9 - దేవాది సృష్టి వర్ణనం

సూతుడు పలికెను:-  ఆ తరువాత ధ్యానము చేయుచున్న స్మరించుచున్న బ్రహ్మకు మానసీ ప్రజలు పుట్టిరి. అతని శరీరమున బుట్టిన కారణములతో గూడిన కార్యములతో క్షేత్రజ్ఞులై ఆ బుద్ధిమంతుని యొక్క (బ్రహ్మయొక్క) గాత్రముల నుండి వారు పుట్టియుండిరి. అంత, దేవ, అసుర- పితరులను మానవుల ఈ నాల్గింటిని సృష్టింప దలచి ఈ జలములను తనతో కలియ జేసెను. యుక్తాత్ముడైన యా బ్రహ్మకు మాత్రలు బుట్టినవి. ఆ సృష్టిని చింతించుచున్న ప్రజాపతికి బ్రహ్మకు ప్రయత్నము కలిగెను.

అంత బ్రహ్మయొక్క పిరుదు నుండి మొదలు సుతులుగా అసురులు జనించిరి. ఓ విప్రులారా! అసు: అనగా ప్రాణము. దాని నుండి బుట్టిన వారు గావున అసురులు. (అనబడినారు), బ్రహ్మ సురులు బుట్టిన శరీరమును తొలగించెను. తొలగింపబడిన శరీరముచేత వెంటనే రాత్రి జనించెను. అది చీకటి నిండినది కావున త్రియామీక. ఆ బ్రహ్మ నుండి వచ్చిన ప్రజలు రాత్రియందు తమస్సుతో నావృతులైరి.

దేవేశుడైన బ్రహ్మ సురలను చూచి, వేరొక శరీరమును పొందెను. అవ్యక్తమైన సత్యము నిండినదైన యా శరీరమును ధరించెను. అట్లు ఆ శరీరమును పొందిన ప్రభువునకు సంతసముగానుండెను.

అంత, క్రీడించుచున్న బ్రహ్మయొక్క ముఖము నుండి దేవతలు పుట్టిరి. దేవనము చేయుచున్న బ్రహ్మ నుండి బుట్టిన వారు గావున దేవతలని పిలువబడిరి. 'దివి' యను ధాతువు క్రీడయందు భావింపబడును. దివ్యమైన (క్రీడించిన) యా శరీరమున బుట్టిన వారు గావున దేవతలు.

దేవతలను సృష్టించి దేవేశుడైన బ్రహ్మ వేరొక శరీరమును పొందెను. (అనగా) బ్రహ్మ సత్యమాత్రాత్మకమైన వేరొక శరీరమును పొందెను ఆ ప్రభువు తనను తండ్రివలె భావించునాపుత్రులను బాగుగా స్మరించెను. రాత్రి పగళ్ళ మధ్యన ఉపపక్షములరెంటిచే పితరులను సృజించెను. కావున నాపితరులు దేవతలు అందుచేత వారియందు అ పుత్రత్వము.

పితరులను సృష్టించిన యా శరీరమును బ్రహ్మ తొలగించెను. ఆ శరీరము తొలగినందున వెంటనే సంధ్య పుట్టినది. కావున పగలు దేవతల కోసం సంబంధించినది. రాత్రి యసురులకు సంబంధించిదని యనబడినది. ఆ రాత్రి పగళ్ళ మధ్య సంధ్య పితృదేవతలకు సంబంధించినదియై శ్రేష్టమైనది. కావున దేవాసురులందరును ఋషులును మునులను వీరందరు కలిసి బ్రహ్మయొక్క (మధ్యమమైన) శరీరమైన సంధ్యనుపాసించుచున్నారు .

