7 - అథర్వ వేద శాఖలు - పురాణ లక్షణములు

సూత ఉవాచ

అథర్వవిత్సుమంతుశ్చ శిష్యమధ్యాపయత్స్వకామ్

సంహితాం సోఽపి పథ్యాయ వేదదర్శాయ చోక్తవాన్

సూత మహర్షి ఇట్లు పలికెను --- ప్యాసునినుండీ అథర్వవేదమును స్వీకరించిన సుమంతుడు తాను నేర్చిన ఆ వేదసంహితను తన శిష్యుడగు కబంధునకు బోధించెను. ఆ కబంధుడు కూడ ఆ సంహితను రెండు విభాగములు చేసి, పథ్యుడు, వేదదర్శుడు అనువారలకు బోధించెను.

శౌక్లాయనిర్భ్రహ్మబలిర్మోదోషః పిప్పలాయనిః

వేదదర్శస్య శిష్యాస్తే పథ్యశిష్యానథో శృణు

శోక్లాయని, బ్రహ్మబలి, మోదోషుడు, పిప్పలాయని అనువారు వేదదర్శుని శిష్యులు. తరువాత పథ్యుని శిష్యులను గురించి వినుము.

కుముదశ్శునకో బ్రహ్మన్ జాజలిశ్చాప్యథర్వవిత్

బభ్రుశ్శిష్యోఽథాంగిరస స్సైంధవాయన ఏవ చ

అధీయేతాం సంహితే ద్వే సావర్ణ్యాద్యాస్తథాపరే

నక్షత్రకల్పశ్శాంతిశ్చ కశ్యపాంగిరసాదయః

ఏతే ఆథర్వణాచార్యాశ్శృణు పౌరాణికాన్ మునే

ఓ శౌనకమహర్షీ! అథర్వవేత్తయగు కుముదుడు, శునకుడు, జాజలి పథ్యుని శిష్యులు. బభ్రువు, సైంధవాయనుడు అంగిరసగోత్రీకుడగు శునకుని శిష్యులు. వారు రెండు సంహితలను అధ్యయనము చేసిరి. ఇంతే గాక సావర్ణుడు, నక్షత్రకల్పుడు, శాంతి, కశ్యపుడు, ఆంగిరసుడు మొదలగు ఇతరవిద్వాంసులు కూడ అథర్వణవేదమును అధ్యయనము చేసిరి. వీరు నక్షత్రకల్పము, శాంతికల్పము ఇత్యాదులను విరచించి, ఆ పేర్లతో ప్రసిద్ధులైరి. తరువాత పౌరాణికులను గురించి వినుము.

త్రయ్యారుణిః కశ్యపశ్చ సావర్ణిరకృతవ్రణః

వైశంపాయనహారీతౌ షడ్వై పౌరాణికా ఇమే

త్రయ్యారుణి, కశ్యపుడు, సావర్ణి, అకృతవ్రణుడు, వైశంపాయనుడు, హారీతుడు అనే ఈ ఆరుగురు పురాణవేత్తలు.

అధీయంత వ్యాసశిష్యాత్సంహితాం మత్పితుర్ముఖాత్

ఏకైకమహమేతేషాం శిష్యస్సర్వాస్సమధ్యగామ్

నా తండ్రి వ్యాసుని శిష్యుడు. ఆయన వద్దనుండి వీరు ఒక్కొక్క సంహితను అధ్యయనము చేసిరి. నేను వీరందరికి శిష్యుడను. కావున, నేను ఆరింటిని అధ్యయనము చేసితిని.

కశ్యపోఽహం చ సావర్ణి రామశిష్యోఽకృతవ్రణః

అధీమహి వ్యాసశిష్యాచ్చతస్రో మూలసంహితాః

కశ్యపుడు, నేను, సావర్ణి, పరశురాముని శిష్యుడగు అకృతవ్రణుడు అనువారలము వ్యాసుని శిష్యుడగు (నా తండ్రి) రోమహర్షణునినుండి నాలుగు మూలసంహితలను అధ్యయనము చేసితిమి.

పురాణలక్షణం బ్రహ్మన్ బ్రహ్మర్షిభిర్నిరూపితమ్

శృణుష్వ బుద్ధిముపాశ్రిత్య వేదశాస్త్రానుసారతః

ఓ మహర్షీ! బ్రహ్మర్షులు వేదరూపమైన శాస్త్రముననుసరించి పురాణముల లక్షణమును నిరూపించిరి. నీవు సావధానచిత్తుడవై వినుము.

