భాగవత మహా పురాణము
1 - ప్రహ్లాదుని చరితమునకు ఉపక్రమము
రాజోవాచ ।
సమః ప్రియస్సుహృద్బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయమ్ ।
ఇంద్రస్యార్ధే కథం దైత్యానవధీద్విషమో యథా ॥
పరీక్షిన్మహారాజు ఇట్లు ప్రశ్నించెను -- ఓ శుక మహర్షీ! సకలప్రా ణులకు హితమును చేసే భగవానుడు ప్రేమస్వరూపుడు. ఆయనకు నావాడు పైవాడు అనే తేడా లేదు గదా! అట్టి భగవానుడు భేదబుద్ది గల వాని వలె ఇంద్రుని ప్రయోజనము కొరకు రాక్షసులను సంహరించుట ఎట్లు పొసగును?
న హ్యస్యార్థస్సురగణైస్సాక్షాన్ని శ్శ్రేయసాత్మనః ।
నైవాసు రేభ్యో విద్వేషో వోద్వేగశ్చాగుణస్య హీ ॥
ఎందుకంటే -- పరమానందస్వరూపుడు, నిర్గుణుడు అగు భగవ నునకు దేవతాగణముల సహకారముతో పొందదగిన ప్రయోజనము గాని, రాక్షసుల వలన భయము గాని, వారి యెడల. ద్వేషభావము గాని లేనే లేవు గదా!
ఇతి నస్సుమహాభాగ నారాయణగుణాన్ ప్రతి ।
సంశయస్సుమహాన్ జాతస్తద్భవాం శ్ఛేత్తుమర్హతి ॥
భగవద్భక్తి అనే గొప్ప భాగ్యము గల ఓ మహర్షీ! మాకు సహాయ ణుని గుణములను గురించి ఈ విధముగా పెద్ద సందేహము కలిగినది. దానిని తొలగించుటకు నీవే అర్హుడవు.
శ్రీశుక ఉవాచ ।
సాధు పృష్టం మహారాజ హరేశ్చరితమద్బుతమ్ ।
యద్భాగవతమాహాత్మ్యం భగవద్భక్తివర్ధనమ్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! నీవు శ్రీహరియొక్క ఆశ్చర్యమును గొల్పే గాథను గురించి చక్కగా ప్రశ్నించితివి. శ్రీహరి గాథలో భగవద్భక్తిని వర్ధిల్ల జేసే భగవద్భక్తుల మహిమ వర్ణించబడును.
గీయతే పరమం పుణ్యమృషిభిర్నారదాదిభిః ।
నత్వా కృష్ణాయ మునయే కథయి ష్యే హరేః కథామ్ ॥
పరమపవిత్రమగు శ్రీహరి గాథను నారదుడు మొదలగు మహర్షులు గానము చేయుచుందురు. నేను వేదవ్యాస మహర్షికి నమస్కరించి అట్టి గాథను చెప్పెదను.
నిర్గుణోఽపి హ్యజోఽవ్యక్తో భగవాన్ ప్రకృతేః పరః ।
స్వమాయాగుణమవిశ్య బాధ్యబాధకతాం గతః ॥
మాయాశక్తికి అతీతుడైన భగవానుడు నిర్గుణుడు. పుట్టుక లేని ఆయనకు దేహేంద్రియాదులు లేవు. అయిననూ, ఆయన తన మాయాశక్తి యొక్క గుణములకు అధిష్టానమై యుండుటచే, దేవతలు రాక్షసులు పర స్పరము బాధించుకుంటూ ఉంటే అదంతా ఆయనకు సంక్రమించినది.
సత్త్వం రజస్తమ ఇతి ప్రకృతేర్నాత్మనో గుణాః ।
న తేషాం యుగపద్రోజన్ హ్రస ఉల్లాస ఏవ వా ॥
ఓ మహారాజా! సత్త్వము, రజస్సు, తమస్సు అనేవి మాయాశక్తి గుణములే గాని, ఆత్మవి కావు. అవి అన్నీ ఏకకాలములో క్షయమును గాని, వృద్ధిని గాని పొందవు.
జయకాలే తు సత్త్వస్య దేవర్షీన్ రజసోఽసురాన్ ।
తమసో యక్షరక్షాంసీ తత్కాలానుగుణోఽభజత్ ॥
భగవానుడు ఆయా కాలములకు తగ్గట్లుగా, సత్త్వగుణము వర్ధిల్లే లచుండు మతము ముగులు గగనము నందు భోగపరాయణులగు అసురులను, తమోగుణము వర్ధిల్లే కాలము నందు యక్షులను రాక్షసులను అనుగ్రహించును.
