భాగవత మహా పురాణము
7 - సప్తమోఽధ్యాయః
బ్రహ్మోవాచ।
యత్రోద్యతః క్షితితలోద్ధరణాయ బిభ్రత్
క్రౌడీం తనుం సకలయజ్ఞమయీమనంతః ।
అంతర్మహార్ణవ ఉపాగతమాదిదైత్యం
తం దంష్ట్రయాద్రిమివ వజ్రధరో దదార ॥
బ్రహ్మ ఇట్లు పలికెను: అనంతుడగు శ్రీహరి భూమండలమును పైకి తీసుకు వచ్చుట కొరకై సకలయజ్ఞస్వరూపమగు వరాహరూపమును దాల్చి సన్నద్ధుడైనాడు. దితియొక్క మొదటి సంతానమైన సుప్రసిద్ధుడగు హిరణ్యాక్షుడు విశాలమగు సముద్రముయొక్క మధ్యలో తన మీదకు రాగా, ఇంద్రుడు వజ్రముతో పర్వతముయొక్క రెక్కలను దునిమిన విధముగా ఆయన వానిని తన కోరతో చీల్చి చంపెను.
జాతో రుచేరజనయత్సుయమాన్ సుయజ్ఞ
ఆకూతిసూనురమరానథ దక్షిణాయామ్ ।
లోకత్రయస్య మహతీమహరద్యదార్తిం
స్వాయంభువేన మనునా హరిరిత్యనూక్తః ॥
ఆ పరమేశ్వరుడు రుచిప్రజాపతికి ఆకూతియందు పుత్రుడై అవతరించి, సుయజ్ఞుడు అను పేరుతో ప్రసిద్ధిని గాంచి, దక్షిణ అనునామెను వివాహమాడి, ఆమెయందు సుయములు అనే దేవతలను కనెను. తరువాత ఆయనయే ఆ దేవతలకు అధీశ్వరుడై ముల్లోకముల ఇడుములను బొపగా, స్వాయంభువ మనువు ఆ కారణముచే ఆయనకు హరి (కష్టములను హరించువాడు) అని పేరు పెట్టెను.
జజ్ఞే చ కర్దమగృ హే ద్విజ దేవహూత్యాం
స్త్రీభిస్సమం నవభిరాత్మగతిం స్వమాత్రే ।
ఊచే యయాత్మశమలం గుణసంగపంక
మస్మిన్ విధూయ కపిలస్య గతిం ప్రపేదే ॥
ఓ నారదా! ఇంకా ఆ శ్రీహరి కర్దముప్రజాపతికి ఓపహుంటదు తొమ్మిది మంది అమ్మాయిల తరువాత జన్మించి, కపిలుడను పేరుతో తన తల్లికి బ్రహ్మవిద్యను ఉపదేశించెను. ఆమె సత్త్వరజస్తమోగుణములతోడి సంగము అనే బురదను, బుద్ధియందలి మాలిన్యమును ఆ జ్ఞానముచే కడి గివేసి అదే జన్మలో కపిలుడు బోధించిన ఆత్మతత్త్వమును పొందెను; అన గో, మోక్షమును పొందెను.
అత్రేరపత్యమభికాంక్షత ఆహ తుష్టో
దత్త మయాఽహమితి యద్భగవాన్ స దత్తః ।
యత్పాదపంకజపరాగపవిత్రదేహా
యోగర్ధిమాపురుభయీం యదు హైహయాద్యాః॥
అత్రి మహర్షి సంతానమును కోరి తపస్సును చేయగా, భగవా నుడు సంతోషించి, నన్ను నేను నీకు ఇచ్చుచున్నాను అని పలికెను. అపు డాయన అత్రికి పుత్రుడై జన్మించి దత్తుడు (ఈయబడినవాడు) అను పేరు (దత్తాత్రేయ) తో ప్రసిద్దిని బడసినాడు. యదు మహారాజు, కార్తవీర్యార్జు నుడు మొదలగువారు ఆయన పాదపద్మముల ధూళీచే పవిత్రములైన దేహములు గలవారై, ఆయన అనుగ్రహముచే ఇహలోకములో అణిమ మొదలగు అష్టసిద్దులను మాత్రమే గాక, దేహమును వీడిన తరువాత మోక్షమును కూడ పొందినారు.
తప్తం తపో వివిధలోకసిసృక్షయా మే
ఆదౌ సనాత్స్వతపసస్స చతుస్సనోఽభూత్ ।
ప్రాకల్పసంప్లవవినష్టమహాత్మతత్త్వం
సమ్యగ్జగాద మునయో యదచక్షతాత్మన్ ॥
నేను సృష్టికి పూర్వము వివిధములగు లోకములను సృష్టించగోరి , తపస్సును చేసి, దానిని శ్రీహరికి సమర్పించితిని. అప్పుడు ఆ సమర్పణ. వలన శ్రీహరి సనత్కుమార సనక సనందన సనాతనులనే నల్గురు దేవ రుల రూపములో అవతరించెను. ఈ అవతారములో ఆయన పూర్వకల్ప ముయొక్క అంతమునందలి ప్రళయములో కనబడకుండా పోయిన ఆత్మ జ్ఞానమును చక్కగా బోధించగా, మహర్షులు ఆయన బోధనలను వింటూనే తమ బుద్ధిలో ఆ ఆత్మస్వరూపమును సాక్షాత్కరించు కొనిరి.
ధర్మస్య దక్షదుహితర్యజనిష్ట మూర్త్యాం
నారాయణో నర ఇతి స్వతపఃప్రభావః ।
దృష్ట్వాత్మనో భగవతో నియమావలేపం
దేవ్యస్త్వనంగపృతనా ఘటితుం న శేకుః ॥
దక్షుని కుమార్తెయగు మూర్తి ధర్ముని భార్య. శ్రీహరి ఆ దంపతులకు సంతానమై నర నారాయణుల రూపములో అవతరించెను. వారి తపస్సు అసాధారణమైనది. దానిలో వారికి వారే సాటి. మన్మథుని సేనలు అన దగిన అప్సరసలు సర్వప్రాణులలో ఆత్మరూపముగానుండే నారాయణుని తపస్సును భంగము చేయుటకు ప్రయత్నించి తామే భంగపడిరి. పైగా, వారు ఆయన వద్దనుండి ఆవిర్భవించి తమను పోలియున్న ఊర్వశి మొద లగు అప్సరసలను కూడ కనుగొనిరి.
