1 - కలియుగ రాజవంశముల వర్ణనము

రాజోవాచ

స్వధామానుగతే కృష్ణే యదువంశవిభూషణే

కస్య వంశోఽభవత్పృథ్యామేతదాచక్ష్వ మే మునే

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- యాదవవంశమునకు అలంకారమైన శ్రీకృష్ణుడు తన ధామమునకు చేరిన పిదప, భూలోకములో ఎవని వంశము ఉండెను? ఓ మహర్షీ! నాకీ విషయమును చెప్పడు.

శ్రీశుక ఉవాచ

యోఽకంత్యః పురంజయో నామ భవిష్యో బార్హ ద్రథః

తస్యామాత్యస్తు శునకో హత్వా స్వామినమాత్మజమ్

ప్రద్యోతసంజ్ఞం రాజానం కర్తా యత్పాలకస్సుతః

విశాఖయూపస్తత్పుతో భవితా రాజకస్తతః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- పురంజయుడని (రిపుంజయుడు) ప్రసిద్ది చెందినవాడు బృహద్రథ (జరాసంధుని తండ్రి) వంశీయులలో ఆఖరి రాజు కాగలడు. ఆతని మంత్రియగు శునకుడు ప్రభువును సంహరించి, ప్రద్యోతుడనే పేరు గల తన కొడుకును రాజు చేయగలడు. ఆ ప్రద్యోతునకు పాలకుడనే పుత్రుడు ఉండును. పాలకుని పుత్రుడు విశాఖయూపుడు, విశాఖయూపునికి రాజకుడనే పుత్రుడు కలుగును.

నందివర్దనస్తత్పుత్రః పంచ ప్రద్యోతనా ఇమే

అష్టత్రింశోత్తరశతం భోక్ష్యంతి పృథివీం నృపాః

ఆ రాజకుని పుత్రుడు నందివర్ధనుడు. ప్రద్యోతుని వంశీయులగు ఈ ఐదుగురు (ప్రద్యోతునితో కలిపి) ప్రద్యోతనులనబడుదురు. వీరు నూట ముప్పది యెనిమిది సంవత్సరముల కాలము భూమిని పాలించెదరు.

శిశునాగస్తతో భావ్యః కాకవర్ణస్తు తత్సుతః

క్షేమధర్మా తస్య సుతః క్షేత్రజ్ఞః క్షేమధర్మజః

ఆ నందివర్ధనుని పుత్రుడు శిశునాగుడు. శిశునాగుని పుత్రుడు కాకవర్ణుడు. కాకవర్ణుని పుత్రుడు క్షేమధర్ముడు. క్షేమధర్ముని పుత్రుడు క్షేత్రజ్ఞుడు కాగలరు.

విధిసారస్సుతస్తస్యాజాతశత్రుర్బవిష్యతి

దర్భకస్తత్సుతో భావీ దర్భకస్యాజయస్స్మృతః

క్షేత్రజ్ఞుని పుత్రుడు విధిసారుడు, విధిసారుని పుత్రుడు అజాతశత్రుడు, అజాతశత్రుని పుత్రుడు దర్భకుడు, దర్భకపుత్రుడు అజయుడు కాగలరు.

నందివర్ధన ఆజేయో మహానందిస్సుతస్తతః

శిశునాగా దశైవైతే షష్ట్యుత్తరశతత్రయమ్

సమా భోక్ష్యంతి పృథివీం కురుశ్రేష్ఠ కలౌ నృపాః

మహానందిసుతో రాజన్ శూద్రీగర్భోద్భవో బలీ

మహాపద్మపతిః కశ్చిన్నందః క్షత్రవినాశకృత్

కురువంశీయులలో శ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! అజయుని పుత్రుడు నందివర్ధనుడు. నందివర్ధనుని పుత్రుడు మహానంది. ఈ (శిశునాగునినుండి మహానంది వరకు) పదిమంది శిశునాగ వంశీయులు కలియుగమునందు మూడు వందల అరవై సంవత్సరముల కాలము భూమిని పాలించగలరు. ఓ రాజా! మహానందికి శూద్రురాలైన భార్యయందు బలశాలియగు నందుడనుపాడు పుట్టును. మహాపద్మ (ఒకానొక పెద్ద) సంఖ్య గల సైన్యమునకు (మహాపద్మమనే నిధికి) ప్రభువగు ఆ నందుడు క్షత్రియవంశమును విసాశము చేయును.

