భాగవత మహా పురాణము
4 - శ్రీహరి అవతారములు
రాజోవాచ ।
నిమి మహారాజు ఇట్లు పలికెను --- శ్రీహరి తన ఇచ్చచే, తనవారైన భక్తుల ఇచ్చచే, అవతరించి ఈ లోకములో అనేకకర్మలను చేసియున్నాడు, ఇంకా చేస్తూ ఉన్నాడు, భవిష్యత్తులో చేయబోతాడు. వాటి గురించి మాకు చెప్పుడు.
ద్రుమిల ఉవాచ ।
ఎవడైతే అనంతుడగు శ్రీహరి యొక్క అనంతగుణములను లెక్కించ బూనునో, ఆతడు పిల్లల వలె మందబుద్ధి. ఏదో విధముగా కొంత కాలానికి భూమియొక్క ధూళికణములను లెక్క పెట్టవచ్చునేమో గాని, సకలశక్తులకు నివాసమగు శ్రీహరి గుణములను లెక్కించుట సంభవము కాదు.
నారాయణుడు లీల కొరకై జగత్తును సృష్టించిన దేవుడు. ఆయన పంచభూతములను సృష్టించి, వాటితో తన బ్రహ్మాండశరీరమును రచించి, దానిలో తన అంశ (అంతర్యామి) చే ప్రవేశించినాడు. కావుననే, ఆయనకు పురుషుడు (విరాట్పురమునందుండువాడు) అనే పేరు వచ్చినది.
ఆదికర్తయగు నారాయణుడే ఈ జగత్తును రజోగుణముచే సృష్టించి, సత్త్వగుణముచే పాలించి, తమోగుణముచే తనలో విలీనము చేయును. ఈ ముల్లోకముల సంరచన ఆయనయొక్క విరాగ్గేహములో అంతర్గతమై యున్నది. దేహధారుల యొక్క జ్ఞానేంద్రియకర్మేంద్రియప్రవృత్తులన్నీ ఆయన సమష్టి-ఇంద్రియశక్తిలో అంతర్గతమైనవి. ప్రాణుల తెలివి ఆయన చైతన్యస్వరూపాంతర్గతమే. ప్రాణుల దేహశక్తి, ఇంద్రియశక్తీ, చేష్టలు ఆయన శ్వాసప్రశ్వాసల చేతనే ఘటిల్లుచున్నవి.
సర్వకారణమగు ఆ పూర్ణపరబ్రహ్మమే సృష్ట్యాదియందు రజోగుణోపాధిచే ఈ జగత్తును సృష్టించిన బ్రహ్మదేవుడు ఆయెను. ఆ బ్రహ్మ పాలనమునందు సత్త్వగుణోపాధిచే విష్ణువై యజ్ఞ ప్రభుడాయెను. వేద వేత్తలను, వేదోక్తధర్మములను నిలబెట్టేది విష్ణువే. ఆ బ్రహ్మమే తమోగుణోపాధిచే రుద్రుడై ప్రళయమును చేయును. ఈ విధముగా ప్రతి కల్పమునందు నిరంతరముగా ప్రాణుల సృష్టి స్థితిలయములు కలుగును.
ధర్ముని భార్య, దక్షుని పుత్రిక అగు మూర్తియందు శ్రీహరి నరనారాయణులై అవతరించెను. నారాయణుడు మహర్షులలో శ్రేష్ఠుడు, పరమప్రశాంతుడు. ఆయన క్రియాసంబంధము లేని ఆత్మస్వరూపమునకు ఉపాయమైన కర్మయోగము (తపస్సు) ను బోధించి తాను ఆచరించెను. మహర్షులచే సేవించబడే పాదములు గల ఆయన ఈ నాటికీ ఉన్నాడు.
ఈయన నా స్థానమును లాగుకొన గోరుచున్నాడనే సందేహము నారాయణ మహర్షి గురించి ఇంద్రునకు కలిగెను. ఆయన మన్మథుని, వాని అనుచరులతో సహా నారాయణ మహర్షి ఉండే బదరికాశ్రమమునకు పంపెను. ఆతని వెంట అప్సరసలు, వసంతుడు, మందమారుతము కూడ వచ్చినవి. ఆయన మహిమ ఆతనికి తెలియదు. ఆతడాయనను ప్రమదల వాలు చూపులనే బాణములతో కొట్టెను.
