భాగవత మహా పురాణము
1 - మహర్షులు యదువంశమును శపించుట
శ్రీబాదరాయణిరువాచ ।
వ్యాససూనుడగు శుకమహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణుడు బలరామునితో, ఇతరయాదవులతో గూడి రాక్షసులను మట్టుబెట్టెను. ఆయన అతిశయించిన వేగము గల కలహము (మహాభారతయుద్దము) ను కలిగించి, తద్ద్వారా భూమియొక్క బరువును తగ్గించెను.
శత్రువులైన దుర్యోధనాదులు పాండవులను పలుమార్లు అవమానించిరి. వారిని కపటపు జూదములో ఓడించి వారి భార్యయగు ద్రౌపది జుట్టు పట్టి లాగిరి. ఇంతేగాక, లక్కయింటిని తగులబెట్టుట మొదలగు అకృత్యములను చేసిరి. దీనితో పాండవులు కోపించియుండిరి. సర్వసమర్థుడగు శ్రీకృష్ణ భగవానుడు భూభారమును పోగొట్టుటకు వారినే నిమిత్తముగా చేసుకొనెను. కౌరవపాండవుల పక్షములలో చేరి రాజులు ఒకచో యుద్ధరంగములో సమావేశమైరి. వారినీ పరస్పరము సంహరింపజేసి ఆయన భూభారమును తగ్గించెను.
శ్రీకృష్ణ భగవానుని స్వరూపము ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కాదు. ఆయన తన భుజశక్తిచే రక్షించబడిన యాదవుల ద్వారా భూమికి బరువైన రాజులను, వారి సేనలను సంహరించి, ఇట్లు తలపో సెను -- లోకదృష్టిలో భూభారము తొలగినా, నా దృష్టిలో ఇంకనూ పూర్తిగా తొలగలేదు. ఇది నిశ్చయము. ఆహా! ఎందుకంటే, శత్రువులకు కన్నెత్తి చూడ శక్యము కాని యాదవవంశము ఇంకనూ మిగిలియే యున్నది.
వీర్యశౌర్యాదులలో ఉత్కర్షను పొంది ఉచ్చృంఖలముగానున్న ఈ యాదవవంశమునకు ఆశ్రయము నేనే అగుట వలన, దీనికి ఇతరుల వలన పరాభవము కలుగనే కలుగదు. (ఇతరుల వలన నాశము కలుగదని చెప్పవ లేనా?) లోపల నిప్పు పుట్టినప్పుడు వెదుళ్ల పొద కాలి బూడిద యగును. అదే విధముగా, ఈ వంశమునకు లోపలినుండీ, కలహమును కలిగించేదను. ఈ వంశము కూడ నాశము కాగా, భూభారము తగ్గుటచే నాకు శాంతి కలుగును. అప్పుడు నేను నిత్యమంగళమగు వైకుంఠధామమును చేరెదను.
ఓ పరీక్షిద్రాజా! శ్రీకృష్ణ భగవానుని సంకల్పము సత్యమగును. సర్వ ప్రాణులలో అంతర్యామి, సర్వసమర్థుడు అగు ఆ దేవుడీ విధముగా నిశ్చ యించి, తనదైన వంశమును మహర్షుల శాపమనే మిషతో నశింపజేసెను.
శ్రీకృష్ణ భగవానుని రూపలావణ్యము ముందు లోకములో ఇతరములైన సుందరవస్తువులు వెలవెలపోయెడివి. ఆ సౌందర్యము జనుల చూపును తన వైపు బలముగా ఆకర్షించెడిది. ఆయన పలుకులు ఆ పలుకులను స్మరించువారి చిత్తమును ఆకర్షించెడివి. జనులు ఇతరవ్యాపారములను కట్టిపెట్టి ఆయన కాలి గురుతులను చూచెడివారు. ఆయన భూలోకమునందు చక్కగా కవులచే గానము చేయబడే కీర్తిని విస్తరింపజేసినాడు. దానిచే జనులు నిశ్చయముగా అజ్ఞానమనే చీకటిని తేలికగా దాటివేయగలరనే దయతో ఆయన అట్లు చేసినాడు. అప్పుడాయన తన ధామమునకు వెళ్లినాడు.
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- యాదవులు బ్రాహ్మణభక్తులు, దాతలు. వారు శ్రీకృష్ణునియందే లగ్నమైన చిత్తము గలవారై సర్వదా పెద్దలను సేవించెడివారు. వారికి మహర్షుల శాపము ఎట్లు కలిగెను?
ఓ మహర్షిపుంగవా! ఆ శాపమునకు కారణమేమి? ఆ శాపమెట్టిది? ఒకే చిత్తము గల యాదవులలో కలహము ఎట్లు కలిగెను? ఈ విషయమునంతనూ నాకు చెప్పడు.
శ్రీశుక ఉవాచ ।
పూర్ణకాముడగు శ్రీకృష్ణుడు భూలోకములో ద్వారకాధామమునధిష్టించి కల్యాణకరమగు లీలలను చేస్తూ రమించెను. ఆయన గొప్ప కీర్తి గలవాడు. ఆయన అందమైన సకలావయవముల చక్కని విన్యాసము గల దేహమును ధరించినాడు. భూభారమును హరించుట అనే కార్యములో ఇంకనూ శేషము గలదు. కావుననే, ఆయన యాదవవంశము నుపసంహరించవలెనని సంకల్పించెను.
కాలరూపుడైన శ్రీకృష్ణుడు చేసిన పరమమంగళకరములగు లీలలు గానము చేసే జగత్తులోని జనులకు కలిదోషములను పోగొట్టి పుణ్యమును కలిగించును. వసుదేవుని ఇంటిలో నివసించే శ్రీకృష్ణుని వద్ద సెలవు తీసుకొని మహర్షులు పిండారకక్షేత్రమును చేరిరి.
