1 - ప్రథమోధ్యాయః

శ్రీశుక ఉవాచ

వరీయానేష తే ప్రశ్నః కృతో లోకహితో నృప

 ఆత్మవిత్సంమతః పుంసాం శ్రోతవ్యాదిషు యః పరః

శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను: ఓ మహారాజా! మానవులు విని కీర్తించి స్మరించదగిన వాటిలో సర్వోత్కృష్టమైనది యేది? అని నీవు వేసిన ఈ ప్రశ్న చాల గొప్పది. ఏలయనగా, లోకమునకు హితమును గూర్చే ఈ ప్రశ్న బ్రహ్మవేత్తలకు చాల అభీష్టమైనది.

శ్రోతవ్యాదీని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః

 అపశ్యతామాత్మతత్త్వం గృహేషు గృహమేధినామ్

ఓ మహారాజా! గృహస్థులగు మానవులు కుటుంబపోషణలో భాగముగా పొయ్యి, రోలు మొదలగు వంట సాధనములను వాడే సందర్భము లలో తమకు తెలియకుండగనే హింసకు పాల్పడుచుందురు. లౌకికజీవన మునందు తీవ్రమగు ఆసక్తి గలవారు ఆత్మస్వరూపమును తెలియజాలరు. అట్టి మానవులకు నిత్యకృత్యములలో భాగముగా విని స్మరించదగిన విషయములు అసంఖ్యాకముగా నుండును.

నిద్రయా హ్రియతే నక్తం వ్యవాయేన చ వా వయః

 దీవా చార్థేహయా రాజన్ కుటుంబభరణేన చ

ఓ మహారాజా! మానవుని ఆయుర్దాయములోని రాత్రిభాగము నిద్రలో మరియు శారీరకసుఖములలో, పగటి భాగము ధనమును. సంపాదీంచి కుటుంబమును పోషించుకొనుటలో గడిచి పోవుచున్నదీ.

తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి న పశ్యతి

             మానవునకు ఈ సంసారయాత్రలో సహకరించే దేహము, సంతాన ము, జీవితభాగస్వామి మొదలగు పరికరములు కాలముతో చేసే పోరాట మునకు సమర్థములు కావు. ఈ పరికరములు మిథ్యాభూతములు మాత్రమే గాక, కొన్ని సందర్భములలో చేటును కొనితెచ్చును. కాని, వాటి యందు లగ్నమైన మనస్సు గల మానవుడు తన తండ్రి మొదలగు వారి జీవితములో వాటి వినాశమును చూచుచున్ననూ, వాటి అనిత్యత్వమును గమనించ లేకపోవుచున్నాడు.

తస్మాద్భారత సర్వాత్మా భగవాన్ హరిరీశ్వరః

 శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చేచ్ఛతాభయమ్

భరతవంశములో జన్మించిన ఓ మహారాజా! కావున, మోక్షమును గోరు మానవుడు శ్రీవిష్ణుభగవానుని గురించి శ్రవణము చేసి, ఆయనను కీర్తించి, ఆయననే స్మరించవలెను. సర్వజగన్నాథుడగు ఆ భగవానుడు సర్వప్రాణులలో ఆత్మరూపముగా నున్నాడు.

జన్మలాభః పరః పుంసామంతే నారాయణస్మృతిః

            మానవుడు తన కర్తవ్యమును నియమము తప్పకుండా పాటిస్తూ, కర్మయోగముననుష్ఠించి, ఆత్మానాత్మవివేకము గలవాడై, ఆత్మస్వరూప జ్ఞానమును పొంది, మరణకాలములో నారాయణుని స్మరిస్తూ దేహమును విడిచి పెట్టినచో, అదియే మానవజన్మయొక్క మహాఫలము.

ప్రాయేణ మునయో రాజనివృత్తా విధిషేధతః

 నైర్గుణ్యస్థా రమంతే స్మ గుణానుకథనే హరేః

ఓ మహారాజా! సర్వకర్మసన్న్యాసముచే విధిని షేధములకు అతీ తులైన మహర్షులు నిర్గుణపరబ్రహ్మయందు నిష్ఠ గలవారే అయిననూ, తరచుగా శ్రీహరియొక్క గుణములను గానము చేయుటలో ప్రీతిని కలిగియుందురు సుమా!

ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మసమ్మితమ్

అధీతవాన్ ద్వాపరాదౌ పితుర్ద్వైపాయనాదహమ్

భాగవతమని ప్రసిద్ధి గాంచిన ఈ వేదముతో సమానమగు పురాణ మును నేను కలియుగారంభములో నా తండ్రియగు వేదవ్యాసమహర్షి వద్ద అధ్యయనము చేసితిని.

పరినిష్టితోపీ నైర్గుణ్యే ఉత్తమశ్లోకలీలయా

గృహీతచేతా రాజర్షే ఆఖ్యానం యదధీతవాన్

 తదహం తేకాభిధాస్యామి మహాపౌరుషికో భవాన్

 యస్య శ్రద్దధతామాశు స్యాన్ముకుందే మతిస్సతీ

ఓ రాజర్షీ! నేను త్రిగుణములకు అతీతమగు పరమాత్మతత్త్వము నందు నిష్ఠను కలిగియున్న అంతఃకరణము గలవాడనే అయిననూ, ఉత్తమ మగు కీర్తిగల శ్రీహరియొక్క లీలలచే ఆకర్షించ బడినవాడనై భాగవతపురా ణమును అధ్యయనము చేసియుంటిని. ఈ పురాణమునందు శ్రద్దను చూపు జనులకు మనస్సు శీఘ్రమే శుద్దమై శ్రీహరియందు లగ్నమగును. నీవు మహాపురుషుడగు శ్రీకృష్ణునకు ప్రియుడవు. ఈవున, అట్టి భాగవతగా థను నేను నీకు చెప్పెదను.

ఏతన్నిర్విద్యమానానామిచ్చతామకుతోభయమ్

 యోగినాం నృప నిర్ణీతం హరేర్నామానుకీర్తనమ్

ఓ మహారాజా! వైరాగ్యమును పొంది అభయస్థానమగు మోక్ష మును కోరే కర్మయోగులకు మాత్రమే గాక, ఇహపరలోకములలోని భోగ ములను కోరువారికి కూడ ఈ హరినామసంకీర్తనమే ఉత్తమసాధనముగా పెద్దలచే నిర్ణయించబడినది. జ్ఞానులు పొందే మోక్షరూపఫలము కూడ ఇదియే.

కిం ప్రమత్తస్య బహుభిః పరోక్షైర్హాయనైరిహ

 వరం ముహూర్తం విదితం ఘటేత శ్రేయసే యతః

విషయభోగములయందు తగుల్కొని అజ్ఞానములో జీవించే వ్యక్తికి గడచిపోయిన అనేకసంవత్సరముల కాలము అంతయు వ్యర్థమే. మానవజన్మయొక్క ప్రయోజనము గురించి తెలిసిన కాలము గంటయై ననూ అట్టి చాల సంవత్సరముల కంటె గొప్పది. ఏలయన, దాని వలన మానవుడు మోక్షము కొరకు ప్రయత్నించును.

ఖట్వాంగో నామ రాజర్షి జ్ఞాత్వేయమిహాయుషః

ముహూర్తాత్సర్వముత్సృజ్య గతవానభయం హరిమ్

ఖట్వాంగుడనే రాజర్షి తనకు కేవలము ముహూర్తకాలము మాత్రమే ఆయుర్దాయము మిగిలి యున్నదని తెలుసుకొని, సర్వమును విడిచి పెట్టి, ఆ ముహూర్తకాలముచే మాత్రమే భయమును పోగొట్టే శ్రీహ రిని పొందినాడు.

తవా ప్యేతర్హి కౌరవ్య సప్తాహం జీవితావధిః

 ఉపకల్పయ తత్సర్వం తావద్యత్సాంపరాయికమ్

కురువంశములో జన్మించిన ఓ మహారాజా! నీకైతే ఇంకా ఏడు రోజుల ఆయుర్దాయము మిగిలి యున్నది. నీవు ఆ కాలమును వినియోగిం చుకోని ఉత్తమగతిని ఇచ్చే సాధనమునంతను సంపాదించుకొనుము.

