3 - గరుడ పురాణము - బ్రహ్మ కాండము
5 - 9 - దేవతలు గావించిన నారాయణ స్తుతి
శ్రీ కృష్ణుడు గరుడునికి అత్యంతోత్తమ విష్ణు స్తుతుల భావాన్ని చెప్పసాగాడు. (విష్ణువు దయవల్ల పుట్టిన దేవతలంతా ఒక్కొక్కరుగా ఆయన నిలా స్తుతించారు. ఖగేశ్వరా! ముందుగా లక్ష్మీదేవి ఆయన గుణాలన్నిటినీ స్తుతించేటంత మహాద్భుతశక్తి తనకి లేదని సిగ్గుపడుతూ చెప్పింది. పిమ్మట ఇలా అంది.
‘హే నాథా! నేను మీ పాదారవిందాల వద్ద నతమస్తకనై *జీవిస్తాను. మీ చరణాలను తప్ప వేరేమీ ఎఱుగను. ఓ దేవదేవా! ఓ ఈశ్వరా! మీలో అనంత గుణాలున్నాయి. హే దామోదరా! మీరు నాకు తమ శరీరంలోనే స్థానమిచ్చి నన్ను రక్షించండి. మీరు తప్ప వందనీయులు వేరొకరు నాకు కనబడుటలేదు;
(*నతమస్తక అనగా తలవంచుకొని)
బ్రహ్మ ఇలా స్తుతించాడు; హే లక్ష్మీపతే! జగదాధార స్వరూప విశ్వమూర్తీ! మీరుజ్ఞాన మహాసాగరము. నేను అజ్ఞానిని. మీరు శక్తిలో అసీములు. నేను అల్పజ్ఞుడిని అల్పశక్తుడిని. మీమ్మల్ని సేవించుకొనే భాగ్యాన్ని నాకు శాశ్వతంగా ప్రసాదించండి. దానికీ, ముఖ్యంగా నాలోని అహంకార మమకారాలను నశింపజేయండి. ఓ రమేశా! అసన్మార్గం వైపు చూసే నా ఇంద్రియాలచూపును మళ్ళించి మీ చరణ కమలాలపై నిత్యానురక్తంగా నా మనసు నిలిచేలా దయ చేయండి. మిమ్మల్ని సంపూర్ణంగా స్తుతించే సామర్థ్యం నాకు లేదు. అయినా మీరు నా పట్ల ప్రసన్నులు కండి.
వాయుదేవుడీలా వినుతించాడు. ‘హే ప్రభో! దేవతలంతా మీ సేవకులమే. మీ చరణారవింద సాన్నిధ్యం పరమదుర్లభం. రమేశా! జగన్నాథా! లోకంలో మీ భక్తి పట్ల విముఖులు, పాప కర్ములు, అత్యంత దుఃఖితులునగు ప్రాణులను అనుగ్రహించుటకే మీరు అవతరిస్తారు. ఓ వాసుదేవా! మీరీ అవతారాలలో గో, బ్రాహ్మణం దేవతాదుల క్షేమ కల్యాణాలకై ఎన్నోరకాల లీలలను వెలయించారు. దేవదేవా! మీ చరితా మృతాన్నెంతగా ఆస్వాదించినా మీ గుణగానాన్నెంతగా చేసినా నాకు తనివి తీరడంలేదు. కావున నోముకుందా! ఒక అవీచల భక్తునితో సమానమైన భక్తిని మీ పట్ల నాకు ప్రసాదించండీ. దాని ద్వారా నా మనసు మీ చరణాలపైనే లగ్నమై వుండేలా అనుగ్రహించండీ నా నిద్ర నీ వందన రూపాన్ని ధరించాలి. *నా సంపూర్ణ ఆచరణ నీకు ప్రదక్షిణగా మారాలి, నా వ్యవహారమేదైనా నీ స్తుతి రూపమే అయివుండాలి - అని తలచుకుంటూ నీ పాదాలపై నన్ను నేను స్వయంగా సమర్పించుకుంటున్నాను. నేను దేనిని చూసినా అది నాకు హరి ప్రతిమగానే కనిపించాలి. ఏది మాట్లాడినా అది హరిభజనమే కావాలి - ఇలా చేయగలిగేలా నన్ను అనుగ్రహించండి - అంటూ మహాత్ముడైన వాయు దేవుడు విష్ణువు ఎదుట నిలబడి పోయాడు.
