భాగవత మహా పురాణము
3 - ప్రహ్లాదుని చరితము - హిరణ్యకశిపుడు వరములను కోరుట
నారద ఉవాచ ।
హిరణ్యకశిపూ రాజన్నజేయమజరామరమ్ ।
ఆత్మానమప్రతిద్వంద్వమేకరాజం వ్యధిత్సత ॥
ఓ మహారాజా! హిరణ్యకశిపుడు. తాను ఇతరులు జయించ శక్యము కాని ఏకైక చక్రవర్తి కాగోరెను. తనకు వృద్ధాప్యము గాని మరణము గాని ఉండరాదనియు, తనకు ఎదురుగా నిలిచే ప్రతిపక్షి ఉండకూడదనియు ఆతని ఆకాంక్ష.
స తేపే మందరద్రోణ్యాం తపః పరమదారుణమ్ ।
ఊర్ధ్వబాహుర్నభోదృష్టిః పాదాంగుష్ఠాశ్రితావనిః ॥
ఆతడు మందరపర్వతలోయయందు కాలి బొటనవ్రేలిని మాత్రమే నేలపై ఆన్చి నిలబడి, చేతులు పైకెత్తి ఆకాశము వైపు చూస్తూ, మిక్కిలి కఠినమగు తపస్సును చేసెను.
జటాదీధితిఖీ రేజే సంవర్తార్క ఇవాంశుభిః ।
తస్మింస్తపస్తప్యమానే దేవాః స్థానాని భేజారే ॥
ఆతని జటల కాంతులు ప్రళయకాల సూర్యుని కిరణములను పోలి ప్రకాశించేను. ఆతడు తపస్సును చేయుచుండగా, దేవతలు తిరిగి తమ తమ స్థానము (పదవు) లను పొందిరి.
తస్య మూర్ద్నస్సముద్భూతస్సధూమోగ్నిస్తపోమయః ।
తిర్యగూర్ధ్వమధో లోకానతపద్విష్వగీరితః ॥
వాని తలనుండి తపస్సుచే వర్దిల్ల జేయబడిన అగ్ని పొగతో బాటుగా బయల్వెడలెను. అది అంతటా భూలోకమును మాత్రమే గాక ఊర్ధ్వలోకములను, పాతాళమును కూడ వ్యాపించి తపింప జేసెను.
చుక్షుభుర్నద్యుదన్వంతస్సద్వీపాద్రిశ్చచాల భూః ।
నిపేతుస్సగ్రహాస్తారా జజ్వలుశ్చ దిశో దశ ॥
నదులు, సముద్రములు కలచివేయ బడినవి. ద్వీపములతో మరియు పర్వతములతో సహా భూమి కంపించేను. గ్రహములు, తారలు. నేల గూలినవి. పది దిక్కులు కూడ మండజొచ్చెను.
తేన తప్తా దివం త్యక్త్వా బ్రహ్మలోకం యయుస్సురాః ।
ధాత్రే విజ్ఞాపయామాసుర్దేవదేవ జగత్పతే ॥
దైత్యేంద్రతపసా తప్తా దివి స్థాతుం న శక్నుమః ।
తస్య చోపశమం భూమన్ విధేహి యది మన్యసే ।
లోకా న యావన్నంక్ష్యంతి బలిహారాస్తవాభిభూః ॥
ఆ అగ్నిచే తపింప జేయబడిన దేవతలు స్వర్గమును విడిచి పెట్టి బ్రహ్మలోకమునకు వెళ్లి, బ్రహ్మగారితో ఇట్లు విన్నవించు కొనిరి -- ఓ దేవ దేవా! జగన్నాథా! రాక్షసరాజగు హిరణ్యకశిపుని తపస్సుచే తపింప జేయబడిన మేము స్వర్గములో నిలువ లేకున్నాము. ఓ అనంతా! సర్వేశ్వరా! నీకు పూజలనందించే జనులు నశించే లోపులోనే, నీవు తలచుకున్నచో, ఆ అగ్నిని శాంతింప జేయుము.