అంత, ఆ బ్రహ్మ మరల వేరొక శరీరమును ధరించెను. రజోమాత్రాత్మకమైన యా శరీరమునందు ఆ ప్రభువు మనస్సుతో (ప్రజలను సృష్టించెను. రజస్సునిండిన యా శరీరము నుండి బ్రహ్మ మానస సుతులను సృష్టించెను. కాగా బ్రహ్మ మనస్సు నుండి మానస ప్రజలు బుట్టిరి. ఆ ప్రజలను చూచి కూడ బ్రహ్మ మరల తన శరీరమును తొలగించెను. ఆ శరీరమును తొలగించుటచే వెంటనే వెన్నెల కలిగెను. వెన్నల కలుగగా దాని నుండి సంతసించిన ప్రజలు బుట్టిరి. ఈ విధముగ మహాత్ముడగు బ్రహ్మచేత శరీరములు తొలగింపబడినవి.

వెంటనే రాత్రి పగళ్ళు, సంధ్యా జ్యోత్స్నలు పుట్టినవి. జ్యోత్స్య సంధ్య అట్లే పగలు ఈ మూడు స్వయముగా సత్యమాత్రాత్మకము. రాత్రి తమోమాత్రాత్మిక. అదియే త్రియామిక. అందువలననే దివ్యతత్త్యము గలిగి సంతుష్టులైన దేవతలు బ్రహ్మముఖముల నుండి సృష్టింపబడిరి. వారి జన్మ పగలున జరిగినది. కావున వారు పగలు బలవంతులు.

 ప్రభువైన బ్రహ్మ తన శరీరము నుండి యసురులను సృష్టించేను. కావున రాత్రి జన్మించిన వారు రాత్రియందు ప్రాణములకంటే కూడ అసహ్యులైరి. ప్రాణ భయంకరులైరని భావము గావచ్చును?. అసురులతోబాటు భవిష్యులైన దేవతలకును, భూతభవిష్యములలో పితృ దేవతలకును మానవులకును మన్వన్తరములలో అందరికిని ఇవియే నిమిత్తములగును గదా. వెన్నెల రాత్రి, పగలు, సంధ్య ఈ నాలుగు భాసితములు (ప్రకాశింపబడినవి.) దేనివలన భాసించునో అది వ్యాపించి ప్రకాశించుటలో (అర్థములో) 'భాసి' అని విద్వాంసులచే చెప్పబడినది. ఇంకను ప్రజాపతి పలికెను.

ఆ బ్రహ్మ యీ జలములను జూచి, దేవతలను, దానవులను, మానవులను పితృదేవతలను, తక్కిన విబుధులను తన ఆత్మ నుండి సృజించెను. అంత ఆ శరీరమును మొత్తమును తొలగించి యా ప్రభువు మరొక శరీరమును సృజించెను. రజస్తమో గుణములు నిండిన శరీరమును ధరించేను. అంధకారములో ఆకలితో నుండి మరొక శరీరమును సృజించెను (ధరించెను). దానిచే సృజింపబడి ఆకలిచే అలమటించినవారు నీటిని దీసికొనుటకు ప్రయత్నించిరి. వారిలో ఈ నీటిని రక్షింతుము అనిరి. వారు లోకమున రాక్షసులని తలంపబడిరి. క్రోధాత్ములైన వారు నిశాచరులు.

నీటిని రక్షింతు మన్నవారు పరస్పరముగా సంతసించిరి. ఈ పనిచే వారు క్రూరకర్మలుగల యక్షులు గుహ్యకులు. (ఐరి) క్షిణాతువు రక్షణార్థమున పాలించుట యను నర్థమున వర్తిల్లునని భావింపబడినది. ఈ క్షితి ధాతువు క్షీణింపచేయుట యను నర్థము గూడ నున్నదని నిర్వచింపబడినది.

