భాగవత మహా పురాణము
5 - భక్తిహీనుల గతి - భగవానుని పూజావిధి
రాజోవాచ ।
నిమి ఇట్లు పలికెను --- మీరు ఆత్మవేత్తలలో అగ్రగణ్యులు. చల్లారని కోరికలు గల కొందరు శ్రీహరి భగవానుని ఇంచుమించుగా భజించరు. వారు మనస్సునకు పరవశులై యుందురు. వారెట్టి గతిని పొందెదరు?
చమస ఉవాచ ।
చమసమహర్షి ఇట్లు పలికెను --- భగవానుని నోరు, చేతులు, తొడలు, పాదములనుండి సత్త్వరజస్తమోగుణముల మేళవింపుచే బ్రాహ్మణులు-క్షత్రియులు మొదలైన వేర్వేరు వర్ణములు, బ్రహ్మచర్యము-గార్హస్థ్యము మొదలైన ఆశ్రమములు పుట్టెను.
సాక్షాత్తుగా సర్వులకు జన్మనిచ్చిన అంతర్యామియే ఈశ్వరుడు. ఈ వర్ణాశ్రమములలో ఎవరైతే అట్టి ఈశ్వరుని సేవించకుండా అనాదరము చేయుదురో, వారు మానవజన్మయొక్క యోగ్యతనుండి భ్రష్టులై పశుపక్ష్యాది జన్మలను పొందెదరు.
కొందరు స్త్రీలు, శూద్రులు స్వరూపచ్యుతీ లేని శ్రీహరి గాథలకు, కీర్తనలకు దూరమైనారు. మీవంటి వారు వారిపై దయ చూపవలెను (వారికీ హరికథాదికములో శిక్షణనీయవలెను).
వేదవేత్త, క్షత్రియుడు, వైశ్యుడు వేదవిహితమైన ఉపనయనసంస్కార ముచే శ్రీహరి పాదములను చేరే యోగ్యతను పొందెదరు. వారు కూడ వేదములో కర్మఫలములను స్తుతించే అర్థవాదముల వెంట పడి కామ్యకర్మరతులైనచో, వ్యామోహితులై మోక్షమునకు దూరమగుదురు.
కర్మను చేస్తూనే కర్మబంధమునుండి తప్పించుకునే నేర్పు కామ్యకర్మరతులకు ఉండదు. వారు అవడానికి మూర్ఖులే అయినా, తాము పండితులమనీ తలపోయుదురు. తేనెవంటి అర్థవాదవాక్యములు (కర్మచే స్వర్గాదికము లభించును ఇత్యాది) వారి మనస్సులో తహతహను కలిగించి వ్యామోహితులను చేయును. స్వర్గములో భోగములను గురించి వారు ప్రీతికరములైన వాక్యములను పలుకుచుందురు.
రజోగుణప్రధానులగు వ్యక్తులు చేసే సంకల్పములలో హింస, కామనలు అధికముగా నుండును. వారు పాము వలే పగబట్టి కోపిష్టులుగా నుందురు. పోరు గర్విష్ఠులై డాంబీకమును ప్రదర్శించెదరు, అట్టి పాపులు శ్రీహరియొక్క ప్రేమీ భక్తులను పరిహసించెదరు.
పోరు యువతుల వెంట తిరిగేదరే గాని, మహాత్ముల వెంట కాదు. వారికి ఇల్లు ఇంద్రియభోగములకు స్థానమే గాని, ఆతిథ్యాది ధర్మములకు కాదు. వారు పరస్పరము కామనలగురించి ప్రసంగించెదరే గాని, ధర్మజ్ఞానముల గురించి కాదు. వారికి యజ్ఞముల అనుష్టానము గురించి తెలియకున్నా యజ్ఞములను చేసెదరు. ఆ యజ్ఞములలో అన్నదానము, విధిపూర్వకమైన కర్మానుష్ఠానము, సరియైన దక్షిణలు ఉండవు. పోరు కేవలము యజ్ఞముల పేరుతో పశువులను వధించెదరు.
