6 - ప్రహ్లాద చరితము - ప్రహ్లాదుని ఉపదేశము

ప్రహ్లాద ఉవాచ

 కౌమార ఆచరేత్ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ

దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్థదమ్

జీవునకు పురుషార్థము లభించేది మానవజన్మలో మాత్రమే. మానవజన్మను పొందుట చాల కఠినము. పైగా ఈ జన్మ అనిత్యము. కావు న, వివేకి ఈ జన్మలోనే బాల్యమునందే భగవంతుని లభింపజేసే ధర్మము లను అనుష్ఠించవలెను.

యథా హి పురుష స్యేహ విష్ణోః పాదోపసర్పణమ్

యదేష సర్వభూతానాం ప్రియ ఆత్మేశ్వరస్సుహృత్

ఎందుకంటే, ఈ మానవజన్మలో మానవుడు చేయదగిన యోగ్య మైన పని విష్ణువు పాదములను ఆశ్రయించుటయే. ఏలయనగా, శ్రీహరి సకలప్రాణులలో అంతర్యామియై, ప్రీతినిధానమగు ఆత్మయై హితమును చేయుచున్నాడు.

సుఖమైంద్రియకం దైత్యా దేహయోగేన దేహినామ్

 సర్వత్ర లభ్యతే దైవాద్యథా దుఃఖమయత్నతః

దితివంశీయులారా! ప్రాణులకు అన్ని దేశకాలములలో అన్ని రక ముల జన్మలయందు దేహముతోడి సంయోగము (జన్మ) కలుగగానే ఇంద్రియముల వలన లభించే సుఖము, దుఃఖము వలెనే, ప్రారబ్ధకర్మాధీన ముగా ప్రయత్నము లేకుండగానే లభించుచుండును.

తత్ప్రాయాసో న కర్తవ్యో యత ఆయుర్వ్యయః పరమ్

న తథా విందతే క్షేమం ముకుందచరణాంబుజమ్

అట్టి (తనంత తానుగా లభించే) ఇంద్రియసుఖము కొరకు ప్రయ త్నము చేయనక్కరలేదు. ఎందుకంటే, అట్టి ప్రయత్నమును చేయుట కేవ లము ఆయుర్దాయమును వృథా చేసుకొనుటయే యగును. ఇంద్రియభోగములవెంట బడే వ్యక్తి ఆత్యంతికమగు క్షేమము (మోక్షము) నిచ్చే మోక్ష ప్రదాతయగు శ్రీహరి పాదపద్మమును పొందజాలడు.

తతో యతేత కుశలః క్షేమాయ భయమాశ్రితః

 శరీరం పౌరుషం యావన్న విపద్యేత పుష్కలమ్  

కావున, భయ హేతువగు సంసారమును పొందియున్న నేర్పరి యగు మానవుడు ఈ నిండైన మానవదేహము రోగముల పాలై వీనష్ట మయ్యే లోపులోనే ఆత్యంతికక్షేమమైన మోక్షము కొరకై యత్నించవలెను.

పుంసో వర్షశతం హ్యాయుస్తదర్ధం చాజితాత్మనః

నిష్ఫలం యదసా రాత్యాం శేతేకంధం ప్రాపితస్తమః

మానవుని ఆయుర్దాయము వంద సంవత్సరములు. మనోజ యము లేనివానికి దానిలో సగము వ్యర్థమే యగును. ఎందుకంటే, మనిషి రాత్రియందు ఏమీ తెలియని తమోగుణప్రధానమైన నిద్రలో గడుపును.

ముగ్ధస్య బాల్యే కౌమారే క్రీడతో యాతి వింశతిః

 జరయా గ్రస్తదేహస్య యాత్యకల్పస్య వింశతిః

మానవుడు బాల్యములో మూర్ఖుడై యుండును. కుమారావస్థలో ఆటలాడుచుండును. ఈ విధముగా ఇరవై ఏళ్లు గడచిపోవును. వృద్ధాప్య ములో దేహము వడలిపోయి ఏ పనినైననూ చేయలేని స్థితిలో ఇంకో ఇరవై ఏళ్లు గడచిపోవును.

