భాగవత మహా పురాణము
9 - వృత్రాసురుని పుట్టుక - దేవతలు శ్రీహరిని స్తుతించుట
శ్రీశుక ఉవాచ ।
తస్యాసన్ విశ్వరూపస్య శిరాంసి త్రీణి భారత ।
సోమపీథం సురాపీథమన్నాదమితి శుశ్రుమ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఆ విశ్వరూపునకు మూడు తలలు ఉండెననియు, ఒక తలతో సోమరసమును, రెండవ తలతో మద్యమును త్రాగెడివాడనియు, మూడవ దానితో ఆహారమును తినెడివాడనియు విని యుంటిమి.
స వై బర్హిషి దేవేభ్యో భాగం ప్రత్యక్షముచ్చ కైః ।
అవదద్యస్య పితరో దేవాస్సప్తశ్రయం నృప ॥
ఆ విశ్వరూపునకు తండ్రులు దేవతలే. కావున, ఆతడు యజ్ఞములో సవినయముగా బిగ్గరగా దేవతలకు హవిర్భాగములను ప్రకటిస్తూ, సమర్పించెడివాడు.
స ఏవ హి దదౌ భాగం పరోక్షమసురాన్ ప్రతి ।
యజమానోఽవహద్భాగం మాతృస్నేహవశానుగః ॥
ఆ విశ్వరూపుడు యజ్ఞమును చేస్తూ, రాక్షసులకు కూడ హవిర్భాగములను రహస్యముగా సమర్పించెను. ఆతని తల్లి రాక్షసవంశమునందు పుట్టుటచే, ఆమెకు వారియందు ఉండే ప్రేమకు ఈతడు కూడ వశీభూతు డై, రాక్షసులకు భాగమును అందజేసెడివాడు.
తద్దేవహేలనం తస్య ధర్మాలీకం సురేశ్వరః ।
ఆలక్ష్య తరసా భీతస్తచ్ఛీర్షిణ్యచ్ఛినద్రుషా ॥
ఆ విధముగా ఆతడు ధర్మములో కపటమును చేస్తూ దేవతల యెడల అపరాధమును చేయగా, దేవప్రభుడగు ఇంద్రుడు గమనించెను. ఇంద్రుడు భయపడి, కోపముతో వేగముగా ఆతని తలలను నరికివేసెను.
సోమపీథం తు యత్తస్య శిర ఆసీత్కపింజలః ।
కలవింకస్సురాపీథమన్నాదం యత్స తిత్తిరిః ॥
సోమపానమును చేసే వాని తల కముజు పిట్టగను, మద్యమును త్రాగే తల పిచ్చుకగను, ఆహారమును తినే తల తీతువు పిట్టగను ఆయెను.
బ్రహ్మహత్యామంజలినా జగ్రాహ యదపీశ్వరః ।
సంవత్సరాంతే తదఘం భూతానాం స విశుద్ధయే ।
భూమ్యంబుద్రుమయోషిద్భ్యశ్చతుర్ధా వ్యభజద్ధరిః ॥
ఇంద్రుడు స్వర్గాధిపతియే అయిననూ, ఆయనకు బ్రహ్మహత్య తప్పలేదు. ఆయన ఆ పాపమును తన దోసిలితో స్వీకరించెను. సంవత్సరము తరువాత ఆయన తన దేహమునందలి నాలుగు భూతముల పరిశుద్ధి కొరకై (ఆకాశమునకు అపవిత్రత లేదు), ఆ పాపమును నేల, నీరు, చెట్లు మరియు స్త్రీలకు నాలుగు భాగములుగా పంచి యిచ్చెను.
భూమిస్తురీయం జగ్రాహ ఖాతపూరవరేణ వై ।
ఈరిణం బ్రహ్మహత్యాయా రూపం భూమౌ ప్రదృశ్యతే ॥
భూమిపై ఎక్కడైననూ గొయ్యి తనంత తానుగా పూడ్చబడవలెను అనే వరమును తీసుకొని, భూమి ఆ పాపముయొక్క నాల్గవ భాగమును స్వీకరించెను. భూమిపై కనబడే చవిటి నేల బ్రహ్మహత్యయొక్క రూపమే.
