భాగవత మహా పురాణము
9 - నవమోధ్యాయః
శ్రీశుక ఉవాచ ।
ఆత్మమాయామృతే రాజన్ పరస్యానుభవాత్మనః ।
న ఘటేతార్థసంబంధస్స్వప్నద్రష్టురివాంజసా ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను: ఓ మహారాజా! అనుభూతి స్వరూపమగు ఆత్మ చైతన్యము దేహాదులకంటే విలక్షణమైనది. అట్టి ఆత్మకు దేహము మొదలగు దృశ్యవర్గముతో, స్వప్నద్రష్టకు స్వప్నదృశ్యములతో వలె, వాస్తవముగా సంబంధము లేదు. కాని, పరమాత్మయొక్క మాయచే అట్టి సంబంధము ఘటిల్లుచున్నది.
బహురూప ఇవాభాతి మాయయా బహురూపయా ।
రమణో గుణేష్వస్యా మయాహమితి మన్యతే ॥
ఈ మాయాశక్తి దేవతలు, మనుష్యులు, బాల్యము, యౌవనము మొదలగు అనేకరూపములలో ప్రకటమగుచుండగా, ఆత్మచైతన్యము కూడ ఆయా ఉపాధులలో అనేకరూపములు గలది వలె కన్పట్లుచున్నది. జీవుడు ఈ మాయాదేవియొక్క గుణములచే నిర్మితమైన దేహాదుల యందు రమించువాడై, నేను, నాది అనే భ్రాంతికి గురి యగుచున్నాడు.
యర్హి వావ మహిమ్న స్వే పరస్మిన్ కాలమాయయోః ।
రమేత గతసంమోహన్త్యర్త్వోదాస్తే తదోభయమ్ ॥
మానవుడు ఏ కాలమునందైతే కాలమునకు మరియు ప్రకృతికి (ప్రకృతికార్యములగు దేహాదులకు) అతీతమైన చైతన్యస్వరూపమునందు ప్రతిష్ఠితుడై రమించునో, ఆ కాలములో తొలగిన వ్యామోహము గలవాడగుటచే అహంకార మమకారములను రెండింటినీ త్రోసిపుచ్చి, ఉదాసీనుడై (గుణములకు అతీతుడై) యుండును.
ఆత్మతత్త్వవిశుద్ద్యర్థం యదాహ భగవానృతమ్ ।
బ్రహ్మణే దర్శయన్ రూపమవ్యలీకవ్రతాదృతః ॥
బ్రహ్మ నిష్కామమగు తపస్సును చేసి శ్రీహరిని ఆరాధించెను. అపుడాయన బ్రహ్మగారికి తన సత్యజ్ఞానస్వరూపమును ప్రకటించి, ఆత్మత త్వసాక్షాత్కారము కొరకై సాధనమును ఉపదేశించి యున్నాడు. దానిని నేను చెప్పగలను.
స ఆదిదేవో జగతాం పరో గురుః
స్వధిష్ట్యమాస్థాయ సిసృక్షయైక్షత ।
తాం నాధ్యగచ్ఛద్దృశమత్ర సంమతాం
ప్రపంచనిర్మాణవిధిర్యయా భవేత్ ॥
జగత్తులకు వేదరాశిని అందించిన ఆదిగురువు మరియు ఆదిదే వుడు అగు బ్రహ్మగారు తన ధామమునధిష్టించినవాడై, సృష్టిని చేయవలె నని సంకల్పించి, ఆలోచించ మొదలిడెను. కాని, జగత్తును రచించుటకు యోగ్యమగు ప్రకారమును తోపింపజేసే ప్రజ్ఞ ఆయనకు భాసించలేదు.
స చింతయన్ ద్వ్యక్షరమేకదాంభ-
స్యుపాశృణోద్ద్విర్గదితం వచో విభుః ।
స్పర్శేషు యత్ షోడశ మేకవింశం
నిష్కించనానాం నృప యద్దనం విదుః ॥
ఓ మహారాజా! సర్వసమర్థుడగు ఆ బ్రహ్మగారు ఒక సమయ ములో ప్రళయజలమునందు తనకు దగ్గరలో తపః (తపస్సు) అనే పద మును రెండు సార్లు వినెను. దరిద్రులకు గల ఏకైకధనము ఈ తపస్సేనని మహాత్ములు చెప్పుచున్నారు.
