భాగవత మహా పురాణము
14 - భక్తియోగము - ధ్యాన విధి
ఉద్ధవ ఉవాచ ।
ఉద్ధవుడిట్లు పలికెను --- ఓ శ్రీకృష్ణా! వేదవేత్తలు శ్రేయస్సుయొక్క సాధనములను అనేకము చెప్పుచున్నారు. వాటిలో సందర్భానుసారముగా అన్నీ ముఖ్యమేనా? లేక ఒక్కటియే ముఖ్యమా?
ఓ ప్రభూ! నీవు ఇతరసాధనముల అపేక్ష లేని నిష్కామభక్తియోగమును ఉపదేశించితివి. దీనిచే మనస్సు సకలములైన ప్రాపంచిక విషయములయందు ఆసక్తిని విడిచి పెట్టి నీయందు లగ్నమగును.
శ్రీభగవానువాచ ।
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- వేదమనే పేరు గల ఈ ఉపదేశము కాలప్రభావముచే ప్రళయమునందు అదృశ్యమైనది. సృష్టికి ఆదియందు నేను దీనిని బ్రహ్మదేవునకు ఉపదేశించితిని. దీనియందలి ధర్మము నాయందు చిత్తమును లగ్నము చేయుటయే.
ఆ బ్రహ్మదేవుడు ఆ ధర్మమును పెద్ద కొడుకైన స్వాయంభువ మనువునకు ఉపదేశించెను. ఆయననుండి ఆ ఉపదేశమును భృగువు, మరీచి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, అత్రి, క్రతువు అనే ప్రజాపతులైన ఏడురు మహర్షులు స్వీకరించిరి.
తండ్రులైన ఆ ప్రజాపతులనుండి వారి పుత్రులైన దేవతలు, దానవులు, యక్షులు, మానవులు, సిద్దులు, గంధర్వులు, విద్యాధరులు, చారణులు, దేవతలను పోలిన పాశ్చాత్యులు, కిన్నరులు, నాగులు, రాక్షసులు, కింపురుషులు, పితృదేవతలు మొదలగువారు ఆ ఉపదేశమును పొందిరి.
వారి వారి స్వభావములు సత్త్వరజస్తమోగుణములనుండి పుట్టేవి గనుక పలు రకములుగా నుండును. ఆ స్వభావములను బట్టియే ప్రాణులు, వారి బుద్దులు పలు రకములుగానున్నవి. ఎవరి స్వభావమునకు తగ్గట్లుగా వారు వేదమును ప్రవచించుటయు ప్రసిద్ధమే గదా!
ఈ విధముగా స్వభావములు పలు రకములుగా నుండుటచే మానవుల బుద్దులు భిన్నముగా నున్నవి. కొందరు ఉపదేశపరంపరను బట్టి భిన్నమగు సాధనలను స్వీకరించుచుండగా, మరికొందరు వేదవిరుద్దమగు తలంపులను కలిగి ఉన్నారు.
ఓ పురుషశ్రేష్టా! మానవుల బుద్ధులు నా మాయచే మోహితములైనవి. కావుననే, మానవులు తమ తమ కర్మసంస్కారములకు అభిరుచులకు తగ్గట్లుగా, శ్రేయస్సును గురించి పరిపరి విధములుగా చెప్పుచున్నారు.
ధర్మమే శ్రేయస్సాధనమని మీమాంసకులు చెప్పగా, కీర్తియని ఆలం కారికులు, కామమేనని వాత్స్యా యనుడు చెప్పిరి. సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, యమములు (అహింసా-సత్య-అస్తేయ బ్రహ్మచర్య-అపరిగ్రహములు), నియమములు (శౌచ-సంతోష-తపస్స్వాధ్యాయ-ఈశ్వరప్రణిధానములు) శ్రేయస్సని యోగులు చెప్పగా, సంపదయే పురుషార్థమని కామందకాది రాజనీతిజ్ఞుల అభిప్రాయము. వేదమును ప్రక్కన బెట్టి భోగములననుభవించుటయే మేలని చార్వాకులు, తపస్సు, దానము, వ్రతములు శ్రేయస్సాధనములని పౌరాణికులు చెప్పిరి.
ధర్మము మొదలైన ఈ సాధనముల ఫలములు ఒక కాలములో ఆరంభమై ఇంకో కాలములో సమాప్తమయ్యేవి మాత్రమే. కర్మచే సంపాదించబడే ఈ ఫలములు దుఃఖమునందు, మోహమునందు పర్యవసించును. అల్పమైన ఆనందమునిచ్చే ఈ సాధనములు దుఃఖముచే వ్యాపించబడి యున్నవి.
