3 - యుగధర్మములు - నామసంకీర్తన మహిమ

శ్రీశుక ఉవాచ

దృష్ట్వాఽఽత్మని జయే వ్యగ్రాన్ నృపాన్ హసతి భూరియమ్

అహో మా వీజిగీషంతి మృత్యోః క్రీడనకా నృపాః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- తనను జయించాలని ఉద్యమించే రాజులను చూచి ఈ భూమి -- ఆహా! మృత్యువు చేతిలో ఆటబొమ్మలైన ఈ పాలకులు నన్ను జయించగోరుచున్నారు -- అని నవ్వుకొనును.

కామ ఏష నరేంద్రాణాం మోఘస్స్యాద్విదుషామపి

యేన ఫేనోపమే పిండే యేఽతివిశ్రంభితా నృపాః

రాజనీతిపండితులే అయిననూ ఈ మహారాజుల ఈ (భూమిని జయించాలనే) కామన వ్యర్థమగును. అట్టి కామనచే ఆ రాజులు నీటి నురగవలే క్షణికమైన దేహము పై అతివిశ్వాసమును కలిగియున్నారు.

పూర్వం నిర్జిత్య షడ్వర్గం జేష్యామో రాజమంత్రిణః

తతస్సచివపౌరాప్తకరీంద్రానస్య కంటకాన్

అంతశ్శత్రువులను జయించకుండా బాహ్యశత్రువులపై విజయము దుర్లభము. కాబట్టి, ముందుగా కామక్రోధములు మొదలైన అంతశ్శత్రువు లను జయించి, తరువాత ఈ శత్రురాజును, మంత్రులను, సహాయకులను, ఆ నగరపౌరులను, ఆ రాజుయొక్క ఆపులను, వాని గజసైన్యమును, ఇతర సైన్యమును జయించి, వాని రాజ్యములో ముళ్లవంటి చోరాదులను (అల్పశత్రువులను) కూడ జయించెదను (అని వారు తలపోయుదురు).

ఏవం క్రమేణ జేష్యామః పృథ్వీం సాగరమేఖలామ్

ఇత్యాశాబద్ధహృదయా న పశ్యంత్యంతి కేంఽతకమ్

ఈ తీరున క్రమముగా సముద్రమే హద్దుగా గల రాజ్యమును జయించే దము, అని వారు హృదయములో దృఢమైన ఆశను కలిగియుందురు. ఇంతలో మృత్యువు దగ్గరపడుతున్న విషయమును వారు గుర్తించరు.

సముద్రావరణాం జిత్వా మాం విశంతశబ్ధమోజసా

కియదాత్మజయస్యైతన్ముక్తిరాత్మజయే ఫలమ్

సముద్రముచే చుట్టువారబడియున్న నన్ను (రాజ్యమును) జయించి వారు బలముచే సముద్రములోని ద్వీపములను జయించుటకు ఉద్యమం చెదరు. ఇంద్రియజయమునకు ఫలము భూమిని జయించుటయైనచో, అది యెంతటి ఫలము? మోక్షమే ఇంద్రియజయమునకు ఫలము.

యాం విసృజ్యైవ మనవస్తత్సుతాశ్చ కురూద్వహ

గతా యథాఽఽగతం యుద్ధే తాం మాం జేష్యంత్యబుద్ధయః

 (పృథివీగీతమును శుకమహర్షి తన మాటలలో చెప్తున్నాడు) కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఏ భూమిని విడిచి పెట్టియే మనువులు, వారి పుత్రులు వచ్చిన విధముగా (శూన్యహస్తములతో) వెళ్లిరో (మరణించిరో), అట్టి నన్ను జయించబూనువారు అవివేకులు.

మత్కృతే పితృపుత్రాణాం భ్రాతృణాం చాపి విగ్రహః

జాయతే హ్యసతాం రాజ్యే మమతాబద్ధచేతసామ్

దుర్బుద్దులై రాజ్యమునందు మమకారముచే కట్టివేయబడిన మనస్సు గల తండ్రీకొడుకులకు, సోదరులకు కూడ నా కొరకై నిశ్చయముగా కలహము పుట్టును.