(*నేను నిద్రలో కూడా నీకే వందనం చేస్తూండాలి గాక అని అర్థము.)
చదువులతల్లి సరస్వతీ దేవి శ్రీ హరితో నిట్లన్నది. ‘హే మురారీ, హరీ, భగవన్! నిన్ను స్తుతించి తన పదజాలంతో సంతృప్తులైపోవు రసజ్ఞులుండరు. భాషకందని, కవితలో ఇమడని మహత్త్వం నీది. నిన్ను పూర్తిగా ప్రశంసించడానికి ఏ ఒక్కరి బుద్ధీ చాలదు. స్వామీ నిజమైన భక్తులు నీ గుణానువాద కీర్తనము తమ చెవులకు సోకగానే దేహానురక్తి, ఇల్లు, ఇల్లాలు, పిల్లలతో సహా అన్నీ మలచిపోతారు. అంత గొప్ప భక్తి తత్త్వం భవత్ప్రసాదం. హే జగన్నాథా, అనంతమహిమా సనాథా! వేదప్రతిపాదితమైన నీ స్వరూపము లక్ష్మికైనా, వాయుదేవునికైనా, చతుర్ముఖ బ్రహ్మకైనా కొంతే తెలుసుగాని అంతా అవగతం కాలేదు. అలాటిది నేనగా నెంత? నా స్తుతి అనగా నెంత? కావున నో స్వామి! నన్ను రక్షించి నా జ్ఞానాన్ని పెంచండి. అప్పుడు నేను స్తుతించగలనేమో.
‘పరబ్రహ్మా, లక్ష్మీశా, హరీ, మురారీ! నీ గుణాలలోనే నిత్య శ్రద్ధాళులై, ఆ గుణ గానాన్నే గామేస్తూ జీవించే వారు సాంసారిక అసద్విషయాల) అయోమయంలో చిక్కుకున్న తమ బుద్ధిని విరక్తి వైపు మళ్ళించుకోని సంసారం నుండి వీరాగులై నీ భక్తి వైపు సరాగులై ఆ భక్తి బలంతో నీ ప్రసన్నతకు పాత్రులు కాగలరు. అప్పుడు వారికి నీ ప్రత్యక్ష దర్శనమవుతుంది. కాబట్టి హే జగదానందకారకా! నీ గుణ కీర్తనంలోనిమగ్నురాలనై నన్ను నేనే మరచిపోయేటంత భక్తి భావాన్ని నాకనుగ్రహించు.
పక్షీంద్రా! సరస్వతీ దేవి ఇలా పలికి మౌనం వహించగానే ఆదిశేషువు చేతులు జోడించి ఇలా అన్నాడు ; ‘హే ప్రభో! వాసుదేవా! నీ చరణ కమల మహిమను బ్రహ్మ రుద్రులు, గరుత్మంతుడే పూర్తిగా కనుగొనలేకపోయారు. ఇక నేననగానెంత? నేను బహున్యూనుడను. కాబట్టి నన్ను రక్షించు.”
అంతట రుద్రుడిలా ప్రార్థించాడు ‘హే భూమన్, హే భగవన్! మిమ్మల్ని ఎలా స్తుతించాలో కూడా తెలియనంత అజ్ఞానిని నేను. మీ కళ్యాణకరములయిన చరణ కమలాలపై నా భక్తి స్థిరంగా వుండేలా కరుణించండి. మీలోనే నాకు స్థానమిచ్చి నన్ను రక్షించండి.
ఇంద్రుడిలా స్తుతించాడు ఓ దేవ దేవా! మిమ్మల్ని స్తుతించుట ఎవరివల్లా అయ్యే పనికాదు. ఎందుకంటే మీ స్వరూపాన్ని మేము చూస్తున్నామనుకుంటున్నాం, మీ గుణ మహిమలు మాకు తెలుసనుకుంటున్నాం. ఈ కనిపించే దానికీ, అనిపించే దానికీ వందలవేల రెట్లు ఎక్కువయైన మీ నిజస్వరూపం మాకు తెలీదు. మీరు చూపినా అర్థం కాదు. అయినా మేమెందుకు స్తుతిస్తామంటే అందులో మీ నామోచ్చారణ వుంటుందిగా. మీ పేరు తలచినా చాలు. మదిలో పొంగుతాయి శతకోటీ భక్తి తరంగాలు. అవి పుణ్యప్రదాలు. బ్రహ్మరుద్రుల స్థాయిలో కాకపోయినా అందరమూ నీ నామాన్నే జపిస్తాం. అనుగ్రహించు.