అంతకాలే తు పురుష ఆగతే గతసాధ్వసః

 ఛింద్యాదసంగశ స్త్రేణ స్పృహాం దేహేను యే చ తమ్

మానవుడు తనకు మరణకాలము ఆసన్నమైనప్పుడు మరణభ యమును విడనాడి, దేహమునందు మరియు దానిని అనుసరించి సంప్రాప్త మైన వస్తువాహనాదులయందు గల ప్రీతిని అనాసక్తి (ప్రాపంచిక వస్తువుల యందు తీవ్రమగు అభిలాష లేకుండుట) అనే ఆయుధముతో ఛేదించుకొన వలెను.

గృహాతప్రజితో ధీరః పుణ్యతీర్థజలాప్లుతః

శుచౌ వివిక్త ఆసీనో విధివత్కల్పితాసనే

 అభ్య సేన్మనసా శుద్ధం త్రివృద్బ్రహ్మాక్షరం పరమ్

 మనో యచ్ఛేజ్జితశ్వాసో బ్రహ్మబీజమవిస్మరన్

మానవుడు ఇంద్రియజయము గలవాడై, ఇంటినుండి బయట పడి, పవిత్రమగు తీర్థజలములో స్నానమాడి, ఏకాంతప్రదేశములో శుద్ద మగు స్థానమునందు యథావిధిగా ఆసనమును ఏర్పాటు చేసుకొని, దానిపై యధోచితమగు ఆసనమును బంధించి, ఓంకారమును జపించవలె ను. అకార-ఉకార-మకారముల కూర్పు అగు ఓంకారము పరమేశ్వరుని బోధించే శబ్దములలో సర్వశ్రేష్ఠమైనది. అట్టి పవిత్రమగు ఓంకారముపై నుండి మనస్సును ఇతరము పైకి మళ్లనీయకుండగా ప్రాణాయామమును చేయుచూ, మనస్సును వశము చేసుకొనవలెను.

నియచ్చేద్విషయేభ్యో క్షాన్మనసా బుద్ధిసారథిః

 మనః కర్మభిరాక్షిప్తం శుభార్థే ధారయేద్దియా

            కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము అనే అయిదు ఇంద్రియ ములు వరుసగా రూపము (రంగు), శబ్దము, గంధము, రసము (రుచి), స్పర్శ (కోమలము ఇత్యాది) అనే ప్రాపంచిక విషయములయందు ప్రసక్త ములై యుండును. మనస్సు వీటిద్వారా ప్రపంచములో విహరించుచుండు ను. సాధకుడు శరీరము అనే రథమును నడిపే నిశ్చయాత్మకమగు బుద్ది అనే సారథి ద్వారా మనస్సు అనే కళ్లెముతో గుర్రముల వంటి ఇంద్రియ ములను భోగములలో చిక్కుకొనని విధముగా వెనుకకు మళ్లించవలెను; అనగా, మనస్సును అంతర్ముఖము చేయవలెను (ప్రత్యాహారము). మనస్సు కర్మవాసనలచే ఆకర్షించబడి విక్షేపము (చెల్లాచెదరు అగుట) ను పొందుచుండును. సాధకుడు సత్సంస్కారములతో కూడిన బుద్దిచే అట్టి మనస్సును సకలకల్యాణనిలయమగు భగవద్రూపమునందు స్థిరముగా నిలుప వలెను (ధారణ).

తత్రైకావయవం ధ్యాయేదవ్యుచ్చిన్నేన చేతసా

 మనో నిర్విషయం యుంక్త్వా తతః కించన న స్మరేత్

పదం తత్పరమం విష్ణోర్మనో యత్ర ప్రసీదతి

 సాధకుడు భగవంతుని పూర్ణరూపమునుండి జారిపోని (ఇటునటు చెదిరిపోని) మనస్సుతో ఆ భగవత్స్వరూపమునందలి ఒక్కొక్క అవయవ మును ధ్యానించవలెను (ధ్యానము). మనస్సును విషయాసక్తినుండి మరల్చి ఆ పైన భగవద్రూపముకంటే భిన్నమగు మరియొక దానిని స్మరిం చరాదు (సమాధి). అదియే శ్రీమహావిష్ణువుయొక్క పరమపదము. దాని యందు లగ్నమైన మనస్సు ప్రసన్నమగును. లేదా, దేనియందు లగ్నమై మనస్సు ప్రసన్నమగునో, అట్టి ధ్యేయము శ్రీమహావిష్ణువుయొక్క సర్వోత్కృష్టమగు స్వరూపము మాత్రమే.

