భాగవత మహా పురాణము
18 - వానప్రస్థ సన్న్యాస ధర్మములను నిరూపణ
తలపై జుట్టు, రోమములు, మీసములు, గెడ్డము అనే శరీరమాలిన్యము లను పట్టించుకోరాదు. దంతముల సౌందర్యము కూడ అపేక్షితము కాదు. మూడు పూటలా దేహమును నీటిలో ముంచవలె. నేల పై పరుండవలెను.
వేసవిలో చుట్టూ నాలుగు అగ్నులు, పైన సూర్యుడనే అగ్ని, వెరసి అయిదు అగ్నుల మధ్యలో దేహమును తపింపజేస్తూ తపస్సు చేయ వలెను. వర్షకాలములో వర్షధారలను సహించవలెను. చలికాలములో మెడ వరకు నీటిలో మునిగి, ఈ విధముగా ఉంటూ తపస్సు చేయవలెను.
వేదవేత్తలు వానప్రస్థునకు గృహస్థునితో సమానముగా అగ్నిహోత్రము, దర్శపూర్ణమాసలు, చాతుర్మాస్యలు అను కర్మలను విధించిరి.
ఈ విధముగా తపస్సుచే శుష్కించిన వానప్రస్థుడు బయటకు కనబడే నాడులతో వ్యాపించబడియుండును. ఆయన మహర్లోకమును, అక్కడనుండి నన్ను పొందును. నేను జ్ఞానమే స్వరూపముగా గలవాడను.
కష్టసాధ్యమైన ఈ గొప్ప తపస్సు మోక్షసాధనము. దీనిని మిక్కిలి అల్పమైన సంసారభోగము కొరకు ఎవడు వినియోగించునో, వానికంటే మూర్ఖుడు మరియొకడు ఎవడు గలడు? (ఎవ్వడూ లేడు).
.
కామనలు లేనివాడు సన్న్యాసవిధినతిక్రమించకుండా నన్ను ఆరాధించి సర్వస్వమును ఋత్విక్కునకిచ్చి, అగ్నులను తన ప్రాణమునందారోపించుకొని (ప్రాజాపత్యేష్టిని చేసి) సన్న్యసించవలెను.
వేదవేత్త సన్న్యసించునప్పుడు, తమను దాటివేసి పరమపదమును పొందుననే భావముతో, దేవతలు వానికి భార్య, పుత్రుడు మొదలగు రూపములతో నిశ్చయముగా విఘ్నములను కలిగించెదరు.
మననశీలుడగు సన్న్యా సి వస్త్రమును ధరిస్తే, అది కేవలము కౌపీనమును కప్పేది నడుమునకు వస్త్రము మాత్రమే కావలెను. అంతకు మించి వస్త్రము వద్దు. ఆపద వచ్చినప్పుడు తప్పించి, విడిచి పెట్టిన సంపదలోనుండి దండకమండలములను తప్ప ఇతరమును తీసుకోరాదు.
భిక్షాటనము చేయవలెను, లబేన లభించిన, తావతా - అంత మాత్రముతో, తు ష్యేత్ - సంతోషించవలెను.
సన్న్యాసి గరించదగినవారిని విడిచి నాలుగు వర్ణముల వారికి చెందిన ఏడు ఇళ్లలో భిక్షను స్వీకరించవలెను. ఆ గృహములు పూర్వనిర్ధారిత ములు కారాదు. లభించినదానితో ఆతడు సంతోషించవలేను.
సన్న్యాసి గ్రామము బయట జలాశయమునకు వెళ్లి ఆచమనము చేసి మౌనముగా తీసుకువచ్చిన ఆహారమును ప్రోక్షణచే పవిత్రము చేసి తినవలెను. ఎవరైనా యాచిస్తే వారికి ఇచ్చి మిగిలినదంతా తినవలెను.
సన్న్యాసి ఒంటరిగా ఎవరితోనైననూ సంగము పెట్టుకోకుండా భూలోకములో సంచరించవలెను. జితేంద్రియుడగు ఆతనికి విహారము తనయందే, సంతోషము తనయందే (ఇతర పేక్ష లేదు). ధీరుడగు ఆతడు అంతటా ఈశ్వరుని దర్శించును.
కావున, మననశీలుడగు యతి నాయందలి భక్తితో ఐదు జ్ఞానేంద్రియములను, మనస్సును నియంత్రించవలెను. ఆతడు అల్పమగు కామనలనుండి విరక్తుడై ఆత్మస్వరూపమునందలి మహానందమును పొందీ సంచరించవలేను.
సన్న్యా సీ భిక్ష కొరకై నగరములను, గ్రామములను, గొల్లపల్లెలను, యాత్రికుల గుంపులను ప్రవేశిస్తూ, పుణ్య క్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యపర్వతములు, పుణ్యవనములు, పవిత్రములగు ఆశ్రమములలో కూడియున్న (భరత) భూలోకములో సంచరించవలెను.
