భాగవత మహా పురాణము
12 - ఇంద్రుడు వృత్రాసురుని సంహరించుట
ఋషిరువాచ ।
ఏవం జిహాసుర్నృప దేహమాజౌ
మృత్యుం వరం విజయాన్మన్యమానః ।
శూలం ప్రగృహ్యాభ్యపతత్సురేంద్రం
యథా మహాపురుషం కైటభోఽప్సు ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధమగా వృత్రుడు యుద్ధములో దేహమును విడువ గోరెను. ఆయనకు విజ యముకంటె మరణమే మేలని తోచెను. అపుడాయన శూలమును పట్టుకొని, ప్రళయకాలజలములలో కైటభుడు పురుషోత్తముని పైకి వలె, దేవేంద్రుని పైకి ఉరికెను.
తతో యుగాంతాగ్నికఠోరజిహ్వమావిధ్య శూలం తరసాఽసురేంద్రః,
క్షిప్త్వా మహేంద్రాయ వినద్య వీరో హతోఽసి పాపేతి రుషా జగాద.
తరువాత రాక్షసశ్రేష్ఠుడు, వీరుడు అగు వృత్రుడు ప్రళయకాలాగ్ని వలె వెలిగిపోయే నాలుకలు గల శూలమును వేగముగా త్రిప్పి, మహేంద్రునిపై విసిరి, సింహనాదము చేసి, ఓరీ పాపీ! దీనితో నీ పని ఆఖరు, అంటూ కోపముతో పలికెను.
ఖ ఆపతత్తద్విచలద్గ్రహోల్కవన్నిరీక్ష్య దుష్ప్రేక్ష్యమజాతవిక్లవః ।
వజ్రేణ వజ్ర శతపర్వణాకచ్చినద్బుజం చ తస్యోరగరాజభోగమ్॥
ఆకాశములో తిరుగుతూ మీదకు వచ్చుచున్న ఆ శూలము గ్రహమును ఉల్కను బోలి, చూచుటకు వీలు కాకుండెను. అయిననూ, వజ్రధరుడగు ఇంద్రుడు భయపడలేదు. వంద కణుపుల వజ్రముతో ఆయన ఆ త్రిశూలమును మాత్రమే గాక, నాగరాజగు వాసుకి పడగవంటి వాని భుజమును కూడ తెగగొట్టెను.
ఛిన్నైకబాహుః పరిఘేణ వృత్రస్సంరబ్ద ఆసాద్య గృహీతవజ్రమ్,
హనౌ తతాడేంద్రమథామరేభం వజ్రం చ హస్తాన్న్యపతన్మ ఘోనః.
వృత్రుని ఒక చేయి తెగిపోయేను. అయిననూ, ఆతడు కోపించి ఇనుప గుదియతో ఇంద్రుని మీదకు వెళ్లి చెక్కిలిపై కొట్టెను. తరువాత దేవగజమగు ఐరావతమును కూడ ఆతడు కొట్టెను. ఆ దెబ్బకు ఇంద్రుని చేతి నుండి వజ్రము క్రింద పడిపోయెను.
వృత్రస్య కర్మాతిమహాద్భుతం తత్
సురాసురాశ్చారణసిద్దసంఘాః ।
అపూజయంస్తత్ పురుహూతసంకటం
నిరీక్ష్య హా హేతి విచుక్రుశుర్భృశమ్ ॥
వృత్రుడు చేసిన ఆ మిక్కిలి అధికముగా ఆశ్చర్యమును కలిగించే పనిని దేవతలు, రాక్షసులు, చారణులు, సిద్దులు గుంపులుగా చేరి ప్రశంసించిరి. ఇంద్రుడు ఉన్న సంకటస్థితి (చేతినుండి వజ్రము జారిపోవుట) ని గాంచి, వారు అయ్యో! అయ్యో! అంటూ ఆక్రోశించిరి.
ఇంద్రో న వజ్రం జగృహే విలజ్జితః
చ్యుతం స్వహస్తాదరిసన్నిధౌ పునః ।
తమాహ వృత్రా హర ఆత్తవజ్రో
జహి స్వశత్రుం న విషాదకాలః ॥
తన చేతినుండి శత్రువు యెదుట వజ్రము జారి పడినందులకు ఇంద్రుడు చాల సిగ్గు పడెను. అపుడు వృత్రుడాతనితో నిట్లనెను --- ఓయీ ఇంద్రా! వజ్రమును తీసుకొని శత్రువును సంహరించుము. ఇది దుఃఖించుటకు సమయము కాదు.
