భాగవత మహా పురాణము
31 - శ్రీకృష్ణ భగవానుడు అవతారమునుపసంహరించుట
శ్రీశుక ఉవాచ ।
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- దారుకుడు వెళ్లిన తరువాత అక్కడకు బ్రహ్మదేవుడు, శివుడు, పార్వతీదేవి, దేవేంద్రుడు-అగ్ని మొదలగు దేవతలు, ప్రజాపతులు, మహర్షులు విచ్చేసిరి.
పితృదేవతలు, సిద్దులు, గంధర్వులు, విద్యాధరులు, గొప్ప నాగులు, చారణులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, అప్సరసలు, మైత్రేయుడు మొదలైన బ్రాహ్మణులు విచ్చేసిరి.
వారికి శ్రీకృష్ణ భగవానుని నిర్యాణమును చూడవలెననే కోరిక, అతిశయించిన ఉత్కంఠ ఉండెను. వారు శూరవంశమునందు అవతరించిన శ్రీకృష్ణుని లీలలను గానము చేస్తూ ఆయనను స్తుతించుచుండిరి..
ఓ పరీక్షిన్మహారాజా! వారు పూలవానలను కురిపించిరి. వారి విమానముల పంక్తులచే ఆకాశము రద్దీగా నుండెను. వారు సర్వాతిశాయి భక్తిని కలిగియుండిరి.
సర్వవ్యాపకుడగు శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుని, తన విభూతులైన ఇంద్రాదులను చూచేను. ఆయన , చిత్తమును తన స్వరూపమునందు విలీనము చేసి, పద్మములవంటి కన్నులను మూసుకొనెను.
జనులకు మనోహరమైన ఆ రూపమును ధారణ చేసి ధ్యానించినచో మంగళములు కలుగును. అట్టి తన దేహమును ఆయన అగ్నిదేవతా సంబంధమైన యోగధారణచే దహించి, వైకుంఠధామమును ప్రవేశించెను.
దేవదుందుభులు మ్రోగినవి. ఆకాశమునుండి పుష్పములు పడినవి. భూలోకమునుండి సత్యము, ధర్మము, దైర్యము, కీర్తి, సంపద కూడ ఆయన వెంట వెళ్లినవీ.
తన ధామమును ప్రవేశిస్తున్న శ్రీకృష్ణుని గతిని, బ్రహ్మదేవుడు ప్రముఖుడుగా గల దేవతలు మొదలగువారు గుర్తించలేకపోయిరి. వారు చాల ఆశ్చర్యపడిరి. .
ఆకాశమునందు మేఘమండలమును విడిచి పెట్టి వెళ్లుచున్న మెరుపు తీగయొక్క గతిని మానవులు కనుగొనలేరు. అదే విధముగా, శ్రీకృష్ణుని గతిని దేవతలు కనుగొనలేకపోయిరి.
శ్రీకృష్ణుడు యోగముచే తన ధామమును చేరుటను చూచి ఆ బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలగువారు ఆశ్చర్యమును పొందిరి. పోరా యోగమాయావైభవమును కొనియాడుతూ, తమ తమ లోకములకు వెళ్లిరి.
ఓ పరీక్షిన్మహారాజా! పరమాత్మకు దేహధారులయందు పుట్టుట, నిర్యాణము, లీలలు నటునకు వలే మాయచే అనుకరణము మాత్రమేనని తెలియుము. ఆయన తననుండి ఈ జగత్తును సృష్టించి, దానియందు ప్రవేశించి, విహరించి, అంతమునందు ఉపసంహరించును. అప్పుడాయన జగత్కార్యమునుండి నివృత్తు డై అఖండసద్రూపముతో నిలిచియుండును.