ఓ ఆర్యా! సర్వమునందు అపేక్ష లేకుండా నాయందు మనస్సును అర్పించినవానికి ఆత్మరూపుడనగు నాచే బ్రహ్మానందము కలుగును. ఇంద్రియభోగములయందు తగుల్కొన్న మనస్సు గలవానికి అది యెక్కడినుండి వచ్చును? (రాదు).
మనస్సును, ఇంద్రియములను జయించి, పరిగ్రహము లేకుండా, సుఖదుఃఖాది ద్వంద్వములలో సమచిత్తము కలిగి, నన్ను ధ్యానించుటచేతనే సంతోషముతో నిండిన మనస్సు గలవానికి దిక్కులు సుఖముతో నిండియుండును (ఎక్కడైనా ఆనందమే).
న పారమేష్ఠ్యం న మ హేంద్రధిష్ణ్యం
నాయందు సమర్పించబడిన మనస్సు గలవాడు నన్ను తప్ప, బ్రహ్మ పదవిని గాని, దేవేంద్రుని పదవిని గాని, ప్రపంచరాజ్యమును గాని, రసా తలముయొక్క ఆధిపత్యమును గాని, ఆణిమ మొదలైన యోగ సిద్దులను గాని, పునర్జన్మ లేని మోక్షమును గాని, ఇతరమును దేనినైననూ కోరడు.
నాకు నీవు (భక్తుడు)_ ఎంతటి ప్రియతముడవో, అంతటి ప్రీతి స్వయంభువుడగు బ్రహ్మదేవుని (పుత్రుడు) పై, నా స్వరూపమైన శంకరునిపై, అన్న బలరామునిపై, భార్య లక్ష్మీదేవిపై, నాపై కూడ లేదు.
భోగములయందు - అ పేక్ష, ప్రాణుల యెడల వైరము లేని భక్తుడు మననశీలుడు, శాంతస్వభావుడు అయి ఉండును. ఆతడు సర్వమునందు సమముగా ఉన్న ఈశ్వరుని దర్శించును. ఆతని పాదధూళికణములచే పవిత్రుడను కావాలని నేను ఆతని వెనుక నడచెదను.
పరిగ్రహము లేకుండా నాయందలి ప్రేమతో నిండిన మనస్సుతో శాంత ముగా ఉండే మహాత్ములు సకలప్రాణులయందు దయను కలిగియుందు రు. కామనలు వారి బుద్ధిని స్పృశించవు. వారు ఇతర పేక్ష లేకుండా సేవించే నా స్వరూపమైన ఆనందము ఇతరులకు తెలి సేది కాదు.
ఒకచో జితేంద్రియుడు కాకపోవుటచే నా భక్తుని భోగములాకర్షించవచ్చును. కాని, తరచుగా ఆతడు వర్ధిల్లుతూ సమర్థ మైన భక్తి కారణముగా భోగ్యవిషయములచే పరాభూతుడు కాడు.
ఉద్దవా! బాగా ప్రజ్వరిల్లిన జ్వాలలు గల అగ్ని కట్టెలను బూడిదగా చేయును. అదే తీరున, నాపై భక్తి పాపములను పూర్తిగా నశింపజేయును.
ఓ ఉద్దవా! నాపై వర్ధిల్లిన భక్తి నన్నే విధముగా వశము చేయునో ఆ విధముగా, యోగము, ప్రకృతిపురుష వివేకము, వేదవిహితకర్మాను ఫానము, వేదాధ్యయనము, తపస్సు, సన్న్యాసము కూడ చేయలేవు.
సత్పురుషులకు ప్రియమగు ఆత్మయైన నన్ను శ్రద్ద వలన కలిగే అనన్యభక్తి మాత్రమే వశము చేయగలదు. నాయందలి స్థిరమైన భక్తి పశుమాంసభక్షకులను కూడ జన్మదోషమునుండి పావనము చేయును.
సత్యము, దయలతో కూడిన ధర్మమైనా, తపస్సుతో కూడిన శాస్త్రాధ్యయనమైనా, నా భక్తి లేని అంతఃకరణమును బాగుగా పవిత్రము చేయజాలదు. ఇది నిశ్చయము.