ఆ మహర్షులెవరనగా -- విశ్వామిత్రుడు, అసితుడు, కణ్వుడు, దూర్వాసుడు, భృగువు, అంగిరసుడు, కశ్యపుడు, వామదేవుడు, అత్రి, వసిష్ఠుడు, నారదుడు, గౌతముడు మొదలగువారు.
యాదవుల పుత్రులగు కొందరు యువకులు అచట ఆటలాడుచుండిరి. వినయమునేరుంగని ఆ యువకులు ఆ మహర్షుల వద్దకు వెళ్లి, వినయశీలురు వలే పాదములకు నమస్కరించి ఇట్లు ప్రశ్నించిరి.
వారు జాంబవతి పుత్రుడగు సాంబునకు స్త్రీల వస్త్రములను కట్టి, ఆభరణములను పెట్టి వారితో నిట్లనిరి -- మహర్షులారా! ఈ నల్లని కన్నుల సుందరి గర్భిణి. ఈమె మిమ్ములను (మా ద్వారా) ఇట్లు ప్రశ్నించుచున్నది.
ఓ మహర్షులారా! మీ దర్శనము వ్యర్థము కాదు. ఈమె తానే స్వయముగా మిమ్ములను ప్రశ్నించుటకు చాల సిగ్గు పడుచున్నది. కొద్ది రోజులలో ప్రసవించబోయే ఈమె పుత్రసంతానమును కోరుచున్నది. ఈమెకు పుత్రుడు కలుగునా?
ఓ పరీక్షిన్మహారాజా! వారీ విధముగా వంచనతో పరిహసించగా మహర్షులు కోపించి ఇట్లు పలికిరి -- ఈమె మీ వంశమునంతమొందించే రోకలిని ప్రసవించగలదు.
ఆ మాటను విని ఆ యువకులు చాల భయపడిరి. వారు వెంటనే సాంబునకు కృత్రిమముగా పెట్టిన పొట్టను తెరిచి చూడగా, దానిలో యథార్థముగా ఇనుముతో చేసిన రోకలి కనబడెను.
మనము దురదృష్టవంతులము. మనము చేసిన పని యేమి? మనలను గురించి జనులేమనుకొనెదరు? ఈ విధముగా వ్యాకులమైన మనస్సు గల ఆ యువకులు రోకలిని తీసుకొని ఇళ్లకు వెళ్లిరి.
ఆ యువకుల ముఖకాంతి పూర్తిగా మాడిపోయేను. వారా రోకలిని సభకు తీసుకువచ్చి, సకలయాదవుల సన్నిధిలో ఉగ్ర సేన మహారాజునకు విన్నవించిరి. (శ్రీకృష్ణునకు చెప్పలేదు).
ఓ పరీక్షిన్మహారాజా! ద్వారకావాసులు తప్పక ఫలమునిచ్చే మహర్షుల శాపమును గురించి విని రోకలిని కూడ చూచిరి. వారికి ఆశ్చర్యము, భయముతో కంగారు కలిగెను.
యాదవుల రాజగు ఆ ఉగ్ర సేనుడు ఆ రోకలిని చూర్ణముగా చేయించి, ఆ చూర్ణమును, మిగిలియున్న చిన్న లోహపు ముక్కను కూడ సముద్రజలములలో పారవేయించెను (శ్రీకృష్ణుని సంప్రదించలేదు).
ఆ సముద్రములోని ఒక చేప లోహపు ముక్కను మ్రింగెను. చూర్ణముయొక్క కణములు కెరటములపై పయనించి ఒడ్డున ఇసుకకు తగుల్కొని తుంగ (ముళ్ల) గడ్డి దుబ్బులుగా అయినవి.
సముద్రములో చేపలను పట్టువారు వల వేసి మిగతా చేపలతో బాటుగా ఆ చేపను కూడ పట్టిరి. దాని పొట్టలోని లోహపు శకలము ఒక కిరాతునకు దొరకగా, ఆతడు దానిని బాణపు కొనలో గ్రుచ్చెను.
శ్రీకృష్ణ భగవానుడు కాల(మృత్యు)రూపుడు. ఆయనకు అన్ని విషయములు తెలియును. మహర్షుల శాపము జరుగకుండా చేసే శక్తి ఆయనకు గలదు. అయినా, ఆ శాపమును తప్పించుట ఆయనకు ఇష్టము కాలేదు. ఆయన ఆ శాపముననుమోదించెను.
శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో యదువంశములో ముసలము పుట్టుటను వర్ణించే మొదటి అధ్యాయము ముగిసినది (1).
Summary of chapter 1 of the Bhāgavata Mahā Purana is as follows:
This chapter records the historical events that initiated the withdrawal of the Yadu dynasty from the earth. Having fulfilled His divine promise to relieve the earth planet (*Bhūmi-devī*) of its burden of tyrannical asuric rulers, Svayam Bhagavān Śrī Kṛshṇa determined that the mighty Yadu warriors, if left behind on earth, would prove an unmanagable power that could destabilize the cosmos. While the great rishis—including Viśvāmitra, Asita, Kaṇva, Durvāsā, and Devarshi Nārada—were residing at the holy site of Piṇḍāraka near Dvārakā, young princes of the Yadu dynasty playfully dressed the youth Sāmba as a pregnant woman and mockingly asked the rishis to predict the gender of the child. Perceiving their insolence through divine vision, the enraged sages pronounced a curse: Sāmba would give birth to a iron mace (*Mushala*) that would bring about the complete destruction of the Yadu dynasty. Terrified, King Ugrasena ordered the iron club pulverized into fine powder and cast into the ocean, along with a small remaining iron lump which was swallowed by a fish.