రజస్తమోభ్యామాక్షిప్తం విమూఢం మన ఆత్మనః

                     యచ్చేద్దారణయా ధీరో హంతి యా తత్కృతం మలమ్

మనస్సునందలి రజోగుణము దానిని ఇటునటు చెదరగొట్టును. తమోగుణము మనస్సునకు భగవద్రూపమును భావించే సామర్థ్యము లేకుండగా చేయును. అట్లు జరిగినప్పుడు సాధకుడు ధైర్యము గలవాడై, భగవత్స్వరూపమును ధ్యానము చేస్తూ మనస్సును తన వశము చేసుకొన వలెను. అట్టి భావన వలన మనస్సులోని రజస్తమోగుణముల మాలిన్యము తొలగి పోవును.

యతస్సంధర్యమాణాయాం యోగినో భక్తిలక్షణః

 ఆశు సంపద్యతే యోగ ఆశ్రయం భద్రమీక్షతః

సాధకుడు స్థిరచిత్తముతో ఈ విధముగా చక్కగా మంగళకరమగు భగవత్స్వరూపము పై మనస్సును నిలిపియున్నచో (ధారణ), దాని వలన శీఘ్రమే ఆతని హృదయములో భగవతేమ (భక్తి) మొలకెత్తి, దాని ప్రభా వముచే ఆతడు భగవంతుని పొందును.

రాజోవాచ

యథా సంధార్యతే బ్రహ్మన్ ధారణా యత్ర సంమతా

 యాదృశీ వా హరేదాశు పురుషస్య మనోమలమ్

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను: ఓ మహర్షీ! ధారణను చక్కగా స్థిరముగా చేసే విధమెట్టిది? దేనిపై చేయవలెను? మానవుని మనస్సులోని మాలిన్యమును వెంటనే పోగొట్టే ధారణయొక్క స్వరూపమెట్టిది?

శ్రీశుక ఉవాచ

 జితాసనో జితశ్వాసో జితసంగో జితేంద్రియః

స్థూలే భగవతో రూపే మనస్సంధారయేద్ధియా

శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను: సాధకుడు అభ్యాసముచే ఆసన మును జయించి, అనగా స్థిరముగా సుఖముగా ఆసనమునందు కూర్చుండి, శ్వాసను జయించి, అనగా ప్రాణాయామముయొక్క అభ్యాసముచే శ్వాసను వశము చేసుకొని, ప్రాపంచిక విషయములపై ఉండే ఆసక్తిని జయించి, ఇంద్రియములను వశపరచుకొని, నిశ్చయాత్మకమగు బుద్ధి ద్వారా మనస్సును భగవంతుని స్థూలరూపముపై చక్కగా నిలిపి యుంచవలెను.

విశేషస్తస్య దేహోయం స్థవిష్ఠశ్చ స్థవీయసామ్

యత్రదం దృశ్యతే విశ్వం భూతం భవ్యం భవచ్చ సత్

భూతభవిష్యద్వర్తమానకాలములలో కార్యరూపములోనున్న సక లచరాచరప్రాణికోటికి మరియు సకలపదార్థజాతమునకు ఆశ్రయమై మన కంటికి కానవచ్చే ఈ బ్రహ్మాండమే ఆ పరమేశ్వరుని దేహము. ఈ విరాడ్ (స్థూల) దేహము పెద్ద వాటన్నింటికంటే పెద్దది.

