3 - తృతీయోధ్యాయః

శ్రీశుక ఉవాచ        

ఏవమేతన్నిగదితం పృష్టవాన్ యద్బవాన్మమ

 నృణాం యన్మ్రియమాణానాం మనుష్యేషు మనీషిణామ్

            శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను: మనుష్యజన్మను పొందియున్న జీవులలో వివేకము గలవారు మరణించ బోయే సమయములో చేయదగిన పని యేది? అని నీవు నన్ను ప్రశ్నించితివి. దానికి సమాధానముగా శాస్త్ర ముయొక్క సందేశమును నేను నీకు చెప్పితిని. అట్టి వారు హరికథా శ్రవ ణము మొదలగు వాటియందు ఈ విధముగా కాలమును గడుప వలెనని శాస్త్రము విధించుచున్నది.

బ్రహ్మవర్చసకామస్తు యజేత బ్రహ్మణస్పతిమ్

ఇంద్రమింద్రియకామస్తు ప్రజాకామః ప్రజాపతీన్

            బ్రహ్మతేజస్సును కోరు వ్యక్తి వేదములకు అధిపతియగు బ్రహ్మ గారిని, ఇంద్రియపాటవమును కోరువాడు ఇంద్రుని, సంతానమును కోరు వాడు దక్షుడు మొదలగు ప్రజాపతులను ఉపాసించ వలెను.

దేవీం మాయాం తు శ్రీకామ స్తేజస్కామో విభావసుమ్

 వసుకామో వసూన్ రుద్రాన్ వీర్యకామోకథ వీర్యవాన్

  అన్నాద్యకామస్త్వదితిం స్వర్గకామోదితేస్సుతాన్

 విశ్వాన్దేవాన్ రాజ్యకామస్సాధ్యాన్సంసాధకో విశామ్

  ఆయుష్యకామోకాశ్వినౌ దేవో పుష్టి కామ ఇలాం యజేత్

 ప్రతిష్టాకామః పురుషో రోదసీ లోకమాతరౌ

సంపత్తిని కోరువాడు దుర్గాదేవిని, తేజస్సును కోరువాడు అగ్నిని, ధనమును కోరువాడు వస్తువులను ఆరాధించ వలెను. వీరత్వమును కోరు వ్యక్తి ఉత్సాహముతో రుద్రులను ఉపాసించ వలెను. సమృద్ధమగు అన్న మును మాత్రమే గాక, మంచి జీర్ణశక్తిని కూడ కోరు వ్యక్తి అదితిని, స్వర్గ మును కోరువాడు ద్వాదశాదిత్యులను, రాజ్యాధికారమును కోరువాడు విశ్వేదేవతలను, దేశప్రజలను తన స్వాధీనములోనికి తెచ్చుకోవాలని కోరే వ్యక్తి (లేదా, వ్యాపారమును చేయగోరు వ్యక్తి) సాధ్యులను, ఆయుర్దాయ మును కోరువాడు అశ్వినీ దేవతలను, పుష్టిని కోరువాడు పృథివీ దేవతను, తన స్థానమును నిలబెట్టుకోవాలని కోరే వ్యక్తి (లోకమునందు పేరు ప్రతిష్ట లను కోరువాడు) సకలప్రాణులకు ఆధారభూతులైన భూలోక-స్వర్గలోక ముల అధిష్టాన దేవతలను ఉపాసించ వలెను.

రూపాభికామో గంధర్వాన్ స్త్రీకామోప్సరఉర్వశీమ్

 ఆధిపత్యకామస్సర్వేషాం యజేత పరమేష్ఠినమ్  

సౌందర్యమును కోరు వ్యక్తి గంధర్వులను, భార్యను కోరువాడు ఊర్వశి అనే అప్సరసను, జనులందరిపై పెత్తనమును కోరువాడు బ్రహ్మ గారిని కొలువ వలెను.

యజ్ఞం యజేద్యశస్కామః కోశకామః ప్రచేతసమ్

         విద్యాకామస్తు గిరిశం దాంపత్యార్థముమాం సతీమ్      

కీర్తిని కోరువాడు యజ్ఞరూపుడగు శ్రీహరిని, ధనమును ప్రోగు , చేయ గోరువాడు వరుణుని, విద్యను కోరువాడు శంకరుని, దాంపత్యజీవిత ములో అన్యోన్యానురాగమును కోరువారు పతివ్రతయగు పార్వతీదేవిని ఉపాసించ వలెను.