భక్తిచే మనస్సు కరిగి, గగుర్పాటు కలిగి, ఆనందముతో కన్నీరు ప్రవ హించును. ఇదేదీ లేకుండా అంతఃకరణము శుద్ధమగుట యెట్లు? (కాదు).
నా భక్తి గలవాని చిత్తము కరిగి వాక్కు గద్గదమగును. ఆతడు పలుమార్లు ఏడ్చును; ఒకప్పుడు నవ్వును. ఆతడు బిడియపడకుండా బిగ్గరగా గానము చేసి నాట్యమాడును. అట్టి నా భక్తునిచే లోకము పావనమగును.
అగ్నిలో పుటము పెట్టిన బంగారము మాలిన్యమును విడిచి తనదైన ప్రకాశమును పొందును. అదే విధముగా, జీవుడు కూడ నిష్కామభక్తి యోగముచే కర్మవాసనను విడనాడి, వెంటనే నన్ను పొందును.
ఎంత ఎక్కువగా సాధకుడు నా పవిత్రగాథలను విని కీర్తించుటచే అంతః కరణమును శుద్దము చేసుకోనునో, అంత సరళముగా - అంజనము (మందు) వేసిన కన్నువలె -- సూక్ష్మమైన ఆత్మతత్త్వమును తెలియును.
విషయభోగముల గురించి ధ్యానించువాని చిత్తము వాటియందు గట్టిగా తగుల్కొనును. నన్నే ధ్యానించుట అభ్యసించినచో, చిత్తము నాయందే తల్లీనమగును.
ప్రాపంచికవిషయములు కలవలె, మనస్సుయొక్క విలాసలు వలె అసత్యములు. కావున, వాటి చింతనమును విడిచి పెట్టుము. నాయందలి భక్తిచే మనస్సును శుద్ధము చేసి, నాయందు ఏకాగ్రము చేయుము.
సాధకుడు ధైర్యము కలిగి సోమర్దనము లేకుండనుండవలెను. ఆతడు యువతుల సంగమును, యువతీప్రియుల సంగమును దూరము పెట్టవలెను. ఆతడు భయ హేతువులు లేని నిర్జనస్థానమునందు ఆసనము వేసి కూర్చుని నన్ను ధ్యానించవలెను.
వ్యక్తికి యువతుల సంగము వలన, యువతులతోడి సంగము గలవారి సంగము వలన ఏ విధమైన చిత్త క్లేశము, బంధము కూడ కలుగునో, ఆ విధముగా ఇతరములయందలి ఆసక్తి వలన కలుగదు.
ఉద్ధవ ఉవాచ ।
ఉద్ధవుడిట్లు పలికెను --- పద్మములవంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! నీవు నాకు ధ్యానమును గురించి చెప్పదగుదువు, ఏ విశేషణములతో, ఏ స్వరూపముతో కూడియున్న నిన్ను ధ్యానించవలెను ?
శ్రీభగవానువాచ ।
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- సాధకుడు ఎగుడు దిగుడులు లేని ఆసనముపై సుఖముగా కూర్చుండి దేహమును నిటారుగా నుంచవలెను. చేతులను ఒడిలోనుంచుకొని, చూపును ముక్కు కొనపై నిలుపవలెను.
రేచకములను, రేచకకుంభకపూరకములను చేసి నాడీశోధన చేయవలెను. గాలిని నిండా లోనికి పీల్చుట పూరకము, గాలిని లోపల నిలిపి ఉంచుట అంతఃకుంభకము, గాలిని పూర్తిగా విడిచి పెట్టుట రేచకము, గాలిని బయటనే నిలిపి ఉంచుట బాహ్యకుంభకము.
హృదయమునందు ఘంటానాదము వంటి ఓంకారము తాముడతడు. వలె సూక్ష్మముగా ఆరంభమై విడిచే గాలితో బాటు పైకి రావలెను. మరల ఆ ఓంకారమునందలి మకారమునందు నాదమును స్థిరము చేయవలెను.
ఈ విధముగా సాధకుడు ఓంకారముతో కూడిన ప్రాణాయామమును పదిసార్లు మూడు పూటలా చక్కగా నిశ్చయముగా అభ్యసించినచో, నెలకంటే ముందే ప్రాణమును జయించినవాడగును.