మమైవేయం మహీ కృత్స్నా న తే మూడేతి వాదినః

స్పర్ధమానా మిథో ఘ్నంతి మ్రియంతే మత్కృతే నృపాః

ఓ మూర్ఖ! ఈ భూమి అంతా నాదే, నీది కాదు, అని ఈ విధముగా వాదించి పోటీ పడుతూ రాజులు నా కొరకు పరస్పరము చంపుకొంటూ, తాము కూడ మరణించెదరు.

పృథుః పురూరవా గాధిర్నహుషో భరతోఽర్ధునః

మాంధాతా సగరో రామః ఖట్వాంగో ధుంధుహా రఘుః

తృణబిందురయాతిశ్చ శర్యాతిశ్శంతనుర్గయః

భగీరథః కువలయాశ్వః కకుత్స్థా నైషధో నృగః

హిరణ్యకశిపుర్వృత్తో రావణో లోకరావణః

నముచిశ్శంబరో భౌమో హిరణ్యాక్షఽథ తారకః

అన్యే చ బహవో దైత్యా రాజానో యే మహేశ్వరాః

సర్వే సర్వవిదశ్శూరాస్సర్వే సర్వజితోఽజితాః

పృథువు, పురూరవుడు, గాధి, నహుషుడు, భరతుడు, కార్తవీర్యార్జునుడు, మాంధాత, సగరుడు, శ్రీరాముడు, ఖట్వాంగుడు, ధుంధుహుడు, రఘువు, తృణబిందువు, యయాతి, శర్యాతి, శంతనుడు, గయుడు, భగీరథుడు, కువలయాశ్వుడు, కకుత్స్థుడు, నిషధరాజగు నలుడు, నృగుడు, హిరణ్యకశిపుడు, వృత్రాసురుడు, జనులనేడ్పించిన రావణుడు, నముచి, శంబరుడు, భూపుత్రుడగు నరకాసురుడు, హిరణ్యాక్షుడు, తారకాసురుడు, అనేకులు ఇతరరాక్షసులు, దొడ్డ ప్రభువులైన రాజులు, అందరు సర్వము దెలిసిన శూరులు, సర్వమును జయించినవారు, పరాజయము నెరుగని వారు.

మమతాం మయ్యవర్తంత కృత్వోచైర్మర్త్యధర్మిణః

కథాఽవ శేషాః కాలేన హ్యకృతార్థాః కృతా విభో

ఓ పరీక్షిన్మహారాజా! (ఈ సంబోధన మాత్రము శుకమహర్షిది.మిగిలినది భూమిగీతము). వారు నా పై అధికమగు మమకారమును నేరపిరి. కాని, వారు కూడ మరణించే స్వభావము గలవారే. కాలము వారిని నిశ్చయముగా చరిత్ర మాత్రమే మిగిలినవారినిగా, కృతార్థులు కానివారినిగా చేసినది.

కథా ఇమాస్తే కథితా మహీయసాం

వితాయ లోకేషు యశః పరేయుషామ్

విజ్ఞానవైరాగ్యవివక్షయా విభో వచోవిభూతీర్న తు పారమార్థ్యమ్

ఓ పరీక్షిన్మహారాజా! జనులయందు కీర్తిని విస్తరింపజేసి పరలోకమును పొందిన మహాపురుషుల యొక్క ఈ గాథలను నీకు వివేకవైరాగ్యములను బోధించే ఇచ్చచే చెప్పితిని. అంతే. ఇవి వాక్కు యొక్క విలాసలు మాత్రమే. ఇవి పరమార్థతత్త్వము కావు.

యస్తూత్తమశ్లోకగుణానువాదస్సంగీయతేఽభీక్ష్ణ మమంగలఘ్నః

తమేవ నిత్యం శృణుయాదభీక్ష్ణం కృష్ణేఽమలాం భక్తిమభీప్సమానః

శ్రీహరియొక్క కీర్తి ఉత్తమమైనది. మహాత్ములు అమంగళములను పోనాడే ఆయన గుణములను నిరంతరముగా కీర్తించెదరు. శ్రీకృష్ణునిపై కామనల కాలుష్యము లేని శుద్ధభక్తిని కోరు సాధకుడు ఆ ప్రవచనములను ప్రతిదినము తప్పనిసరిగా మరల మరల శ్రవణము చేయవలెను.