దురాపూరేణ కామేన మో హేన చ బలీయసా

శేషం గృ హేషు సక్తస్య ప్రమత్తస్యాపయాతి హి  

మానవుడు ఇంటికి సంబంధించిన విషయములలో ఆసక్తిని పెంచుకొని, తీర్చ శక్యము కాని కోరికలతో మరియు బలీయమైన వ్యామో హముతో ఆదమరచి యుండగా, మిగిలిన ఆయుర్దాయము గడచిపోవును.

కో గృహేషు పుమాన్ సక్తమాత్మానమజితేంద్రియః

 స్నేహపాశైర్దృథైర్బద్దముత్స హేత విమోచితుమ్

ఎవడైతే ఇంటికి సంబంధించిన విషయములలో ఆసక్తిని పెంచుకో ని, రాగపాశములచే గట్టిగా బంధించబడి ఉండునో, అట్టి వ్యక్తి ఎవ్వాడు ఇంద్రియములను వశము చేసుకోకుండా తనను బంధవిముక్తునిగా చేసు కొన గల్గును? (చేసుకొనలేడు).

కో న్వర్థతృష్ణాం విసృజేత్ప్రాణేభ్యోకపి య ఈప్సితః

యం క్రీణాత్యసుభిః ప్రేష్ఠైస్తస్కరస్సేవకో వణిక్

ధనమునందలి పేరాసను ఎవడు విడిచి పెట్టును? జనులకు ధనము ప్రాణములకంటె కూడ ప్రియమైనది. చోరుడు ధనము కొరకై ప్రాణ ములను పణము పెట్టును. సేవకుడు ధనము కొరకై తన శక్తిని ఇతరులకు ధారపోయును. వ్యాపారి ధనము కొరకై తన జీవితమును వెచ్చించును.

కథం ప్రియాయా అనుకంపితాయాః

సంగం రహస్యం రుచిరాంశ్చ మంత్రాన్

 సుహృత్సు చ స్నేహసితశ్శిశూనాం

కలాక్షరాణామనురక్తచిత్తః

పుత్రాన్ స్మరంస్తా దుహితృర్హృదయ్యా

భ్రాతృన్ స్వసూర్వా పితరౌ చ దీనౌ

గృహాన్ మనోజ్ఞోరుపరిచ్ఛదాంశ్చ

వృత్తీశ్చ కుల్యాః పశుభృత్యవర్గాన్

 త్యజేత కోశస్కృదివేహమానః

కర్మాణి లోభాదవితృప్తకామః

ఔపస్థ్య జైహ్వ్యం బహు మన్యమానః

 కథం విరజ్యేత దురంతమోహః

మానవుడు స్నేహితులయందలి రాగముచే బద్ధుడై యుండును. వాని చిత్తములో ముద్దు పలుకుల పిల్లలయందు అనురాగము నిండియుం డును. ఆతడు తన పుత్రులను గుర్తు చేసుకుంటూ కర్మలను చేసి పట్టు పురుగు వలే తన కర్మలచే తానే బంధించబడును. లోభము గల ఆతనికి కోరికలు తీరుచున్ననూ తృప్తి కలుగదు. ఆతనికి సంభోగము, ఆహారములు ఇచ్చే సుఖమునందు ఆదరము మెండు. అంతము లేని వ్యామోహము గల ఇట్టి వ్యక్తి ప్రేమపాత్రురాలగు ప్రియురాలితోడి ఏకాంత సమావేశమును, ఆమెతోడి తియ్యని గుసగుసలను, హృదయమునకు ఆనందమునిచ్చే వివాహితలైన కూతుళ్లను, సోదరులను, అక్కచెల్లెళ్లను, దీనులైన తల్లిదం డ్రులనైననూ, మనస్సునకు ఉల్లాసమునిచ్చే భోగసాధనములతో నిండి యున్న ఇంటిని గాని, కులవృత్తులను గాని, పశుసంపదను గాని, దాసదాసీ జనమును గాని ఎట్లు విడిచి పెట్టును? అట్టి వ్యక్తికి వైరాగ్యమెట్లు కలు గును? (కలుగదు).