సంపద, అధికారము, కులీనత, చదువు, దానము, రూపము, బలము, కర్మానుష్ఠానము అనువాటిచే దుష్టులు గర్వమును కలిగియుందురు. వారు వివేకబుద్దిని కోల్పోయి, శ్రీహరికి ప్రేమీ భక్తు లైన సజ్జనులను మాత్రమే గాక, సర్వాంతర్యామియగు శ్రీహరిని కూడ అవమానించెదరు.
వేదములచే గానము చేయబడే శ్రీహరి సకలప్రాణుల దేహములలో ఆకాశము వలె సర్వకాలములలో ప్రియతమమైన ఆత్మ రూపముగా నిలిచి యున్నాడు. మూర్ఖులు ఆ అంతర్యామిలీ గురించి శ్రవణము చేయకుండా తిరస్కరించి, కోరికలను తీర్చుకోనుటయే వేదముల తాత్పర్యమని వక్కాణించెదరు.
లోకములో ప్రాణులకు సంభోగము, మాంసభక్షణము, మద్యపానములను వేదము విధించవలసిన పనిలేదు. ఎందుకంటే, అవి ప్రాణులకు రాగము చేతనే నిత్యప్రాప్తములై యున్నవి. కావుననే, శాస్త్రము ఐటీ విషయములో నియమమును మాత్రమే విధించుచున్నది. వివాహమునందు మాత్రమే సంభోగము, యజ్ఞమునందు మాత్రమే మాంసశేషమును భక్షించుట, సౌత్రామణీ యాగములో సురాగ్రహసందర్భములో మాత్రమే శేషమద్యపానము విహితములు. కాబట్టి, వీటి విషయములో కూడ నివృత్తియే వేదముయొక్క తాత్పర్యము.
ధనమునకు ప్రముఖప్రయోజనము ధర్మమే. ధర్మము వలన ఆత్మయొక్క పరోక్ష జ్ఞానముతో బాటు, ఆత్మసాక్షాత్కారము కూడ కలిగి, గొప్ప శాంతి లభించును. కాని, అజ్ఞానులు అట్టి ధనమును ఇంటిలో భోగములకు వినియోగించెదరు. మొక్కవోని శక్తి గల కాలము దేహమును కబళించి వేయుచుండుటను వారు గాంచరు.
సౌత్రామణి యాగములో మద్యమును ఆఘ్రాణించుట మాత్రమే (త్రాగు ట కాదు) విధించబడెను. పశుయాగములోనైనా పశువును స్పృశించుటయే గాని, మాంసము కొరకై వధించుట విహితము కాదు. అదే విధముగా, సంభోగము సంతానము కొరకే గాని, ఇంద్రియసుఖము కొరకు కాదు. అర్థవాదములచే ఆకర్షితులైన కర్మఠులీ విశుద్ధమగు స్వధర్మము నెరుగరు.
ఈ విశుద్దమగు స్వధర్మమునేరుంగని అయోగ్యులు గర్వముతో తామే సత్పురుషులమని తలపోయుదురు. వారు తమను నమ్మిన పశువులను హింసించెదరు. అవి మరణించి పరలోకములో వీరిని చంపి తినును.
అంతర్యామియగు శ్రీహరియే నా దేహమునందు, సకలప్రొణిదేహములయందు ఆత్మరూపముగా నున్నాడు. ఇతరులను ద్వేషించువారు ఆ శ్రీహరినే ద్వేషించుచున్నారు. వారు శవమువంటి ఈ దేహమునందు, దేహమును బట్టి వచ్చే బంధువర్గమునందు రాగమును కలిగియుందురు. అట్టివారు అధోలోకములను పొందెదరు.
కొందరు మూర్ఖులైతే కారు గాని, తత్త్వజ్ఞానమును కూడ పొందలేదు. ఈ అంతరావస్థలో ఉన్న వారు ధర్మార్థకామములకు మాత్రమే కట్టుబడి, దేహాదులు క్షణికములని తెలియలేక, తమకు తామే హానిని చేయుదురు.
