5 - శ్రీ శుకమహర్షియొక్క అంతిమ ఉపదేశము

శ్రీశుక ఉవాచ

అత్రానువర్జ్యతేఽభీక్ష్ణం విశ్వాత్మా భగవాన్ హరిః

యస్య ప్రసాదజో బ్రహ్మా రుద్రః క్రోధసముద్భవః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను - ఈ భాగవత పురాణము నిరంతరముగా మరల మరల సర్వాంతర్యామియగు శ్రీహరి భగవానుని వర్ణించును. ఆయన హర్షమునుండి బ్రహ్మదేవుడు, కోపమునుండి రుద్రుడు ప్రకటమైరి.

త్వం తు రాజన్ మరి ష్యేతి పశుబుద్ధిమిమాం జహి

న జాతః ప్రాగభూత్వోఽద్య దేహవత్వం న నంక్ష్యసి

ఓ పరీక్షిన్మహారాజా! నీవైతే మరణించేదననే బుద్దిని విడిచి పెట్టుము. ఈ బుద్ధి దేహమే ఆత్మ అనే అవివేకమునుండి పుట్టినది. నీవు ఇదివరలో పుట్ట లేదు. ఇప్పుడు నశించవు. దేహము పుట్టినది. అది మాత్రమే నశించును.

న భవిష్యసి భూత్వా త్వం పుత్రపౌత్రాదిరూపవాన్

బీజాంకురవద్దేహాదేర్వ్యతిరిక్తో యథాఽనలః

నేను ఇదివరలో లేను. ఇప్పుడు ఉన్నాను. మొక్క విత్తు రూపమును, విత్తు మరల ఇంకో మొక్క రూపమును పొందునట్లుగా, నేను కూడ పుత్రులు, పౌత్రులు మొదలగువారి రూపములో భవిష్యత్తులో ఉండెదను. ఇది అజ్ఞానము. నీవు అట్లు కావు. అగ్ని కట్టెలకంటే విలక్షణమై యుండును. అదే విధముగా, నీవు దేహేంద్రియాదులకంటే విలక్షణుడవు.

స్వప్నే యథా శిరశ్ఛేదం పంచత్వాద్యాత్మనస్స్వయమ్

యస్మాత్పశ్యతి దేహస్య తత ఆత్మా హ్యజోఽమరః

ఒకప్పుడు కలలో వ్యక్తి తన తల నరకబడినట్లు, తాను మరణించినట్లు చూచును. జాగ్రదవస్థలో కూడ కనబడే సర్వము దేహమునకే. కావున, ఆత్మ నిశ్చయముగా జన్మమృత్యువులు లేనిది.

ఘటే భిన్నే యథాఽఽకాశ ఆకాశస్యాద్యథా పురా

ఏవం దేహే మృతే జీవో బ్రహ్మ సంపద్యతే పునః

ఘటము పుట్టుటకు ముందు ఉన్నది మహాకాశమే. ఘటము పగిలిన తరువాత ఘటాకాశము మరల ఆ మహాకాశమే యగును. ఇదే విధముగా, దేహము మరణించగా (వివేకజ్ఞానముచే అనాత్మయని తెలియబడగా), జీవుడు మరల పరబ్రహ్మయందు విలీనమగును.

మనస్సృజతి వై దేహాన్ గుణాన్ కర్మాణి చాత్మనః

తన్మసస్సృజతే మాయా తతో జీవస్య సంసృతిః

మనస్సు ఆత్మకు దేహములను, గుణకార్యములగు విషయములను, కర్మలను కూడ సృష్టించును. ఆ మనస్సును అవిద్య సృష్టించును. జీవునకు అవిద్య వలన సంసారము కలుగుచున్నది.

స్నేహాధిష్ఠానవర్త్యగ్నిసంయోగో యావదీయతే

తతో దీపస్య దీపత్వమేవం దేహకృతో భవః

రజస్సత్త్వతమోవృత్త్యా జాయతేఽథ వినశ్యతి

ఎంతవరకైతే తేజస్సునకు నూనె, బుడ్డి, వత్తి, నిప్పు అనువాటి సంబంధమో, అంతవరకు తేజస్సు పరిచ్చిన్నమగు దీపము అగును. ఇదే విధముగా, ఆత్మకు పుట్టుక దేహాధ్యాస వలన కలిగినది. సత్త్వరజస్తమోగుణముల వృత్తులతోడి తాదాత్మ్యము వలన ఆత్మకు పుట్టుక, మరణము కలుగుచున్నవి.

