3 - గరుడ పురాణము - బ్రహ్మ కాండము

Table of Contents

21 - సూర్యపుత్రి *కాళింది కథ

(*కాళింది అనే మాట తెలుగులోనే వ్రాయబడుతుంది. ఇతర భాషలలో కాళిందియే.)

వివస్వంత రూపంలో నున్నపుడు సూర్యునికి జనించిన కాళింది నాపత్ని ఎట్లయినదో విను. ఈమెకు యమున, యమానుజ అనే పేళ్ళు కూడా వున్నాయి. ఆమె విష్ణు పత్నిని కావాలనే ఇచ్ఛతో విశిష్ట తపస్సును కావించింది. పూర్వజన్మలో చేసిన పాపాలను దగ్ధం చేయడానికి చేసే ప్రయత్నాన్నే తపస్సంటారు. దీనినే పాపానుతాపమనీ అంటారు.

పూర్వజన్మలో నెవరైతే ముకుందుని అసలు తలచుకోకుండానే బతికేశారో వారు జీవిత చరమాంకంలో చివరగా ఇలా దేవునికి విన్నవిస్తారు. ‘హే ముకుందా! నేనీ పుత్ర, మిత్ర, కళత్రాది బంధాలతో నిండిన సంసారంతో అత్యంత సంతప్తుడనై వున్నాను. భగవన్! నేను నీ ముఖారంవిదాన్నెప్పుడు దర్శించగలను? నేనెన్నడూ నిన్ను సేవించలేదు, పూజించలేదు. నేనెలా ఉద్ధరింపబడగలను? స్వామీ! నావంటి మహాపాపి నిన్నెట్లు చూడగలడు? నేనిలాగే ఎన్నో జన్మలుగా సాంసారిక బంధాలలో చిక్కువడి నిన్ను తలచుకోక పోవడం వల్ల మరల మరల జన్మించి, గతించి వుంటాను. ఈ సంసార బంధాల వల్ల ఏ మాత్రమూ సుఖపడలేదు. నిన్ను సేవించుకోలేదు. సత్సంగతిలో సమయాన్నీ సద్వినియోగం చేసుకోలేదు. భక్తజనులతో కలసి భజనలైనా చేయలేదు. హే మురారీ! నా శరీరం కష్టాలలో పడీ కాలిపోతోంది. ఇపుడు ఎవరిని శరణు వేడను, నీవు తప్ప నాకు దిక్కెవరు? - ఈ రకంగా పశ్చాత్తపించడాన్నే అనుతాపమంటారు. ఇపుడు చేసేదే తపము. పక్షిరాజా! కాళింది ఇలా తపస్సు చేయడానికి యమునా తీరానికి పోయి అక్కడ నా ధ్యానంలో నిమగ్నమై వుండిపోయింది.

గరుడా! ఇలా వుండగా నేనొక రోజు అర్జునునితో కలిసి యమునా తీరానికి విహారానికి వెళ్ళాను. అక్కడామెను చూసి వివరాలు కనుకొమ్మని అర్జునుని పంపాను. అర్జునుడామె కథనంతటినీ కనుక్కొని వచ్చి నాకు చెప్పాడు. తరువాత నేనొక శుభముహూర్తంలో ఆచార ప్రకారం అక్కడికి పోయి కాళిందీ పాణిగ్రహణం చేశాను. స్వయంగా సంపూర్ణానంద స్వరూపుడనైన నాకు ఏ సుఖాభిలాషా వుండదు. నా వివాహాలన్నీ భక్తానుగ్రహ దృష్టి వల్ల జరిగినవే.