వారిని చూచిన కోపముతో ధీమంతుడైన బ్రహ్మయొక్క కేశములు రాలినవి. అపుడు శీతోష్ణము వలన పైకి లేచినవై (ప్రభువు శిరమున) మొలచినవి. నా శిరము నుండి హీనములై (తొలగినవై) వ్యాలములు. కారణము అవి అపసర్పితములై సర్పములైనవి. విరుద్ధముగా నడ్డినవి గాన వ్యాలాత్మలు హీనములు గావున అహులు అనబడినవి. పన్నములు జారిపడుచుండునవి) గాన పన్నగములు అపసర్పీణులు వక్రముగా బ్రాకునవి) గావున సర్పములు వాటికి సూర్యచంద్రుల క్రింద భూమి యందు నిలయములు (ఉండును). ఆ బ్రహ్మ యొక్క కోపము వలన బుట్టినవాడు అగ్ని గర్భుడు, మిక్కిలి భయంకరుడు. అతడు సర్పములతోబాటు బుట్టిన విషాత్మకులనావేశించెను.

అంత, సర్పములను చూచి కోపమువలన క్రోధాత్మలను సృజించెను. వారు కవిశ (కోతి) వర్ణముతోనుగ్రులై భూతములు (కోరినది పొందువారు) మాంసాశను (రాక్షసు)లైరి. పోవుచున్నందున వలన గోవులు (?) గన్ధర్వులును అపుడా బ్రహ్మకు బుట్టిరి. ధ్యాయతియను నీ ధాతువు యాత్రార్థమున పరిపఠింప బడును. త్రాగుచున్నందున గోవులు బుట్టినవి(?) అందుచేత వారు గంధర్వులనబడిరి. ఈ యెనిమిది దేవయోనులు సృష్టింపబడగా ఆ ప్రభువైన బ్రహ్మ తన స్వేచ్ఛతోనే వయసులను (వయాంసి), వయసములను (వయసః) (పక్షిజాతులను) సృజించెను. వానిని వయసులను వయాంసలను కప్పును గాన ఛందసి యనబడినవి. ఆ బ్రహ్మదేవుడు పక్షిగణములు తేమిచూచి యా పక్షిగణములను సృజించెను.

 ఆ తరువాత నా బ్రహ్మ ముఖము నుండి మేకపోతులను సృజించెను. వక్షః స్థలము నుండి పక్షులను సృజించెను. కడుపు నుండి గోవులను ప్రక్క భాగముల నుండి సృజించెను. పాదముల నుండి గుఱ్ఱములను, ఏనుగలను, శరభములను (సింహమును జంపు మీగండ్లు ఎనిమిది కాళ్ళు గల మృగములను), గోవులవలె నుండు గురుపోతులను, లేళ్ళను. ఒంటెలను, కంచరగాడిదలను, మరియు తరజాతులను సృజించెను-40. ఆ బ్రహ్మ రోమముల నుండి ఫలములు కందమూలములు (గల వృక్షములు) సృజింపబడెను. ఇట్లే పశువులను, ఓషధులను, సృష్టించి యా ప్రభువైన బ్రహ్మ వానిని యజ్ఞములతో గలి పెను. (తదుపయోగులుగా జేసెను).

కల్పాదిలో త్రేతాయుగ ప్రారంభమున గోవు, మేక, పురుషుడు, గుజ్జమే, కంచరగాడిత, గాడిద వీనిని గ్రామ్యములైన పశువులందురు. ఇక అరణ్య పశువులను వినుడు. వ్యాఘములు (పులులు), రెండు గిట్టులు గలవి. ఏనుగ, వానరము, పక్షులు ఈ యైదును పందికొక్కులు ఏడవవి పాములును సృష్టించబడినవి. ఆ బ్రహ్మ తన మొదటిదైన తూర్పు ముఖము నుండి యజ్ఞములకు సంబంధించిన గాయత్రమును వరుణమును, త్రివృత్సౌత్యమును, రథన్తరమును, అగ్నిష్టోమమును సృజించెను. ఆ బ్రహ్మ తన దక్షిణ ముఖము నుండి ఛందస్సులను, తైషుభ కర్మను పంచదశస్తోమములను, అట్లే బృహత్సామమును, తరువాత ఉర్థ్యమును, సృజించెను. బ్రహ్మ తన పశ్చిమ ముఖము నుండి సామములను, జగతిచ్ఛందములను, పంచదశాక్రోమములను, అట్లే వైరూప్యమును అతి రాత్రమును సృజించెను. ఉత్తర ముఖము నుండి ఇరువది యొక్క అధర్వణమును, ఆర్యామాణమును, అనుష్ణుభమును, వైరాజమును సృజించెను.