నిశమ్య తద్వక్తృదిదృక్షయా దినో
విలోక్య తత్రాన్యదపశ్యమానః ।
స్వధిష్ట్యమాస్థాయ విమృశ్య తద్ధితం
తపస్యుపాదిష్ట ఇవాదధే మనః ॥
ఆ మాటను విన్నవెంటనే బ్రహ్మగారు ఆ మాటను పలికిన వ్యక్తి కొరకై నలువైపులా వెదికెను. కాని ఆయనకు ఎవ్వరు కానరాలేదు. అపుడాయన తన ధామము (పద్మము) నందు కూర్చున్నవాడై, తపస్సు తనకు మేలు చేయగలదని నిర్ణయించుకొనెను. ఎవరో ఒకరు స్వయముగా ఉపదే శించినారా అన్నట్లు ఆయన తన మనస్సును తపస్సు పై లగ్నము చేసెను.
దివ్యం సహస్రాబ్దమమోఘదర్శ నో
జీతానిలాత్మా విజితోభయేంద్రియః ।
అతప్యత స్మాఖిలలోకతాపనం
తపస్తపీయాంస్తపతాం సమాహితః ॥
తపః అనే పదమును విని బ్రహ్మ చేసిన ఊహ వ్యర్థము కాలేదు. బ్రహ్మ తపస్సును చేయువారందరిలో శ్రేష్ఠుడగు తపశ్శాలి. ఆయన కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను నియమించి (ప్రత్యాహారము), వాయువును మనస్సును జయించి (ప్రాణాయామము, ధారణ, ధ్యానము), ఏకాగ్రమగు మనస్సుతో (సమాధి) వేయి దివ్యసంవత్సరములు తపస్సును చేసెను. ఆ తపస్సుయొక్క ప్రభావముచే ఆయనకు సకలలోకములను సృష్టించే ప్రజ్ఞ ప్రకాశించెను.
తస్మై స్వలోకం భగవాన్ సభాజితః
సందర్శయామాస పరం న యత్పరమ్ ।
వ్య పేతసంక్షేశవిమోహసాధ్వసం
స్వదృష్టవద్భిర్విబుదైరభిష్టుతమ్ ॥
ఈ విధముగా బ్రహ్మ తపస్సు చేసి ఆరాధించబడిన శ్రీహరి భగవానుడు సర్వోత్కృష్టమగు తన వైకుంఠలోకమును ఆయనకు చూపిం చెను. ఆ లోకమునందు అవిద్యా-అస్మితా-రాగ-ద్వేష-అభినివేశములనే చిత్తమలములకు గాని, వ్యామోహమునకు గాని, భయమునకు గాని తావు లేదు. గొప్ప పుణ్యము గలవారు, ఆత్మజ్ఞానులు అగు దేవతలు దానిని అధికముగా కొనియాడుచుందురు.
ప్రవర్తతే యత్ర రజస్తమస్తయోః
సత్త్వం చ మిశ్రం న చ కాలవిక్రమః ।
న యత్ర మాయా కిముతాపరే హరేః
అనువ్రతా యత్ర సురాసురార్చితాః ॥
వైకుంఠములో రజస్తమోగుణములకు గాని, వాటితో కలిసియున్న సత్త్వగుణమునకు గాని ప్రవేశము లేదు. అనగా, కేవలసత్వగుణము మాత్రమే అచటనుండును. కాలముయొక్క వినాశసామర్థ్యము అచట. చెల్లుబాటు కాదు. అచట మాయయే లేదన్నచో, మాయాకార్యములగు రాగలోభాదులు ఉండవని వేరుగా చెప్పవలయునా? అచట ఇంద్రుడు మొదలగు దేవతలు, ప్రహ్లాదుడు మొదలగు రాక్షసులు శ్రీహరియొక్క అనుయాయులను, భక్తులను పూజించెదరు.