జ్యోతిరాదిరివాభాతి సంఘాతాన్న వివిచ్యతే ।
విదంత్యాత్మానమాత్మస్థం మథిత్వా కవయోఽoతతః ॥
నిప్పు, నీరు మొదలైన పంచభూతములు వలె భగవానుడు అనేక రూపములలో ప్రకాశించుచున్నాడు. కాని, దేహేంద్రియమనస్సంఘాత ములయందు ఆత్మరూపముగానుండే ఆయనను మానవులు దేహాదుల కంటే విలక్షణముగా తెలియకున్నారు. కట్టెలోని నిప్పు మథించినచో ప్రకట మగును. అదే విధముగా, జ్ఞానులు ఆత్మవిచారమును చేసి అనాత్మను నిషేధిస్తూ, భగవానుని బుద్ధియందలి ఆత్మచైతన్యరూపముగా తెలుసుకో ని, ఆయనలో ఐక్యమగుచున్నారు.
యదా సిసృక్షుః పుర ఆత్మనః పరో
రజస్సృజత్యేష పృథక్ స్వమాయయా ।
సత్త్వం విచిత్రాసు రిరంసురీశ్వరః
శయిష్యమాణస్తమ ఈరయత్యసౌ ॥
రాజసూయ మహాయజ్ఞమునందు చేదిదేశపు రాజగు శిశుపాలుడు పోసుదేవ భగవానునియందు ఐక్యమయ్యెను. ఆ గొప్ప అద్బుతమును చూచి, పొండుపుత్రుడగు ధర్మరాజుయొక్క మనస్సు ఆశ్చర్యముతో నిండి పోయెను. ఆ సమయములో యజ్ఞశాలలో దేవర్షియగు నారదుడు కూర్చుండియుండెను. ఇతరమహర్షులు వినుచుండగా ఆ మహారాజు ఆయనను ఇట్లు ప్రశ్నించెను.
యుధిష్ఠిర ఉవాచ ।
అహో అత్యద్భుతం హ్యేతద్దుర్ల భైకాంతినామపి ।
వాసుదేవే పరే తత్త్వే ప్రాప్తిశ్చైద్యస్య విద్విషః ॥
ధర్మరాజు ఇట్లు పలికెను --- ఆహా! ఇది అత్యద్బుతము సుమా! చేదిదేశపు రాజగు శిశుపాలుడు అధికముగా ద్వేషించి కూడ వాసుదేవ పర బ్రహ్మయందు ఐక్యమైనాడు. ఇది ఏకాంతభక్తులకు కూడ పొంద శక్యము కానిది.
ఏతద్వేదితుమిచ్చామస్సర్వ ఏవ వయం మునే ।
భగవన్నిందయా వేనో ద్విజైస్తమసీ పాతితః ॥
ఓ మహర్షీ! మేమందరము ఈ విషయమును తెలియగోరుచున్నా ము. భగవంతుని నిందించిన వేనుని వేదవేత్తలు నరకములో పారద్రోసిరి..
దమ ఘోషసుతః పాప ఆరభ్య కలభాషణాత్ ।
సంప్రత్యమర్షి గోవిందే దంతవక్త్రశ్చ దుర్మతిః ॥
దమఘోషుని పుత్రుడు, పాపి అగు శిశుపాలుడు ముద్దు పలుకుల నాటినుండి ఈ నాటి వరకు గోవిందునిపై కోపమును కలిగియే యున్నాడు. దుర్బుద్ధియగు దంతవక్తడు కూడ అంతే.
శపతోరసకృద్విష్ణుం యద్బ్రహ్మ పరమవ్యయమ్ ।
శ్విత్రో న జాతో జిహ్వాయాం నాంధం వివిశతుస్తమః ॥
అవినాశియగు పరబ్రహ్మయే శ్రీమహావిష్ణువు. ఆయనయే శ్రీకృ ష్ణుడు. ఆయనను మాటిమాటికీ తిట్టుచున్న వీరిద్దరు అంధకారమయమగు నరకములో పడుట మాట అటుంచి, వారికి నాలుకపై తెల్లని మచ్చ కూడ పడలేదు.