మెరువులను పిడుగులను, మేఘములను, చక్కని (ఋజువైన) ఇంద్రధనుస్సులను, వక్రమైన ఇంద్రధనస్సులను, పక్షులను కల్పాదిలో భగవంతుడై ప్రభువైన బ్రహ్మ సృజించెను. అనేక ప్రకారములైన భూతములు ఆ బ్రహ్మ యొక్క గాత్రముల నుండి పుట్టినవి. సృష్టించుచున్న ప్రజాపతియైన బ్రహ్మము నుండి ప్రజాసృష్టి జరిగినది. మొదట, దేవతలు, అసురులు, పితరులు, ప్రజలు అను నీ నాల్గింటిని సృష్టించి, తరువాత స్థావరములను చరములను సృష్టించెను. తరువాత యక్షులను, పిశాచులను గన్ధర్వులను, అట్టే అప్సరస గణములను, కిన్నరులను, రక్షస్సులను, పక్షులను, పశువులను, మృగములను పాములను. నశించనివానిని, నశించువానిని, ఈ స్థాణు జడ్గమములను, వాని కర్మలను పూర్వసృష్టిలో పొందిరి. అవియే మరల మరల సృష్టింపబడుచున్నవై పొందబడుచున్నవి.

హింసా హింసములు (చంపు స్వభావము గలవారు దానికి విరుద్దులు మెత్తని స్వభావము గలవారు క్రూర స్వభావము గలవారును, ధర్మము, అధర్మము, సత్యము, అసత్యమును ఇవి భావింపబడినవై పొందబడును. కావున అది వానికి రుచించును. మహా భూతములలో వినియోగమును బ్రహ్మయే స్వయముగాజేసెను. కొందరు మానవులు పురుషకార కర్మ (పురుష ప్రయత్నము) యే తమ స్థితికి ముఖ్యమందురు. దైవచింతకులై విప్రులగు మరొకరు తమ స్థితిని దైవమని (దైవాధీనమని) యందురు. ఈ తమ స్థితికి పురుష ప్రయత్నమున కొందరు దైవ ప్రయత్నమును కొందరు అధికమందురు. పౌరష-దైవములు వాని సఫల స్వభావమును బట్టి ఒకటిగా గాని, వేరుగా గాని, వానిలో నొకటి యధికమని గాని ఉండవని పెద్దలు తెలియుదురు. ఇది యిట్లు అది ఒకటి కాదు. రెంటిలోనే యొకదానికి, అధిక న్యూనతలు లేవు. అనగా సమానములు.

 సత్య గుణవంతులై సర్వసమతను జూచువారు విషయములను (ఐహిక భోగములను) పురుష ప్రయత్న రూపకర్మవల్ల పొందదగిన వానిగా జెప్పుదురు. ఆ మహేశ్వరుడు, మొదట నామరూపాత్మకమును, సృష్టింపబడిన భూతములను విస్తరింపజేయుటను వేదశబ్దముల నుండియే నిర్మించెను.

