3 - గరుడ పురాణము - బ్రహ్మ కాండము
2 - గరుడునికి శ్రీకృష్ణుడు చెప్పిన విష్ణుమహిమ - ప్రళయాంతంలో శేషశయనుని స్తుతి - మేలుకొలుపులు
గరుత్మంతుడొక మారు భూలోకంలో దర్శనమిచ్చిన శ్రీ కృష్ణుని విశ్వసృష్టి విషయమై ప్రశ్నించాడు. అ గీతాచార్యుడు సుప్రసన్నుడై ఇలా చెప్పసాగాడు.
‘ఓ పక్షీంద్రా! ఈ సృష్టికి మూలకారణం అవ్యయ పురుషుడైన శ్రీ మహావిష్ణువు. ఆయన సర్వవ్యాపకుడు, విశ్వమంతటా నిండి వుంటాడు. పూర్ణుడైన కారణాన ఆయనే అన్ని అవతారాలనూ ఎత్తగలడు. అనేక రూపాలతో నున్న ఈ దృశ్యజగత్తుని ఏకరూపంగా చేసి ప్రళయకాలంలో తనలో లీనం చేసుకుంటాడు. ఆయన గుణాల్లో, రూపాల్లో, అవతారాల్లో, అవయవాలలో, వైభవాది ఐశ్వర్యాలలో భేదరూపం (భిన్నరూపాలు) కనిపిస్తున్నా ఆయననొక అభేదరూపంగానే మనం దర్శించాలి. అప్పుడే అజ్ఞానాంధకారం నుండి వెలుగులోకి వెళ్ళగలము.
ప్రళయకాలీన సముద్రమంతటా తానే వ్యాపకుడై శ్రీమహావిష్ణువు అన్ని జీవరాశులనూ తన ఉదరంలో కలిపి వేసుకొని శయనిస్తాడు. బ్రహ్మాది దేవతలు కూడా ఆయనలో కలిసిపోయి బయటికి కనబడరు. సృష్టి మొత్తం మీద విష్ణుమూర్తి, లక్ష్మీదేవిమాత్రమే మిగిలి వుంటారు. విష్ణుమూర్తి అలాగే ఒక కల్పం - అనగా బ్రహ్మదినం, వెయ్యియుగాలు, పదునాలుగు మన్వంతరాలు, మానవులకైతే నలుబది మూడుకోట్ల ఇరవైలక్షలయేళ్ళు పాటు శయనిస్తాడు. లక్ష్మీదేవి ఆయనను స్తుతిస్తుంది. పర్యంకరూపంలో, వాసరూపంలో మరెన్నో రూపాలలో ఆమె విష్ణువును సేవిస్తుంది.
శౌనకా! శ్రీకృష్ణుడే స్వయంగా తన మూలరూపమైన మహావిష్ణువును ఇలా స్తుతించాడు (గరుడుడు వింటున్నాడు) హే! విష్ణూ నీవు అందరికన్న అన్నిటికన్న ఉత్కృష్టుడవు. అందరు దేవతలలోకి ఉత్తముడవు కావున నీవు ఉత్కృష్టుడవు. నీతో సమానుడు గాని నీకంటె అధికుడుగాని సృష్టిలోనే లేరు. నీవే ఏక మాత్ర అద్వితీయ బ్రహ్మవు. బ్రహ్మ శబ్దానికి ప్రయోగం నీవే. ముఖ్య బ్రహ్మవునీవే. నీ తరువాత బ్రహ్మ రుద్రాదులు బ్రహ్మములగుచున్నారు. అనంతగుణ పరిపూర్ణుడవు కావున శ్రీహరివైన నిన్నే బ్రహ్మము అని కూడా అంటాము. గుణాడుల పూర్ణత లేకుండుట వల్ల ఇతర దేవతలు పరబ్రహ్మము కాలేరు. నీ గుణాలు అనంతాలు. నీవే అనంతుడవు. నిన్ను నేనే కాదు బ్రహ్మ రుద్రులు కూడా పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాలేదు. ఇంద్రాగ్ని యమాది వేల్పులు కూడ నీ గుణాలను పూర్తిగా చూడలేరు, గానం చేయలేరు. నీ పూర్ణ రూపాన్ని