భాగవత మహా పురాణము
28 - ఆత్మ తత్త్వ నిరూపణము
శ్రీభగవానువాచ ।
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను --- ప్రకృతిపురుషులతో కూడియున్న ఈ జగత్తునకు అధిష్ఠానము అద్వయపరబ్రహ్మ, అని దర్శిస్తూ సాధకుడు ఇతరుల స్వభావమును, పనులను ప్రశంసించరాదు, నిందించరాదు.
మిథ్యాజగత్తునందు ఆగ్రహము గలవాడు ఇతరుల స్వభావమును, - కర్మలను ప్రశంసించును, నిందించును. అట్టివాడు పురుషార్థమునుండి శీఘ్రముగా జారిపోవును.
రాజసాహంకారకార్యమైన ఇంద్రియవర్గము నిద్రచే విలీనమైనప్పుడు దేహమునందుండే జీవుడు మనస్సుతో కల్లయైన కలను గనును. మనస్సు కూడ విలీనమైనప్పుడు మృత్యువువంటి గాఢనిద్రను పొందును. అదే విధముగా, అనేకత్వమే సత్యమని దర్శించే అజ్ఞాని కలవంటి మిథ్యా జగత్తులో పరిభ్రమిస్తూ, మృత్యురూపమైన అజ్ఞానములో పడియుండును.
ద్వైతము మిథ్య. దానిలో మంగళమన నేమి? అమంగళమనగా నేమి? మనస్సుచే సంకల్పించబడి వాక్కుచే చెప్పబడేది ఏదైనా, అది అసత్యమే.
ప్రతిబింబము, ప్రతిధ్వని, రజ్జుసర్పమువంటి భ్రాంతిజనితదృశ్యములు అసత్యము లే అయినా వ్యవహారము (ముఖముపై తిలకము పెట్టుకొనుట, త్రాడును చూచి పామని భయపడుట) ను కలిగించుచునే యున్నవి. ఇదే విధముగా, దేహము, ఇతరదృశ్యములు మొదలైన పదార్థములు అసత్యములే అయినా, మరణించే వరకు భయమును కలిగించుచున్నవి.
కావున, పరమాత్మ సర్వము కాగల సమర్థుడు, సర్వమునకు అంతరతమమగు స్వరూపము, సర్వాంతర్యామి. ఆ పరమాత్మ తనను తానే ఈ జగద్రూపముగా 'సృష్టించి, తనను తానే పాలించి, తనను తానే ఉపసంహారము చేయుచున్నాడు. కాబట్టి, సృష్టించబడే జగత్తు ఇతరము, సృష్టించే పరమాత్మ ఇతరము అనే విధముగా ఆత్మకంటే భిన్నముగా ఏదీ నిర్వచించ శక్యము కాదు. ఇది నిశ్చయము.
ఆత్మయందు ఆధ్యాత్మిక-ఆధిభౌతిక-ఆధిదైవికభేదముతో, జాగ్రత్స్వప్నసుషుప్తి భేదముతో ప్రతీతమయ్యే జగత్తు పరమార్థసత్యము కాదని మహాత్ములు నిరూపించిరి. ద్రవ్యశక్తి విజ్ఞానములనే మూడు విధముల ఈ జగత్తు సత్త్వరజస్తమోగుణముల కార్యము, వాస్తవముగా లేకున్ననూ అజ్ఞానముచే ఉన్నదా యన్నట్లు భాసిల్లుచున్నది, అని తెలియుము.
నేనీ జ్ఞాన (శాస్త్రపరిజ్ఞానము)-విజ్ఞాన (ఆత్మానుభవము) ముల నిష్ఠను చెప్పితిని. దీనిని తెలిసినవాడు లోకమునందు దేనినీ నిందించడు, స్తుతించడు. ఆతడు సూర్యుడు వలె (అసంగుడై, సముడై) సంచరించును.
పుట్టుటకు ముందు, గిట్టిన తరువాత లేనిది (మొదలు, తుది గలది) : వర్తమానములో కూడ లేనిదియే. కాబట్టి, అది కనబడుచున్నా లేనిది గనుక మిథ్య. ఈ సత్యమును సాధకుడు ప్రత్యక్షముచే (ఉన్నది మట్టియే గాని ఘటము కాదు), అనుమానముచే (ఈ లోకము మిథ్య, ఆది-అంతములు గలది గనుక, ఘటము వలె), వేదముచే (నేహ నాన్వాస్తి కించన), తన అనుభవముచే (సర్వము తన మనస్సునందలి చలనముచే భాసించుచున్నది) తెలుసుకొనవలెను. అట్లు తెలిసిన జ్ఞాని ఈ లోకములో అసంగుడై సంచరించవలెను (సంచరించును).
