భాగవత మహా పురాణము
16 - చిత్రకేతువునకు పరమాత్మ సాక్షాత్కరించుట
శ్రీశుక ఉవాచ ।
అథ దేవఋషీ రాజన్ సంపరేతం నృపాత్మజమ్ । .
దర్శయిత్వేతి హోవాచ జ్ఞాతీనామనుశోచతామ్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! తరువాత దేవర్షియగు నారదుడు మరణించిన రాజకుమారుని జీవుని (సూక్ష్మశరీరమును) దుఃఖించుచున్న బంధువులకు చూపించి, ఇట్లు పలికెను.
నారద ఉవాచ ।
జీవాత్మన్ పశ్య భద్రం తే మాతరం పితరం చ తే ।
సుహృదో బాంధవాస్తప్తాశ్శుచా త్వత్కృతయా భృశమ్ ॥
నారద మహర్షి ఇట్లు పలికెను --- ఓ జీవుడా! నీకు మంగళమగు గాక! నీ తల్లిదండ్రులను చూడుము. మిత్రులు, బంధువులు నీ కారణముగా కలిగిన దుఃఖముచే అధికమగు తాపమును పొంది యున్నారు.
కలేవరం స్వమావిశ్య శేషమాయుస్సుహృద్వృతః ।
భుంక్ష్వ భోగాన్ పితృప్రత్తానధితిష్ఠ నృపాసనమ్ ॥
నీ దేహములో నీవు ప్రవేశించుము. మిగిలియున్న ఆయుర్దాయమును నీ మిత్రులతో గూడి నీ తండ్రి ఇచ్చిన భోగములననుభవించుము. రాజ సింహాసనము నధిష్ఠించుము.
జీవ ఉవాచ ।
కస్మిన్ జన్మన్యమీ మహ్యం పితరో మాతరోఽభవన్ ।
కర్మభిర్భ్రామ్యమాణస్య దేవతిర్యజ్నృయోనిషు ॥
కర్మలు నన్ను దేవతలు, పశుపక్ష్యాదులు మరియు మానవుల జన్మలలో త్రిప్పుచున్నవి. ఆ జన్మలలో వీరు నాకు తండ్రులు, తల్లులు అయిన జన్మ ఏది?
బంధుజ్ఞాత్యమధ్యస్థమిత్రోదాసీనవిద్విషః ।
సర్వ ఏవ హి సర్వేషాం భవంతి క్రమశో మిథః ॥
వివిధజన్మలలో అందరు అందరికి పరస్పరము క్రమముగా బంధువులు, జ్ఞాతులు (ఒకే కుటుంబమువారు), శత్రువులు, మధ్యస్థులు, ఉదాసీనులు (కలుగజేసుకొనని వారు), ద్వేషించువారు అగుచునే యుందురు.
యథా వస్తూని పణ్యాని హేమాదీని తతస్తతః ।
పర్యటంతి నరేష్వేవం జీవో యోనిషు కర్తృషు ॥
క్రయవిక్రయములు చేయదగిన బంగారము మొదలగు వస్తువులు జనులలో ఒకనినుండి మరియొకనికి, మరల వానినుండి ఇంకొకనికీ, ఈ విధముగా చుట్టూ తిరుగుచుండును. ఇదే విధముగా, జీవుడు తల్లిదండ్రు లలో తిరుగుచుండును.
నిత్యస్యార్థస్య సంబంధో హ్యనిత్యో దృశ్యతే నృషు ।
యావద్యస్య హి సంబంధో మమత్వం తావదేవ హి ॥
స్థిరముగానుండే బంగారము మొదలగు వస్తువులకు కూడ మనుష్యులతోడి సంబంధము అనిత్యముగనే యున్నదని మనకు అనుభవములో తెలియుచునే యున్నది. ఒక వ్యక్తికి ఒక వస్తువుతో ఎంతవరకు సంబంధముండునో, అంతవరకు మాత్రమే మమకారము ఉండును గదా!
ఏవం యోనిగతో జీవస్స నిత్యో నిరహంకృతః।
యావద్యత్రోపలభ్యేత తావత్స్వత్వం హి తస్య తత్ ॥
నిత్యుడగు జీవుడు తల్లి కడుపున జన్మించి ఆ దేహమునందు దేహియై ఉండును. జీవునకా దేహమునందు, నేను అనే ధారణ వాస్తవము కాదు. జీవుడు ఎంతవరకైతే ఒక దేహమునందు ప్రకటమగునో, అంతవరకు ఆ దేహమునందు, నేను నాది అనే ధారణను కలిగియుండును.
ఏష నిత్యోఽవ్యయసూక్ష్మ ఏష సర్వాశ్రయస్స్వదృక్ ।
ఆత్మమాయాగుణైర్విశ్వమాత్మానం సృజతి ప్రభుః ॥
కాలమునకు అతీతుడు, అపక్షయము లేనివాడు, ఇంద్రియగోచరము కానివాడు, సర్వమునకు ఆశ్రయుడు, స్వయంప్రకాశస్వరూపుడు అగు ఈ జీవుడు, తన మాయాశక్తియొక్క సత్త్వరజస్తమోగుణములచే తానే జగద్రూపముగా ప్రకటమగుచున్న సర్వశక్తిమంతమగు పరబ్రహ్మ వాస్తవ ముగా ఒక్కటియే.
