3 - గరుడ పురాణము - బ్రహ్మ కాండము

Table of Contents

20 - భద్ర, మిత్రవింద కృష్ణపత్నులైన విధము

 “అన్ని శుభలక్షణాలతో విష్ణుపత్నికి అవసరమైన అన్ని భద్రమైన గుణాలతో భద్రయను పేరు గల కన్య, పూర్వజన్మలో, నలుడను సామాన్యుని ఇంట దివ్యజ్ఞాన సంపన్నురాలై జన్మించింది. అందరు ఆడపిల్లల తండ్రులలాగే నలుడు కూడా తన కన్యకు వివాహం చేయ సంకల్పించాడు. దానికి ఉపోద్ఘాతంగా ఆమెతో ఇలా అన్నాడు- ‘అమ్మా భద్రా! నీలో సామాన్య కన్యకల లక్షణాలు కనబడటం లేదు. ఎప్పుడూ ఏదో పూజలంటావు, నైవేద్యాలంటావు, ప్రదక్షిణలంటావు. మామూలు మాటలు, ఆటపాటలు, అమ్మలక్కలతో అనుబంధాలు, కనీసం పరిచయాలు వుంటే కదా నీ మంచి లక్షణాలు నలువైపులా పాకి నీకు మంచి సంబంధాలొచ్చేది? ఇంత శ్రమపడి, శరీరాన్ని శుష్కింపజేసుకొని పూజలు చేసే నీవు ఏ ఫలాన్ని ఆశిస్తున్నావో చెప్పగలవా?”

భద్ర ఇట్లన్నది;  ‘తండ్రీ! నా పితృదేవుడవైన నీకు నేనేమి చెప్పగలను? భగవంతుడికి నమస్కారాదిక్రియలు చేయడం వల్ల వచ్చే ఫలాన్ని ఎవరు చెప్పగలరు? అయినా నా విషయమై నా ప్రయత్నం నేను చేస్తాను. తండ్రీ! నా జీవితపు తొలినాళ్ళ నుండి కూడా కరుణా నిధానమగు విష్ణు భగవానుడే నా స్వామి. నేను హరికి దాసిని. హరిదాసులకు దాసిని. అంబుజోదర దివ్య పాదారవిందాలకు నమస్కరించి నన్ను రక్షించు మహాప్రభో” అని వేడుకుంటాను. ఇలా అంటూనే ఆమె భక్తి పరవశయై నేలపై సాష్టాంగపడి విష్ణువుకి నమస్కరించి లేచి మరల తండ్రితో మాట్లాడసాగింది. ‘ఓ తండ్రి ప్రతీ జీవీ నిత్యం, నిరంతరం విష్ణుభగవానునికి ప్రణామం చేస్తూనే వుండాలి. ఆయనకు వందనమే ఆనందనందనము. పూజదాకా పోనక్కరలేదు. నామస్మరణం, ప్రణామ నివేదనం, వందనం - ఈ మాత్రపు సేవకే ఆయన సంతుష్టి చెందిపోయి శుభం కలిగిస్తాడు. అందుకే ఆయనే కరుణాపయోనిధి.

నాన్నగారూ! విష్ణుదేవునికి దండం పెట్టని వారి శరీరం పెద్ద దండగ. దాన్ని పోషించడం వ్యర్థం. వారు నరకానికి పోకుండా ఆపగలిగేశక్తి మరల ఆ విష్ణుభగవానునికే ఉంటుంది. దేవశ్రేష్ఠులకు కూడా హరినామ స్మరణమే పరమోపాయము. ఏ నాలుకపై నైతే ‘హరికృష్ణ’ అనే పదాలుండవో అది, జ్ఞానేంద్రియం కాజాలదని జ్ఞానులు వక్కాణిస్తారు.

కాశీ నివాసం కన్న, ప్రయాగలో మరణం కన్న, యజ్ఞాదుల యాజమాన్యం కన్న, సర్వతీర్థాభిగమనం కన్న - ఇలాంటి, మనకు తెలిసిన ఎన్నో - కాదు, అన్ని - పుణ్య కార్యాల కన్న - హరినామస్మరణమే మిన్న.

కాశీనివాసేన చ కిం ప్రయోజనం

కిం వా ప్రయాగే మరణేన తాత ॥

కిం వా రణాగ్రే మరణేన సౌఖ్యం

కింవా మఖాదేః సమనుష్ఠితేన ।

సమస్త తీర్థేషటనేన కిం కీమ

ధీత శాస్త్రేణ సుతీక్ష్ణబుద్ధ్యా ॥

యేషాంజిహ్వాగ్రే హరినామైవ నాస్తి

యేషాం గాత్రైర్నమనం నాపి విష్ణోః ।

యేషాం పద్ భ్యాం నాస్తి హరేః ప్రదక్షిణం

తేషాం సర్వం వ్యర్థమా హుర్మహాంతః ॥ (బ్రహ్మ....ఽ0/10-1ఽ)

కాబట్టి ఓ తండ్రీ! ప్రాణుల యొక్క ప్రథమ కర్తవ్యం సర్వకాల సర్వావస్థలందూ హరిని స్మరించడం, పూజించడం, ప్రదక్షీణించడం, జపించడం, స్తుతించడం. మానవ జన్మ దుర్లభమే. అయితే నశ్వరం కూడ. దగ్గితే ఊడిపోయే ముక్కులాటి ఈ శరీరంతో శాశ్వతమైన కీర్తినీ, స్థానాన్నీ సంపాదించుకోగలిగితే అది చాలా గొప్ప విషయమే కదా! అలా సంపాదించి పెట్టేవాడు హరి. అందుకే నా జీవితం ఆయనకే అంకితం. తండ్రీ! మీరు కూడా జీవితాన్ని ఆయనకు నైవేద్యం చేయండి”.

