10 - దశమోధ్యాయః

శ్రీశుక ఉవాచ

అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయః

 మన్వంతరేశానుకథా నిరోధో ముక్తిరాశ్రయః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను: ఈ భాగవత పురాణమునందు సర్గ ము, విసర్గము, స్థానము, పోషణము, ఊతులు, మన్వంతరములు, ఈశా నుకథలు, నిరోధము, ముక్తి మరియు ఆశ్రయము అనే పది విషయములు వర్ణించబడును.

దశమస్య విశుద్ద్యర్థం నవానామిహ లక్షణమ్

 వర్ణయంతి మహాత్మానః శ్రుతేనార్థన చాంజసా

పదవదియగు ఆశ్రయముయొక్క తత్త్వమును తేలికగా తెలియుట కొరకై మహాత్ములు మిగిలిన తొమ్మిది లక్షణములను సాక్షాత్తుగా ఆయా విషయములను బోధించే శబ్దములతో గాని, లేదా తాత్పర్యవృత్తిచే గాని బోధించుచున్నారు.

భూతమాత్రేంద్రియధియాం జన్మ సర్గ ఉదాహృతః

 బ్రహ్మణో గుణవైషమ్యాద్విసర్గః పౌరుషస్స్మృతః

పరబ్రహ్మయొక్క అధిష్ఠానమునందు ప్రకృతియొక్క పత్త్వరజస్త మోగుణములలో ఏర్పడిన పరిణామము వలన మహత్తత్త్వము, అహంకార ము, పంచతన్మాత్రలు, ఇంద్రియములు, పంచభూతములు హిరణ్యగర్భ రూపములో ప్రకటమైనవి. ఇది సర్గము. ఆ హిరణ్యగర్భుడు చేసిన చరాచ రజగత్తుయొక్క సృష్టికి విసర్గమని పేరు.

స్థితిర్వైకుంఠవిజయః పోషణం తదనుగ్రహః

 మన్వంతరాణి సద్ధర్మ ఊతయః కర్మవాసనాః

శ్రీహరి సృష్టించబడిన జగత్తును ధర్మముయొక్క మర్యాదలో నిలబెట్టి, జగత్తు వినాశము కాకుండగా కాపాడుతూ తన భక్తుల దుఃఖమును పారద్రోలును. ఇట్టి శ్రీహరియొక్క ఉత్కర్షయే స్థానము అనబడును. ఆయన భక్తులపై చూపే అనుగ్రహమునకు పోషణమని పేరు. మన్వం తధిపతులగు మహాత్ములు అనుష్ఠించే ధర్మమునకు మన్వంతరములని పేరు. జీవులు కర్మలను ఆచరించుచుందురు. వోటి వలన అంతఃకరణ ములో రాగద్వేషాది సంస్కారములు నిర్మాణమై, అవి మరల జీవుని కర్మల యందు ప్రేరేపించును. ఈ విధముగా జీవుడు వాసనలనే దారముల చుట్టలో చిక్కుకొనియుండును. కావుననే, ఈ కర్మవాసనలకు ఊతులు అని పేరు వచ్చినది.

అవతారానుచరితం హరేశ్చాస్యానువర్తనామ్

పుంసామీశకథాః ప్రోక్తా నానాఖ్యానోపబృంహితాః

శ్రీహరి అనేకములగు అవతారములనెత్తి వివిధములగు లీలలను ప్రకటించినాడు. ఇంతేగాక, ఆయన భక్తుల చరితములు కూడ విస్తారముగా గలవు. వీటికి సంబంధించిన గాథలకు ఈశకథలు (ఈశ్వరుని గాథలు) అని పేరు.

నిరోధోస్యానుశయనమాత్మనస్సహ శక్తిభిః

 ముక్తిర్హిత్వాన్యథారూపం స్వరూపేణ వ్యవస్థితిః

ప్రళయమునందు ఈశ్వరుడు యోగనిద్రను పొందును. అపుడు సర్వజీవులు తమ తమ ఉపాధులతో సహా ఆ ఈశ్వరునియందు విలీనమై యుందురు. దీనికి నిరోధమని పేరు. జీవుడు తనయందు అజ్ఞానముచే కల్పించబడిన కర్తృత్వభోక్తృత్వాదిరూపములను జ్ఞానముచే త్రోసిపుచ్చి, స్వస్వరూపమగు సచ్చిదానందమునందు నిలకడను కలిగియుండుటయే ముక్తి అనబడును.