కామం దహంతి కృతినో నను రోషదృష్ట్యా
రోషం దహంతముత తే న దహంత్యసహ్యమ్ ।
సోఽయం యదంతరమలం నివిశన్ బిభేతి
కామః కథం ను పునరస్య మనః శ్రయేత ॥
రుద్రుడు మొదలగు మహాత్ములు క్రోధముతో నిండిన చూపుతో కామమును (మన్మథుని) దహించి వేయగల్గుదురు. కానీ, ఆ మహానుభా వులు కూడా సహింప శక్యము కాని వేగముతో తమ హృదయములను దహించి వేయుచున్ననూ ఆ క్రోధమును జయింప లేకున్నారు. అట్టి ఆ క్రోధము నిర్మలమగు నరనారాయణుల అంతఃకరణములో ప్రవేశించుటకై ననూ గడగడ వణికి పోవును. అట్టిచో, వారి హృదయములలో కామము నకు తాను ఎక్కడిది?
విద్ధస్సపత్న్యుదితపత్రిభిరంతి రాజ్ఞో
బాలోఽపి సన్నుపగతస్తపసే వనాని ।
తస్మా అదాద్వృవగతిం గృణతే ప్రసన్నో
దివ్యాః స్తువంతి మునయో మదుపర్యధస్తాత్ ॥
ఉత్తానపాద మహారాజుయొక్క సన్నిధిలో ఆయన కుమారుడగు ధ్రువుని సవతి తల్లి సూటిపోటి మాటలతో గాయపరచగా, ధ్రువుడు పసి ఊడి పరకనక ఈael # #జన్సీన జిక, తీహారిని మెప్పించెను;తనకు ప్రత్యక్షమైన శ్రీహరిని ఆ బాలుడు స్తుతించగా, ఆయన సంతోషిం చి, ఆతనికి ధ్రువపదమును ఇచ్చెను. ఆ పదముయొక్క మహిమను దానికి పైన ఉండే భృగువు మొదలగు దేవర్షులు, దానికి క్రింద ఉండే సప్తర్షులు కూడ కొనియాడుచుందురు.
యద్వేనముత్పథగతం ద్విజవాక్యవజ్ర-
విప్లుష్టపౌరుషభగం నిరయే పతంతమ్ ।
త్రాత్వాఽర్ధితో జగతి పుత్రపదం చ లేభే
దుగ్ధ వసూని వసుధా సకలాని యేన ॥
బ్రాహ్మణశాపము అనే వజ్రము వేన మహారాజుయొక్క పురుషకా రమును, సౌభాగ్యమును నశింప జేసెను. ఆతడు అధర్మమార్గములో నడిచి నరకములో పడబోవుచుండగా, మహర్షుల ప్రార్థనను. ఆలకించి, శ్రీహరి ఆతని పుత్రుడు అగు పృథువు రూపములో అవతరించి, ఆ వేనుని రక్షించెను. పుత్రుడు అనగా పున్నామనరకమునుండి రక్షించువాడు అను పదమును ఆయన ఈ విధముగా జగత్తులో సార్థకము చేసెను. ఇంతేగాక, ఆ అవతారములో ఆయన గోవు రూపములోనున్న పృథివినుండి సమస్త సంపదలను పాల రూపములో పితికెను.
నాభేరసావృషభ ఆస సుదేవిసూనుః
యో వై చచార సమదృగ్ జడయోగచర్యామ్ ।
యత్పారమహంస్యమృషయః పదమామనంతి
స్వస్థ: ప్రశాంతకరణః పరిముక్తసంగః ॥
సుదేవి, నాభుడు అనే దంపతులకు ఈ శ్రీహరి ఋషభుడను పేరుతో కుమారుడై జన్మించెను. సర్వజగత్తు పరబ్రహ్మయే అధిష్ఠానముగా గల మిథ్య అనే సమ్యగ్లర్శనము ఆయనకు గలదు. అందువలననే, ఆయన విషయభోగములయందు ఆసక్తి లేనివాడగుటచే ఇంద్రియములను వాటి నుండి ఉపసంహరించి, ఆత్మస్వరూపనిష్ఠుడై, జడుని వలె కన్పట్టిననూ నిత్యసమాధియందు ఉంటూ జీవనచర్యను గడి పెను. ఋషభయోగీంద్రుని ఈ స్థితి (చిహ్నము) పరమహంసస్వభావమని మహర్షులు వర్ణించుటయే గాక, దానిని తమ జీవితములో అభ్యసించుచున్నారు.
సత్రే మమాస భగవాన్ హయశీరషాఽథో
సాక్షాత్స యజ్ఞపురుషస్తపనీయవర్ణః ।
ఛందోమయో మఖమయోఃఽఖిలదేవతాత్మా
వాచో బభూవురుశతీశ్శ్వసతోకస్య నస్తః ॥
ఇంతేగాక, నేను సత్రయాగమును చేయుచుండగా, యజ్ఞములచే ఆరాధించబడే పరమపురుషుడు, వేదములు యజ్ఞములు మరియు సకలదే వతలు అనే రూపములలో ప్రకటమగువాడు, బంగరు మేని రంగు గల వాడు అగు ఆ శ్రీహరి భగవానుడు సాక్షాత్తుగా హయగ్రీవరూపములో అవ తరించినాడు. గాలిని పీల్చుచున్న ఆ హయగ్రీవుని ముక్కు రంధ్రముల నుండి సుందరమగు వేదవాణి ప్రకటమయ్యెను.
మత్స్యో యుగాంతసమయే మనునోపలబ్ధః
క్షౌణీమయో నిఖిలజీవనికాయ కేతః ।
విస్రంసీతానురుభయే సలిలే ముఖాన్మే
ఆదాయ తత్ర విజహార హ వేదమార్గాన్ ॥
చాక్షుషమన్వంతరము పూర్తి అయి జగత్తు ప్రళయజలములలో మునిగిపోవుచుండగా, శ్రీహరి మత్స్యరూపుడై అవతరించెను. ఆయనను వైవస్వత మనువు కనుగొనెను. ఆ మహామత్స్యము నౌకరూపములోనున్నపృథివిని నిలబెట్టి తద్ద్వారా సకలజీవరాశులకు ప్రాణదానమును చేసి, నా ముఖమునుండి జారిపోయిన వేదములను తిరిగి రాబట్టి, మహాభయంకర మగు ఆ ప్రళయజలములలో విహరించెను.
క్షీరోదధావమరదానవయూథపానా
మున్మథ్ననామమృతలబ్దయ ఆదిదేవః ।
పృష్ఠేన కచ్ఛపవపుర్విదధార గోత్రం
నిద్రాక్షణోఽద్రిపరివర్తకషాణకండూః ॥
అమృతమును పొందగోరిన దేవతలు మరియు రాక్షసనాయకులు కలిసి మందరపర్వతముతో పాల సముద్రమును మథించుచుండగా, ఆదిదే. వుడగు శ్రీహరి కూర్మరూపమును దాల్చి తన వీపుపై ఆ పర్వతమును మోసెను. ఆ పర్వతమును' ఇటునటు త్రిప్పగా కలిగిన రాపిడిచే ఆయనకు వీపుమీది దురద తోలగి పోయి సుఖముగా కొద్ది సేపు నిద్రించే అవకాశము లభించేను.