తతో నృపా భవిష్యంతి శూద్రప్రాయాస్త్వధార్మికాః

స ఏకచ్ఛత్రాం పృథివీమనుల్లంఘితశాసనః

శాసిష్యతి మహాపద్మో ద్వితీయ ఇవ భార్గవః

అప్పటినుండి రాజులు శూద్రప్రాయులు, ధర్మము లేనివారు అగుదురు. ఆ మహాపద్మనందుడు ఏకచ్ఛత్రాధిపతియై రాజ్యమును ఏలును. ఆతని శాసనమును ఎవ్వరైననూ ఉల్లంఘించరు. క్షత్రియనాశము అనే అంశములో ఆతడు రెండవ పరశురాముడు వంటివాడు.

తస్య చాష్టౌ భవిష్యంతి సుమాల్యప్రముఖాస్సుతాః

య ఇమాం భోక్ష్యంతి మహీం రాజానస్స్మ శతం సమాః

ఆ మహాపద్మనందునకు సుమాల్యుడు మొదలైన ఎనమండుగురు పుత్రులు ఉండగలరు. వారు రాజులై ఈ భూమిని వంద సంవత్సరములు పొలించగలరు.

నవ నందాన్ ద్వీజః కశ్చిత్ప్రపన్నానుద్ధరిష్యతి

తేషామభావే జగతీం మౌర్యా భోక్ష్యంతి వై కలౌ

ఒకానొక బ్రాహ్మణుడు (చాణక్యుడు) ప్రఖ్యాతి చెందిన ఆ తొమ్మండుగురు (తండ్రి, ఎనమండుగురు పుత్రులు) నందులను రాజ్యభ్రష్టులను చేయును. దానితో కలియుగమునందు చంద్రవంశము అంతమగును. అప్పుడు రాజ్యమును మౌర్యులు పాలించగలరు.

స ఏవ చంద్రగుప్తం వై ద్విజో రాజ్యేఽభి షేక్ష్యతి

తత్పుత్రో వారిసారస్తు తతశ్చాశోకవర్ధనః

ఆ బ్రాహ్మణుడే చంద్రగుప్తుని రాజ్యమునందు పట్టాభిషిక్తుని చేయగలడు. ఆ చంద్రగుప్తుని పుత్రుడు వారిసారుడు. వారిసారుని పుత్రుడు అశోకవర్ధనుడు.

సుయశా భవితా తస్య సంగతస్సుయశస్సుతః

శాలిశూకస్తతస్తస్య సోమశర్మా భవిష్యతి

ఆ అశోకవర్ధనుని పుత్రుడు సుయశస్కుడు. సుయశస్కుని పుత్రుడు సంగతుడు. సంగతుని పుత్రుడు శాలిశూకుడు. శాలిశూకుని పుత్రుడు సోమశర్మ అగును.

శతధన్వా తతస్తస్య భవితా తద్బృహద్రథః

మౌర్యా హ్యేతే దశ నృపాస్సప్తత్రింశచ్ఛతోత్తరమ్

సమా భోక్ష్యంతి పృథివీం కలౌ కురుకులోద్వహ

ఓ పరీక్షిన్మహారాజా! కురువంశమును నిలబెట్టేది నీవే. ఆ సోమశర్మకు శతధన్వుడు, శతధన్వునకు బృహద్రథుడు పుత్రులు కాగలరు. ఈ పదిమంది మౌర్యరాజులు (చంద్రగుప్తునితో తొమ్మిదిమంది, చంద్రగుప్తునికంటే ముందువాడు దశరథుడు, వెరసి పదిమంది) నూట ముప్పై ఏడు సంవత్సరములు రాజ్యమునేలగలరు.

