45 -  భువనవిన్యాసో

శాంశపాయనుడనెను:- ఓ ప్రభో! సూత! తూర్పు-పడమరలవని పేర్కొనబడిన రెండు దేశములు మాకు చక్కగా జెప్పబడినవి. ఇక ఉత్తర-దక్షిణ దేశములను అచటి పర్వత నివాసులను అన్ని విధముల విశదముగా మాకు జెప్పుడు-1.

సూతుడనెను:- శ్వేతపర్వతమునకు దక్షిణమున నీలపర్వతమునకు ఉత్తరమున రమణక మనువర్షము(దేశము) ఉండును. అచట మానవులు బుట్టు చుందురు-2. వారు అన్ని ఋతువులలోను కామము నిచ్చువారు. ముసలి తనము(పు) దుర్గంధములేని వారు తమ తెల్లని జాతిజనముతో గూడియున్నవారు. అందరును అందమైనవారు-3. అచట గూడ రోహణమను గొప్ప వటవృక్షము గలదు. వారు దాని ఫలరసములను ద్రావుచుందురు-4. ఆ మహాభాగ్యవంతులు పదకొండువేల యైదువందలు నిత్యసంతుష్టులైన మానవశ్రేష్ఠులై జీవింతురు-5.

శ్వేత పర్వతము నకుత్తరమున శృంగసాహ్వ పర్వతమునకు దక్షిణమున హిరణ్యతమను వర్షము(దేశము)గలదు. అచట హైరణ్యతీయను నది కలదు-6. అచట మహాబలులు మంచి తేజస్కులునైన మానవులు బుట్టుచుందురు. ప్రాణులు అన్ని ఋతువులలోను కామమునిచ్చునవి. వారు ధనికులు అందమైన వారు-7. అమితౌజస్కులైనట్టివారు(12005) పండ్రెండు వేల యైదు సంవత్సరముల యాయువు ప్రమాణముగలవారు-8. ఆదేశమున నాజురసములకు నెలవైన గజనిమ్మచెట్టు మహావృక్షము దాని ఫలరసమును ద్రావి యచటి మానవులు జీవింతురు-9. అచటి పర్వతమునకు మూడు ఉన్నత శిఖరములు గలవు. అందులో ఒకటి మణిమయము. మరొకటి బంగారముతో నిండినది. మూడవది సర్వరత్నమయమై మేడలతో  బ్రకాశించునది-10.

ఉత్తర సముద్రము యొక్క సముద్రము చివర “కురులు” ఉందురు. ఆ కురుదేశము పుణ్యమై సిద్దులచే సేవింపబడినది-11. అచట వృక్షములు తీయుఫలములుగలవి. నిత్యము పుష్పఫలములనందునవి. ఫలములందు వస్త్రములను ఆభరణములను ప్రసవించును-12. కొన్నిచోట్ల నచటి వృక్షములు సర్వకామములను ఫలములుగా నిచ్చునవై మనోహరములు గంధవర్ణముతో రసముతో గూడిన ఉత్తమమైన మధువును స్రవించును-13. అచట మరొకవృక్షములు క్షీరవృక్షములు. అవిమనోహరములు. అవి యాటు రసములుగలిగి యమృతముతో బోలిన క్షీరమును స్రవించును-14. అచటి భూమియంతయు మణిమయమై సన్నని బంగారు ఇసుకగలది. అంత సుఖస్పర్శగలది. బురుదలేనిదై రోగములు లేనిదై శుభకరమైనది-15. అచట దేవలోకమునుండి జారిన వారు మానవులై జన్మింతురు. శుభకరులు. తెల్లని శుద్దమైన తనజాతి బంధుజనముతో గూడినవారు. వారందరు స్థిరమైన యౌవనముగలవారు-16. స్త్రీ, పురుషుల జంటలను ప్రసవింతురు స్త్రీలుగూడ మిక్కిలి మనోహరలు వారు అందరు అమృతముతో సమానమైన క్షీరవృక్షమును (క్షీరమును) ద్రావుదురు-17. వెంటనే జంటజనించును. సమముగనే పెద్దదగును. శీలము రూపము సమమే. సమముగనే మరణింతురు-18. చక్రవాక పక్షులవలె అన్యోన్యము అనురక్తులు ఆరోగ్యవంతులు దుఃఖములేనివారు నిత్యము సుఖములచే సేవింపబడుదురు-19. పదునాలుగు వేలయైదు సంవత్సరములు మహావీర్యులై అన్యస్త్రీలను సేవింపనివారై జీవింతురు-20.