దేహము లోపల హృదయము. పైకి తూడు, క్రిందికి ముఖము గల ముడుచుకున్న పద్మమును పోలియుండును. దానియందు పైకి ముఖము గల వికసించిన పద్మమును ధ్యానించవలేను. ఆ పద్మమునకు ఎనిమిది రేకులు, దుద్దు ఉండును. ఆ దుద్దునందు సూర్యుడు, సూర్యుని లోపల చంద్రుడు, ఆ లోపల అగ్ని ఉన్నట్లుగా ధ్యానించవలెను. అగ్ని మధ్యలో నా యీ (క్రింది) రూపమును ధ్యానించినచో, మంగళములు కలుగును.
శ్రీహరి రూపము పొందికగా, ప్రశాంతముగా, మిక్కిలి అందముగా నుండును. పొడవాటి నాలుగు చేతులు గల ఆయన మోము సుందరముగా నుండును. అందమైన మేడ, సుకుమారమైన. చెక్కిళ్లు గల ఆయన మోముపై చిరునవ్వు రాజిల్లును. అట్టి రూపమును ధ్యానించవలెను.
శ్రీహరి పచ్చని వస్త్రమును దాల్చి, సమానమైన రెండు చెవులకు ప్రకా శించే మకరాకారపు కుండలములను పెట్టుకొనును. మేఘము వలె నల్లని ఆయన వక్షఃస్థలముపై శ్రీ అనే పుట్టుమచ్చను, లక్ష్మీదేవిని దాల్చును.
శంఖము, చక్రము, గద, పద్మము, వనమాలలను అలంకరించుకున్న శ్రీహరి పాదములు నూపురములతో ప్రకాశించును. ఆయన కౌస్తుభమాణిక్యమును ధరించును.
ప్రకాశించే కిరీటము, హస్తాభరణములు, మొలత్రాడు, భుజపురులతో బాగా అలంకరించుకున్న శ్రీహరి సకలావయవములయందు సుందరుడు. మనోహరుడైన ఆయన కన్నులు అనుగ్రహించుటకు సుముఖముగానుండును. సుకుమారుడైన శ్రీహరియొక్క సకలావయవములంయదు మనస్సును నిలిపి ధ్యానించవలెను.
వివేకవంతుడగు సాధకుడు మనస్సులో ఇంద్రియములను వాటియొక్క శబ్దాదివిషయములనుండి వెనుకకు మళ్లించవలెను. ఈ దేహమనే రథమునకు సారథి బుద్ధి. దానితో ఆ మనస్సును అన్ని వైపులనుండి ఆకర్షించి నాయందు స్థిరముగా నీలుపవలెను.
అందమైన చిరునగవు గల ముఖమనే ఒకే అవయవము నందు నిలుపవలెను. మరల ఇతరావయవములను ధ్యానించరాదు.
ఆ ముఖమునందు స్థిరమైన మనస్సును అక్కడనుండి ఆకర్షించి ఆకాశమువంటి ఆత్మ చైతన్యమునందు నిలుపవలేను. ఆ విధముగా నాతో ఐక్యమును చెంది, సాధకుడా పైన దేనినైననూ సంకల్పించరాదు.
ఈ విధముగా ఏకాగ్రమైన మనస్సు గల సాధకుడు ఆత్మరూపుడనగు నన్నే తనయందు దర్శించును. జ్యోతి మహాభూతమగు అగ్నిలో కలిసినట్లుగా, ఆతడు సర్వమునకు ఆత్మయగు నాయందు విలీనుడగును.
యోగి ఈ విధముగా తీవ్రముగా ధ్యానము చేసి మనస్సును ఏకాగ్రము చేయవలెను. ఆతనికి శీఘ్రముగా -- దేహమనే ద్రవ్యమే ఆత్మ, నేను కర్తను, జ్ఞాతృ-జ్ఞేయములు వేరు -- అనే భ్రమలు తొలగిపోవును.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో భక్తియోగధ్యానములను
వర్ణించే పదునాల్గవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 14 of the Bhāgavata Mahā Purana is as follows:
Uddhava inquired why various teachers recommend different paths for spiritual perfection—such as Karma, Jñāna, Yoga, or severe penance—and asked which path is truly supreme. Śrī Kṛshṇa clarified that while various Vaidika paths were revealed according to different human temperaments and material modes, **Bhakti-yoga** (pure devotional service) is the absolute, supreme, and most beloved path. Kṛshṇa declared that a heart purified by devotional love for Him cannot be captivated by material wealth or mystic powers. He then provided Uddhava with precise instructions on the method of meditating upon His divine four-armed form (*Dhyāna-yoga*) within the lotus of the heart.