హత్వా బృహద్రథం మౌర్యం తస్య సేనాపతిః కలౌ

పుష్యమిత్రస్తు శుంగహ్వస్వయం రాజ్యం కరిష్యతి

కలియుగములో బృహద్రథమౌర్యుని ఆతని సేనాపతియగు పుష్యమిత్రశుంగుడు సంహరించి తానే రాజ్యమునేలగలడు.

అగ్నిమిత్రస్తతస్తస్మాత్సుజ్యేష్ఠోఽథ భవిష్యతి

వసుమిత్రో భద్రకశ్చ పులిందో భవితా సుతః

ఆ పుష్యమిత్రుని పుత్రుడు అగ్నిమిత్రుడు. అగ్నిమిత్రుని పుత్రుడు సుజ్యేష్ఠుడు. సుజ్యేష్ఠుని పుత్రుడు వసుమిత్రుడు. వసుమిత్రుని పుత్రుడు భద్రకుడు. భద్రకునకు పులిందుడనే పుత్రుడు కలుగగలడు.

తతో ఘోషస్సుతస్తస్మాద్వజమిత్రో భవిష్యతి

తతో భాగవతస్తస్మాద్దేవభూతిరితి శ్రుతః

ఆ పులిందుని పుత్రుడు ఘోషుడు. ఘోషుని పుత్రుడు వజ్రమిత్రుడు. వజ్రమిత్రుని పుత్రుడు భాగవతుడు. భాగవతునకు దేవభూతి అని ప్రసిద్ధి జెందిన పుత్రుడు కలుగును.

శుంగా దశైతే భోక్ష్యంతి భూమిం వర్షశతాధికమ్

తతః కణ్వనియం భూమిర్యాస్యత్యల్పగుణాన్ నృప

ఓ పరీక్షిన్మహారాజా! ఈ పదిమంది శుంగులు భూమిని వంద యేళ్లకంటే ఎక్కువ (నూట పన్నెండు) కాలము పాలించగలరు. తరువాత ఈ భూమి గుణసంపద కొరవడిన కణ్వవంశీయుల చేతిలోనికి వెళ్లగలదు.

శుంగం హత్వా దేవభూతిం కణ్వోఽమత్యస్తు కామినమ్

స్వయం కరిష్యతే రాజ్యం వసుదేవో మహామతిః

వసుదేవ కణ్వుడు గొప్ప బుద్ధిశాలియైన అమాత్యుడు, ఆతడు కాముకుడైన దేవభూతీశుంగుని సంహరించి తానే రాజ్యమునేలగలడు.

తస్య పుత్రస్తు భూమిత్రస్తస్య నారాయణస్సుతః

నారాయణస్య భవితా సుశర్మా నామ విశ్రుతః

ఆ వసుదేవుని పుత్రుడు భూమిత్రుడు. భూమిత్రుని పుత్రుడు నారాయ ణుడు. నారాయణుని పుత్రుడు సుశర్మ అనే పేరుతో ప్రసిద్ధిని బడయును.

కాణ్వాయనా ఇమే భూమిం చత్వారింశచ్చ పంచ చ

శతాని త్రీణి భోక్ష్యంతి వర్షాణాం చ కలౌ యుగే

ఈ కణ్వవంశీయులు కలియుగములో మూడు వందల నలభై ఐదు సంవత్సరములు భూమిని పాలించగలరు.

హత్వా కణ్వం సుశర్మాణం తద్భృత్యో వృషలో బలీ

గాం భోక్ష్యత్యంధ్రజాతీయః కంచిత్కాలమసత్తమః

కణ్వవంశీయుడైన సుశర్మకు బలి అనే పేరుతో శూద్రుడైన సేవకుడు ఉండును. అంధ్రజాతీయుడైన ఆ సేవకుడు పరమదుష్టుడు. ఆతడు ఆయనను సంహరించి కొంత కాలము భూమిని పాలించును.

