3 - గరుడ పురాణము - బ్రహ్మ కాండము

Table of Contents

23 - 29 - సోమపుత్రి జాంబవతి కథ

ప్రియుడైన శిష్యుని కెంత చెప్పినా గురువు తనివి తీరదు. గరుడా! నీకిపుడు నా ప్రియపత్ని జాంబవతి కథను వెల్లడిస్తాను విను. క్రిందటి జన్మలో ఆమె శ్రీ సోముని (చంద్రుని) పుత్రిక. ఆయన నిరంతరం విష్ణు సేవలనే చేస్తుండేవాడు. ఆయన పుత్రిక తండ్రిని అనుసరించేది. ఆమె నిత్యమూ పురాణాలు వినేది; ప్రతి క్షణం భగవత్ స్మరణ చేస్తుండేది; ఆయన చరణాలకు అవకాశమున్నపుడల్లా వందనాలు చేస్తుండేది; విష్ణు సేవ తోడిదే జీవితమన్నట్లుగా కాలం గడిపేది. మెల్లమెల్లగా క్రమక్రమంగా జాంబవతి మనసులో ఆధ్యాత్మిక జ్ఞానం గూడుకట్టుకోసాగింది. ఈ సంసారం శాశ్వతం కాదనీ, సుఖదుఃఖాలు మాయాకల్పిత విన్యాసాలేనని ఆమెకు అవగతమైంది. భగవత్ ప్రేమతోనే జీవిస్తూ ఆయనకు అంకితంగానే అన్ని పనులు చేస్తుండడంలో వున్న అనందం మరెక్కడాలేదని ఆమెకు తెలిసి వచ్చింది. ఆమె మాటలో భగవంతుని నామమూ, గుణకథనమూ తప్ప వేరొకటి వినవచ్చేది కాదు. ఆమె కన్నులు నిత్యమూ ఆయననే అన్వేషిస్తూ ఆయన కోసమే వేచి చూస్తూ ఉండేవి. చెవులు విష్ణుదేవుని మాట వినడానికి సిద్ధంగా వుండేవి. ఆమె చేతులనిండా నిత్యమూ కృష్ణార్చనకు సంబంధించిన సంభారాలే ప్రకాశిస్తుండేవి. ఆమె పాదములు నిత్యమూ హరికి ప్రదక్షిణ చేయడానికే ప్రయత్నిస్తుండేవి. హృదయంలో ఆమె నింపుకున్న కోరిక ఒకటే. ‘నేను శ్రీ స్వామి చరణ దాసిని కావలెను. అంతే’ ఆమె కార్యములన్నీ శ్రీహరివైపే కదులుతుండేవి. ఆ పని పూర్తి కాగానే దాని నామె భగవంతునికే సమర్పిస్తుండేది. బ్రాహ్మణులను, సంతులనూ జాంబవతి హరి స్వరూపులనుగా భావించి నిత్యమూ పూజిస్తుండేది.

ఒకనాడామె తండ్రి శ్రీ సోముడు తీర్థయాత్రలకు బోవ సంకల్పించాడు. జాంబవతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె ఎప్పటి నుండో భగవంతుడు వివిధ లీలలను ప్రదర్శించిన యాత్రా స్థలాలనూ, ఆయన అదృశ్యరూపంలో నెలకొని వుంటాడని ప్రతీతమైన క్షేత్రాలనూ సేవించాలని అనుకుంటుండేది. సోముడు శ్రీనివాసుని దర్శనానికి పోదామనుకుంటున్నాడని విని ఆమె ఆనందంతో పరవశించిపోయింది. శ్రీనివాసుని పట్ల మధురభక్తిని మదిలో పెంచి పోషించిన అరుదైన అతివ జాంబవతి. శేషాచలంపై తన ప్రియతముని కనుల నిండా నింపుకోగల నన్న భావయామెను నిలువనీయలేదు. ఆమె తండ్రి కూడా సంపూర్ణ భక్తితత్పరుడే. ఇరువురి ఉత్సుకతా అనిర్వచనీయమే. యాత్ర ప్రారంభమైంది.

తండ్రీకూతుళ్ళిద్దరిదీ భక్తి పారవశ్యమే. వారి పాదములు అప్రయత్నంగానే ముందుకి సాగిపోసాగినవి. వారి కులగురువు సద్గురు జైగీషవ్యమహర్షి ఆజ్ఞ మేరకు సోముడు కపిల తీర్థాన్ని చేరగానే శిరోముండనం చేయించుకొని స్నానం చేసి తీర్థ శ్రాద్ధాన్ని నిర్వహించాడు. వివిధ ప్రకారాల దానాలనూ ఇచ్చాడు. తరువాత గురువుగారు వారికి వేంకటాద్రీ యొక్క మహత్త్వాన్ని వినిపించాడు. యాత్రికుల మనసులు శ్రద్ధాతిరేకములు కాగా వారు మిక్కిలి ప్రేమగా ఆ పవిత్ర పర్వతాన్నధిరోహించసాగారు. గురువుగారు వారికి నారద, ప్రహ్లాద, పరాశర పుండరీకాది మహా భాగవతోత్తముల పుణ్య కథలను వినిపిస్తూ వెళ్ళసాగారు. ఇవి కాక నామరసాస్వాదన వుండనే వుంది కదా! నిజం చెప్పాలంటే వారు నడవడం లేదు. ఆనందరసాబ్ధిలో దిగి నిలబడితే ఆ తరంగాలే వారిని ముందుకి గొనిపోతున్నాయి. జామ ఆనందానికి అంతేలేడు.