యుయుత్సతాం కుత్రచిదాతతాయినాం
జయస్సదైకత్ర న వై పరాత్మనామ్ ।
వినైకముత్పత్తిలయస్థితీశ్వరం
సర్వజ్ఞమాద్యం పురుషం సనాతనమ్ ॥
జగత్కారణుడు, జగత్తుయొక్క ఉత్పత్తిస్థితిలయములకు అధీశ్వరుడు, సర్వజ్ఞుడు, కాలమునకు అతీతుడు అగు పూర్ణ పరబ్రహ్మకు సర్వత్ర విజయమే. కాని, దేహాత్మభావముతో శస్త్రములను ధరించి యుద్ధమును చేయగోరు వారలకు అన్ని కాలములలో విజయము తమ పక్షమున మాత్రమే ఉండుననే నియమము లేదు. విజయము ఎటువైపునైననూ ఉండవచ్చును.
లోకాస్సపాలా య స్యేమే శ్వసంతి వివశా వశే ।
ద్విజా ఇవ శిచా బద్ధాస్స కాల ఇహ కారణమ్ ॥
పాలకులతో సహా సకలజనులు పరాధీనులై, వలలో బంధించబడిన పక్షులు వలె, కాలమునకు వశులై వివిధచేష్ఠలను చేయుచున్నారు. అట్టి కాలమే ఈ జయపరాజయములకు కారణము.
ఓజస్సహో బలం ప్రాణమమృతం మృత్యుమేవ చ ।
తమజ్ఞాయ జనో హేతుమాత్మానం మన్యతే జడమ్ ॥
కాలమే జనునియందు మనోబలము, ఇంద్రియబలము, దేహబలము, ప్రాణశక్తి, జీవనము మరియు మరణముల రూపముగా నున్నది. ఈ సంగతి తెలియక జనుడు తన దేహమే జయపరాజయములు మొదలగువా టికి కారణమని తలపోయుచుండును.
యథా దారుమయీ నారీ యథా యంత్రమయో మృగః ।
ఏవం భూతాని మఘవన్నీశతంత్రాణి విద్ది భోః ॥
ఓ ఇంద్రా! చెక్కతో చేసిన స్త్రీ బొమ్మ, యంత్రముతో నడిచే మృగము బొమ్మ వాటిని నడిపించే వాని చేతిలో ఉండును. అదే విధముగా, ప్రాణులు ఈశ్వరుని వశములోనున్నవని తెలుసుకొనుము.
పురుషః ప్రకృతిద్వ్యక్తమాత్మా భూతేంద్రియాశయాః ।
శక్నువంత్యస్య సర్గాదౌ న వినా యదనుగ్రహాత్ ॥
మాయాశక్తియందు ప్రతిఫలించిన పరబ్రహ్మయే జగత్కారణమగు ఈశ్వరుడు. ఆ మాయాశక్తియే మహత్తత్త్వము (సమష్టి బుద్ధిశక్తి), అహంకారము (సమష్టి), పంచభూతములు, ప్రాణులలోని ఇంద్రియములు, ప్రాణుల అంతఃకరణముల రూపములో ప్రకటమై, ఈ జగత్తుయొక్క సృష్టి, స్థితి ఘటిల్లుచున్నవి. ఈ సర్వము విలోమక్రమములో పరబ్రహ్మలో విలీన మగుటయే ప్రళయము. ఈ విధముగా, జగత్తుయొక్క సృష్టిస్థితిలయము లను ఈ మాయాకార్యములు సత్తాస్పూర్తిప్రదాతయగు ఆ పరబ్రహ్మ యొక్క అనుగ్రహము వలననే ఘటిల్ల జేయుచున్నవి. ఆ అనుగ్రహము లేనిచో, ఈ జడతత్త్వములు నిరాత్మకములై దేనికైననూ సమర్థములు కావు.
అవిద్వానేవమాత్మానం మన్యతేఽనీశమీశ్వరమ్ ।
భూతైస్సృజతి భూతాని గ్రసతే తాని తైస్స్వయమ్ ॥
ఈ సత్యమునెరుగని వ్యక్తి అస్వతంత్రుడై యున్న తానే స్వతంత్రుడనగు కర్త-భోక్తనని తలపోయును. ఈశ్వరుడే స్వయముగా ప్రాణులను ప్రాణుల ద్వారా సృష్టించి, వాటిని వాటి ద్వారానే సంహరించుచున్నాడు.