త్రైవిష్టపోరుభయహా స నృసింహరూపం
కృత్వా భ్రమద్భృకుటిదంష్ట్రాకరాలవస్త్రమ్ ।
దైత్యేంద్రమాశు గదయాఽభిపతంతమారాత్
ఊరౌ నిపాత్య విదదార నఖైః స్ఫురంతమ్ ॥
దేవతలకు వచ్చిన మహాభయమును పోగొట్టే ఆ శ్రీహరి సుడులు తిరుగుచున్న కనుబొమలతో మరియు కోరలతో రాక్షసులకు మాత్రమే గాక. దేవతలకు కూడ భయమును గొల్పే ముఖము గల నరసింహావతారమును దాల్చి, అట్టహాసమును చేయుచున్నవాడై, గదను చేతబట్టి తన మీదకు కదము తొక్కుతూ దుముకుచున్న రాక్షసరాజగు హిరణ్యకశిపుని శీఘ్ర ముగా పట్టి తొడపై వేసుకొని గోళ్లతో చీల్చివేసెను.
అంతస్సరస్యురుబలేన పదే గృహీతో
గ్రా హేణ యూథపతిరంబుజహస్త ఆర్తః ।
ఆ హేదమాదిపురుషాఖిలలోకనాథ
తీర్థ శ్రవః శ్రవణమంగలనామధేయ ॥
గజేంద్రుని సరస్సు మధ్యలో మహాబలశాలియగు మొసలి కాలి యందు పట్టి లాగుచుండెను. అపుడాతడు గొప్ప దుఃఖమును పొందినవా డై, తొండముతో పద్మమును పట్టుకొని ఆ పరమేశ్వరునితో ఇట్లు మొర పె ట్టుకొనెను: ఓ ఆదిపురుషా! సర్వజగన్నాథా! నీ కీర్తి జీవులను పవిత్రము చేయును. నీ నామమును విన్నంత మాత్రాన జీవులకు మంగళములు కలుగును.
శ్రుత్వా హరిస్తమరణార్థినమప్రమేయః
చక్రాయుధః పతగరాజభుజాధిరూఢః ।
చక్రేణ నక్రవదనం వినిపాట్య తస్మాత్
హస్తే ప్రగృహ్య భగవాన్ కృపయోజ్జహార ॥
ఇంద్రియములకు మరియు బుద్ధికి గోచరము కానివాడు, సుదర్శ నచక్రము ఆయుధముగా గలవాడు అగు శ్రీహరి భగవానుడు తనను శరణు జొచ్చిన ఆ గజేంద్రుని మొరను విని, దయతో పక్షిరాజగు గరుత్మం తుని భుజమునధిష్టించి వచ్చి, ఆ గజేంద్రుని తొండముతో పట్టుకొని, చక్ర ముతో మొసలి నోటిని చీల్చివేసి, దానిలో చిక్కుకొనియున్న గజేంద్రుని పాదమును విడిపించి, ఆతనిని ఒడ్డునకు తెచ్చి రక్షించెను.
జ్యాయాన్ గుడైరవరజోప్యదితేస్సుతానాం
లోకాన్ విచక్రమ ఇమాన్ యదథాధియజ్ఞః ।
క్ష్మాం వామనేన జగృహే త్రిపదచ్చలేన
యాచ్ఞామృతే పథి చరన్ ప్రభుభిర్న చాల్యః ॥
యజ్ఞములకు ప్రభువగు శ్రీహరి అదితికి పుత్రుడై అవతరించెను. ఆయన ఆమె పుత్రులందరిలో చిన్నవాడైననూ, గుణములలో దిట్టయే. ఆ వామనుడు బలిచక్రవర్తి చేయుచున్న యజ్ఞమునకు వెళ్లి మూడు అడుగుల భూమిని ఆ చక్రవర్తినుండి దానముగా పొందెను. ఆ చక్రవర్తి మాట ఇచ్చిన మరుక్షణమే ఆయన మూడు అడుగులతో ముల్లోకములను కొలిచివేసి, ఆ నెపముతో ఆతని రాజ్యమును తన వశము చేసుకొనెను. దీనిని బట్టి ఒక విషయము స్పష్టమగుచున్నది. సన్మార్గములో నడిచే వ్యక్తిని, యాచనకు పాల్పడకుండగా, తన స్థానమునుండి చలింప జేయుట ఎంతటి సమర్థులకై ననూ సంభవము కాదు.
నార్థో బలేరయమురుక్రమపాదశౌచ-
మాపశ్శిఖా ధృతవతో విబుధాధిపత్యమ్ ।
యో వై ప్రతిశ్రుతమృతే న చికీర్షదన్యత్
ఆత్మానమంగ శిరసా హరయేఽభిమెనే ॥
ఓ నారదా! విస్తారమగు పాదన్యాసము గల శ్రీహరియొక్క పాద ములను కడిగి ఆ నీటిని ఆదరముతో శిరస్సు పై అంతటా ధరించిన బలి చక్రవర్తికి దేవలోకప్రభుత్వము పురుషార్థము (నిశ్చితముగా కోరి సంపా దించ దగినది) కాదు. ఆ బలి మూడు అడుగులను ఇచ్చేదనని తాను చేసిన ప్రతిజ్ఞకు వ్యతిరేకముగా మరియొక విధముగా చేయుటకు శుక్రాచా ర్యుడు ప్రేరేపించిననూ ఇష్టపడలేదు. ఆయన శిరస్సును వంచి శ్రీహరి యొక్క మూడవ అడుగునకు తన దేహమును సమర్పించిన మహాత్ముడు.
తుభ్యం చ నారద భృశం భగవాన్ వివృద్ద-
భావేన సాధు పరితుష్ట ఉవాచ యోగమ్ ।
జ్ఞానం చ భాగవతమాత్మసతత్త్వదీపం
యద్వాసుదేవశరణా విదురంజసైవ ॥
ఓ నారదా! శ్రీహరిభగవానుడు నీయొక్క మిక్కిలి ఉద్రిక్తమైన భక్తికి సంతసిల్లినవాడై హంసరూపములో అవతరించి. నీకు భక్తియోగము ను, ఆత్మస్వరూపమును ప్రకాశింపజేసే జ్ఞానమునకు సాధనమగు భాగవ తధర్మమును చక్కగా బోధించినాడు. వాసుదేవుని శరణు పొందిన భక్తులు మాత్రమే దీనిని అనాయాసముగా తెలియ గల్గుదురు.