తస్యాయం కిల సంకల్పశ్చరతో దుశ్చరం తపః ।
శ్రూయతాం కిం న విదితస్తవాథాపి నివేదితః ॥
చేయ శక్యము కాని తపస్సును చేయుటలో వానికి ఒక సంక ల్పము గలదు. అది మీకు తెలియకుండునా యేమి? అయిన, మేము విన్నవించెదము. వినుడు.
సృష్ట్వా చరాచరమిదం తపోయోగసమాధినా ।
అధ్యాస్తే సర్వధిష్ణ్యేభ్యః పరమేష్ఠి నిజాసనమ్ ॥
బ్రహ్మగారు తపోయోగమును నిష్ఠగా అనుష్ఠించి స్థావర జంగమా త్మకమగు ఈ జగత్తును సృష్టించి, ధామములన్నింటిలో శ్రేష్ఠమగు తన సత్యలోకమును అధిష్ఠించి యున్నాడు.
తదహం వర్ధమానేన తపోయోగసమాధినా ।
కాలాత్మనోశ్చ నిత్యత్వాత్సాధయిష్యే తథాత్మనః ॥
నేను కూడ అదే విధముగా వర్దిల్లే తపోయోగమునందలి నిష్టచే నాకు ఆ ప్రజాపతి స్థానమును సంపాదించుకొనెదను. ఎందుకంటే, దేహము నశించినా, ఆత్మ నశించదు. కాలము కూడ నిరంతరముగా ముందుకు పోతూనే ఉంటుంది. కావున, ఎంత కాలము పట్టినా, ఎన్ని జన్మలు వచ్చినా, ఆ స్థానమును సంపాదించెదను.
అన్యథేదం విధా స్యేహమయథాపూర్వమోజసా ।
కిమన్యైః కాలనిర్ధూతైః కల్పాంతే వైష్ణవాదిభిః ॥
నేను నా తపశ్శక్తితో ఈ జగత్తును మరియొక విధముగా ఇదిత రలో ఎన్నడూ లేని విధముగా వ్యవస్థ చేసెదను (అనగా పాపము చేసినవా రికి స్వర్గము, పుణ్యము చేయువారలకు నరకము కలుగునట్లు చేయుట ఇత్యాది). విష్ణులోకము, ధ్రువలోకము మొదలగు ధామములు కూడ కల్పము అంతమయ్యేసరికి కాలగర్భములో కలిసిపోయేవే. అట్టి ధామము లతో నాకు పని యేమి?
ఇతి శుశ్రుమ నిర్బంధం తపః పరమమాస్థితః ।
విధత్స్వానంతరం యుక్తం స్వయం త్రిభువనేశ్వర ॥
ఆతడు ఈ విధమైన హఠమును కలిగియున్నాడని మేము విని యుంటిమి. ఆతడు సర్వాధికమైన తపస్సును చేసినాడు. ఓ బ్రహ్మా! నీవు ముల్లోకములకు ప్రభుడవు. ఈ విషయములో తరువాత చేయదగిన యోగ్యమగు కార్యమును నీవే స్వయముగా చేయుము.
తవాసనం ద్విజగవాం పారమేష్ఠ్యం జగత్పతే ।
భవాయ శ్రేయసే భూత్యై క్షేమాయ విజయాయ చ ॥
ఓ జగన్నాథా! సర్వశ్రేష్ఠమగు నీ సత్యలోక ధామము వేదవేత్తలకు మరియు గోవులకు వృద్ధిని, కల్యాణమును, సంపత్తిని, క్షేమమును, విజయ మును సమకూర్చుటకై ఉన్నది.
ఇతి విజ్ఞాపీతో దేవైర్భగవానాత్మభూర్నృప ।
పరీతో భృగుదక్షాద్యైర్యయౌ దైత్యేశ్వరాశ్రమమ్ ॥
ఓ మహారాజా! దేవతలీ విధముగా విన్నవించగా, స్వయంభువు డగు బ్రహ్మభగవానుడు, భృగువు దక్షుడు మరీచి మొదలగు ప్రజాప తులతో గూడి, రాక్షసరాజగు హిరణ్యకశిపుని ఆశ్రమమునకు వెళ్లాను.
