వాయు మహా పురాణము
39 - భువనవిన్యాసో
సూతుడనెను:- ఆ తఱువాత ఏయే పర్వతమున వివిధములైన దేవతలయొక్క యే గృహరాజములు చక్కగా నెలకొన్నవో చెప్పుదును వినుడు-1. అందులో ఏ యీ మహాశైలము శీతాంతమై (ప్రాణులకు శీతలమే మరణమైనట్టి) అనేక విస్తారములు గలదై, చీధాత్రములైన యనేక శతధాతువులచే చిత్రమై, అనేక సముద్రములకు నిధానమై, అనేక ప్రాణులకును గుణములకును నెలవైనదై, గొప్పనైన మణులచే చిత్రములైన బంగారు వెదురు వృక్షములతో నలంకరింప బడినదై యుండెనో ఆ పర్వతము-3. యొక్క నితంబములు (కొండనడిమి ప్రదేశములు) తుమ్మెదలచే ఝంకారములచే నాదితములు. పగడపు రంగు ధాతువులచేతను బంగారు ధాతువుల చేతను చిత్రవర్ణములుగలవి. తటములు మదించిన తుమ్మెదల ధ్వనిగల పూవులతో వ్యాపించినవి-4. వ్రేలాడు తీగలుగలవి. చిత్రములచే చిత్రములైనవి. నూర్ల ధాతువులచే పూజింపబడినవి. పూవులతో నొప్పి రత్నచిత్రములైన చరియలచే నలంకరింపబడినవి-5. నిర్మలమై తీయనైన పానీయములైన నీరుగల యనేకములైన కాలువలతో కూడినది. అనేకములైన పూబోదలతో నలంకరింపబడినది-6. పూలతెప్పలను వహింపజేయు నదులచే నలంకరింపబడినది. అంతట కిన్నరులు దీరుగు గుహలు గలది-7. దానిగుహాగర్బములు యక్షులు గంధర్వులు తిరుగాడునవి. సుఖముగా సేవింపదగిన చిత్రములైన లోతైన గుహలచే శోభితమైనది-8. అనేక ప్రాణి గణములు (ప్రక్ష్యాదులు) వ్యాపించి సుఖాశ్రయములై మంచిపానీయములు గలది. అనేక పుష్పఫలములతో గూడిన వృక్షములతో నలంకరింపబడినది. (ఆ పర్వతము)?-9.
అనేక గర్భములు గల గుహలు గలిగి యా గుహ నాశ్రయించియున్న వారితో నిండిన యా పర్వతము నందు మహేంద్రుని క్రీడావనము కలదు. అది యన్ని కోరికలకు తగిన గుణములతో గూడినది-10. అచట దేవరాజైన యా యింద్రుని యొక్క పారిజాతవనమను మహావనముగలదు. అది వేద ప్రామాణ్యమున ముల్లోకములలో ప్రకాశమైనదిగా కీర్తింపబడును-11. లేత సూర్యునితో సమానమైన యెఱ్ఱనై మహాగంధముగలిగి మనోహరములైన పూవులతో నా పర్వత శ్రేష్ఠము చక్కగా నంతట ప్రకాశించినది (వెలిగినది) వలె నుండును-12. మహేంద్ర వనమున నుండి బయలుదేరిన పారిజాత పుష్పముల గంధమును వాయువు పూర్తి నూరు యోజనముల వరకు గొనిపోయి వ్యాపింపజేయును-13. అచటి బావులు (దిగుడుబావులు) కమలములతో నలంకరింపబడినవి. ఆ కమలములు సువర్ణములు (బంగారువి) వైడూర్య నాళములు గలవి. వజ్రపు కింజల్కములు గలవి. సమస్తము గంధములతో గూడినవి. మదించిన తుమ్మెదల ఝుంకారములు గలవి. విశాల కోశములు గలిగి బాగా వికసించినవి. ఇట్టి మనోహరములైన కమలములు గలవి-14,15. ఆ బావులలో నీటి మధ్యలో బంగారము చేతను మణుల చేతను అలంకరింపబడి కదలని కన్నులుగల వేలకొలది చేపల గుంపులు ప్రకాశించును-16. అనేక సంస్థానములుగలిగి సౌవర్ణమని భూషణముల నలంకరింపబడి ఎగజిమ్ముచున్న నీరు గలిగిన తాబేళ్ళచే నంతట చిత్రముగా ప్రకాశించుచుండును-17. అనేక విధములైన రత్నము వెంట్రుకలు (రెక్కలు)గల పలురంగుల పక్షులచే ప్రకాశించు చుండును. పలు బంగారు పూవుల చేతను మణుల తుండములు గల యేనుగుల చేతను ప్రకాశించుచుండును-18. అంతటను వాలుచున్నవియు చక్కని స్వరములు గలిగి మదోన్మత్తములైన పక్షులచే నా మేధావియైన యింద్రుని యొక్క క్రీడావనము రమ్యమై ప్రకాశించును-19.
