భాగవత మహా పురాణము
10 - ప్రహ్లాద చరితము - ప్రహ్లాదుని నిష్కామ భక్తి, త్రిపుర దహనము
నారద ఉవాచ ।
భక్తియోగస్య తత్సర్వమంతరాయతయార్భకః !
మన్యమానో హృషీ కేశం స్మయమాన ఉవాచ హ ॥
నారద మహర్షి ఇట్లు పలికెను --- ప్రహ్లాదుడు పిల్లవాడే అయినా, ఆ వరములన్నియు భక్తియోగమునకు ఆటంకములనియే భావించి, చిరున వ్వుతో ఇంద్రియాధిపతియగు నరసింహునితో ఆ సమయములో ఇట్లు పలికెను.
ప్రహ్లాద ఉవాచ ।
మా మాం ప్రలోభయోత్పత్త్యాఽఽసక్తం కామేషు తైర్వ రైః ।
తత్సంగభీతో నిర్విణ్ణో ముముక్షుస్త్వాముపాశ్రితః ॥
ప్రహ్లాదుడు ఇట్లు పలికెను --- స్వభావముచేతనే కామనల యందు ఆసక్తి కలిగియున్న నన్ను ఆ వరములతో ప్రలోభ పెట్ట వద్దు. నేను విరక్తుడనై ఆ కామనలయందలి ఆసక్తి వలన భయపడుచున్నవాడను. మోక్షమును కోరే నేను నిన్ను శరణు వేడుచున్నాను.
భృత్యలక్షణజిజ్ఞాసుర్భక్తం కామేష్వచోదయాత్ ।
భవాన్ సంసారబీజేషు హృదయగ్రంథిషు ప్రభో ॥
ఓ ప్రభూ! కామనలు సంసారమునకు మూలములు, హృదయ ములోని ముడులు. నీవు భక్తుని లక్షణములనరయుటకు మాత్రమే భక్తుడ నగు నన్ను అట్టి కామనలయందు ప్రేరేపించితివి.
నాన్యథా తేఽఖిలగురో ఘటేత కరుణాత్మనః ।
యస్త ఆశీష ఆశాస్తే న స భృత్యస వై వణిక్ ॥
ఓ సకలజగద్గురూ! అట్లు (పరీక్ష కోసము) గానిచో, కరుణానిధివగు నీవు భక్తుని ప్రలోభ పెట్టుట సంభవము కాదు. ఎవడైతే నీనుండి కామన లను కోరునో, ఆతడు నిశ్చయముగా వర్తకుడే గానీ, భక్తుడు కాడు.
నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే ।
హరయేఽద్భుతసింహాయ బ్రహ్మణే పరమాత్మనే ॥
ఓ భగవానుడా! పూర్ణుడవగు నీవు సర్వాత్మస్వరూపుడవు. సకల ప్రాణులలో అంతరతమమగు ఆత్మస్వరూపుడవై విరాజిల్లే పరబ్రహ్మవు నీవే. నీవు అద్బుతమగు సింహము రూపు దాల్చిన శ్రీహరివి. నీకు నమ స్కారము.
నృసింహ ఉవాచ ।
నైకాంతినో మే మయి జాత్విహాశిష
ఆశాసతేఽముత్ర చ యే భవద్విధాః ।
అథాపి మన్వంతరమేతదత్ర
దైత్యేశ్వరాణామనుభుంక్ష్వ భోగాన్ ॥
నరసింహస్వామి ఇట్లు పలికెను --- నాయందు ఏకాంతమగు (ఫలాపేక్ష లేని) భక్తి గల నీవంటి వారలు ఇహలోకమునందు గాని, పరలోకమునందు గాని కోరికలను ఏనాడైననూ నానుండి కోరరు. అయినప్పటికీ, నీవీ మన్వంతరము పూర్తి అయ్యేవరకు ఈ లోకమునందు రాక్షసప్రభువుల భోగములను నిరంతరముగా అనుభవించుము.
కథా మదీయా జుషమాణః ప్రియాస్త్వం
ఆవేశ్య మామాత్మని సంతమేకమ్ ।
సర్వేషు భూతేష్వధియజ్ఞమీశం
యజస్వ యోగేన చ కర్మ హిన్వన్ ॥
నీవు అభీష్టములైన నా గాథలను వినుచుండుము. నాకంటే భిన్న ముగా రెండవది ఏదీ లేదు. సకలప్రాణులలో నేనే ఆత్మరూపుడనై యున్నా ను. యజ్ఞేశ్వరుడనగు నాపై నీ మనస్సును దృఢముగా నిలిపియుంచుము. కర్మయోగము (ఈశ్వరార్పణబుద్ధితో కర్మలను చేయుట) తో నన్ను ఆరాధి స్తూ, ప్రారబ్ధకర్మను క్షయము చేసుకొనుము.