ఆభాసశ్చ నిరోధశ్చ యతశ్చాధ్యవసీయతే

స ఆశ్రయః పరం బ్రహ్మ పరమాత్మేతి శబ్ద్యతే

ఏ పరమేశ్వరుని కారణముగా విశ్వముయొక్క సృష్టిస్థితిలయములు కలిగి ప్రకాశించుచున్నవో, అట్టి చేతనపరబ్రహ్మయే ఆశ్రయమనియు, పరమాత్మ అనియు పిలువబడును.

యోఽధ్యాత్మికోఽయం పురుషస్సోఽసావేవాధిదైవికః

యస్తత్రోభయవిచ్ఛేదః పురుషో హ్యాధిభౌతికః

కన్ను మొదలగు ఇంద్రియములలో ద్రష్ట రూపముగా జీవుడు ఉన్నాడు (ఆధ్యాత్మిక). కన్ను మొదలగు ఈ ఇంద్రియములకు సూర్యుడు మొదలగు దేవతలు అధిష్ఠానదేవతలై యున్నారు (ఆధిదైవిక). ఒకే ఆత్మ చైతన్యమునందు ఈ ఆధ్యాత్మిక-ఆధిదైవిక విభాగమునకు హేతువు పాంచభౌతికమగు స్థూలదేహము (ఆధిభౌతిక). పురుషునకు ఉపాధియగు ఈ అన్నరసమయదేహము పురుషుడనబడుచున్నది.

ఏకమేకతరాభావే యదా నోపలభామ హే

 త్రితయం తత్ర యో వేద స ఆత్మా స్వాశ్రయాశ్రయః

దృశ్యము సిద్ధించనిదే దానిని దర్శించే ఇంద్రియము సిద్ధించదు; ద్రష్ట కూడ సిద్ధించడు. ఇంద్రియము సిద్ధించనిదే, దాని అధిష్ఠానమగు దేవత సిద్ధించదు. దేవత లేనిదే ఇంద్రియము పని చేయదు. ఇంద్రియము లేనిదే ఇంద్రియగోచరమగు దృశ్యము సిద్ధించదు. ఈ విధముగా, ఆధ్యాత్మిక-ఆధిదైవిక-ఆధిభౌతికములు మూడింటిలో ఏ ఒక్కటి లేకున్ననూ, మరియొకటి కానవచ్చుట లేదు. కాని, ఈ మూడింటినీ మానసిక ప్రత్యయ రూపముగా దర్శించే ఏ సాక్షి చైతన్యము గలదో, ఆ పరమాత్మ స్వయంసిద్ధము (స్వయంసత్తాకము) మాత్రమే గాక, ఇతరమునకు కూడ తన సత్తా స్ఫూర్తులను అనుగ్రహించే సర్వాశ్రయమగుచున్నాడు.

పురుషోఽoడం వినిర్భిద్య యదాసౌ స వినిర్గతః

 ఆత్మనోఽయనమన్విచ్ఛన్నపోఽస్రాక్షీచ్ఛుచిశ్శుచీః

ఇది వరలో చెప్పబడిన విరాట్ పురుషుడు బ్రహ్మాండమును భేదిం చుకొని బయటకు వచ్చి, తన కొరకై ఒక స్థానము కొరకు అన్వేషించెను. ఆయన తాను స్వయముగా శుద్ధుడు గనుక, శుద్ధములగు జలములను సృష్టించెను.

తాస్వవాత్సీత్స్వసృష్టాసు సహస్రపరివత్సరాన్

 తేన నారాయణో నామ యదాపః పురుషోద్భవాః

ఆ విరాట్ పురుషుడు తనచే సృష్టించబడిన ఆ జలములలో వేయి సంవత్సరముల కాలము నివసించెను. విరాట్ పురుషుని (నర) నుండి ఉత్పన్నములగుటచే, జలములకు నారములు అను పేరు వచ్చినది. వాని యందు నివసించుటచే ఆ పురుషునకు నారాయణుడు (నారములు అయనము, అనగా నివాసస్థానముగా గలవాడు) అనే పేరు ప్రసిద్ధిని గాంచినది.

ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవ ఏవ చ

 యదనుగ్రహతస్సంతి న సంతి యదు పేక్షయా

జగత్తునకు ఉపాదానమగు (మహత్తు మొదలుకొని పృథివి వరకు గల) భూతవర్గము, సృష్టికి నిమిత్తమగు జీవుల కర్మాశయము, ప్రకృతి యొక్క సత్త్వరజస్తమోగుణముల సామ్యావస్థలో క్షోభను కలిగించే కాలము, ప్రకృతిలోని పరిణామమునకు హేతువు అగు స్వభావము, జీవుడు (భోక్త) అను తత్త్వములు తమకు సత్తాస్స్ఫూర్తులను అనుగ్రహించే నారా యణుని అనుగ్రహముచే మనుచున్నవి. ఆ సచ్చిద్బృహ్మకంటే భిన్నముగా వాటికి స్వతంత్రమగు ఉనికి గాని, స్ఫురణము గాని లేవు,

ఏకో నానాత్వమన్విచ్ఛన్ యోగతల్పాత్సముత్తితః

 వీర్యం హిరణ్మయం దేవో మాయయా వ్యసృజత్తృధా

అధిదేవమథాధ్యాత్మమధిభూతమితి ప్రభుః

అథైకం పౌరుషం వీర్యం త్రిధాఽభిద్యత తచ్ఛృణు

            సర్వసమర్థుడు, అద్వితీయుడు అగు నారాయణుడు యోగనిద్ర నుండి లేచి, తానే దేవమనుష్యాది రూపములలో అనేకముగా ప్రకటము కావలెనని సంకల్పించి, మాయాప్రభావముచే తేజోమయమగు తన సృజనశక్తిని అధ్యాత్మ-అధిభూత-అధిదైవములనే మూడు భాగములుగా విడదీసెను. పరమపురుషుని ఏకైకసృజనశక్తి మూడు విధములుగా విభాగమును చెందిన ప్రకారమును వినుము.

అంతశ్శరీర ఆకాశాత్పురుషస్య విచేష్టతః

ఓజస్సహో బలం జజ్జీ తతః ప్రాణో మహానసుః

వివిధములగు క్రియాశక్తి రూపములలో ప్రకటమగుచున్న విరాట్ పురుషునియొక్క శరీరము లోపలి ఆకాశమునుండి దేహశక్తి, ఇంద్రియశక్తి, మనశ్శక్తి పుట్టెను. వాటినుండి సమష్టి క్రియాశక్తి స్వరూపుడగు ప్రాణదేవత (సూత్ర అని వ్యవహరించబడు వాడు) ప్రకటమయ్యెను.

అను ప్రాణంతి యం ప్రాణాః ప్రాణంతం సర్వజంతుషు

 అపానంతమపానంతి నరదేవమివానుగాః

ఈ సూత్రాత్మ (సమష్టిక్రియాశక్తి) సకలప్రాణులలో క్రియాశక్తి రూపముగా ప్రకటమగుచున్నాడు. ఆ ప్రాణదేవత ప్రాణుల దేహములలో ప్రకటమగుచుండగా ఇంద్రియములు, మహారాజును అనుసరించి ప్రవర్తిల్లే అనుచరుల వలె, ఆ శక్తిని అనుసరించి తాము వివిధచేష్టలను చేయగలుగుచున్నవి. ఆ ప్రాణదేవత చేష్టలను విరమించగా, అవి తాము కూడ తమ  తమ చేష్టలనుండి విరమించుచున్నవి.

ప్రాణేన క్షిపతా క్షుత్తృడంతరా జాయతే ప్రభోః

పిపాసతో జక్షతశ్చ ప్రాఙ్నుఖం నిరభిద్యత

విరాట్ పురుషుని ఉదరము లోపల ప్రాణము సంచరించగా, ఆయనకు ఆకలి, దప్పిక పుట్టెను. అపుడాయనకు నీటిని త్రాగవలెననియు, ఆహారమును తినవలెననియు కోరిక కలుగగా, నోరు విడివడెను.