ఈ కురువుల విషయమును గూడ విస్తరముగా వినుడు. ఉత్తరపుదైన జూరుధియ పర్వతరాజమునకు ఉత్తరముగా సర్వదిక్కులలో కీర్తింపబడు కురువుల విషయమును వినుడు-21. చంద్రకాంతశైలము సూర్యకాంతశైలము-అనునివిరెండు మిక్కిలి గొప్పనై మహోన్నతములైన రెండు కులపర్వతములచట నున్నవి-23. 1/2. అవి అనేక కందరములు (నీటితో జీల్చబడియేర్పడిన గుహలు) దరులు (స్వయముగానలంకరింపబడినవి. అనేకములైన పొదలచేతను, వనములచేతను గూడినవి. చిత్రములైన ధాతువులచే నలంకరింపబడినవి. పుష్పములు, కందమూలములు, ఫలములు-వీనితో గూడినవి. సిద్దులచేతను చారణులచేతను సేవింప బడినవి. (నివసింపబడినవి)-23. ఆ రెండు కులపర్వతములచేతను అనేకములైన నూర్ల శిఖరముల చేతను ఆ ద్వీపము దగ్గరగా నుండి సేవింపబడినది-24. ఆ చంద్రకాంత-సూర్యకాంతపర్వతములమధ్యగా ఆ భద్రసామయనుమహానది పోయినది (ప్రవహించినది)-25. ఇతరము లైన వేలకొలది నదులు నిర్మలములై సురసములైన జలములు గలవై, కురుదేశవాసులందరీ స్నానపానములకే కాక యీదుటకును సరిపోవునట్లుగా నిండైన జలములు గలవై ప్రవహించినవి-26. అట్లే మరికొన్ని వేల మహానదులు క్షీరముల బ్రవహించును. తేనెలను, మైరేయమును, నేతిని ప్రవహించినవి 27. అచట పెరుగు మడుగులు వేలుగలవు. తీయని రుచ్యమైన యన్నపర్వతముగలదు. అమృతమువలె తీయనిపండ్లు అనేకములుగలవు-28. గంధవర్ణరసముతో నొప్పిన కందమూలములు ఫలములుగలవు. అవి యైదుయోజనములవరకంతట గంధములవిరజిమ్మును-29. పలురంగుల పూవులు వేలకొలదియు, గొప్పనైన భోగ్యవస్తువులు మంగళములును వేలకొలది కలవు-30. గంధము-రంగు-రసము వీనిచే నొప్పినవై సుఖస్పర్శగల తమాల-అగురు-గంధ-చందనవనములుగలవు-31. అచట వనములు వికసించిన పూవులతో వాని తిరుగాడు తుమ్మెదలతోను గూడిన వృక్షములుపొదలు తీవలును గలవి-32. ఓ బ్రాహ్మణోత్తములారా తుమ్మెదలగీతులతోను పక్షులతోనునిండిన కమలములతో కలువలతోను ఒప్పిన వేలకోలది. సరస్సులుగలవు-33. భక్ష్యములతోను, పూవులు మొదలగువాని మాలలతోను, సమృద్ధములు. అనేకములైన మాలలు పూసికొను గంధాదులును గలవి. అందమైన ముఖములుగల చిత్రమైనవి పక్షిసంఘములకూతలచే ధ్వనింపబడినవి-34. పడుకొను పరుపులు కూర్చొను అసనములు మొదలగు భోగములుగలవియు అనేకగుణవిస్తారములు గలవియును గల రమ్యమైన విహారభూములుగలవు. అవియన్నీ ఋతువులలో సుఖప్రదములు-35. ఉద్యానవనములు అంతటను బలిసినవి. మణులతోను బంగారము తోను అలంకరింపబడిన శిలాగృహములు వృక్షగృహములు