భోగేన పుణ్యం కుశలేన పాపం కలేవరం కాలజవేన హిత్వా ।
కీర్తిం విశుద్ధాం సురలోకగీతాం వితాయ మామేష్యసి ముక్తబంధః ॥
సుఖానుభవముచే పుణ్యమును, ధర్మానుష్ఠానముచే పాపమును క్షయము చేసుకొనుము. దేవలోకములో కూడ గానము చేయబడే పరిశుద్ధమైన కీర్తిని విస్తరింప జేయుము. కాలముయొక్క వేగముచే దేహమును విడిచిపెట్టి నన్ను చేరుకొనుము.
య ఏతత్కీర్తయేన్మహ్యం త్వయా గీతమిదం నరః ।
త్వాం చ మాం చ స్మరన్ కాలే కర్మబంధాత్ప్రముచ్యతే॥
ఏ మానవుడైతే నీవు దానము చేసిన ఈ నా స్తోత్రమును కీర్తించి నిన్ను నన్ను కూడ స్మరించునో, ఆతడు తగిన కాలములో కర్మబంధము నుండి విముక్తిని పొందగలడు. .
ప్రహ్లాద ఉవాచ ।
వరం వరయ ఏతత్తే వరదేశాన్మహేశ్వర ।
యదనిందత్పితా మే త్వామవిద్వాం స్తేజ ఐశ్వరమ్ ॥
విద్దామర్షాశయస్సాక్షాత్సర్వలోకగురుం ప్రభుమ్ ।
భ్రాతృ హేతి మృషాదృష్టిస్త్వద్భక్తే మయి చాఘవాన్ ॥
తస్మాత్పితా మే పూయేత దురంతాద్దుస్తరాదఘాత్ ।
పూతస్తేఽపాంగసందృష్టస్తదా కృపణవత్సల ॥
ప్రహ్లాదుడు ఇట్లు పలికెను --- ఓ మహేశ్వరా! నీవు వరములనిచ్చువారికి ప్రభుడవు. నేను నీనుండి ఈ వరమును కోరుచున్నాను. ఈశ్వరుని తేజస్సు గురించి తెలియని నా తండ్రి నీవే తన సోదరుని చంపినావనే తప్పుడు ధారణను కలిగియుండెను. ఆయన అంతఃకరణము వ్యథతో మరియు కోపముతో నిండియుండెను. పైగా, ఆయన నీ భక్తుడనగు నాకు కూడ ద్రోహమును చేసెను. సర్వసమర్థుడవగు నీవు సాక్షాత్తుగా సకలప్రా ణులకు తండ్రివి. అట్టి నిన్ను నిందించి, ఆయన అంతము లేని పాపమును చేసెను. ఆ పాపమును తరించుట శక్యము కాదు. ఓ దీనబంధూ! ఆయన ఆ పాపమునుండి విముక్తుడగు గాక! నీవు ఆయనను సంహరించినప్పుడు కడకంటితో చక్కగా చూచితివి. ఆ చూపుతోనే ఆయన పవిత్రుడైనాడు.
శ్రీభగవానువాచ ।
త్రిస్సప్తభిః పితా పూతః పితృభిస్సహ తేఽనఘ ।
యత్సాధోఽస్య గృహే జాతో భవాన్ వై కులపావనః ॥
ఓ సత్పురుషా! నీలో పాపము లేదు. నీ తండ్రి ఇరవై ఒక్క తరాల పితృదేవతలతో సహా పవిత్రుడైనాడు. ఇది నిశ్చయము. ఎందుకంటే, కులమును పావనము చేసే నీవు వీని ఇంటిలో జన్మించినావు గదా!
యత్ర యత్ర చ మద్భక్తాః ప్రశాంతాస్సమదర్శినః ।
సాధవస్సముదాచారాస్తే పూయంత్యపి కీకటాః ॥
సత్పురుషులగు నా భక్తులు ప్రసన్నమైన మనస్సుతో సర్వము నందు పరమాత్మను దర్శించెదరు. చక్కని ఉత్తమమైన ప్రవృత్తి గల అట్టి నా భక్తులు ఏయే దేశములో అడుగిడుదురో, ఆ స్థానములు కీకటములే (అ పవిత్రదేశములు) అయినా, పావనమగును.
సర్వాత్మనా న హింసంతి భూతగ్రామేషు కించన ।
ఉచ్ఛావచేషు దైత్యేంద్ర మద్భావేన గతస్పృహాః ॥
ఓ రాక్షసరాజా! తొలగిపోయిన కోరికలు గల నా భక్తులు పెద్ద గాని, చిన్న గాని ప్రాణుల సముదాయములయందు ఏ ప్రాణికైననూ ఏ విధమైన హింసను చేయరు. వారు హింసను పరిహరించుటకు సర్వప్రయత్నములను చేసెదరు.
భవంతి పురుషా లోకే మద్భక్తాస్త్వామనుప్రతాః ।
భవాన్మే ఖలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపధృక్ ॥
లోకములో నిన్ను నిష్టగా అనుసరించే జనులు నా భక్తులగుదురు. నా భక్తులందరిలో శ్రేష్ఠుడవగు నీవు నా భక్తులందరికీ ఆదర్శము అగుచున్నావు సుమా!