న హ్యస్యాతిప్రియః కశ్చిన్నాప్రియస్స్వ పరోకపి వా ।
ఏకస్సర్వధియాం ద్రష్టా కర్తృణాం గుణదోషయోః ॥
జీవుని యథార్జస్వరూపము అసంగ-ఆత్మ. అద్వితీయమగు ఆత్మకు ప్రియుడు గాని, శత్రువు గాని, తనవారు గాని, పరాయి వారు గాని లేరు. ధర్మాధర్మముల కర్తృత్వము బుద్ధినిష్ఠము. అట్టి బుద్ధిలోని వృత్తు లను ఆత్మ ప్రకాశింపజేస్తూ, దృక్-స్వరూపముగా నిలిచియుండును.
నాదత్త ఆత్మా హి గుణం న దోషం న క్రియాఫలమ్ ।
ఉదాసీనవదాసీనః పరావరదృగీశ్వరః ॥
ఆత్మకు పుణ్యపాపములతో గాని, కర్మఫలములగు సుఖదుఃఖము లతో గాని సంగము లేదు. సర్వస్వతంత్రమగు ఆత్మ ఉదాసీనముగా స్వరూపమునందు నిలిచి, కారణకార్యములను ప్రకాశింపజేస్తూ, వాటికి సాక్షిగా నుండును.
శ్రీశుక ఉవాచ ।
ఇత్యుదీర్య గతో జీవో జ్ఞాతయస్తస్య తే తదా ।
విస్మితా ముముచుశ్శోకం ఛిత్త్వాత్మ స్నేహశృంఖలామ్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- జీవుడు ఈ విధముగా పలికి నిషమించెను. అప్పుడు వాని ఆ జ్ఞాతులు తమలోని ఆసక్తి అనే సంకె లను ఛేదించి, శోకమును విడిచి పెట్టిరి.
నిర్ఘృత్య జ్ఞాతయో జ్ఞాతేర్దేహం కృత్వోచితాః క్రియాః ।
తత్యజుర్దుస్త్యజం స్నేహం శోకమోహభయార్తిదమ్ ॥
జ్ఞాతులు తమ తియగు ఆ బాలకుని దేహమును దహించి, ఉత్తరక్రియలను యథోచితముగా చేసిరి. వారు ఆ బాలకునిపై గల ఆసక్తిని విడనాడిరి. విడిచి పెట్ట శక్యము కాని ఈ ఆసక్తియే మానవులకు దుఃఖమును, వ్యామోహమును, భయమును, మానసిక పీడను కలిగించుచుండును.
బాలఘ్న్యో ప్రీడితాస్తత్ర బాలహత్యాహతప్రభాః ।
బాలహత్యావ్రతం చేరురాహ్మ ణెర్యన్నిరూపితమ్ ।
యమునాయాం మహారాజ స్మరంత్యో ద్విజభాషితమ్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! అప్పుడు బాలకుని చంపిన రాణుల ముఖ కాంతి బాలుని హత్యచే నశించెను. వారు తాము చేసిన పనికి సిగ్గు తెచ్చు కొని, అంగీరసుని ఉపదేశమును స్మరించిరి. వేదవేత్తలు బాలకుని హత్యకు ప్రాయశ్చిత్తమును ప్రతిపాదించిరి. అపుడు వారా ప్రాయశ్చిత్తమును యమునానదియందు నిర్వర్తించిరి.
స ఇత్థం ప్రతిబుద్ధాత్మా చిత్రకేతుర్ద్విజోక్తిభిః ।
గృహాంధకూపాన్నిషాంతస్సరఃపంకాదివ ద్విపః ॥
నారదుడు, అంగిరసుడు చేసిన ఉపదేశము వలన చిత్రకేతువు యొక్క అంతఃకరణము జాగృతమయ్యెను. సరస్సులోని బురదనుండి ఏనుగు వలే, ఆయన ఇల్లు అనే అజ్ఞానాంధకారపు గుయ్యారమునుండి నిష్క్రమించెను.
కాలింద్యాం విధివత్ స్నాత్వా కృతపుణ్యజలక్రీయః ।
మౌనేన సంయతప్రాణో బ్రహ్మపుత్రావవందత ॥
ఆయన యమునానదిలో యథావిధిగా స్నానము చేసి, పవిత్ర మగు తర్పణాది కర్మలను నిర్వర్తించెను. తరువాత మౌనముగానుండి ప్రాణాయామమును చేసెను. పిదప ఆయన బ్రహ్మపుత్రులగు అంగీరస నారదులకు నమస్కరించెను.
అథ తస్మై ప్రపన్నాయ భక్తాయ ప్రయతాత్మనే ।
భగవాన్నారదః ప్రేతో విద్యామేతామువాచ హ ॥
తరువాత, భక్తుడగు చిత్రకేతువు మనోనిగ్రహము గలవాడై పూజనీ యుడగు నారదుని శరణు వేడెను. ఆయన సంతోషించి ఈ ఉపాసనను బోధించెను.
ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ।
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ నమస్సంకర్షణాయ చ ॥
భగవంతుడగు వాసుదేవుని కొరకు, ప్రద్యుమ్న (శ్రీకృష్ణుని పుత్రు డు), అనిరుద్ద (మనుమడు), సంకర్షణుల (సోదరుడు) కొరకు మనస్సులో నమస్కారమును భావన చేయుచున్నాము. లేదా, ఆ నామములు గల నాలుగు వ్యూహములకు నమస్కారము. లేదా, సర్వజగన్నివాసుడు, ప్రకా శస్వరూపుడు, తేజస్స్వరూపుడు, స్వతంత్రుడు, ప్రేమస్వరూపుడై భక్తు లను తన వద్దకు ఆకర్షించువాడు అగు భగవానునకు, అనగా ఓ దేవా! నీకు, మనస్సులో నమస్కారమును భావన చేయుచున్నాము.