న తత్రాత్మా స్వయంజ్యోతిర్యో వ్యక్తావ్యక్తయోః పరః

ఆకాశ ఇవ చాధారో ధ్రువ్వోఽనంతోపమస్తతః

ఆత్మ ఆ దేహమునందున్నా దేహాదుల వలె నశించేది కాదు. ఆత్మ స్వయంప్రకాశము, కారణకార్యములకంటె అతీతము. ఆత్మ ఆకాశము వలే దేహాదులకు ఆధారము. ఆత్మ నిత్యము. ఆత్మకు నాశము గాని, పోలిక గాని లేవు. ఆత్మ సర్వవ్యాపకము.

ఏవమాత్మానమాత్మస్థమాత్మ నైవామృశ ప్రభో

బుద్ధ్యాఽనుమానగర్భిణ్యా వాసుదేవానుచింతయా

ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధముగా బుద్దియందు ప్రతిఫలిస్తున్న పరమాత్మను స్వయముగా అన్వయవ్యతిరేకములతో కూడిన బుద్ధితో (ద్రష్ట పై దృశ్యము ఆధారపడినా, దృశ్యముపై ద్రష్ట ఆధారపడదు) స్వయముగా విచారము చేసి దేహాదులకంటే వివిక్తముగా దర్శించుము. నిరంతరము శ్రీహరి భగవానుని స్మరించుము.

చోదితో విప్రవాక్యేన న త్వాం ధక్ష్యతి తక్షకః

మృత్యవో నొపధక్ష్యంతి మృత్యూనాం మృత్యుమీశ్వరమ్

మృత్యువులకు మృత్యువగు ఈశ్వరుడవు నీవే. నిన్ను మహర్షి శాపముచే ప్రేరితుడైన తక్షకుడు గాని, మరేవైనా మృత్యు హేతువులు గాని దగ్గరకు రాలేవు, దహించలేవు.

అహం బ్రహ్మ పరం ధామ బ్రహ్మాహం పరమం పదమ్

ఏవం సమీక్షన్నాత్మానమాత్మణ్యాధాయ నిష్కలే

నేను సర్వాధిష్ఠానమగు పరబ్రహ్మను, నేను సర్వాధిష్ఠానమగు పర బ్రహ్మను అనీ అనుసంధానము చేయుము. ఈ తీరున నిన్ను నీవు (ధ్యాన ముచే) ఉపాధిసంబంధము లేని పరమాత్మలో విలీనము చేసుకొనుము.

దశంతం తక్షకం పాదే లేలిపోనం విషాననైః

న ద్రక్ష్యసి శరీరం చ విశ్వం చ పృథగాత్మనః

నాలుకలతో పెదవులను స్పృశిస్తూ కాలి పై విషపు పడగలతో కరుచుచున్న తక్షకుడనే సర్పము గాని, దేహము గాని, జగత్తు గాని ఆత్మకంటే వేరుగా లేదని నీకు తెలియగలదు.

ఏతత్తే కథితం తాత యథాఽఽత్మా పృష్ఠవాన్ నృప

హరేర్విశ్వాత్మనశ్చేష్టాం కిం భూయశ్శ్రోతుమిచ్ఛసి

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ద్వాదశస్కంధే పంచమోఽధ్యాయః

నాయనా! పరీక్షిన్మహారాజా! సర్వాంతర్యామియగు శ్రీహరియొక్క లీలలను గురించి నీవు ప్రశ్నించగా, నేనీ విషయమును నీకు చెప్పితిని. నీవింకనూ ఏమి వినగోరెదవు?

శ్రీమద్బాగవత మహాపురాణము పన్నెండవ స్కంధములో శ్రీశుక మహర్షి యొక్క అంతిమ ఉపదేశమును వర్ణించే ఐదవ అధ్యాయము ముగిసినది (5).