ముఖతస్తాలు నిర్భిన్నం జిహ్వా తత్రోపజాయతే

తతో నానా రసో జజ్ఞే జిహ్వయా యోఽధిగమ్యతే

తరువాత నోటియందు దౌడ పుట్టెను. దానియందు నాలుక (రస నేంద్రియము) ఉదయించెను. తరువాత ఆరు విధముల రుచులు పుట్టేను. నాలుక వాటిని గ్రహించు చుండును.

వివక్షోర్ముఖతో భూమ్నో వహ్నిర్వా గ్వ్యాహృతం తయోః

 జలే వై తస్య సుచిరం నిరోధస్సమజాయత

ఆ పురుషుడు మాటలాడవలెనని సంకల్పించగానే నోటియందు వాగీంద్రియము, దానికి అధిష్టానదేవతయగు అగ్ని, ఇంద్రియమునకు దేవతకు వశమై యుండే భాషణము అనే విషయము పుట్టెను. తరువాత ఆ పురుషుడు చిరకాలము నీటి లోననే చిక్కుకొని యుండెను.

నాసికే నిరభిద్యేతాం దోధూయతి నభస్వతి

తత్ర వాయుర్గంధవహో ఘ్రాణో నసి జిఘృక్షతః

ప్రాణవాయువు అధికముగా సంచరించగా, ముక్కు రంధ్రములు ప్రకటమయ్యేను. పురుషుడు గంధమునాఘ్రాణించ వలెనని సంకల్పించగానే, ఘ్రాణేంద్రియము మరియు గంధమును మోసుకొని పోయే వాయు దేవత ప్రకటమయ్యెను.

యదాత్మని నిరాలోకమాత్మానం చ దిదృక్షతః

నిర్భిన్నే హ్యక్షిణీ తస్య జ్యోతిశ్చక్షుర్గుణగ్రహః

ఆరంభములో పురుషుని శరీరమునందు ప్రకాశము లేకుండెను. ఇంతలో, పురుషుడు తనను తాను చూడగోరెను. అప్పుడు ఆ పురుషునకు కన్నులు, నేత్రేంద్రియము, దానికి అధి ష్ఠాన దేవతయగు సూర్యుడు ప్రకటమై, రూపజ్ఞానము కలిగెను.

బోధ్యమానస్య ఋషిభిరాత్మనస్తజ్జిఘృక్షతః

కర్ణౌ చ నిరభిద్యేతాం దిశః శ్రోత్రం గుణగ్రహః

వేదములు తనను గురించి చేయుచున్న వర్ణనను ఆలకించ గోరిన పురుషునకు రెండు చెవులు, శ్రోత్రేంద్రియము, వాటికి అధిష్ఠానమగు దిగ్దేవత మరియు శబ్దగ్రహణము ప్రకటమయ్యెను.

వస్తునో మృదుకాఠిన్యలఘుగుర్వోష్ణశీతతామ్

జిఘృక్షతస్త్వజ్నిర్ఛిన్నా తస్యాం లోమ మహీరుహాః

 తత్ర చాంతర్బహిర్వాతస్త్వచా లబ్ధగుణో వృతః

పురుషుడు పదార్థములయందలి సున్నితత్వము, కఠినత్వము, తేలిక దనము, బరువు, కొంచెము వేడి, చల్లదనము అను ధర్మములను గ్రహించగోరేను. అపుడాయనకు చర్మము ప్రకటమై, దానియందు లోపల బయట వాయువు, భూమియందు చెట్లు మొలిచినట్లు రోమములు, చర్మమునంతనూ వ్యాపించి యుండే స్పర్శేంద్రియము ప్రకటమై, స్పర్శ అనే గుణము గ్రహించబడ జొచ్చెను.

హస్తౌ రురుహతుస్తస్య నానాకర్మచికీర్షియా

 తయోస్తు బలమింద్రశ్చ ఆదానముభయాశ్రయమ్

ఆ పురుషునకు అనేకములగు పనులను చేయవలెననే కోరిక కలుగగానే, చేతులు మొలిచెను. వాటియందు కర్మేంద్రియమగు బలము, బలమునకు అధిదేవతయగు ఇంద్రుడు, ఆ రెండు ఆశ్రయముగా గల పట్టుకోనుట (బరువుల నెత్తుట) అనే కర్మ కూడ ప్రకటమయ్యెను.

