3 - గరుడ పురాణము - బ్రహ్మ కాండము
10 - 13 - నారాయణకృత ప్రాకృత, వైకృత సృష్టి
“ప్రభో శ్రీకృష్ణచంద్రా! ఈ విధంగా దేవతలకు ఆశ్రయమిచ్చిన భగవానుడు స్వయంగా వారిలోనే తానెలా ప్రవేశించాడు? సృష్టి ఏ విధంగా జరిగింది? దయచేసి ఉపదేశించండి”
వచింపసాగాడు వసుదేవనందనుడు.
“పక్షీంద్రా! ఒక దానికొకటి సంబంధింపని అన్ని తత్త్వాలలో భగవంతుడైన విష్ణుభగవానుడు ముఖ్య కేంద్రరూపంలో ప్రవేశించడంతో అన్ని తత్త్వాలలో తీవ్రమైన కదలిక లేర్పడ్డాయి. అప్పుడాయన సర్వప్రథమంగా కనకంవలెకనిపించిన బ్రహ్మాండము
(గుడ్డు) ను సృష్టించాడు. అది యాభై కోట్ల యోజనాలలో విస్తరించింది. దానిపైనొక బంగరు వలయాన్ని, అంతే విస్తీర్ణంలో సృష్టించాడు. దానిపై అదే వైశాల్యంతో అదే ఆకారంలో భూమిని సృష్టించాడు. మొత్తంగా ఆ బ్రహ్మాండం వందకోట్ల యోజనాల మేరదాటింది. ఈ బ్రహ్మాండం ఏడు వృత్తాలుగా విభజితమైంది. తొలి భాగం పదివేలకోట్ల యోజనాల్లో నీరు, రెండవ భాగం నిప్పు, మూడవపరిధి శివునిది, నాలుగవ ఆవరణం ఆకాశం, అయిదవది అహంకారానిది కాగా ఆరవది మహత్తత్త్వాత్మకం, ఏడవది త్రిగుణాత్మకం.
ఈ అండంచుట్టూ వున్నది కూడా ఆకాశమే. దాని మధ్యంలో విరజానది సృష్టింపబడింది. దీని పరిధి అయిదు యోజనాలు. ఇది అతిశయపుణ్యవతియైన నది. దీనిలో స్నానంచేస్తే హరిపాదసన్నిధి లభిస్తుంది. ప్రారబ్ధకర్మలన్నీ క్షయమైపోయినవారికే ఈ నదిలో స్నానంచేసే అదృష్టంపడుతుంది. ఖగేశ్వరా! మరొకమాట. ప్రళయంలో కూడా ఈ నది లయమునొందదు. లోకులయొక్క శరీరమును త్యజింపజేసేది కాబట్టి దీనిని లక్ష్మీ స్వరూప అంటారు. విరజానది తరువాత వ్యాకృతమైన (కనిపించు) హద్దులేని ఆకాశంలో లక్ష్మీదేవి కిష్టమైన ప్రాంతముంది. దీనికి అభిమానినీ దేవత ఆ పద్మాసనయే. సృష్టి సమయంలో బ్రహ్మాండాని కభిమానిదేవత బ్రహ్మ. ఆ సమయంలో ఆయనను ‘విరాట్’ అనే నామంతో పూజిస్తారు. అవ్యయాత్మయగు భగవానుడు శ్రీహరి ఈ రకంగా సృష్టించిన జగతిలో క్రిందా పైనా లోనా బయటా అంతటా వ్యాప్తుడై నిత్యస్థితుడై వుంటాడు. పక్షీంద్రా! దీనిని ప్రాకృత సృష్టిగా సంభావించారు. అవ్యక్తాదులతో సహా ఈ అండరూపం గల జగతిలో బ్రహ్మరూపంలో పుట్టినవన్నీ ప్రాకృత సృష్టములు కాగా బ్రహ్మాండ, బ్రహ్మాండాం తర్వర్తియగు సృష్టి వైకృతమనబడింది.