సర్గోఽస్యాథ విసర్గశ్చ వృత్తి రక్షాఽoతరాణి చ

వంశో వంశానుచరితం సంస్థా హేతురపాశ్రయః

దశభిర్లక్షణైర్యు క్తం పురాణం తద్విదో విదుః

కేచిత్పంచవిధం బ్రహ్మన్ మహదల్పవ్యవస్థయా

ఈ జగత్తుయొక్క సర్గము, విసర్గము, వృత్తి, రక్ష, మన్వంతరములు, వంశము, వంశానుచరితము, ప్రళయము, హేతువు, అపాశ్రయము అనే పది లక్షణములు గలది పురాణము అని పురాణవేత్తలు చెప్పుచున్నారు. కొందరు పురాణములో ఐదు లక్షణములుండునని చెప్పుచున్నారు. పది ఉన్నచో మహాపురాణము, ఐదు ఉంటే అల్పపురాణము అని వ్యవస్థ.

అవ్యాకృతగుణక్షోభాన్మహతస్త్రీవృతోఽహమః

భూతమాత్రేంద్రియార్థానాం సంభవస్సర్గ ఉచ్యతే

మాయాశక్తి యొక్క గుణములయందలి క్షోభచే మహత్తత్త్వము, దానినుండి మూడు విధముల (సాత్త్విక-రాజస-తామస) అహంకారము, దానినుండి శబ్దాది భూతసూక్ష్మములు, ఇంద్రియములు, వాటి దేవతలు, పంచస్థూలభూతములు ఉత్పన్నమగును. దీనిని సర్గము. అందురు. .

పురుషానుగృహీతానామేతేషాం వాసనామయః

విసర్గోఽయం సమాహారో బీజాద్బీజం చరాచరమ్

పరమేశ్వరుని అనుగ్రహముచే ఆ మహాదాది తత్త్వములు పూర్వకర్మ వాసనలు ప్రధానముగా గల శరీరములను సృష్టించును. కదిలే మరియు కదలని ఈ కార్యకరణసంఘాతములే జీవులకు ఉపాధులు. బీజమునుండి బీజము వలె ప్రవాహముగా సాగే ఈ సృష్టి యే విసర్గము (విశిష్టసృష్టి).

వృత్తిర్భూతాని భూతానాం చరాణామచరాణి చ

కృతా స్వేన నృణాం తత్ర కామాచ్చోదనయాఽపి వా

కదిలే ప్రాణులైన పశుపక్ష్యాదులకు కదలని చెట్టు చేమలు, కదిలే ప్రాణులు కూడ ఆహారమును సమకూర్చును. ఆ కదిలే ప్రాణులలో మానవులకు స్వభావముచే (బియ్యము మొదలైనవి), కామనచే (పళ్లు మొదలైనవి), వేదవిధిచే (పురోడాశము) బ్రదుకు దెరువు నిశ్చితమగును.

రక్షాఽచ్యుతావతారేహా విశ్వస్యాను యుగే యుగే

తిర్యజ్మర్త్యర్షిదేవేషు హన్యంతే యైస్త్రయీద్విషః

శ్రీహరి ప్రతియుగమునందు ఆ సందర్భమును బట్టి పశువులు, మానవులు, మహర్షులు, దేవతలయందు అవతరించి లీలలను చేయును. ఆ అవతారములచే ఆయన వేదవిరోధులను సంహరించి జగత్తును రక్షించును గనుక, వాటికి రక్ష అని పేరు.

మన్వంతరం మనుర్దేవా మనుపుత్రా స్సురేశ్వరః

ఋష యోంఽశావతారశ్చ హరేష్షడ్విధముచ్యతే

మనువు, దేవతలు, మనువు యొక్క పుత్రులు, దేవేంద్రుడు, మహర్షులు, శ్రీహరియొక్క అంశావతారములు అనే ఆరు విషయములు ప్రవర్తిల్లే కాలము మన్వంతరమనబడును.

రాజ్ఞాం బ్రహ్మ ప్రసూతానాం వంశస్త్రైకాలికోఽన్వయః

వంశానుచరితం తేషాం వృత్తం వంశధరాశ్చ యే

బ్రహ్మదేవునినుండి పుట్టిన రాజులయొక్క (స్వాయంభువ మనువు ఇత్యాదులు) భూతభవిష్యద్వర్తమానకాలములకు చెందిన సంతానపరం పర వంశమనబడును. ఆ రాజులయొక్క, మరియు వారి వంశమును నిలబెట్టిన వారి (ప్రియవ్రతాదుల) చరిత్ర వంశానుచరితమనబడును.

నైమిత్తికః ప్రాకృతికో నిత్య ఆత్యంతికో లయః

సం స్థేతి కవిభిః ప్రోక్తా చతుర్ధాఽస్య స్వభావతః

మాయాశక్తినుండి పుట్టిన ఈ జగత్తునకు నైమిత్తికము, ప్రాకృతికము, నిత్యము, ఆత్యంతికము అనే నాలుగు రకములు ప్రళయములు గలవు. ఇదియే సంస్థ యనబడునని మహాత్ములు చెప్పిరి.