 గతిం జిగీషతః పాదౌ రురుహాత్వేఽభికామికామ్

 పద్భ్యాం యజ్ఞస్స్వయం హవ్యం కర్మభిః క్రియతే నృభిః

ఆ పురుషుడు తాను నడువవలెనని కాంక్షించెను. వెంటనే ఆయనకు పాదములు మొలిచెను. పాదములకు అధిష్థాన దేవత స్వయముగా విష్ణువు. మానవులు పాదములతో నడిచి ఆ ఇంద్రియశక్తి ద్వారా యజ్ఞము కొరకు కావలసిన ద్రవ్యములను సమకూర్చుకొను చున్నారు.

నిరభిద్యత శిశ్నో వై ప్రజానందామృతార్థినః

 ఉపస్థ ఆసీత్కామానాం ప్రియం తదుభయాశ్రయమ్

సంతానమును, శారీరక సుఖమును మరియు స్వర్గాది భోగములను కోరిన పురుషునకు జననేంద్రియస్థానము, దానియందు జననేంద్రియము ప్రకటమయ్యెను. అవి రెండు కామనా పరిపూర్తి వలన కలిగే సుఖమునకు ఆశ్రయమగుచున్నవి.

ఉత్సిసృక్షోర్థాతుమలం నిరభిద్యత వై గుదమ్

 తతః పాయుస్తతో మిత్ర ఉత్సర్గ ఉభయాశ్రయః

ఆసిసృప్సోః పురః పుర్యా నాభిద్వారమపానతః

 తత్రాపానస్తతో మృత్యుః పృథక్త్వముభయాశ్రయమ్

ఆ విరాట్ పురుషుడు ఇతరదేహములన్నింటినీ వ్యాపించగోరి దేహమునుండి బయటకు రాబోగా, నాభిద్వారము, దానియందు అపానము అనే ప్రాణవృత్తి, దానికి అధిష్ఠానమగు మృత్యుదేవత ప్రకటమయ్యెను. ప్రాణ-అపానముల విశ్లేషణరూపమగు మరణము ఆ ప్రాణవృత్తి మరియు అధిష్ఠానదేవత అనే రెండింటి పై ఆధారపడి యుండును.

 ఆదిత్సోరన్నపానానామాసన్ కుక్ష్యంత్రనాడయః

 నద్యస్సముద్రాశ్చ తయోస్తుష్టిః పుష్టిస్తదాశ్రయే

ఆ పురుషుడు ఆహారమును పానీయమును స్వీకరించ గోరెను. అపుడు ఉదరములోని ప్రేవులు మరియు నాడీమండలము ప్రకటమయ్యెను. ప్రేవులకు నదీదేవతలు, నాడీమండలమునకు సముద్రదేవత అధిష్ఠానములు. కడుపు నిండుట మరియు శరీరపుష్టి అనునవి వాటిని ఆశ్రయించుకోని ఉండును.

నిదిధ్యాసోరాత్మమాయాం హృదయం నిరభిద్యత

 తతో మనస్తతశ్చంద్రస్సంకల్పః కామ ఏవ చ

తన మాయను గురించి విచారించ గోరిన పురుషునకు హృదయపుండరీకము అనే స్థానము, దానియందు మనస్సు అనే ఇంద్రియము, దానికి చంద్రుడు అనే అధిష్ఠాన దేవత, వాటికి పదార్థచింతనము మరియు వాటిని కామించుట అనే విషయములు ప్రకటమయ్యెను.

 త్వక్చర్మమాంసరుధిరమేదోమజ్జాస్థి ధాతవః

భూమ్యప్తేజోమయాస్సప్త ప్రాణో వ్యోమాంబువాయుభిః

విరాట్ పురుషుని దేహమునందు పై చర్మము, లోపలి చర్మము, మాంసము, రక్తము, క్రొవ్వు, మూలుగు, ఎముక అనే ఏడు మూలపదార్థములు భూమి, నీరు, అగ్ని అనే మూడు భూతములనుండి తయారైనవికాగా, ఆకాశము, నీరు, వాయువు అనే మూడు భూతములనుండి ప్రాణము నిర్మాణమైనది.