శ్రేష్ఠములైన అరటి చెట్లగృహములును గలవు-36. అంతటను వేలకొలది సుఖదములైన తీవపొదరిండ్లు, శుద్దశంఖపు చిప్పవలె తెల్లనైన నూర్లకొలది భూగృహములును గలవు 37. మణుల జాలాన్తరములుగల బంగారు గవాక్షములు (కిటికీలు) గలవు. అంతటగూడ విశాలసువర్ణమణి చిత్రములు గలవు-38. వేలకొలది శ్రేష్టములైన మహావృక్షములంతటను గలవు. సన్నని యనేకాకారములు గల సుఖకరములైన వస్త్రములు గలవు-39. మృదంగములు. వేణువులు, చేతివాద్యములైన (డక్కీ) పణవములు, చాల  విస్తారముగా నున్నవి. లక్షలకొలది కల్పవృక్షములు ఫలించుచుండును-40. అట్లే యంతటను ఉద్యానములుగలవు. ఆ పురము అంతట వ్యాపించినట్లుండును. సర్వద్వీపములలోన దేశము(కురుదేశం) మిక్కిలి సంతుష్టమైనది. స్త్రీపురుషులతో వ్యాకులమైనది. అచట వాయువు అనేక పుష్ప సుగంధముగలదై బాగుగా వీచును-41. శ్రమను పోగొట్టునా ద్వీపమున నిత్యము సంగసుఖసంతోషముండును. స్వర్గమునుండి భ్రష్టులైన నరులు ఎల్లప్పుడచట జన్మించుచుందురు. అది భూతలస్వర్గము అదియు గుణములతో సర్వోత్తమమైనది-42.

అచటి వారు చంద్రుని వంటి కాంతిగల (తెల్లని)వారు నరశ్రేష్ఠులు తూర్పుతీరమున బుట్టినవారు నల్లని యంకములు (చుక్రలు)గలవారు. నలుపు తెలపువారు సుఖవంతులు. సూర్యునివంటీ కాంతిగల(యెట్టని) వారుశ్రేష్ఠులైన ప్రజలు-43. ఆదేశములోని నరులుశ్రేష్టులు, దేవతలబలపరాక్రమములు గలవారు. ఎల్లప్పుడు విహరించువారు. అందరును స్వేచ్చావృత్తిచే మంచి తేజస్సు గలవారు-44. కంకణములు. చేతులు మొదలగు అవయవములందును భుజములందును ధరించు భుజకీర్తులు మొదలగునవి. కంధహార ములు, చెవికుండలములు-వీనిచేనలంకరింపబడినవారు. పూలమాలలు ధరించినవారు. చిత్రములైన కిరీటములు ధరించినవారు. చిత్రమైన కప్పువస్త్రములు గలవారు-45. తరగని యౌవనము గలవారు. ప్రియమైన సుందరులు.-ఇట్టి ప్రజలు పెక్కువేలయేండ్లుజీవింతురు-46. వారుప్రసవించు ధర్మము(కాన్పు) కలవారుకారు. వంశమును క్షీణింపజేయువిధానము లేదు. వృక్షమునుండి మిధునము(లు) బుట్టును. ఇట్టియుపక్ష(క్ర)మముప్రారంభము కనబడదు-47. అందరును సామాన్యమైన సంపదలుగలవారు. మమత్వమును వదలిన వారు. అచట ధర్మము లేదు. దర్బుద్ది లేదు. శ్రమలేదు. కాలమునిండగనే వారు నీటిబుడుగల వలె నశింతురు-49, ఈ విధముగ్గవారు అత్యంత సుఖవంతులు. సర్వదుఃఖములు వదలినవారు. రాగులై (ప్రేమగలవారై) ధర్మమును జూడరు. దుఃఖమువలననే (సామాన్యముగ)ధర్మము బుట్టును-50.