నమో విజ్ఞానమాత్రాయ పరమానందమూర్తయే ।
ఆత్మారామాయ శాంతాయ నివృత్తద్వైతదృష్టయే ॥
శుద్దజ్ఞానస్వరూపుడు, పరమానందఘనుడు, ఆత్మారాముడు (తన ఆనందము కొరకు ఇతరముపై ఆధారపడనివాడు), శాంతుడు (స్వరూపమునందు చలనము లేనివాడు), భేదదృష్టి లేనివాడు అగు భగవాను నకు నమస్కారము.
ఆత్మానందానుభూత్యైవ న్యస్తశక్యూర్మయే నమః ।
హృషీ కేశాయ మహతే నమస్తే విశ్వమూర్తయే ॥
నీవు నీ స్వరూపమగు ఆనందముయొక్క అనుభూతి చేతనే మాయనుండి పుట్టే రాగద్వేషములను త్రోసిపుచ్చితివి. నీవు దేశపరిచ్ఛేద రహితుడవే అయిననూ, ఇంద్రియాధిపతివై ఉన్నావు. జగద్రూపముగా ప్రక టమై యున్న నీకు నమస్కారము.
వచస్యుపరతేప్రాప్య య ఏకో మనసా సహ ।
అనామరూపశ్చిన్మాత్రస్సో వ్యాన్నస్సదసత్పరః ॥
వాక్కు, మనస్సు కలిసి నామరూపములు లేని భగవానుని చేరు టకు ప్రయత్నించి విఫలమై వెనుదిరిగినవి (భగవానుడు వాక్కులకు, మన స్సునకు గోచరుడు కాడు). అద్వితీయుడు, శుద్ధచైతన్యమే స్వరూపముగా గలవాడు, కార్య (జగత్తు) కారణము (మాయాశక్తి) లకు అతీతుడు అగు ఆ పరమేశ్వరుడు మమ్ములను రక్షించు గాక!
యస్మిన్నదం యతశ్చేదం తిష్ఠత్యహ్యేతి జాయతే ।
మృణ్మయేష్వివ మృజ్ఞాతిస్తస్మై తే బ్రహ్మణే నమః ॥
ఈ జగత్తు పరబ్రహ్మనుండి పుట్టి, పరబ్రహ్మయందే మనుగడను సాగించి, పరబ్రహ్మయందే విలీనమగును. మట్టితో చేసిన ఘటాదుల యందు మట్టి అనుస్యూతముగ నుండును. అదే విధముగా, ఈ జగత్తు నందు పరబ్రహ్మ అనుస్యూతమై యున్నది. అట్టి పరబ్రహ్మవు నీవే. నీకు నమస్కారము.
యన్న స్పృశంతి న విదుర్మనోబుద్ధీంద్రియాసవః ।
అంతర్బహిశ్చ వితతం వ్యోమవత్తన్నతోకస్మ్యహమ్ ॥
పరబ్రహ్మ ఆకాశము వలె లోపల బయట కూడ వ్యాపించి యున్న ది. దానిని మనస్సు (సంకల్ప వికల్పాత్మకము), బుద్ధి (నిశ్చయాత్మకము), జ్ఞానేంద్రియములు తెలియలేవు. దానిని కర్మేంద్రియములు స్పృశించలే వు. అట్టి పరబ్రహ్మకు నేను నమస్కరించుచున్నాను.
దేహేంద్రియప్రాణమనోధియోమీ
యదంశవిద్దాః ప్రచరంతి కర్మసు ।
నైవాన్యదా లోహమివాప్రతప్తం
స్థానేషు తద్దృష్ట్రపదేశమేతి ॥
ఈ దేహము, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు, బుద్ది అను నవి పరబ్రహ్మయొక్క చైతన్యాంశముచే ఆవేశించబడి, నిప్పులలో కాలిన గుండు ఇతరమును గ్రహించునట్లు, తమ తమ వ్యాపారములయందు ప్రవ ర్తిల్లుచున్నవి. అట్లు గానిచో, నిప్పులలో కాల్చని గుండు దేనినీ కాల్చలేని విధముగనే, అవి కూడ తమ వ్యాపారములను చేయలేవు. ఈ దేహేంద్రి యాదుల సంఘాతమునందు ఆ పరబ్రహ్మ చైతన్యము అభివ్యక్తమవుతూ, జాగ్రత్తు మొదలగు అవస్థలయందు ఆ అవస్థలకు సాక్షి అని వ్యవహరించ బడుచున్నది.
ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహా విభూతిపతయే సకలసాత్వతపరివృఢనికరకరకమలకుడ్మలో లాలితచరణారవిందయుగల పరమ పరమేష్ఠిన్నమస్తే ॥
ఓమ్. గొప్ప మహిమ గలవాడు, గొప్ప విభూతులకు (లక్ష్మీదేవికి) ప్రభువు అగు పురుషోత్తమ భగవానునకు నమస్కారము. ఓ సర్వేశ్వరా! భక్తశిఖామణులందరు గుంపులుగా చేరి పద్మములవంటి తమ చేతులను జోడించి, మొగ్గలవంటి ఆ దోసిళ్లతో సర్వాతీతుడవగు నీ పద్మములవంటి పాదముల జంటను సేవించుచున్నారు. నీకు నమస్కారము.
శ్రీశుక ఉవాచ ।
భక్తాయైతాం ప్రపన్నాయ విద్యామాదిశ్య నారదః।
యయావంగిరసా సాకం ధామ స్వాయంభువం ప్రభో ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! భక్తుడగు చిత్రకేతువు శరణు వేడగా, నారదుడు ఆయనకీ ఉపాసనను ఉపదేశించి, తరువాత అంగిరసునితో గూడి స్వయంభువుడగు బ్రహ్మగారి ధామమునకు వెళ్లాను.