రాజోవాచ

కేనోపాయేన భగవన్ కలేర్దోషాన్ కలౌ జనాః

విధమష్యంత్యుపచీతాంస్తన్మే బ్రూహీ యథా మునే

పరీక్షిన్మహారాజు పలికెను --- పూజనీయుడవగు ఓ మహర్షీ! కలియుగ మునందు దోషములు గుట్టలుగా పెరుగును. జనులు వాటిని పోగొట్టుకునే ఉపాయమేది? నాకా విషయమును యథాతథముగా చెప్పుడు.

యుగాని యుగధర్మాంశ్చ మానం ప్రలయకల్పయోః

కాల స్యేశ్వరరూపస్య గతిం విష్ణోర్మహాఽఽత్మనః

యుగములను, యుగధర్మములను, ప్రళయము, కల్పములు అనుపాటి కొలమానములను గురించి చెప్పడు. సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు అగు ఈశ్వరుడు కాలరూపుడై ఉన్నాడు. ఆ కాలముయొక్క గమనమును గురించి కూడ చెప్పడు.

శ్రీశుక ఉవాచ

కృతే ప్రవర్తతే ధర్మశ్చతుష్పాత్తజ్జనైర్ధృతః

సత్యం దయా తపో దానమితి పాదా విభోర్నృప

శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! కృతయుగమునందలి జనులు ధారణ చేసే ధర్మము నాలుగు పాదములతో ప్రవర్తిల్లును. ఆ పూర్ణ మైన ధర్మమునకు సత్యము, దయ, తపస్సు, (అభయ)దానము అనేవి నాలుగు పాదములు.

సంతుష్టాః కరుణా మైత్రాశ్శాంతా దాంతాస్తితిక్షవః

ఆత్మారామాస్సమదృశః ప్రాయశశ్శ్రమణా జనాః

కృతయుగములో జనులందరికి సంతోషము, దయ, మైత్రి, మనోనిగ్రహము, బా హ్యేంద్రియనిగ్రహము, సుఖదుఃఖాదిద్వంద్వములను సహించే శక్తి, స్వరూపానందము, సమ (సమ్యగ్) దర్శనము (సర్వమునందు ఈశ్వరుని దర్శించుట), కష్టపడి పని చేయుట ఉండును.

త్రేతాయాం ధర్మపాదానాం తుర్యాంశో హీయతే శనైః అధర్మపాదైరనృతహింసాఽసంతోషవిగ్రహైః

త్రేతాయుగమునందు ధర్మపాదములయొక్క చతుర్థాంశము అధర్మపాదములచే మెల్లగా క్షీణించును. అసత్యముచే సత్యము, హింసచే దయ, పేరాసచే తపస్సు, కలహముచే దానము క్షీణించును.

తదా క్రీయాతపోనిష్ఠా నాతిహింస్రా న లంపటాః

త్రైవర్గీకాస్త్రయీవృద్ధా వర్ణి బ్రహ్మోత్తరా నృప

ఓ పరీక్షిన్మహారాజా! ఆ త్రేతాయుగమునందు జనులకు వైదికకర్మలయందు, తపస్సనందు నిష్ణ మెండు. గృహస్థాశ్రమములో ఇల్లు కడుగుట ఇత్యాది సందర్భములలో చీమలు మొదలగునవి చంపబడుట మొదలైన హింస తప్పనిసరి. అది తప్ప వేరే హింసను వారు చేసెడివారు కాదు. వారు భోగాసక్తి లేకుండా ధర్మార్థకామములననుష్ఠించెడివారు, ఋగ్యజుస్సామవేదములచే ప్రతిపాదించబడే వైదికకర్మలలో వారు నిష్ణాతులు. వర్ణములలో బ్రాహ్మణవర్ణమునకు ఆధిక్యము ఉండును.

తపస్సత్యదయాదినేష్వర్ధం హ్రసతి ద్వాపరే

హింసాఽతుష్ఠ్యనృతద్వేషైర్ధర్మస్యాధర్మలక్షణైః

ద్వాపరయుగమునందు ధర్మలక్షణములైన తపస్సు, సత్యము, దయ, దానములయొక్క సగము అధర్మలక్షణములైన హింస, దురాశ, అసత్యము, ద్వేషములచే (క్రమము అవివక్షితము) క్షీణించిపోవును.