ఓ అండజకులమండనా! ప్రకృతి పురుషులలో పురుషుడని చెప్పబడిన ఆ విష్ణుదేవుడు సాక్షాత్తూ పురుషోత్తముడే. ఆయన ఆ సువర్ణాండ మధ్యంలో నున్న జలరాశిలో వేయి సంవత్సరాలు శయనించాడు. అప్పుడు లక్ష్మీ జలరూపంలో, విద్యాదేవి శయ్యారూపంలో, వాయుదేవుడు తరంగ రూపంలో వున్నారు. తమస్సంతా నిద్రరూపాన్ని ధరించింది. వీరుగాక వేరెవ్వరూలేరు. అపుడా శయనమూర్తిని లక్ష్మీ స్తుతించింది. ప్రకృతి అప్పుడు శ్రీ, భూదేవీమతల్లులగూపంలోనూ, శేషుడు వేదరూపాన్ని ధరించీ హరిని స్తుతించారు. స్తుతివల్ల సంతుష్టుడై ప్రబుద్ధుడై శ్రీమహావిష్ణువు మేల్కొని చైతన్య స్వరూపుడైనాడు. నిజానికాయన నిత్యప్రబుద్దుడే. (ఈ నిద్రా, దాని పరిత్యాగమూ ఆయనకు లీల, మనకు మాయ - అను). అపుడాయన నాభినుండి హీరణ్మయపద్మముద్భవించింది. దీనిని ప్రాకృత సృష్టిగానే భావించాలి. ఇది భూదేవి అభిమానినిగా కలది. ఆ పద్మం అసంఖ్యాక సూర్యులతో సమాన కాంతిని కలిగి వుంది. చిదానందమయుడైన విష్ణువీ ప్రాకృత సృష్టికి భిన్నుడు. ఇదాయన అలంకారాలలో నొకటీగా భావింపబడింది. హరి అలంకారాలలో కీరీటాదులు స్వరూపభూతాలనీ స్వరూపభిన్నాలనీ రెండు ప్రకారాలు. ఆ హిరణ్మయపద్మం నుండీ చతుర్ముఖ బ్రహ్మ ప్రాదుర్భవించాడు. ‘నన్ను సృష్టించిన ప్రభువెవ్వరో’ అనే జిజ్ఞాసతో నలువంకలాచూసి ఆ పద్మనాళంలో ప్రవేశించాడు. అక్కడిక దిక్కుతోచలేదు, జిజ్ఞాస తీరలేదు కాని తపముచేయి - తపముచేయి’ అనే శబ్దాలు వినిపించాయి. వెంటనే బ్రహ్మకు తన కర్తవ్యం బోధపడి నిష్ఠగా వేయి దివ్య సంవత్సరాలపాటు ‘హరి ప్రీతి ప్రాప్తీచ్ఛతో? కఠిన తపస్సు చేశాడు. అంతట ఆయన అమోఘ తపస్సును మెచ్చి శ్రీహరి తన భక్త శ్రేష్ఠుడైన బ్రహ్మకు దివ్యవరాలను ప్రదానం చేయడానికి సాక్షాత్కరించాడు.
ఆయన నారాయణుడనీ ఆయనను స్తుతించాలనీ బ్రహ్మజ్ఞానియైన బ్రహ్మకు వెంటనే తెలియడంతో ఇలా స్తుతించాడు. ‘చతుర్భుజుడవై అనేక నేత్ర కమలుడవై, వక్షఃస్థలంపై శ్రీవత్స చిహ్నంతో సుశోభితుడవై, కంఠమందు కౌస్తుభమణీ మాలాలంకృతుడవై, అత్యంత ప్రసన్నముద్రతో, కరుణ తొణికిసలాడు నయనాలతో నాకు దర్శనమిచ్చిన నారాయణ దేవా నీకు నమస్కారము. భక్తులకెల్లవేళలా వశుడవై ఉండు పరమాత్మవు, అత్యంత దయాళుడవు, పరబ్రహ్మస్వరూపుడవు, జగదానంద కారకుడవు, శ్రీమన్నారాయణుడవు నీవే! నన్ను కరుణించు’ అంటూ ఆయన చరణ కమలాలను కడిగి పూజించి ఆ నీటిని నెత్తిన జల్లుకున్నాడు బ్రహ్మ,
గరుడా! బ్రహ్మ స్తుతికి ప్రసన్నుడై భగవానుడు మేఘ గంభీర స్వరంలో ఇలా చెప్పాడు, “ఓ బ్రహ్మదేవా! నా వరప్రసాదబలంతో దేవతలందరినీ ఇదివఱకు సృష్టించినట్లే ఇప్పుడు కూడా కావించు. దీనివల్ల నీకేమీ ప్రయోజనం సిద్దించకపోవచ్చు కానీ నా ప్రసన్నత కోసం ఆచరించు,’ హరి ఇలా అనతివ్వగానే మహత్తత్త్వాత్మకుడైన బ్రహ్మముందుగా జీవకోటి కభిమానపాత్రుడైన వాయుదేవుని సృష్టించాడు. ఆయనయే సృష్టికీ ప్రథమపురుషాత్ముడు. తరువాత బ్రహ్మ తనకుడి చేతినుండి బ్రహ్మాజీ, భారతీ అను పేళ్ళు గల దేవీ మణులను సృష్టించాడు. ఎడమచేతితో సత్యపుత్రుడైన అగ్నిని సృజించాడు. ఆ పై కుడిచేతితో అహంకారాత్మకుడగు హరుని సృష్టించాడు. తరువాత శేషనాగ, గాయత్రి, * వారుణి, సౌపర్ణి, ఇంద్ర, చంద్ర, కామదేవులు, ఇంద్రియాభిమాన దేవతలు, మను - శతరూపా, దక్ష, వసిష్ఠాది ప్రజాపతులు, కశ్యప, అదితి, వశిష్ఠ మహాముని, అటువంటి బ్రహ్మజ్ఞానులే అయిన మరికొందరు ఋషులు, కుబేరుడు, విష్వక్సేన, పర్జన్యాది దేవతలు బ్రహ్మచే సృష్టింపబడ్డారు. గరుడా! నా కృపవల్ల పరమసమర్థుడైన బ్రహ్మ ఇంతటి సృష్టినీ అలవోకగా చేయగలిగాడు.
(*ఈ గాయత్రి మన గాయత్రి మంత్ర దేవత కాదు. మంత్ర దేవత గాయత్రీ పురుష శక్తి.)