కథం తస్మిన్ భగవతీ దురవగ్రాహధామని ।
పశ్యతాం సర్వలోకానాం లయమీయతురంజసా ॥
భగవానుని స్వరూపమును పొందుట చాల కష్టము. జనులందరు చూచుచుండగా వీరిద్దరు సాక్షాత్తుగా ఆ భగవానునియందు ఐక్యమగుట ఎట్లు సంభవమయ్యేను?
ఏతద్బ్రామ్యతి మే బుద్ధిర్దీపార్చిరివ వాయునా ।
బ్రూ హ్యేతదద్భుతతమం భగవాంస్తత్ర కారణమ్ ॥
ఇది మిక్కిలి అద్భుతము. దీని విషయములో నా బుద్ది, గాలిలోని దీపజ్వాల కదలాడినట్లు, భ్రమను పొందుచున్నది. పూజనీయుడవగు నీవు అట్లు జరుగుటకు గల కారణమును చెప్పుము.
శ్రీశుక ఉవాచ ।
రాజ్ఞస్తద్వచ ఆకర్ణ్య నారదో భగవానృషిః ।
తుష్టః ప్రాహ తమాభాష్య శృణ్వత్యాస్తత్సదః కథాః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను - పూజనీయుడగు నారద మహర్షి ధర్మరాజుయొక్క ఆ మాటను విని సంతోషించెను. ఆయన ధర్మరాజును సంబోధించి, సభాసదులందరు వినుచుండగా, గాథలను చెప్పెను.
నారద ఉవాచ ।
నిందనవసత్కారన్యక్కారార్థం కలేవరమ్ ।
ప్రధానపరమో రాజన్నవివేకేన కల్పితమ్ ॥
ఓ మహారాజా! ప్రకృతికి, పరమాత్మకు మధ్యలో ఉండే తేడా తెలి యని కారణముగా ఈ దేహము కల్పితమై, నిందాస్తుతులకు, సత్కారతిర స్కారములకు యోగ్యమై యున్నది.
హింసా తదభిమానేన దండపారుష్యయోర్యథా ।
వైషమ్యమిహ భూతానాం మహమితి పార్థివ ॥
యన్నిబద్దోభిమానోకాయం తద్వధాత్ప్రాణినాం వధః ।
తథా న యస్య కైవల్యాదభిమానోఖిలాత్మనః ।
పరస్య దమకర్తర్హి హింసా కేనాస్య కల్ప్యతే ॥
ఓ మహారాజా! ఈ లోకములో మానవులు భ్రాంతిచే దేహము నందు నేను-నాది అనే అభిమానము గలవారై, కొట్టుకొనుట మరియు పరు షముగా తిట్టుకొనుటల వలన కలిగే పీడకు గురియగుచుందురు. మాన వులు దేహమే ఆత్మ అనే దృఢమగు అభిమానముగలవారై, దేహముయొక్క వినాశము తమ మరణమేనని స్వీకరించెదరు. కాని సకల ప్రాణులను వారి కర్మలకనురూపముగా శిక్షించే పరమాత్మ అద్వితీయుడు, సర్వాత్మస్వరూపుడు. ఆయనయందు ఇట్టి ఆభిమానమునకు తావు లేదు. ఆయన విషయములో హింసయొక్క కల్పననైననూ ఎవడు చేయగలడు ?
తస్మాద్వైరానుబంధేన నిర్వైరేణ భయేన వా ।
స్నేహాత్కామేన వా యుంజ్యాత్కథంచిన్నేక్షతే పృథక్ ॥
కావున, వైరమును బూని గాని, వైరమునెరుంగని భక్తితో గాని, భయముతో గాని, మైత్రితో గాని, కామనచే గాని భగవానునియందు మన స్సును గట్టిగా నిలుపవలెను. ఈ ఉపాయములలోని భేదమును భగవా నుడు సరకు చేయడు.
యథా వైరానుబంధేన మర్త్యస్తన్మయతామియాత్ ।
న తథా భక్తియోగేన ఇతి మే నిశ్చితా మతిః ॥
మానవుడు గట్టిగా వైరమును బూని తన్మయుడై భగవానునితో సాయుజ్యమును పొందిన విధముగా భక్తియోగముతోనైననూ పొందలేడని నా నిశ్చితమైన అభిప్రాయము.
కీటః పేశస్కృతా రుద్దః కుడ్యాయాం తమనుస్మరన్ ।
సంరంభభయయోగేన విందతే తత్సరూపతామ్ ॥
తుమ్మెద గ్రుడ్డునుండి వచ్చిన పురుగు (లార్వా) ను గోడచిల్లులో బంధించును. అది ద్వేషము-భయములతో తుమ్మెదనే స్మరిస్తూ, తుమ్మెద రూపమునే పొందును.