చిత్రకేతుస్తు విద్యాం తాం యథా నారదభాషితామ్ ।
ధారయామాస సప్తాహమబ్భక్షస్సుసమాహితః ॥
నారదుడు ఉపదేశించిన ఈ మంత్రమును చిత్ర కేతువు యథాతథ ముగా ఏడు రోజులు మిక్కిలి ఏకాగ్రమగు చిత్తముతో జపించెను. ఆ సమ యములో ఆయన కేవలము నీటిని మాత్రమే ఆహారముగా తీసుకొనెను.
తతశ్చ సప్తరాత్రాంతే విద్యయా ధార్యమాణయా ।
విద్యాధరాధిపత్యం స లేభేకప్రతిహతం నృపః ॥
ఆ రాజు ఈ మంత్రమును ఏడు రోజులు జపించెను. అపుడాతనికి దాని ప్రభావముచే విద్యాధరులపై ఎదురు లేని అధీశ్వరత్వము లభించెను.
తతః కతిపయాహోభిర్విద్యయేద్దమనోగతిః ।
జగామ దేవదేవస్య శేషస్య చరణాంతికమ్ ॥
మంత్రప్రభావముచే ఆయన మానసిక ప్రవృత్తి చాల పరిశుద్ధము య్యేను. కొన్ని రోజుల తరువాత ఆయన దేవదేవుడగు ఆది శేషుని పాద ముల వద్దకు వెళ్లెను.
మృణాలగౌరం శితివాససం స్పురత్-
కిరీటకేయూరకటిత్రకంకణమ్ ।
ప్రసన్నవక్తారుణలోచనం వృతం
దదర్శ సిద్దేశ్వరమండలైః ప్రభుమ్ ॥
చిత్రకేతువు సిద్దేశ్వరుల గుంపుల మండలములోనున్న ఆది శేష ప్రభుని చూచెను. తామరతూడు వలె తెల్లని ఆదిశేషుడు నల్లని వస్త్ర మును దాల్చెను. ఆయన కిరీటము, భుజపురులు, మొలనూలు, కంకణ ములతో ప్రకాశించుచుండెను. ఆయన ముఖములు ప్రసన్నములుగను, కన్నులు ఎర్రగను ఉండెను.
తద్దర్శనధ్వస్తసమస్తకిల్బిషః
స్వచ్చామలాంతఃకరణేభ్యయాన్మునిః ।
ప్రవృద్ధభక్త్యా ప్రణయాశ్రులోచనః
ప్రహృష్టరోమాన్నమదాదిపూరుషమ్ ॥
చిత్ర కేతువు పాపములన్నియు ఆయన దర్శనముచే నశించి, అంతఃకరణము స్వచ్ఛము, నిర్మలము ఆయెను. మౌనముగానున్న ఆయన కళ్లు ప్రేమచే నీటితో నిండెను. శరీరమంతటా రోమములు గగుర్పా టును పొందెను. అధికముగా వర్ధిల్లిన భక్తితో ఆతడు, జగత్కారణుడు పూర్ణుడు అగు సంకర్షణ దేవుని యెదుటకు వచ్చి నమస్కరించెను.
స ఉత్తమశ్లోకపదాబ్జవిష్ణరం ప్రేమాశ్రులే శైరుపమేహయన్ముహుః,
ప్రేమోపరుద్ధాఖిలవర్ణనిర్గమో నైవాశకత్తం ప్రసమీడితుం చిరమ్ ।
ఆ చిత్రకేతువు పవిత్రకీర్తియగు సంకర్షణ దేవుని పాదపద్మముల పీఠమును ప్రేమచే తన కన్నులనుండి స్రవించే నీటి బిందువులతో అభిషే కించెను. అన్ని అక్షరముల ఉచ్చారణను భక్తిచే కలిగిన డగ్గుత్తిక అడ్డు కొనేను. చాల సేపటి వరకు ఆతడు ఆయనను చక్కగా స్తుతించనే లేక పోయెను.
తతస్సమాధాయ మనో మనీషయా
బభాష ఏతతతిలబ్దవాగసౌ ।
నియమ్య సర్వేంద్రియబాహ్యవర్తనం
జగద్గురుం సాత్వతశాస్త్రవిగ్రహమ్ ॥
తరువాత ఆ చిత్ర కేతువు సంకల్పశక్తిచే మనస్సును ఏకాగ్రము చేసి, తిరిగి ఉచ్చారణ శక్తిని పొందెను. ఆతడు ఇంద్రియములు బయటకు పోకుండా నియమించి సంకర్షణ దేవునితో నిట్లనెను. జగత్తునకు తండ్రి యగు ఆ దేవుడు భక్తి శాస్త్రము వర్ణించే రూపమును కలిగియుండెను (సాత్వతశాస్త్రమగు భాగవతమే ఆయన రూపము). చిత్రకేతురువాచ ।
అజిత జితస్సమమతిభిస్సాధుభిర్భవాన్ జితాత్మభిర్భవతా,
విజితా స్తీపి చ భజతామకామాత్మనాం య ఆత్మదోతికరుణః ।
పరాజయము లేని ఓ దేవా! సర్వమునందు సముడగు ఈశ్వరుని దర్శిస్తూ మనస్సును జయించిన సత్పురుషులు నిన్ను తమ వశము చేసు కొనెదరు. నీవు కూడ వారిని నీ వశము చేసుకొనెదను. మనస్సులో కామనలు లేకుండా భక్తిని చేయువారలకు పరమదయామూర్తివగు నీవు నిన్నే సమర్పించెదవు.