దేవర్షి నారదుడు, సప్తర్షులు, గంధర్వులూ - ఇంకెవ్వరూ పూర్తిగా దర్శించ సమర్థులు కారు. ఇక సామాన్యులమాట చెప్పేదేముంది? నీ నుండియే దేవతల సృష్టి జరిగింది. నీ శక్తియే బ్రహ్మలో చేరి సృష్టి కార్యాన్ని నిర్వహిస్తోంది. బ్రాహ్మణులు చేసే వేదాది అధ్యయనమంతా ‘హరి’ నామకమే. వారు నీ కత్యంత ప్రియులు. నాకు (అంటే శ్రీకృష్ణునికి) కూడా మీరే స్వామి. ఈ విషయాన్ని ముందు తెలుసుకొని వేదం చదివే వాడు ద్విజోత్తముడు. నిన్ను కాదనుకొనేవాడు వేదవాదికాడు, వేదావాది. నిన్ను పూజిస్తూ వేదం చదివే వాడే వేదపాఠి. (వేదవాది అనే మాట కూడా మంచి అర్థంలో లేదు)
గరుడా! లోకాల్లో అజ్ఞానులైన జీవుల ద్వారా కోట్ల సంఖ్యలో అపరాధాలూ, మహాపచారాలూ జరుగుతునేవుంటాయి. అయినా పరమదయాళువైన శ్రీహరి పశ్చాతప్త హృదయులు మూడుమార్లు తన నామాన్నుచ్చరిస్తే చాలు; క్షమిస్తాడు.
మహాపరాధాస్సంతి లోకే మహాత్మన్
సహస్రశః శతశః కోటిశశ్చ ।
హరిశ్చతాన్ క్షమతే సర్వదైవ
నామత్రయ స్మరణాద్వై కృపాలుః ॥
కల్పాంతంలో విష్ణువు మేల్కొనవలసిన వేళ దేవతలంతా ఆయనను ఇలా స్తుతించారు - ‘హే ప్రభో వేదాల ద్వారా తెలియదగినవాడవు, యజ్ఞస్వరూపుడవునైన గోవిందా! నీవు వేగ మా పట్ల ప్రసన్నుడవై వెంటనే మేల్కొనవలసియున్నది. జగత్తుని రక్షించి ఉద్దరించ వలసియున్నది. ఇక నీవు యోగనిద్రను పరిత్యజించి ఆనంద స్వరూపుడవై అరుదెంచాలి. ఈ జగత్తుకి సృష్టీ, ప్రళయమూ కూడా నీ సంకల్పమే.
బ్రహ్మను సృష్టించి నీవే ఆయనచే జగత్తును సృష్టింపజేయవలసిన సమయం ఆసన్నమైంది. రుద్రుని సంహారకునిగా నిలుపవలసినది కూడా నీవే. హరీ! ఓ మురారీ! కల్పాదినీ కల్పాంతాన్నీ చేయడానికి నీవు మేల్కొనిరావాలి. ఓ మహాత్మా జగత్తంతటా అలముకొనియున్న దుఃఖస్వరూపాంధకారాన్ని దూరం చేయాలి. ఓ దేవదేవా! భక్తుల దుఃఖాన్ని చూస్తే నీవు కూడా దుఃఖితుడవైపోయేటంత కరుణా సముద్రుడవు. లేచి మమ్ముకాచు.
నారాయణ! వాసుదేవ! కృష్ణ! అచ్యుత! మాధవ! దయామూర్తీ! లక్ష్మీపతీ! నీకు శతకోటి నమస్కారములు.
సరస్వతీశ! రుద్రేశ ! అంబికేశ! చంద్రేశ! శచీపతీ! నీవు బ్రాహ్మణులకూ గోవులకూ స్వామివి. నీ పేరే శాస్త్రప్రియుడు. ఋగ్వేదయజుర్వేద ప్రియా! మేలుకో! నిదానమూర్తీ! మమ్మేలుకో. హే సామాథర్వప్రియా, మురారీ! పురాణ మూర్తివి, స్తుతిప్రియుడవునగు విచిత్ర మూర్తీ! మేలుకో.
ఈ స్తుతికి బద్ధుడై భగవంతుడైన మహా విష్ణువు యోగ నిద్రను త్యజిస్తాడు.