తుర్యం ఛేదవిరోహేణ వరేణ జగృహుద్రుమాః।
తేషాం నిర్యాసరూపేణ బ్రహ్మహత్యా ప్రదృశ్యతే ॥
తెగిన కొమ్మ చిగురించవలెను అనే వరమును పొంది, చెట్లు ఆ పాపములో నాల్గవ వంతును స్వీకరించినవి. ఆ బ్రహ్మహత్యాదోషము కొమ్మను నరికినప్పుడు వచ్చే బంక రూపములో కనబడును.
శశ్వత్కామవరేణాంహస్తురీయం జగృహుః స్త్రియః ।
రజోరూపేణ యాస్వంహో మాసి మాసి ప్రదృశ్యతే ॥
అధికమగు కామమును వరముగా పొంది, స్త్రీలు ఆ పాపములో నాల్గవ వంతును స్వీకరించిరి. స్త్రీలలో ప్రతి నెల రజస్వల యగుట అనే రూపములో ఆ దోషము కనబడును.
ద్రవ్యభూయోవరేణాపస్తురీయం జగృహుర్మలమ్ ।
తాసు బుద్బుదఫేనాభ్యాం దృష్టం తద్ధరతి క్షిపన్ ॥
నూతులు మొదలగువాటియందు నీరు అధికముగా ఊరుచుండవలెను అనే వరమును పొంది, జలములు నాల్గవ వంతు పాపమును స్వీకరించినవి. ఆ పాపమే నీటియందు బుడగలు, నురగల రూపములో కనబడును. వ్యక్తి నీటిని తీసుకొనే సమయములో వాటిని ప్రక్కకు త్రోసివేయును.
హతపుత్రస్తతస్త్వష్టా జుహావేంద్రాయ శత్రవే ।
ఇంద్రశత్రో వివర్ణస్వ మా చిరం జహి విద్విషమ్ ॥
తరువాత కొడుకును కోల్పోయిన త్వష్ణ ఇంద్రుని సంహరించు వాని కొరకై, ఓ ఇంద్ర సంహారకా! వర్ధిల్లుము, విలంబము లేకుండా శత్రువును హతమార్చుము అనే అర్థము గల మంత్రముతో హోమము చేసెను.
అథాన్వాహార్యపచనాదుత్థితో ఘోరదర్శనః ।
కృతాంత ఇవ లోకానాం యుగాంతసమయే యథా ॥
అపుడు దక్షిణాగ్నినుండి భయంకరాకారుడగు పురుషుడొకడు బయటకు వచ్చెను. ఆతడు ప్రళయకాలమునందు లోకములను సంహరించే రుద్రుడు వలె కానవచ్చెను.
విష్వగ్వివర్ధమానం తమిషుమాత్రం దినే దినే ।
దగ్ధశైలప్రతీకాశం సంధ్యాఽభ్రానీకవర్చసమ్ ॥
తప్తతామ్రశిఖాశ్మశ్రుం మధ్యాహ్నార్కోగ్రలోచనమ్ ॥
దేదీప్యమానే త్రిశిఖే శూల ఆరోప్య రోదసీ ।
నృత్యంతమున్నదంతం చ చాలయంతం పదా మహీమ్॥
దరీగంభీరవక్త్రేణ పిబతా చ నభస్తలమ్ ।
లిహతా జిహ్వయర్ క్షాణి గ్రసతా భువనత్రయమ్ ॥
మహతా రౌద్రదం ష్ట్రేణ జృంభమాణం ముహుర్ముహుః।
విత్రస్తా దుద్రువుర్లోకా వీక్ష్య సర్వే దిశో దశ ॥
ఆ పురుషుడు ప్రతిదినము అన్ని వైపులా ఒక బాణము పరిమాణములో పెరుగుచుండెను. తగులబడ్డ పర్వతము వలె నల్లనైన ఆతడు సంధ్యాకాలమునందలి మేఘముల గుంపుయొక్క కాంతిని కలిగియుండెను. పుటము పెట్టిన రాగిని బోలిన జుట్టు, గెడ్డము, మీసములు గల ఆతని కన్నులు మధ్యాహ్నసూర్యుని వలె చూపరులకు తాపమును కలిగించుచుండెను. ఆతడు గొప్పగా వెలిగిపోవుచున్న మూడు కొనల శూలమును పట్టుకొని బిగ్గరగా నాదము చేస్తూ నాట్యమాడినప్పుడు, నేల కంపించెను. ఆ శూలముపై అంతరిక్షమును గ్రుచ్చినాడా యన్నట్లుండెను. గుహవలె లోతైన ఆతని నోటిలో పెద్ద భయంకరములగు కోరలు ఉండెను. ఆతడు మాటిమాటికీ ఆవులిస్తూ, ఆకాశమును త్రాగివేయుచున్నాడా యన్నట్లు, నాలుకతో నక్షత్రములను నాకి వేయుచున్నాడా యన్నట్లు, ముల్లోకములను మ్రింగి వేయుచున్నాడాయన్నట్లు ఉండెను. వానిని చూచి జనులు చాల భయపడి పది దిక్కులకు పారిపోయిరి.