అండకోశే శరీరేస్మిన్ సప్తావరణసంయుతే

 వైరాజః పురుషో యోసౌ భగవాన్ ధారణాశ్రయః

ఈ బ్రహ్మాండము భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకా శము అనే పంచభూతములు, అహంకార మహత్తత్త్వములు వెరసి ఏడు ఆవరణములతో కూడియున్నది. ఈ విరాట్ దేహమునకు అభిమానియైన చేతనతత్త్వమే హిరణ్యగర్భుడు. ఆ హిరణ్యగర్బుని రూపములోనున్న భగ వానునిపై మనస్సును స్థిరముగా నిలిపి ధ్యానించవలేను.

పాతాలమేతస్య హి పాదమూలం

పఠంతి పార్ష్టిప్రపదే రసాతలమ్

మహాతలం విశ్వసృజోథ గుల్ఫౌ

తలాతలం వై పురుషస్య జంఘే

జగత్తును సృష్టించిన ఈ హిరణ్యగర్భునకు పాతాళలోకము పాదముల క్రింది భాగమనియు, రసాతలము కాలి ముందు వెనుక భాగములని యు, మహాతలము చీలమండలనియు, తలాతలము పిక్కలనియు మహర్షులు చెప్పుచున్నారు.

ద్వే జానునీ సుతలం విశ్వమూర్తేః

ఊరుద్వయం వితలం చాతలం చ

 మహీతలం తజ్జఘనం మహీపతే

 నభస్తలం నాభిసరో గృణంతి

ఓ మహారాజా! బ్రహ్మాండరూపములో ప్రకటమైన ఆ పరమేశ్వరు నకు సుతలము మోకాళ్లనియు, వితలము మరియు అతలము రెండు తొడ లనియు, భూతలము పొత్తికడుపు అనియు, అంతరిక్షము సరస్సు వంటి నాభి అనియు మహాత్ములు చెప్పుచున్నారు.

ఉరఃస్థలం జ్యోతిరనీకమస్య

 గ్రీవా మహర్వదనం వై జనోస్య

 తపో రరాటీం విదురాదిపుంసః

సత్యం తు శీర్షాణి సహస్రశీర్ష్ణః

ఆదిపురుషుడగు ఆ హిరణ్యగర్భునకు స్వర్గలోకమే వక్షఃస్థలమనియు, మహర్లోకము కంఠమనియు, జనలోకము నోరనియు, తపోలోకము నుదురనియు, అనంతములగు శిరస్సులు గల ఆ పరమేశ్వరుని శిరస్సుల సమూహమే సత్యలోకమనియు మహర్షులు భావన చేయుచున్నారు.

ఇంద్రాదయో బాహవ ఆహురుస్రాః

కర్ణౌ దిశః శ్రోత్రమముష్య శబ్దః

నాసత్యదస్రౌ పరమస్య నాసే

 ఘ్రాణోస్య గంధో ముఖమగ్నిరిద్ధః

ఈ పరమేశ్వరునకు ఇంద్రుడు మొదలగు దేవతలే అనేకములగు బాహువులనియు, దిక్కులు చెవి దొప్పలనియు, శబ్దము (ఆకాశతన్మాత్ర) శ్రోత్రేంద్రీయమనియు, అశ్వినీదేవతలు ముక్కు పుటములనియు, గంధత న్మాత్ర ఘ్రాణేంద్రియమనియు, ప్రజ్వరిల్లే అగ్నియే వాగింద్రియమనియు మహాత్ములు చెప్పుచున్నారు.

ద్యౌరక్షిణీ చక్షురభూత్పతంగః

పక్ష్మాణీ విష్ణోరహానీ ఉభే చ

 తద్బ్రూవిజృంభః పరమేష్ఠిధిష్ట్య-

 మాపోస్య తాలూ రస ఏవ జిహ్వా

ఈ శ్రీమహావిష్ణువునకు ద్యులోకమే రెండు కన్నులు కాగా, సూర్యుడు నేత్రేంద్రియమగుచున్నాడు. ఆయనకు రాత్రింబగళ్లు కనురె ప్పలు కాగా, చతుర్ముఖబ్రహ్మయొక్క స్థానము ఆయన కనుబొమల విలా సము అగును. నీరు (మహాభూతము) ఆయనకు దౌడ కాగా, రసతన్మాత్ర (సూక్ష్మమహాభూతము) నాలుక అగుచున్నది.