తవ విభవః ఖలు భగవన్ జగదుదయస్థితిలయాదీని ।
విశ్వసృజస్తేకాంశాంశాస్తత్ర మృషా స్పర్ధంతే పృథగభిమత్యా ॥
ఓ భగవానుడా! జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయము, మరల సృష్టిని అనుగ్రహించుట మొదలగు జగద్వ్యాపారములు నీ లీలావిలాస ములు మాత్రమే. జగత్తును సృష్టించే ప్రజాపతులు నీ అంశయగు హిరణ్య గర్బుని అంశలు. వారు ఆ జగత్తులో, మేము వేరుగా నున్నాము అనే అభి మానముతో వ్యర్థముగా పోటీ పడుతున్నారు.
పరమాణుపరమమహతోస్త్వమాద్యంతాంతరవర్తీ త్రయవిధురః ।
ఆదావంతేపి చ సత్త్వానాం యద్ధ్రువం తదేవాంతరాలేపి ॥
మిక్కిలి చిన్నదియగు పరమాణువునుండి మొదలిడి మిక్కిలి పెద్ద దియగు మహత్తత్త్వము వరకు సకలపదార్థములయొక్క ఆది, మధ్య, అంతము నీవే. కాని, నీకు ఆది, అంతము, మధ్య లేవు. పదార్థముల యందు (కంఠాభరణము మొదలగునవి) ఏదైతే ఆది-అంతములలో స్థిర ముగానుండునో (బంగారము), మధ్యయందు కూడ అదియే ఉండును (అ నగా కర్ణాభరణము మిథ్య, బంగారము సత్యము. అదే విధముగా, జగత్తు మిథ్య, ఈశ్వరుడు సత్యము).
క్షిత్యాదిభిరేష కిలావృతస్సప్తభిర్దశగుణోత్త రైరాండకోశః ।
యత్ర పతత్యణుకల్పస్సహాండకోటికోటిభిస్తదనంతః ॥
పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తు అనే ఏడు తత్త్వములు ఒకదాని చుట్టుపోరి మరియొకటి పది రెట్లు చొప్పున ఈ బ్రహ్మాండము మొగ్గవలె నున్నది. ఇది, ఇటువంటి కోట్ల కోట్ల బ్రహ్మాండములు నీయందు ఒక కణమును పోలి తిరుగుచున్నవి. కావు ననే, నీవు అనంతుడని చెప్పబడుచున్నావు.
విషయతృషో నరపశవో య ఉపాసతే విభూతీర్న పరం త్వామ్ ।
తేషామాశిష ఈశ తదను వినశ్యంతి యథా రాజకులమ్ ॥
ఓ ఈశ్వరా! ఇంద్రియభోగములయందు తృష్ణ గల మానవులు పశుప్రాయులు. వారు సర్వోత్తముడవగు నిన్ను కాకుండా, నీ విభూతులైన ఇంద్రాది దేవతలను కొలిచెదరు. వారికి ఆ దేవతలచే అనుగ్రహించబడిన భోగములు, రాజకులము నశించుట తోడనే ఆ రోజు అనుగ్రహించిన సంప దలు వలె, ఆ దేవతలతో బాటే నశించును.
కామధేయస్త్వయి రచితా న పరమ రోహంతి యథా కరంభబీజాని,
జ్ఞానాత్మన్యగుణమయే గుణగణతోస్య ద్వంద్వజాలాని ॥
ఓ సర్వేశ్వరా! నీవు నిర్గుణచైతన్యస్వరూపుడవు గనుక, నీయందు చేయబడే సంకల్పములు కామనతో కూడినవే అయిననూ, వేయించిన విత్త నములు వలే కొత్త జన్మను కలిగించవు. ఈ జీవునకు సుఖదుఃఖాది ద్వంద్వముల పరంపర సత్త్వరజస్తమోగుణముల సముదాయము (గుణకార్యమగు ప్రపంచము) వలననే కలుగుచున్నది.
జితమజిత తదా భపతో యదాహ భాగవతం ధర్మమనవద్యమ్,
నిష్కించనా యే మునయ ఆత్మారామా యముసొసత్వేపవర్గాయ.
పరాజయమునెరుగని ఓ ఈశ్వరా! నీవేనాడైతే నిర్దోషమగు భాగ పత ధర్మమును ఉపదేశించితివో, ఆనాడు నీవు సర్వోత్కరగా సున్నావు. ఏలయనగా, అంచనులే (ప్రోగు చేయుట నేరుగనివారు) అయినవ ఆత్మస్వరూపమునందే రమించే మహర్షులు మోక్షము కొరకై ఆ ధర్మమునే ఉపాసించుచున్నారు.
విషమమతిర్న యత్ర నృణాం
త్వమహమితి మమ తవేతి చ యదన్యత్ర ।
విషమధియా రచితో యః
సహ్యవిశుద్దః క్షయిష్ణురధర్మబహులః ॥
భాగవత ధర్మము (నిష్కామభక్తి) లో నీవు, నేను, నీది, నాది అనే భేదబుద్ధికి తావు లేదు. సకామముగా చేసే ధర్మములో ఇట్టీ భేదబుద్ధి గలదు. వాస్తవములో సకామధర్మము భేదబుద్దిని పురస్కరించుకొనియే విధిం చబడుచున్నది. కావున, అది అంత పవిత్రమైనది కాదు. దాని వలన కలిగే ఫలములు కూడ శీఘ్రముగా నశించును. పైగా, దానిని ఆచరించుటలో హింస మొదలగు అధర్మము అధికముగనే యుండును.