పిమ్మట శచీదేవి ఇట్లన్నది ‘హే జగదానంద సంధాయకా! వజ్ర, అంకుశ, ధ్వజ, కమల చిహ్నితములైన మీ పాద పద్మాలపైనే నా చింతన నిత్యం జరుగుతుంటుంది. ఈశా! మీ చరణరజాన్నే, నేనెప్పుడూ స్మరిస్తుంటాను. హే కృపాళో! భక్తవత్సలా! మీరే నన్ను రక్షించాలి.
అంతట రతీ దేవి ఇలా ప్రార్థించింది. ‘నరరూపాన్ని ధరించి లోకాలను కాపాడే అవతారమూర్తీ! ప్రస్తుతం నీవు నీ సేవకులపై దయను కురిపించడానికే అట్టి మాకు దర్శనమిచ్చావు. నీ ముఖారవిందాన్ని కనులార గాంచిన నేను ఇక దానినే ధ్యానిస్తుంటాను. కుంచితకేశరాశీసుశోభితము, బ్రహ్మ, లక్ష్మీ, రుద్రాదిదేవ సంస్తుత్యము, శ్రీనికేతన సదృశమునగు నీనగుమోమునే మనసులో పెట్టుకొని నిత్యమూస్మరిస్తుంటాను. నీ భక్తురాలినగు నన్ను రక్షించు.”
దక్ష ప్రజాపతి ఇలా స్తుతించాడు. ‘భగవన్! మీ చరణోదకరూపమగు పవిత్ర తీర్థాన్ని నేను నిత్యం స్మరిస్తుంటాను. అది బ్రహ్మ సేవితం కూడ. బ్రహ్మాది దేవతలందరూ దానికి నమస్కరిస్తారు. ఆ తమ పవిత్ర తమ పాదోదకమే గంగానదిగా రూపొంది శ్రేష్ఠ శీర్ణమైనది. తమ పవిత్ర పాద ధూలితో కలిసిన గంగ అశివాన్ని కూడా శివము చేయగలడు. అందుకేనేమో పరమేశ్వరుడు ప్రేమగా గంగను నెత్తిన ధరించి తాను గంగాధరుడనని సగర్వంగా చెప్పుకుంటాడు. హే కరుణేశ! ఈ మీ కృపావతారాన్ని వీక్షించే భాగ్యమిచ్చిన నాకు దానిని స్తుతించి తృప్తి నొందేశక్తి లేదు. దయచేసి నా కాశక్తిని ప్రసాదించి రక్షించండి.
బృహస్పతి ఇలా కోరాడు.
‘ప్రభో! మీ సుందరవదనారవిందమే నా మనసులో నిత్యము కొలువుంటుంది. ఇక సాంసారిక విషయాలపై నాకు విరక్తి కలిగేలా చేయండి. పుత్ర, మిత్ర, స్త్రీ, పశు, ధనాదులన్నీ నశించిపోతాయి, నశింపజేస్తాయి కూడా. కాబట్టి మీరు నాకు వీటిపై గల ఆసక్తిని నశింపజేయండి. దేవా ఈ సంసార చక్ర భ్రమణం నాకు నేర్పిన అనుభవమేమనగా ‘ఈ ప్రపంచం దుఃఖంతోనే పరివ్యాప్తమైపున్నదని’. దీని నుండి ముక్తిని పొందుటకే నేను మిమ్ము శరణు వేడుతున్నాను. రక్షించండి.”