ఆయుశ్ర్శీః కీర్తి రైశ్వర్యమాశిషః పురుషస్య యాః ।
భవంత్యేవ హి తత్కాలే యథానిచ్ఛోర్విపర్యయాః ॥
వ్యక్తి ఆయుర్వృద్ధి, సంపద, కీర్తి, ఈశ్వరభావము మొదలగు మనోరథములను కలిగియుండును. వ్యక్తి కోరకున్ననూ వీటికి విరుద్ధములగు అపకీర్తి మొదలగునవి కలుగుచునే యున్నవి. అదే విధముగా, ఇవి కూడ తగిన కాలము వచ్చినప్పుడు తప్పక లభించును.
తస్మాదకీర్తియశసోర్జయాపజయయోరపి ।
సమస్స్యాత్సుఖదుఃఖాభ్యాం మృత్యుజీవితయోస్తథా ॥
కావున, కీర్తి-అపకీర్తులు, జయ-పరాజయములు, జీవన్మరణములు, సుఖదుఃఖములు అనే ద్వంద్వముల యెడల వ్యక్తి సమచిత్తుడై యుండవలెను.
సత్త్వం రజస్తమ ఇతి ప్రకృతేర్నాత్మనో గుణాః ।
తత్ర సాక్షిణమాత్మానం యో వేద న స బధ్యతే ॥
సత్త్వరజస్తమోగుణములు మాయాశక్తివే గాని, ఆత్మ చైతన్యమునకు చెందినవి కావు. కావున, వాటి కార్యములగు సుఖదుఃఖమోహముల యెడల ఎవడైతే తన స్వరూపము సాక్షాయని తెలియునో, వానికి వాటి వలన బంధము కలుగదు.
పశ్య మాం నిర్జితం శక్ర వృక్ణాయుధభుజం మృధే ।
ఘటమానం యథాశక్తి తవ ప్రాణజిహీర్షయా ॥
ఓ ఇంద్రా! చూడుము. యుద్ధములో నీవు నా ఆయుధమును మాత్రమే గాక, నా భుజమును కూడ తెగగొట్టి, నన్ను ఓడించితివి. అయిననూ, నేను యథాశక్తిగా నీ ప్రాణములను తీయుటకే యత్నించుచున్నాను.
ప్రాణగ్లహోఽయం సమర ఇష్వక్షో వాహనాసనః ।
అత్ర న జ్ఞాయతేఽముష్య జయోఽముష్య పరాజయః ॥
ఈ యుద్దము అనే జూదములో ప్రాణములే పందెముగా ఒడ్డబడును. వాహనములే జూదపు పలకలు కాగా, బాణములే పాచికలు. ఈ జూదములో ఫలానా వానికి విజయమనియు, ఫలానా వానికి పరాజయమనియు ముందుగా తెలియదు.
శ్రీశుక ఉవాచ ।
ఇంద్రో వృత్రవచశ్ర్శుత్వా గతాలీకమపూజయత్ ।
గృహీతవజ్రః ప్రహసంస్తమాహ గతవిస్మయః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను -- వృత్రుని కపటము లేని మాటను విన్న ఇంద్రునకు అధికమగు గర్వము తొలగి పోయెను. ఆయన వజ్రమును చేతిలోకి తీసుకొని నవ్వుతూ, వృత్రుని ప్రశంసిస్తూ, ఆతనితో నిట్లనెను.
ఇంద్ర ఉవాచ ।
అహో దానవ సిద్ధోఽసి యస్య తే మతిరీదృశీ ।
భక్తస్సర్వాత్మనాఽఽత్మానం సుహృదం జగదీశ్వరమ్ ॥
ఇంద్రుడిట్లు పలికెను --- ఓ రాక్షసా! ఇట్టి వివేకము గల నీవు సిద్ద పురుషుడవు. ఆత్మరూపుడు, హితకరుడు, జగన్నాథుడు అగు ఆ శ్రీహరిని నీవు సర్వస్వార్పణము చేసి సేవించితివి.
భవానతార్షీన్మాయాం వై వైష్ణవీం జనమోహినీమ్ ।
యద్విహాయాసురం భావం మహాపురుషతాం గతః ॥
నీవు జనులను మోహ పెట్టే వైష్ణవ మాయను నిశ్చయముగా తరించితివి. ఏలయనగా, నీవు అసురులలో ఉండే లక్షణములను విడిచిపెట్టి, మహాపురుషుల లక్షణములను సంతరించుకున్నావు.
ఖల్విదం మహదాశ్చర్యం యద్రజఃప్రకృతేస్తవ ।
వాసుదేవే భగవతి సత్త్వాత్మని దృడా మతిః ॥
రజోగుణ ప్రధానమగు నీ బుద్ది సత్త్వగుణ ప్రధానుడగు వాసుదేవ భగవానునియందు దృఢముగా నిలిచినది. ఇది గొప్ప ఆశ్చర్యము సుమా!