ఋషుల యొక్క నామధేయములకు దేవతలతోని దృష్టులను రాత్రి చివరలో ప్రసవించిన వారి యొక్క నాయధేయములను ఆ బ్రహ్మ ధరించును(?). ఋతువులో చివర నానారూపములైన ఋతు చిహ్నములు కనబడునట్లే యుగాదులలో గూడ నానారూపములైన యుగచిహ్నములు ఆ విధముగనే గనబడును. పుట్టుక దెలియని బ్రహ్మచే ఈ విధముగ సృష్టింపబడిన వానిలో రాత్రి చివర మానసీ సిద్దినాశ్రయించి నామ రూప చిహ్నములు గనబడుచున్నవి. ఈ విధముగ భూతములు చరాచరములు సృష్టింపబడినవి. బ్రహ్మచే మహామేధావియైన బ్రహ్మచే. సృష్టింపబడిన యా ప్రజలు చక్కగా వృద్ధిబొందకుండిరి. 

 ఆ తరువాత తనను బోలిన మానస పుత్రులను కొందరిని సృష్టించెను. భృగువు పులస్త్యుడు, పులహుడు, క్రతువు, ఆబ్ధిరసుడు, అట్లే మరీచి, దక్షుడు, అత్రి (మానసుడైన) వసిష్ఠుడు ఈ వీరు బ్రహ్మాత్మకులుగా బ్రహ్మవాదులు అయిన అందరిలోను నవ బ్రహ్మలని పురాణము నిశ్చయముగా దెలియబడినవారు.

తరువాత పూర్వులలో పూర్వుడైన బ్రహ్మ సంకల్పాత్మకుడును ధర్మాత్ముడును, రోషాత్మవల్ల బుట్టినవాడు నగు రుద్రుని సృజించెను. ముందు బ్రహ్మ తన మనుసు నుండి బుట్టిన తనతో సమానులైన సనందమని, సనకుని విద్వాంసుడైన సనాతనుని, సనత్కుమారుని, ప్రభువగు సనకుని సనందనుని(?) సృజించెను. కాని ఏ కోరికలు (అపేక్షలు) లేని యా సనాతనులు లోకమున నేమియు సృష్టించరైరి (నసర్జస్తే). వారందరు చక్కగా పొందబడిన జ్ఞానము గలవారు విరాగులు, విమత్సరులు లోకవృత్త కారణమున వారు అపేక్షింపదగిన వారైరి. అపుడు హిరణ్యగర్భుడైన భగవంతుడైన బ్రహ్మ యాలోచించెను. అతని రోషము వలన బుట్టిన పురుషుడు సూర్యసమాన తేజస్కుడు. సగము స్త్రీ సగము పురుషుడుగల శరీరము గలవాడు. మండుటగ్ని వంటివాడు. అపుడు సూర్యసమాన తేజస్సుగలదై యంతయు తేజోమయమైనది. "ఆత్మను (తనను) విభజించుము” అని చెప్పి (రుద్రుడు) (బ్రహ్మ) అచటనే అంతర్థానమయ్యెను.

 ఈ విధముగా జెప్పి యా యీశ్వరుడు స్త్రీ వేరుగా పురుషుడు వేరుగా రెండు విధములయ్యెను. ఆ యీశ్వరుడు తన సగభాగమును పదకొండు విధములుగా బుట్టించెను. ఆ మహాత్మునిచే చెప్పబడిన వారందరు మహాత్ములు జగత్తు యొక్క బహులీభావమును గురించి హితములను గోరువారు. మీరు లోకము గడచుట కారణముగా సోమరితనము లేనివారై విశ్వము యొక్కయు సమస్త లోకము యొక్కయు స్థాపన కొరకును దాని మంచి కొఱకును ప్రయత్నించుడు". ఈ విధముగా జెప్పబడినవారై (ఆపదకొండు శివార్థరూపములు) రోదనము జేసిరి (ఏడ్చిరి). అంతటను పరుగిడిరి. రోదనము వల్లను ద్రావణమువల్లను వారు రుద్రులను వేళ్ళతో ప్రసిద్ధి జెందిరి.