ఉత్తర కురు దేశములకు ప్రక్కన దక్షిణమున సముద్రము కలదు. అది తరంగమాలలతోనొప్పినది. కావున అనేక స్వరములతో నలంకరింపబడినది-51. ఐదువేలయోజనములు దాటి దేవతలకు నిలయమైన చంద్రద్వీపమని పేరొంది. చంద్రమండలమందున్నట్లున్న) ద్వీపము కలదు-52. దాని పరిమండలము వేయియోజనములు అనేక పుష్పఫలములతో గూడినది. గొప్పసమృద్దీతో గూడినది. నూరుయోజనముల విస్తీర్ణము గలది. నూరు యోజనముల ఔన్నత్యము గలది-53. దానీ మధ్యన గిరి శ్రేష్ఠము గలదు. అది సిద్దులచేతను చారణులచేతను సేవింపబడినది. చంద్రసమాన కాంతులు గలవియు, మనోహరములైనవియు, చంద్రాకారమున నున్నవియు, మంచిలక్షణములు(చిహ్నములు)గలవియు-54. తెల్లనివియు వైడూర్య వర్ణము గల వియునైన కలువల తోనీ పర్వతము కుముద ప్రభమై (కలువల కాంతి నిండినదై) యుండెను. అది అనేక చిత్రముల యుద్యాన  వనములుగలది. అనేకములైన సెలయేరులు గల గుహలుగలది. రకరకములైన గొప్పచరియలు గుహలు పొదరిండ్లచే చక్కగా నలంకరింపబడినది-55. ఆ శైలమునుండి మహాపుణ్యము చంద్రకిరణముల వలె నిర్మలము లైన జలములు గలదియు అత్యుత్తమమైన చంద్రావర్త యనునది కలదు-56. అచట నక్షత్రాధిపతియైన చంద్రుని యొక్క యుత్తమ స్థానముగలదు. అచట గ్రహ నాయుకుడైన చంద్రుడెప్పుడు అవతరించును-57. అచట చంద్రుని పేర పర్వతము బాగుగా వినబడినది. చంద్రద్వీపమను మహాద్వీపము స్వర్గమునను ఇచటను ప్రకాశమైనది-58. అచట అందరు చంద్రునితో సమానమైనవారు, నిండు చందురుని మోము గలవారు, చంద్రకాంతిగల ప్రజలు నిర్మలులు, చంద్రుడే దైవముగా గలవారు 59. అత్యంతధార్మికులు, సౌమ్యులు, సత్యసంధులు, సుతేజస్కులును అయిన ప్రజలచట సదాచారులు, వేయియేండ్ల యా యువు గలవారు-60.

పశ్చిమ ద్వీపమునకు పశ్చిమముగా నాలుగువేల యోజనములు మహోదధిని దాటి-61. అంతటను పదివేల యోజనముల పరిమండలము గల భద్రాకరమను ద్వీపము గలదని చెప్పబడినది. అది యనేక పుష్పములతో బ్రకాశించినది 62. మిక్కిలి ధనధాన్యములతో నొప్పినది. అనేక రాజులతో పాలింపబడినది. నిత్యసంతుష్టమై యుబ్బినది. మహా శైలములతో బ్రకాశించినది-63. అచట వాయువు యొక్క భద్రాసనము గలదు. అది నానా రత్నములచే నలంకరింప బడినది. అచట ఆకారము దాల్సిన వాయువెల్లప్పుడు పర్వ దినములలో పూజింప బడును-64. అచటి ప్రజలు మంచి బంగారు వన్నెగలవారు, బంగారుతోనలంకరింపబడిన వారు దేవతలతో సమానులై చిత్రమైన వస్త్రములు పూలమాలలు గలవారై-65, వీర్వవంతులై మహాభాగ్యవంతులై ఐదువేల యేండ్లాయువు గలవారై సత్యసందులై సంతుష్టులై వాయువు దైవముగా గలవారునై యుందురు-66.