కురు త్వం ప్రేతకార్యాణి పితుః పూతస్య సర్వశః ।
మదంగస్పర్శనేనాంగ లోకాన్ యాస్యతి సుప్రజాః ॥
ఓ వత్సా! నా అవయవములను స్పృశించుటచే నీ తండ్రి అన్ని విధములుగా (అన్ని పాపములనుండి) పవిత్రుడైనాడు. నీవంటి మంచి పుత్రుని కన్నందువలన ఆయన పుణ్యలోకములను పొందగలడు.
పిత్ర్యం చ స్థానమతిష్ఠ యథోక్తం బ్రహ్మవాదిభిః ।
మయ్యావేశ్య మనస్తాత కురు కర్మాణి మత్పరః ॥
ఓ వత్సా! నీ తండ్రియొక్క రాజ్యాధికారమును కూడ నీవు చేపట్టుము. మనస్సును నాయందే గట్టిగా నిలిపి, నేనే పరమలక్ష్యముగా గలవాడవై, వేదవేత్తల బోధనలను ఉల్లంఘించకుండా, కర్మలను చేయుము.
నారద ఉవాచ ।
ప్రహ్లాదోఽపి తథా చక్రే పితుర్యత్సాంపరాయికమ్ ।
యథాఽఽహ భగవాన్ రాజన్నభిషిక్తో ద్విజోత్తమైః ॥
నారదుడిట్లు పలికెను --- ఓ ధర్మరాజా! నరసింహ భగవానుడు ఆదేశించిన విధముగా ప్రహ్లాదుడు కూడ తండ్రియొక్క ప్రేతకర్మను చేసెను. గొప్ప వేదవేత్తలు ఆయనను రాజ్యాభిషిక్తుని చేసిరి.
ప్రసాదసుముఖం దృష్ట్వా బ్రహ్మా నరహరిం హరిమ్ ।
స్తుత్వా వాగ్భిః పవిత్రాభిః ప్రాహ దేవాదిభిర్వృతః ॥
నరసింహరూపములోనున్న శ్రీహరి ప్రసన్నుడై సుందరమగు ముఖమును కలిగియుండుటను గమనించిన బ్రహ్మగారు, దేవతలు మహర్షులు మొదలగువారు చుట్టువారియుండగా, పవిత్రములగు వాక్కులతో స్తుతించి ఇట్లు పలికెను.
. బ్రహ్మోవాచ ।
దేవదేవాఖిలాధ్యక్ష భూతభావన పూర్వజ ।
దిష్ట్యా తే నిహతః పాపో లోకసంతాపనోఽసురః ॥
ఓ దేవదేవా! సర్వేశ్వురడవగు నీవే సకలప్రాణులను సృష్టించితివి. తండ్రీ! పాపియై లోకములకు అధికమగు పీడను కలిగించుచున్న రాక్షసుని నీవు సంహరించి లోకకల్యాణమును చేసితివి.
యోఽసౌ లబ్ధవరో మత్తో న వధ్యో మమ సృష్టిభిః । తపోయోగబలోన్నద్ధస్సమస్తనిగమానహమ్ ॥
ఈ రాక్షసుడు నా సృష్టిలోని వారెవ్వరైననూ సంహరించలేని విధముగా నానుండి వరములను పొందెను. ఈతడు తపస్సును చేసి యోగశక్తులను సంపాదించి గర్వించినవాడై వైదికధర్మములనన్నింటినీ చెడగొట్టెను.
దిష్ట్యాస్య తనయస్సాధుర్మహాభాగవతోఽర్భకః ।
త్వయా విమోచితో మృత్యోర్ధిష్ట్యా త్వాం సమితోఽధునా ॥
కాని సౌభాగ్యమేమనగా వీని పుత్రుడగు ఈ బుడతడు సత్పురుషుడు,గొప్ప భగవద్భక్తుడు. వానిని నీవు మృత్యువునుండి విడిపించితివి. ఈతడు సౌభాగ్యముచే నిన్ను ఇప్పుడు శరణు పొందినాడు.
ఏతద్వపుస్తే భగవన్ ధ్యాయతః ప్రయతాత్మనః ।
సర్వతో గోప్తృ సంత్రాసాన్మృత్యోరపి జిఘాంసతః ॥
ఓ భగవానుడా! నీ ఈ రూపము నియంత్రించబడిన మనస్సుతో ధ్యానించువానిని అన్ని విధములుగా రక్షించును; మృత్యుదేవత సంహరించగోరువానినైననూ ఈ రూపముయొక్క ధ్యానము రక్షించును.
నృసింహ ఉవాచ ।
మైవం వరోఽసురాణాం తే ప్రదేయః పద్మసంభవ ।
వరః క్రూరనిసర్గాణామహీనామమృతం యథా ॥
నరసింహుడిట్లు పలికెను --- పద్మమునుండి పుట్టిన ఓ బ్రహ్మా! నీవు అసురులకు ఇట్టి వరమును ఈయరాదు. క్రూరస్వభావము గలవారికి వరమునిచ్చుట పాములకు పాలు పోయుట వంటిది.