దారిలో వారికొక మనోరమమైన తీర్థం తగిలింది. జాంబవతి ‘గురుదేవా! ఇది ఏ తీర్థము? ఇక్కడెవరో పరమభాగ్యశాలినే భగవంతుడు అనుగ్రహించినట్లనిపిస్తోంది. ఎవరు వారు? అని అడిగింది.

ప్రసన్నుడైన గురుదేవులిలా ప్రవచించారు. ‘అమ్మా! దీని పేరు నారసింహ తీర్థము. భక్తరాజు ప్రహ్లాదుడు శ్రీనివాసుని దర్శించుటకై ఇక్కడికి విచ్చేశాడు. ఆతనితోబాటు కొందరు మిత్రులు కూడా వచ్చారు. వారు దైత్యులే అయినా భక్తులు, వారు ప్రహ్లాదునిలా అడిగారు. ‘మిత్రమా! మనకందరికీ భగవానుని చూడాలనే ఉత్సుకత ఎక్కువగా నున్నది కదా. నృసింహరూపుడైన శ్రీనివాసుడిక్కడి ప్రతికణంలోనూ వ్యాపించి యున్నాడని చెప్పావు కదా! ఈ విశుద్ధ జలంలో ఆయన మాకెందుకు కనబడుట లేదు? మాకాయన దర్శనాన్ని చేయించు’.

దైత్యులు సహజంగా ఎలా మాట్లాడతారో తెలిసిన ప్రహ్లాదుడు వారి పట్ల ప్రసన్నుడై భగవంతుని ప్రార్థించగా ఆ మహాభక్తుని పట్ల నిత్యమూ ప్రసన్నంగా వుండే పరమాత్మ ఆ బృందానికంతటికీ ఆ నీటిలో దర్శనమిచ్చాడు. అంతేకాక ఇకపై ఆ జలాశయంలో స్నానం చేసినవారు జ్ఞానవంతులవుతారని వరం కూడా ఇచ్చారు. ప్రహ్లాదాది ఆ భక్త శిఖామణులు సామాన్యశరీరాలను త్యజించిన తరువాత అనంతాత్మరూపులై ఇక్కడే నివసించ సాగారు. ఇప్పటికీ వున్నారు. ఎప్పటికీ వుంటారు. మహాభాగవతోత్తములకు ఈనాటికీ ఇక్కడ మధ్యాహ్నం దాటాక నృసింహ నామమూ, జయజయధ్వనులూ వినిపిస్తుంటాయి.’

అందరికీ రోమాంచమునూ అశ్రుధారాపాతమునూ అవిరళభక్తి భావజనితములుగా కలిగించింది ఈ ఇతిహాసం. వారి భక్తికి ప్రసన్నుడై ముగ్ధుడై శ్రీనివాసుడు వారికి అక్కడే దర్శనమిచ్చాడు. జాంబవతి మధురభావానికనుగుణంగా ఆ స్వామి కోటి మన్మథుల అందంతో కమనీయ రూపంలో దర్శనమిచ్చాడు. చూస్తుండగానే జాంబవతికి అంగాలన్నీ శిథిలమైనట్లయింది. రోమాంచం కలిగింది. కంటి నుండి ప్రేమాశ్రువులు ధారకట్టి జారగా అమె పాదాల వద్ద నొక మడుగు వంటి దేర్పడింది. ఎట్లో గొంతు పెగుల్చుకొని ‘నాథా! నన్ను నీ చరణదాసిగా స్వీకరించు’ అనగలిగింది జాంబవతి.

ఇంతవఱకు తన సౌందర్య సుధనే చవి చూపిన శ్రీనివాసుడిపుడామెకు తన వాక్సుధను కూడా సమర్పిస్తూ ఇలా అన్నాడు. *‘జాంబవతీ! నేను నీకు వేంకటేశ మంత్రాన్నుపదేశిస్తాను. నువ్విక్కడే వుండీ దాన్ని జపిస్తూ తపము చెయ్యి’ అని అనుగ్రహించాడు. జాంబవతికామాటకి తన చెవిలో అమృతం కురిసినట్లయింది. ఆనందంతో పరవశమైపోయింది. అప్పటిదాకా వున్న లజ్జ ఏమై పోయిందో, ఉన్నట్లుండి అనంద నృత్యం చేయసాగింది. ఆ నృత్యానికి బ్రహ్మాండమంతా పరవశమై పోయి నాట్యం చేస్తున్నట్లు ఊగింది. స్వర్గం నుండి అప్సరసలు దిగి వచ్చి ఆమె కిరువైపులా సర్దుకొని నర్తించసాగారు. దేవదుందుభులు మ్రోగుతుండగా దేవతలామెపై పుష్పవృష్టిని కురిపించారు.