ఇంద్రుడు చేసిన తప్పు పని ఆదిదేవుడగు నారాయణునకు తెలియును. భయముతో వణుకుతున్న వారిని ఉద్దేశించి ఆ నిగర్వి ఇట్లు పలికెను - ఓ మన్మథా! మందమారుతమా! అప్సరసలారా! భయపడకుడు. మా ఆతిథ్యమును స్వీకరించి, ఈ ఆశ్రమమునకు నిండుదనమును కలిగించుడు.
ఓ మహారాజా! అభయదాత, దయాళువు అగు దేవుడిట్లు పలుకగా మన్మథుడు మొదలైన దేవతలు సిగ్గుతో తలలు వంచిరి. వారాయనతో నిట్లనిరి -- ఓ ప్రభూ! పరబ్రహ్మవగు నీయందు వికారములు లేవు. ఆత్మారాములు, జితేంద్రియులు అగు మహాత్ములు అందరు నీ పాదపద్మములకు నమస్కరించెదరు. నీవీ విధముగా అభయమునిచ్చుట విడ్డూరము కాదు.
నిన్ను సేవించు భక్తులు దేవతల స్వర్గ స్థానమును దాటి నీ పరమ పదము (వైకుంఠము) ను పొందెదరు. దేవతలు వారికి అనేకవిఘ్నములను కలిగించెదరు. కాని, తమకు యజ్ఞములో హవిర్భాగములను సమర్పించువారలకు వారు విఘ్నములను కలిగించరు. కాని, నీవు రక్షకుడవై యుండగా, భక్తుడు విఘ్నములను అలవోకగా త్రోసిపుచ్చును.
కొందరు ఆకలి-దప్పికలను, కాలప్రవాహములో వచ్చే చలి-వేడి-వర్షములను, సుడిగాలులను, భక్ష్యముల ఆకర్షణలను, కామభోగములను విడిచి పెట్టి, మమ్ములను - (కామాదులను) అతిక్రమించెదరు. కాని, వారు కోపమునకు వశులై ఎవ్వరూ చేయలేని తమ తపస్సును కూడ వ్యర్థముగా పోగొట్టుకొనేదరు. ఒకడు పెద్ద ధనపు మూటతో సప్తసముద్రములను దాటి ఇంటి ముందు ఆవు గిట్ల చేసిన గోతిలో పడి సర్వమును నేలపాలు చేసుకున్నట్లు ఉన్నది వీరి స్థితి.
మన్మథుడు మొదలగువారీ విధముగా స్తుతించుచుండగా, నారాయణ మహర్షి తనకు సేవను చేయుచున్న స్త్రీలను వారికి చూపెను. చక్కగా అలంకరించుకున్న ఆ స్త్రీల రూపము గొప్ప అచ్చెరువును గొల్పెను.
దేవతల అనుచరులగు ఆ మన్మథాదులు లక్ష్మీదేవి వలె సౌందర్యవతులైన ఆ స్త్రీలను చూచిరి. వారి అతిశయించిన రూపము ముందు మన్మథాదుల శోభ వెలవెలబోయెను. వారి దేహపరిమళమునకు మన్మథాదులు మోహమును పొందిరి.
దేవదేవులగు బ్రహ్మాదులకు కూడ నియామకుడగు నారాయణుడు నవ్వుతున్నాడా యన్నట్లు ఆ మన్మథాదులనుద్దేశించి ఇట్లు పలికెను -- వీరిలో ఒకతెను మీతో సమానమైన అందము గల యువతిని ఎన్నుకొనుడు. ఆమె స్వర్గమునకే అలంకారము కాగలదు.
దేవతల అనుచరులగు మన్మథుడు మొదలగువారు అటులనే అని నారాయణుని ఆదేశమును స్వీకరించిరి. వారు అప్సరసలలో శ్రేష్ఠురాలగు ఊర్వశిని ఎన్నుకొని, ఆమెను దోడ్కొని స్వర్గమును వెళ్లిరి.
వారు దేవసభలో ఇంద్రునకు ప్రణమిల్లి, స్వర్గవాసులు వినుచుండగా నారాయణ మహర్షియొక్క శక్తిని గురించి చెప్పిరి. ఇంద్రుడు ఆశ్చర్యమును, భయమును పొందెను.
శ్రీహరి భగవానుడు తన స్వరూపమునుండి చ్యుతి లేకుండానే ఎన్నో కళావతారములను స్వీకరించి జగత్తునకు కల్యాణమును కలిగించినాడు. ఆయన హంసగా, దత్తాత్రేయుడుగా, సనక-సనందన-సనాతనసనత్కుమారులుగా, మా తండ్రియగు ఋషభదేవునిగా అవతరించి అధ్యాత్మయోగమును (క్రమముగా సనకాదులకు, యదువునకు, నారదు నకు, మాకు) ఉపదేశించేను. ఆయన హయగ్రీవుడై మధు కైటభులను సంహరించి, వారు అపహరించిన వేదములను తీసుకువచ్చెను.