ఆ క్రీడావనము మదించిన తుమ్మెదల చక్కని నాదములతోను పక్షుల కూతలతోను నిత్యము ఆనంద వంతముగా జేయబడిన యా క్రీడావనము గొప్పది-20. అది బంగారు ప్రక్క భాగములు గల పర్వతముల చేతను, మణుల చేతను ముత్యముల చేతను, మణులతో గూడిన పర్వత శిఖరముల చేతను ఒప్పినది. అంతటి ఎగురుచున్నవియు-21. చిత్రమైన శరీరములు గలవియు, అనేక రత్నముల వంటి శరీర రోమములు గలవి యునైన కోతుల చేత కూడినది. అనేక వర్ణములు గల తక్కిన ప్రాణుల చేత వ్యాకులముగా నున్నది-22. అచట బాలతలును, పారిజాత(పుష్పముల) వృక్షములును పిల్లవాయువులచే కదల్చబడినవై పుష్పవర్షములు గురియును-23. అచట విశాలములై రత్నములచే నలంకరింపబడిన శయనములు, ఆసనములు, ద్వారములు- వీనిచే నలంకరింపబడిన విహారభూములును గలవు. అచట ఇంద్రక్రీడావనములో మంగళకరములైన పక్షులుగలవు. అచట సూర్యుడు మిక్కిలి వేడిగ గాని శీతలముగగాని లేక ఎల్లప్పుడు సమశీతోష్ణముగా నుండును-24. అచట చైత్రమాసమున వసంతఋతువున అనేక పుష్పములతో సువాసితమై వాయువు వీచును. అది నిత్యము కామోన్మాదమును గలుగజేయును. నిత్యము శరీరము శరీరమున సంగసుఖముచే నానందింప జేయును. శ్రమమును క్లమమును నశింపజేయును-25.
ఆశుభ్రమైన యింద్ర వనమున, దేవతలు, దానవులు, పన్నగులు, యక్షులు, రాక్షసులు, గుహ్యకులు, అమితతేజస్కులైన గంధర్వులు-24. విద్యాధరులు, సిద్దులు, కిన్నరులును సంతోషముతో గూడి యుందురు. ఆ తరువాత అప్సరోగణములుగూడ అచట నిత్యము క్రీడాపరాయణులై యుందురు-27. ఆ పర్వత శ్రేష్ఠము యొక్క తూరుపు ప్రక్కన మహోచితమైన కుముంజమను పర్వతశ్రేష్ఠము గలదు. దాని పై యనేక(నదీ) ప్రవాహములు, గుహలును గలవు-28. దానియొక్క ధాతు విచిత్రమైన శిఖరముల యందు మహాత్ములైన రాక్షసులయొక్క బహువిస్తారములైన యెనిమిది నగరములు బయలు దేరినవి-29.