న దదర్శ ప్రతిచ్చన్నం వల్మీకతృణకీచకైః ।
పిపీలికాభిరాచీర్ణమేదస్త్వఙ్మాంసశోణితమ్ ॥
హిరణ్యకశిపుని పుట్టలు, గడ్డి, వెదురు డొంకలు కప్పి వేసినవి. ఆతని దేహములోని క్రొవ్వు, చర్మము, మాంసము, రక్తములను చీమలు అంతటా తినివేసినవి. ఆతడు బ్రహ్మగారికి కనబడనే లేదు.
తపంతం తపసా లోకాన్ యథాభ్రాపిహితం రవిమ్ ।
విలక్ష్య విస్మితః ప్రాహ ప్రహసన్ హంసవాహనః ॥
మేఘములచే కప్పివేయబడిన సూర్యుడు వలె తన తపస్సుచే లోకములను తపింప జేయుచున్న హిరణ్యకశిపుని చూచి, హంసవాహను డగు బ్రహ్మగారు ఆశ్చర్యపోయి నవ్వుతూ ఇట్లు పలికెను.
బ్రహ్మోవాచ ।
ఉత్తిష్ణోత్తిష్ఠ భద్రం తే తపస్సిద్ధోసి కాశ్యప ।
వరదోహమనుప్రాప్తో వ్రియతామీప్సితో వరః ॥
ఓ కశ్యప నందనా! లెమ్ము, లెమ్ము. నీకు మంగళమగు గాక! నీ తపస్సు సిద్ధించినది. వరములనిచ్చే నేను విచ్చేసినాను. నీకు ఇష్టమైన వర మును కోరుకొనుము.
అద్రాక్షమహమేతత్తే హృత్సారం మహదద్బుతమ్ ।
దంశభక్షితదేహస్య ప్రాణా హ్యస్థిషు శరతే ॥
గొప్ప ఆశ్చర్యమును గొల్పే నీ హృదయమునందలి బలమును నేను చూచితిని. ఎందుకంటే, అడవి ఈగలు మొదలగునవి దేహమును తినివేసినవి. అయిననూ, నీ ప్రాణములు ఎముకలయందు నిలిచియున్నవి.
నైతత్పూర్వర్షయశ్చక్రుర్న కరిష్యంతి చాపరే ।
నిరంబుర్ధారయేత్ప్రాణాన్ కో వై దివ్యసమాశ్శతమ్ ॥
పూర్వమునందలి మహర్షులు ఇట్టి తపస్సును చేయలేదు, భవిష్య తలో ఇతరులు చేయబోరు. వంద దివ్యసంవత్సరముల కాలము నీటినై నన త్రాగకుండా ప్రాణములను ఎవరు నిలిపి యుంచగలరు?
వ్యవసాయేన తేనేన దుష్కరేణ మనస్వినామ్ ।
తపోని ష్ఠేన భవతా జితోహం దితినందన ॥
దితిపుత్రుడవగు ఓ హిరణ్యకశిపూ! ధైర్యశాలురగు మహర్షులు సైతము చేయ శక్యము కాని గొప్ప తపస్సును నీవు చేసితివి. నీ తపోని ష్ఠచే నేను నీకు వశుడనైతిని.
తతస్త ఆశిషస్సర్వా దదామ్యసురపుంగవ ।
మర్త్యస్య తే అమర్త్యస్య దర్శనం నాఫలం మమ ॥
ఓ రాక్షసశ్రేష్ఠా! కావున, నేను నీ కోరికలనన్నింటినీ తీర్చెదను, మరణించే స్వభావము గల మానవుడవు నీవు. మరణము లేని దేవుడను నేను. నీకు నా దర్శనమైనది. అట్టి నీకు నా దర్శనము వృథా కాబోదు.
నారద ఉవాచ ।
ఇత్యుక్త్వాదిభవో దేవో భక్షితాంగం పిపీలికైః ।
కమండలుజలేనౌక్షద్దివ్యనామోఘరాధసా ॥
నారదుడిట్లు పలికెను --- సృష్ట్యాదియందు ప్రకటమైన ఆ బ్రహ్మ దేవుడు ఈ విధముగా పలికెను. హిరణ్యకశిపుని దేహమును చీమలు తిని వేసెను. అపుడాయన తన కమండలమునందలి దివ్యజలమును ఆతనిపై చల్లెను. ఆ నీటియొక్క ప్రభావము అమోఘమైనది.