భద్ర ఇలా ప్రవచించగానే ఆమె తండ్రికి భద్రావిష్ణుల తత్త్వం అవగతమైంది. ఆయన కూడా హర్యుపాసనలో పడ్డాడు. వారిద్దరూ అలా హరిని ధ్యానిస్తూనే ఆ జన్మను గడిపేశారు. ధ్యానంలోనే మృతి చెందారు.

పక్షిరాజా! మరుజన్మలో ఆమె నా మేనత్త గారింట జనించింది. దైవికంగా ఆమెకు భద్ర అనే పేరే పెట్టబడింది. ఆమెకు కైకేయి అనే పేరు అనుకున్నారు. గానీ మునులు, పెద్దలు ఆమె భద్రమైన లక్షణాలను చూసి ‘భద్ర’ అనే అన్నారు. నేనామెను సలక్షణంగా వివాహం చేసుకున్నాను.

ఓ గరుడా! మిత్రవింద నా పతియగుట కూడా ఆమె కారణజన్మురాలగుట వల్లనే. పూర్వజన్మలో ఆమె హరిని మిత్రరూపంలో పొందాలనుకొనేది. సర్వకాల సర్వావస్థలలోనూ హరిని ఎలా పొందాలనే ఆలోచన తప్ప ఆమెకు మరొకటి వుండేది కాదు. ఆమెకెన్నో తెలుసు. చివరకు ‘సాత్త్విక పురాణాలందు వర్ణితములైన భగవానుని కథలను శ్రవణము చేయుటయే సర్వసాధనాలలోకీ శ్రేష్ఠమైనది’ అనే నిశ్చయానికి వచ్చింది. విష్ణు కథలు వినని వారి జన్మవ్యర్థమని నిర్ణయించుకుంది; గరుడా! ఆమె ఆలోచన ఎంత సముచితమో కదా! విష్ణు సంబంధిత కథారూపియగు మహానది ప్రవహించని చోట నారాయణ పదాంబుజాశ్రయం కానిచోట, ముఖం నుండి శ్రీహరి నామస్మరణం, కలువ నుండీ తుమ్మెద ఝంకారం వలె వెలువడని చోట, ఎంత తప్పనిసరైనా, ఒక్క క్షణం కూడా నిలువరాదు. భాగవత శాస్త్ర చర్చలు జరగని గ్రామంలో, భాగవత రసపిపాసులు లేని ఊరిలో, భగవద్గీతా ప్రవచనాలు గాని విష్ణు సహస్రపారాయణం గాని జరుగని జనావాసాల్లో, హరికథా గానం చెవికీ సోకని ప్రదేశాల్లో బతుకు తెరువు కోసం ఉండిపోయినా, అట్టివారి జీవితం వ్యర్థమే.

యస్మిన్ గ్రామే భాగవతం న శాస్త్రం

న వర్తతే భాగవతా రసజ్ఞాః ।

యస్మిన్ గృహే నాస్తి గీతార్థ సారో

యస్మిస్ గ్రామే నామ సహస్రకం వా ॥

తయో రసజ్ఞా యత్ర నసంతి తత్ర

న సంవసేత్ క్షణ మాత్రం కథంచిత్ ।

యస్మిన్ దినే దివ్య కథాచ విష్ణోర్నవాస్తి

జంతో స్తస్య చాయు ర్వృథైవ ॥ (బ్రహ్మ....ఽ0/ఽ9, 30)

‘రసికుడైన విద్వాంసుడు తన చెవులకు బంగరు కుండలాల వల్ల సౌందర్యం వస్తుందనుకోడు. చెవులకు నిజమైన అందం వాటిలో నెల్లవేళలా హరిగాథలు ‘రింగు రింగు’మనడమే! ఎవడైతే నిత్యమూ భాగవతార్ణ తత్వాన్ని వింటూ దాని గురించే మాట్లాడుతూ వుంటారో, వారి జీవితమే సఫలము. ఈ విశ్వంలో సర్వత్ర వ్యాప్తి చెందియున్నవాడు శ్రీ మహావిష్ణువే. ఆయనే నిత్యుడు, అంతర్యామి. ఎవరైతే నిత్యమూ ఆయన భక్తులుగానే జీవిస్తారో వారి యోగక్షేమాలను ఆయనే స్వయంగా చూసుకుంటాడు. భక్తుల కశుభము కలుగదు. కాబట్టి నాన్నగారూ! నేను కూడా ఆయన సత్కధలను వింటూనే జీవిస్తాను. అలా వింటూనే తనువు చాలిస్తాను’ అని మిత్రవింద అలాగే చేసి మరుజన్మలో నా మేనత్త సుమీత్ర కూతురిగా జనించింది. స్వయంవరంలో ఎందరో క్షత్రియ వీరులను దాటుకొని నా మెడలో మాల వేసి నన్ను వరించింది. నేను ఆమె కోరికను మన్నించి ఆమెను అపహరింపదలచిన రాజుల నోడించి ద్వారకకు తీసుకువచ్చి శాస్త్ర వీధిని వివాహమాడాను.