నారద ఉవాచ ।
ఇత్యుక్త్వా భగవాన్ రాజంస్తత్రైవాంతర్దధే హరిః ।
అదృశ్యస్సర్వభూతానాం పూజితః పరమేష్ఠినా ॥
ఓ ధర్మరాజా! శ్రీహరి భగవానుడీ విధముగా పలికి, బ్రహ్మగారి పూజలనందుకొని, అప్పుడే అక్కడే సకలప్రాణులకు కానరాకుండా అంతర్ధానమాయెను.
తతస్సంపూజ్య శిరసా వవందే పరమేష్ఠినమ్ ।
భవం ప్రజాపతీన్ దేవాన్ ప్రహ్లాదో భగవత్కలాః ॥
తరువాత ప్రహ్లాదుడు భగవానుని అంశలగు బ్రహ్మగారిని, రుద్రుని, ప్రజాపతులను, దేవతలను చక్కగా పూజించి తల వంచి ప్రణమిల్లెను.
తతః కావ్యాదిభిస్సార్గం మునిభిః కమలాసనః ।
దైత్యానాం దానవానాం చ ప్రహ్లాదమకరోత్పతిమ్ ॥
తరువాత పద్మాసనుడగు బ్రహ్మగారు శుక్రాచార్యుడు మొదలగు మహర్షులతో గూడి, ప్రహ్లాదుని దితి-దనువంశీయులగు రాక్షసులకు ప్రభువునుగా చేసెను.
ప్రతినంద్య తతో దేవాః ప్రయుజ్య పరమాశిషః ।
స్వధామని యయూ రాజన్ బ్రహ్మాద్యాః ప్రతిపూజితాః ॥
ఓ ధర్మరాజా! తరువాత బ్రహ్మగారు మొదలగు దేవతలు ప్రహ్లాదుని అభినందించి గొప్ప ఆశీస్సులను చేసిరి. ప్రహ్లాదుడు కూడ వారిని పూజించెను. అపుడు వారు తమ తమ స్థానములకు వెళ్లిరి.
ఏవం తౌ పార్షదౌ విష్ణోః పుత్రత్వం ప్రాపితౌ దితేః ।
హృది స్థితేన హరిణా వైరభావేన తౌ హతౌ ॥
ఈ విధముగా విష్ణువుయొక్క అనుచరులగు ఆ జయ విజయులిద్దరు దితికి పుత్రులై జన్మించిరి. వైరబుద్దిచే శ్రీహరియే హృదయమునందు స్థిరముగా నిలిచియుండగా, వారిద్దరు సంహరించబడిరి.
పునశ్చ విప్రశాపేన రాక్షసౌ తౌ బభూవతుః ।
కుంభకర్ణదశగ్రీవౌ హతౌ తౌ రామవిక్రమైః ॥
వేదవేత్తలగు సనకాదుల శాపముచే మరల వారిద్దరు కుంభకర్ణుడు, రావణుడు అనే రాక్షసులై జన్మించిరి. వారినిద్దరిని పరాక్రమశాలియగు శ్రీరాముడు సంహరించెను.
శయానౌ హృది నిర్భిన్నహృదయౌ రామసాయకైః ।
తచ్చిత్తౌ జహతుర్దేహం యథా ప్రాక్తనజన్మని ॥
శ్రీరాముడు తన బాణములతో వారి గుండెలను పగులగొట్టగా, వారు నేలకొరిగి, గడచిన జన్మ (హిరణ్యాక్ష-హిరణ్యకశిపులు) లో వలెనే ఆయననే చిత్తములో స్మరిస్తూ దేహమును విడిచి పెట్టిరి.
తావిహాథ పునర్జాతౌ శిశుపాలకరూషజౌ ।
హరౌ వైరానుబంధేన పశ్యతస్తే సమీయతుః ॥
తరువాత వారిద్దరు ఈ సమయములో శిశుపాల దంతవక్తులై జన్మించి శ్రీహరియందు వైరమును నిరంతరముగా చేసిరి. నీవు చూచుచుండగనే వారిద్దరు శ్రీహరియందు విలీనమైరి.
ఏనః పూర్వకృతం యత్త ద్రాజానః కృష్ణవైరిణః ।
జహుస్త్వంతే తదాత్మానః కీటః పేశస్కృతో యథా ॥
శ్రీకృష్ణునియందు వైరము గల రాజులు పూర్వజన్మలో ఆయనను నిందించి చాల పాపమును చేసిరి. కాని, గొంగళిపురుగు తుమ్మెదను ధ్యానించి దాని రూపమును పొందినట్లుగా, వారు దేహత్యాగసమయము నందు శ్రీకృష్ణుని స్వరూపములో విలీనమై ఆ పాపమును విడిచి పెట్టిరి.