అజ్ఞానమే జ్ఞానమని విర్రవీగుతూ అశాంతిగా ఉండే వీరు తమను తామే హింసించుకోనేదరు. వీరికి కృతార్థత ఉండదు. వీరి కోరికలను కాలము ధ్వర్ణము చేయును. వీరు నిశ్చయముగా ఇడుముల పాలగుదురు.
వాసుదేవుని యెడల పెడ మోము గల జనులకు తాము చాల కష్టపడి సంపాదించుకున్న ఇల్లు, సంతానము, బంధువులు, సంపదలు అనువాటిని విడిచి పెట్టుట సుతరాము సమ్మతము కాదు. అయినా, వారు వాటిని కోల్పోయి నరకము (దుఃఖము) లో పడెదరు.
రాజోవాచ ।
నిమి మహారాజు ప్రశ్నించెను - ఆ భగవానుడు ఏ కాలములో ఏ రంగు కలిగియుండును? మానవులు ఏ ఆకారము గల భగవానుని ఏ పేరుతో, ఏ విధివిధానముతో అర్చించెదరు? ఈ విషయములను మాకు చెప్పడు.
కరభాజన ఉవాచ ।
కరభాజనుడిట్లు పలికెను --- కృతవ్రేతాద్వాపరకలియుగములలో జనులు అనేకములైన రంగులు, పేర్లు, ఆకారములు గల శ్రీహరిని పలు రకముల విధానములతో ఆరాధించెదరు.
కృష్ణమృగచర్మము, యజ్ఞోపవీతము, మాలలను ధరించి, దండకమం డలములను పట్టుకొని, నార బట్టలను దాల్చిన జటాధారియగు తెల్లని శ్రీహరిని శుక్లుడనే పేరుతో జనులు కృతయుగములో ఆరాధించెదరు.
ఆ కృతయుగములో జనులు శాంతులు, వైరము లేనివారు, ఉపకారస్వభావులు, సమదర్శులు. వారు శ్రీహరి భగవానుని తపస్సు, మనోనిగ్రహము, ఇంద్రియనిగ్రహములచే ఆరాధించెదరు.
వారాయనను హంసుడు (అజ్ఞానమును పోగొట్టువాడు), సుపర్ణుడు (సుందరమైన రూపము గలవాడు), వైకుంఠుడు (జడత్వము లేనివాడు), ధర్ముడు, యోగేశ్వరుడు (యోగులకు పాలకుడు), మనువు, ఈశ్వరుడు (అంతర్యామి), పురుషుడు (పూర్ణుడు), అవ్యక్తుడు (ఇంద్రియగోచరము కానివాడు), పరమాత్మ (అంతరతమమగు ఆత్మ) అనే పేర్లతో కీర్తించేదరు.
త్రేతాయుగమునందీ శ్రీహరి ఎర్రని రంగుతో, నాలుగు చేతులతో, మూడు పేటల మొలత్రాడుతో, బంగరు జుట్టుతో ప్రకాశించును. సుక్కు, స్రువము మొదలైన హోమసాధనములే చిహ్నముగా గల ఆయన యజ్ఞస్వరూపమును ఋగ్యజుస్సామవేదములు ప్రతిపాదించును.
ఆ త్రేతాయుగమునందు జనులు ధర్మిష్ఠులుగను, వేదవేత్తలుగను ఉందురు. వారు సకల దేవతాస్వరూపుడగు ఆ శ్రీహరి భగవానుని వేదవిద్యచే, యజ్ఞములతో ఆరాధించెదరు.