అనిరుద్ధుడిలా స్తుతించాడు ‘హే హరే! రసమయమైన నీ గుణగానకథయందు కాక స్త్రీ పై మనసులగ్నము చేయువాడు మందబుద్ది, సూకరసమానుడు. హే ప్రభో! మజ్జ, అస్థి, పిత్త, కఫ, రక్త, మలాదులచే పరివ్యాపితమై చర్మంచే ఆవేష్టితమైన స్త్రీ ముఖాన్ని మాత్రమే మనసులో పెట్టుకొని నిన్ను తలవని వాని పతనం తథ్యం. నా వంటి సామాన్యునికీ, పాపమతికీ నీమాయయే బలము. స్వామీ! దుఃఖం మాత్రమే ఉండి, సుఖం లేశ మాత్రమూ లేని ఈ జననమరణ చక్రం నుండి నన్ను తప్పించి శాశ్వతంగా నీ చరణ కమలాలనే స్తుతిస్తుండేలా అనుగ్రహించు.
స్వాయంభువమనువిలా ప్రార్థించాడు. ‘హే దేవా! మిమ్మల్ని స్తుతించడానికీ ప్రయత్నిస్తే చాలు; ఇక గర్బదుఃఖం - అనగా పునర్జన్మ వుండదు. మీ యొక్క ఈ కృప వల్లనే నాకు పరమ పూజ్యపదవి ప్రాప్తించింది. నా కర్తవ్య నిర్వహణలో నన్ను కాపాడండి.”
వరుణదేవుడిలా వచించాడు.
‘హే ప్రభో! మీ ఇచ్చవల్ల రచింపబడిన దేహమనే ఇంట్లో దిగి పుత్ర, స్త్రీ, ధన, ద్రవ్యాలపై మోహం పెంచుకొని ‘ఇవి నావి’ అనీ ‘నేను వీరివాడను’ అనే అల్పబుద్ధి జన్యమైన అహంకార మమకారాలతో ప్రాణి దుఃఖంలో మునిగిపోతుంది. నాకటువంటి దుర్గతి పట్టకుండా కాపాడండి. మీ చరణాల దాస్యాన్ని నాకు దానం చెయ్యండి.’
దేవర్షి నారదుడు హరినిలా ప్రార్థించాడు. విష్ణుదేవా! నాకు నీ నామ శ్రవణ కీర్తనలు తప్ప మరేవీ రుచింపవు. నిజానికి నాకు వేరేలోకంగానీ జీవనంగానీ లేవు. అలాగే వుండే పవిత్రతను నాకందించు. నా జిహ్వగ్రంపై సర్వదా నీ నామమే వుండేలా అనుగ్రహించు. నీ స్వరూపమే నా మూసిన కనులకు కూడా కనిపించాలి. అదే నా హృదయమంతటా నిండి వుండాలి.”
భృగుమహర్షి ఇలా స్తుతించాడు. ‘హే గరుడుని వంటి అత్యుత్తమాసనానికీ అధికారివైన దేవదేవా! మీరు గ్రహించే ఏదైనా సర్వేసర్వత్ర ఉత్తమమై అలరారుతుంది. కౌస్తుభమణిని మించిన గొప్పమడిగానీ, లక్ష్మికి సాటివచ్చు పత్నిగానీ, సరస్వతీ దేవికేనయైన ఆత్మబంధువుగానీ విశ్వంలోనే లేరు. అలాగే మీ భక్తకోటిలో మమ్ము నిత్యులుగా అనుగ్రహించి చరిత్రలో మా కొక విశిష్ట స్థానాన్నిచ్చిన మీకు శతకోటి నమస్కారములు.”
అగ్ని దేవుడిలా అన్నాడు, ‘మూలవిరాటము నీవే. నీ తేజాంశవల్ల నేను తేజస్వినైనాను. నీవిచ్చిన ఆజ్యసిక్త హవ్యంతో హవ్యవహునిగా పవిత్ర స్థానాన్ని పొందాను. నీ అంశతో జఠరాగ్నిగా మారి మానవోదరస్థితుడనై వారి జీవరక్షకుడనగుచున్నాను. నీ అనుగ్రహం లేకుంటే ఈ అగ్నియేలేడు. నిన్నెంత స్తుతించినా నాకు తృప్తి గలుగదు.’