కుటుంబపోషాయ వియన్ నిజాయుః

న బుధ్యతేర్థం విహతం ప్రమత్తః

 సర్వత్ర తాపత్రయదుఃఖితాత్మా

నిర్విద్యతే న స్వకుటుంబరామః

భోగములలో ఆదమరచియున్న వ్యక్తి మనస్సు దేశకాలముల న్నింటియందు ఆధ్యాత్మిక-ఆధిభౌతిక-ఆధిదైవికములనే మూడు విధముల తాపములతో దుఃఖమును పొందుచుండును. తన కుటుంబమునందు ఆసక్తి గల ఆ వ్యక్తి కుటుంబమును పోషించుటకై తన ఆయుర్దాయము ఖర్చు అయిపోవుచున్న సంగతిని గాని, తన పురుషార్థము (మోక్షము) భగ్నమైన దని గాని తెలియకున్నాడు. ఇట్టి వ్యక్తికి వైరాగ్యము కలుగదు.

 విత్తేషు నిత్యాభినివిష్టచేతా విద్వాంశ్చ దోషం పరవిత్తహర్తుః

ప్రేత్యేహ చాఠాప్యజితేంద్రియస్తదశాంతకామో హరతే కుటుంబీ

కుటుంబమునందు ఆసక్తి గల వ్యక్తికి ఇంద్రియములపై అజమా యిషీ లేదు గనుక, వాని కోరికలు చల్లారవు. ఆతనికి అన్ని కాలములలో సంపదలను పొందాలనే పట్టుదల మెండు. ఇతరుల సొత్తును అపహరించే వ్యక్తి ఇహపరములలో దుఃఖభాజనుడగునని ఆతనికి తెలియును. అయిన నూ, ఆతడు పరధనమును అపహరించును.

విద్వానపీత్తం దనుజాః కుటుంబం పుష్ణన్స్వలోకాయ న కల్పతే వై యస్వీయపారక్యవిభిన్నభావస్తమః ప్రపద్యేత యథా విమూఢః

ఓ దనువంశీయులారా! నాది పరాయిది అనే భేదభావన గలవాడై పైన చెప్పిన విధముగా తీవ్రమగు ఆసక్తితో కుటుంబమును పోషించే వ్యక్తి శాస్త్రజ్ఞుడే అయినా, ఆత్మవిచారమునకు నిశ్చయముగా సమర్థుడు కాడు. అట్టివాడు అజ్ఞానకృతమగు సంసారమునే పొందును.

యతో న కశ్చిత్వ చ కుత్రచిద్వా

దీనస్స్వమాత్మానమలం సమర్థః

విమోచితుం కామదృశాం విహార -

క్రీడాము యమగడో విపరః  

ఎందుకంటే, చూపులలో కామమును ఒలికించే యువతుల విహార మునకు కోతివంటి ఆటవస్తువు అయి మిక్కిలి దీనుడైయున్న ఎవ్వడైననూ ఏ కాలమునందైననూ ఏ దేశమునందైననూ తనను తాను విముక్తుని చేసు కోనుటకు సమర్థుడు కాజాలడు. వానికి అట్టి యువతులయందు కలిగే సంతానము వానికి సంకెల యగును.

తతో విదూరాత్పరిహృత్య దైత్యా

దైత్యేషు సంగం విషయాత్మకేషు

 ఉపేత నారాయణమాదిదేవం

విముక్తసంగైరిషితోపవర్గః

ఓ దితివంశీయులారా! కావున, మీరు ఇంద్రియభోగములయందు ఆసక్తిని చూపే రాక్షసులతోడి స్నేహమును చాల దూరముగా విడిచి పెట్టు డు. జగత్కారణుడు, ప్రకాశస్వరూపుడు అగు నారాయణుని శరణు పొందు డు. ఆసక్తిని విడిచిన మహాత్ములు కోరే మోక్షము అట్టి శరణాగతియే.