విష్ణువు (సర్వవ్యాపకుడు), యజ్ఞుడు (యజ్ఞరూపుడు, పూజనీయుడు), పృశ్నిగర్భుడు (పృశ్నీయొక్క పుత్రుడు), సర్వదేవుడు (సకల దేవతాస్వరూ పుడు), ఉరుక్రముడు ( పెద్ద అడుగులు గలవాడు), వృషాకపి (కోరికలను దీర్చి కష్టములను బాపువాడు), జయంతుడు (సర్వోత్కర్షగా నున్నవాడు), ఉరుగాయుడు (గోప్పగా కీర్తించబడువాడు) అనేవి ఆయన పేర్లు.
ద్వాపరయుగమునందు శ్యామలవర్ణము గల శ్రీహరి భగవానుడు పీతాంబరుడై యుండును. శ్రీవత్సమనే పుట్టుమచ్చ, చేతిలో పద్మము మొదలైన చిహ్నములను, కౌస్తుభాది మాణిక్యములను కలిగియుండును.
ఓ రాజా! ఆ ద్వాపరయుగమునందు తత్త్వజ్ఞానమును కోరే మానవులు ఛత్రచామరాది మహారాజచిహ్నములు గల పురుషోత్తముని వేదోక్తతంత్రోక్తప్రకారములతో ఆరాధించెదరు.
ఓ వాసుదేవా! భగవంతుడవగు నీ కొరకు నమస్కారము. ప్రద్యుమ్న (శ్రీకృష్ణుని పుత్రుడు), అనిరుద్ద (మనుమడు), సంకర్షణుల (సోదరుడు) కొరకు నమస్కారము. లేదా, ఆ నామములు గల నాలుగు వ్యూహములకు నమస్కారము. లేదా, సర్వజగన్నివాసుడు, ప్రకాశస్వరూపుడు, తేజస్స్వ రూపుడు, స్వతంత్రుడు, ప్రేమస్వరూపుడై భక్తులను తన వద్దకు ఆకర్షించు వాడు అగు భగవానునకు నమస్కారము.
సకలప్రాణులలో దేశపరిచ్చేదము లేని ఆత్మరూపుడైయున్న పూర్ణ పరబ్రహ్మయే నారాయణ మహర్షి. జగద్రూపముగా ప్రకటమై జగత్తునకు అంతర్యామియైన ఆ పరబ్రహ్మకు నమస్కారము.
ఓ మహారాజా! జనులు ద్వాపరయుగమునందు జగన్నాథుడగు శ్రీహరిని ఈ (పైన చెప్పిన) విధముగా స్తుతించెదరు. కలియుగములో జనులాయనను అనేకములగు తంత్రోక్తవిధానములతో ఆరాధించెదరు. ఆ వివరములను వినుము.
వివేకవంతులు నల్లని రంగుతో ప్రకాశించే శ్రీకృష్ణుని నామసంకీర్తన ప్రధానమైన యజ్ఞములతో ఆరాధించెదరు. ఆయన హృదయము మొదలైన అంగములతో, కౌస్తుభము మొదలైన ఉపాంగములతో, సుదర్శనము మొదలైన ఆయుధములతో, అసుచరులతో ప్రకాశించును.
ప్రణమిల్లువారిని పాలించే ఓ పురుషోత్తమా! పద్మమువంటి నీ పాదము ఎల్లవేళలా ధ్యానము చేయదగ్గది. గంగానదికి మూలమైన నీ పాదము శరణు వేడినవారి పరాభవములను నివారించును. అభీష్టములనిచ్చే నీ పాదమును శివుడు, బ్రహ్మదేవుడు స్తుతించెదరు. భక్తుల దుఃఖమును పోగొట్టి, సంసారసముద్రమునకు నావయగు నీ పాదానికి నమస్కారము.
ఓ పురుషోత్తమా! శ్రీరాముడవై అవతరించిన నీవు ధర్మనిష్ఠుడవై తండ్రి మాటను నిలబెట్టుటకై రాజ్యసంపదను విడిచి పెట్టి అరణ్యమునకు వెళ్లితివి. దేవతలచే కోరబడే ఆ రాజ్యసంపదను విడిచి పెట్టుట సుతరాము కష్టము. ప్రియురాలగు సీత కోరికపై మాయ లేడి వెంట పరుగెత్తితివి. పద్మమువంటి నీ పాదమునకు నమస్కారము.