ఏవం కృష్ణే భగవతి మాయామనుజ ఈశ్వరే ।
వైరేణ పూతపాపానస్తమాపురనుచింతయా ॥
శ్రీకృష్ణ భగవానుడు మాయచే మానవరూపమును దాల్చిన పర మేశ్వరుడు. కొందరు ఆయనను ఆ పురుగు వలె వైరముతో ధ్యానించి, దానిచే పాపములు తొలగి ఆయనను పొందిరి.
కామాద్ద్వేషాదయాత్ స్నేహాద్యథా భక్త్యేశ్వరే మనః ।
ఆవేశ్య తదఘం హిత్వా బహవస్తద్గతిం గతాః ॥
భక్తులు భక్తితో భగవానుని పొందినట్లుగానే, చాల మంది కామనతో గాని, ద్వేషముతో గాని, భయముతో గాని, మైత్రితో గాని మనస్సును భగ. వానునియందు గట్టిగా నిలిపి, ఆయా దోషములను వదిలించుకొని, భగవా నుని సాయుజ్యమును పొందిరి.
గోప్యః కామాదయాత్కంసో ద్వేషాచ్చైద్యాదయో నృపాః ।
సంబంధాద్వృష్ణయ స్నేహాద్యూయం భక్త్యా వయం విభో ॥
ఓ మహారాజా! గోపికలు కామనచే, కంసుడు భయముచే, చేదిదేశ ప్రభువగు శిశుపాలుడు మొదలగు రాజులు ద్వేషముచే, యాదవులు, బంధుత్వముచే, మీరు మైత్రిచే, మేము భక్తిచే మనస్సును ఈశ్వరుని యందు నిలిపితిమి.
కతమోపీ న వేనస్స్యాత్పంచానాం పురుషం ప్రతి ।
తస్మాత్కేనాప్యుపాయేన మనః కృష్ణే నివేశయేత్ ॥
పరమేశ్వరుని యెడల చేసే (పైన చెప్పినవాటిలో కామనను మిన హాయించి) అయిదు రకముల భావనలలో దేనినైననూ వేనుడు చేయలేదు (కావుననే, నరకమును పొందెను). కావున, సాధకుడు ఏ ఉపాయముచేనై ననూ మనస్సును శ్రీకృష్ణునియందు గట్టిగా నిలుపవలెను.
మాతృష్వ సేయో వశ్చైద్యో దంతవక్తశ్చ పాండవ ।
పార్షదప్రవరౌ విష్ణోర్విప్రశాపాత్పదాచ్చ్యుతే ॥
పాండువంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! చేదిదేశప్రభుడగు. శిశుపాలుడు మీ పినతల్లి కొడుకు. ఆతడు, దంతవక్తడు విష్ణువుయొక్క అనుచరులలో ప్రముఖులు, బ్రహ్మవేత్తలగు సనకాదుల శాపముచే వారు తమ పదవినుండి జారిపోయిరి.
యుధిష్ఠిర ఉవాచ ।
కీదృశః కస్య వా శాపో హరిదాసాభిమర్శనః ।
అశ్రద్దేయ ఇవాభాతి హరేరేకాంతినాం భవః ॥
ధర్మరాజు ఇట్లు పలికెను --- శ్రీహరియొక్క భక్తులను తిరస్క రించే ఆ శాపమెట్టిది? ఎవరి శాపము? శ్రీహరియొక్క ఏకాంతభక్తులకు కూడ సంసారము కలుగుట నమ్మ శక్యము కాకుండా నున్నది.
దేహేంద్రియాసుహీనానాం వైకుంఠపురవాసినామ్ । దేహసంబంధసంబద్దమేతదాఖ్యాతుమర్హసి ॥
వైకుంఠపురములో నివసించువారలకు ప్రాకృతములైన దేహములు, ఇంద్రియములు, ప్రాణములు ఉండవు. అట్టివారికి దేహముతోడి సంబంధము (జన్మనెత్తుట) ఎట్లు కలిగినదో, ఆ ఈ వృత్తాంతమును నీవు చెప్ప తగుదువు.
