3 - గరుడ పురాణము - బ్రహ్మ కాండము
1 - శ్రీహరి మహిమ - సర్వేశ్వరత్వం - భాగవత, విష్ణు, గరుడపురాణాలపై స్వామిప్రేమ - నిరూపణం
విశ్వానికి జ్ఞాన నేత్ర స్వరూపుడైన పరబ్రహ్మ శ్రీహరి స్తవనాన్నే నిత్యం చేస్తూ వుండే సర్వశాస్త్ర తత్త్వజ్ఞుడూ, మానవకల్యాణం కోసం సహస్రాబ్దాలపాటు సత్రయాగాన్ని చేసి లోకరక్షక మునిపుంగవునిగా పేరు గాంచినవాడూనగు శౌనకమహర్షి ఇతర బ్రహ్మవాదులైన మహామునులతో బాటు రెండు యాగాల మధ్య విశ్రాంతి కాలంలో *నైమిషారణ్యంలో తపస్సులో మునిగియున్నాడు. ఆయన చాలాకాలానికి కనులు తెరిచే సరికి నైమిషంలోని ఇతర మహర్షులంతా వినయంగా నిలబడి వేచియున్నారు. వారంతా జితేంద్రియులు, ఆకలి దప్పులను కూడా గెలువగలిగినవారు, సత్యపరాయణులు, సంతులు, సంసారానికి సమస్త జ్ఞానాన్నీ ప్రసాదించే విష్ణు భగవానునే నిరంతరం ధ్యానిస్తూ పూజిస్తూ జీవిస్తున్న పుణ్య పురుషులు. వారిలో కొందరు యజ్ఞం ద్వారా యజ్ఞపతి యొక్క తత్త్వాన్ని, ఇంకొందరు జ్ఞానం ద్వారా జ్ఞానాత్మక పరబ్రహ్మతత్త్వానీ, మరికొందరు పరమభక్తి ద్వారా నారాయణ తత్త్వాన్ని అందిపుచ్చుకున్నారు.
(*దీనికి మోక్ష కాండ అనే పేరు కూడా వున్నట్టు చెప్పబడుతుంది. గరుడ పురాణ సంస్కరణల్లో చాలా చోట్ల ఈ కాండల పేర్లు కనిపించవు. పూర్వార్ధ, ఉత్తరార్ధ అని మాత్రమే వుంటాయి.
* నైమిషారణ్యం అనే మాట నిమిష అనే మాటకు ఆదివృద్ధి రావడం వల్ల నేర్పడింది. ఈ అరణ్యంలో ప్రతి నిమిషమూ ఏవో యాగాలూ శాస్త్ర చర్చలూ పురాణ శ్రవణాలూ జరుగుతుంటాయి. అక్కడి ప్రతి నిమిషమూ విలువైనదే, పవిత్రమైనదే కాబట్టి అది నైమి’షా’రణ్య మైంది.
కాలచక్ర నిమి ఇక్కడ తిరగదు, ధాబట్టి అది నైమిషారణ్యమైంది.
గౌరముఖుడనే ముని ఒకనిమిషంలోనే వందలమంది అసురులను భస్మంచేసిందిక్కడే కాబట్టి అది నైమిషారణ్యం.
వారిలో సద్గోష్ఠిలో ప్రసక్తంగా ధర్మార్థకామ మోక్షాలను పొందడం అనే మాట వచ్చింది. ఆ ఉపాయాన్ని తెలుసుకోడానికి, చెప్పి జాతినుద్ధరించడానికీ ఒక చోట చేరారు. ఆ మునులొక అరవైవేలమంది వుంటారు. వారంతా రాగద్వేషముక్తులే. సామాన్య జీవులపై అనుగ్రహం కలవారే. లోకులకు విష్ణువు పై అచంచలభక్తి కుదరాలంటే ఏం చేయాలి, అధిదైవిక, అధిభౌతిక, ఆధ్యాత్మిక సంపూర్ణకర్మల సిద్ధి సామాన్య ప్రజలకెలా సాధ్య మౌతుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం ఆ మహాతేజస్వులంతా శౌనక మహర్షికభిముఖులై నిలబడ్డారు.
ఆ మహాత్ముడు వీరి జిజ్ఞాసను తెలుసుకొని వారికి తానే లేచి నిలబడి నమస్కరించి ఇలా అన్నాడు - “మహాత్ములారా! మనందరి, ఇంతటి ఉత్తమ, ఉన్నత జిజ్ఞాసను తీర్చగలవాడు సూతమహర్షి. వేదవ్యాసునిప్రియ శిష్యుడైన ఆ పౌరాణికోత్తముడు ప్రస్తుతం సిద్ధాశ్రమంలో విరాజమానుడై యున్నాడు. పదండి ఆ మహామహుని వద్దకు పోదాం. అని బయలు దేరాడు.
