భాగవత మహా పురాణము
10 - దేవాసుర యుద్ధము
శ్రీశుక ఉవాచ ।
ఇంద్రమేవం సమాదిశ్య భగవాన్ విశ్వభావనః ।
పశ్యతామనిమేషాణాం తత్రైవాంతర్ధధే హరిః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- జగత్తునకు సుఖమును కలిగించే శ్రీహరి భగవానుడు ఇంద్రుని ఈ విధముగా ఆదేశించి, దేవతలు చూచుచుండగా అచటనే అంతర్ధానమాయెను.
తథాऽభియాచితో దేవైరృషీరాథర్వణో మహాన్ ।
మోదమాన ఉవాచేదం ప్రహసన్నివ భారత ॥
భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! దేవతలు అథర్వణవేదీ యుడగు దధీచి మహర్షిని అదే విధముగా కోరిరి. అప్పుడాయన సంతోషిస్తూ, చిరునవ్వుతో వారితోనిట్లనెను.
అపి బృందారకా యూయం న జానీథ శరీరిణామ్ ।
సంస్థాయాం యస్త్వభిద్రోహో దుస్సహశ్చేతనాపహః ॥
దేవతలారా! దేహధారులకు మరణసమయములో సహించ శక్యము కాని ఉపద్రవము (పీడ) కలిగి మూర్చ కూడ వచ్చును. ఆ విష యము మీకు తెలియదా యేమి?
జిజీవిషూణాం జీవానామాత్మా ప్రేష్ఠ ఇహేప్సితః ।
క ఉత్స హేత తం దాతుం భిక్షమాణాయ విష్ణవే ॥
ఈ లోకములో జీవించ గోరే ప్రాణులకు దేహము మిక్కిలి ప్రియ తమమైనది, అభీష్టమైనది. స్వయముగా విష్ణువే కోరిననూ, దానిని ఇచ్చు టకు ఎవడు సాహసించును?
దేవా ఊచుః ।
కిం ను తద్దుస్త్యజం బ్రహ్మన్ పుంసాం భూతానుకంపినామ్ ।
భవద్విధానాం మహతాం పుణ్యశ్లోకేడ్యకర్మణామ్ ॥
దేవతలిట్లు పలికిరి --- ఓ మహర్షీ! భూతదయ, పవిత్రమగు కీర్తి, పవిత్రమగు కీర్తి గలవారిచే కూడ కొనియాడదగిన కర్మలు గల నీవంటి మహాత్ములగు పురుషులకు విడిచి పెట్ట శక్యము కానిది ఏమి ఉండును?
నను స్వార్థపరో లోకో న వేద పరసంకటమ్ ।
యది వేద న యాచేత నేతి నాహ యదీశ్వరః ॥
జనులకు తమ పనియే ప్రధానముగా నుండును. వారు ఇతరుల కష్టమును తెలుసుకొనరు. తెలుసుకొనేవారైనచో, ఇతరులను ఈ విధముగా యాచించరు. దాత సమర్థుడైనచో, ఇతరులు యాచించినప్పుడు కాదనడు.
ఋషిరువాచ ।
ధర్మం వశ్శ్రోతుకామేన యూయం మే ప్రత్యుదాహృతాః ।
ఏష వః ప్రియమాత్మానం త్యజంతం సంత్యజామ్యహమ్ ॥
దధీచి మహర్షి ఇట్లు పలికెను --- నేను మీనుండి ధర్మమును వినగోరి మిమ్ములను నిరాకరించినట్లు మాటలాడినాను. ఇదిగో! నేను ప్రియమైన దేహమును మీ కొరకు విడిచి పెట్టుచున్నాను. ఈ దేహము నన్ను ఒకనాడు విడిచి పెట్టేదే.