ఛందాంస్యనంతస్య శిరో గృణాంతి

 దంష్ట్రా యమ స్స్నేహకలా ద్విజాని

 హాసో జనోన్మాదకరీ చ మాయా

దురంతసర్గో యదపొంగమోక్షః

అనంతుడగు శ్రీమహావిష్ణువునకు వేదములే బ్రహ్మరంధ్రమని యు, యముడు దంతములనియు మహాత్ములు చెప్పుచున్నారు. సకలప్రా ణులలో సంతానము మొదలగు వాటియందు సహజమగు ప్రేమ కానవ చ్చును. అట్టి ప్రేమలేశములే ఆయన పళ్లు. జనులకు మోహమును కలి గించే మాయాశక్తియే ఆయన చిరునవ్వు. ఈ అపారమగు సృష్టి ఆ మాయాశక్తియొక్క కడగంటి చూపు మాత్రమే.

వ్రీడోత్తరోష్ఠోధర ఏవ లోభో

ధర్మః స్తనోధర్మపథోకస్య పృష్ఠః

 కస్తస్య మేడ్రం వృషణా చ మిత్రౌ

కుక్షిస్సముద్రా గీరయోస్థిసంఘాః

            ఈ పరమేశ్వరునకు సిగ్గు పై పెదవి, లోభము క్రింది పెదవి, ధర్మము స్తనము, అధర్మమార్గము వీపు, ప్రజాపతి జననేంద్రియము, మిత్రావరుణులు అండములు, సముద్రములు పొట్ట, పర్వతములు ఎము కల సమూహములు అగుచున్నవి.

నద్యోకస్య నాడ్యోథ తనూరుహాణి

 మహీరుహా విశ్వతనోర్నృపేంద్ర

అనంతవీర్యశ్శ్వసితం మాతరిశ్వా

గతిర్వయః కర్మ గుణప్రవాహః

ఓ మహారాజా! బ్రహ్మాండమే దేహముగా గల ఈ శ్రీమహావిష్ణువు నకు సడులే నాడులు కాగా, చెట్లు రోమములు అగును. అనంతమగు శక్తి గల యువు ఆయన శ్వాస. కాలమే ఆయన చలనము. సత్త్వరజస్తమో గు, ప్రవాహమనదగిన కలప్రాణిసృష్టిపరంపర ఆయన చేసే పని.

ఈశస్య కేశాన్ విదురంబువాహాన్

వాసస్తు సంధ్యాం కురువర్య భూమ్నః

 వ్యక్తమాహుర్హృదయం మనశ్చ

స చంద్రమాస్సర్వవికారకోశః

  ఓ కురువంశశ్రేష్టా! జగన్నాథుడు, పరబ్రహ్మస్వరూపుడు అగు శ్రీప, నిష్ణువునకు మేఘములే కేశములనియు, సంధ్య వస్త్రమనియు, ప్రక్క ఒక మృదయమనియు మహర్షులు చెప్పుచున్నారు. ఇంతేగాక, ఓషధులలోని రసవికారములన్నింటికీ ఆశ్రయముగా ప్రసిద్ధి చెందిన చంద్రుడే ఆయనకు మనస్సు.

విజ్ఞాన శక్తిం మహిమామనంతి సర్వాత్మనోకంతఃకరణం గిరిత్రమ్

అశ్వాశ్వతర్యుష్ట్రగజా నఖాని సర్వే మృగాః పశవశోణిదేశే

సర్వము తానే అయి ఉన్న ఆ పరమేశ్వరునకు మహత్ (సమష్టి బుద్ది) తత్త్వము జ్ఞానశక్తి అనియు, రుద్రుడు అహంకారమనియు మహ రులు వేదానుసారముగా చెప్పుచున్నారు. గుర్రము, కంచరగాడిద, ఒంటే, ఏనుగు అను జంతువులు ఆయన గోళ్లు. లేడి మొదలగు సర్వమృగములు, ఆవు మొదలగు సకలపశువులు ఆయన కటిప్రదేశమని భావన చేయవ లెను.