న హ్యచ్యుతం ప్రీణయతో బహ్వాయాసోకసురాత్మజాః

ఆత్మత్వాత్సర్వభూతానాం సిద్ధత్వాదిహ సర్వతః

ఓ రాక్షస నందనులారా! శ్రీహరి సకలప్రాణులలోపల ఆత్మరూ పుడై బయట సర్వమునందు వ్యాపించి యున్నాడు. కావున, శ్రీహరికి ప్రీతిని కలిగించుటలో అధికమైన శ్రమ లేదు సుమా!

పరావరేషు భూతేషు బ్రహ్మాంతస్థావరాదిషు

 భౌతికేషు వికారేషు భూతేష్వథ మహత్సు చ

గుణేషు గుణసామ్యే చ గుణవ్యతికరే తథా

ఏక ఏవ పరో హ్యాత్మా భగవానీశ్వరోవ్యయః

చెట్టుచేమలతో మొదలిడి బ్రహ్మగారు వరకు ఉండే పెద్ద చిన్న ప్రాణులయందు, పంచభూతములనుండి నిర్మితమైన పదార్థములయందు, పంచభూతములయందు, సూక్ష్మతన్మాత్రలయందు, సత్త్వరజస్తమోగుణ ములయందు, వాటియందు వైషమ్యము వచ్చి ప్రకటమైన మహత్తత్త్వము నందు, వాటి సామ్యావస్థయగు ప్రకృతియందు కూడ ఒకే ఒక భగవానుడు ఉన్నాడు. సర్వాంతర్యామి, అవినాశీ, అద్వితీయుడు అగు ఆ భగవానుడు ఈ సర్వమునకు అతీతుడై యున్నాడు.

ప్రత్యగాత్మస్వరూపేణ దృశ్యరూపేణ చ స్వయమ్

వ్యాప్యవ్యాపకనిర్దేశ్యో హ్యనిర్దేశ్యోకవికల్పితః

పరమేశ్వరునియందు వివిధత్వము లేదు. అయిననూ, ఆయ నయే స్వయముగా వ్యక్తియొక్క అంతరతమమగు ఆత్మ (దృక్-చైతన్యము) గా, దృశ్యమైన జగత్తుగా ప్రకటమైనాడు. ఆయనను నిర్దేశించుట సంభవము కాదు. అయిననూ, సత్తాస్పూర్తులచే వ్యాపించబడియుండే దృశ్యజగత్తుగా, సత్తాస్ఫూర్తిస్వరూపుడగు ద్రష్టగా నిర్దేశించబడుచున్నాడు.

కేవలానుభవానందస్వరూపః పరమేశ్వరః

మాయయాంతర్హి తైశ్వర్య ఈయతే గుణసర్గయా  

పరమేశ్వరుడు చైతన్యఘన-ఆనందఘన స్వరూపుడు. త్రిగుణాత్మ కమగు జగత్తు రూపముగా ప్రకటమైన మాయాశక్తి ఆ సర్వేశ్వరుని ఈశ్వర భావమును కప్పివేయుచున్నది. నామరూపాత్మకమగు జగత్తును నిషేధిం చినచో, ఈశ్వరుని సాక్షాత్కారము ఆత్మరూపముగా కలుగును.

తస్మాత్సర్వేషు భూతేషు దయాం కురుత సౌహృదమ్

 ఆసురం భావమున్ముచ్య యయా తుష్యత్యధోక్షజః

కావున, భోగపరాయణులు ఆలోచించే పద్ధతిని మీరు విడనాడి, సకలప్రాణులయందు దయను చూపుతూ, ప్రేమతో ప్రాణులకు హితమును ఆచరించుడు. అట్లు చేయుట వలన, ప్రత్యక్షాది ప్రమాణములకు అతీతు డైన శ్రీహరి ప్రసన్నుడగును.