యోఽధ్రువేణాత్మనా నాథా న ధర్మం న యశః పుమాన్ ।
ఈ హేత భూతదయయా స శోచ్యః స్థావరైరపి ॥
ఓ ప్రభువులారా! ఏ మానవుడైతే భూతదయ గలవాడై, అనిత్యమగు దేహముతో ధర్మమును చేసి కీర్తిని సంపాదించడో, అట్టివానిని గురించి చెట్టు చేమలు కూడ శోకింప దగినదే.
ఏతావానవ్యయో ధర్మః పుణ్యశ్లో కైరుపాసితః ।
యో భూతశోకహర్షాభ్యామాత్మా శోచతి హృష్యతి ॥
మానవుడు ప్రాణుల దుఃఖముచే తాను దుఃఖమును, వాటి సుఖ ముచే తాను హర్షమును పొందవలెను. పవిత్రమగు కీర్తి గలవారలు ఉపా సించే వినాశము లేని ధర్మము ఇంత మాత్రమే.
అహో దైన్యమహో కష్టం పారక్యైః క్షణభంగురైః । యన్నోపకుర్యాదస్వార్థైర్మర్త్యస్వజ్ఞాతివిగ్రహైః ॥
ధనము, బంధువులు, దేహము క్షణకాలములో ముక్కలయ్యేవే గాని, పురుషార్థమునకు పనికి వచ్చేవి కావు. ఇవి అంతతో గత్వా ఇతరులకు మాత్రమే పనిని ఇచ్చును. మానవుడు వీటితో పరోపకారమును చేయకపోవుట, అయ్యో! ఎట్టి దీనత! అయ్యో! ఎట్టి కష్టము!
శ్రీశుక ఉవాచ ।
ఏవం కృతవ్యవసితో దధ్యజ్జాథర్వణస్తనుమ్ ।
పరే భగవతి బ్రహ్మణ్యాత్మానం సన్నయన్ జహౌ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- అథర్వవేదీయుడగు దధీచి ఈ విధముగా నిశ్చయించుకొని, పరబ్రహ్మస్వరూపుడగు శ్రీహరి భగవానుని యందు మనస్సును విలీనము చేసి, దేహమును విడిచి పెట్టెను.
యతాక్షసుమనోబుద్దిస్తత్త్వదృగ్ ధ్వస్తబంధనః ।
ఆస్థితః పరమం యోగం న దేహం బుబుధే గతమ్ ॥
పరమాత్మతత్త్వము నెరింగిన దధీచికి కర్మబంధము నశించెను. ఆయన ఇంద్రియములను, ప్రాణములను, మనస్సును, బుద్ధిని వశము చేసుకొని, సర్వోత్తమమగు చిత్తేకాగ్రతను పొందియుండెను. ఆయనకు తెలి యకుండానే దేహత్యాగము సంపన్నమయ్యెను.
అథేంద్రో వజ్రముద్యమ్య నిర్మితం విశ్వకర్మణా ।
మునేశ్శుక్తిభిరుత్సిక్తో భగవతేజసాఽన్వితః ॥
వృతో దేవగణెస్సర్వైర్గజేంద్రోపర్యశోభత ।
స్తూయమానో మునిగణై స్త్రైలోక్యం హర్షయన్నివ ॥
తరువాత విశ్వకర్మ దధీచి మహర్షియొక్క ఎముకలతో వజ్రమును నిర్మించెను. బలమును , పొంది, భగవానుని తేజస్సుతో కూడియున్న ఇంద్రుడు గొప్ప ఏనుగుపై కూర్చుండి దానిని పైకెత్తి పట్టుకొని శోభిల్లెను. దేవగణములన్నియు ఆయనను చుట్టువారి యుండెను. మహర్షుల గణము లాయనను స్తుతించుచుండెను. ఆయన ' ముల్లోకములను ఆనందింప జేయుచున్నాడా యన్నట్లు ఉండెను.