స తత్కీచకవల్మీకాత్ సహఓజోబలాన్వితః ।
సర్వావయవసంపన్నో వజ్రసంహననో యువా ।
ఉత్తితస్తప్త హేమాభో విభావసురివైధసః ॥
ఆయన నీటిని చల్లుట వలన హిరణ్యకశిపుడు వెదురుడొంకలతో కప్పివేయబడియున్న చీమల పుట్టనుండి, కట్టెనుండి అగ్ని వలె, లేచి నిలబ డెను. అన్ని అవయవములతో ఒప్పారే ఆతని దేహము వజ్రము వలె దృఢ ముగ నుండెను. ఆతనియందు మనశ్శక్తి, ఇంద్రియశక్తి, దేహశక్తి నిండుగా నుండెను. ఆతడు పుటము పెట్టిన బంగారము వలె ప్రకాశించెను.
స నిరీక్ష్యాంబరే దేవం హంసవాహమవస్థితమ్ ।
ననామ శిరసా భూమౌ తద్దర్శనమహోత్సవః ॥
ఆ హిరణ్యకశిపుడు ఆకాశములో హంసవాహనముపైనున్న బ్రహ్మదేవుని చూచి గొప్ప ఉత్సాహమును పొందెను. అపుడాతడు నేలపై తలను ఆన్చి నమస్కరించెను.
ఉత్థాయ ప్రాంజలిః ప్రహ్వ ఈక్షమాణో దృశా విభుమ్ ।
హర్షాశ్రుపులకోద్భేదో గిరా గద్గదయాకగృణాత్ ॥
బ్రహ్మదేవుని చూస్తూ ఉంటే హిరణ్యకశిపునకు గొప్ప హర్షముచే కన్నీరు స్రవించేను, ఒళ్లంతా గగుర్పాటు కలిగెను. ఆతడు పైకి లేచి చేతులు జోడించి, వినయముతో తలను వంచి బ్రహ్మగారికేసి చూస్తూ ఇట్లు స్తుతించెను.
హిరణ్యకశిపురువాచ ।
కల్పాంతే కాలసృష్టేన యోకంధేన తమస్వావృతమ్ ।
అభివ్యనర్ జగదిదం స్వయంజ్యోతిస్వరోచిషా ॥
ఆత్మనా త్రివృతా చేదం సృజత్యవతి లుంపతి ।
రజస్సత్త్వతమోధామ్నే పరాయ మహతే నమః ॥
కల్పము అంతమైనప్పుడు కాలముయొక్క ప్రభావముచే ఈ జగత్తు దట్టని తమోగుణముచే కప్పివేయబడి యుండెను. స్వయంప్రకాశ - స్వరూపుడగు పరమేశ్వరుడు అట్టి జగత్తును తన చైతన్యప్రకాశముతో ప్రకటము చేసెను. ఆయన తన మాయాశక్తియొక్క సత్వరజస్తమోగుణముల ద్వారా తానే పృథివి-నీరు-తేజస్సుల రూపముగా ప్రకటమై, వాటి ద్వారా ఈ జగత్తును సృష్టించి, రక్షించి, ఉపసంహారము చేయుచున్నాడు. సర్వ వ్యాపకుడగు అట్టి పరమేశ్వరుని కొరకు నమస్కారము.
నమ ఆద్యాయ బీజాయ జ్ఞానవిజ్ఞానమూర్తయే ।
ప్రాణేంద్రియమనోబుద్ధివికారైర్వ్యక్తిమీయు షే ॥
జగత్తునకు మూలకారణము పరమేశ్వరుడే. శుద్ధచైతన్యస్వరూపు డగు ఆయనయే ప్రాణుల అంతఃకరణములయందు వివిధములగు విశేష జ్ఞానముల రూపముగా ప్రకటమగుచున్నాడు. ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనే కార్యముల రూపముగా ఆయనయే ప్రకటకై యున్నాడు. అట్టి పరమేశ్వరుని కొరకు నమస్కారము.