సూతుడనెను:- భారత యుగమున నీ సృష్టి యీ విధముగనే పరమ తత్త్వజ్ఞులచే చూడబడినది. నేనీకింకేమి చెప్పవలెను. ఈ విధముగ బుద్ధిమంతుడగు సూతుడు చెప్పగనే మరల ప్రత్యుత్తరమును వినుటకే యీ విధముగ నడిగిరి-68.

ఋషులనిరి:- ఇది భారతవర్షము దీనియందు స్వాయంభువు మొదలగు పదునలుగురు మనువులు ప్రజాసృష్టికై జన్మింతురు-69. దీనిని తెలిసి కొన గోరుచున్నాము. వారి యీ మాటలు విని లోమహర్షణుడు చెప్పెను-70. సూతపౌరాణికుడు భావితాత్ములైన ఋషులవచనములు విని సమాహితమనస్కుడై మరల వారిని గూర్చి యిట్లు పలికెను-71.

సూతుడనెను:- ఈ పైది కురుదేశముల యధార్థ నిసర్గము (స్వభావస్థితి) భారతము యొక్క యథార్థమైన నిసర్గమును (స్వభావస్థితిని) చెప్పబోవుచున్నాను వినుడు-72. ఓ బ్రాహ్మణోత్తములారా! పూర్వపశ్చిమ(సముద్రములవరకు పొడవైన దక్షిణ హిమాచల పుణ్యక్షేత్రమున దక్షిణముగా వ్యాపించియున్న-73. జానపదముల (జనాహస దేశముల) విస్తరమును గూడ వినుడు. ఇచట నీ భారతదేశమున ప్రజలను మాకువర్ణించి చెప్పుదును-74. ఇది (భారత దేశము) హిమవత్పర్వతమునకు దక్షిణముగను సముద్రమునకుత్తరముగను వ్యాపించి యున్న చిత్రము (చిత్తరువు) శుభాశుభ ఫలములు లభించు స్థానము 75. ఇది భారతమను దేశము. ఇచటి ప్రజలు భారతీయులు ప్రజలను భరించుటచే మనువు భరతుడనబడుచున్నాడు. ఈ నిరుక్తవచనము (వ్యుత్పత్తి నిర్వచనము) వలన దేశమది భారతమనబడినది-76. అక్కడినుండియే స్వర్గము, మోక్షము, మధ్యశ్రాంతమును (స్వర్గమోక్షములకు మధ్య విశ్రాప్తి మార్గము లేదా జీవన్మోక్షము) పొందబడును. ఇచట దప్ప వేరొకచోట భూమిలో మర్త్యులకు (మరణ స్వభావులగు మానవులు మొదలగు వారికి) కర్మ చెప్పబడలేదు. ఒక్క భారతదేశమునకు ఎనిమిది భేదములు చెప్పబడినవి. అవి సముద్రములో మునిగినవై. పరస్పరము తెలియరానివి-78. ఇంద్రద్వీపము కసేరు ద్వీపము, తామద్వీపము, సూర్యద్వీపము, నాగద్వీపము, సౌమ్య (సోమ)ద్వీపము, గంధర్వద్వీపము, వారుణద్వీపము ఈ భారత ద్వీపమనునది తొమ్మిదవది. ఇది సముద్రములచే (పూర్వ పశ్చిమ దక్షిణ సముద్రములచే) చుట్టబడినది. ఇది దక్షిణోత్తరముగా వేయి యోజనములు గలది-79,80. కుమారీనది వరకుగాని గంగోత్పత్తి స్థానమువరకు గాని