3 - గరుడ పురాణము - బ్రహ్మ కాండము
22 - లక్షణా పరిణయం
ఓ ఖగపతీ! లక్షణ వివాహ వృత్తాంతాన్ని వినిపిస్తాను. ఈమె పూర్వజన్మలో సకల వేదపారంగతుడైన అగ్నిదేవుని పుత్రి. అన్ని ప్రకారాల శుభలక్షణాలతోనూ పుట్టడం వల్ల ఈమెకు సులక్షణ (సులక్ష్మణ) అను పేరు కలిగింది. అన్ని రకాల శుభ లక్షణాలూ సంపూర్ణంగా గల పురుషుడు మహావిష్ణువొక్కడే కదా! ఆయన ప్రతిరూపుడీ లోకమున శ్రీకృష్ణుడే కదా అని యెంచి ఆమె నన్ను పతిగా భావించి పూజలు చేయసాగింది. వివాహ ప్రసక్తిని దెచ్చిన తండ్రితో ఆమె ఇలా అంది నాన్నగారూ! ఆ శ్రీహరి సర్వత్ర వ్యాపించి, అందరిలోనూ వుండే సర్వాంతర్యామి. దానాది శుభకర్మలేవి చేసినా ఆయననే ఉద్దేశించి చేయాలి. ఆయనను భక్తిపూర్వకంగా వివిధోపచారాలను సమర్పిస్తూ మనసులో నిలుపుకొని ఆ దేవదేవుని సంతుష్టపఱచడానికి ప్రయత్నించాలి. భక్తిసహితంగా నివేదింపబడిన అన్నపానాది పదార్థాలను ఆ శ్రీమహావిష్ణువు నిస్సందేహంగా స్వీకరిస్తాడు.
గృహస్థు ఎప్పుడూ కూడా సర్వప్రథమంగా యోగ్య పదార్థాలనన్నిటినీ శ్రీహరికీ సమర్పించిన తరువాతే తన పనులు చూసుకోవాలి. అట్టివారే ధన్యగృహస్థులు. ఎవరికి ఎట్టి దానమిచ్చినా మాధవుడే వచ్చి గ్రహిస్తున్నాడనుకొని దానగ్రహీతను ఆదరించి దానం చెయ్యాలి. ఈ రకంగా ఇతరులకు దానమిచ్చినా దానిని తానే గ్రహించి విష్ణువు సంతుష్టుడవుతాడు. ఆ వాసుదేవుడే వసించు దేవుడు. ఆయనే మన ఇంటిలోనూ ఒంటిలోనూ వెలిగే దీపం. నేనా మాధవుని భక్తురాలిని. ఇంకొకరిని నాధవునిగా ఊహించలేను’.
తరువాత కొంత కాలానికామె ‘నాకు కృష్ణుడే పతిగా రావాలి గాక’ అని కోరుకుంటూ ప్రాణ పరిత్యాగం చేసింది. మరుజన్మలో ఆమె మద్ర దేశాధీశుని పుత్రిగా జనించింది. మహావీరుడైన ఆమె తండ్రి మత్స్యయంత్రాన్ని ఛేదించగలవానికే పిల్లనిస్తానని స్వయంవరం ప్రకటించాడు. నేనామె గత జన్మనాటి కోరికను తీర్చడం కోసం మద్రదేశానికి పోయి ఆ యంత్రాన్ని ఛేదించి ఆమెను పెండ్లి చేసుకున్నాను.