ఓ రాజా! వివిధయుగములయందుండే మానవులీ విధముగా శ్రీహరి భగవేనుని ఆయా యుగములకు తగియున్న నామరూపములతో ఆరాధించెదరు. ఆయన శ్రేయస్సులను ఇచ్చే ప్రభుడు.
గుణమును తెలిసి సారమును పట్టుకొనే వివేకులు కలియుగమును ప్రశంసించెదరు. ఎందుకంటే, కలియుగములో సంకీర్తన చేతనే సకలయుగములలో పొందబడే ప్రయోజనములు సిద్ధించును.
ఎందుకంటే, ఈ సంసారములో తిరుగాడే ప్రాణులకు ఈ నామసంకీర్తనముకంటె గొప్ప లాభము లేదు. దాని వలన సంసారము నశించి, సర్వోత్తమమైన శాంతి (మోక్షము) లభించును.
ఓ మహారాజా! కృతవ్రేతాద్వాపరయుగములయందలి జనులు కలియుగమునందు పుట్టాలని కోరెదరు. ఎందుకంటే, కలియుగములో అక్కడక్కడ నారాయణుడే పరమగమ్యముగా గల భక్తులు పుట్టెదరు. ద్రవిడదేశమునందైతే అట్టి భక్తులు చాల మంది పుట్టెదరు.
ద్రవిడదేశమునందు తామ్రపర్ణి, కృతమాల, పయస్విని, పరమపవిత్రమైన కావేరి, ప్రతీచి, మహానది అనే నదులు గలవు.
ఓ మహారాజా! ఏ మానవులైతే ఆ నదుల నీటిని త్రావెదరో, వారికి తరుచుగా అంతఃకరణము శుద్ధమై వాసుదేవునియందు భక్తి కలుగును.
ఓ రాజా! సాధారణముగా గృహస్థు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ప్రాణులకు, అతిథులకు, కుటుంబీకులకు ఋణపడి వారికి సేవ చేయుచుండును. కాని, ఎవడైతే భేదబుద్దిని, అహంకారమును వీడనాడి శరణు వేడదగిన శ్రీహరిని సర్వవిధములుగా శరణాగతి చేయునో, అట్టివాడు సకలములైన ఋణములనుండి విముక్తుడగును. శ్రీహరి మోక్ష ప్రదాత.
భక్తుడు ఇతరమునందలి ప్రేమను విడిచి పెట్టి పరమేశ్వరుని పాదముల మూలమును సేవించును. అట్టివాడు శ్రీహరికి ప్రియుడు. ఆతనికి ఏదో విధముగా నిషిద్ధకర్మ ప్రాప్తమైననూ, హృదయమునందు సన్నిహితుడై ఉండే శ్రీహరి దానినంతనూ నశింపజేయును.
నారద ఉవాచ ।
నారద మహర్షి ఇట్లు పలికెను -- ఈ విధముగా మిథిలాన రేశుడగు నిమి భగవద్భక్తికి చెందిన ధర్మములను విని ప్రీతి జెందెను. తరువాత ఆయన ఋత్విక్కులతో గూడి జయంతీపుత్రులగు ఆ మహర్షులను పూజించెను.
పూజ తరువాత జనులందరు చూచుచుండగా ఆ సిద్ధపురుషులు అంతర్ధానమైరి. నిమి మహారాజు ధర్మములననుష్ఠించుచున్నవాడై సర్వోత్తమమైన మోక్షగతిని పొందెను.
గొప్ప భాగ్యవంతుడవగు ఓ వసుదేవా! భగవద్బక్తికి చెందిన ధర్మములను నీవు కూడ నానుండి వింటివి. నీవు సంసారాసక్తిని విడిచి పెట్టి శ్రద్దతో గూడీ వాటిని అనుష్ఠిస్తూ పరమపదమును పొందగలవు.