ఆ రుద్రులే చరాచరములతో నిండిన యీ సమస్త త్రైలోక్యమును వ్యాపించి యుండిరి. వారి యొక్క అనుచరులే (ఎప్పుడు వెంబడి ఉండి సేవించువారు) లోకమున సర్వలోక పరాయణులు, పదివేల ఏనుగుల బలము గలవారు, పరాక్రమము గలవారు, అయిన గణేశ్వరులు గణముల నాయకులు ఉన్నారు. నేనీ వరకు జెప్పినదియు మ హైశ్వర్యము గలదియు స్వయంభువైన బ్రహ్మయొక్క శరీరము ముఖము నుండి బుట్టినదియునై, శంకరార్ధశరీరముదాల్చినదై అర్ధనారియైనది. ఆమె కుడి సగభాగము తెలుపు. యెడమ సగభాగము నలుపు. బ్రహ్మ ఆమెను “ఆత్మను (తనను) విభజించుకొనుము" అనగానే ఓ బ్రాహ్మణులారా! బ్రహ్మ చెప్పిన విధముగనే, ఆమె రెండుగానై తెల్లనిదిగను నల్లదిగను అయినది. ఆమె నామములను జెప్పెదను ఏకాగ్రచిత్తులై వినుడు. స్వాహా, స్వధా, మహావిద్యా, మేధా, లక్ష్మీ! సరస్వతీ, అపర్ణా, ఏకవర్ణా, పాటలా, ఉమా హైమవతీ, షష్ఠి (కాత్యాయనీ), కల్యాణీ, ఖ్యాతి, ప్రజ్జా, మహైశ్వర్యవతియైన గౌరి (ఇవి 16 షోడశదుర్గ నామరూపములు). ఈనామములు అర్ధనారీ తన్నుతాను విభజించుకొన్న 16 రూపముల యొక్కయు నామములుగా లోకమున ప్రసిద్ధిజెందినవి.

ఇక ఆర్య యొక్క వేర్వేరు దేహములను ధరించుటచే యామె విశ్వరూపమైనది. మొదటి నుండి సంగ్రహముగా ఆమె విశ్వరూపములను వినుడు. ప్రకృతి, నియతా, రౌద్రీ, దుర్గా, భద్రా, ప్రమాధినీ, కాలరాత్రి, మహామాయా, రేవతీ, భూతనాయికా.

ద్వాపర యుగాన్త వికారములలో దేవి యొక్క నామములను వినుడు. గౌతమీ, కాశికీ, ఆర్యా, చండీ, కాత్యాయనీ, సతీ, 82 కుమారీ, యాదవీ, దేవీ, వరదా కృష్ణపింగళా, బ ర్హిర్ద్వజా, శూలధరా, పరమ బ్రహ్మచారిణీ-83, మహే న్ద్రీ, ఇ న్ద్ర భాగినీ, వృషకన్యా, ఏకవాససీ, అపరాజితా, బహుభుజా, ప్రగల్బా సింహవాహినీ-84, ఏకనాసా దైత్యహనీ, మాయా, మహిషమర్దినీ, అమోఘా, వింధ్యనిలయా, విక్రాంతి, గణనాయికా-85, ఈ విధముగా వరుసగానివి దేవీ నామవికారములు. తత్త్యతః (తాత్యికముగా) భద్రకాళీ స్తవములో చెప్పబడిన వీనిని.

చదివిన వారికి అవమాన ముండదు. అరణ్యమున గాని, దూరమైన ఏడాది త్రోవలోగాని, పురమునగాని ఇంటగాని దీని రక్షను (ఈ నామములతో మంత్రించిన భస్మమును పెట్టుట ఈ నామములను వ్రాసిన తాయెత్తును ధరింపజేయుటను) ప్రయోగింపవలె. జలమునగాని స్థలమున గాని పులి నుండి గాని, మొసలి నుండి గాని, దొంగల నుండిగాని, యీ నామములతో రక్షించు కొనవచ్చును. విశేషించి భూతములుండు స్థానమున అన్ని విధములైన రోగముల యందును ఈ నామములను చదువవలెను. బాల గ్రహములు, భూతములు, పూతనా మాతలు తల్లిగా వచ్చునట్టి పూతనాది పిశాచములు) వీనిచే పీడింపబడినవారికి ఈ నామములతో రక్షను ప్రయోగించవలెను.