తుష్టే చ తత్ర కీమలభ్యమనంత ఆద్యే

కిం తైర్గుణవ్యతికరాదిహ యే స్వసిద్దాః

ధర్మాదయః కీమగుణేన చ కాంక్షతేన

సారంజుషాం చరణయోరుపగాయతాం నః

కాలాతీతుడు, సర్వజగత్కారణుడు అగు శ్రీహరి ప్రసన్నుడైనచో పొంద శక్యము కానిది ఏది ఉండును? మేము శ్రీహరి రెండు పాదముల సారమును సేవిస్తూ ఆయన కీర్తిని గానము చేసెదము. ఈ జగత్తులో సత్త్వ రజస్తమోగుణముల పరిణామము వలన తమంత తాముగా లభించే ధర్మా ర్థకామములతో గాని, అందరు కోరే గుణాతీతమైన మోక్షముతో గాని, మనకు పని యేమున్నది?

ధర్మార్థకామ ఇతి యోభిహితస్త్రివర్గ 

ఈక్షా త్రయీ నయదమౌ వివిధా చ వార్తా

మన్యే తదేతదఖిలం నిగమస్య సత్యం

స్వాత్మార్పణం స్వసుహృదః పరమస్య పుంసః  

ధర్మార్థకామములు అనే మూడు పురుషార్థములు, ఆత్మవిద్య, కర్మవిద్య, తర్క శాస్త్రము, దండనీతి, అనేకవిధములైన వృత్తివిద్యలు అనే ఈ సర్వము మూడు గుణములకు లోబడి వేదముచే ప్రతిపాదించబడుచు న్నది. కాని, వ్యక్తి తనలో అంతర్యామియై హితకారియగు పురుషోత్తము నకు తన సర్వస్వమును సమర్పించుటయే సత్యము (సార్థకము) అని నా అభిప్రాయము.

జ్ఞానం తదేతదమలం దురవాపమాహ

నారాయణో నరసఖః కిల నారదాయ

ఏకాంతినాం భగవతస్తదకించనానాం

పాదారవిందరజస్వాప్లుతదేహినాం స్యాత్  

నరుడు తోడుగానున్న నారాయణుడీ నిర్మలమగు జ్ఞానమును నారదునకు ఉపదేశించెనట. దీనిని పొందుట చాల కష్టము. భగవంతుని ఏకాంతభక్తులై, సర్వసంగపరిత్యాగుల పాదపద్మముల ధూళిచే వ్యాప్తమైన దేహము గలవారలకు మాత్రమే అది లభించును.

శ్రుతమేతన్మయా పూర్వం జ్ఞానం విజ్ఞానసంయుతమ్

 ధర్మం భాగవతం శుద్ధం నారదాద్దేవదర్శనాత్

అనుభవముతో కూడిన నిర్మలమైన ఈ జ్ఞానమును, భగవద్భక్తుల నుష్టించే ధర్మమును, నేను పూర్వము నారదుని వలన చినియుంటిని. నార దుడు భగవానుని దర్శించినవాడు.

దైత్యపుత్రా ఊచుః

ప్రహ్లాద త్వం వయం చాపి నర్తేన్యం విద్మహే గురుమ్

 ఏతాభ్యాం గురుపుత్రాభ్యాం బాలానామపి హీశ్వరౌ  

రాక్షసుల పిల్లలు ఇట్లు పలికిరి --- ఓ ప్రహ్లాదా! నీవు గాని, మేము గాని, గురుపుత్రులగు వీరిద్దరిని మినహాయించి మరియొక గురువును యెరుగము. పిల్లలమగు మనలను శాసించువారు వీరిద్దరే.

బాలస్యాంతఃపురస్థస్య మహత్సంగో దురన్వయః

ఛింధి నస్సంశయం సౌమ్య స్యాచ్చేద్విశంభకారణమ్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధ ప్రహ్లాదచరితే ప్రహ్లాదేన బాలానాముపదేశవర్ణనం నామ షష్ఠోధ్యాయః

ఓ ప్రియదర్శనా! అంతఃపురమునందు పెరిగిన నీకు మహాత్ముడగు నారదునితో సమావేశము దుర్ఘటము. ఈ విషయములో నిన్ను విశ్వసించుటకు తగిన కారణమున్నచో, మా ఈ సందేహమును నివృత్తి చేయుము.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో ప్రహ్లాదచరితమునందు ఆరవ అధ్యాయము ముగిసినది (6).