యథా యథా భగవతో భక్త్యా పరమయాఽభిదా ।
నృపాశ్చైద్యాదయస్సాత్మ్యం హరేస్తచింతయా యయుః ॥
భక్తులు భేదదర్శనము లేని సర్వోత్కృష్టమైన భగవంతునియందలి భక్తితో ఏయే విధముగా, శ్రీహరిని ధ్యానించి ఆయన స్వరూపములో విలీనమగుదురో, అదే విధముగా చేదిరాజగు శిశుపాలుడు మొదలగు రాజులు కూడ ఆయననే నిరంతరముగా స్మరించి ఆయనలో విలీనమైరి.
ఆఖ్యాతం సర్వమేతత్తే యన్మాం త్వం పరిపృష్టవాన్ ।
దమ ఘోషసుతాదీనాం హరేస్సాత్మ్యమపి ద్విషామ్ ॥
దమఘోషుని పుత్రుడగు శిశుపాలుడు మొదలగువారు శ్రీహరిని ద్వేషించి కూడా ఆయన స్వరూపములో విలీనమగుటను గురించి నీవు నన్ను సాదరముగా ప్రశ్నించితివి. ఈ విషయమునంతనూ నేను నీకు చెప్పితిని.
ఏషా బ్రహ్మణ్యదేవస్య కృష్ణస్య చ మహాత్మనః ।
అవతారకథా పుణ్యా వధో యత్రాదిదైత్యయోః ॥
శ్రీకృష్ణుడు వేదవేత్తల యెడల భక్తి గల దేవుడు. సర్వాత్మస్వరూపుడగు ఆయనయొక్క ఈ అవతార గాథ పవిత్రమైనది. దీని యందు మొట్టమొదటి దితిపుత్రులగు హిరణ్యాక్ష-హిరణ్యకశిపుల సంహారము వర్ణించబడినది.
ప్రహ్లాదస్యానుచరితం మహాభాగవతస్య చ ।
భక్తిర్ జ్ఞానం విరక్తిశ్చ యాథాత్మ్యం చాస్య వై హరేః ॥
గొప్ప భగవద్బక్తుడగు ప్రహ్లాదుని వృత్తాంతము, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, ఈ శ్రీహరియొక్క స్వరూపము అను విషయములు నిశ్చయముగా వర్ణించబడినవి.
సర్గస్థిత్యప్యయేశస్య గుణకర్మానువర్ణనమ్ ।
పరావరేషాం స్థానానాం కాలేన వ్యత్యయో మహాన్ ॥
సృష్టిస్థితిలయములకు ప్రభుడగు శ్రీహరియొక్క గుణములు, లీలలు వర్ణించబడినవి. గొప్పవారగు దేవతల స్థానములలో, నికృష్టులగు రాక్షసుల స్థానములలో కాలమును బట్టి వచ్చిన గొప్ప మార్పులు (తల్లక్రిందులగుట) కూడ వర్ణించబడినవి.
ధర్మో భాగవతానాం చ భగవాన్ యేన గమ్యతే ।
ఆఖ్యానేఽస్మిన్ సమామ్నాతమాధ్యాత్మికమ శేషతః ॥
భగవానుని పొందించే భగవద్భక్తుల ధర్మము, ఆత్మానాత్మవివేకము మొదలైన ఆత్మస్వరూప నిరూపణము కూడ ఈ గాథలో చక్కగా వర్ణించ బడినవి.
య ఏతత్పుణ్యమాఖ్యానం విష్ణోర్వీర్యోపబృంహితమ్ ।
కీర్తయేచ్చ్రద్దయా శ్రుత్వా కర్మపాశైర్విముచ్యతే ॥
ఈ పవిత్రమైన గాథలో విష్ణువుయొక్క పరాక్రమము విస్తారముగా వర్ణించబడినది. దీనిని ఎవడైతే శ్రద్ధతో కీర్తించునో మరియు వినునో, అట్టి వాడు కర్మబంధమునుండి విముక్తుడగును.
ఏతద్య ఆదిపురుషస్య మృగేంద్రలీలాం
దైత్యేంద్రయూథపవధం ప్రయతః పఠేత ।
దైత్యాత్మజస్య చ సతాం ప్రవరస్య పుణ్యం
శ్రుత్వానుభావమకుతోభయమేతి లోకమ్ ॥
ఈ విధముగా సర్వజగత్కారణుడగు పురుషోత్తముడు నరసింహావతారమునెత్తి లీలలను చేసెను. ఆయన రాక్షసరాజు సేనానాయకుడు అగు హిరణ్యకశిపుని సంహరించెను. హిరణ్యకశిపుని పుత్రుడగు ప్రహ్లాదుడు పవిత్రమగు ప్రభావము గలవాడు. ఈ వృత్తాంతమునంతనూ ఎవడైతే వినునో, ఏకాగ్రమగు చిత్తముతో పఠించునో, అట్టివాడు దేనివలనైననూ భయము లేని ఆత్మలోకమును (ఆత్మజ్ఞానముచే) పొందును.