పొలములో పడిన గింజలను ఏరి తెచ్చి వండిన అన్నము అంతఃకరణశుద్ధిని కలిగించును. అట్టి అన్నమును తినుట వలన వ్యామోహము తొలగి శీఘ్రముగా మోక్షము కలుగును. కావున, సన్న్యాసి వానప్రస్థుల ఆశ్రమస్థానములో మరల మరల భిక్షను చేయవలెను.
చిహ్నములతో కూడిన, ఆశ్రమాన్ - ఆశ్రమములను, త్యక్త్వా - విడిచి పెట్టి, చరేత్ - సంచరించవలెను.
ఆత్మస్వరూపనిష్ఠుడైన విరక్తుడు, నిష్కాముడైన నా భక్తుడు విధినిషేధములకు అతీతులు. కావున, అట్టివారు ఆశ్రమములను, వాటి చిహ్నములను విడిచి పెట్టి సంచరించవచ్చును.
సన్న్యా సి వివేకియే అయినా పిల్లవాడు వలె క్రీడించవలెను (క్రీడించును), నేర్పరియే అయినా మందబుద్దివలె సంచరించును, పండితుడే అయినా పిచ్చివాడు వలే పలుకును, వేదవేత్తయే అయినా ఎద్దువలె నియతము కాని ఆచరణము కలిగియుండును.
సన్న్యాసి వేదములో కామ్యకర్మలను స్తుతించే అర్థవాదములయందు ప్రీతి గలవాడు, వేదవిరుద్దమగు ఆచరణము గలవాడు, కేవలతర్కనిష్ఠుడు కాకూడదు. నిషయోజనమగు వాదవివాదములలో సన్న్యాసి ఏ పక్షమునైననూ బలపరచకూడదు.
సన్న్యాసి ధైర్యము గలవాడై ఒక కాలములో భిక్ష దొరకనప్పుడు విషాదమును చెందరాదు, మరియొక కాలములో దొరికినప్పుడు హర్షించరాదు. భిక్ష దొరుకుట, దొరకకుండుట రెండు దైవాధీనములే.
సన్న్యాసి ఆహారము కొరకు ప్రయత్నమును చేయవలెను. ఎందుకంటే, సన్న్యా సి ప్రాణములను నిలబెట్టుకొని, ఆ శక్తితో ఆత్మవిచారము చేసినచో, ఆత్మజ్ఞానమును పొంది విముక్తుడగును.
భోగముల ఉత్తర (తరువాతి) ఫలము దుఃఖమే. వాటియందు వైరాగ్యము కలిగిన బుద్ధిశాలి ఇంకనూ నన్ను పొందే ఉపాయమును నేర్వనిచో గురువు వద్దకు వెళ్లవలెను. ఆ గురువు మననశీలుడు (శ్రోత్రియుడు) కావలెను.
పరబ్రహ్మసాక్షాత్కారము వరకు భక్తుడు గురురూపుడనగు నన్ను శ్రద్ధతో, ఆదరముతో సేవించవలెను. గురువులో దోషములను వెదుకరాదు.
భార్యతో కలిసి భోగాలననుభవించే గృహస్థునకు కూడ బ్రహ్మచర్యము (భార్య తప్ప మరో స్త్రీని చూడకుండుట), తపస్సు, శౌచము, సంతోషము, ప్రాణుల యెడల మైత్రి ధర్మములు. ఈశ్వరుడనగు నన్ను ఉపాసించుట అన్ని ఆశ్రమములవారికి ధర్మము.
ఈ విధముగా ఎవడైతే నిష్కామముగా నిత్యము స్వధర్మముననుష్ఠించి నన్ను సేవించునో, ఆతడు సకలప్రాణులయందు నన్నే దర్శించి, తొందరలో నాయందు దృఢమైన (జ్ఞానరూపమైన) భక్తిని పొందును.
ఓ ఉద్ధవా! నీవు సజ్జనుడవు. స్వధర్మముతో కూడియున్న భక్తుడు పరబ్రహ్మనగు నన్ను ఏ విధముగా పొందును? అని నీవు ప్రశ్న వేసితివి. ఈ విధముగా నేను నీ ప్రశ్నకు సమాధానమును చెప్పితిని.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో
వానప్రస్థ సన్న్యాస ధర్మములను నిరూపించే
పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది .
Summary of chapter 18 of the Bhāgavata Mahā Purana is as follows:
Śrī Kṛshṇa continued His exposition of Varṇāśrama-dharma by detailing the duties of a retired householder (*Vānaprastha*) and a fully renounced mendicant (*Sannyāsī*). He described the severe austerities, forest living, and scriptural study required of a Vānaprastha. Turning to the Sannyāsa order, Kṛshṇa explained that a true renunciant must abandon all material possessions, family ties, and desire for prestige, wandering the earth with a peaceful mind, equal vision toward all beings, and total absorption in the Supreme. He outlined the advanced behavioral characteristics of a liberated *Paramahaṁsa*, noting that an exalted devotee may transcend outward formal robes while remaining internally absorbed in unalloyed devotion to Śrī Kṛshṇa.