చక్రం చ దిక్ష్వవిహతం దశసు స్వతేజో
మన్వంతరేషు మనువంశధరో బీభర్తీ ।
దుష్టేషు రాజసు దమం వ్యదధాత్స్వకీర్తిం
సత్యే త్రిపృష్ఠ ఉశతీం ప్రథయంశ్చరితైః ॥
శ్రీహరి ఆయా మన్వంతరములయందు మనువు రూపములో అవతరించి మనువంశమును రక్షించువాడై, ఎదురు లేని తన తేజస్సును సుదర్శనచక్రమును వలె పది దిక్కులయందు ప్రసరింప జేసి ప్రాణులను పాలించి పోషించుచున్నాడు. ఇంతేగాక, దుష్టులగు రాజులను శిక్షించి, వివి ధములగు చరితములను చేయుచూ, తన మనోహరమగు కీర్తిని ముల్లోక ములలో మాత్రమే గాక వాటికి పైన ఉండే సత్యలోకములో కూడ వ్యాపింప జేసినాడు.
ధన్వంతరిశ్చ భగవాన్ స్వయమేవ కీర్తి:
నామ్నా స్రుణాం పురురుజాం రుజ ఆశు హంత।
యజ్ఞే చ భోగముడుతాయురహోవరుంధ
ఆయుశ్చ వేదమునుశాస్త్యవతీర్య లోకే ॥
శ్రీహరిభగవానుడు లోకమునందు ధన్వంతరియై అవతరించి గొప్ప కీర్తిని పొందెను. ఆయన పేరు చెప్పినంత మాత్రాన మానవుల పెద్ద పెద్ద రోగములు వెంటనే నయమగును. ఆయన దేవతలకు అమృతమును జరామరణములు లేని జీవనమును ఇచ్చి, తననుండి అపహరించబడిన యజ్ఞభాగములను తిరిగి పొందెను. ఆయన లోకములో ఆయుర్వేదమును ప్రవర్తిల్ల జేసెను.
క్షత్రం క్షయాయ విధానోపభృతం మహాత్మా
బ్రహ్మధ్రుగుజ్ఘితపథం నరకార్తిలిప్సు ।
ఉద్ధంత్యసావవనికంటకముగ్రవీర్యః
త్రిస్సప్తకృత్వ ఉరుధారపరశ్వధేన ॥
ఒక సమయములో క్షత్రియజాతి బ్రాహ్మణులను ద్వేషిస్తూ వేద మార్గమును విడనాడి, నరకములోని పీడలను పొందగోరుచున్నదాయన్నట్లు వర్తిల్లెను. ఈ విధముగా దురదృష్టవశాత్తు సమాజమునకు కంటక ములవలే తయారైన ఆ దుష్టరాజన్యుల సమూహము వినాశపు అంచులకు నెట్టివేయబడి యుండెను. అప్పుడు పరమాత్మయగు శ్రీహరి భయంకర మగు పరాక్రమము గల పరశురాముడై అవతరించి పొడవైన వాడి అంచు గల గండ్ర గొడ్డలితో ఇరవై ఒక్క పర్యాయములు వారిని సంహరించి నీర్మూలము చేసెను.
అస్మత్పృసాదసుముఖః కలయా కలేశ
ఇక్ష్వాకువంశ అవతీర్య గురోర్నిదేశే ।
తిష్ఠన్ వనం సదయితానుజ ఆవివేశ
యస్మిన్ విరుధ్య దశకంధర ఆర్తిమార్ఛత్॥
మనలను అనుగ్రహించుటకై సర్వదా సుముఖుడుగానుండే మాయాధీశ్వరుడగు శ్రీహరి భరతుడు మొదలగు అంశలతో గూడి ఇక్ష్వా కువంశమునందు శ్రీరాముని రూపములో అవతరించెను. ఆయన తన తండ్రియగు దశరథుని మాటను నిలబెట్టుటకై తమ్ముడగు లక్ష్మణునితో మరియు భార్యయగు సీతతో గూడి అడవికి వెళ్లాను. అచట రావణుడు ఆయనతో విరోధమును బూని వినాశమును పొందెను.
యస్మా అదాదుదధిరూఢభయాంగవేపో
మార్గం సపద్యరిపురం హరవద్దిధక్షోః ।
దూరేసుహృన్మథితరోషసుశోణదృష్ట్యా
తాతప్యమానమకరోరగనక్రచక్రః ॥
శ్రీరాముడు రుద్రుని వలె శత్రువగు రావణుని నగరమును దహింప గోరుచుండెను. ఆయనకు దారిలో అడ్డముగా నిలచిన సముద్రు నకు ఆ కారణముగా భయము ఏర్పడి, ఆయన శరీరములో కంపము పుట్టు చుండెను. తన ప్రియురాలగు సీతాదేవి తనకు దూరముగా నున్నదనే భావన మాత్రముచే శ్రీరాముని హృదయము క్షుభితమై కోపము చెలరేగు చుండెను. ఆ కోపము వలన ఆయన కన్నులు ఎర్రగా నుండెను. అట్టి కన్ను లతో ఆయన చూచుచుండగా ఏర్పడిన తాపమును మొసళ్లు పాములు తిమింగలములు మొదలగు సముద్రజంతువులు సహింప లేకుండెను. అపుడు సముద్రుడు వెంటనే శ్రీరామునకు దారిని ఇచ్చెను.
వక్షఃస్థలస్పర్శరుగ్ణమహేంద్రవాహ-
దంతైర్విడంబితకకుబ్జుష ఊడహాసమ్ ।
సద్యోఽసుభిస్సహ వినేష్యతి దారహర్తుః
విస్ఫూర్జితైర్ధనుష ఉచ్చరత్వోఽది సైన్యే ॥
రావణుడు మహేంద్రుని యుద్దమును చేసిన సందర్భములో ఇంద్రుని వాహనమగు ఐరావతమనే ఏనుగుయొక్క దంతములు వాని వక్షః స్థలమునకు తగిలి ఆ తాకిడికి విరిగి పడినవి. ఆ దంతముల శకలములచే తెల్లగా చేయబడిన దిక్కులను రావణుడు పాలించును. అట్టి రావణుడు గర్వముతో అట్టహాసమును చేయుచూ, సైన్యమధ్యములో గంభీరముగా ఇటునటు సంచరించుచుండగా, శ్రీరాముడు కేవలము తన ధనస్సు యొక్క టంకారధ్వనులచే మాత్రమే వానీ అట్టహాసమును, దానితో పాటు ప్రాణములను కూడ వెంటనే తుడిచి పెట్టగలడు.