సూతమహర్షి వీరినాదరించి ఆసనాలు చూపించి సత్కరించిన పిమ్మట ఆతని ఆనతి మేరకు శౌనక మహర్షి ఆయన నీలా ప్రార్థించాడు.
“సూతభగవన్! మేమొక జిజ్ఞాస తీరుటకై మిమ్మాశ్రయించాం. ఋషి శ్రేష్ఠా! ఏ ఉపాయం ద్వారా విష్ణు భగవానుని ప్రసన్నుని చేసుకోవచ్చు? అయన నెలా పూజించాలి? ముక్తికి సాధన భూతమైన తత్త్వమేది?”
ప్రసన్నదృక్కులను వారివైపు ప్రసరింపజేస్తూ ప్రశాంతంగా ప్రవచింపసాగాడు సూత మహర్షి - ఇలా :
“ఋషి శ్రేష్టులారా! విష్ణు దేవునికీ, లక్ష్మీమాతకూ, సరస్వతీదేవికీ, వాయుదేవునికీ, ఆదిశేషునికీ, గురుశ్రేష్ఠులైన కృష్ణద్వైపాయన వ్యాసభగవానులకీ నమస్కరించి వారిచ్చిన జ్ఞానం సాయంతో నాకు వచ్చిన దేదో మీకు విన్నవిస్తాను. శ్రేష్ఠతత్త్వ స్వరూపుడైన విష్ణు భగవానునితో సమానులు లేరు, ఉండరు, ఉండబోరు.
నాస్తి నారాయణ సమం
న భూతం న భవిష్యతి ।
ఈ సత్యవాక్యం ద్వారా మీ కార్యసిద్ధికి నేను ప్రయత్నిస్తాను.
“ఋషిశేష్ఠా! మొట్టమొదట విష్ణు భగవానునికే ఎందుకు నమస్కరించాలి? దయచేసి చెప్పండి” అన్నాడు శౌనకుడు.
“హే శౌనకా! అన్ని వేదాలద్వారా వేద్యుడు - అనగా తెలుసుకొనబడేవాడు. వేదశాస్త్ర పురాణేతిహాసాలలో సర్వత్ర కీర్తింపబడుతున్న ఏకైక దైవతము మహావిష్ణువే కాబట్టి ఆయనే ప్రథమ వందనీయుడు. ఆయనే అందరిలోనూ జ్ఞానరూపంలో ప్రకాశిస్తుంటాడు. కాబట్టే ప్రథమ ప్రణామయోగ్యుడు. అందరిలోనూ ప్రధానుడు అందరికంటే అన్ని విధాలా అధికుడు విష్ణువే కాబట్టి ఆయనే ప్రప్రథమ, సర్ప ప్రథమ ప్రణామయోగ్యుడు.
విష్ణు సమానుడైన దేవుడుగాని వాయుసమానుడైన గురువుగానిలేరు. విష్ణుపది సమానమైన తీర్థంలేదు. విష్ణుభక్తులతో సమానులైన భక్తులు లేరు.
కలియుగంలో ఎన్నో పురాణాలు ప్రాచుర్యంలోకి వస్తాయి. అన్నీ పరమ పవిత్రాలూ ముక్తి దాయకాలే అయినా మహా విష్ణువుకి ప్రత్యేక ప్రీతికరములైనవి మూడు. భగద్భక్తుల ప్రసక్తి ఎక్కువగానున్నదీ, కలికాలంలో మనిషికి విన్నంతమాత్రాన కల్యాణకారిగా వుండేదీ, సృష్టిని మొదటిసారిగా విష్ణు రూపంగా చెప్పేదీ, ఆయన నుండే బ్రహ్మ, మహేశాదుల సృష్టి జరిగిందని వెల్లడించేదీ, ఎన్నో అర్థాలనూ తత్త్వాలనూ అనితర సాధ్యమైన తత్త్వజ్ఞానాన్నీ ప్రతిపాదించేదీ అయిన శ్రీ భాగవతమహాపురాణం మొదటిది. విష్ణుభక్తినీ ఆయనను కట్టిపడేసే మంత్ర సహిత శ్లోకాలనూ, భక్తిని పెంచే కథలనూ ప్రపంచానికి ప్రసాదించిన విష్ణుపురాణం రెండవది. ఇక అన్నిటికన్న మిన్నగా ఆయనే చెప్పి తన భక్తుడైన గరుడుని పేర మానవజాతికిచ్చిన గరుడపురాణం* మూడవది.
(*గరుడ పురాణ మాహాత్యం గూర్చి ఈ గ్రంథంలో అనేక సందర్భాలలో చెప్పబడింది. వాటన్నిటినీ కలిపి ఈ గ్రంథం చివరలో వ్రాయడం జరిగింది.)
గారుడాఖ్య పురాణేతు ప్రతిపాద్యో హరిః స్మృతః ।
అతోహర్నిమస్కార్యోగమ్యోయోగ్యో హరిఃస్మృతః II