కృష్ణ నామాఽథ తద్భ్రాతా భవితా పృథివీపతిః

శ్రీశాంతకర్ణస్తత్పుత్రః పౌర్ణమాసస్తు తత్సుతః

తరువాత బలి సోదరుడు కృష్ణుడనువాడు రాజ్యమును పాలించును. కృష్ణుని పుత్రుడు శ్రీశాంతకర్ణుడు. శ్రీశాంతకర్ణుని పుత్రుడు పౌర్ణమాసుడు.

లంబోదరస్తు తత్పుత్రస్తస్మాచ్చిబిలకో నృపః

మేఘస్వాతిశ్చిబిలకాదటమానస్తు తస్య చ

ఆ పౌర్ణమాసుని పుత్రుడు లంబోదరుడు. లంబోదరుని పుత్రుడు చిబిలక మహారాజు, చిబిలకుని పుత్రుడు మేఘస్వాతి. మేఘస్వాతి పుత్రుడు అటమానుడు.

అనీష్ట కర్మా హాలేయస్తలకస్తస్య చాత్మజః

పురీషభీరుస్తత్పుత్రస్తతో రాజా సునందనః

అటమానుని పుత్రుడు అనిష్ట కర్ముడు. అనిష్టకర్ముని పుత్రుడు హాలేయుడు. హాలేయుని పుత్రుడు తలకుడు. తలకుని పుత్రుడు పురీషభీరువు. పురీషభీరుని పుత్రుడు సునందన మహారాజు.

చకోరో బహవో యత్ర శివస్వాతిరరిందమ

తస్యాపి గోమతీపుత్రః పురీమాన్ భవితా తతః

శత్రువులను జయించే ఓ పరీక్షిన్మహారాజా! సునందనుని పుత్రుడు చకోరుడు. చకోరునకు బహువులనే పుత్రులు ఎనమండుగురు గలరు. వారిలో ఎనిమిదవవాడు శివస్వాతి. శివస్వాతి పుత్రుడు గోమతి. గోమతికి పురీమంతుడనే పుత్రుడు కలుగును.

మేదశిరాశ్శివస్కందో యజ్ఞశ్రీస్తత్సుతస్తతః

విజయస్తత్సుతో భావ్యశ్చంద్రవిజ్ఞస్సలోమధిః

పురీమంతుని పుత్రుడు మేదశిరస్సు. మేదశిరస్సుయొక్క పుత్రుడు శివస్కందుడు. శివస్కందుని పుత్రుడు యజ్ఞశ్రీ. యజ్ఞశ్రీ యొక్క పుత్రుడు విజయుడు. విజయుని పుత్రుడు చంద్రవిజ్ఞుడు. చంద్రవిజ్ఞుని పుత్రుడు సలోమధి.

ఏతే త్రింశన్నృపతయశ్చత్వార్యబ్దశతాని చ

షట్పంచాశచ్చ పృథివీం భోక్ష్యంతి కురునందన

కురువంశమునానందింపజేసే ఓ రాజా! ఈ ముప్పది మంది రాజులు నాలుగు వందల ఏభై ఆరు వత్సరముల కాలము భూమిని పొలించెదరు.

సప్తాభీరా ఆవభృత్యా దశ గర్దభినో నృపొః

కంకాష్షోడశ భూపాలా భవిష్యంతి చ లోలుపాః

అవభృతీనగరమును పాలించిన ఆభీరజాతికి చెందిన ఏడుగురు, గర్గభులనే పదిమంది, కంకులనే పదునాల్గురు రాజులు కూడ భోగపరాయణులు అగుదురు.