శ్రీకృష్ణుడు యమలోకమునకు కొనిపోబడిన గురుపుత్రుని మానవదేహముతో తీసుకువచ్చెను. ఆ శరణాగతరక్షకుడు బ్రహ్మాస్త్రముచే దహించబడిన నిన్ను కాపాడెను. ఆయన మృత్యుంజయుడగు రుద్రుని జయించెను. కిరాతుని దేహముతో సహా స్వర్గమునకు పం పెను. ఆయన తనను, తనవారిని రక్షించుట చేతకానివాడా?(కాదు).
సకలజగత్తుయొక్క సృష్టి స్థితిలయములకు రెండవది లేని (అభిన్ననిమిత్తపాదన) కారణము శ్రీకృష్ణుడే. ఎందుకంటే, ఆయన సకలశక్తులను ధరించియున్నాడు. కాని, ఆయన ఈ లోకములో దేహమును నిలిపి ఉంచుటకు ఇష్టపడలేదు. దేహము మరణించేది. దానితో పని యేమి? ఆత్మనిష్ఠులు మోక్షమును పొందెదరు. ఈ సత్యమును సాధకులకు ప్రదర్శించుటకే ఆయన అట్లు చేసెను.
శ్రీకృష్ణుని ఈ వైకుంఠగమనలీల సర్వోత్తమమైనది. దీనిని ఎవడైతే ఉదయమే నిద్ర లేచి సావధానుడై భక్తితో కీర్తించునో, అట్టివాడు ఆ సర్వోత్తమమైన గతినే పొందును.
దారుకుడు శ్రీకృష్ణుడు లేకుండా ద్వారకకు వచ్చి, వసుదేవ-ఉగ్ర సేనుల పాదములపై పడి కన్నీళ్లతో అభిషేకించెను.
ఓ పరీక్షిన్మహారాజా! యాదవులు పూర్తిగా నశించిన విషయమును దారుకుడు చెప్పెను. దానిని విని ఉద్వేగముతో నిండిన హృదయము గల జనులు శోకముచే మూర్చిల్లిరి.
శ్రీకృష్ణుని వియోగముచే వ్యాకులు రైన జనులు తలలు బాదుకుంటూ, తమ జ్ఞాతులు ప్రాణములు పోయి పడి ఉన్న చోటికి వేగముగా వెళ్లిరి.
దేవకీ, రోహిణి, వసుదేవుడు తమ పుత్రులైన బలరామశ్రీకృష్ణులు కొనరాక శోకముచే పీడితులై స్పృహను కోల్పోయిరి.
శ్రీకృష్ణ భగవానుని వియోగముచే దుఃఖితులై వారు అక్కడనే ప్రాణములను విడిచిరి. స్త్రీలు తమ తమ భర్తల దేహములను కౌగిలించి చితిని అధిష్ఠించిరి.
బలరాముని భార్యలు ఆయన దేహమును, వసుదేవుని భార్యలు ఆయన దేహమును, శ్రీకృష్ణ భగవానుని కోడళ్లు తమ భర్త లైన ప్రద్యుమ్నుడు మొదలగువారి దేహములను కౌగిలించుకొని అగ్ని ప్రవేశము చేసిరి. శ్రీకృష్ణుని భార్యలగు రుక్మిణి, సత్యభామ మొదలగువారు ఆయననే ధ్యానిస్తూ అగ్నిని ప్రవేశించిరి.
ప్రియతముడైన శ్రీకృష్ణుని వియోగముచే అర్జునుడు దుఃఖమును పొందెను. ఆతడు శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీతలలోని సత్యవచనములతో తనను తానే ఓదార్చుకొనెను.
సంతానము నశించి తాము కూడ సంహరించబడిన బంధువులకు క్రమముగా అర్జునుడు పరలోకసాధనమైన పితృకర్మను యథావిధిగా చేయించెను.
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ భగవానుడు విడిచి పెట్టిన ద్వారకను, శ్రీకృష్ణ భగవానుని నివాసమును మినహాయించి, సముద్రము క్షణకాలములో ముంచివేసెను.