ఉద్దవ ఉవాచ ।
ఉద్దవుడిట్లు పలికెను - ఈశ్వరా! ఆత్మ చూచేది, దేహము చూడబడేది. ఆత్మ స్వయంప్రకాశము కాగా, అనాత్మయగు దేహము జడము. వీటిలో సంసారము ఆత్మకు లేనే లేదు. జడమైన దేహమునకు కూడ లేదు. మరి యీ సంసారము (సుఖదుఃఖములు) దేనికి? అనుభవమైతే ఉన్నది గదా!
ఆత్మ వినాశము లేనిది (కాలాతీతము), నిర్గుణము, శుద్ధము (పుణ్యపాపములు లేనిది), అగ్నివలె స్వయంప్రకాశము,అజ్ఞానముయొక్క ఆవరణము లేనిది. దేహము కట్టెవలె జడము. ఈ రెండింటిలో సంసారము దేనికి?
శ్రీభగవానువాచ ।
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను --- ఆత్మానాత్మవివేకము లేనివానికి ఎంతవరకైతే ఆత్మకు దేహము, ఇంద్రియములు, ప్రాణాపానాదులు మొదలగు అనాత్మలతో అజ్ఞానకృతమైన సంబంధముండునో, అంతవరకు సంసారము -- మిథ్యాభూతమే అయిననూ -- స్ఫురించుచుండును.
జన్మ మరణాదిరూపమైన సంసారము మిథ్య. అయిననూ, భోగములను గురించి చింతిల్లే జీవునకు -- స్వప్నమునందలి ఆపద, దాని దుఃఖము వలే -- సంసారమునందు తిరుగాడుట తప్పుట లేదు..
ఇది యెల్లాగంటే, నిద్ర పోతున్నవానికి స్వప్న ప్రపంచము అనేకములగు అనర్థములను మోపు చేయును. కాని, తెలివి వచ్చినవానికైతే ఆ స్వప్నము మోహము (క్లేశము) ను కలిగించలేదు. .
శోకము, హర్షము, భయము, క్రోధము, లోభము, మోహము, కామనలు, నిరాశ మొదలైనవి, పుట్టుక, మరణము అహంకారమునకే అనుభవమునకు వచ్చుచున్నవే గాని, ఆత్మకు కాదు.
దేహము, ఇంద్రియములు, ప్రాణాపానములు, మనస్సు అనువాటి లోపలి మూలతత్త్వము పరమాత్మయే. ఆ పరమాత్మ వాటియందు అహం -మమ అభిమానముల కారణముగా జీవుడనబడును. సమష్టిలో ఈ జీవునకే సూత్రాత్మ, మహత్తత్త్వము ఇత్యాది పలు పేర్లు గలవు. ఈ జీవుడే కాలమునకు అధీనుడై సంసారములో అంతటా పరిభ్రమించుచున్నాడు.
మనస్సు, వాక్కు, ప్రాణాపానాదులు, దేహము, కర్మలయందు అహం తాదాత్మ్యముచే పుట్టిన ఈ అహంకారమునకు మూలము లేదు (అది యథార్థతత్త్వము కాదు). ఈ అహంకారము అనేకరూపములతో భాసించు చున్నది. మననశీలుడగు సాధకుడు ఉపాసన చేసి వివేకజ్ఞానమనే కత్తితో దీనిని ఛేదించి కామనలు లేనివాడై భూలోకములో సంచరించవలెను.
ఆత్మను అనాత్మనుండి విడిగా తెలియుటయే జ్ఞానము. దానికి సాధనము వేదము (శ్రవణము), తపస్సు (నిదిధ్యాసనము). తన అను భవము, పెద్దల ఉపదేశము, యుక్తి (మననము) కూడ సాధనములే. ఈ జగత్తునకు ఆది-అంతములయందు ఏ ఆత్మతత్త్వము గలదో అదియే మధ్య యందు కూడ గలదు. అదియే జగత్తును ప్రకాశింపజేసే జగత్కారణము
ఆభరణముగా మలచబడని బంగారమేది గలదో అదియే ఆభరణప్రపంచమునకు ముందు వెనుక ఉన్నది. మధ్యలో కూడ అదియే ఉన్నది. కాని, కంఠాభరణము మొదలైన అనేకములైన పేర్లతో అదియే వ్యవహరించబడుచున్నది. అదే విధముగా, నేనీ జగద్రూపముగా ఉన్నాను.