యడ్డముగా తొమ్మిది వేల (యోజనములు) విస్తీర్ణము గలది-81. ఈ ద్వీపము చివరలలో మ్లేచ్చులచే నిత్యము నివసింపబడినది. ఈ ద్వీపముయొక్కతూర్పు చివరలో కిరాతులు పశ్చిమము (చివర) యవనులును ఉన్నట్లు స్మరింపబడినది-82. ఇక మధ్యన బ్రాహ్మణులు క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు క్రమముగా యుగములచే యుద్ధములచే వ్యాపారములచేతను వృత్తులను నిర్వహించు వారై యుండిరి-83. వారిలో పరస్పర సంవ్యవహారము (తగవు-న్యాయము) జరుగుచుండెడిది. వర్ణములవారు తమ కర్మలలో ధర్మార్థకామ సంయుక్తాలుగా నుండిరి-84. సంకల్పమే యైదవ యాశ్రమముగాగల బ్రహ్మచర్యగృహస్థ వానప్రస్థ-సన్యాసాశ్రమములు యథావిధిగా జరుగుచుండెడివి. ఇచటి స్వర్గ-మోక్షములకొరకై యే మానవుల ప్రవృత్తి (ఆచరణము) యుండెడిది-85. అడ్డము పొడవుగా నుండి తొమ్మిదవదైన యీ ద్వీపమునంతయు జయించిన వాడు సమ్రాట్ అనబడును-86. ఈ లోకము సమ్రాట్టనియు (ఈ లోకమును జయించిన వాడు సమ్రాట్టనియు) అంతరిక్షలోకము విరాట్టనియు (అంతరిక్షమును జయించిన వాడు విరాట్టనియు) ఆవీరిరువురికంటె వేరొక స్వరాట్టును లోకము కలదు. విస్తరమును మరల జెప్పెదను (స్వరాట్టు ఆత్మను జయించిన వాడు బ్రహ్మము)-87.

 ఈ భారతదేశమున మంచి చరిత్రలు గల యేడు కుల పర్వతములు గలవు, మహేంద్ర పర్వతము, మలయ పర్వతము, సహ్య పర్వతము, శుక్తిమత్పర్వతము, ఋక్ష పర్వతము, వింధ్య పర్వతము, పారియాత్ర పర్వతము- ఇవి యేడు కుల పర్వతముల పేళ్లు-88. వాని సమీపములలో నున్న తక్కిన పర్వతములు వేల కొలది కలవు. అవి యుత్తమ వంశమున బుట్టినవి. అన్ని గుణములు గలవి. విశాలములైనవి. చిత్రమైన చరియలు గలవి-89. పర్వతశ్రేష్టమైన మందరము, విహారయోగ్యమైన దద్దుర పర్వతము, కోలాహల పర్వతము, నాగమాతతో గూడిన మైనాక పర్వతము, వైద్యుత పర్వతము, పాతంధమ పర్వతము, పాండుర పర్వతము, గన్లు ప్రస్థపర్వతము, కృష్ణగిరి, గోధనగిరి-91, పుష్పగిరి, ఉజ్జయన్త పర్వతము, రైవతక పర్వతము, శ్రీపర్వతము, కారుపర్వతము, కూటశైలపర్వతము-92, వీనికంటే వేరైనవి చిన్నవి యాశ్రయించిన ప్రాణులు స్వల్పముగా నున్నవియునైన పర్వతములుగలవు. వానితో గలిసిన జనపదములు నిత్యము ఆర్యమ్లేచ్చులు