కః క్షేమో నిజపరయోః కియానర్థస్స్వపరద్రుహా ధర్మేణ ।
స్వద్రోహాత్తవ కోపః పరసంపీడయా చ తథాధర్మః ॥
కామన కొరకు చేసే ధర్మము తనకు, ఇతరులకు కూడ ద్రోహ మును చేయును. దాని వలన తనకు గాని, ఇతరులకు గాని ఏమి క్షేమము కలుగును? దాని వలన ఒరిగే ప్రయోజనమేంతటిది? దాని వలన వ్యక్తి ఆత్మద్రోహమునకు పాల్పడినప్పుడు, నీ అనుగ్రహమునకు దూరుడగును. పైగా, ఇతరులకు దాని వలన పీడ కలుగుటచే వానికి అధర్మము (పాపము) కూడ చుట్టుకొనును.
న వ్యభిచరతి తవేక్షా యయా హ్యభిహితో భాగవతో ధర్మః ।
స్థిరచరసత్త్వకదంబేష్వపృథగ్గియో యముపాసతే త్వార్యాః ॥
ఓ భగవానుడా! నీవు ఏ దృష్టితో నిష్కామ భక్తి అనే భాగవత ధర్మము నుపదేశించితివో, (జీవుడు కృతార్థుడు కావాలనే) ఆ దృష్టి ఎన్న టికీ సత్యదూరము కాదు. చరాచరజగత్తును ఆత్మకంటే అభిన్నముగా దర్శించే మహాత్ములు ఆ ధర్మమునే ఉపాసించుచున్నారు.
న హి భగవన్నఘటితమిదం త్వద్దర్శనాన్నృణామఖిలపాపక్షయః, యన్నామసకృచ్ఛ్రవణాత్పుల్కసకోకపి విముచ్యతే సంసారాత్.
ఓ భగవానుడా! నీ దర్శనముచే మానవులకు సకలపాపములు నశించును అను వచనము అసంగతము కానే కాదు సుమా! ఏలయనగా, నీ నామమును ఒక్కసారి వినుటచే కసాయి కూడ సంసారబంధమునుండి విముక్తుడగుచున్నాడు.
అథ భగవన్ వయమధునా త్వదవలోకపరిమృష్టాశయమలాః ।
సురఋషిణా యదుదితం తావకేన కథమన్యథా భవతి ॥
ఓ భగవానుడా! కావున, నీ దర్శనముచే ఈనాడు మా అంతఃకర ణములోని మాలిన్యములు కడిగి వేయబడినవి. నీ భక్తుడు, దేవర్షి అగు నారదుడు చేసిన ఉపదేశము మరియొక విధముగా (వ్యర్థము) అగుట ఎట్లు సంభవము?
విదితమనంత సమస్తం తవ జగదాత్మనో జనైరిహాచరితమ్ ।
విజ్ఞాప్యం పరమగురోః కియదివ సవితుర్వ ఖద్యోతైః ॥
ఓ అనంతా! జగత్తు యొక్క పరమార్థ తత్త్వము నీవే. జగద్రూప ముగా నీవే ప్రకటమైనావు. అట్టి నీకు ఈ లోకములో జనులు చేసే సర్వము తెలియుచునే యుండును. నీవు తండ్రులకు తండ్రివి, గురువులకు, గురుడ వు. మిణుగురు పురుగులు సూర్యుని యెదుట ప్రకాశింప జేసేది ఏమి ఉండును? అదే విధముగా, నీ యెదుట విన్నవించేది (తెలుపుడుజేసేది) ఏమి ఉండును?
నమస్తుభ్యం భగవతే సకలజగత్స్థితిలయోదయేశాయ ।
దురవసితాత్మగతయే కుయోగినాం భిదా పరమహంసాయ ॥
ఓ భగవానుడా! సకలజగత్తుయొక్క సృష్టిస్థితిలయములకు అధీశ్వరుడవు నీవే. కేవలము భేదమును మాత్రమే దర్శించే అయోగ్యులగు సాధకులు నీ యథార్థతత్త్వమును తెలియజాలరు. పరమహంస (ఆత్మజ్ఞాని) కు నీకు తేడా లేదు. సూర్యాదులను కూడ ప్రకాశింప జేసేది నీవే. నీకు నమస్కారము.
యం వై శ్వసంతమను విశ్వసృజశ్శ్వసంతి
యే చేకితానమను చిత్తయ ఉచ్ఛకంతి ।
భూమండలం సర్షపాయతి యస్య మూర్ధ్ని
తస్మై నమో భగవతేస్తు సహస్రమూర్ధ్నే ॥
ఆ అనంతుని చేష్టను అనుసరించియే జగత్తును సృష్టించే ప్రజాప తులు చేష్టను చేయుచున్నారు (వారి శక్తి అనంతుని అధీనమై యున్నది). ఆయన ప్రాణులలో ఆత్మచైతన్యమై ప్రకాశించుచుండగా, ఆ ప్రకాశమున నుసరించి జ్ఞానేంద్రియములు శబ్దాది విషయములను ప్రకాశింప జేయుచు న్నవి. ఆయన పడగపై భూమండలము ఆవగింజ వలె నున్నది. అట్టి వేయి పడగల భగవానుని కొరకు నమస్కారము అగుగాక!
శ్రీశుక ఉవాచ ।
సంస్తుతో భగవానేవమునంతస్తమభాషత ।
విద్యాధరపతిం ప్రీతశ్చిత్ర కేతుం కురూద్వహ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కురువంశ శ్రేష్ఠుడవగు ఓ పరీక్షి న్మహారాజా! ఈ విధముగా విద్యాధరులకు ప్రభువగు చిత్రకేతువు అనంత భగవానుని చక్కగా స్తుతించెను. అపుడాయన ప్రసన్నుడై ఆతనితో నిట్లనె ను.