తత్వోఽష్టా యవనా భావ్యాశ్చతుర్దశ తురుష్కకాః

భూయో దశ గురుండాశ్చ మౌనా ఏకాదశైవ తు

తరువాత ఎనమండుగురు గ్రీసు జాతీయులు, పధ్నాలుగురు టర్కీ జాతీయులు, మరల పదిమంది గురుండులు, పదకొండు మంది మౌనులు అనే వారు రాజ్యమునేలగలరు.

ఏతే భోక్ష్యంతి పృథివీం దశ వర్షశతాని చ

నవాధికాం చ నవతం మౌనా ఏకాదశ క్షితిమ్

భోక్ష్యంత్యబ్దశతాన్యంగ త్రీణి తైస్సంస్థితే తతః

కిలికిలాయాం నృపతయో భూతనందోఽథ వంగిరిః

శిశునందిశ్చ తద్భ్రాతా యశోనందిః ప్రవీరకః

ఇత్యేతే వై వర్షశతం భవిష్యంత్యధికాని షట్

ఈ యవనులు, తురుష్కులు, గురుండులు భూమిని వెయ్యి తొంబై తొమ్మిది సంవత్సరములు పాలించెదరు. మౌనులనే రాజులు పదకొండు మంది మూడు వందల సంవత్సరములు భూమీనీ పొలించెదరు. వారి పాలన అంతమైన పిదప కిలికిలానగరమునందు భూతనందుడు, ఆయన పుత్రుడైన వంగిరి, శిశునంది, ఆయన సోదరుడైన యశోనంది, ప్రవీరకుడు అనే ఈ రాజులు నూట ఆరు సంవత్సరములు రాజ్యము నేలేదరు.

తేషాం త్రయోదశ సుతా భవితారశ్చ బాహ్లికాః

పుష్పమిత్రోఽథ రాజన్యో దుర్మిత్రోఽస్య తథైవ చ

ఆ భూతనందుడు మొదలగువారికి బాహ్లికులు అనే పదముగ్గురు పుత్రులు కలిగెదరు. వారి రాజ్యము తరువాత పుష్పమిత్రుడనే క్షత్రియుని రాజ్యము వచ్చును. ఆ పుష్పమిత్రుని పుత్రుడు దుర్మిత్రుడు.

ఏకకాలా ఇమే భూపాస్సప్తాంధ్రాస్సప్త కౌశలాః

వైదూరపతయో భావ్యా నైషధాస్తత ఏవ హి

బాహ్లికవంశీయులు ఏడుగురు అంధ్రదేశమునకు, ఏడుగురు కోసలదేశమునకు ప్రభువులగుదురు. ఆ వంశీయులే విదూరదేశమునకు, నిషధదేశమునకు కూడ ప్రభువులు కాగలరు. వీరందరు సమకాలీనులు.

మాగధానాం తు భవితా విశ్వస్పూర్జిః పురంజయః

కరిష్యత్యపరో వర్ణాన్ పులిందయదుమద్రకాన్

మగధవంశీయులలో విశ్వస్పూర్జి అనే రాజు ఉండగలడు. ఈయనకు పురంజయుడని ప్రసిద్ది. ఇదివరలో వచ్చిన పురంజయునికంటే ఈతడు వేరు. ఈతడు పులిందయదుమద్రకులనే కొత్త వర్ణములను కల్పించి, వారిని బ్రాహ్మణులు మొదలగు వర్ణముల స్థానములో నియమించును.

ప్రజాశ్చాబ్రహ్మభూయిష్ఠాః స్థాపయిష్యతి దుర్మతిః

వీర్యవాన్ క్షత్రముత్సాద్య పద్మవత్యాం స వై పురి

అనుగంగామాప్రయాగం గుప్తాం భోక్ష్యతి మేదినీమ్

ఆ విశ్వస్ఫూర్జి దుర్బుద్ధి, బలశాలి. ఆతడు పద్మవతి అనే నగరములో ఉంటూ, హరిద్వార్ నుండి ప్రయాగ వరకు గల రాజ్యమును రక్షిస్తూ పాలించగలడు. ఆతడు క్షత్రియధర్మమును నశింపజేసి, జనులలో వైదికసంస్కారము ఇంచుమించు లుప్తమగునట్లు చేయగలడు.