భూమేస్సురేతరవరూథవిమర్ధితాయాః
క్లేశవ్యయాయ కలయా సీతకృష్ణ కేశః ।
జాతః కరిష్యతి జనానుపలక్ష్యమార్గః
కర్మాణి చాత్మమహిమోపనిబంధనాని ॥
రాక్షసుల అంశలచే జన్మించిన రాజులు మరియు వారి సైన్యము భూమికి పెనుభారముగా తయారైనప్పుడు, భూదేవియొక్క భారమును నశింప జేయగోరి, భగవానుడు బలరామకృష్ణుల రూపములో అవతరించు ను. ఆయనయొక్క తెల్లని కేశములు ప్రకాశించే దేహవర్ణము గల బలరా ముడుగను, నల్లని కేశములు నల్లనయ్యగను అవతరించును. ఆయన సాక్షాత్తుగా పరమేశ్వరుడే యను విషయము సామాన్యజనులకు తెలియదు. ఆయన ఆ విధముగా గుప్తముగా నున్ననూ, తన మహిమను ప్రక టించే అనేకములగు లీలలను నెరపును.
తోకేన జీవహరణం యదులూకికాయాః
త్రైమాసికస్య చ పదో శకటోఽపవృత్తః ।
యద్రింగత్వాంఽతరగతేన దివిస్పృశోర్వా
ఉన్మూలనం త్వతరథాఽర్జునయోర్న భావ్యమ్ ॥
శ్రీకృష్ణుడు పిల్లవాడుగా నుండగనే పూతన అనే రాక్షసిని సంహ రించును. మూడు మాసముల వయస్సులో ఆయన బండిని తల్లక్రిందులు చేయును. మోకాళ్లపై పాకే వయస్సులో మిక్కిలి ఎత్తైన జంట మద్ది చెట్ల మధ్యలో దూరి వాటిని నేల గూల్చును. ఆయన అవతారపురుషుడు కానిచో, ఈ సర్వము సంభవము కాబోదు.
యద్వై ప్రజే ప్రజపశూన్ విషతోయపీథాన్
పాలాంస్త్వజీవయదనుగ్రహదృష్టివృష్ట్యా ।
తచ్చుద్ధయేఽతివిషవీర్యవిలోలజిహ్వం
ఉచ్చాటయిష్యదురగం విహరన్ హ్రదిన్యామ్ ॥
నందగోకులములో విషజలమును త్రాగిన పశువులను, వాటి పాల కులను శ్రీకృష్ణుడు తన అనుగ్రహముతో కూడిన చూపులతో జీవింప జేసి, తరువాత యమునా నదిని శుద్ధి చేయుట కొరకై దానియందు విహరిస్తూ, విషబలముచే 'మిక్కిలి చంచలమైన జిహ్వలు గల సర్పరాజును అచట నుండి వెళ్లగొట్టును. ఇది సామాన్యమానవుడు చేయగలిగే పని కాదు.
తత్కర్మ దివ్యమివ యన్నిశి నిశ్శయానం
దావాగ్నినా శుచివనే పరిదహ్యమానే ।
ఉన్నేష్యతి ప్రజముత్వోఽవసితాంతకాలం
నేత్రే పిధాయ్య సబలోఽనధిగమ్యవీర్యః ॥
నందగోకులములోని జనులందరు ఒకనాటి రాత్రి గాఢనిద్రలో నుండగా, వేసవి వేడికి ఎండి ఉన్న. అడవిలో దావాగ్ని పుట్టి నలువైపులా ప్రసరించును. దాని మూలకముగా ఆ ప్రజవాసులకు మృత్యువు నిశ్చ - యమనే పరిస్థితి దాపురించును. ఇంతలో, ఊహింప శక్యము కాని పరాక్ర మము గల శ్రీకృష్ణభగవానుడు బలరామునితో గూడి వారిని కళ్లను - మూసుకొనమని చెప్పి, వారినందరినీ ఆ దావాగ్నినుండి రక్షించును. ఇది ఖచ్చితముగా అలౌకికమగు లీలయే సుమా!
గృహ్ణీత యద్యదుపబంధమముష్య మాతా
శుల్బం సుతస్య న తు తత్తదముష్య మాతి ।
యజ్జృంభతోఽస్య వదనే భువనాని గోపీ
సంవీక్ష్య శంకితమనాః ప్రతిబోధితాసీత్ ॥
బాలకుడగు శ్రీకృష్ణుని అల్లరిని కట్టుబాటు చేయగోరి తల్లియగు యశోద ఆతనిని త్రాడుతో కట్టివేయుటకు యత్నించెను. కానీ, ఆమె ఏ త్రాడును తెచ్చిననూ, అది ఆతని నడుమునకు సరిపడకుండెను. మరియు, ఆమె ఒకనాడు ఆ పిల్లవాడు ఆవులించుచుండగా నోటిలో పదునాలుగు భువనములను కనెను. ఆమె హృదయము శంకతో నిండిపోయెను. కాని, ఇంతలో ఆమెకు ఆ బాలకుడు ఈశ్వరావతారమనే సత్యము అవగాహనకు వచ్చేను. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు కానిచో, ఈ లీలలు సంభవమయ్యెడివి కావు.
నందం చ మోక్ష్యతి భయాద్వరుణస్య పాశాత్
గోపాన్ బిలేషు పిహితాన్మయసూనునా చ ।
అహ్న్యాపృతం నిశి శయానమతిశ్రమేణ
లోకే వికుంఠ ఉపనేష్యతి గోకులం స్మ ॥
శ్రీకృష్ణుడు వరుణపాశము వలన కలిగిన భయమునుండి నందుని రక్షించగలడు. మయుని పుత్రుడగు వ్యోమాసురుడు గోపాలకులను గుహ లలో దాచి పెట్టగా, శ్రీకృష్ణుడు వారిని విడిపించును. గోకులములోని జనులు పగలు లౌకికవ్యవహారములలో తలమున్కలై రాత్రియందు అలసి నిద్రించెదరు. అనగా, వారికి సాధనలను చేసే అవకాశము లేదు. అయిన నూ, భగవానుడు పొరికి తన నిత్యనివాసమగు వైకుంఠము (మోక్షము) ను అనుగ్రహించును.
గోపైర్మఖే ప్రతిహతే వ్రజవిప్లవాయ
దేవేఽభివర్షతి పశూన్ కృపయా రిరక్షుః ।
ధర్తోచ్ఛిలీంధ్రమివ సప్తదినాని సప్త-
వర్షో మహీధ్రమనఘైకకరే సలీలమ్ ॥
గోపాలకులు ప్రతిసంవత్సరము చేసే ఇంద్రయాగమునకు శ్రీకృ ష్ణుడు విఘ్నమును కలిగించగా, కోపించిన ఇంద్రుడు గోకులమును ముంచెత్తి వినాశము చేయుట కొరకై అధికముగా వర్షించును. అప్పుడు ఆయన వయస్సు ఏడు సంవత్సరములు మాత్రమే. అయిననూ, ఆయన పశువులను మరియు అమాయకులగు జనులను రక్షించగోరి, గోవర్ధన పర్వతమును ఎత్తైన కుక్క గొడుగును వలె సునాయాసముగా ఒంటి చేతితో పైకెత్తి ఏడు రోజులు నిలబెట్టి ఉంచును.