ధర్మార్థ ఉత్తమశ్లోకం తంతుం తన్వన్ పితృన్ యజేత్

రక్షాకామః పుణ్యజనానోజస్కామో మరుద్గణాన్

ధర్మమును కోరువాడు ఉత్తమమగు కీర్తిగల శ్రీహరిని, సంతానమును అధికముగా కోరువాడు పితృదేవతలను, రక్షణను (బాధలనుండి విముక్తిని) కోరువాడు యక్షులను, బలమును కోరువాడు మరుద్గణములను ఆరాధించ వలెను.

రాజ్యకామో మనూన్డేవాన్నిరృతిం త్వభిచరన్ యజేత్

 కామకామో యజేత్సోమమకామః పురుషం పరమ్

క్షత్రియజన్మను కోరువాడు మన్వంతరాధిపతులను, శత్రువినాశ మును కోరువాడు నిరృతిని, భోగములను కోరువాడు చంద్రుని, విరాగి పర , మపురుషుడగు శ్రీహరిని కొలువ వలెను.

అకామస్సర్వకామో వా మోక్షకామ ఉదారధీః

తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరమ్

ఉన్నతమగు బుద్ధి గల వ్యక్తి కామములు లేకున్ననూ, లేక అన్నిం టినీ కోరువాడైననూ, లేక మోక్షమును మాత్రమే కోరువాడైననూ, తీవ్ర మగు భక్తియోగముతో పరమపురుషుడగు శ్రీహరిని కొలువ వలెను.

ఏతావానేవ యజతామిహ నిఃశ్శ్రేయసోదయః

 భగవత్యచలో భావో యద్భాగవతసంగతః

సాధకునకు ఈశ్వరారాధన వలన లభించే మహాఫలమేమనగా, భగవద్భక్తులతో సంగమము ఏర్పడి, తద్ద్వారా భగవంతునియందు నిశ్చల మగు భక్తి కుదురుటయే. దాని వలన సాధకునకు పరమపురుషార్థమగు మోక్షము లభించును.

జ్ఞానం యదాప్రతినివృత్తగుణోర్మిచక్ర-

మాత్మప్రసాద ఉత యత్ర గుణేష్వసంగః

 కైవల్యసంమతపథస్త్వథ భక్తియోగః

కో నిర్వృతో హరికథాసు రతిం న కుర్యాత్

            శ్రీహరియొక్క గాథలను వినువానికి జ్ఞానోదయమై త్రిగుణముల కార్యములగు రాగద్వేషాదుల వెల్లువల పరంపరలనుండి మనస్సు ఉపసం హరింపబడుటచే, ఆ మనస్సు ప్రసన్నమగును. అట్టి ప్రసన్నమగు మన స్సులో విషయభోగములపై వైరాగ్యము ఉదయించును. ఆ తరువాత ఆ మనస్సులో భక్తియోగము ఉదయించును. ఈ భక్తియోగము మోక్షమార్గ మని మహాత్ములు ఉద్దేషించుచున్నారు. అట్టి శ్రీహరియొక్క గాథలలోని మాధుర్యమును చవి చూచినవాడు ఎవడు వాటియందు ప్రీతిని చేయకుం డును?

శౌనక ఉవాచ

ఇత్యభివ్యాహృతం రాజా నిశమ్య భరతర్షభః

 కిమన్యత్పృష్టవాన్భూయో వైయాకిమృషిం కవిమ్

            శౌనకమహర్షి ఇట్లు పలికెను: శుకమహర్షి చెప్పిన ఈ విషయ మును విని, భరతవంశశ్రేష్ఠుడగు పరీక్షిన్మహారాజు మరల. ఆయనను ఇంకనూ ఏమని ప్రశ్నించెను?