వజ్రక పర్వతమునగూడ అనేక శిఖరములచేతను గర్భముల చేతను పైకి వెలసిన రాక్షస నివాసములు గలవు. అవి పురుషులతోను స్త్రీలతోను వ్యాకులమైనవి-30. నీలకులను నా రాక్షసులు భయంకరులు, కామరూపులు (అనుకొన్న రూపమును ధరించగలవారు) వారు బలపరాక్రమవంతులై యచట నిత్యము ఆసక్తులై యుందురు-31. మహానీలపర్వతరాజమున గూడ పదియైదు పురములు గలవు. అవి గుఱ్ఱపు ముఖము గలిగి కిన్నరులనీ ప్రసిద్దిజెందిన మహాత్ములవి-32. మహాబాహువైన దేవసేనుడు అట్లే ఇంద్రుడు మొదలగువారు ఆపురములకు బలము అచట కిన్నరరాజులు పదియైదుగురు గర్వితులు-33. బంగారు ప్రక్కభాగములు గలవారు. సామాన్యముగా అనేక వర్ణ(జాతులతో) ములచే వ్యాకులములై బల ప్రవేశములు గల నగరములచే ఆ శైలేంద్రము బాగుగా నలంకరింపబడినది-34.
అచట మిక్కిలి భయంకరులు, విషపు చూపులు గలవారు, అగ్నివంటి కోపము గలవారు. సమీపింపనలవికానివారు, బంగారమునకు వశమై నడచుకొనువారు నైన మహోరగులు నూరుగురు గలరు-35. ఆ పర్వతము చక్కగా నాగులు గలదైనను అచట రాక్షసావాసములు వేలకొలది కలవు. ధనికుల మేడలు రాజమందిరములు దేవాలయములును పొడవైన ప్రాకరము తోరణద్వారములును గలిగియున్నవి-36.
వేణువంతమను మహాశైలమున విద్యాధరులవి మూడు పురములున్నవి. అవి ముప్పదియోజనములు వెడల్పు, ఏబది యోజనముల పొడవును గలవి-37. అచట దేవేంద్రునితో సమానమైన పరాక్రమములు గల ఉలూకుడు, రోమశుడు, వీర్యవంతుడైన మహానేత్రుడు-అను విద్యాధరులు గలరు-38.
వైకంకమను శైలము గలదు. దానిలో గుహలు సెలయేరులును గలవు. మహోన్నతమై యందమైన శిఖరములు గలవు. అది అనేక రత్నములచేతను ధాతువులచేతను చిత్రింపబడినట్లుండును-39. అచట నిత్యము గరుడుని కుమారుడైన సుగ్రీవుడను పరాక్రమవంతుడు కలడు. ఆతడు ఉరగుల శత్రువు. దరి చేరనలవికాని వాడు మహావాయువంతటి వేగము గలవాడు-40. ఆ పర్వతము మహాప్రమాణములు గలవై, పరాక్రమవంతములై మహాబలపరాక్రమములు గల సర్పశత్రువులైన పక్షులచే నా పర్వతమంతయు నొవరింపబడియుండును-41.
కరంజ వర్వతమున నెల్లప్పుడును సాక్ష్యాద్భూతపతియై ప్రభువై వృషభధ్యజుడై యోగులకు ప్రభులై-42. మహాదేవుడైన శంకరుడుండును. ఆ కరంజ పర్వతమున చరియలన్నియును అనేక వేషములు ధరించి భూతములై దరిజేరనలవిగాని ప్రమథ గణములచేత నంతట వ్యాపించబడియుండును-43.
వసుధారమను పర్వతమున వస్తువుల యొక్క యెనిమిది పూజితములైన నివాసములు గలవందురు. వారు వసు(ధన) మంతులు. అమితతేజసులు. మహాత్ములు-44. రత్నధాతువను పర్వత శ్రేష్ఠమున మహాత్ములైన (సప్త ఋషులయొక్క యేడు ఆశ్రమములు గలవు. అవి సిద్ధావాసములతో గూడియున్నవి-45. హేదుశృంగమను పర్వత శ్రేష్ఠమున నాలుగు ముఖములు గల ప్రజాపతిబ్రహ్మ) యొక్క స్థానము గలదు. అది సర్వభూతములచే నమస్కరింపబడినది-46. గజశైలమున భగవంతుని నానా భూతగణములతో జుట్టబడిన శూద్రులు గలరు. వారు నిత్య సంతుష్టులు. సర్వ భూతములచే నమస్కరింప బడినవారు-47.