గలవి-93. వారీనదులను (నీటిని) ద్రాగుదురు. గంగ, సింధు, సరస్వతి, శతద్రు చంద్రభాగ, యమున, సరయూ-94, ఇరావతీ, వితస్త, విపాశ, దేవిక, కుహు, గోమతి, ధుతపాప, బాహుద, దృషద్వతి-95, కౌశికి, నిశీర, గండకీ, ఇక్షు, లోహిత- ఇవి హిమవత్పర్వత(పాద) ప్రత్యంత పర్వతములనుండి బయలుపడి స్రవించినవి-96. వేదస్మృతి, వేదవతి, వృత్రుఘ్ని, సిందు, వర్ణాశ, చందన, తీరములతో గూడిన మహతి-97, పరా, చర్మణ్వతి, విశద, వేత్రవతి, శిప్ర అవR,-ఇవి పారియాత్ర కులపర్వతమునాశ్రయించిన నదులు-98. మహానదమైన శోణ, మహావృక్షములు గల నర్మద, మందాకిని, దశార్ణ, చిత్రకూట 99, తమస, పిప్పల, శ్రోణి కరతోయ, పిశాచిక, నీలోత్పల, విపాశ, జంబుల, వాలువాహినీ-100, సీతేరజ, శుక్తిమతి, మక్రుణ, త్రిదివ-ఇవి నక్షత్రపాతమువలన ప్రసవించిన(బయలుదేరిన) మణిసమానజలములుగల నదులు-101. తాపి, పయోష్టి నీర్వింధ్య, మద్ర, నిషద, పేన్వ, వైతరణి, శితిబాహు, కుముద్వతి-102, తోయ, మహాగౌరి, దుర్గ, అక్షశిల,-వింధ్యపాద (ప్రత్యంతపర్వత) ములనుండి బయలువెడలిన పుణ్యజలములుగలిగిన శుభనదులు-103, గోదావరి, భీమరథి, కృష్ణవేణి, వంజుల, తుంగభద్ర, సుప్రయోగ, కావేరి-ఇవి దక్షిణాపథనదులు సహ్యపర్వత పాదప్రత్యంతపర్వతములనుండి బయలుదేరినవి-104. కృతమాల, తామ్రవర్ణ, పుష్పజాతి, ఉత్పలావతి-ఇవి మలయ పర్వతమునుండి బుట్టిన నదులు, ఇవి యన్నియు శీతజలములుగలవి. మంగళములు-105. త్రిసామ, ఋతుకుల్య, ఇక్షుల, త్రిదివ, లాంగులిని, వంశధార,-ఇవి మహేంద్ర పర్వతమునుండి బుట్టిన నదులు-అనబడినవి-106. ఋషీక, సుకుమారి, మందగ, మందవాహిని, కూప్రపలాశిని-ఇవిశుక్తిమత్పర్వతమున బుట్టిన నదులు-107. అన్ని నదులును పుణ్యనదులు, సరస్సులు గలవి, అన్నియు గంగలే సముద్రమునకు జేరబోవునవి. అవి అన్నియు విశ్వమునకు తల్లులు, అవి ఉపనదులను నూర్లకొలదియు వేలకొలది యును గలవు. ఇవి కురుపాంచాలదేశములు జాంగల దేశముతో గూడినవి. సేన దేశము, భద్రకారము, బోధము, శతపథేశ్వరులతో గూడిన వత్సదేశము, కిసష్ణము, కుల్యము, కున్తలము, కాశికోశములు ఈ దేశముల ప్రక్కన తెలంగదేశము వృకదేశముతో గూడిన మగధ దేశమున్ను-ఇవి మధ్యదేశములోని జనపదములు చాలమట్టు చెప్పబడినవి.