మీ యిద్దరు దంపతుల (దేవకీవసుదేవుల) కీర్తిచే జగత్తు నిండిపోయినది సుమా! ఎందుకంటే, సర్వాంతర్యామియగు శ్రీహరి భగవానుడు మీ యిద్దరికీ పుత్రుడై అవతరించినాడు.
మీరిద్దరు శ్రీకృష్ణునిపై గాఢమైన పుత్రప్రేమను కలిగియుండిరి. ఆయనను చూచుట, కౌగిలించుట, కబుర్లాడుట, ఆయనను పరుండబెట్టుట, కూర్చుండ బెట్టుట, ఆహారమును తినిపించుట అనువాటిచే మీ అంతఃకరణము పావనమాయెను.
శిశుపాలుడు, పౌండ్రకుడు, శాల్వుడు, కంసుడు మొదలగు రోజులు శ్రీకృష్ణునిపై వైరమును పూనిరి. వారు పరున్నా, కూర్చున్నా, భోజనం చేస్తున్నా శ్రీకృష్ణుని నడక, లీలలు, చూపులు మొదలగువాటినే ధ్యానించుటచే, వారి మనస్సు భగవదకారమును పొందెడిది. దానిచే వారు ఆయనలో ఐక్య మైనారు. ప్రేమతో ఆయనను ధ్యానించువారు ఆయనను పొందెదరని వేరుగా చెప్పవలయునా?
శ్రీకృష్ణుడు సర్వమునకు ఆత్మ, అంతర్యామి, అవినాశియగు పరబ్రహ్మ. ఆయన ఈశ్వరభావమును దాచి పెట్టి, తన మాయచే మనుష్య రూపముతోనున్నాడు. ఆయన పై మీరు కొడుకు అనే బుద్ధిని చేయవద్దు.
భూమికి బరువైన రాక్షసరాజులను సంహరించి, సత్పురుషులను కాపొడి, భక్తజనులకు ఆనందమును కలిగించుటకై శ్రీకృష్ణుడు లోకములో అవతరించెను. ఆయన కీర్తి లోకములో విస్తరించుచున్నది.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుకమహర్షి పలికెను --- గొప్ప భాగ్యవంతుడగు వసుదేవుడు, గొప్ప భాగ్యవతియగు దేవకి కూడ ఈ విషయమును విని చాల ఆశ్చర్యమును పొందిరి. వారు ఆత్మతత్త్వమునకు చెందిన అజ్ఞానమును విడిచి పెట్టిరి.
ఎవడైతే ఏకాగ్రమగు చిత్తముతో పవిత్రమగు ఈ వృత్తాంతమును ధారణ చేయునో, అట్టివాడు ఈ లోకములో ఈ జన్మలో పాపములను కడిగి వేసి పరబ్రహ్మ స్వరూపుడగును.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో భక్తిహీనుల గతిని, భగవానుని పూజావిధిని వర్ణించే ఐదవ అధ్యాయము ముగిసినది (5).
Summary of chapter 5 of the Bhāgavata Mahā Purana is as follows:
The sixth Yogendra, Āvirhotra, explained the subtle nature of Vaidika Karma-kāṇḍa, clarifying that scriptural injunctions prescribing fruitive sacrifices are intended not for ultimate enjoyment, but to gradually detach human beings from material lust through regulated discipline. The seventh Yogendra, Karabhājana, answered King Nimi's query regarding the specific forms, complexions, and methods of worshiping Bhagavān in the four Yugas. Karabhājana revealed that in Satya Yuga Bhagavān is worshiped as white-complexioned through meditation; in Tretā Yuga as red-complexioned through Vaidika sacrifices; in Dvāpara Yuga as dark blue-complexioned (*Kṛshṇa*) through Deity worship; and in Kali Yuga as golden-complexioned through the congregational chanting of the holy names (*Nāma-saṅkīrtana*), praising Kali Yuga as the most blessed age because supreme spiritual perfection is achieved effortlessly through divine sound vibration.