యూయం నృలోకే బత భూరిభాగా
లోకం పునానా మునయోఽభయంతి ।
యేషాం గృహానావసతీతి సాక్షాద్
గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగమ్ ॥
ఆహా! మానవలోకములో మీ భాగ్యము చాల గొప్పది. రహస్యముగా మానవాకృతిని దాల్చియున్న పరబ్రహ్మ సాక్షాత్తుగా మీ ఇంటిలో నివసించుచున్నాడు. కావుననే, లోకమును పావనము చేసే మహర్షులు అన్ని వైపులనుండియు మీ గృహమునకు వచ్చుచున్నారు.
స వా అయం బ్రహ్మ మహద్విమృగ్యం
కైవల్యనిర్వాణసుఖానుభూతిః ।
ప్రియస్సుహృద్వః ఖలు మాతులేయ
ఆత్మాఽర్హణీయో విధికృద్గురుశ్చ ॥
అద్వయ-ఆత్మాభిన్నము, నిరుపద్రవము, ఆనందానుభవమే స్వరూపముగా గలది, వేదములలో ప్రసిద్దమైనది అగు పరబ్రహ్మను మహర్షులు ధ్యానమార్గములో అన్వేషించుచుందురు, అట్టి పరబ్రహ్మ మీ మేన మామ కొడుకగు. శ్రీకృష్ణుడే. ఆయన మీకు ప్రియమైన హితకారియై హితమునుపదేశించి మీ పనులను కూడ చేసి పెట్టును. మీ పూజలనందుకొనే ఆయన మీకు మిక్కిలి అనుకూలుడు గదా!
న యస్య సాక్షాద్బవపద్మజాదిఖీ
రూపం ధియా వస్తుతయోపవర్ణితమ్ ।
మౌనేన భక్త్యోపశమేన పూజితః
ప్రసీదతామేష స సాత్వతాం పతిః ॥
శ్రీకృష్ణునియొక్క తత్త్వమును సాక్షాత్తుగా బ్రహ్మగారు, రుద్రుడు మొదలగువారైననూ తమ బుద్ధితో యథాతథముగా వర్ణించజాలరు. ఆయనను సాధకులు మౌనముచే, భక్తితో, ఇంద్రియజయముతో ఆరాధించేదరు. భక్తజనపాలకుడగు ఆ ఈ శ్రీకృష్ణుడు మాపై ప్రసన్నుడగు గాక!
స ఏష భగవాన్ రాజన్ వ్యతనోద్విహతం యశః ।
పురా రుద్రస్య దేవస్య మయేనానంతమాయినా ॥
పూర్వము రుద్రదేవుని కీర్తిని అంతులేని మాయలు గల మయుడు వినష్టము చేసెను. అపుడు ఆ ఈ శ్రీహరి భగవానుడు ఆయన కీర్తిని మరల విస్తరింప జేసెను.
రాజోవాచ ।
కస్మిన్ కర్మణి దేవస్య మయోఽహన్ జగదీశితు: ।
యథా చోపచితా కీర్తి: కృష్ణేనానేన కథ్యతామ్ ॥
ధర్మరాజు ఇట్లు పలికెను --- జగన్నాథుడగు రుద్రదేవుని ఏ కార్యమునందు మయుడు ఆయన కీర్తిని వినష్టము చేసినాడు? ఈ శ్రీకృష్ణుడు ఆ కీర్తిని ఎట్లు వర్ధిల్ల జేసెను? వివరించుము.
నారద ఉవాచ ।
నిర్జితా అసురా దేవైర్యుధ్యనేనోపబృంహితైః ।
మాయినాం పరమాచార్యం మయం శరణమాయయుః ॥
నారదుడిట్లు పలికెను --- ఒకప్పుడు ఈ శ్రీకృష్ణునిచే శక్తి అనుగ్రహించబడిన దేవతలు యుద్ధములో అసురులను జయించిరి. అపుడు వారు మాయావులకు పరమగురువగు మయుని శరణు వేడిరి.
స నిర్మాయ పురస్తిస్రో హైమీరౌప్యాయసీర్విభుః ।
దుర్లక్ష్యాపాయసంయోగా దుర్వితర్క్యపరిచ్ఛదాః ॥
సర్వసమర్థుడగు ఆ మయుడు బంగారము, వెండి, ఇనుములతో మూడు నగరములను నిర్మించి వారికి ఇచ్చేను. విమానముల రూపములో నుండే ఆ నగరముల రాకపోకలు కంటికి కానరావు. వాటిలోని వస్తు సామగ్రి ఊహకైననూ అందదు.