ఏతచుశ్రూషతాం విద్వన్ సూత నోర్హసి భాషీతుమ్

  కథా హరికథోదర్కాస్సతాం స్యుస్సదసి ధ్రువమ్

ఓ సూతమహర్షీ! నీవు విద్వాంసుడవు. ఈ విషయమును మేము వినగోరుచున్నాము. కావున, నీవు చెప్పదగును. సత్పురుషుల సభలో ఘటిల్లే ప్రసంగములు శ్రీహరి గాథలలోనికి మాత్రమే పరిణమించును గదా! .

స వై భాగవతో రాజా పాండవేయో మహారథః

బాలక్రీడనకైః క్రీడన్ కృష్ణక్రీడాం య ఆదదే

పాండవుల మనుమడు, మహారథుడు అగు ఆ పరీక్షిన్మహారాజు గొప్ప భగవద్భక్తుడు. ఆయన చిన్నతనములో ఆటబొమ్మలతో ఆడే సమయములో శ్రీకృష్ణుని లీలలకు సంబందించిన ఆటలను ఆడుకొనెడివాడు.

వైయాసశ్చ భగవోస్ వాసుదేవపరాయణః

 ఉరుగాయగుణేదారాస్సతాం స్యుర్హి సమాగమే

వ్యాసపుత్రుడు, పూజ్యుడు అగు శుకమహర్షి కూడ గొప్ప శ్రీకృష్ణ భక్తుడు. ఇట్టి సత్పురుషుల సమావేశములో భగవానుని గుణములను వర్ణించే గాథలు ముచ్చటించ బడును గదా!

ఆయుర్హరతి వై పుంసాముద్యన్నస్తం చ యన్నసౌ

 తస్యర్తే యత్ క్షణో నీత ఉత్తమశ్లోకవార్తయా

ఎవడైతే క్షణకాలమైననూ ఉత్తమమగు కీర్తిగల భగవానుని ప్రసంగ ముచే గడుపునో వానికి తప్ప, మిగిలిన వారందరికీ సూర్యభగవానుడు ఉద యిస్తూ, అస్తమిస్తూ ఆయుర్దాయమును హరించి వేయుచుండును.

తరవః కిం న జీవంతి భస్త్రాః కిం న శ్వసంత్యుత

న ఖాదంతి న మేహాంతి కిం గ్రామపశవోకపరే

చెట్లు బ్రతుకుట లేదా? కొలిమి తిత్తులు గాలిని పీల్చుట లేదా? గ్రామమునందు బ్రతికే ఇతరజంతువులు తిని, సంతానమును కనుట లేదా? భక్తి లేని మానవజీవితము వాటి వలె నిస్సారమైనది అని భావము.

శ్వవిడ్వరాహోష్ట్రఖరైస్సంస్తుతః పురుషః పశుః

 న యత్కర్ణపథో పేతో జాతు నామ గదాగ్రజః

చెవి (శ్రవణము) ద్వారా ఎవని హృదయము లోనికి ఒక్కనాడై ననూ శ్రీకృష్ణభగవానుడు ప్రవేశించ లేదో, అట్టి పురుషాకారములోనున్న పశువును మహాత్ములు తిరస్కారయోగ్యుడగుటచే కుక్కలలో, కలుషితములగు భోగములయందు ఆసక్తి గలవాడగుటచే గ్రామములోని పందులలో, దుఃఖ హేతువగు మార్గమునందు పయనించుచుండుటచే ఒంటెలతో, సంసారభారమును మోయుచుండుటచే గాడిదలతో సమానుడని పరిగణిం చినారు. లేదా, మనలో ఒక్కొక్కరిలో గల గుణములను అన్నింటినీ వీడు కలిగియున్నాడని ఆయా పశువులు వానిని స్తుతించునని భావము.

బీలే బతోరపక్రమవిక్రమానీ యే

న శృశ్వతః కర్ణపుటే నరస్య

జిహ్వాసతీ దార్దురికేవ సూత

 న చోపగాయత్యురుగాయగాథాః

వామనావతారములో మూడు అడుగులలో విశ్వమును కొలిచిన శ్రీహరియొక్క పరాక్రమగాథలను వినని మానవుని చెవి దొప్పలు వ్యర్థ మగు రంధ్రములు మాత్రమే. అయ్యో! వేదములలో పలువిధములుగా కీర్తించబడే పరమేశ్వరుని గాథలను ఎవని నాలుక కీర్తించదో, అది కప్ప నాలుక వలె వ్యర్థముగా కటువగు శబ్దములను చేయుటకు మాత్రమే పనికి వచ్చును.