శ్యామావదాతాశ్శతపత్రలోచనా:
పిశంగవస్త్రాసురుచస్సు పేశసః ।
సర్వే చతుర్బాహవ ఉన్మిషన్మణి -
ప్రవేకనిష్కాభరణాస్సువర్చసః ।
ప్రవాలవైదూర్యమృణాలవర్చసః
పరిస్ఫురత్కుండలమౌలిమాలినః ॥
అక్కడి వారు అందరు నల్లని దేహకాంతితో, పద్మములవంటి నిడివి కన్నులతో గొప్పగా ప్రకాశించుచుందురు. పచ్చని వస్త్రములను ధరించే వారికి నాలుగు బాహువులు గలవు. వారందరు మిక్కిలి సుంద రులు మరియు సుకుమారులు. గొప్ప తేజశ్శాలురగు వారు ఉజ్జ్వలమగు గొప్ప మణులు పొదిగిన పదకములను మరియు ఇతరములగు ఆభరణ ములను ధరించియుందురు. పగడములు వైడూర్యములు మరియు తామ రతూడులవంటి ప్రకాశము గల ఆ పార్షదులు నలువైపులా కాంతులను విరజిమ్మే కుండలములను కిరీటములను మరియు మాలలను ధరించేదరు.
భ్రాజిష్ణుభిర్యః పరితో విరాజతే
లసద్విమానావలిభిర్మహాత్మనామ్ ।
విద్యోతమానః ప్రమదోత్తమాద్యుభిః
సవిద్యుదభావలిభిర్యథా నభః ॥
ఆ లోకములో అంతటా మహాత్ముల విమానములు వరుసలలో దేదీప్యమానముగా ప్రకాశించుచుండును. గొప్ప యువతుల కాంతులచే ఆ విమానముల శోభ మరింత ఇనుమడించుచుండును. అట్టి ఆ లోకము మెరుపు తీగలతో కూడిన మేఘపంక్తులతో నిండియున్న ఆకాశము వలె విశేషముగా ఒప్పారుచుండును.
శ్రీర్యత్ర రూపిణ్యురుగాయపాదయోః
కరోతి మానం బహుధా విభూతిభిః ।
ప్రేంఖం శ్రితా యా కుసుమాకరానుగైః
విగీయమానా ప్రియకర్మ గాయతీ ॥
వైకుంఠమునందు సంపద మూర్తిని దాల్చి శ్రీహరియొక్క పాద ములను పలు విభవములతో సేవించును. వేదములలో గొప్పగా స్తుతించ బడే ఆ భగవానుని పాదములకు అతిలోకసుందరియగు లక్ష్మీదేవి తన సఖురాండ్రతో గూడి గొప్పగా పూజను చేయును. ఒకచో ఆ లక్ష్మీదేవి ఉయ్యలనూగుతూ తన ప్రియుడగు శ్రీహరియొక్క గుణములను గానము చేయుచుండగా, వసంతుని అనుచరులగు కోకిల చిలుక మరియు తుమ్మెదలు తాము ఆయేయొక్క సౌందర్యమును గానము చేయుచున్నవా యన్నట్లు మధురమగు ధ్వనులను చేయుచుండును.
దదర్శ తత్రాభిలసాత్వతాం పతిం
శ్రీయః పతిం యజ్ఞపతిం జగత్పతిమ్ ।
సునందనందప్రబలార్హణాదిభిః
స్వపార్షదముఖ్యైః పరి సేవితం విభుమ్ ॥
భక్తులందరికీ రక్షకుడు, లక్ష్మీపతి, యజ్ఞములచే ఆరాధించ బడు వాడు, జగన్నాథుడు, సర్వశక్తిమంతుడు అగు శ్రీహరిని ఆ వైకుంఠలోకములో బ్రహ్మ దర్శించెను. ఆయన పార్షదులలో ప్రముఖులగు సునందు డు, నందుడు, ప్రబలుడు, అర్హణుడు మొదలగువారు ఆయనను అన్ని విధ ములుగా సేవించుచుండిరి.
భృత్యప్రసాదాభిముఖం దృగాసవం
ప్రసన్నహాసారుణలోచనాననమ్ ।
కిరీటినం కుండలినం చతుర్భుజం
పీతాంబరం వక్షసి లక్షితం శ్రియా ॥
శ్రీహరి సర్వదా తన భక్తులను అనుగ్రహించుటకు అభిముఖుడై యుండును. ఆయన చూపులు ఆసవము వలె భక్తులకు ఆనందమును కలిగించును. ఆయన ముఖము ప్రసన్నమగు చిరునవ్వుతో ఎర్రని కన్నులతో ఒప్పారుచుండును. నాలుగు భుజములతో ప్రకాశించే శ్రీహరి కిరీటమును, కుండలములను, పచ్చని వస్త్రములను ధరించియుండును. ఆయన వక్షఃస్థ లము పై స్వర్ణరేఖ రూపములో లక్ష్మీదేవి ప్రకాశించుచుండును. అట్టి శ్రీహ రిని బ్రహ్మ చూచెను.