మహదేవీకులమునందైతే ప్రజ్ఞా - శ్రీ అనునిద్దరు చెప్ప బడుచున్నారు. ఈ రెంటి నుండి సమస్త జగమును వ్యాపించిన దేవీ సహస్రములను (వేలకొలది దేవీశక్తులను) ఆమె సృజించినది. వ్యవసాయము పురుష ప్రయత్నము ధర్మము, భూతముల సుఖాసుఖములు సంకల్పము ఇవి కల్పాదిలో అవ్యక్త జన్ముడైన బ్రహ్మ నుండి పుట్టినవి-91. బ్రహ్మయొక్క మనస్సు నుండి బుట్టిన పుత్రుడు రుచి అని తెలియవలెను. బ్రహ్మ తన ప్రాణము నుండి దక్షుని సృజించెను. కన్నుల నుండి 'మరీచి'. (మహర్షిని సృజించెను-92. బ్రహ్మయొక్క హృదయము నుండి భృగుమహర్షి జనించెను. శిరస్సు నుండి అంగిరసుడను మహర్షి, చెవి నుండి అత్రి మహర్షి-93, అట్లే బ్రహ్మ తనయొక్క ఉదాన వాయువు నుండి (కంఠము నుండి) పులస్త్య మహర్షిని, వ్యానవాయువు నుండి (సర్వ శరీరము నుండి) పులహ మహర్షిని సమాన వాయువు నుండి (నాభి నుండి) వశిష్ఠ మహర్షినీ, అపానవాయువు నుండి (గుదము నుండి) వక్రత మహర్షిని, ఈ సప్తర్షులను సృజించెను-94. అభిమాన స్వభావముగల వాడును భద్రుడును (మంగళరూపుడు) అగు శివుని సృజించెను. (?) ఈ వీరందరు బ్రహ్మయొక్క ప్రాణము నుండి బుట్టిన పండ్రెండుగురు పుత్రులు అనబడిరి-95.

ఈ వీరందరు బ్రహ్మమానసపుత్రులని తెలియవలెను. ఈ విధముగ సృష్టింపబడిన భృగుమహర్షి మొదలగువారు బ్రహ్మవాదులు (తోపర బ్రహ్మను చెప్పువారు) భార్య గృహస్థాశ్రమమున నున్నవారు. చాల ప్రాచీనులు. వారిచేతనే మొట్టమొదటి ధర్మము లోకమున నడపబడినది. రుద్రునితో గలిపి పండ్రెండుగురు ప్రజలు-76, 97, ఋభువు సనత్కుమారుడను నీ యిద్దరు ఊర్థ్వరేతస్కులు. వీరు వారి నుండి మొదట జన్మించినవారు. అందరికంటెను పూర్వులు-98, పురాణమై (ప్రాచీనమై) వైరాజ్యమైన ప్రథమకల్పము గడచిపోగా వారిద్దరు ఆత్మయందు ఆత్మని ఆరోపించుకొని (ఆత్మను ఆత్మలోనిలిపి), యోగ ధర్మమున నున్నవారు. తమమహాతేజశక్తితో ప్రజాధర్మకామములను (ప్రజలలో ధర్మ కామములను) చక్కగా ప్రవర్తింపజేయుచుండిరి.