హేతుర్జీవోఽస్య సర్గాదేరవిద్యా కర్మకారకః

యం చానుశయినం ప్రాహురవ్యాకృతముతాపరే

అజ్ఞానముచే మోహితుడై కర్మలను చేసే జీవుడు ఈ జగత్తుయొక్క సృష్టి స్థితిలయములకు కారణము. ఈ జీవుడు అనుశయి, అనగా ప్రకృతిలో శయనించే చేతనుడు, లేదా కర్మఫల శేషముచే ఒక లోకమునుండి మరియొక లోకమునకు పయనించువాడు అని మహాత్ములు చెప్పెదరు. మరికొందరైతే వ్యక్తము కాని నామరూపములు గల ప్రకృతియే సృష్టి మొదలగువానికి కారణమని చెప్పెదరు.

వ్యతిరేకాన్వయో యస్య జాగ్రత్స్వప్నసుషుప్తిషు

మాయామయేషు తద్భ్రహ్మ జీవవృత్తిష్వపాశ్రయః

అజ్ఞానముచే జీవుడు జాగ్రదభిమానియగు విశ్వునిగా, స్వప్నాభిమాని యగు తైజసునిగా, సుషుప్త్యభిమానియగు ప్రాజ్ఞునిగా కల్పించబడు చున్నాడు. పరబ్రహ్మ ఈ కల్పనలన్నింటియందు చైతన్యరూపముగా అనుగతమై ఉన్నా, సాక్షిగా వాటికంటే విలక్షణముగనే ఉన్నది. ఆ పర బ్రహ్మ అపాశ్రయము (సంసారప్రతీతికి, బాధకు అధిష్ఠానము) అనబడును.

పదార్థేషు యథా ద్రవ్యం సన్మాత్రం రూపనామసు

బీజాదిపంచతాoఽతాసు హ్యవస్థాసు యుతాయుతమ్

ఏలయనగా, ఘటాది కార్యములయందు మట్టి మొదలైన కారణ ద్రవ్యము వలే, నామరూపములు గల పదార్థములయందు కేవల సత్తవలె, గర్భాధానము మొదలుకొని మరణించుట వరకు గల దేహము యొక్క అవస్థలయందు పరబ్రహ్మ సాక్షిగా అనుగతమవుతూనే ఆ అవస్థలకంటే విలక్షణముగా నున్నది. అదియే అపాశ్రయము.

విరమేత యదా చిత్తం హిత్వా వృత్తిత్రయం స్వయమ్

యోగేన వా తదాఽఽత్మానం వేదేహాయా నివర్తతే

ఎప్పుడైతే శ్రవణమనననిదిధ్యాసలచే చిత్తము స్వయముగా సాత్త్విక-రాజస-తామససంకల్పములను విడిచి పెట్టి శాంతమగునో, అప్పుడు ఆత్మసాక్షాత్కారము కలిగి, సంసారమునుండి, కర్తృత్వమునుండి, కర్మవాసనలనుండి విముక్తి కలుగును.

ఏవంలక్షణలక్ష్యాణి పురాణాని పురావీదః

మునయోఽష్టాదశ ప్రాహుః క్షుల్లకాని మహాంతి చ

ఈ విధమైన లక్షణములను బట్టి మనము పురాణములను గుర్తించవచ్చును. వీటిలో కొన్ని చిన్నవి కాగా, కొన్ని పెద్దవి. ఇట్టివి పదునెనిమిది గలవని పురాతత్త్వవేత్త లైన మహర్షులు చెప్పుచున్నారు.

బ్రాహ్మం పాద్మం వైష్ణవం చ శైవం లైంగం సగారుడమ్

నారదీయం భాగవతమాగ్నేయం స్కాందసంజ్ఞితమ్

భవిష్యం బ్రహ్మ వైవర్తం మార్కండేయం సవామనమ్

వారాహం మాత్స్యం కౌర్మం చ బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్

బ్రహ్మ-పద్మ-విష్ణు-శివ-లింగ-గరుడ-నారద-భాగవత-అగ్ని-స్కందభవిష్య-బ్రహ్మ వైవర్త-మార్కండేయ-వాన-వరాహ-మత్స్య-కూర్మబ్రహ్మాండములని పురాణములు పదునెనిమిది.

బ్రహ్మన్నిదం సమాఖ్యాతం శాఖాప్రణయనం మునేః

శిష్యశిష్యప్రశిష్యాణాం బ్రహ్మతేజోవివర్ధనమ్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ద్వాదశస్కంధే సప్తమోఽధ్యాయః

ఓ నౌ నకమహర్షీ! వ్యాసమహర్షి, ఆయన శిష్యులు, వారి శిష్యప్రశిష్యులు వేదశాఖలను ప్రవర్తిల్ల జేసిన ఈ వివరములను నేను చెప్పితిని. దీనిని విన్నవారికి బ్రహ్మవర్చస్సు వర్ధిల్లును.

శ్రీమద్భాగవతము పన్నెండవ స్కంధములో అథర్వవేదమును, . పురాణములను వర్ణించే ఏడవ అధ్యాయము ముగిసినది (7).