నారద ఉవాచ ।
ఏకదా బ్రహ్మణః పుత్రా విష్ణోర్లోకం యదృచ్చయా ।
సనందనాదయో జగ్ముశ్చరంతో భువనత్రయమ్ ॥
నారదుడిట్లు పలికెను --- బ్రహ్మగారి పుత్రులను సనందనుడు మొదలగువారలు ముల్లోకములను సంచరిస్తూ అనుకోకుండా (ఈశ్వరేచ్ఛచే) ఒకనాడు విష్ణులోకమునకు వెళ్లిరి.
పంచషడ్డాయనారాభాః పూర్వేషామపి పూర్వజాః ।
దిగ్వాససశ్శిశూన్ మత్వా ద్వాఃస్థౌ తాన్ ప్రత్య షేధతామ్ ॥
అయిదారు సంవత్సరముల వయస్సు గల పిల్లలవలె కన్పట్టే దిగంబరులైన ఆ సనందనాదులు అందరికంటే ముందటివారైన మరీచి మొదలగు ప్రజాపతులకు కూడా ముందు జన్మించినవారు. వారు పిల్లలేనని తలపోసి, ఇద్దరు వైకుంఠ ద్వారపాలకులు వారిని అడ్డుకొనిరి.
అశషన్ కుపితా ఏవం యువాం వాసం న చార్హథః ।
రజస్తమోభ్యాం రహితే పాదమూలే మధుద్విషః ।
పాపిష్టామాసురీం యోనిం బాలిశౌ యాతమాశ్వతః ॥
ఈ విధమగు ఆటంకముచే కోపించిన ఆ సనకాదులు ఇట్లు శపించిరి -- మధువైరియగు శ్రీహరి చరణముల వద్ద రజస్తమోగుణములకు తావు లేదు. కావున, మీరిచట నివసించుటకు తగరు. ఓ మూర్ఖులారా! మీరు వెంటనే ఇక్కడనుండి జారిపోయి, పాపభూయిష్టమగు అసురజ న్మను పొందుడు.
ఏవం శప్తా స్వభవనాత్పతంతో తైః కృపాలుభిః ।
ప్రోక్తా పునర్జన్మభిర్వాం త్రిభిర్లోకాయ కల్పతామ్ ॥
ఈ విధముగా శపించబడి వారిద్దరు తమ భవనమునుండి పడిపో వుచుండగా, సనకాదులు వారితో మరల ఇట్లనిరి -- మూడు జన్మల తరు వాత శాపము సమాప్తమై మీరు వైకుంఠలోకమును పొందగలరు.
జజ్ఞాతౌ తొ దితేః పుత్రా దైత్యదానవవందితా ।
హిరణ్యకశిపుర్ణ్యేష్ణో హిరణ్యాక్షో నుజస్తతః ॥
వారిద్దరు దితి పుత్రులై జన్మించి, దితిదానవవంశములకు చెందిన రాక్షసుల మన్ననలను పొందిరి. వారిలో పెద్దవాడు హిరణ్యకశిపుడు; హిర ణ్యాక్షుడు వాని తమ్ముడు.
హతో హిరణ్యకశిపుర్హరిణా సింహరూపిణా ।
హిరణ్యాక్షో ధరోదారే బీభ్రతా సౌకరం వపుః ॥
శ్రీహరి నరసింహరూపమును దాల్చి హిరణ్యకశిపుని, వరాహరూ పమును దాల్చి భూమిని పైకి తీసుకువస్తూ హిరణ్యాక్షుని సంహరించెను.
హిరణ్యకశిపుః పుత్రం ప్రహ్లాదం కేశవప్రియమ్ ।
జిఘాంసురకరోన్నానా యాతనా మృత్యు హేతవే ॥
హిరణ్యకశిపుని పుత్రుడగు ప్రహ్లాదుడు శ్రీహరి భక్తుడు, శ్రీహరికి ప్రియమైనవాడు. ఆతనిని హిరణ్యకశిపుడు చంపగోరెను. ప్రహ్లాదుని చంపు టకై హిరణ్యకశిపుడాతనిని అనేకములైన తీవ్రవేదనలకు గురి చేసెను.
సర్వభూతాత్మభూతం తం ప్రశాంతం సమదర్శనమ్ ।
భగవత్తేజసా స్పృష్టం నాశక్నోద్ధంతుముద్యమైః ॥
ప్రహ్లాదుడు సర్వవ్యాపకమైన పరబ్రహ్మను దర్శించే జ్ఞాని యగుటచే, ఆతని మనస్సులో రాగద్వేషములకు తావు లేదు. సర్వప్రాణులకు ఆత్మరూపుడైయున్న ఆతనిని భగవానుని తేజస్సు వ్యాపించి యుండెను. కావుననే, శస్త్రాఘాతములు మొదలగు ప్రయత్నములను చేసిననూ, హిర ణ్యకశిపుడు ప్రహ్లాదుని సంహరించలేక పోయెను.