తాభిస్తేుఽసురసేనాన్యో లోకాంస్త్రీన్ సేశ్వరాన్ నృప ।
స్మరంతో నాశయాంచక్రుః పూర్వవైరమలక్షితాః ॥
ఓ ధర్మరాజా! ఆ రాక్షస సేనానాయకులు లోకపాలకులతో సహా ముల్లోకముల యెడల తమకు పూర్వమునందు గల వైరమును గుర్తుకు తెచ్చుకొని ఆ నగరములలో ఉంటూ కంటికి కనబడకుండా నాశనము చేయ దొడగిరి.
తతస్తే సేశ్వరా లోకా ఉపాసాద్యేశ్వరం విభో ।
త్రాహి నస్తావకాన్ దేవ వినష్టాంస్త్రీపురాలయైః ॥
ఓ ధర్మరాజా! అపుడు దేవతలు లోకపాలకులతో గూడి రుద్రుని వద్దకు వెళ్లి ఇట్లు విన్నవించిరి -- ఓ దేవా! మూడు నగరములలో నివసించి యున్న రాక్షసులు మాకు వినాశము తెచ్చి పెట్టుచున్నారు. నీ వారలమగు మమ్ములను కాపాడుము.
అథానుగృహ్య భగవాన్ మా భైష్టేతి సురాన్ విభుః ।
శరం ధనుషి సంధాయ పురేష్వస్త్రం వ్యముంచత ॥
అపుడు సర్వసమర్థుడగు రుద్ర భగవానుడు దేవతలను, భయపడకుడు అని అనుగ్రహించి, ధనుస్సు పై బాణమునెక్కు పెట్టి ఆ మూడు నగరములపై అస్త్రమును ప్రయోగించెను.
తతోఽగ్నివర్ణా ఇషవ ఉత్సేతుస్సూర్యమండలాత్ ।
యథా మయూఖసందోహా నాదృశ్యంత పురో యతః ॥
సూర్యమండలమునుండి కిరణముల సమూహములు వచ్చినట్లుగా, ఆ బాణమునుండి అగ్ని వలె ప్రకాశించే బాణములు బయల్వెడలినవి. వాటి కారణముగా ఆ నగరములు కానరాలేదు.
తైస్ప్సృష్టా వ్యసవస్సర్వే నిపేతుస్స్మ పురౌకసః ।
తానానీయ మహాయోగీ మయః కూపర సేఽక్షిపత్ ॥
ఆ బాణములు తగులగానే ఆ పురములలోని వారందరు ప్రాణము లను కోల్పోయి నేలకొరిగిరి. మయుడు గొప్ప సిద్దులు గలవాడు. ఆతడు అమృతము ఉండే నూతిని నిర్మించి, వారిని తెచ్చి అందులో వైచెను.
సిద్దామృతరసస్పృష్టా వజ్రసారా మహౌజసః ।
ఉత్తస్థుర్మేఘదలనా వైద్యుతా ఇవ వహ్నయః ॥
జీవమునిచ్చే ఆ అమృతరసము తగులగానే ఆ రాక్షసులు వజ్రము వలే దృఢమైన దేహములు మరియు గొప్ప శక్తి గలవారై లేచి నిలబడిరి. వారు మేఘములను పగులగొట్టే మెరుపుల రూపములోనున్న అగ్నులు వలె ప్రకాశించిరి.
విలోక్య భగ్నసంకల్పం విమనస్కం వృషధ్వజమ్ ।
తదాఽయం భగవాన్ విష్ణుసత్రోపాయమకల్పయత్ ॥
తన సంకల్పము భగ్నము కాగా మనస్సు చెడియున్న వృషభధ్వజుడగు రుద్రుని చూచి, ఈ శ్రీకృష్ణుని రూపములోనున్న ఆ విష్ణు భగవానుడు అపుడు ఆ పురములను భేదించుటకై ఒక ఉపాయమును పన్నెను.
వత్స ఆసీత్తదా బ్రహ్మా స్వయం విష్ణురయం హి గౌః ।
ప్రవిశ్య త్రిపురం కాలే రసకూపామృతం పపౌ ॥
అప్పుడు బ్రహ్మగారు దూడలై, ఈ విష్ణువు స్వయముగా ఆవుడై మూడు పురములలో మధ్యాహ్నసమయములో ప్రవేశించి, ఆ నూతియందలి అమృతరసమును త్రాగివేసిరి.
తేఽసురా హ్యపి పశ్యంతో న న్యషేధన్ విమోహితాః ।
తద్విజ్ఞాయ మహాయోగీ రసపాలానిదం జగౌ ॥
స్వయం విశోకశ్శోకార్తాన్ స్మరన్ దైవగతిం చ తామ్ ।
దేవోఽసురో నరోఽన్యో వా నేశ్వరోఽస్తీహ కశ్చన ॥
ఆత్మనోఽన్యస్య వా దిష్టం దైవేనాపోహితుం ద్వయోః ।
వ్యామోహితులైయున్న ఆ రాక్షసులు ఆ దూడను, ఆవును చూచి కూడ అడ్డుకొననేలేదు. గొప్ప శక్తులు గల మయుడు ఆ విషయము తెలిసి ఆ దైవముయొక్క లీలను స్మరించి తాను శోకమును పొందలేదు. కాని, శోకముతో పీడితులైయున్న నూతి కాపలాదారులతో ఆయన ఇట్లు పలికెను -- ఈ జగత్తులో దేవత గాని, అసురుడు గాని, మానవుడు గాని, మరియొ కడు గాని, ఎవడైననూ తనకు గాని, ఇతరునకు గాని, ఇద్దరికీ గాని దైవ ముచే కల్పించబడిన దానిని పరిహరించుటకు సమర్థుడైనవాడు లేడు.