వయాంసి తద్వ్యాకరణం విచిత్రం మనుర్మనీషా మనుజో నివాసః గంధర్వవిద్యాధరచారజాప్సరస్స్వరస్మృతీరసురానీకవర్యః

ఆ పరమేశ్వరుని అద్భుతమగు శిల్పనైపుణ్యమే పక్షుల రూపము లోను, ఆయన షడ్డము మొదలగు సంగీతస్వరములను స్మరించినప్పుడు ఆ స్మృతులే గంధర్వ-విద్యాధర-చారణ-అప్సరసలు అనే దేవయోనుల రూపములోను రూపు దిద్దుకున్నవి. స్వాయంభువ మనుపు ఆయన బుద్ధి కాగా, మానవుడు ఆ పరమేశ్వరుని నివాసస్థానము. ఆయన పరాక్రమము రాక్షససమూహముల రూపములో ప్రకటమైనది.

 బ్రహ్మాననం క్షత్రిభుజో మహాత్మా వీడూరురంఘిశ్రితకృష్ణవర్ణః

 వానాభిధాభీజ్యగణోపపన్నో ద్రవ్యాత్మకః కర్మ వితానయోగః

బ్రాహ్మణుడు ఆయనకు ముఖము, క్షత్రియుడు భుజములు, వైశ్యుడు ఊరువులు, శూద్రులు పాదములు కాగా, ఆయన సర్వజగద్రూపుడై, వసు-రుద్ర మొదలగు అనేకనామములు గల దేవతాగణములతో కూడి యున్నాడు. హవిస్సు మొదలగు ద్రవ్యములచే చేయబడే విస్తారమగు యజ్ఞప్రయోగము ఆయన కర్మ.

ఇయానసావీశ్వరవిగ్రహస్య

యస్సన్నివేశః కథతో మయా తే

 సంధార్యతేకస్మిన్ వపుషి స్థవిష్ఠే

మనస్స్వబుద్ధ్యాన యత్వోస్తి కించిత్

ఈ విధముగా విస్తరించియున్న ఈశ్వరుని విరాడ్రేహముయొక్క అవయవసంస్థానమును నేను నీకు చెప్పితిని, సాధకులు తమ బుద్ధి ద్వారా మనస్సును ఈ పరమేశ్వరుని స్థూలదేహమునందు ధారణ చేయుదురు.ఈ విరాడ్రూపము కంటే భిన్నముగా ఈ జగత్తులో ఏదీ లేదు.

స సర్వధీవృత్త్యనుభూతసర్వ

ఆత్మా యథా స్వప్నజనేక్షి లైకః

 తం సత్యమానందనిధిం భజేత

నాన్యత్ర సజ్జేద్యత ఆత్మపాతః

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ద్వితీయస్కంధే ప్రథమోధ్యాయః

పరమేశ్వరుడు సకలప్రాణులలో ఆత్మరూపముగా నున్నవాడై ఆయా ప్రాణుల మనోవృత్తులచే సకలజగత్తును దర్శించి అనుభవించుచు న్నాడు. మనిషి స్వప్నములో తనను మాత్రమే వివిధజనుల రూపములో మరియు పదార్థముల రూపములో దర్శించును. ఆ విధముగా దర్శించ బడే స్వప్నప్రపంచము ద్రష్ట కంటే భిన్నముగా లేదు. అదే విధముగా ఈ జగత్తు పరమేశ్వరుని కంటే భిన్నముగా లేదు. అనగా, ఆ పరబ్రహ్మ అద్వి తీయము. నిర్విశేషమగు ఉనికియే స్వరూపముగా గల ఆనందఘనుడగు ఆ పరమేశ్వరుని సాధకుడు సేవించవలేను. సాధకుడు ఇతరములగు ప్రాపంచిక విషయములయందు తీవ్రమగు ఆసక్తిని కలిగియుండరాదు. ఏల యనగా, అట్టి ఆసక్తి మానవుని పతితుని చేయును.

శ్రీమద్బాగవత మహాపురాణములోని రెండవ స్కంధములో మొదటి అధ్యాయము ముగిసినది.