ప్రసూతి ఇలా చెప్పాడు, ప్రభూ! నీ నామముయొక్క అర్ణాన్ని కనుగొనుట అనేదే మోహం వలే పరిణమించి అందులో మునిగి పోయివుండే మహర్షులకు నీ దర్శనమే జీవిత పరమావధి. నీ దయవల్ల నేనా దశకు చేరుకున్నాను. దేవతలు కూడా భయగౌరవ సంభ్రమాలతో పూజించే మాంధాత, ధ్రువుడు నారదుడు, భృగుమహర్షి వైవస్వతమనువు మున్నగు మహనీయులే నిన్ను స్తుతించి సంతృప్తి చెందలేకపోయారనగా నిన్ను స్తుతింప నేనే పాటివాడను.
బ్రహ్మపుత్రుడైన వసిష్ఠ ప్రజాపతి ఇలా స్తుతించాడు. ‘విధాత పురుషునకు వందనము. అసత్ స్వరూపాన్ని అంతమొందించే దేవునికి నమస్కారము. నాథా! నేను నీ చరణ కమలాలపై నిత్యం నా మస్తకాన్ని వంచి జీవించదలచుకుంటాను. ఓ వాసుదేవ భగవన్! నన్ను సదా రక్షించు.”
బ్రహ్మ మరొకపుత్రుడైన మరీచి ఇలాగే విన్నవించగా అత్రికూడా అలాగే స్తుతించి నారాయణ ప్రసన్నతను పొందాడు.
అంతట అంగిరామహర్షి ఇలా స్తవనం చేశాడు. ‘హే నాథా! మీ అనంత బాహు, అనంతచక్షు, అనంత మస్తక సంపన్నమైన రూపాన్ని చూడడానికే నేను అసమర్థుడనగు చున్నాను. వేల ముకుటాలతో అలంకరింపబడి, బహు మూల్యములైన అనేకానేక అలంకారాలతో సుశోభితమైయున్న మీ అనంత జ్యోతిర్మయ దివ్య స్వరూపాన్ని స్తుతించు టకు నా సామర్థ్యం చాలదు. రక్షించండి.”
పులస్త్యబ్రహ్మ ఇలా స్తుతించాడు: ‘హేభగవన్! మీ ఉపాసకులకోసం ఏ దివ్య మంగళ స్వరూపాన్ని ధరిస్తారో ఆ భువనమంగళకారియగు రూపంతోనే నాకు దర్శనమివ్వండి. ఈ రూపియగు మీకు నమస్కారము. నరకం నుండి నాలాటి వారిని మీరే రక్షింపగలరు. మీ స్తుతి మంగళదాయకము. నేను యథాశక్తిగా, మాత్రమే చేయగలను. నన్ను రక్షించండి.”
పులహమహర్షి ఇలా స్తుతించాడు: ‘సగుణోపాసనలో భగవంతునికి స్నాన, ఉత్తమవస్త్ర క్షీర, ఫల, పుష్ప, భోజ్య పదార్థాదులను ఆరాధన పూర్వకంగా సమర్పించుకుంటారు. నిర్గుణోపాసకుడనైన నేను నిష్కామబుద్ధితో నా జీవన జ్యోతినే నీ నిష్కామరూపరహిత భావానికి సమర్పించుకుంటున్నాను.”
మహాముని క్రతువు ఇలా అన్నాడు. “హే భగవన్! శరీరం నుండి ప్రాణం విడివడి బయటికి పోతున్నపుడు మీ పేరును స్మరించడమే దుఃఖనివారణకు మార్గము. అది అనేక జన్మలలో చేసిన పాపాలన్నిటినీ నశింపజేయగలదు; ముక్తిని ప్రసాదించగలదు. నేను ఆ నామశక్తినే శరణుకోరుతున్నాను. మీ భక్తి గాని అసలు భక్తి అంటే ఏమిటో గాని తెలియక పోయినా మీ నామస్మరణను ఎక్కడో విని చేసినా ముక్తిని ప్రసాదించే దయాళు మీరు.
యే భక్త్యావివశోవిష్ణో నామ మాత్రైకజల్పకాః ।
తేఽపి ముక్తిం ప్రయాంత్యాకు కిముత ధ్యాయినః సదా ॥
అప్పుడు విశ్వామిత్రుడు విష్ణువు నీలా స్తుతించాడు: ‘భగవన్! నీ చరణకమలాలను ధ్యానించకపోయినా, నిత్యమూ సంధ్యా వందనము చేయకపోయినా, జ్ఞానమనెడు ద్వారానికి తలుపువంటి ధర్మ కర్మములను పాటింపకపోయినా, నిత్యము నీ కథలనే వింటూ పరవశం కాకపోయినా అనాథలనూ ఏమిలేనివారినీ కరుణించే వరప్రదాతవు నీవు. నన్నూ రక్షించు.