మనస్సునకు జాగ్రత్స్వప్నసుషుపులనే మూడు అవస్థలు గలవు. జగత్తునందు అధ్యాత్మ-అధిభూత-అధిదైవములనే మూడు విభాగములు గలవు. వీటికి మూలము సత్త్వరజస్తమోగుణములు. ఈ సర్వము ఆత్మ చైతన్యమునందు మాత్రమే ప్రకాశించుచున్నది. ఇది అన్వయము. సమాధి యందు ఈ సర్వము లేకున్నా ఆత్మ చైతన్యము ప్రకాశిస్తూనే ఉన్నది. ఇది వ్యతిరేకము. ఈ విధముగా నాల్గవదియగు ఆత్మయే సత్యము.
న యత్పురస్తాదుత యన్న
ఏ కార్యము పుట్టుటకు ముందు లేదో, నశించిన వెనుక లేదో, మధ్య యందు కూడ అది కేవలము నామరూపవ్యవహారము మాత్రమే. ఏయే కార్యము ఏ కారణముచే ప్రకాశింపజేయబడినదో, అది ఆ కారణముకంటే భిన్నము కాదు, అనగా ఆ కారణమే యగునని నా నిశ్చయము.
సాత్త్విక-రాజస-తామస-అహంకారములనుండి పుట్టిన . ఈ సృష్టి వాస్తవముగా లేకున్ననూ భాసించుచున్నది. కాని, స్వతస్సిద్ధమగు పరబ్రహ్మ దీనిని ప్రకాశింప జేయుచున్నది. కాబట్టి ఇంద్రియములు, తన్మాత్రలు, పంచభూతములు, జీవులు అనే నానాత్వరూపముగా పరబ్రహ్మయే ప్రకాశించుచున్నది.
నిపుణుడైన గురువునుండి శాస్త్రమును శ్రవణము చేసి దేహాదివ్యతిరిక్తము, ఆత్మ-అభిన్నము అగు బ్రహ్మను సాధకుడీ విధముగా స్పుటముగా అరయవలెను. అట్లు తెలిసి, అనాత్మలగు దేహాదులయందు ఆత్మబుద్దిని తిరస్కరించి, స్వరూపానందముచే సంతుష్టుడై, సకలకామవాసనలనుండి నివృత్తుడు కావలెను.
పృథివీవికారమైన దేహము, ఇంద్రియములు, వాటిని అనుగ్రహించే దేవతలు, ప్రాణశక్తి, ఆహారముచే వర్ధిల్లజేయబడే మనస్సు (సంకల్పవికల్పాత్మకము), బుద్ధి (నిశ్చయాత్మకము), చిత్తము (స్మృతి), అహంకారము, ఆకాశము-వాయువు-అగ్ని-జలములు-పృథివి అనే పంచభూతములు, మూడు గుణముల సామ్యావస్థయగు ప్రకృతి అనేవి యేవీ ఆత్మ కావు. ఇది నిశ్చయము.
నా స్వరూపమును సుస్పష్టముగా అనుభూతి పొందిన జ్ఞానికీ గుణకార్యములగు ఇంద్రియములు ఏకాగ్రమగుటచే లాభమేమున్నది?(ఏమీ లేదు). అవి విక్షేపమును పొందినచో దోషమేమి?(ఏమీ లేదు). సూర్యునకు మేఘములు వస్తే ఏమి లాభము? పోతే ఏమి నష్టము?
వాయువుయొక్క శోషణము (ఎండగొట్టుట), అగ్నియొక్క దహనము, నీటియొక్క క్లేదనము (తడుపుట), భూమియొక్క దుమ్ము ఇత్యాది ధర్మములు గాని, వచ్చి పోయే ఋతుధర్మములు (చలి, వేడి ఇత్యాదులు) గాని ఆకాశమునకు అంటవు. అదే విధముగా, సత్త్వరజస్తమోగుణముల మంచి-చెడులు దేహాభిమానము గల అజ్ఞానికి సంసారదుఃఖము నిస్తాయే గాని, ప్రకృతికి అతీతమగు అవినాశి పరమాత్మకు తగుల్కొనవు."