అధ్యర్హణీయాసనమాస్థితం పరం
వృతం చతుష్షోడశపంచశక్తిభిః ।
యుక్తం భగైస్వైరితరత్ర చాధ్రువైః
స్వ ఏవ ధామన్ రమమాణమీశ్వరమ్ ॥
యంతయగు శ్రీహరిని.
శ్రీహరి సర్వోత్కృష్టము, అతిపూజనీయము అగు సింహాసనము నధిష్టించి యుండెను. ప్రకృతి, పురుషుడు, అహంకారము, మహత్తత్త్వ ము, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, అంతఃకరణము, ఐదు మహాభూతములు, ఐదు వాటి తన్మాత్రలు వెరసి ఇరువది ఐదు తత్త్వములు ఆయనను సేవించుచుండెను. ఇతరులలో అనిత్యముగా ప్రకట మయ్యే ఈశ్వరభావము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అనే ఆరు గుణములు ఆయనకు స్వభావసిద్దములు. స్వీయమగు సచ్చిదానందస్వరూపమునందు ప్రకాశిస్తూ ఆత్మారాముడై యున్న సర్వజగన్ని యంతయగు శ్రీహరిని బ్రహ్మ కనుగొనెను.
తద్దర్శనాహ్లాదపరిప్లుతాంతరో
హృష్యత్తనుః ప్రేమభరాశ్రులోచనః ।
ననామ పాదాంబుజమస్య విశ్వసృక్
యత్పారమహం స్యేన పథ్యాధిగమ్యతే ॥
ఆ శ్రీహరిని చూచిన వెంటనే సృష్టికర్తయగు బ్రహ్మయొక్క హృదయము ఆనందముతో పొంగిపొరలి, కన్నులు ప్రేమాశ్రువులను వర్షించెను; శరీరము గగుర్పాటును చెందెను. సర్వకర్మసన్న్యాసపూర్వకజ్ఞానని స్థచే జ్ఞానులు పొందే శ్రీహరి పాదపద్మములకు ఆయన నమస్కరించెను.
తం ప్రియమాణం సముపస్థితం తదా
ప్రజావసర్లే నిజశాసనార్హణమ్ ।
బభాష ఈషత్ స్మితనోచిషా గిరా
ప్రియః ప్రియం ప్రీతమనాః కరే స్పృశవ్ ॥
ఆ సమయములో విచ్చేసి తన దర్శనముచే ఆనందమును పొందుచున్న, తనకు ప్రియుడగు బ్రహ్మను ఆయనచే ప్రేమించబడే - శ్రీహరి చూచెను. తన శాసనముచే ప్రజాసృష్టికి ఒడగట్టబోయే బ్రహ్మను చూచి ఆయనకు మనస్సులో చాల ప్రీతి కలిగెను. శ్రీహరి బ్రహ్మను చేతితో పట్టుకొని, చిరునవ్వుయొక్క శోభతో నలరారే వాక్కుతో ప్రీతి కలు గువిధముగా ఇట్లు మాటలాడెను.
శ్రీభగవానువాచ ।
త్వయాహం తోషితస్సమ్యగ్ వేదగర్భ సిసృక్షయా ।
చిరం భృతేన తపసా దుస్తోషః కూటయోచామ్ ॥
శ్రీహరి భగవానుడు ఇట్లు పలికెను: ఓ వేదనిధీ! నీవు సృష్టిని చేయగోరి చిరకాలము తపస్సును చేసి నన్ను బాగుగా సంతోష పెట్టితివి. కపటయోగులు నాకు సుతరాము ప్రీతిని కలిగించలేరు సుమా! .