గుణాత్మకానీంద్రియాణి భూతాదిప్రభవా గుణాః

మనస్సర్వవికారాత్మా బుద్ధిర్విజ్ఞానరూపిణీ

ఇంద్రియములు శబ్దము మొదలగు విషయములను గ్రహించును. ఆ విషయములు అహంకారమునుండి పుట్టినవి. కామక్రోధలోభమోహశో కాది వికారములన్నింటికీ మనస్సు ఉత్పత్తిస్థానము. బుద్ధి సకలపదార్థముల జ్ఞానమును కలిగించును.

ఏతద్భగవతో రూపం స్థూలం తే వ్యాహృతం మయా

 మహ్యాదిభిశ్చావరణైరష్టభిర్బహిరావృతమ్

ఈ విధముగా భగవంతుని బ్రహ్మాండాత్మకమగు స్థూల రూపమును నేను నీకు వర్ణించి చెప్పితిని. ఈ రూపము బాహ్యమునందు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్త్వము, ప్రకృతి అనే ఎనిమిది తత్త్వములచే చుట్టువారబడి యున్నది.

అతః పరం సూక్ష్మతమమవ్యక్తం నిర్విశేషణమ్

 అనాదిమధ్యనిధనం నిత్యం వాఙ్మ్నసః పరమ్

భగవానుని సూక్ష్మశరీరము ఈ స్థూలశరీరమునకు కారణము, అతీతము మరియు ఉత్కృష్ఠము. ఇంద్రియగోచరము కానిది, సకలవ్యావర్త  కధర్మములు (విశేషణములు) లేనిది, ఆదిమధ్యాంతములు లేనిది, కాలాతీతమైనది అగు ఆ భగవానుని రూపమును వాక్కుతో వర్ణించుట గాని, మనస్సుతో ఊహించుట గాని సంభవము కాదు..

అమునీ భగవద్రూపే మయా తే హ్యనువర్ణితే

ఉభే అపి న గృహ్ణంతి మాయాసృష్టే విపశ్చితః

నేను నీకు భగవంతుని స్థూలసూక్ష్మరూపములను రెండింటినీ వర్ణించి చెప్పితిని. ఇవి  భగవానుని మాయచే రచించబడినవి గనుక, జ్ఞానులు వీటిని యథార్థమగు తత్త్వముగా స్వీకరించరు.

స వాచ్యవాచకతయా భగవాన్ బ్రహ్మరూపధృక్

 నామరూపక్రియా ధత్తే సకర్మాఽకర్మకః పరః

పరబ్రహ్మస్వరూపుడగు శ్రీహరి భగవానుడు వాస్తవములో నిష్కృయుడు. అయిననూ, మాయాసంబంధముచే బ్రహ్మగారి రూపమును దాల్చి, సక్రియుడై వాచ్యవాచకభావముతో ప్రకటమై, నామములను , రూపములను మరియు క్రియలను సృష్టించుచున్నాడు.

ప్రజాపతీన్ మనూన్ దేవానృషీన్ పితృగణాన్ పృథక్

 సిద్ధచారణగంధర్వాన్ విద్యాధ్రాసురగుహ్యకాన్  

కిన్నరాప్సరసో నాగాన్ సర్పాన్ కింపురుషోరగాన్

 మాతృ రక్షఃణపిశాచాంశ్చ ప్రేతభూతవినాయకాన్

  కూష్మాండోన్మాదవేతాలాన్ యాతుధానాన్ గ్రహానపి

ఖగాన్ మృగాన్ పశూన్ వృక్షాన్ గిరీన్నృప సరీసృపాన్

ఓ మహారాజా!, ఈశ్వరుడు ప్రజాపతులను, మనువులను, దేవతలను, ఋషులను, వివిధరకముల పితృదేవతల గణములను, సిద్దులను, చోరణులను, గంధర్వులను, విద్యాధరులను, అసురులను, యక్షులను, కిన్నరులను, అప్సరసలను, నాగులను, సర్పములను, కింపురుషులను, పాములను, మాతృకలను, రాక్షసులను, పిశాచములను, ప్రేతములను, భూతములను, వినాయకులను, కూష్మాండులను, ఉన్మాదులను, వేతాళులను, యాతుధానులను, గ్రహములను, పక్షులను, మృగములను, ఇతర జంతువులను, వృక్షములను, పర్వతములను, సరీసృపములను (వంకర టింకరగా ప్రాకునవి) సృష్టించుచున్నాడు.