యశస్వినో మహాశాలాస్వాధ్యాయాధ్యయనే రతాః

ఆడ్యాః కుటుంబినో హృష్టా వర్ణాః క్షత్రద్విజోత్తరాః

జనులు పెద్ద లోగిళ్లు, పెద్ద కుటుంబములు కలిగి తమ వేదశాఖను అధ్యయనము చేసి చేయించుటలో ప్రీతి గలవారై కీర్తిమంతులుగా నుందురు. వారు పెద్ద యజ్ఞములను చేస్తూ ధనవంతులై ఆనందించెదరు. వర్ణములలో బ్రాహ్మణక్షత్రియవర్ణములకు ప్రాముఖ్యము ఉండును.

కలౌ తు ధర్మ హేతూనాం తుర్యాంశోఽధర్మ హేతుభిః

ఏధమానైః క్షీయమాణో హ్యంతే సోఽపీ వినంక్ష్యతి

కలియుగమునందైతే అధర్మపాదములు పెరిగి ధర్మపాదముల నాల్గవ అంశము వరకు క్షీణించును. ఆ యుగము అంతమయ్యేనాటికి అది కూడ నశించును.

తస్మింల్లుబ్దా దురాచారా నిర్దయాశ్శుష్క వైరిణః

దుర్భగా భూరితర్షాశ్చ శూద్రదాశోత్తరాః ప్రజాః

ఆ కలియుగమునందు జనులు లోభులై చెడు నడవడిని కలిగి దయ లేకుండనుందురు. భాగ్యహీనులైన జనులు పేరాసతో గిల్లి కజ్జాలు పెట్టుకొనెదరు. శూద్రులకు, మత్స్యకారులకు ప్రాముఖ్యము ఉండును.

సత్త్వం రజస్తమ ఇతి దృశ్యంతే పురుషే గుణాః

కాలసంచోదితాస్తే వై పరివర్తంత ఆత్మని

వ్యక్తిలో సత్త్వరజస్తమస్సులనే మూడు గుణములు ఉండును. అవి కాలముయొక్క ప్రేరణచే దేహము-మనస్సులయందు మార్పు చెందును.

ప్రభవంతి యదా సత్త్వే మనోబుద్ధీంద్రియాణి చ

తదా కృతయుగం విద్యాజ్జ్ఞానే తపసి యద్రుచిః

ఎప్పుడైతే మనస్సు, జ్ఞానేంద్రియములు అతీశయించి సత్త్వగుణమునందు ప్రవర్తిల్లుచున్నవై, జ్ఞానమునందు, తపస్సునందు అభిరుచి ఉండునో, అదియే కృతయుగమని తెలియవలెను.

యదా ధర్మార్థకామేషు భక్తిర్బవతి దేహినామ్

తదా త్రేతా రజోవృత్తిరీతి జానీహి బుద్దిమన్

బుద్దిమంతుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఎప్పుడైతే ప్రాణులకు ధర్మార్థకామములయందు భక్తి కలుగునో, అప్పుడు రజోగుణప్రధానమగు త్రేతాయుగమని తెలియుము.

యదా లోభస్త్వసంతోషో మానో దంభోఽథ మత్సరః

కర్మణాం చాపీ కామ్యానాం ద్వాపరం తద్రజస్తమః

ఎప్పుడైతే లోభము, దురాశ, గర్వము, డాంబీకము, మరియు ఈర్ష్య కలుగునో, కోరికలచే ప్రేరితమైన కర్మలయందు అభిరుచి కలుగునో, అదియే రజోగుణతమోగుణములు ప్రధానముగా గల ద్వాపరయుగము.

యదా మాయాఽనృతం తంద్రా నిద్రా హింసా విషాదనమ్

శోకో మోహో భయం దైన్యం స కలిస్తామసస్స్మృతః

ఎప్పుడైతే కపటము, అసత్యము, సోమరిదనము, నిద్ర, హింస, దుఃఖము, ఏడుపు, వ్యామోహము, భయము, దీనత్వము కలుగునో, అదియే తమోగుణప్రధానమైన కలియుగమని చెప్పెదరు.

యస్మాత్ క్షుద్రదృశో మర్త్యాః క్షుద్రభాగ్యా మహాశనాః

కామినో విత్తహీనాశ్చ స్వైరిణ్యశ్చ స్త్రియోఽసతీః

కలి ప్రభావము వలన మరణించే స్వభావము (దేహాతాదాత్మ్యము) గల మానవులు మందబుద్దులు, అల్పభాగ్యులు అయి తిండిపోతులు కూడ అగుదురు. వారు దరిద్రులై కాముకులగుదురు. స్త్రీలు కూడ దుష్టలై యథేచ్ఛగా సంచరించెదరు.