శ్రీహరి చేపట్టే ప్రళయములో సత్యవ్రతమనువును, భూమిని, చెట్టు చేమలను, మహర్షులను కాపాడెను. ఆయన వరాహమై భూమిని సముద్రమునుండి పైకి లేస్తూ హిరణ్యాక్షుని మట్టుబెట్టెను. ఆయన అమృతము కొరకై పాల సముద్రమును మథించే సందర్భములో తాబేలై మందర పర్వతమును తన వీపుపై మో సెను. ఆపదలో పడి శరణు వేడిన గజేంద్రుని ఆయన మొసలినుండి విడిపించెను.
తపస్సుచే చిక్కిన వాలఖిల్య మహర్షులు ఒకప్పుడు చిన్న గుంటలో పడి శ్రీహరిని స్తుతించిరి. వారికి అదే సముద్రము ఆయెను. శ్రీహరి వారిని కాపాడెను. వృత్రాసురుని వధించి బ్రహ్మహత్యాపాపమును మూట కట్టుకున్న ఇంద్రుని ఆయన ఆ పాపమునుండి రక్షించెను. రాక్షసులు తమ అంతఃపురములో బందీ చేసిన దేవతాస్త్రీలను కూడ ఆయన రక్షించెను. నృసింహావతారములో ఆయన హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదునకు, ఇతరభక్తులకు అభయమును అనుగ్రహించెను.
శ్రీహరి దేవాసురయుద్దమునందు దేవతల ప్రయోజనమును కాపాడుట కై రాక్షస నాయకులను సంహరించేను. ఆయన ఆయా మన్వంతరముల లో అవతరించి లోకములను నిలబెట్టెను. వైవస్వత మన్వంతరములో ఆయన వామనుడై బలి చక్రవర్తియొక్క భూమిని, యాచించుట అనే నెపముతో లాగుకొని, అదితి పుత్రులగు ఇంద్రాదులకు ఇచ్చెను.
ఆయన హైహయకులమును నశింప జేసే అగ్ని యనదగిన పరశు రాముడుగా భృగువంశములో అవతరించి, ఇరవై ఒక్క పర్యాయములు భూమిపై క్షత్రియులు లేకుండా చేసెను. ఆయన సీతాపతియై సముద్రము పై సేతువును కట్టి, లంకను ముట్టడించి, రావణాసురుని సంహరించేను. సర్వోత్కర్షగా ప్రకాశించే శ్రీరాముని కీర్తిస్తే జనుల పాపాలు పోతాయి.
పుట్టుక లేని శ్రీహరి భూభారమును తగ్గించుటకై యాదవకులములో పుట్టి, దేవతలు కూడ చేయ లేని గోవర్ధనోద్దారము మొదలైన లీలలను చేయును. ఆయన బుద్ధుడుగా అవతరించి, అర్హత లేకుండా యజ్ఞములను చేసేవారిని వేదవిరుద్దమగు వాదనలతో మోహ పెట్టును. ఆయన కలియుగాంతములో కల్కియై భూమిని భోగసాధనముగా చేసి దోచుకొనే పాలకులను సంహరించును.
గొప్ప భుజశక్తి గల ఓ మహారాజా! జగత్తును పాలించే శ్రీహరి కీర్తి చాల గొప్పది. ఈ విధముగా నేను ఆయనయొక్క పలు అవతారములను, లీలలను కూడ వర్ణించితిని.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో శ్రీహరి అవతారములను వర్ణించే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).
Summary of chapter 4 of the Bhāgavata Mahā Purana is as follows:
Responding to King Nimi's inquiry regarding the various Avatāras and divine descents of the Supreme Being across cosmic time, the fifth Yogendra, Drumila, presented a historical summary of Bhagavān's major incarnations. Drumila described the Purūsha-avatāras, the creation of the universal form, the descent of Nara-Nārāyaṇa Rishis (who demonstrated unrivaled sense control by vanquishing the allurements of Kāmadeva's celestial apsarās at Badarīkāśrama), Haṁsa-avatāra, Varāha, Matsya, Nṛsiṁha, Vāmana, Paraśurāma, Śrī Rāmacandra, and Svayam Bhagavān Śrī Kṛshṇa. He explained that Bhagavān manifests in every epoch to re-establish Vaidika Dharma and liberate surrendered souls.