ద్వివిధాశ్చతుర్విధా యేఽన్యే జలస్థలనభౌకసః

 కుశలాకుశలా మిశ్రాః కర్మణాం గతయన్స్త్విమాః

            ప్రాణులలో కదిలేవి, కదలనివి అనే రెండు భేదములు గలవు. ప్రాణులలో కొన్ని తల్లి గర్భమునుండి జన్మించగా, కొన్ని గ్రుడ్డునుండి, కొన్ని చెమట మొదలగు మాలిన్యములనుండి, మరికొన్ని నేలనుండి పుట్టును. ఈ ప్రాణియోనులు అన్నియు జీవుల కర్మఫలరూపములే. కొన్ని ఉత్తమయోనులు పుణ్యఫలములు కాగా, నీచయోనులు పాపఫలములుగా లభించును. మనుష్యజన్మ పుణ్యపాపముల మిశ్రమమగు కర్మఫలరూప.

సత్త్వం రజస్తమ ఇతి తిస్రస్సురనృనారకాః

 తత్రాప్యేకైకశో రాజన్ భిద్యంతే గతయస్తృథా

యదైకైకతరోఽన్యాభ్యాం స్వభావ ఉపహన్యతే

ఓ మహారాజా! సత్త్వగుణము. ప్రధానమైనచో దేవతాదేహము, రజోగుణము ప్రధానమైనచో మనుష్యదేహము, తమోగుణము ప్రధానమైనచో నరకమునకు సంబంధించిన దేహము లభించును. ఈ మూడు గతులలో కూడ మరల ఒక గుణమును మిగిలిన రెండు గుణములు అధిగమించినప్పుడు ఒక్కొక్క గతిలో మూడు భేదములు కలుగును.

స ఏవేదం జగద్ధాతా భగవాన్ ధర్మరూపధృక్

 పుష్ణాతి స్థాపయన్ విశ్వం తిర్యజ్నరసురాత్మభిః

జగత్తును సృష్టించిన ఆ భగవానుడే విష్ణురూపమును దాల్చి పశు -పక్షి-నర-దేవాది అవతారములనెతి, ఈ జగత్తును పాలించి పోషించుచు.

తతః కాలాగ్నిరుద్రాత్మా యత్సృష్టమిదమాత్మనః

 సన్నియచ్ఛతి కాలేన ఘనానీకమివానిలః

తరువాత ప్రళయకాలము సంప్రాప్తమైనప్పుడు ప్రళయకాలాగ్ని రూపములోనుండే రుద్రరూపమును దాల్చి, వాయువు మేఘముల సమూహమును వలె, తననుండి సృష్టించబడిన ఈ జగత్తును తనలోనికి ఉపసంహరించును.

ఇత్తంభావేన కథతో భగవాన్ భగవత్తమః

నేత్థంభావేన హి పరం ద్రష్టుమర్హంతి సూరయః

ఈ జగత్తుయొక్క దృష్టికోణములో, భగవానుడు జగత్తును సృష్టించి పాలించి ఉపసంహరించే పరిపూర్ణేశ్వర్యనిధానము అని వర్ణించబడినాడు. కాని, పరమేశ్వరుని పూర్ణరూపము ఇంతమాత్రమేనని జ్ఞానులు స్వీకరించరు. ఏలయనగా, పరమేశ్వరుడు తాత్త్వికముగా ఈ జగత్తునకు అతీతమైనవాడు (నిర్గుణ పరబ్రహ్మ).

నాస్య కర్మణి జన్మాదౌ పరస్యానువిధీయతే

కర్తృత్వప్రతిషేధార్థం మాయయారోపితం హి తత్

వేదములో జగత్తుయొక్క సృష్టిస్థితిలయవర్ణనము పరమేశ్వరుని యందు కర్తృత్వాదికమును నిర్ధారించుటకై చేయబడుట లేదు. వాస్తవములో పరమేశ్వరునియందు కర్తృత్వాదికము లేదు. జగత్తు (కర్తృత్వాదికము) పరమేశ్వరునియందు మాయచే అధ్యారోపము చేయబడుచున్నది.