క్రీడన్ వనే నిశి నిశాకరరశ్మిగౌర్యాం
రాసోన్ముఖః కలపదాయతమూర్చితేన ।
ఉద్దీపితస్మరరుజాం వ్రజభృద్వధూనాం
హర్తుర్హరిష్యతి శిరో ధనదానుగస్య ॥
రాత్రియందు చంద్రుని కిరణములచే తెల్లగా ప్రకాశించే అడవిలో శ్రీకృష్ణుడు విహరిస్తూ రాసక్రీడకు సంసిద్దుడగుచుండెను. ఆయన తన మురళిపై మధురమగు పదములు మరియు దీర్ఘమగు ఆలాపన కలిగిన గీతమును గానము చేయగా, దానిచే వర్ధిల్లజేయబడిన మన్మథతాపము గల గోపికలను కుబేరుని అనుచరుడగు శంఖచూడుడు అపహరించును. అపుడాయన వాని తలను నరికి వేయగలడు.
యే చ ప్రలంబఖరదర్దుర కేశ్యరిష్ట-
మల్లేభకంసయవనాః కుజపౌండ్రకాద్యాః ।
అన్యే చ శాల్వకపిబల్వలదంతవక్తృ-
సప్తోక్షశంబరవిదూరథరుక్మిముఖ్యాః ॥
యే వా మృధే సమితిశాలిన ఆత్తచాపాః
కాంబోజమత్స్యకురుకైకయసృంజయాద్యాః ।
యాస్యంత్యదర్శనమలం బలభీమపార్థ-
వ్యాజాహ్వయేన హరిణా నిలయం తదీయమ్ ॥
ప్రలంబాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, కేశి, అరిష్టాసు రుడు, చాణూరుడు మొదలగు మల్లవీరులు, కువలయాపీడమనే ఏనుగు, కంసుడు, కాలయవనుడు, నరకాసురుడు, పౌండ్రకుడు, శాల్వుడు, ద్వివి దుడనే కోతి, బల్వలుడు, దంతవక్తూడు, నగ్నజిత్, యొక్క ఏడు ఎద్దులు, శంబరాసురుడు, విదూరథుడు, రుక్మి మొదలగువారు, కాంబోజ-మత్స్య -కురు-కైకయ-సృంజయదేశాధిపతులు మరియు ఇతరులు యుద్ధరంగ ములో ధనస్సులను ఎక్కు పెట్టి బీరములను పలికెదరు. వారిని బలరాము డు, భీముడు, అర్జునుడు అనే రూపములలో శ్రీకృష్ణుడు సంహరించగా, వారు ఆయనయందు లయమగుదురు. శ్రీకృష్ణుడు వారికి తన దివ్యధామ మగు వైకుంఠమును (మోక్షమును) అనుగ్రహించును.
కాలేన మీలితధియామవమృశ్య నృణాం
స్తోకాయుషాం స్వనిగమో బత దూరపారః ।
ఆవిర్హితస్త్వనుయుగం స హి సత్యవత్యాం
వేదద్రుమం విటపశో విభజిష్యతి స్మ ॥
కలికాలముయొక్క ప్రభావముచే మానవుల బుద్ధిశక్తి సంకుచితమ గును. మరియు వారికి ఆయుర్ధాయము కూడ తక్కువే. కావున, వారు అపారమగు వేదరాశిని అధిగమించలేరు. అయ్యో! అని ఆలోచించిన శ్రీహరి సత్యవతియందు వ్యాసుని రూపముగా అవతరించి, యుగధర్మము వకు తగిన విధముగా వేదమనే మహావృక్షమును శాఖల రూపములో విభా గము చేయగలడు.
దేవద్విషాం నిగమవర్త్మని నిష్ఠితానాం
పూర్బీర్మయేన విహితాభిరదృశ్యతూర్బిః ।
లోకాన్ ఘృతాం మతివిమోహమతిప్రలోభం
వేషం విధాయ బహు భాష్యత ఔపధర్మ్యమ్ ॥
మయుడు త్రిపురాసురులకు కంటికి కానరాని వేగము గల మూడు నగరములను నిర్మించి ఇచ్చును. వారు వేదమార్గమునందు నిష్ఠ గలవారే అయిననూ, ఆ నగరములను ఆశ్రయించుకొని లోకములను హింసించు చుందురు. వారికి బుద్ధియందు వ్యామోహమును కలిగించి వారి బుద్ధికి తప్పు మార్గమునందు లాలసత్వమును కలిగించుట కొరకై శ్రీహరి పాఖం డవేషమును దాల్చి నాస్తికసిద్ధాంతమును అధికముగా బోధించగలడు.
యర్హ్యాలయేష్వపి సతాం న హరేః కథాస్స్యుః
పాఖండినో ద్విజజనా వృషలా నృదేవాః ।
స్వాహా స్వధా వషడితి స్మ గిరో న యత్ర
శాస్తా భవిష్యతి కలేర్భగవాన్ యుగాంతే ॥
కలియుగము అంతమయ్యే కాలములో సత్పురుషుల ఇళ్లలో కూడ శ్రీహరి గాథలను వినుటకు అవకాశము లేని విధముగా ఆటంక ములు ఉండును. ఉపనయనసంస్కారమును పొందదగిన జనులు వేదనీం దకులు అగుదురు. రాజులు అధర్మమార్గములో పాలించెదరు. ఎక్కడై ననూ స్వాహా స్వధా వషట్ అనే పదములు వినబడవు. అనగా, యజ్ఞ ములు, పితృకర్మలు లుప్తమై పోవును, అట్టి కాలములో శ్రీహరి కల్కిభగ వానుని రూపములో అవతరించి అధర్మమును నశింప జేయగలడు.
సర్గే తపోఽహమృషయో నవ యే ప్రజేశాః
స్థానే చ ధర్మమఖమన్వమరావనీశాః ।
అంతే త్వధర్మహరమన్యువశాసురాద్యా
మాయావిభూతయ ఇమాః పురుశక్తిభాజః ॥
సృష్టియందు తపస్సు, నేను, మరీచి మొదలగు తొమ్మిదిమంది మహర్షులు, దక్షుడు మొదలగు ప్రజాపతులు, స్థితియందు ధర్మము, విష్ణువు, మనువు, దేవతలు మరియు రాజులు, సంహారమునందు అధర్మ ము, రుద్రుడు, క్రోధవశములనే సర్పములు, రాక్షసులు మొదలగు వారు అనంతశక్తిసంపన్నుడగు ఆ పరమేశ్వరుని మాయయొక్క విభూతుల రూప ములో ప్రకటమగుచున్నారు.