త్వమీశిషే జగతస్తస్థుషశ్చ ప్రాణేన ముఖ్యేన పతిః ప్రజానామ్ ।
చిత్తస్య చిత్తైర్మనఇంద్రియాణాం పతిర్మహాన్ భూతగణాశయేశః॥
సర్వజగద్వ్యాపకమగు మహాశక్తి (ముఖ్యప్రాణము, తేక సూ త్రాత్మ) రూపముగా నీవు స్థావరజంగమములగు ప్రాణులకు అంతర్యామివై యున్నావు. ప్రాణులకు ప్రభుడవు నీవే. ప్రాణులలోని స్మృతి, బుద్ధి, మనస్సు, ఇంద్రియములకు ప్రభుడవు నీవే. సర్వోత్కృష్టుడవగు నీవే పంచభూ తములను, వాటి గుణములైన శబ్దాదులను, వాటి సంస్కారములను కూడ నియమించెదవు.
త్వం సప్తతంతూన్ వితనోషి తన్వా
త్రయ్యా చాతుర్హో త్రకవిద్యయా చ ।
త్వమేక ఆత్మావత్మవతామనాదిః
అనంతపారః కవిరంతరాత్మా ॥
హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే నల్గురు ఋత్విక్కులచే నిర్వర్తించబడే యజ్ఞములను వేదము ప్రతిపాదించును. నీవు అట్టి వేదమే శరీరము కాగా -- అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ఉక్టము, షోడశి, వాజపేయము, ఆప్తోర్యామము, అతిరాత్రములనే ఏడు యజ్ఞములను విస్త రింప జేయుచున్నావు. సర్వజ్ఞుడవు, అంతర్యామివి అగు నీవే సకలప్రాణు ల అద్వయ-ఆత్మవు. సర్వకారణుడవగు నీకు దేశ-కాలపరిచ్చేదములు లేవు.
త్వమేవ కాలోనిమిషో జనానాం
ఆయుర్లవాద్యవయవైః క్షిణోషి ।
కూటస్థ ఆత్మా పరమేష్ఠ్యజో మహాన్
త్వం జీవలోకస్య చ జీవ ఆత్మా ॥
నీవే రెప్పపాటునెరుగని కాలము రూపములో ప్రాణుల ఆయుర్దా యమును లవము, క్షణము మొదలైన కాలఖండముల ద్వారా క్షీణింప జేయుచున్నావు. పుట్టుక లేని పరమేశ్వరుడవగు నీవే సకలప్రాణులలో జీవ శక్తి రూపముగా, ఆత్మచైతన్యరూపముగా ప్రకటమగుచున్నావు. నీకు పరి చ్ఛేదములు లేవు.
త్వత్తః పరం నాపరమప్యనేజదేజచ్చ కించిద్వ్యతిరిక్తమస్తి ।
విద్యాః కలాస్తే తనవశ్చ సర్వా హిరణ్యగర్భోసి బృహత్త్రిపృష్ఠ ॥
కారణము గాని, కార్యము గాని, కదిలేది గాని, కదలనిది గాని నీకంటే భిన్నముగా ఏదీ లేదు. సకలవిద్యలు, కళలు నీ రూపములే. సర్వజ గత్తునకు మూలమునందలి మహాశక్తి నీ స్వరూపమే. సత్త్వరజస్తమోగుణా త్మకమగు మాయకు అతీతమైన పరబ్రహ్మవు నీవే.
వ్యక్తం విభో స్థూలమిదం శరీరం
యేనేంద్రియప్రాణమనోగుణాంస్త్వమ్ ।
భుంక్షే స్థితో ధామని పారమేష్ఠ్య
అవ్యక్త ఆత్మా పురుషః పురాణః ॥
సర్వవ్యాపకుడవగు ఓ ప్రభూ! నీనుండి ప్రకటమైన ఈ జగత్తు నీ స్థూలశరీరమే. నీవు సర్వాతిశాయియగు సత్యధామమునందుంటూనే, ఈ బ్రహ్మాండశరీరముతో ఇంద్రియములు, ప్రాణము, మనస్సుల విషయములను భోగించుచున్నావు. ఇంద్రియగోచరము కానిది, పూర్ణము, ప్రాణిదేళ ములయందు ఉపలభ్యమయ్యేది, కాలాతీతము అగు ఆత్మతత్త్వము నీకే.
