3 - గరుడ పురాణము - బ్రహ్మ కాండము
18 - శేష - రుద్ర భగవానుల అవతారాలు
అనంతనాయకుడైన ఆదిశేషుడు అనంత శక్తి సంపన్నుడు. ఆయన ఆవిర్భావం హరి, సిరిల శయనం కోసమే జరిగింది. యోగనిద్రకై విష్ణుభగవానుడు రమాసహితుడై శేషునిపైననే శయనిస్తాడు. గరుడుడు కూడా ‘నేను సర్వదా నారాయణ దాస్యాన్నిచేస్తూ సదా ఆయనను పూజిస్తూనే వుంటాను’ అంటూ ఆ పరమేచ్ఛతోనూ ప్రతిజన్మలోనూ ఆయనతోనే వుంటూ ఆయనకే నమస్కరిస్తూ వుంటాను’ అనే శాశ్వతేచ్ఛతోనూ ఆ శయన స్థలం సమీపంలోనే ఆశ్రయాన్ని పొంది స్థితుడవుతాడు.
శేషుడు నారాయణ భక్తుడు. అతనిలో విష్ణు, వాయు, అనంతాంశలున్నాయి. శ్రీ స్వామి రామునిగా అవతరించినప్పుడు శేషుడాయన తమ్మునిగా లక్ష్మణునిగా జనించాడు. ‘నిత్యం స్వామినే సేవిస్తాను’ అనే ప్రతిజ్ఞను ఆ జన్మలో కూడ నిలబెట్టుకున్నాడు. తరువాతి జన్మలో బలరామునిగా పుట్టినపుడు కూడా స్వామి వెనువెంటనే నిలిచాడు.
కరుణామయుడైన పరమశివుని తత్త్వం రెండు విధాలుగా గోచరిస్తుంది. ఒకటి ఎల్లపుడూ భక్తులను గాచే దివ్యమంగళ స్వరూపం. సదాశివం. శివం అనగా శుభం, కల్యాణం, మంగళప్రదం. ఇంకొకటి రౌద్రరూపం. ఇది సంహారక వేషం. దుష్టులను శ్మశానంలో కలిపేసి తానూ అక్కడే తాండవం చేసే అవతారం. పుఱ్ఱెలను మెడలో వేసుకొని కాటీ బూడిదనొంటినిండా పూసుకొని చెడ్డవారిని భయపెట్టి మంచి వైపు పరుగు పెట్టించే రూపం. ఇదీ సదాశివమే కాని సదా - అశివం.
విష్ణుభక్తుడు, విష్ణుమిత్రుడునగు రుద్రుడు శివుడు. సదాశివుడు. ఆయనొకమారు రాక్షసులను దుర్భాషలాడి ఆ భాషా విషయక పాపం పోయేటందుకు ఉప్పు సముద్రంలో మునిగి పదేళ్లు అలాగే వుండి పోయి ప్రాయశ్చిత్త తపమొనరించాడు. ఆయనకు ‘తాపసుడను పేరు అప్పుడే వచ్చింది. మహా తపస్వుల కాయన ఆ రూపంలో దర్శన మిస్తాడు. అది తాపసావతారం. ఈ అవతారమే వ్యాసపుత్రుడైన శుకుని రూపాన్ని ధరించి భూలోకంలో జీవించింది. శ్రీ శుకమహర్షి శివుని అవతారమే. అశ్వత్థామ కూడ శివుని అంశయే. శివునికి కూడా కొన్ని కర్మఫలాలనుభవింప తప్పలేదు. వాటి కోసమూ శత్రుదుర్భేద్యులైన కొందరి సంహారం కోసం శివుడు ద్రోణపుత్రునిగా - అశ్వత్థామగా జన్మించవలసి వచ్చింది.
ఈశాన్యం వైపుండడం వల్ల శివుని వామదేవుడని కూడా అంటారు. వాయువు శివభక్తుడు. అందుకే అతనికి ఎడమ వైపు శివుడుంటాడు. ఎడమను ‘వామ’ అంటారు కదా! అలా కూడా శివుడు వామదేవుడు.
కాల, బల నామాలతో కూడ శివుడు సంచరిస్తుంటాడు. మహాకాలుడన్నా ఆయనే. త్రిపురాసురులను సంహరించడానికాయన ఘోర, భయంకర రూపాన్ని ధరించాడు. అది అఘోర రూపమే అయింది. భక్తులాయనను అఘోర స్వరూపంగానే కొలుచుకుంటారు. కొంతమంది తపోధనులైన దైత్యులను కాపాడి, వరములీయడానికి ఒక్క నిముషంలోనే నూతన వాటికను నిర్మింపజేసి అందులోతానొకదివ్యస్వరూపంతోజన్మించాడు. ఈ అవతారం పేరు సద్యోజాతుడు. ఊరువనే వాని పుత్రునిగా ఔర్వనామంతో శివుడవతరించాడు.
ఊర్వశబ్దానికీ పెద్ద ధ్వనితో రోదించుటయని అర్థము. రోదన ద్వారా గుండె బరువును దించుకొనుట ఈ భక్తి శాఖ సంకల్పము. (ఇది ఈనాటికీ కొన్ని ఇతర మతాల్లో వుంది - అను) శివుడు ఊరుపుత్రునిగా జనించి ఔర్వుడను పేర ప్రసిద్ధుడై ఈ శాఖను ప్రచారం చేశాడు.
అలాగే ఈశానుడను తపస్సంపన్నుడు ఆయన ప్రశాంతావతారము కాగా దుర్వాసుడను మరొక తపస్సంపన్నుడూ మహర్షి పుంగవుడూ ఆయన అవేశావతారము. గరుడా! ఏ దేవుడైనా దేవి లోక కల్యాణం కోసమే కారణ జన్ములై అవతరిస్తారు”