విష్ణోర్ను వీర్యగణనాం కతమోఽర్హతీహ
యః పార్థివాన్యపి కవిర్విమమే రజాంసి ।
చస్కంభ యస్స్వరంహస్వాఽస్ఖలతా త్రిపృష్ఠం
యస్మాత్ప్రిసామ్యసదనాదురు కంపయానమ్ ॥
ఈ లోకములో శ్రీహరియొక్క పరాక్రమమును లెక్క వేయగల మొనగాడెవ్వడు గలడు? భూమియొక్క ధూళికణములనన్నింటినీ లెక్క వేసిన మహాబుద్ధిశాలియైననూ శ్రీహరియొక్క పరాక్రమములను లెక్కించ. లేడు. ఏలయనగా, ఆయన త్రివిక్రమావతారములో ముల్లోకములను తొట్రు పాటు లేని తన పాదములతో వేగముగా కొలుచుచుండగా, ప్రకృతియొక్క ఆవరణతో మొదలు పెట్టి ముల్లోకములు మరియు వాటికి పైన ఉండే సత్య .. లోకముతో సహా సర్వము అధికముగా కంపింప జొచ్చెను. అపుడాయన దానిని స్థిరము చేసి నిలబెట్టెను.
నాంతం విదామ్యహమమీ మునయోఽగ్రజాస్తే
మాయాబలస్య పురుషస్య కుత్వోఽపరే యే ।
గాయన్ గుణాన్ దశశతానన ఆదిదేవః
శేషోఽధునాపి సమవస్యతి నాస్య పారమ్ ॥
సృష్టిస్థితిసంహారకారణమగు మాయ శ్రీహరియొక్క శక్తి. ఆ శక్తి యొక్క అంతమును నేను గాని, నీ అన్నలగు మరీచి మొదలగు మహర్షులు గాని తెలియలేకున్నారు. ఇక ఇతరుల గురించి చెప్పునదేమున్నది? వేయి పడగలు గల ఆదిదేవుడగు శేషుడు ఆ శ్రీహరి గుణములను గానము చేయుచునే యున్నాడు. అయిననూ, ఇప్పటికి కూడా ఇంకనూ అంతము చేరుకొనలేదు.
యేషాం స ఏవ భగవాన్ దయయేదనంతః
సర్వాత్మనాశ్రితపదో యది నిర్వ్యలీకమ్ ।
తే దుస్తరామతితరంతి చ దేవమాయాం ।
నైషాం మహమితి ధీశ్శ్వశృగాలభ క్ష్యే ॥
ఎవరైతే కపటము లేకుండగా ఏకాగ్రమగు మనస్సుతో ఆ అనంత భగవానుని పాదములను ఆశ్రయించెదరో, వారియందు ఆయన నిశ్చయముగా దయను చూపును. ఆ కారణముగా మిక్కిలి క్లేశముతో మాత్రమే తరించ శక్యమయ్యే దేవమాయను వారు అతిక్రమించెదరు. కుక్కలకు నక్కలకు ఆహారముగా పనికి వచ్చే ఈ దేహమునందు వారికి ఇది నాది, ఇది నేను అనే వ్యామోహము ఉండదు.
వేదాహమంగ పరమస్య హి యోగమాయాం
యూయం భవశ్చ భగవానథ దైత్యవర్యః ।
పత్నీ మనోస్స చ మనుశ్చ తదాత్మజశ్చ
ప్రాచీనబర్హి ఋభురంగ ఉత ధ్రువశ్చ ॥
ఇక్ష్వాకురైలముచుకుందవిదేహగాధి-
రఘ్వంబరీషసగరా గయనాహుషాద్యాః ।
మాంధాత్రలర్కశతధన్వనురంతిదేవా
దేవవ్రతో బలిరమూర్తయో దిలీపః ॥
సౌభర్యుతంకశిబిదేవలపిప్పలాద-
సారస్వతోద్ధవపరాశరభూరి షేణాః ।
యేన్యే విభీషణహనూమదు పేంద్రదత్త-
పార్థార్ష్టి షేణవిదురశ్రుతదేవవర్యాః ॥
ఓయీ నారదా! పరమపురుషుడగు శ్రీహరియొక్క మాయను నేను, నీవు, నీ అన్నలగు సనకాదులు, శివ భగవానుడు, రాక్షసవంశశ్రేష్టు డగు ప్రహ్లాదుడు, స్వాయంభువ మనువు, ఆయన పత్నియగు శతరూప, వారి పుత్రులగు ప్రియవ్రత-ఉత్తానపాదులు, వారి పుత్రికయగు దేవహూతి, ప్రాచీనబరీషుడు అనే ప్రజాపతి, ఋభుడు అనే సిద్దుడు, అంగుడు, ధ్రువు డు, ఇక్ష్వాకు మహారాజు, ఇలుని పుత్రుడగు పురూరవుడు, ముచుకుందు డు, జనక మహారాజు, గాధి, రఘు" మహారాజు, అంబరీషుడు, సగరుడు, గయుడు, నహుషుని పుత్రుడగు యయాతి, మాంధాత, అలర్కుడు, శతధ న్వుడు, అనువు, రంతిదేవుడు, భీష్మ పితామహుడు, బలి చక్రవర్తి, అమూ గ్రరయుడు, దిలీపుడు, సౌభరి, ఉత్తంకుడు, శిబి చక్రవర్తి, దేవల మహర్షి, పిప్పలాదుడు, సారస్వతుడు, ఉద్ధవుడు, పరాశరుడు, భూరి షేణుడు, విభీ షణుడు, హనుమంతుడు, శుకదేవుడు, అర్జునుడు, ఆర్ష్టిషేణుడు, దురుడ, శ్రుతదేవుడు మొదలగు ఎందరో మహానుభావులు తెలుసుకున్నారు.
తే వై విదంత్యత్తరంతి చ దేవమాయాం
స్త్రీశూద్రహూణశబరా అపి పాపజీవాః ।
యద్యద్బుతక్రమపరాయణశీలశిక్షాః
తిర్యగ్జనా అపి కిము శ్రుతధారణా యే ॥
స్త్రీలు, శూద్రులు, హూణులు భిల్లులు మాత్రమే గాక, పాపపపీల మగు జీపనము గల మానవులు మరియు ఏనుగు మొదలగు జంతువులు కూడ శ్రీహరి భక్తులను సేవించి వారివద్ద భగవచ్చింతనమును నేర్చిన పక్ష ములో నిశ్చయముగా దేవమాయను తెలుసుకొని, దానిని అతిక్రమించెద రు. ఇట్టి స్థితిలో వేదవేత్తల గురించి చెప్పునదేమున్నది? ఆ భగవానుడు వామనావతారములో ముల్లోకములను తన పాదములతో అత్యద్భుత ముగా కొలిచి వేసినాడు.