అథాసౌ శక్తిభిస్స్వాభిశ్శంభోః ధనికం వ్యధాత్ ॥
ధర్మజ్ఞానవిరక్త్యృద్ధితపోవిద్యక్రియాదిభిః ।
రథం సూతం ధ్వజం వాహాన్ ధనుర్వర్మ శరాది యత్ ॥
తరువాత ఈ విష్ణువు తన శక్తులతో రుద్రుని యుద్ధసామగ్రిని నిర్మించెను. ధర్మముతో రథమును, జ్ఞానముతో సూతుని, వైరాగ్యముతో జెండాను, ఐశ్వర్యముతో గుర్రములను, తపస్సుతో ధనుస్సును, విద్య (ఉపాసన) తో కవచమును, (వైదిక) కర్మతో బాణమును, ఇతరశక్తులతో ఇతరమగు సామగ్రిని వ్యవస్థ చేసెను.
సన్నద్ధో రథమాస్థాయ శరం ధనురుపాదదే ।
శరం ధనుషి సంధాయ ముహూర్తేఃఽభిజితీశ్వరః ॥
దదాహ తేన దుర్భేద్యా హరోఽథ త్రిపురో నృప ।
ధివి దుందుభయో నేదుర్విమానశతసంకులాః ॥
దేవర్షిపితృసిద్దేశా జయేతి కుసుమోత్క రైః ।
అవాకిరన్ జగుర్ఘృష్టా ననృతుశ్చాప్సరోగణాః ॥
స్వర్గమునందు దుందుభులు మ్రోగినవి. ఆకాశమునందు వందలాది విమానముల రద్దీలు ఏర్పడెను. దేవతలు, దేవర్షులు, పితృదేవతలు, సిద్దుల నాయకులు జయము, జయము అంటూ పూల వానలను చల్లిరి. ఆనందముతో కొందరు గానము చేయగా, అప్సరసల గుంపులు నాట్యమాడిరి.
ఏవం దగ్ధ్వా పురస్తిస్రో భగవాన్ పురహా నృప ।
బ్రహ్మాదిభిః స్తూయమానస్స్వధామ ప్రత్యపద్యత ॥
ఓ ధర్మరాజా! ఈ విధముగా రుద్ర భగవానుడు మూడు నగరములను తగులబెట్టి త్రిపురనాశకుడు ఆయెను. బ్రహ్మగారు మొదలగువారు స్తుతించుచుండగా, అపుడాయన తన ధామమును చేరుకొనెను.
ఏవంవిధాన్యస్య హరేస్స్వమాయయా
విడంబమానస్య నృలోకమాత్మనః ।
వీర్యాణి గీతాన్యృషిభిర్జగద్గురోః
లోకాన్ పునానాన్యపరం వదామి కిమ్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే ప్రహ్లాదచరితే ప్రహ్లాదస్య నిష్కామభక్తివర్ణనం త్రిపురదహన వర్ణనం నామ దశమోఽధ్యాయః ॥
జగత్తునకు తండ్రి, గురువు, ఆత్మస్వరూపుడు అగు శ్రీహరి తన మాయాశక్తిచే మానవరూపమును అనుకరిస్తూ ఈ విధమైన పరాక్రమము లను నెర పెను. మహర్షులచే గానము చేయబడిన ఆ లీలలు జనులను పావనము చేయుచున్నవి. నేను ఇంకనూ దేనిని గురించి చెప్పవలెను?
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో ప్రహ్లాదచరితమునందు ప్రహ్లాదుని నిష్కామభక్తిని, త్రిపుర దహనమును వర్ణించే పదవ అధ్యాయము ముగిసినది (10) .
Summary of chapter 10 of the Bhāgavata Mahā Purana is as follows:
Pleased with Prahlāda's selfless prayers, Bhagavān Nṛsiṁhadeva offered him any material or spiritual boon he desired. Prahlāda humbly declined, stating that a devotee who bargains with Bhagavān for material rewards is a merchant, not a true servant. He requested only that no material desire ever awaken within his heart and begged for the forgiveness and spiritual purification of his deceased father. Bhagavān Nṛsiṁhadeva declared that twenty-one generations of Prahlāda's family were purified by his birth, crowned Prahlāda as the sovereign emperor of the realm, and instructed him to govern righteously. Following the departure of Bhagavān Nṛsiṁhadeva, Lord Brahmā offered heartfelt prayers, and the universe celebrated the restoration of Vaidika Dharma.