అనంతావ్యక్తరూపేణ యేనేదమఖిలం తతమ్ ।
చిదచిచ్చక్తియుక్తాయ తస్మై భగవతే నమః ॥
ఓ అనంతా! ఇంద్రియగోచరము కాని నీ రూపమే (చైతన్యము) ఈ జగత్తునంతనూ వ్యాపించి యున్నది. చైతన్యశక్తియగు జ్ఞానమునకు, జడశక్తియగు మాయకు నీవే అధిష్ఠానము. భగవానుడవగు అట్టి నీ కొరకు నమస్కారము.
యది దాస్యస్యభిమతాన్ వరాన్మే వరదోత్తము ।
భూతేభ్యస్త్వద్విసృష్టేభ్యో మృత్యుర్మా భూన్మమ ప్రభో ॥
ఓ ప్రభూ! నీవు వరములనిచ్చువారిలో ఉత్తముడవు. నాకు ఇష్ట మైన వరములను నీవు ఈయబోయే పక్షములో, -- నీచే సృష్టించబడిన ప్రాణుల వలన నాకు మరణము కలుగకుండు గాక!
నాంతర్బహిర్దివా నక్తమన్యస్మాదపీ చాయుధైః ।
న భూమౌ నాంబరే మృత్యుర్న నరైర్న మృగైరపి ॥
వ్యసుభిర్వాసుమద్భిర్వా సురాసురమహోరగైః ।
అప్రతిద్వంద్వతాం యుద్ధే ఐకపత్యం చ దేహినామ్ ॥
లోపల గాని, బయట గాని, పగలు గాని, రాత్రి గాని, నేలపై గాని, ఆకాశమునందు గాని, మానవులచే గాని, మృగములచే గాని, నీచే సృష్టిం చబడని ప్రాణిచే ఆయుధములతో గాని, ప్రాణము లేనివాటిచే గాని, ప్రాణము ఉన్నవాటిచే గాని, దేవతలచే గాని, రాక్షసులచే గాని, గొప్ప నాగులచే గాని, నాకు మరణము కలుగరాదు. యుద్ధములో నా యెదుట నిలిచి పోరాడగలిగే ప్రతిపక్షి ఉండరాదు. ప్రాణులన్నింటికీ నేను ఏకచ్ఛత్రా ధిపతిని కావలెను.
సర్వేషాం లోకపాలానాం మహిమానం యథాత్మనః ।
తపోయోగప్రభావాణాం యన్న రిష్యతి కర్హిచిత్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సమస్కంధే ప్రహ్లాదచరితే హిరణ్యకశిపోర్వరయాచనం నామ తృతీయోధ్యాయః ॥
లోకపాలకులందరిలో నీ మహిమయే గలదు. అటువంటి మహి మను నాకు కూడ ఇమ్ము, తపోయోగముయొక్క ప్రభావము గల సిద్దపురు షులయందలి అక్షయమగు ఐశ్వర్యమును కూడ నాకు ఇమ్ము,
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో ప్రహ్లాదచరితమునందు హిరణ్యకశిపుడు వరములను కోరుట అనే మూడవ అధ్యాయము ముగిసినది (3).
Summary of chapter 3 of the Bhāgavata Mahā Purana is as follows:
Determined to attain absolute immortality, conquer the planetary systems, and usurp the positions of all cosmic administrators, Hiraṇyakaśipu retired to Mandarācala Mountain to execute unprecedented, severe penances. Standing on his toes with arms extended toward the sky for hundreds of celestial years, Hiraṇyakaśipu remained motionless while anthills, grass, and bamboo completely covered his body and ants consumed his skin, flesh, and blood. The mystic heat generated from his austere skull scorched the three worlds, driving the terrified devatās to seek shelter of Lord Brahmā. Descending upon his swan carrier, Lord Brahmā sprinkled sanctified water from his kamaṇḍalu to restore Hiraṇyakaśipu's skeletal frame into a radiant golden body, agreeing to grant him a boon.