శశ్వత్ప్రశాంతమభయం ప్రతిబోధమాత్రం
శుద్ధం సమం సదసతః పరమాత్మతత్త్వమ్ ।
శబ్దో న యత్ర పురుకారకవాన్ క్రీయార్ధో
మాయా పరైత్యభిముఖే చ విలజ్జమానా ॥
తద్వై పదం భగవతః పరమస్య పుంసో
బ్రహ్మేతి యద్విదురజస్రసుఖం విశోకమ్ ।
సద్య్రజ్ నియమ్య యతయో యమకర్తహేతం
జహ్యుస్స్వరాడిన నిపానఖనిత్రమింద్రః ॥
వచ్చి పోయే సుఖదుఃఖముల బెడద లేని నిత్యప్రసన్నస్వరూప ము, భయమునకు తావు లేనిది, జ్ఞానఘనము, సంసారముయొక్క సంగ ము అనే దోషము లేనిది, భేదము లేనిది, కార్యకారణములకు అతీతమైన ది, జ్ఞాతయొక్క స్వరూపమగు ఆత్మయైనది, సదానంద స్వరూపము, శోక సంస్పర్శ లేనిది అగు పరబ్రహ్మతత్త్వమే పరమపురుషుడగు శ్రీహరి భగ వానుని ధామము (స్వరూపము) అని మహర్షులు తెలియుచున్నారు. అనే కకారకముల (క్రియాసాధనముల) తో గూడిన యజ్ఞయాగాది కర్మలను బోధించే వేదవాక్కు ఆ బ్రహ్మను ఇదమిత్తముగా బోధించలేదు. ఈ పర మాత్మతత్త్వము ఆప్యము (పయనించి పొందదగినది), సంస్కార్యము (సం స్కారకర్మచే సంపాదించ దగినది), వికార్యము (మార్పు వచ్చుటచే లభిం చేది), ఉత్పాద్యము (కోత్తగా నిర్మించ దగినది) అనే నాలుగు రకముల కర్మఫలము కాదు. ఈ ఆత్మజ్ఞానముయొక్క సన్నిధిలో మాయాదేవి సిగ్గు పడి దూరముగా తొలగి పోవును. అనగా, ఆత్మజ్ఞానికి సంసారబంధము లేడు. తన స్వరూపమైన జలపూర్ణమగు మేఘముయొక్క రూపములో ప్రకాశించే ఇంద్రునకు నూతిని తవ్వే గునపముతో ఏ విధముగానైతే ప్రయో జనము లేదో, అదే విధముగా దీనియందు ప్రతిష్టితమైన మనస్సులు గల యతీంద్రులకు భేదమును నిషేధించే జ్ఞానసాధనములతో పని లేదు.
స శ్రేయసామపి విభుర్భగవాన్ యతోస్య
భావస్వభావవిహితస్య సతః ప్రసిద్ధిః ।
దేహే స్వధాతువిరమ్యేను విశీర్యమాణే
వ్యోమేవ తత్ర పురుషో న విశీర్యతేజః ॥
మానవులు తమ స్వభావమునకు అనురూపముగా చేసే శుభకర్మలు ప్రేరకుడగు ఆ పరమేశ్వరుని వలన మాత్రమే చక్కగా ఘటిల్లు చున్నవి. కర్మల ఫలమగు మంగళములను ఇచ్చే ప్రభుడు ఆయనయే. మహత్తు మొదలగు తత్త్వముల పరిణామము వలన ఉత్పన్నమయ్యే ఈ కార్యజగత్తుయొక్క ఉనికి ఆయనయందు మాత్రమే గలదు. మజ్జ, మాంసము మొదలగు ధాతువుల కలయికచే ఏర్పడిన ఈ దేహము శిథి లమై పోయిననూ, దానియందలి ఆకాశము ఏ విధముగానైతే వికారమును పొందదో, అదే విధముగా ఆ దేహమును ప్రకాశింపజేసిన జన్మమరణరహి తుడగు చేతనపురుషుడు ఆ దేహముతో బాటు శిథిలము కాబోడు.
సోయం తేఃభిహితస్తాత భగవాన్ విశ్వభావనః ।
వత్సా! జగత్తును సృష్టించే శ్రీహరి భగవానుని గురించి నేను నీకు సంక్షేపముగా చెప్పితిని. కార్యకారణరూపమగు ఈ జగత్తు జగత్కారణ మగు శ్రీహరికంటె భిన్నముగా లేదు. కాని, శ్రీహరి జగత్తుకంటే విలక్షణ మగు చేతనఘనుడై భాసించుచున్నాడు.
ఇదం భాగవతం నామ యన్మే భగవతోదితమ్ ।
సంగ్రహోయం విభూతీనాం త్వమేతద్విపులీకురు ॥
ఈ భాగవతమని ప్రసిద్ధిని గాంచిన శాస్త్రమును శ్రీహరి నాకు ఉపదేశించినాడు. దీనియందు భగవానుని మహిమలు సంగ్రహముగా వర్ణించబడినవి. దీనిని నీవు విస్తారముగా వర్ణించుము.
యథా హరౌ భగవతి నృణాం భక్తిర్బవిష్యతి ।
సర్వాత్మన్యఖిలాధారే ఇతి సంకల్ప్య వర్ణయ ॥
ఏ విధముగా వర్ణించినచో, మానవులకు సర్వజగత్స్వరూపుడు, - సర్వమునకు ఆత్మయైనవాడు, సర్వజగత్తుయొక్క ఉనికికి ఆశ్రయమైన వాడు, షడ్గుణేశ్వర్యసంపన్నుడు అగు శ్రీహరియందు భక్తి కలుగునో, ఆ విధముగా సంకల్పమును చేసి వర్ణించుము.
మాయాం వర్ణయతోముష్య ఈశ్వరస్యానుమోదతః ।
శృణ్వతః శ్రద్ధయా నిత్యం మాయయాత్మా న ముహ్యతి ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ద్వితీయస్కంధే సప్తమోధ్యాయః॥
ఈ పరమేశ్వరుని లీలలను నిత్యము శ్రద్ధతో వర్ణించు వారలకు, విని అనుమోదించు వారలకు, బుద్ధి అవిద్యచే వ్యామోహమును పొందదు.
ఇది శ్రీమద్భాగవత మహాపురాణములోని రెండవ స్కంధములో ఏడవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 7 of the Bhāgavata Mahā Purana is as follows:
Lord Brahmā presents a majestic summary of the primary avatars and functional incarnations of the Supreme Lord who descend into the material world across different ages. He glorifies the heroic pastimes and cosmic deeds of divine manifestations such as Varāha, Suyajña, Kapila, Dattātreya, the Four Kumāras, Nara-Nārāyaṇa, Pṛthu, Ṛshabha, Hayagrīva, Matsya, Kūrma, Nṛsiṁha, Vāmana, Paraśurāma, Rāma, Kṛshṇa, Buddha, and Kalki, highlighting how each incarnation establishes righteousness and delivers conditioned souls.