలకులారా! మోక్షప్రదాతయగు శ్రీహరిని ప్రసన్నము చేసుకొనుటకు ఉపనయన సంస్కారము గాని, దేవతయై ఉండుట గాని, మహర్షి యగుట గాని, మంచి నడవడి గాని, అధికమగు విజ్ఞానమును కలిగి యుండుట గాని, దానము గాని, తపస్సు గాని, యజ్ఞము గాని, బాహ్యము నందు ఆంతరమునందు శౌచమును కలిగియుండుట గాని, వ్రతములు గాని సమర్థములు గావు. శ్రీహరి నిర్మలమైన (కామన అనే మాలిన్యము లేని) భక్తిచే ప్రసన్నుడగును. ఇతరము సర్వము అనుకరణము మాత్రమే.
తతో హరౌ భగవతి భక్తిం కురుత దానవాః ।
ఆత్మౌపమ్యేన సర్వత్ర సర్వభూతాత్మనీశ్వరే ॥
ఓ అసురులారా! కావున, సకలప్రాణులను తనతో సమానముగా ప్రేమించుట ద్వారా, సకలప్రాణులలో ఆత్మరూపుడై జగన్నాథుడైయున్న శ్రీహరి భగవానునియందు భక్తిని చేయుడు.
దైతేయా యక్షరక్షాంసి స్త్రీయశ్శూద్రా వ్రజౌకసః ।
ఖగా మృగాః పాపజీవాస్సంతి హ్యచ్యుతతాం గతాః ॥
శ్రీహరితో ఐక్యమును పొందినవారు దితివంశీయులు, యక్షులు, రాక్షసులు, స్త్రీలు, శూద్రులు, గొల్లపల్లెలలో నివసించువారు, పక్షులు, పశు వులు, పాపజీవులు కూడ గలరు సుమా! (భక్తి మహిమ అట్టిది).
ఏతావానేవ లోకేఽస్మిన్ పుంసస్స్వార్థః పరస్స్మృతః ।
ఏకాంతభక్తిర్గోవిందే యత్సర్వత్ర తదీక్షణమ్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే ప్రహ్లాదచరితే ప్రహ్లాదకృతోపదేశో నామ సప్తమోఽధ్యాయః ॥
ఈ లోకములో మానవుడు పొందగలిగే సర్వోత్తమమైన పురుషా ర్థము గోవిందునియందు ఏకాంతభక్తిని చేయుటయేనని మహర్షులచే చెప్ప బడినది. సర్వకాలములలో సర్వదేశములలో సర్వమునందు శ్రీహరిని దర్శించుటయే ఆ భక్తియొక్క స్వరూపము.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో ప్రహ్లాదచరితమునందు ప్రహ్లాదుని ఉపదేశమును వర్ణించే ఏడవ అధ్యాయము ముగిసినది (7) .
Summary of chapter 7 of the Bhāgavata Mahā Purana is as follows:
When his classmates asked Prahlāda how he acquired such transcendental knowledge at such a young age within a demonic household, Prahlāda revealed the historical circumstances of his birth. While Hiraṇyakaśipu was performing austerities on Mandarācala Mountain, Indra attacked the demonic realm and abducted Prahlāda's pregnant mother, Kayādhū. Devarshi Nārada intercepted Indra, protected Kayādhū, and brought her to his sacred ashram. While residing at Nārada's hermitage, Kayādhū served the sage, and Nārada imparted profound spiritual discourses on self-realization, the science of the soul, and Bhāgavata-dharma. The unborn child Prahlāda absorbed Nārada's divine teachings directly from within his mother's womb, retaining complete spiritual memory and realization upon birth.