మనస్సులోని మాలిన్యము రజోగుణమే. నాయందు దృఢమైన నిష్కామ భక్తి అనే ఉపాయముచే అది తొలగిపోవును. అంతవరకు సాధకుడు -- గుణకార్యములు జ్ఞానినైతే విచలితము చేయకున్ననూ -- ప్రకృతియొక్క గుణముల కార్యములగు విషయభోగములయందు ఆసక్తిని చేయరాదు.
మానవులకు రోగము వచ్చినప్పుడు తప్పుగా చికిత్స చేసినచో, ఆ రోగము మరల మరల మొలకెత్తి అధికపీడను కలిగించును. ఇదే విధము గా, సాధకుడు మనస్సులోని రాగద్వేషములను, కర్మవాసనలను నశింప జేయనిచో, సర్వమునందు ఆసక్తి గల ఆ మనస్సు, ఆత్మానాత్మవివేకము లేని ఆ సాధకుని పీడించును.
యోగసాధన చేయువారికి దేవతలు బంధుమిత్రులు మొదలైన మనుష్యుల రూపములో విఘ్నములను కలిగించేదరు. వాటిచే యోగము నుండి జారిపోయినవారు తరువాతి జన్మలో ఆ పూర్వజన్మయందలి అభ్యాసముయొక్క బలముచే మరల యోగానుష్టానమును , కొన సాగించేదరు. అంతేగాని, వారు కర్మల విస్తారములో మాత్రము పడిపోరు.
దేహాభిమానియగు అజ్ఞాని నిర్వచించ శక్యము కాని అజ్ఞానముచే ప్రేరితుడై మరణించే పర్యంతము కర్మలను చేస్తూ, కర్మఫలరూపముగా సుఖదుఃఖాది వికారములను పొందుచునే యుండును. కాని, ఆత్మజ్ఞాని దేహమునందున్నవాడే అయినా, ఆత్మానందానుభవముచే సకలకామనల నుండి నివృత్తుడు. ఆయనకు కర్తృత్వము, వికారములు ఉండవు.
జ్ఞానియొక్క బుద్ధి ఆత్మనిష్ఠమై యుండును. దేహము నిలుచున్నా, కూర్చున్నా, వేళ్లుచున్నా, పరున్నా, విసర్జించుచున్నా, అన్నం తింటున్నా, సహజముగా మరియొక ఏదో పనిని చేస్తున్నా, ఆయనకు దేహదృష్టి (దేహమునందు ఆత్మాభిమానము, తనయందు కర్తృత్వము) ఉండదు,
జ్ఞాని కూడ ఇంద్రియములు బహిర్ముఖములైన సందర్భములో ఆయా శబ్దాది విషయములను దర్శించును. అయినా, అవి తనకంటే భిన్నముగా యథార్థములేనని ఆతడు భ్రమపడడు. అనేకత్వము మిథ్య, దృశ్యము గనుక, అనే అనుమానముచే ఆయన దృశ్యమును బాధించును. ఇది యెల్లాగంటే, నిద్ర లేచిన వ్యక్తి స్వప్నములో కనబడి అంతర్ధానమైన ప్రపంచము సత్యమని భావించడు.
పూర్వం గృహీతం
ఓ ఉద్దవా! దేహాదులకు సత్త్వాదిగుణములు ఉపాదానము కాగా ధర్మాధర్మములు నిమిత్తము. వీటిచే నిర్మితమైన దేహాదులు అజ్ఞానావస్థలో తన స్వరూపమేననే భ్రమ ఉండును. కాని, ఆత్మజ్ఞానము కలుగగా ఆ అధ్యాస నివృత్తమగును. ఆత్మ తెలియబడే దృశ్యము కాదు. మరియు, ఆత్మ తాను గనుకనే, విడిచి పెట్టబడేది కూడా కాదు.
సూర్యోదయము మానవుల కళ్లను కప్పిన చీకట్లను పారద్రోలునే గాని, కొత్తగా వస్తువులను రచించదు. ఇదే విధముగా, నిశ్చయాత్మకముగా యథార్థముగా నా (ఆత్మ సాక్షాత్కారము కలుగగా, మానవుని బుద్దిని కప్పివేసిన అజ్ఞానము నశించును. మోక్షము కొత్తగా రాదు. వ్యక్తియొక్క స్వరూపము మోక్షమే.