సౌరాష్ట్రవంత్యభీరాశ్చ శూరా అర్బుదమాలవాః

వ్రాత్యా ద్విజా భవిష్యంతి శూద్రప్రాయా జనాధిపాః

సౌరాష్ట్రము, అవంతి, ఆభీరము, శూరము, అర్బుదము, మాలవము అనే దేశములకు చెందిన బ్రాహ్మణులు ఉపనయనసంస్కారము లేని వారుగా, ప్రజలను పాలించే రాజులు శూద్రులతో సములుగను అగుదురు.

సింధోస్తటం చంద్రభాగాం కౌంతీం కాశ్మీరమండలమ్

భోక్ష్యంతి శూద్రి వ్రాత్యాద్యా మ్లేచ్ఛాశ్చాబ్రహ్మవర్చసాః

సింధు, చంద్రభాగా నదుల తీరమునందలి దేశములను, కుంతీ పురమును, కాశ్మీరమండలమును శూద్రులు, ఉపనయనసంస్కారము లేని బ్రాహ్మణక్షత్రియులు, మ్లేచ్చులు, వేదాచారము లేనివారు పాలించేదరు.

తుల్యకాలా ఇమే రాజన్ మ్లేచ్చప్రాయాశ్చ భూభృతః

ఏతేఽధర్మానృతపరాః ఫల్గుదాస్తీవ్రమన్యవః

ఓ పరీక్షిన్మహారాజా! మ్లేచ్చులతో తుల్యులైన ఈ పాలకులు సమకాలీనులు. వీరికి అధర్మమునందు, అసత్యమునందు నిష్ఠ మెండు. అల్పమును దానము చేసే వీరి కోపము తీవ్రముగానుండును.

స్త్రీబాలగోద్విజఘ్నాశ్చ పరదారధనాదృతాః

ఉదితాస్తమితప్రాయా అల్పసత్త్వాల్పకాయుషః

వారు స్త్రీలను, పిల్లలను, గోవులను, బ్రాహ్మణులను హింసించేదరు. వారికి ఇతరుల భార్యలపై, సొత్తు పై ప్రీతి ఉండును. వారు ఒక క్షణములో సంతోషమును, ఇంకో క్షణములో దుఃఖమును కలిగియుందురు. వారి బలము అల్పము. వారి ఆయుష్షు కూడ అల్పము.

అసంస్కృతాః క్రియాహీనా రజసా తమసా వృతాః

ప్రజాస్తే భక్షయిష్యంతీ మ్లేచ్ఛా సౌజన్యరూపిణః

క్షత్రియుల రూపములో నున్న ఆ మ్లేచ్చులకు ఉపనయనాది వైదికసంస్కారములు ఉండవు. రజోగుణతమోగుణములతో కూడియున్న ఆ పాలకులు వైదికకర్మలను చేయరు. వారు ప్రజలను పీడించేదరు.

తన్నాథాస్తే జనపదాస్తచ్ఛీలాచారవాదినః

అన్యోన్యతో రాజభిశ్చ క్షయం హాస్యంతి పీడితాః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ద్వాదశస్కంధే ప్రథమోఽధ్యాయః

అట్టి పాలకులచే పాలించబడే ఆ ప్రాంతములలోని జనులు కూడ ఆ పాలకుల శీలము, ఆచారము, భాషణములవంటి శీల-ఆచారభాషణములను కలిగియుందురు. వారు పరస్పరము పీడించుకుంటూ, పాలకులచే కూడ పీడించబడుతూ, వినాశమును పొందెదరు.

శ్రీమద్భాగవత మహాపురాణము పన్నెండవ స్కంధములో కలియుగ రాజవంశములను వర్ణించే మొదటి అధ్యాయము ముగిసినది (1).