యస్య భక్తిర్భగవతి హరౌ నిశ్ర్శేయసేశ్వరే ।
విక్రీడతోఽమృతాంభోధౌకిం క్షుద్రైః ఖాతకోదకైః ॥
శ్రీహరి భగవానుడు మోక్షమునకు అధీశ్వరుడు. ఆయనయందు భక్తి కలిగి, అమృత సముద్రమునందు ఓలలాడే నీకు గుంట నీళ్లవంటి స్వర్గాదులతో పని యేమున్నది?
శ్రీశుక ఉవాచ ।
ఇతి బ్రువాణావన్యోన్యం ధర్మజిజ్ఞాసయా నృప ।
యుయుధాతే మహావీర్యావింద్రవృత్రౌ యుధాం పతీ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! గొప్ప పరాక్రమము గలవారు, యుద్ధవీరులకు నాయకులు అగు ఇంద్రవృత్రులిద్దరు ధర్మమును తెలుసుకోవాలనే కోరికతో ఈ విధముగా పరస్పరము మాటలా డుకుంటూ, యుద్ధమును చేసిరి.
ఆవిధ్య పరిఘం వృత్రః కార్ష్ణాయసమరిందమః ।
ఇంద్రాయ ప్రాహిణోద్ఘోరం వామహస్తేన మారిష ॥
శత్రుశాసకుడగు వృత్రుడు భయంకరమగు లోహపు గుదియను ఎడమ చేతితో గిరగిర త్రిప్పి, ఇంద్రుని పైకి విసిరెను.
స తు వృత్రస్య పరిఘం కరం చ కరభోపమమ్ ।
చిచ్ఛేద యుగపద్దేవో వజ్రేణ శతపర్వణా ॥
ఆ ఇంద్రదేవుడు వృత్రుని గుదియను, ఏనుగు తొండమువంటి చేతిని కూడ వంద కణుపుల వజ్రముతో ఒకే సారి తేగగొట్టెను.
దోర్బ్యాముత్కృత్తమూలాభ్యాం బభౌ రక్తస్రవోఽసురః ।
ఛిన్నపక్షో యథా గోత్రః ఖాద్భ్రష్టో వజ్రిణా హతః ॥
వజ్రధరుడగు ఇంద్రుడు వృత్రుని రెండు చేతులను మొదళ్ల వరకు నరికేను. రక్తము కారుచుండగా ఆ రాక్షసుడు, ఇంద్రునిచే వజ్రముతో తెగ గొట్టబడిన రేక్కలు గలదియై ఆకాశమునుండి నేలగూలిన పర్వతము వలె, శోభిల్లెను.
కృత్వాఽధరాం హనుం భూమౌ దైత్యో దివ్యుత్తరాం హనుమ్ ।
నభోగంభీరవక్త్రేణ లేలిహోల్బణజిహ్వయా ॥
దంష్ట్రాభిః కాలకల్పాభిర్ర్గసన్నివ జగత్త్రయమ్ ।
అతిమాత్రమహాకాయ ఆక్షిపంస్తరసా గిరీన్ ॥
గిరిరాట్ పాదచారీవ పద్బ్యాం నిర్జరయన్ మహీమ్ ।
జగ్రాస స సమాసాద్య వజ్రిణం సహవాహనమ్ ।
మహాప్రాణో మహావీర్యో మహాసర్ప ఇవ ద్వీపమ్ ॥
మిక్కిలి ఎత్తైన పెద్ద దేహము, గొప్ప బలపరాక్రమములు గల ఆ రాక్షసుడు క్రింది పెదవిని భూమికి, పై పెదవిని స్వర్గమునకు ఆన్చెను. ఆతని నోరు ఆకాశము వలె లోతుగా నుండెను. ఆతని నాలుక పాము వలె భయమును గొల్పుచుండెను. ఆతని కోరలు మృత్యుదేవత కోరలను బోలి యుండెను. ఆతడు ముల్లోకములను మ్రింగి వేయునా యన్నట్లుండెను. ఆతడు పర్వతములను వేగముగా కదిలిస్తూ, నడయాడే పర్వతరాజు వలె భూమిని పాదములతో చూర్ణము చేస్తూ, వజ్రధారియగు ఇంద్రుని మీదకు వచ్చెను. అపుడాతడు, కొండ చిలువ ఏనుగును వలే, ఇంద్రుని ఆతని వాహనమగు ఐరావతమును కూడ మ్రింగి వేసెను.