వృత్రమభ్యద్రవచ్చేత్తుమసురానీకయూథపైః ।
పర్యస్తమోజసా రాజన్ క్రుద్ధో రుద్ర ఇవాంతకమ్ ॥
ఓ మహారాజా! వృత్రుడు రాక్షస సేనానాయకులతో కూడియుండె ను. ఇంద్రుడు కోపించి వృత్రుని నరుకుటకై, రుద్రుడు యముని పైకి వలె, వేగముగా బలముతో ఆతని పైకి దండెత్తెను.
తతస్సురాణామసురై రణః పరమదారుణః ।
త్రేతాముఖే నర్మదాయామభవత్ప్రథమే యుగే ॥
అప్పుడు మొదటి మహాయుగములో త్రేతాయుగము ఆరంభములో నర్మదానదీతీరమునందు దేవతలకు, రాక్షసులతో మిక్కిలి భయంకరమగు యుద్ధము జరిగెను.
రుద్రైర్వసుభిరాదిత్యైరశ్విభ్యాం పితృవహ్నిభిః ।
మరుద్భిరృభుభిస్సాధ్యైర్విశ్వేదేవైర్మరుత్పతిమ్ ॥
దృష్ట్వా వజ్రధరం శక్రం రోచమానం స్వయా శ్రియా ।
నామృష్యన్నసురా రాజన్ మృధే వృత్రపురస్సరాః ॥
ఓ మహారాజా! రుద్రులు, వస్తువులు, ఆదిత్యులు, అశ్వినీ దేవతలు, పితృదేవతలు, అగ్ని, మరుత్తులు, ఋభువులు, సాధ్యులు, విశ్వేదేవతలతో కూడియున్న దేవరాజగు ఇంద్రుడు వజ్రమును ధరించి యుద్దములో తనదైన శోభతో ప్రకాశించేను. వృత్రుడు అగ్రేసరుడుగా గల రాక్షసులు ఆయనను చూచి సహించ లేకపోయిరి.
నముచిశ్శంబరోఽనర్వా ద్విమూర్ధా ఋషభేకంబరః ।
హయగ్రీవశ్శంకుశిరా విప్రచిత్తిరయోముఖః ॥
పులోమా వృషపర్వా చ ప్రతిర్హేతిరుత్కలః ।
దైతేయా దానవా యక్షా రక్షాంసి చ సహస్రశః ॥
సుమాలిమాలిప్రముఖాః కార్తస్వరపరిచ్చదాః ।
ప్రతిషిధ్యేంద్ర సేనాగ్రం మృత్యోరపి దురాసదమ్ ॥
అభ్యర్ధయన్నసంభ్రాంతాస్సింహనాదేన దుర్మదాః ।
గదాభిః పరిఘైర్భాణైః ప్రాసముద్గరతోమరైః ॥
శూలైః పరశ్వథైః ఖడ్గైశ్శతఘ్నీభిర్భుశుండిభిః ।
సర్వతోఽవాకిరన్ శస్త్రైరస్త్రైశ్చ విబుధర్షభాన్ ॥
నముచి, శంబరుడు, అనర్వ, ద్విమూర్దుడు, ఋషభుడు, అంబ రుడు, హయగ్రీవుడు, శంకుశిరసుడు, విప్రచిత్తి, అయోముఖుడు, పులోమ, వృషపర్వుడు, ప్ర హేతి, హేతి, ఉత్కలుడు, సుమాలి, మాలి మొదలగు దితిపుత్రులు, దనుపుత్రులు, యక్షులు, రాక్షసులు వేలసంఖ్యలో, యమున కైననూ సమీపించ శక్యము కొని ఇంద్రుని సేనానాయకుని త్రోసుకొని నిర్బ యముగా ముందుకు దూసుకు పోయిరి. బంగరు ఆభరణములను ధరించి, గర్వించియున్న ఆ రాక్షసులు సింహనాదమును చేయుచుండిరి. గదలు, గుదియలు, బాణములు, ఈటెలు, సమ్మెటలు, చిల్లకోలలు, శూలములు, గండ్ర గొడ్డళ్లు, కత్తులు, ఫిరంగులు, ఇనుప ముండ్ల కర్రలతో వారు దేవత లను పీడించిరి. వారు దేవనాయకులపై అన్ని వైపులనుండియు శస్త్రముల ను, అస్త్రములను వర్షముగా కురిపించిరి.