ఈ ఆత్మ స్వయంప్రకాశము, పుట్టుక లేనిది, ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కానిది, గొప్ప మహిమ గలది, చిదనము, సర్వసాక్షి, సర్వజ్ఞము, ఏకము, అద్వితీయము. వాక్కులు ఆత్మను చేరలేక నివృత్తములగును. ఆత్మచే ప్రేరితములై వాక్కు మొదలైన ఇంద్రియములు ప్రవర్తిల్లుచున్నవి.
ఆత్మతత్త్వము అద్వితీయము. దానియందు భేదమును కల్పించుట కేవలము బుద్దియొక్క భ్రమ మాత్రమే. ఆ భ్రమ కైననూ వ్యక్తియొక్క స్వరూపమైన ఆత్మ తక్క ఇంకో ఆలంబనము (అధిష్ఠానము) లేదు.
నామరూపాత్మకముగా ఇంద్రియములచే తెలియబడే ఈ పాంచభౌతికజగత్తు అనే ద్వైతము బాధించబడేది కాదనియు, ఇది సత్యమనియు కొందరు వాదించెదరు. వారు తాము పండితులమని భ్రమించుచున్నారు. బ్రహ్మాత్మైక్యమును చెప్పే ఉపనిషద్వాక్యము కర్మవాక్యములకు శేష మయ్యే అర్థవాదమని వారి మతము. ఈ మతములో సారము లేదు. ఎందుకంటే, ఆత్మైక్యము కర్మకు శేషమగుటలో ప్రయోజనమేమీ కానరాదు.
యోగసాధనలో పరిపక్వత రాని సాధకుడు సాధన చేయుచుండగా, దేహములో రోగములు పుట్టి విఘ్నమును కలిగించును. అప్పుడు కర్తవ్యము ఈ క్రింద చెప్పబడుచున్నది.
సాధకుడు దేహమునందు రోగరూపముగా వచ్చే కొన్ని ఉపద్రవములను సూర్యాది దేవతను ధ్యానించుటచే పోగొట్టుకొనవలెను. మరికొన్ని ఉపద్రవములు వాయుధారణతో కూడిన ఆసనములను అభ్యసించుటచే దూరమగును. తపస్సు, మంత్రజపము, ఔషధములు కూడ యథాసంభవముగా రోగములను పూర్తిగా నివారించును.
అశుభమును కలిగించే కామక్రోధాది ఉపద్రవములను నన్ను నిరంతరముగా ధ్యానించుటచే, నామసంకీర్తనమంత్రజపాదులచే, లేదా యోగనిష్ఠులగు మహాత్ములననుసరించుటచే మెల్లగా పోగొట్టుకొనవలెను.
కొందరు జితేంద్రియులు వివిధములగు ఉపాయములచే ఈ దేహమును చాల గట్టిదిగా, యౌవనమునందు స్థిరమై ఉండేదిగా చేసెదరు. అప్పుడు వారు యోగసిద్ధి (మహిమలు) కొరకు ఉద్యమించెదరు.
దేహము చెట్టు పండు వంటిది, రాలిపోతుంది. కాబట్టి, యోగమహిమల కొరకు ఉద్యమించుటను వివేకవంతులు ఆదరించరు. శ్రమతో కూడిన అట్టి ఉద్యమము వ్యర్థము.
ప్రతిదినము యోగము చేయుచున్నచో దేహము తనంత తానే గట్టిదనమును పొందును. నేనే పరమలక్ష్యముగా గల వివేకవంతుడు అప్పుడు కూడా ఆ దేహదార్థ్యమును గురించి పెద్దగా పట్టించుకోరాదు, తన సాధనను విడిచి పెట్టరాదు.
సాధకుడీ విధముగా నన్నే శరణు జొచ్చి నిష్కామముగా ఈ యోగమునభ్యసించినచో, ఆతనిని విఘ్నములు బాధ పెట్టవు. పైగా, ఆతడు ఆత్మానందముననుభవించును.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో ఆత్మతత్త్వమును నిరూపించే
ఇరువది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (28).
Summary of chapter 28 of the Bhāgavata Mahā Purana is as follows:
In this highly philosophical chapter, Śrī Kṛshṇa summarized the core teachings of Advaita-jñāna and self-realization. He explained that the material world of dualities—good and bad, pleasure and pain, birth and death—is an illusory mental projection (*Māyā*) superimposed upon the singular, unchanging spiritual reality. Just as a dreaming person experiences real fear from an imaginary tiger, a conditioned soul suffers due to bodily identification. By analyzing the temporary nature of material phenomena through intelligence and meditating upon the immortal Ātmā, the seeker transcends bodily dualities and remains fixed in divine consciousness.