తతస్తౌ రాక్షతౌ జాతో కేశిన్యాం విశ్రవస్సుతౌ ।
రావణ కుంభకర్ణశ్చ సర్వలోకోపతాపనౌ ॥
తరువాత వారిద్దరు విశ్రవసునకు కేశినియందు రావణకుంభక ర్ణులనే రాక్షసులై జన్మించి, సకలప్రాణులకు పీడను కలిగించిరి.
తత్రాపి రాఘవో భూత్వా న్యహనచ్ఛాపముక్తయే ।
రామవీర్యం శ్రోష్యసి త్వం మార్కండేయముఖాత్ప్రభో ॥
ఓ మహారాజా! వారిద్దరి ఆ జన్మయందు కూడ శ్రీహరి శ్రీరా ముడై అవతరించి వారిని సంహరించి శాపవిముక్తిని కలిగించెను. నీకు శ్రీరాముని పరాక్రమమును గురించి మార్కండేయ మహర్షి చెప్పగలడు.
తావేవ క్షత్రియౌ జాతౌ మాతృష్వస్రాత్మజౌ తవ ।
అధునా శాపనిర్ముక్తా కృష్ణచక్రహతాంహసౌ ॥
వారిద్దరే ఇప్పుడు క్షత్రియకులములో నీ పినతల్లి కుమారులై జన్మించిరి. శ్రీకృష్ణుని చక్రముచే వారి పాపములు నశించగా, వారిప్పుడు శాపవిముక్తిని పొందిరి.
వైరానుబంధతీవ్రేణ ధ్యానేనాచ్యుతసాత్మతామ్ ।
నీతా పునర్హరేః పార్శ్వం జగ్మతుర్విష్ణుపార్షదౌ ॥
వారిద్దరు శ్రీహరియందు గట్టిగా వైరమును బూని ఆయననే ధ్యానిస్తూ ఆయనలో తన్మయులైనారు. ఆ ధ్యానఫలముగా వారు మరల శ్రీహరికి అనుచరులై ఆయన సన్నిధిని చేరుకొనిరి.
యుధిష్ఠిర ఉవాచ ।
విద్వేషో దయితే పుత్రే కథమాసీన్మహాత్మని ।
బ్రూహి మే భగవన్ యేన ప్రహ్రదస్యాచ్యుతాత్మతా ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే ప్రహ్లాదచరితోపక్రమే ప్రథమోధ్యాయః ॥
పూజనీయుడవగు ఓ మహర్షీ! తనకు ప్రియమైన పుత్రుడు మరియు మహాత్ముడు అగు ప్రహ్లాదునియందు హిరణ్యకశిపునకు అధిక మగు విద్వేషము కలుగుటకు కారణమేమి? ప్రహ్లాదుడు ఏ ఉపాయముచే శ్రీహరియందు తన్మయుడు కాగలిగెను? నాకీ విషయమును చెప్పుము.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో ప్రహ్లాదచరితమునకు ఉపక్రమించే మొదటి అధ్యాయము ముగిసినది (1).
Summary of chapter 1 of the Bhāgavata Mahā Purana is as follows:
This chapter records the historical inquiry of Emperor Parīkshit regarding whether Bhagavān Vishṇu is subject to partiality or bias, given His active assistance to the celestial devatās and His slaying of the asuras. Śrī Śukadeva Gosvāmī clarifies that Bhagavān is completely free from material attachment, hatred, or duality, viewing all living entities with absolute equanimity (*Sama-darśanam*). He explains that the cosmic modes of nature (*Sattva*, *Rajas*, and *Tamas*) cycle through time, and Bhagavān's apparent siding with the devatās is a merciful cosmic arrangement to maintain universal balance. To illustrate how even intense hostility directed continuously toward Bhagavān results in ultimate liberation, Śukadeva Gosvāmī references King Śiśupāla of Cedi, whose soul merged into the divine body of Śrī Kṛshṇa upon his decapitation, and recounts Devarshi Nārada's history of how the Vaikuṇṭha gatekeepers Jaya and Vijaya descended into the material world as asuras for three births to return swiftly to the spiritual realm.