 పుట్టినప్పటి రీతిలోనో యున్నవాడుగావున కుమారుడనబడును. అందువలననే సనత్కుమారుడను నీతని నామము కీర్తింపబడినది-101. వారి యా వంశములు పండ్రెండు. అవి దివ్యములు దేవగుణములతో గూడినవి. క్రియావంతములు ప్రజావంతములు, మహర్షులచే నలంకరింపబడినవి-102. ఈ విధముగా ఇది లోకములను సృజించుటకు బ్రహ్మయొక్క కరణముల నుండి బుట్టినది. మహత్తు మొదలుకొని విశేషము వరకు స్వయముగా ప్రకృతి యొక్క వికారము-103. చంద్ర సూర్యుల కాని యొక్క వెలుగు గ్రహ నక్షత్రములచే నలంకరింపబడినది. నదుల చేతను, సముద్రముల చేతను, పర్వతముల చేతను చుట్టబడినది. అట్లే వివిధాకారములు గల పురము చేత, ప్రేతములైన జనపదములచేతను అవ్యక్తమైన యా బ్రహ్మ వనమున బ్రహ్మ రాత్రిలో చరించు చుండెను.

ఈ సనాతన వృక్షము (బ్రహ్మ వృక్షము) అవ్యక్తమను బీజము నుండి బుట్టినది. అవ్యక్తానుగ్రహమున పైకి లేచినది. బుద్ధియను స్కంధముతో నిండినది. (చెట్టు మొదలుతో నిండినది.) ఇంద్రియములనెడి మొలకలు చెట్టు తొజ్జలు గలది. మహాభూతములను పెద్ద కొమ్మలు గలది. విశేషములచే పత్రములు గలది. అట్లే ధర్మాధర్మములు సుపుష్పములుగా గలది. సుఖ దు:ఖములు ఫలములుగా గలది. సర్వ ప్రాణులకును జీవనోపాయమైనది. ఇది ఆ బ్రహ్మ వృక్షము యొక్క బ్రహ్మ బలము-106, 107, 108. అవ్యక్తము కారణము అయిన తత్యము నిత్యము (నాశనము లేనిది) సదసదాత్మకమును ఐనది. ఈ విధమైన యిది బ్రహ్మయొక్క యనుగ్రహరూపమై ప్రాకృతమైన ప్రకృతి నుండి వచ్చిన) సృష్టి.

 అభిమానియైన బ్రహ్మయొక్క ఆముఖ్యాదులైన ఆరు సృష్టులు వైకృతములు, బుద్ధి పూర్వకములునై భూతభవిష్యద్వర్త మాన రూపత్రికాలములలో చక్కగా జరిగినవి-110. పండితులు అసృష్టులు పరస్పరము కారణమగునని చెప్పిరి. దివ్యములైన రెండు పక్షులు చక్కని రెక్కలు గలవియై జతగూడియున్నవి. అవి కొమ్మలతోను పలు విద్రుమము (తెలుపు ఎరువు) వర్ణములు గలవిగా నున్నవి. అందులో ఒకటి సర్వాత్ముడైన బ్రహ్మయొక్క ధ్రుమమును (వృక్షమును) తెలియును వేరొకటి తెలియదు (?) బ్రహ్మయొక్క మూర్ధ (శిరము)ను స్వర్గలోకమని విఫ్టులు స్తుతింతురు. నాభిని ఆకాశమని, నేత్రములు చన సూర్యులని, చెవులను దిక్కులని, పాదములను భూమియనియు, ఆ బ్రహ్మ అచిన్త్య స్వరూపుడైన సర్వప్రాణులను బుట్టించిన వాడని బ్రాహ్మణులు స్తుతింతురు-112. ఆ బ్రహ్మ ముఖము నుండి బ్రాహ్మణులు, రొమ్ము పూర్వభాగమున నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులును, పాదముల నుండి శూద్రులును మొత్తము శరీరము నుండి సర్వవర్ణములు జనించినవి-113. అవ్యక్తము కంటే మహేశ్వరుడు పరుడు (ఉత్కృష్టుడు). అవ్యక్తము నుండి యండము బుట్టినది. అండము నుండి మరల బ్రహ్మ జనించెను. ఆ బ్రహ్మచే నీ లోకములు జనించినవి.

ఇది శ్రీ మహాపురాణే వాయుప్రోక్తే దేవాది సృష్టి వర్ణనం తొమ్మిదవ అధ్యాయము.