దస్యూత్కృష్ణా జనపదా వేదాః పాఖండదూషితాః

రాజానశ్చ ప్రజాభక్షాశ్శిశ్నోదరపరా ద్విజాః

కలియుగమునందు దేశములోని వివిధప్రాంతములలో చోరుల సంఖ్య పెరిగిపోవును. వేదవిరుద్దాచారము గలవారు వేదములను కలుషితము చేసెదరు. రాజులు కూడ ప్రజలను వేపుకు తినెదరు. బ్రాహ్మణులకు సంభోగము, తిండి మాత్రమే ప్రధానములగును.

అప్రతా వటవోఽశేచా భిక్షవశ్చ కుటుంబినః

తపస్వినో గ్రామవాసా న్యాసినోఽత్యర్థలోలుపాః

బ్రహ్మచారులు నియమపాలన, శౌచము లేకుండా ఉండెదరు. గృహస్థులు భిక్షను ఇచ్చుట మానివేసి తామే భిక్షాటన చేసెదరు. అడవిలో (ఏకాంతముగా) వానప్రస్థజీవనము చేయవలసిన పెద్దలు గ్రామములలోనే నివసించెదరు. సన్న్యాసులు అధికమగు ధనాశను కలిగియుందురు.

హ్రస్వకాయా మహాఽఽహారా భూర్యపత్యా గతహ్రియః శశ్వత్కటుకభాషిణ్యశ్చార్యమాయోరుసాహసాః

కలియుగములో స్త్రీలు పొట్టి దేహముతో తిండిపోతులుగా ఉండెదరు. అధికసంతానము గల ఆ స్త్రీలు సిగ్గు లేకుండనుండెదరు. వారు సర్వదా కటువుగా మాటలాడెదరు. వారియందు చౌర్యము, కపటము, పెద్ద సాహసము (దురుసుదనము) ఉండును.

పణయిష్యంతి వై క్షుద్రాః కీరాటాః కూటకారిణః

అనాపద్యపి మంస్యంతే వార్తా సాధుజుగుప్సితామ్

నీచులు, మోసగాండ్రు అగు వర్తకులు వ్యాపారము చేసెదరు. జనులు ఆపద కాని సందర్భములలో కూడ సత్పురుషులు ఏవగించుకొనే బ్రదుకు దెరువును చేపట్టెదరు.

పతిం త్యక్ష్యంతి నిర్ద్రవ్యం భృత్యా అప్యభిలోత్తమమ్

భృత్యం విపన్నం పతయః కౌలం గాశ్చాపయస్వినీః

సేవకులు అందరిలో ఉత్తముడే అయినా డబ్బు లేకున్నచో ప్రభువును విడిచి పెట్టెదరు. ప్రభువులు కులపరంపరలో వచ్చినా ఆపదలో పడ్డ సేవకుని విడిచి పెట్టెదరు. గృహస్థులు పాలివ్వని ఆవును విడిచి పెట్టెదరు.

పితృభ్రాతృసుహృజ్జ్ఞాతీన్ హిత్వా సౌరతసౌహృదాః

ననాందృశ్యాలసంవాదా దీనాః స్త్రైణాః కలౌ నరాః

కలియుగములో పురుషులు స్త్రీకి వశవర్తులై సంభోగమే ప్రియము కాగా దీనులై జీవించెదరు. వారు తల్లిదండ్రులను, సోదరులను, మిత్రులను, బంధువులను విడిచి పెట్టి, మరదళ్లతో, బావమరదులతో సలహా సంప్రదింపులు జేసెదరు.

శూద్రాః ప్రతిగ్రహీష్యంతి తపోవేషోపజీవినః

ధర్మం వక్ష్యంత్యధర్మజ్ఞా అధిరుహ్యాత్తమాసనమ్

శూద్రులు తపశ్శాలుర వేషము వేసి అదియే బ్రదుకు దెరువు కాగా దానములను పట్టెదరు. ధర్మము తెలియనివారు ఉన్నతాసనము (వ్యాసపీఠము) ను అధిష్టించి ధర్మమును బోధించెదరు.