అయం తు బ్రహ్మణః కల్పస్సవికల్ప ఉదాహృతః

 విధిస్సాధారణో యత్ర సర్గాః ప్రాకృతవైకృతాః

            అవాంతర కల్పములతో కూడిన ఈ బ్రహ్మయొక్క మహాకల్పమును గురించి నేను వివరించి చెప్పితిని. మహాకల్పములన్నింటియందు, సృష్టి సమానమే. మహాకల్పమునకు ఆరంభములో మహత్తత్త్వముతో మొదలు పెట్టి పృథివీ వరకు గల తత్త్వములన్నియు ప్రకృతినుండి సృష్టించబడును. అవాంతరకల్పములో ఈ తత్త్వములు యథాతథముగా నుండుటచే, కేవలము స్థాపరజంగమాది సృష్టి మాత్రమే చేయబడును.

పరిమాణం చ కాలస్య కలృలక్షణవిగ్రహమ్

 యథా పురస్తాద్వ్యాఖ్యాసే పొద్మం కల్పమథో శృణు

కాలపరిమాణమును, కల్పలక్షణమును, అవాంతర కల్పముల విభాగమును యథాతథముగా ముందు ముందు వ్యాఖ్యానించ గలను. పాద్మకల్పమును గురించిన వివరములను సావధానముగా వినుము.

శౌనక ఉవాచ

 యదాహ నో భవాన్ సూత క్షత్తా భగవతోత్తమః

 చచార తీర్థానీ భువస్త్యక్త్వా బంధూన్ సుదుస్త్యజాన్

శోనకమహర్షి ఇట్లు పలికెను: ఓ సూతమహర్షీ! భగవద్భక్తులలో శ్రేష్ఠుడగు విదురుడు విడిచి పెట్ట శక్యము కాని బంధువర్గమును కూడ విడిచి భూలోకములోని పుణ్యతీర్థములను సేవించెనని నీవు మాకు చెప్పియుంటివి.

కుత్ర కౌషారవేస్తస్య సంవాదోఽధ్యాత్మసంశ్రితః

 యద్వా స భగవాంస్తస్మై పృష్ణస్తత్త్వమువాచ హ

విదురునకు మైత్రేయునితో అధ్యాత్మజ్ఞానమునకు సంబంధించిన సంవాదము ఎక్కడ జరిగినది? దానిలో పూజ్యుడగు మైత్రేయుడు విదురుడు ప్రశ్నించగా బోధించిన పరమార్థము ఎట్టిది?

బ్రూహి నస్తదిదం సౌమ్య విదురస్య విచేష్టితమ్

 బంధుత్యాగనిమిత్తం చ తథైవాగతవాన్ పునః

సౌమ్యస్వభావము గల ఓ సూతా! విదురుని ఈ చరితమును, ఆయన బంధుజనమును విడిచి వెళ్లుటకు గల కారణమును, ఆయన మరల తిరిగి వచ్చిన సందర్భమును మాకు చెప్పుము.

సూత ఉవాచ

రాజ్ఞా పరీక్షితా పృష్టో యదవోచన్మహామునిః

 తద్వోఽభిధాస్యే శృణుత రాజ్ఞః ప్రశ్నానుసారతః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ద్వితీయస్కంధే

  దశమోఽధ్యాయః.

ద్వితీయః స్కంధః సమాప్తః

సూతుడు ఇట్లు పలికెను: పరీక్షిన్మహారాజుయొక్క ప్రశ్నలకు శుకమహర్షి ఒక క్రమములో సమాధానమును చెప్పెను. ఆ వివరములను నేను మీకు వర్ణించి చెప్పెదను. వినుడు.

శ్రీమద్బాగవత మహాపురాణములోని రెండవ స్కంధములో

 పదవ అధ్యాయము ముగిసినది.ద్వితీయ స్కంధము సమాప్తము.

హరిః ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.

* * * * *