(*శ్రీనివాసుడే స్వయంగా ఉపదేశించిన వేంకటేశమంత్రం ‘ఓం వేంకటేశాయ నమః ఓం)

ఇలాగే భగవంతుని ప్రేమచే ఆహ్లాదితయై జాంబవతి తీర్థయాత్రను కొనసాగించింది. గురువుగారామెకు శ్రీ వేంకటేశ్వర మాహాత్మ్యాన్ని వినిపించారు. శ్రీనివాసుడు సదాచరించే స్వామి పుష్కరిణి కథనీ చెప్పారు. ఇలా ఆ యాత్ర కొనసాగుతున్న ప్రతి నిముషమూ ఆమెకు శ్రీనివాసునిపై గల ప్రేమానురాగాలు పెరిగిపోసాగాయి. గురువుగారు వేంకటాద్రిపై చూపి చెప్పిన ప్రతి శీర్థాన్నీ జాంబవతి మనసారా సేవించింది. చివరగా ఋషితీర్థాన్ని చేరుకున్నపుడు సప్తరుల పాదముద్రలచే పవిత్రమైన ఆ నేలనామె కన్నుల కద్దుకొని ఆ ధూళిని నుదుటికి రాసుకొని అక్కడే ఉండిపోయింది. ఆ తీర్థంలోనే తపస్సుననుష్ఠించింది.

గరుడా! నేను అవతరించే దాకా ఆమె అలా తపస్సు చేస్తూనే వుంది. ఆమె శరీరం అత్యంత పవిత్రమై పోయింది. చివరికి నేను తన పతిని కావాలనే అభిలాషతో, యోగధారణ ద్వారా తన శరీరాన్ని త్యజించి వెంటనే భక్తశిఖామణియైన జాంబవంతుని ఇంటిలో మరల జన్మించింది. అక్కడ కూడా ఆమె పేరు మారలేదు. ఈ జన్మలో కూడ ఆమెది ఏక మాత్ర నిష్టయే - హరినిష్ఠ ఆమె తండ్రి జాంబవంతుడు కూడా మహాభక్తుడు, అతడు తన పుత్రికను నాకు పత్ని రూపంలో సమర్పించి తన జన్మ ధన్యమైందని మురిసిపోయాడు.

గరుడా! నిజమైన భక్తిలో కోరికలుండవంటారు, నిజమే. కాని తనను తాను భగవంతునికి సమర్పించుకోవాలనే కోరిక మామూలు కోరిక కాదు. అది భక్తికి పరకాష్ట. (పరాకాష్ఠ యనుట సరికాదు.) జాంబవతి భక్తి సఫలమైంది. విశ్వనాథుడే విధివిహితంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె ఆనందానికి అంతుగాని ఉపమానం గాని లేవు’

శ్రీకృష్ణుడు గరుడునికి ఆ తరువాత శ్రీనివాస భక్తితత్త్వాన్ని బోధించాడు. ఆయన మాహాత్మ్యాన్ని కూడా వర్ణించి చెప్పి ఇలా ప్రవచించాడు. ‘వత్సా! వైనతేయా! భగవంతుని ఎన్ని పనుల్లో వున్నా మానవులుగాని ఇతరులుగాని మరచిపోరాదు. నిరంతరం ఆయనను ‘హరి’ మున్నగు మంగళమయ నామాల ద్వారా తలచుకొంటూనే వుండాలి.

హరిం హరిం ప్రవదేత్ సర్వదైవ ॥ (బ్రహ్మ..ఽ9/64)

శుభాన్ని కోరుకునేవారు తమ శాస్త్రవిహిత కర్మల నాచరిస్తూనే ప్రతి క్షణమూ లేదా వీలైనపుడు వాసుదేవ హరిస్మరణాన్ని చేస్తునే వుండాలి.

పూర్తిర్య దాక్రియతే కర్మణాం చ

సమ్యగ్ స్మరేత్ వాసుదేవం హరించ ॥ (బ్రహ్మ..ఽ9/68)

ఇలా చేయడం వల్ల నారాయణుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. ప్రాణులు భగవంతుడైన విష్ణుదేవునికి ప్రియకరములైన కార్యములందే అనురక్తిని పెంచుకోవాలి.

హరిప్రీతి కరే ధర్మే

ప్రీతి యుక్తో భవేత్ సదా ॥ (బ్రహ్మ..ఽ9/70)

అని ముగించాడు సూత మహర్షి

గరుడ పురాణ మాహాత్మ్యం ఈ గ్రంథంలో మూడు కాండలలోనూ చెప్పబడింది. అదంతా ఒక చోట చేర్చి అనువదింపబడింది.