నిత్యముద్విగ్నమనసో దుర్భిక్షకరకర్శితాః

నిరశ్నే భూతలే రాజన్ననావృష్టి భయాతురాః

ఓ పరీక్షిన్మహారాజా! కరువు, అధికమగు పన్నులు కారణముగా జనులు దేహమునందు కృశించి మనస్సులో ఉద్వేగము గలవారై ఉందురు. భూలోకములో ఆహారమునకు కొదవ కలుగును. జనులు అనావృష్టి వలని భయముచే పీడను పొందెదరు.

వాసోఽన్నపానశయనవ్యవాయస్నానభూషణైః

హీనాః పిశాచసందర్శా భవిష్యంతి కలౌ ప్రజాః

కలియుగములో ప్రజలకు వస్త్రములు, ఆహారము, త్రాగే నీరు, తల దాచుకునే చోటు కరువగును. దాంపత్యజీవనము లేని ఆ జనులకు స్నానము, అలంకారములు కూడ ఉండవు. వారు పిశాచములను బోలి యుందురు.

కలౌ కాకిణి కేఽప్యర్థే విగృహ్య త్యక్తసౌహృదాః

త్యక్ష్యంతి చ ప్రియాన్ ప్రాణాన్ హనిష్యంతి స్వకానపి

కలియుగములో జనులు పొవలా విలువ గలదానికొరకు కూడ కలహించి, ప్రేమను విడిచి పెట్టి, ప్రియమైన వారిని, ప్రాణాలను కూడ విడిచి పెట్టెదరు. అంతే గాక, తమవారిని కూడా కొట్టి చంపెదరు.

న రక్షిష్యంతి మనుజాః స్థవిరౌ పితరావపి

పుత్రాన్ సర్వార్థకుశలాన్ క్షుద్రాశ్శిశ్నోదరంభూః

కలియుగ మానవులు చిన్న పరిమాణము, సంకుచితమైన మనస్సు గలవారు, పోరీకీ సంభోగము, పొట్ట నింపుకొనుట మాత్రమే ప్రధానము. వారు వృద్ధులను -- ఆ వృద్ధులు తల్లిదండ్రులే అయినా -- పాలించరు. సకలవిషయములయందు నేర్పరులైన కొడుకులను కూడ తరిమివేసెదరు.

కలౌ న రాజన్ జగతాం పరం గురుం త్రిలోకనాథానతపాదపంకజమ్

ప్రాయేణ మర్త్యా భగవంతమచ్యుతం

 యక్ష్యంతి పాఖండవిభిన్న చేతసః

ఓ పరీక్షిన్మహారాజా! కలియుగమునందు జనుల బుద్ది వేదవిరుద్దమగు మతములచే చలింపజేయబడును. వారు లోకములకు ఆదికారణము, తండ్రియగు శ్రీహరి భగవానుని ఆరాధించరు. స్వరూపచ్యుతి లేని ఆ భగవానుని పద్మములవంటి పాదములకు ముల్లోకముల ప్రభువులగు ఇంద్రాదులు కూడ సాష్టాంగప్రణామములను చేయుదురు.

యన్నామధేయం మ్రియమాణ ఆతురః

పతన్ స్థలన్ వా వివశో గృణన్ పుమాన్

విముక్తకర్మార్గల ఉత్తమాం గతిం

ప్రాప్నోతి యక్ష్యంతి న తం కలౌ జనాః

మరణిస్తున్నవాడు గాని, రోగి గాని, పడిపోతూ లేక జారిపోతూ పరవశుడై ఉన్న వ్యక్తి గాని శ్రీహరి పేరును కీర్తించినచో, కర్మలనే గడియ (ఆటంకము) తొలగి ఉత్తమగతిని పొందును. కాని, కలియుగమునందు జనులు అట్టి శ్రీహరిని ఆరాధించరు.

పుంసాం కలికృతాన్ దోషాన్ ద్రవ్యదేశాత్మసంభవాన్

సర్వాన్ హరతి చిత్తస్థో భగవాన్ పురుషోత్తమః

కలియుగముయొక్క ప్రభావముచే ద్రవ్యములయందు, స్థానములయందు, మనస్సునందు, ఇంద్రియములయందు కూడ దోషములు ఉండును. మానవులు చిత్తములో పురుషోత్తమభగవానుని స్మరించినచో, ఈ దోషములన్నియు పరాస్తమగును.