మధు కైటభసంహారియగు శ్రీహరి అక్కడ నిత్యసన్నిధియై ఉన్నాడు.. దానిని స్మరించుటచే సకలములైన అశుభములు తొలగిపోవును. అది మంగళములలో కెల్లా మంగళకరము.
యాదవులు సంహరించబడగా మిగిలిన స్త్రీలను, పిల్లలను, వృద్ధులను అర్జునుడు దోడ్కొని ఇంద్రప్రస్థములో ప్రవేశ పెట్టెను. అక్కడ ఆతడు అనిరుద్ధపుత్రుడగు వజ్రుని పట్టాభిషిక్తుని చేయించెను.
ఓ పరీక్షిన్మహారాజా! ఆత్మబంధువులైన యాదవుల సంహారమును గురించి నీ తాతలు అర్జునునినుండి వినిరి. అపుడు వారందరు నిన్ను - వంశమును నిలబెట్టే రాజునుగా అభిషేకించి, హిమాలయమునకు వెళ్లిరి.
ఏ మానవుడైతే దేవదేవుడగు శ్రీహరియొక్క ఈ అవతారమును, ' లీలలను కూడ శ్రద్ధతో కీర్తించునో, అట్టివాడు సకలపాపములనుండి , విముక్తుడగును.
॥ ఏకాదశ స్కంధస్సమాప్తః ॥
శ్రీహరిభగవానుడు మనోహరములైన అవతారములలో శక్తిని సూచించే లీలలను, బాల్యలీలలను కూడ చేసెను. పరమానందమునిచ్చే ఆ లీలలను ఈ గ్రంథమే గాక, ఇతరగ్రంథములు కూడ వర్ణించినవి. వాటిని కీర్తించే మానవుడు పరమహంసలచే పొందబడే శ్రీహరియందు సర్వాతిశాయియైన (ఫలతృష్ణ లేని) భక్తిని పొందును.
శ్రీమద్బాగవత మహాపురాణము పదునొకండవ స్కంధములో
శ్రీకృష్ణ భగవానుడు అవతారమునుపసంహరించుటను వర్ణించే
ముప్పది ఒకటవ అధ్యాయము ముగిసినది (31).
ఏకాదశ స్కంధము ముగిసినది.
హరిః ఓమ్, తత్సత్, శ్రీకృష్ణార్పణమస్తు.
* * * * *
Summary of chapter 31 of the Bhāgavata Mahā Purana is as follows:
Witnessing the complete withdrawal of the Yadu dynasty, Lord Balarāma sat in deep yoga meditation on the seashore, emitted a luminous white serpent (Ananta Śesha) from His mouth, and returned to His eternal spiritual abode. Svayam Bhagavān Śrī Kṛshṇa then walked into the sacred forest of Prabhāsa, seated Himself peacefully beneath a pippala tree, and rested His lotus left foot upon His right thigh. A hunter named **Jāra**, mistaking Kṛshṇa's glowing foot for the face of a deer, shot an arrow tipped with the remaining iron fragment of the cursed club into His foot. Rushing forward, the terrified hunter realized his error and fell at Kṛshṇa's feet begging for mercy. Śrī Kṛshṇa comforted Jāra, assuring him that this was divinely ordained, and dispatched him to heaven. Instantly, a brilliant, incandescent spiritual light emanated from Śrī Kṛshṇa's divine body, illuminating the universe. Accompanied by celestial devatās, Gandharvas, and Rishis showering flowers and playing drums, Svayam Bhagavān Śrī Kṛshṇa ascended in His original, eternal spiritual form (*Sach-cid-ānanda-vigraha*) directly to His supreme spiritual abode in Vaikuṇṭha. Daruka returned to Dvārakā to inform Arjuna, who escorted the surviving women, children, and elders to Indraprastha as the ocean rose to submerge the city of Dvārakā, concluding an era of divine history.