భారః పరం పట్టకిరీటజుష్ట-

మప్యుత్తమాంగం న నమేన్ముకుందమ్

 శావా కరౌ నో కురుతస్సపర్యం

హరేర్లసత్కాంచనకంకణా వా

శ్రీహరికి నమస్కరించని తల పట్టు తలపాగతో మరియు కిరీట ముతో అలంకరించబడి యున్ననూ, అది కేవలము బరువు మాత్రమే శ్రీహరియొక్క పూజను చేయని చేతులు బంగరు కంకణములతో అలంకరించబడి ప్రకాశించుచున్ననూ, శవముయొక్క చేతులతో సమానము.

బర్హాయితే తే నయనే నరాణాం

లింగాని విష్ణోర్న నిరీక్షతో యే

 పాదౌ నృణాం తౌ ద్రుమజన్మభాజా

క్షేత్రాణి నానువ్రజతో హరేర్యౌ

శ్రీహరియొక్క మూర్తిని, ఆయనను గుర్తుకు తెచ్చే తీర్థములు మొదలగు వాటిని దర్శించని మానవుల కన్నులు నెమలి ఈకల కన్నుల వలె నిరర్థకములు. శ్రీహరియొక్క క్షేత్రములకు యాత్రలను చేయని మానవుల పాదములు ఎక్కడికైననూ కదలని చెట్ల వలె వ్యర్థములు.

జీవన్ శవో భాగవతాంఘ్రిరేణుం

న జాతు మర్త్యాభిలభేత యస్తు

 శ్రీవిష్ణుపద్యా మనుజస్తులస్యాః

శ్వసన్ శవో యస్తు న వేద గంధమ్

            ఏ మానవుడైతే ఒక్కనాడైననూ భగవద్భక్తుల పాదధూళిని తన శిరస్సు పై ధరించడో, వాడు నడయాడే శవముతో సమానము. భగవంతుని పాదములయందు సమర్పించబడి, శ్రీవిష్ణుపది అని పేరు గాంచిన తుల సియొక్క గంధమును ఎవడైతే భక్తిపూర్వకముగా ఆఘ్రాణించి అభినందిం చడో, వాడు గాలిని పీలుస్తూ ఉండే శవముతో సమానము.

తదశ్మసారం హృదయం బతేదం

యద్గృహ్యమాజైర్హరినామధేయైః

 న విక్రియేతాథ యదా వికారో

నేత్రే జలం గాత్రరు హేషు హర్షః

            ఓ సూతా! శ్రీహరియొక్క నామములను తాను ఉచ్చరించి గాని, ఇతరులు ఉచ్చరించగా విని గాని, ఎవని హృదయములో వికారము కలుగదో, వాని ఆ హృదయము రాయి వలె కఠినమైనది. నామమును విన్న వెంటనే కలిగే వికారముయొక్క లక్షణమేమనగా, కన్నుల వెంబడి ఆనంద బాష్పములు రాలుట, మరియు రోమాంచము కలుగుట.

అథాభిధేహ్యంగ మనోనుకూలం

ప్రభాష సే భాగవతప్రధానః

యదాహ వైయాసకీరాత్మవిద్యా-

 విశారదో నృపతిం సాధు పృష్టః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ద్వితీయస్కంధే తృతీయోధ్యాయః

ఓ సూతా! పరీక్షిన్మహారాజు చక్కగా ప్రశ్నించినాడు. ఆత్మజ్ఞాన ములో దిట్ట, భగవద్బక్తులలో మొదటివాడు మరియు వ్యాసుని పుత్రుడు అగు శుకమహర్షి ఆయనకు చెప్పిన విషయమును నీవు మాకు చెప్పుము. నీవు చెప్పే మాటలు మా మనస్సులకు ఆనందమును కలిగించుచున్నవి.

శ్రీమద్బాగవత మహాపురాణములోని రెండవ స్కంధములో మూడవ అధ్యాయము ముగిసినది.