అట సుమేధమను పర్వతము ధాతుచిత్రములతో గూడినది. మేఘముతో సమముగా నల్లనైనది. అనేకములైన గుహలు, ధాన్యములు వాటిక్షేత్రములు పొదలు - వీనిచే నది ప్రకాశించినది-48. ఆదిత్యుల యొక్కయు వస్తువులయొక్కయు, అమిత తేజుస్కులైన రుద్రులయొక్కయు, అశ్వినీ దేవతలయొక్కయు మనోహరములైన గృహవిన్యాసములు గలవు-49. ఆ నగోత్తమమున సిద్ధులచేత దేవతలయొక్క స్థానములు స్థాపింపబడినవి. అచట యక్షగంధర్వకిన్నరులు నిత్యము పూజాపరులై యుందురు.50.
హేమకక్షమను పర్వత శ్రేష్ఠమున విశాలమైన గంధర్వనగరి కలదు. ఎనుబది (క్రోశముల) పొడవుగల పురివంటిది. గొప్పప్రాకార తోరణములుగలది-51. సిద్దులు, అపత్తనులను గంధర్వులను యుద్ధమున శోభించువారు. వారి యధిపతి రాజరాజై దేవుడైన కపింజలుడు-52. అనలపర్వతమున రాక్షసావాసములు గలవు. పంచకూటమున గూడ దానవులుగలరు. వారుత్సాహవంతులై మహాబలపరాక్రమములు గల దేవశత్రువులు-53.
రాగి కాంతి గల పర్వతమున అమిత తేజస్కులైన యక్షులకు సంబంధించిన నూరు శిఖరములు గల నూరు పురములు గలవు. అటక ద్రువ పుత్రుడైన తక్షకుని యొక్క పురశ్రేష్ఠము గూడ గలదు-54. అనేక వస్త్రముల చేతను గుహల చేతను శుభమైన విశాఖమను పర్వత శ్రేష్ఠమున ఎల్లప్పుడు గుహలోనే నివాసము గల గుహుని (కుమారస్వామి) యొక్క గొప్ప (భవనము) కలదు-55. మహాభవనములతో నలంకరింపబడిన శ్వేతోదరమను మహాశైలమున మహాత్ముడు గరుడ పుత్రుడునైన సునాభునియొక్క పురము గలదు-56. పిశాచకమను పర్వత శ్రేష్ఠమున ధనికులయు దేవరాజులయొక్కయు గొప్పమేడలచే నలంకరింపబడినదియు, యక్షగంధర్వులు తిరిగి నదియునై గొప్పనైన కుబేర భవనము గలదు-57. హరికూటపర్వతమున దేవుడై సర్వభూత నమస్కృతుడైన హరి యుండును. ఆయన ప్రభావమువల్ల నీ పర్వతము మహానాభమై ప్రకాశించును-58. కుముదపర్వతమున కిన్నరుల నివాసములు, అంజన పర్వతమున మహోరగులును (వారినివాసములు)ను గలవు. కృష్ణపర్వతమున మహా భవనములతో నొప్పిన గంధర్వ నగరములు గలవు-59. అందమైన శిఖరము గొప్ప ప్రాకారతోరణమును గల పాండుర పర్వతమున మహాభవన పంక్తులు గల విద్యాధరులయొక్క పురము గలదు-60. సహస్ర శిఖరమను పర్వతమున ఉగ్రకర్ములు, బాగుగ పైకెదిగినవారు, బంగారు మాలలుగల రాక్షసులయొక్క వేయిపురములు గలవు-61. ముకుటపర్వతమున నాగుల కావాసములైన యనేక పర్వత శ్రేష్ఠములు గలవు. పుష్పక పర్వతమున నిత్య సంతుష్టులైన ముని గణములు గలవు- 62. సుపక్షమను పర్వత శ్రేష్ఠమున వైవస్వతుని యొక్కయు, సోముని యొక్కయు, వాయువు యొక్కయు, నాగాధిపుని యొక్కయు ఈ నలువురియొక్క నివాసములు గలవు-63. గంధర్వులచేతను, కిన్నరులచేతను, యక్షులచేతను, నాగుల చేతను, విద్యాధరశ్రేష్ఠుల చేతను వారి స్థానములలో నిత్యము ఇష్టమై (హోమము చేయబడినదై) యొక్కువగా పూజింపబడును-64.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున భువన విన్యాసమను ముప్పది తొమ్మిదవ యధ్యాయము.39.