న తేऽదృశ్యంత సంఛన్నాశ్శరజాలైస్సమంతతః ।
పుంఖానుపుంఖపతితైర్జ్యోతీంషీవ నభోఘనైః ॥
వారిపై బాణములు పుంఖానుపుంఖములుగా అన్ని వైపులనుండియు పడుచుండెను. ఆకాశములో మేఘములచే కప్పివేయబడిన నక్షత్రములు వలె, ఆ దేవనాయకులు బాణములచే కప్పబడి కానరాకుండిరి.
న తే శస్త్రాస్త్రవర్షౌఘా హ్యా సేదుస్సురసైనికాన్ ।
ఛిన్నాస్సిద్ధపథే దేవైర్లఘుహస్తైస్సహస్రధా ॥
హస్తలాఘవము గల దేవతలు ఆ శస్త్రముల మరియు అస్త్రముల పరంపరల వర్షములను ఆకాశములోనే ఛిన్నాభిన్నము చేయగా, అవి దేవ సైనికుల దరిదాపులకు రాలేక పోయినవి.
అథ క్షీణాస్త్రశస్త్రాఘా గిరిశృంగద్రుమోపలైః ।
అభ్యవర్షన్ సురబలం చిచ్చిదుస్తాంశ్చ పూర్వవత్ ॥
అప్పుడు రాక్షసుల వద్ద శస్త్రాస్త్రములు ఖర్చు అయిపోగా, వారు దేవ సైన్యము పై పర్వత శిఖరములను, చెట్లను, రాళ్లను వర్షించిరి. దేవతలు వాటిని కూడ ముక్కలు ముక్కలుగా చేసిరి.
తానక్షతాన్ స్వస్తిమతో నీశామ్య శస్త్రాస్త్రపూగైరథ వృత్రనాథాః । ద్రుమైర్దృషద్భిర్వివిధాద్రిశృంగైరవిక్షతాంస్తత్రసురీంద్రసైనికాన్॥
వృత్రుని నాయకత్వములో రాక్షసులు దేవ సైన్యముపై శస్త్రముల ను, అస్త్రములను వర్షించిననూ, వారు చెక్కు చెదరకుండ క్షేమముగా నుండిరి. తరువాత వారు చెట్లను, రాళ్లను, పలు రకముల పర్వత శిఖరము లను ఇంద్రుని సైనికులపై వర్షించిననూ, వారికి గాయమే కాలేదు. ఈ స్థితిని చూచి, రాక్షసులు భయపడిరి.
సర్వే ప్రయాసా అభవన్విమోఘాః
కృతాః కృతా దేవగణేషు దైత్యైః ।
కృష్ణానుకూలేషు యథా మహత్సు
క్షుద్రైః ప్రయుక్తా రుశతీ రూక్షవాచః ॥
అల్పులు మహాత్ములపై ప్రయోగించే తిట్లతో కూడిన పరుషవచన ములు వారిపై ఎట్టి ప్రభావమును చూపలేవు. అదే విధముగా, శ్రీకృష్ణుని అనుగ్రహము గల దేవగణములపై రాక్షసులు మరల మరల చేసిన దాడుల న్నియు వ్యర్థములే ఆయెను.
తే స్వప్రయాసం వితథం నిరీక్ష్య హరావభక్తా హతయుద్దదర్పా: ।
పలాయనాయాజిముఖే విసృజ్య పతిం మనస్తే దధురాత్తసారాః ॥
శ్రీహరియందు భక్తి లేని ఆ రాక్షసులకు యుద్ధమునందలి గర్వము తొలగిపోయెను. వారి మనోబలమంతయు శత్రువులచే తీసుకొనబ డెను. ఈ విధముగా యుద్దమునకు ఆరంభములోనే తమ శ్రమ వ్యర్థమగు టను గాంచి, వారు తమ ప్రభువగు వృత్రుని విడిచి పెట్టి పారిపోవుటకు నిశ్చ యించుకొనిరి.