శ్రీభగవానువాచ ।
యన్నారదాంగిరోభ్యాం తే వ్యాహృతం మేకనుశాసనమ్ ।
సంసిద్ధోసి తయా రాజన్ విద్యయా దర్శనాచ్చ మే ॥
ఓ రాజా! నారదుడు, అంగిరసుడు నా ఉపాసనను నీకు ఉపదేశిం చినారు. దానిచే మరియు నన్ను దర్శించుటచే నీవు పూర్ణమగు సిద్ధిని (కృ తార్థతను) బడసితివి.
అహం వై సర్వభూతాని భూతాత్మా భూతభావనః ।
శబ్దబ్రహ్మ పరం బ్రహ్మ మమోభే శాశ్వతీ తనూ ॥
సకలప్రాణులు, సకలప్రాణుల ఆత్మ, సకలప్రాణులకు కారణము అన్నీ నేనే. వేదరూపముగా నేనే ఉన్నాను. వేదము, వేదములచే ప్రతిపా దించబడే పరబ్రహ్మ (సచ్చిదానందము) అనే రెండు నా రూపములే (ఒకటి రూపము, మరియొకటి స్వరూపము).
లోకే వితతమాత్మానం లోకం చాత్మని సంతతమ్,
ఉభయం చ మయా వ్యాప్తం మయి చైవోభయం కృతమ్ ।
జగత్తు (నామరూపములు) నందు ఆత్మ (చిత్) యే వ్యాపించి యున్నది. జగత్తు ఆత్మయందే నిలిచియున్నది. ఈ రెండింటినీ నేనే (అఖండసత్, బ్రహ్మ) వ్యాపించియున్నాను. ఈ రెండు నాయందే ప్రకాశించుచు న్నవి.
అఖండసత్ యందు చిత్ (ఆత్మ) ఆవిర్భవించినది. ఆత్మయందు నామరూపాత్మకమగు జగత్తు ప్రకాశించుచున్నది. ఆత్మ తాను ప్రకాశింప జేసే జగత్తును వ్యాపించుచున్నది. తనను ప్రకాశింప జేసే ఆత్మయందు మాత్రమే జగత్తు నిలిచియున్నది. ఈ విధముగా, ఈ రెండింటికీ అధిష్ఠానమగు అఖండసత్త (పరబ్రహ్మ) నేనే.
యథా సుషుప్తః పురుషో విశ్వం పశ్యతి చాత్మని ।
ఆత్మానమేకదేశస్థం మన్యతే స్వప్న ఉత్తితః ॥
నిద్రించిన మానవుడు కలలో జగత్తును తనయందే దర్శించును. కాని, ఆతడే నిద్ర లేచిన పిదప తాను ఒక చోట ఉన్నానని తలపోయును.
ఏవం జాగరణాదీని జీవస్థానాని చాత్మనః ।
మాయామాత్రాణి విజ్ఞాయ తద్దృష్టారం పరం స్మరేత్ ॥
అదే విధముగా, జాగ్రత్తు మొదలగు జీవుని (బుద్ది ఉపాధిగా గల వాడు) అవస్థలు కేవలము అజ్ఞానముచే మాత్రమే ఆత్మయందు కల్పించ బడుచున్నవి. వాస్తవములో ఈ అవస్థలకు సాక్షియగు ఆత్మ పరబ్రహ్మయే. ఈ పరబ్రహ్మను సాధకుడు స్మరించవలెను (ఆత్మనిష్ఠుడై యుండవలెను).
యేన ప్రసుప్తః పురుషస్స్వాపం వేదాత్మనస్తదా ।
సుఖం చ నిర్గుణం బ్రహ్మ తమాత్మానమవేహి మామ్ ॥
గాఢనిద్రను పొందిన వ్యక్తికి ఆ నిద్రావస్థ (ప్రపంచము లేకుం డుట) యొక్క అనుభవము ఏ సాక్షి చైతన్యము వలన కలుగుచున్నదో, అట్టి ఆత్మ చైతన్యమే ఆనందఘనము, నిర్గుణము అగు పరబ్రహ్మ అనియు, ఆ పరబ్రహ్మయే సగుణబ్రహ్మనగు నా స్వరూపమనియు, తెలుసుకొనుము.
ఉభయం స్మరతః పుంసః ప్రస్వాపప్రతిబోధయోః ।
అన్వేతి వ్యతిరిచ్యేత తజ్జ్ఞానం బ్రహ్మ తత్పరమ్ ॥
వ్యక్తి జాగ్రదవస్థలో ప్రపంచానుభవమును, నిద్రావస్థలో దాని అభావమును తెలుసుకొనుచుండును. ఈ రెండు అవస్థలలో వ్యాపించి యుండేది నిర్విశేషమగు జ్ఞానము (చైతన్యము). ఆ జ్ఞానము ఆ అవస్థల గుణస్వభావములకు విలక్షణముగనే యుండును. అట్టి ఆ నిర్విశేష జ్ఞానమే ఉపనిషతతిపాద్యమగు పరబ్రహ్మ.
యదేతద్విస్మృతం పుంసో మద్బావం భిన్నమాత్మనః ।
తతస్సంసార ఏతస్య దేహాద్దేహో మృతేర్మృతిః ॥
వ్యక్తియొక్క యథార్థస్వరూపము (ఆత్మ) నాకంటే అభిన్నము. కాని, వ్యక్తి ఆ విషయమును విస్మరించినచో, తన స్వరూపమునుండి తానే వేరగును. అపుడు వానికి సంసారము, ఒక దేహము తరువాత మరియొకటి, ఒక మరణము తరువాత మరియొకటి వరుసగా కలుగుచుండును.