వరం వరయ భద్రం తే వరేశం మాకభివాంఛితమ్।
బ్రహ్మన్ శ్రేయఃపరిశ్రామః పుంసో మద్దర్శనావధిః॥
ఓ బ్రహ్మా! నేను వరములనిచ్చే ప్రభుడను. నీవు నానుండి అభీష్ట మైన వరమును కోరుకొనుము. నీకు మంగళమగు గాక! పురుషుడు శ్రేయస్సు (మోక్షము) ను పొందుట కొరకై చేసే సాధన నా దర్శనముతో పర్యవసానమును పొందుచున్నది.
మనీషితానుభావోస్యం మమ లోకావలోకనమ్ ।
యదుపశ్రుత్య రహసి చకర్థ పరమం తపః ॥
నా సంకల్పప్రభావముచే మాత్రమే నీకు నా లోకమును దర్శించే భాగ్యము కలిగినది. ఏలయనగా, నేను కంటికి కానరాకుండగనే తపః అను పదమును ఉచ్చరించగా, ఒంటరిగానున్న నీవు ఆ మాటను విని కఠోరమగు తపస్సును అనుష్ఠించితివి.
ప్రత్యాదిష్టం మయా తత్ర త్వయి కర్మవిమోహితే ।
తపో మే హృదయం సాక్షాదాత్మాహం తపసోకనఘ ॥
ఓ పాపరహితుడా! ఆ సమయములో నీవు సృష్టికార్యము విషయ ములో విశేషమగు వ్యామోహమును పొందియుండగా, తపస్సును చేయు మని నేను నీకు ఉపదేశించితిని. తపస్సు సాక్షాత్తుగా. నా హృదయము; అనగా, నాకు అత్యంతప్రీతిపాత్రము. తపస్సు నా స్వరూపమే; అనగా, తపస్సు రూపములో నేనే ఉన్నాను.
సృజామీ తపసైవేదం గ్రసామి తపసా పునః।
బిభర్మి తపసా విశ్వం వీర్యం మే దుశ్చరం తపః ॥
నేను ఈ జగత్తును తపస్సుయొక్క ప్రభావముచే మాత్రమే సృష్టించి, పాలించి పోషించి, మరల ఉపసంహరించుచున్నాను. నా శక్తి కఠోరమగు తపస్సు మాత్రమే.
బ్రహ్మోవాచ ।
భగవన్ సర్వభూతానామధ్యక్షోపస్థితో గుహామ్ ।
వేద హ్యప్రతిరుద్దేన ప్రజ్ఞానేన చికీర్షితమ్॥
బ్రహ్మ ఇట్లు పలికెను: ఓ భగవానుడా! నీవు సకలప్రాణుల బుద్దిగు హయందు సాక్షి రూపుడవై నిలిచి, ఆటంకములు లేని నీ చిర్ఘనస్వరూపముచే ఆ ప్రాణుల అంతఃకరణములోని సంకల్పములను దర్శించుచునే యున్నావు.
వ్రతాపి వాతమానస్య నాథ నాథయ నాథితమ్ ।
పరాననే యాతా కూపే జానీయాం తే త్వరూపిణః ॥
ఓ తండ్రీ! అయినప్పటికీ, నేను ఒక కోరికను కోరుచున్నాను. నేను సృష్టికార్యము విషయములో పీడను పొందియున్నాను. నాకు సృష్టిసామ ర్థ్యమును ఇమ్ము, మరియు, రూపవిహీనుడవైన నీకు మాయాసంబంధ ముచే సంప్రాప్తమైన స్థూలసూక్ష్మరూపములను రెండింటినీ నేను యథాత ధసుగా తెలియగోరుచున్నాను. నా కోరికను తీర్చుము.
యథాత్మమాయాయోగేన నానాశక్త్యుపబృంహితమ్ ।
విలుంపస్ సృజన్ గృహ్ణన్ బిభ్రదత్మానమాత్మనా ॥
క్రీడస్యమోఘసంకల్ప ఊర్ణనాభర్యథోర్ణుతే ।
తథా తద్విషయాం దేహీ మనీషాం మయి మాధవ ॥
ఓ లక్ష్మీపతీ! సాలె పురుగు తనను మాత్రమే ఉపాదానముగా చేసుకోని గూడును అల్లు విధముగా, మొక్కవోని సంకల్పము గల నీవు నిన్నే జగద్రూపముగా ప్రకటించుచున్నావు. నీవు మాయాశక్తియొక్క ఉపా ధిని స్వీకరించు వాడవై, ఇరువది ఐదు తత్త్వములతో కూడియున్న జగత్తును సృష్టించి పాలించి పోషించి ఉపసంహరిస్తూ క్రీడించుచున్నావు. నీవు ఈ జగత్తుయొక్క సృష్టిస్థితిలయములను చేసే విధానము యథాతథ ముగా నాకు అవగాహనకు వచ్చునట్లు జ్ఞానమును ఇమ్ము.