వృత్రగ్రస్తం తమాలక్ష్య సప్రజాపతయస్సురాః ।
హా కష్టమితి నిర్విణ్ణాశ్చుక్రుశుస్సమహర్షయః ॥
వృత్రుడు ఇంద్రుని మ్రింగివేయుచుండగా, ప్రజాపతులతో మరియు మహర్షులతో కూడియున్న దేవతలు చూచి, అయ్యో! కష్టము వచ్చినది! అంటూ నిరాశతో ఆక్రోశించిరి.
నిగీర్ణోऽప్యసురేంద్రేణ న మమారోదరం గతః ।
మహాపురుషసన్నద్ధో యోగమాయాబలేన చ ॥
రాక్షసశ్రేష్టుడగు వృత్రునిచే మ్రింగివేయబడిన ఇంద్రుడు వాని ఉదరమును చేరి కూడ మరణించలేదు. ఏలయనగా, ఆతనిని పురుషోత్తముడు కవచము రూపములో కాపాడెను. పైగా, ఆతని వద్ద త్రిగుణాత్మిక యగు మాయాశక్తియొక్క బలము కూడ గలదు.
భిత్త్వా వజ్రేణ తత్కుక్షిం నిష్క్రమ్య బలబిద్విభుః।
ఉచ్చకర్త శిరశ్శత్రోర్గిరిశృంగమివౌజసా ॥
బలాసురుని సంహరించిన దేవరాజగు ఇంద్రుడు వజ్రముతో వాని పొట్టను చీల్చి బయటకు వచ్చి, తన శత్రువగు వృత్రుని పర్వత శిఖరము వంటి తలను బలముగా నరికెను.
వజ్రస్తు తత్కంధరమాశువేగః కృంతన్ సమంతాత్పరివర్తమానః । న్యపాతయత్తావదహర్గణేన యో జ్యోతిషామయనే వార్త్రహత్యే ॥
ఆ వజ్రము అధికమగు వేగముతో వృత్రుని మెడను కోసుకుంటూ, వానిని సంహరించే పనిలో చుట్టూ తిరుగుతూ కొంత కాలమునకు దానిని క్రింద పడవేసి, వానిని సంహరించెను. అదే కాలము (సంవత్సరము) లో సూర్యుడు మొదలగు జ్యోతిర్మండలములు దక్షిణ-ఉత్తర అయనముల గతిని పూర్తి చేసెను.
తదా చ ఖే దుందుభయో వినేదుర్గంధర్వసిద్ధాస్సమహర్షిసంఘాః, వార్త్రఘ్నలింగైస్తమభిష్టువానా మంత్రైర్ముదా కుసుమైరభ్యవర్షన్।
అప్పుడు ఆకాశమునందు దేవదుందుభులు మ్రోగినవి. మహర్షుల గణములు, గంధర్వులు, సిద్ధులు వృత్రుని సంహరించిన ఇంద్రుని పరాక్రమమును వెల్లడి జేసే మంత్రములతో ఆయనను అభిముఖముగా స్తుతిస్తూ, ఆనందముతో ఆయనపై పూలవానను కురిపించిరి.
వృత్రస్య దేహాన్నిష్క్రాంతమాత్మజ్యోతిరరిందమ ।
పశ్యతాం సర్వలోకానామలోకం సమపద్యత ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే షష్ఠస్కంధే ఇంద్రేణ
వృత్రాసురసంహారో నామ ద్వాదశోऽధ్యాయః ॥
అంతశ్శత్రువులను శాసించే ఓ మహారాజా! వృత్రుని దేహము నుండి సూక్ష్మ శరీర ప్రకాశము బయటకు వచ్చి, దేవతలు మొదలగు వారందరు చూచుచుండగా, లోకాతీతుడగు భగవానునిలో ఐక్యమయ్యేను.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో వృత్రాసురుని సంహారమును వర్ణించే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).
Summary of chapter 12 of the Bhāgavata Mahā Purana is as follows:
Vṛtrāsura engages Indra directly, swallowing Indra alongside his celestial elephant Airāvata, but Indra uses his divine weapon to cut through the titan's abdomen and emerge safely. After a protracted, ferocious struggle lasting a full year, Indra uses the Vajra weapon forged from Dadhīci's bones to sever Vṛtrāsura's giant head, whereupon a radiant spiritual spark emerges from the titan's body and merges directly into the lotus feet of Bhagavān Vishṇu in the spiritual sky before the astonished eyes of all.