లబ్ద్వేహ మానుషీం యోనిం జ్ఞానవిజ్ఞానసంభవామ్ ।
ఆత్మానం యో న బుద్ధ్యేత న క్వచిచ్ఛమమాప్నుయాత్ ॥
ఈ సృష్టిలో మానవజన్మయందు మాత్రమే ఆత్మయొక్క యథార్థ స్వరూపమును తెలుసుకొని అనుభవమునకు తెచ్చుకొనే అవకాశము గల దు. కాని, ఎవడైతే ఆత్మను తెలుసుకొనడో, వానికి ఎక్కడనైననూ (ఏ జన్మ లోనైననూ) శాంతి కరువగును.
స్మృత్వేహాయాం పరిక్లేశం తతః ఫలవిపర్యయమ్ ।
అభయం చాప్యనీహాయాం సంకల్పాద్విరమేత్కవిః ॥
కామనల కొరకై చేసే కర్మలలో అధికమగు క్లేశము మాత్రమే గాక, కోరినదానికి విరుద్దముగా దుఃఖఫలము కూడ కలుగుచుండును. కామనాని వృత్తియందు అభయమగు ఆత్మస్వరూపము లభించును. ఈ సత్యమును తెలుసుకున్న వివేకి కామనలను, వాటి కొరకై కర్మలను సంకల్పించరాదు.
సుఖాయ దుఃఖమోక్షాయ కుర్వాతే దంపతీ క్రియాః ।
తత్వోనివృత్తిరప్రాప్తిర్దుఃఖస్య చ సుఖస్య చ ॥
లోకములో స్త్రీలు గాని, పురుషులు గాని, దుఃఖమునుండి విముక్తి ని, సుఖమును కోరి కామ్యకర్మలను చేయుచుందురు. కాని, వాటి వలన దుఃఖము తొలగుట లేదు, సుఖము లభించుట లేదు.
ఏవం విపర్యయం బుద్ధ్వా నృణాం విజ్ఞాభిమానినామ్ ।
ఆత్మనశ్చ గతిం సూక్ష్మాం స్థానత్రయవిలక్షణమ్ ॥
దృష్టశ్రుతాభిర్మాత్రాభిర్నిర్ముక్త స్స్వేన తేజసా ।
జ్ఞానవిజ్ఞానసంతుష్టా మద్భక్తః పురుషో భవేత్ ॥
ఈ విధముగా తాము తెలివి గలవారమనే అభిమానము గల జనులు కామ్యకర్మలను చేసి విరుద్దఫలమును పొందుచున్నారు. మాన వుడు ఈ సంగతిని గమనించి, ఇంద్రియగోచరము కాని ఆత్మయొక్క యథార్థస్వరూపమును తెలుసుకొనవలెను. మానవజీవితములోని మూడు అవస్థలను ప్రకాశింప జేసేది ఆత్మయే అయినా, వాటికంటే ఆత్మ విలక్షణ ముగా నున్నది. మానవుడు తన వివేకశక్తిచే, కనబడే (ఇహలోక) మరియు వినబడే (పరలోక) భోగములనుండి బయటపడి, ఆత్మజ్ఞానమును సాధన చేసి, అనుభవము లోనికి తెచ్చుకొని, నా భక్తుడై ఉండవలెను.
ఏతావానేవ మనుజైర్యోగనైపుణబుద్ధిభిః ।
స్వార్థస్సర్వాత్మనా జ్ఞేయో యత్పరాత్మైకదర్శనమ్ ॥
మానవులు కర్మయోగమునభ్యసిస్తూ బుద్ధికి పదును పెట్టి పరబ్ర హ్మయే ఆత్మరూపముగా నున్నదని తెలుసుకొనుటకు సర్వవిధములుగా ప్రయత్నించవలెను. పురుషార్థము (జీవితలక్ష్యము) ఇది మాత్రమే.
త్వమేతచ్ఛ్రద్ధయా రాజన్నప్రమత్తో వచో మమ ।
జ్ఞానవిజ్ఞానసంపన్నో ధారయన్నాను సిధ్యసి ॥
ఓ రాజా! నీవు నా మాటను మరచిపోవద్దు. నా ఉపదేశమును బుద్దిలో నిలుపుము. దాని వలన నీవు శీఘ్రముగా ఆత్మజ్ఞానమును, ఆత్మా నుభవమును పొంది, జీవన్ముక్తుడవు కాగలవు.
శ్రీశుక ఉవాచ ।
ఆశ్వాస్య భగవానిత్థం చిత్ర కేతుం జగద్గురుః ।
పశ్యతస్తస్య విశ్వాత్మా తతశ్చాంతర్గధే హరిః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే షష్ఠస్కంధే చిత్రకేతోః పరమాత్మదర్శనం నామ షోడశోధ్యాయః ॥
జగత్తునకు తండ్రి, గురువు అగు శ్రీహరి భగవానుడే జగత్తు యొక్క యథార్థస్వరూపము కూడ. ఆయన చిత్రకేతువును ఈ విధముగా ఓదార్చి, ఆతడు చూచుచుండగనే అక్కడనుండి అంతర్ధానమయ్యెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో చిత్ర కేతువునకు పరమాత్మ సాక్షాత్కారమును వర్ణించే పదునారవ అధ్యాయము ముగిసినది (16).
Summary of chapter 16 of the Bhāgavata Mahā Purana is as follows:
Devarshi Nārada initiates Citraketu into a sacred prayer, through which the king performs intense meditation for seven days, culminating in the direct, luminous vision of Bhagavān Ananta Śesha. Citraketu offers magnificent prayers glorifying the supreme majesty, unalloyed devotion, and divine opulences of the Lord, receiving divine blessings to rule as sovereign king of the celestial Vidyādharas while remaining completely free from material illusion.