శ్రుతస్సంకీర్తితో ధ్యాతః పూజితశ్చాదృత్వోఽపి వా

నృణాం ధునోతి భగవాన్ హృత్స్థో జన్మాయుతాశుభమ్

భగవానుని గాథలను శ్రవణము చేయుట, నామసంకీర్తనము, ధ్యానము, పూజ, లేదా ఆదరించుటయే అయిననూ చేసి మానవులు శ్రీహరిని హృదయమునందు నిలుపుకొనవలెను. అట్లు చేసినచో, పదివేల జన్మల పాపములు కడిగివేయబడును.

యథా హేమ్నీ స్థితో వహ్నిర్దుర్వర్ణం హంతి ధాతుజమ్

ఏవమాత్మగతో విష్ణుర్యోగినామశుభాశయమ్

బంగారమునందు అగ్ని ప్రవేశించి రాగి మొదలైన ఇతరలోహముల మాలిన్యమును పోగొట్టును. అదే విధముగా, సాధకుల హృదయము నందుండే శ్రీహరి వారియందలి పాపవాసనల సంచితమును పోగొట్టును.

విద్యాతపఃప్రాణనిరోధమైత్రీతీర్థాభిషేకవ్రతదానజ ప్యైః

నాత్యంతశుద్ధిం లభత్యేంఽతరాత్మా యథా హృదిస్థే భగవత్యనంతే

అనంతభగవానుని హృదయమునందు ధ్యానించుటచే అంతఃకరణమునకు ఏ విధమగు పూర్ణమగు శుద్ధి కలుగునో ఆ విధముగా, ఉపాసన, తపస్సు, ప్రాణాయామము, ప్రాణుల యెడల మైత్రి, తీర్థస్నానము, వ్రతములు, దానములు, జపములచే కలుగదు.

తస్మాత్సర్వాత్మనా రాజన్ హృదిస్థం కురు కేశవమ్

మ్రియమాణో హ్యవహితస్తతో యాసి పరాం గతిమ్

ఓ పరీక్షిన్మహారాజా! కాబట్టి నీవు మృత్యువు దగ్గరైన సమయములో సావధానుడవై హృదయమునందు నిశ్చయముగా శ్రీహరిని నిలుపుము. అట్లు చేయుటచే, నీవు సర్వోత్తమమైన మోక్షమును పొందెదవు.

ప్రియమాణైరభిధ్యేయో భగవాన్ పరమేశ్వరః

ఆత్మభావం నయత్యంగ సర్వాత్మా సర్వసంశ్రయః

ఓ పరీక్షిన్మహారాజా! మరణిస్తూ పూజనీయుడగు పరమేశ్వరుని ఏకాగ్రముగా ధ్యానించవలెను. సర్వమునకు ఆత్మ, సర్వమునకు ఆశ్రయము అగు భగవానుడు అట్టివానికి తనతో ఐక్యముననుగ్రహించును.

కలేర్థోషనిధే రాజన్నస్తి హ్యేతో మహాన్ గుణః

కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగః పరం వ్రజేత్

ఓ పరీక్షిన్మహారాజా! దోషములకు నిధానమైన కలియుగమునకు నిశ్చయముగా ఒక గుణము గలదు. అదేమంటే, ఈ యుగములో శ్రీకృష్ణుని కీర్తించినంత మాత్రాన సాధకుడు సంసారాసక్తిని వదిలి పరమాత్మను చేరుకొనును.

కృతే యద్ద్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖైః

ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరికీర్తనాత్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ద్వాదశస్కంధే తృతీయోఽధ్యాయః

కృతయుగమునందు శ్రీహరిని ధ్యానించుట వలన, త్రేతాయుగమునందు యజ్ఞములచే ఆరాధించుట వలన, ద్వాపరయుగమునందు సేవ-పూజల వలన ఏది (మోక్షము) లభించునో, అది కలియుగములో శ్రీహరిని కీర్తించుటవలననే లభించును.

శ్రీమద్బాగవత మహాపురాణము పన్నెండవ స్కంధములో యుగధర్మములను, నామసంకీర్తనమహిమను వర్ణించే మూడవ అధ్యాయము ముగిసినది (3).