సహ్యపర్వతము నకుత్తరమున గోదావరి యున్న ప్రదేశము మొత్తము భూమిలో రమ్యమైన ప్రదేశము-112. అచట గోవర్థన పర్వతము గలదు. అది యింద్రునిచే నిర్మింపబడినది. (పరశు) రాముని సంతోషమునకై యిది స్వర్గము. భరద్వాజ ముని చేత రామ సంతోషమునకే వృక్షములు ఓషధులును, అవతరింప జేయబడినవి. ఆతని చేత అంతఃపుర వనప్రదేశము మనోహరముగా సృష్టింపబడినది -113, 114. వాహ్లికుములు, వాడధామములు, ఆభీరుములు, కాలతోయకములు, అపరీతములు, శూద్రములు, పహ్నవములు, చర్మఖండికములు-115, గాంధారములు, యవనములు, సింధు-సావేరీ భద్రకములు శకములు, వ్రాదములు, కులిందములు, పరితములు, హరపూరికములు (హర్షములు-పూరీకములు)-116. రమటములు, రద్దకటకములు, కేకయులు, దశమానికములు, క్షత్రీయోపనివేశములు, వైశ్యశూద్ర కులములును-117, కాంభోజములు, దరదములు, బర్బరములు, ప్రియకౌశికములు, పీనములు, తుషారములు, పహ్లవములు, బాహ్యతోదరములు 118, ఆత్రేయములు, భరద్వాజములు, ప్రస్థలములు కేసరకములు, లంపాకములు, స్తనపములు, జహుడములతోగూడిన పీడికములును-119, అపగములు, అలియచూలికములు, ఆహుకములు, పూర్ణదర్వులును-ఇవి ఉదీచ్యుదేశము ఇక ప్రాచ్యుదేశములను వినుడు-121. ఆంధ్రవాకములు, సుజరకములు, అంతర్గిరి-బహిర్గిరులు, ప్రవంగ-వంగేయములు, మాలదములు, మాలవర్తి దేశములు-122, బ్రహ్మోత్తరములు, ప్రవిజయులు, భార్గవములు, గేయమర్థకములు, ప్రాగ్జ్యోతిషములు, ముండములు, విదేహములు, తామ్ర (త్రు) లిప్తకములు, యాలములు, మగధములు, గోవిందములు ఇవి ప్రాచ్య దేశములు. ఇవి ప్రాచ్యములనబడినవి-123. ఇక దక్షిణాపథమున నున్న యితరదేశములు. పాండ్యము, కేరళములు, చౌల్యములు, కుల్యములు-124, సేతుకములు, మూషికములు, కుమనములు వనవాసికములు, మహారాష్ట్రములు, మాహిషకములు, కలింగములు-125. చౌషికములతోడి అభీరములు, వరములైన యాటవ్యములు. పులింగములు, వింధ్యమూలికములు, దండకములతోడి వైదర్భములు - 126. పౌనికములు, మౌనికములు, అస్మకములు, భోగవర్థనములు, నైర్ల్కములు, కుంతలములు, ఆంధ్రములు, ఉద్భిదములు, నీలికాలికములు-127, ఇవి ప్రాచ్యదేశములు, ఇక తక్కిన దాక్షణాత్యదేశములను వినుడు. శూర్పకారములు, కోలవనములు, కాలీతకములతోడి దుర్గములు, పురేయములు, సురాలములు, తాపసములతోడి రూపసములు, సురసితములు, సమస్తపరక్షరములు- 129, నాసిక్యములు, అంతర నర్మదములు, భానుకచ్ఛములు, సమములు, హేయములు, శాశ్వతములతోడి సహసములు, కచ్ఛీయములు, సురాష్ట్రములు, అర్బుదములతోడి అనర్తములు, అనునవి చక్కగా చుట్టియున్నదేశములు. వింధ్యవాసిదేశములను వినుడు-130. మాలవములు, కరూషములు, ఉత్కలములతోడి వేకలములు, ఉత్తమగ్లములు, దశార్ణములు, కిష్కింధములతోడి భోజములు-132, తోసలములు కోసలములు, తైపురములు, వైదికములు, తుమురములు, తుంబురములు, నిషధములతోడి షట్సురములు 133. అనుపములు, తుండికేరములు. వీతిహోత్రములు, అవంతులు, ఇవి మొత్తము వింధ్యపృష్ఠముననున్న దేశములు 134. తరువాత పర్వతాశ్రయిదేశములను జెప్పెదను. నిగర్హరములు, హంసమార్గములు. క్షుణములు, తంగణములు, ఖసములు-135, కుశప్రావరణములు, హూణములు, హూదకములతోగూడిన దర్వములు, త్రిగర్తములు, మాలవములు, తామసములతో గూడిన కిరాతములు-136. భారతదేశమున నాలుగు యుగములని పండితులు తెలియుదురు. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము-అనియవి నాలుగు వానియొక్క స్వభావమును ముందు జెప్పెదను వినుడు-137.

ఇది శ్రీ వాయుప్రోక్తే మహాపురాణమున భువన విన్యాసమను నలుబది యైదవ యధ్యాయము -45.