భగవచ్చి క్షితమహం కరవాణి హ్యతంద్రితః ।
నేహమానః ప్రజాసర్గం బధ్యేయం యదనుగ్రహాత్ ॥
నేను భగవానుని ఆదేశముచే ప్రజాసృష్టిని నిశ్చితముగా సోమరిత నము లేకుండగా చేసెదను. కాని, భగవానుని అనుగ్రహము వలన సృష్టిని చేసే నాయందు కర్తృత్వము (అహంకారము) మొదలగు దోషములు బయలుదేరి, నన్ను బంధించకుండును గాక!
యావత్సఖా సఖ్యురివేశ తే కృతః
ప్రజావిసర్గే విభజామి భో జనమ్ ।
అవిక్లబస్తే పరికర్మణి స్థితో
మా మే సమున్నద్ధమదోకజమానినః ॥
ఓ ఈశ్వరా! నీవు నాకు హితమును చేసే మిత్రుడవు. నన్ను మిత్రుని వలె నీతో సమానముగా ఆదరించినావు. నేను మనోవ్యాకులత లేని వాడనై ప్రజాసృష్టి అనే నీ సేవయందు స్థిరముగా నున్నాను. నేను వివిధ ప్రాణులను సృష్టించెదను. కాని, సృష్టిని చేయుచున్న నాకు, జన్మలేని వాడను, స్వతంత్రుడను అనే ఉత్కటమగు గర్వము కలుగకుండును గాక!
శ్రీభగవానువాచ ।
జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞానసమన్వితమ్ ॥
సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా ॥
శ్రీభగవానుడు ఇట్లు పలికెను: నేను నీకు మిక్కిలి రహస్యమైనది, భక్తితో కూడియున్నది, అనుభవముతో జతగూడినది అగు నా జ్ఞానమును, దానిని పొందే సాధనమును ఉపదేశించేదను. స్వీకరించుము.
యావానహం యథాభావో యద్రూపగుణకర్మకః ।
తథైవ తత్త్వవిజ్ఞానమస్తు తే మదనుగ్రహాత్ ॥
నేను ఎంతటివాడను? నా ఉనికి (స్వరూపము) ఎట్టిది? నా రూప మేది? గుణములు ఎయ్యవి? నా చేష్టలు ఎట్టివి? ఈ విషయములన్నియు నీకు నా అనుగ్రహముచే యథాతథముగా అనుభవపూర్వకముగా తెలియుగాక!
అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్సదసత్పరమ్ ।
పశ్చాదహం యదేచచ్చ యోవశిష్యేత సోస్మ్యహమ్ ॥
సృష్టికి పూర్వమునందు ఉన్నది నేను మాత్రమే. అప్పుడు ఈ గాని లేవు. సృష్టి తరువాతనైననూ ఈ కంటికి కనబడే విశ్వము నేనే. ప్రలయమునందు మిగిలి ఉండేది కూడ నేనే.
ఋతేకార్థం యతతీయేత న ప్రతీయేత చాత్మని ।
తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథా తమః ॥
ఆకాశములో రెండు చంద్రులు లేరు. అయిననూ, కంటికి వ్రేలును అడ్డుగా పెట్టి చూచినచో, రెండు చంద్రులు కానవచ్చెదరు. మరియు, గ్రహ మండలములో రాహువు ఉన్ననూ, కానవచ్చుట లేదు. అదే విధముగా, అధిష్ఠానమగు బ్రహ్మయందు నానాత్వము (జగత్తు) వాస్తవముగా లేకున్న నూ, కొనవచ్చుచున్నది. సద్రూపమగు (ఉనికియే స్వరూపముగా గల) బ్రహ్మ భాసించుటనే లేదు. ఇదియే నా మాయ.