వృత్రోऽసురాంస్తాననుగాన్మనస్వీ ప్రధావతః ప్రేక్ష్య బభాష ఏతత్,
పలాయితం ప్రేక్ష్య బలం చ భగ్నం భయేన తీవ్రేణ విహస్య వీరః।
స్వాభిమానము గల వృత్రాసురుడు తన అనుచరులగు ఆ రాక్ష సులు పారిపోవుచుండుటను గాంచెను. తీవ్రమగు భయముతో తన సైన్యము చెల్లాచెదరై పారిపోవుచుండుటను చూచిన ఆ వీరుడు నవ్వి ఇట్లు పలికెను.
కాలోపపన్నాం రుచిరాం మనస్వినా-
మువాచ వాచం పురుషప్రవీరః।
హే విప్రచిత్తే నముచే పులోమన్.
మయానర్వఞ్శoబర మే శృణుధ్వమ్ ॥
పురుషులలో గొప్ప వీరుడగు వృత్రుడు సమయోచితముగా, స్వాభిమానము గలవారల మనస్సును హరించే ఈ మాటను పలికెను --- ఓ విప్రచిత్తీ! నముచీ! పులోమా! మయా! అనర్వా! శంబరా! నా మాటను వినుడు.
జాతస్య మృత్యుర్ద్రువ ఏష సర్వతః
ప్రతిక్రియా యస్య న చేహ క్లుప్తా ।
లోకో యశశ్చాథ తతో యది హ్యముం
కో నామ మృత్యుం న వృణీత యుక్తమ్ ॥
ఈ లోకములో సర్వత్రా పుట్టినవానికి మరణము నిశ్చితము. భగవంతుడు దానికి నివారణోపాయమును కూడ పెట్టలేదు. అట్టి మరణము వలన పుణ్యలోకము కీర్తి కూడ లభించే పక్షములో, అట్టి యోగ్యమగు మరణము సంప్రాప్తమైనప్పుడు, దానిని ఎట్టివాడు వరించకుండును?
ద్వౌ సంమతావిహ మృత్యు దురాపౌ
యద్బ్రహ్మసంధారణయా జితాసుః ।
కలేవరం యోగరతో విజహ్యాద్
యదగ్రణీర్వీరశయేఽనివృత్తః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే షష్ఠస్కంధే దేవాసురయుద్ధ
వర్ణనం నామ దశమోऽధ్యాయః ॥
ఈ లోకములో రెండు గొప్ప మరణములు గలవు. వాటిని పొందుట చాల కష్టము. భక్తిజ్ఞానములయందు ప్రీతి గల సాధకుడు ప్రాణాయామమును చేసి భగవంతుని ధ్యానిస్తూ దేహమును విడిచి పెట్టుట మొదటిది. వీరుడు యుద్ధరంగమునుండి వెనుదిరుగకుండా ముందుకు దూసుకు పోయి శత్రువుల ప్రహారమునకు గురియై యుద్దభూమియందు మరణిం చుట రెండవది.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో దేవాసుర
యుద్దమును వర్ణించే పదవ అధ్యాయము ముగిసినది (10).
Summary of chapter 10 of the Bhāgavata Mahā Purana is as follows:
Bhagavān Vishṇu appears before the devatās and instructs them to approach the saintly sage Dadhīci to beg for his indestructible, sanctified bones to construct a formidable weapon. Displaying supreme compassion for universal welfare, Sage Dadhīci cheerfully surrenders his physical body through yogic trance, allowing the celestial architect Vishvakarmā to forge the invincible thunderbolt weapon (*Vajra*) from his bones, after which Indra leads the devatās into a ferocious cosmic war against Vṛtrāsura and his demonic legion.