నధ్యాతే చరణాంబుజే భగవతో
సంధ్యాపి నానుష్ఠితా
జ్ఞాన ద్వార కపాట పాటన పటు
ర్ధర్మోఽపి నో పార్జితః ।
అంతర్వ్యాప్తమలాభిఘాతకరణే
పట్వీశ్రుతా తే కథా
నోదేవ శ్రవణేన పాహిభగవన్
మామత్రితుల్యం సదా । (బ్రహ్మ... 7/71)
మిత్రుడను వైదిక దేవత ఇలా స్తుతించాడు: ‘దేవా! సంసారబంధనాలను త్రెంచి ప్రాణులకు ముక్తి నొసగు పరమాత్ముడవు నీవు. కల్యాణనిధానము, జ్ఞానసాగరమునకు నీకు అజ్ఞానినగు నేను ప్రణమిల్లుతున్నాను. అగ్ని, బ్రహ్మ, రుద్రాదులకే అగమ్యము, మహా తేజస్వులగు తపస్వులకు కూడా అగోచరమునగు నీ స్వరూపము నాకూ తెలియనిదే. కావున భగవన్! వాసుదేవునిగా పేరొందిన నీవొక్కడివే సర్వజ్ఞుడవు. నీవే నన్ను నిత్యము రక్షింపగలవు.’
తార ఇట్లన్నది : విష్ణుదేవా! అనన్య భావంతో నీ పట్ల దృఢ భక్తి గలవారు, నీ కోసం అన్ని కర్మలనూ త్యాగం చేసేవారు, నిన్ను చేరగోరి స్వజనులనూ బంధుబాంధవు లనూ కూడా పరిత్యజించేవారు, నీ కథలను వింటూ, ఇతరులకు వినిపిస్తూ జీవించే వారు - ఇటువంటి సాధుజనులకు నీవు తప్ప వేరే ఆసక్తి ఏదీ వుండదు. ప్రభో! వారి నెంత ప్రేమతో చూసి సంరక్షిస్తావో నీచరణదాసినగు నన్ను కూడా అంతగానే రక్షించు’.
నిరృతి ఇలా అన్నాడు : ‘యోగపూర్వకంగా నీకు సమర్పితులైన వారు భక్తి ద్వారా పరమగతిని పొందుతారు. భక్తి శ్రద్ధలతో నిన్ను సేవించడం ద్వారా, సాంసారిక విషయాలపై అనాసక్తిని సాధించడం ద్వారా, చిత్రాన్ని నిగ్రహించడం ద్వారా జనులు విష్ణు పరమ పదమును పొందుతారు. ప్రభూ! నన్ను నీ పరమ పదానికి చేర్చుకో. ఇదేనా వేడికోలు.”
విష్వక్సేనుడు వైకుంఠ ద్వారము వద్దవుండే దళపతి. ఆయన విష్ణువునెపుడూ దర్శిస్తూనే పుంటాడు. అయినా విష్ణువుయొక్క ఆశీర్వాదం కోసం ఇలా ప్రార్థించాడు. ‘స్వామీ! పూర్ణానంద స్వరూపుడైన శ్రీకృష్ణపరమాత్మ మీ ప్రతి రూపమై మోక్ష ప్రదాతయగుచున్నాడు. నేను మీ కృప వల్ల అపరోక్షసాధనారూపమైన పరమభక్తిని సాధించాను. గురువుతో మొదలు పెట్టి బ్రహ్మాండమందున్న సాధువులందరినీ మీరు ప్రసాదించిన బుద్ధి వల్ల సేవించుకున్నాను. వారిపట్ల నాది నిష్కపటభక్తి. అలాగే మిమ్మల్ని చేర్చగలిగే తులసిపై అఖండ ప్రీతినాది. భగవన్! నాకు మీ అశీర్వాదమొక్కటి చాలు.”
భగవంతుడైన విష్ణువు వీరందరికీ తన శరీరంలో ఆశ్రయం కల్పించాడు” అని వసుదేవనందనుడు వినతాసుతునికీ బోధించాడు.