యథా మహంతి భూతాని భూతేషూచ్చావచేష్వను ।
ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహమ్ ॥
భౌతికపదార్థములు పంచమహాభూతముల వికారములగుటచే ఒక దృష్టికోణములో ఆ మహాభూతములు వాటియందు ప్రవేశించి యున్నవని చెప్పదగును. కానీ, మరియొక దృష్టికోణములో కారణములగు మహాభూ తములయందు మాత్రమే కార్యములు భాసించుచుండుటచే, అవి సర్వకా లములలో ముందే ఉండియుండుటచే, కొత్తగా ప్రవేశించినవని చెప్ప బని లేదు. అదే విధముగా విశ్వములోని సర్వదృశ్యవస్తువులు నాయందు అధ్య స్తములై భాసించుచున్నవి. కావున, ఒక దృష్టికోణములో సర్వమునందు సత్తాస్ఫూర్తిరూపముగా నేను ప్రవేశించి యున్నానని చెప్పిననూ, పరమా ర్థములో నాకంటే భిన్నముగా రెండవ వస్తువు లేదు గనుక, వాస్తవమగు ప్రవేశము పొసగదు. (ఈశ్వరుడు ప్రవేశించినాడనగా, సర్వపదార్థములలో సత్తాస్ఫూర్తుల రూపముగా ఈశ్వరుడు ఉపలభ్యమగుచున్నాడని మాత్రమే తాత్పర్యము).
ఏతావదేవ జిజ్ఞాస్యం తత్త్వజిజ్ఞాసునాత్మనః ।
అన్వయవ్యతిరేకాభ్యాం యత్ స్యాత్సర్వత్ర సర్వదా ॥
ఏదైతే సర్వదేశకాలములలో కారణరూపముగా అనువృత్తమగుచు న్ననూ, పరమార్థములో కార్యముకంటే విలక్షణముగా నుండునో, లేదా, జాగ్రత్తు మొదలగు అనుభవములన్నింటిలో స్పూర్తి రూపముగా అనువృత్త మగుచున్ననూ, పరమార్థముగా అనుభవములకు అతీతమగు చిదనమై యుండునో, అదియే ఆత్మ. ఆత్మతత్త్వమును తెలియగోరు జిజ్ఞాసువు ఈ విధమగు విచారమును చేసిన చాలును.
ఏతన్మతం సమాతిష్ఠ పరమేణ సమాధినా ।
భవాన్ కల్పవికల్పేషు న విముహ్యతి కర్హిచిత్ ॥
స్థిరమగు చిత్తైకాగ్రతతో నేను చెప్పిన ఈ సిద్ధాంతమునందు చక్కగా నిలిచి యుండుము. నీవు కల్పములో చేసే వివిధసృష్టులలో ఏ కాలమునందైననూ మోహమును పొందవు.
శ్రీశుక ఉవాచ ।
సంప్రది శైవమజనో జనానాం పరమేష్ఠినమ్ ।
పశ్యతస్తస్య తద్రూపమాత్మనో న్యరుణద్ధరిః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను: పుట్టుక లేని శ్రీహరి పుట్టుక గల ప్రాణులపై సర్వాధిపతియగు బ్రహ్మకు ఈ విధముగా ఉపదేశించి, ఆయన చూచుచుండగనే తన ఆ రూపమును అంతర్ధానము చేసెను.
అంతర్హితేంద్రియార్థాయ హరయే విహితాంజలిః ।
సర్వభూతమయో విశ్వం ససర్జదం స పూర్వవత్ ॥
శ్రీహరి అంతర్ధానమై తన రూపమును బ్రహ్మ కన్నుల యెదుట నుండి ఉపసంహరించెను. సకలప్రాణుల సమష్టిస్వరూపుడగు బ్రహ్మ ఆయనకు చేతులను జోడించి నమస్కరించి, పూర్వకల్పమునందు వలెనే ఈ జగత్తును సృష్టించెను.
ప్రజాపతిర్దర్మపతిరేకదా నియమాన్ యమాన్ ।
భద్రం ప్రజానామన్వచ్ఛన్నాతిష్ఠత్స్వార్థకామ్యయా ॥
ధర్మమును పాలించే ఆ బ్రహ్మ ఒకనాడు ప్రజల కల్యాణమును గురించి దీర్ఘముగా ఆలోచించెను. ప్రజలకు కల్యాణమును కలిగించ వలె ననే కోరికతో ఆయన అహింస, సత్యము, పరధనమును భావనలోనైననూ అపహరించకుండుట, బ్రహ్మచర్యము, భోగలాలసత లేకుండుట అనే ఐదు యమములను, లోపల బయట శుద్ధి, ఉన్నదానితో సంతృప్తిని చెందుట, తపస్సు, మోక్షశాస్త్రమును అధ్యయనము చేయుట, ఈశ్వర శరణాగతి అనే అయిదు నియమములను అనుష్ఠించెను.
తం నారదః ప్రియతమా రిక్థాదానామనువ్రతః ।
శుశ్రూషమాణశ్శీలేన ప్రశ్రయేణ దమేన చ ॥
మాయాం వివిదిషన్ విష్ణోర్మాణేశస్య మహామునిః।
మహాభాగవతో రాజన్ పితరం పర్యతోషయత్ ॥
ఓ మహారాజా! గొప్ప భగవద్భక్తుడగు నారదమహర్షి బ్రహ్మ యొక్క పుత్రులందరిలో ఆయనకు మిక్కిలి ప్రియమైనవాడు మరియు విధే యుడు. ఆ నారదుడు మాయను వశము చేసుకొనియున్న శ్రీహరియొక్క మాయను గురించి తెలియగోరి, తన తండ్రియగు బ్రహ్మగారిని సచ్చీలము తో, వినయముతో మరియు ఇంద్రియనిగ్రహముతో సేవించి, ఆయనను సంతోషపెట్టెను.
తుష్ఠం నిశామ్య పితరం లోకానాం ప్రపితామహమ్ ।
దేవర్షిః పరిపప్రచ్ఛ భవాన్ యన్మాకనుపృచ్ఛతి ॥
లోకములకు ఆదికర్త, పితామహుడు అగు తన తండ్రి తన విషయ ములో సంతసించి యున్నాడని గమనించిన దేవర్షియగు నారదుడు ఆయ నను, నీవు నన్ను అడిగిన విధముగనే ప్రశ్నించెను.
తస్మా ఇదం భాగవతం పురాణం దశలక్షణమ్ ।
ప్రోక్తం భగవతా ప్రాహ ప్రీతః పుత్రాయ భూతకృత్ ॥
ప్రాణులను సృష్టించిన బ్రహ్మ తన పుత్రుడగు నారదుని విషయ ములో చాల సంతసించి శ్రీహరి భగవానునిచే తనకు బోధించబడిన ఈ భాగవత పురాణమును ఆయనకు బోధించెను. దీనియందు పది లక్షణ ములు గలవు.
నారదః ప్రాహ మునయే సరస్వత్యాస్తటే నృప ।
ధ్యాయతే బ్రహ్మ పరమం వ్యాసాయామితతేజసే॥
ఓ మహారాజా! సరస్వతీ నదీతీరమునందు మహాతేజశ్శాలియగు వ్యాసమహర్షి పరబ్రహ్మను ధ్యానము చేయుచుండగా, నారదుడు విచ్చేసి ఆయనకు దీనిని బోధించెను.
యదుతాహం త్వయా పృష్టో వైరాజాత్పురుషాదీదమ్ ।
యథాసీత్తదుపాఖ్యాస్యే ప్రశ్నానన్యాంశ్చ కృత్స్నశః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ద్వితీయస్కంధే నవమోధ్యాయః ॥
ఈ జగత్తు విరాట్ పురుషునినుండి ఉద్భవించిన విధమెట్టిది? అని కూడ నీవు నన్ను ప్రశ్నించితివి. ఆ ప్రశ్నకు మాత్రమే గాక, ఇతరప్రశ్నలకు కూడ సంపూర్ణముగా సమాధానమును చెప్పగలను.
శ్రీమద్భాగవత మహాపురాణములోని రెండవ స్కంధములో తొమ్మిదవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 9 of the Bhāgavata Mahā Purana is as follows:
Śukadeva Gosvāmī explains that the soul's entanglement in the material world is purely due to the illusory potency of the Supreme Lord, which disappears upon spiritual awakening. He reveals the divine Chatuh-shlokī Bhāgavatam, the four essential original verses spoken directly by Lord Vāsudeva to Lord Brahmā at the dawn of creation, which convey the core truth that the Supreme Lord existed before creation, exists during creation, remains after dissolution, and is the ultimate reality to be sought through devotional inquiry.