యేనావృతా ఇమే లోకాస్తమసా త్వాష్ట్రమూర్తినా ।
స వై వృత్ర ఇతి ప్రోక్తః పాపః పరమదారుణః ॥
త్వష్టయొక్క పుత్రుని రూపములో చీకటి ఈ లోకములను ఆవరించెను. కావుననే, పాపి మిక్కిలి క్రూరుడు అగు ఆతడు వృత్రుడు (ఆవరించినవాడు) అని పిలువబడెను.
తం నిజఘ్నురభిద్రుత్య సగణా విబుధర్షభాః ।
స్వైస్సైర్దివ్యాస్త్రశస్త్రౌఘైస్సోఽగ్రసత్తాని కృత్స్నశః ॥
దేవవీరులు తమ గణములతో కూడి వానిపై దండెత్తి వానిని తమ తమ దివ్యములగు అస్త్ర (మంత్రపూర్వకముగా ప్రయోగించబడే ఆయుధములు) శస్త్రముల (బాణములు మొదలగు ఆయుధములు) తో గట్టిగా కొట్టిరి. ఆతడు వాటినన్నింటినీ మ్రింగి వేసెను.
తతస్తే విస్మితాస్సర్వే విషణ్ణా గ్రస్తతేజసః ।
ప్రత్యంచమాదిపురుషముపతస్థుస్సమాహితాః ॥
తరువాత తమ తేజస్సు తిరస్కరించబడుటచే ఆశ్చర్యవిషాదములను పొందియున్న ఆ దేవతలందరు, ఆత్మస్వరూపుడు సర్వజగత్కారణుడు అగు పూర్ణ పరబ్రహ్మను ఏకాగ్రమగు చిత్తముతో నిలబడి స్తుతించిరి.
దేవా ఊచుః ।
వాయ్వంబరాగ్న్యప్ క్షితయస్త్రిలోకా ।
బ్రహ్మాదయో యే వయముద్విజంతః ।
హరామ యస్మై బలిమంతకోऽసౌ
బిభేతి యస్మాదరణం తతో నః ॥
దేవతలిట్లు పలికిరి --- పృథివ్యప్తేజోవాయ్వాకాశములనే పంచభూతములు, ముల్లోకములు, బ్రహ్మగారు మొదలుగా గల దేవతలమగు మేము కాలమునకు భయపడి, శ్రీహరికి పూజాదికమును సమర్పించుచుందుము. కాని, ఆ కాలము కూడ శ్రీహరి వలన భయపడును. అట్టి శ్రీహరి మాకు శరణు.
అవిస్మితం తం పరిపూర్ణకామం
స్వేనైవ లాభైన సమం ప్రశాంతమ్ ।
వినోపసర్పత్యపరం హి బాలిశః
శ్వలాంగులేనాతితితర్తి సింధుమ్ ॥
సర్వజగత్కర్తయగు శ్రీహరియందు కర్తృత్వాహంకారము గాని, రాగద్వేషములు కానీ లేవు. ఆనందఘనమగు తన స్వరూపము చేతనే పరిపూర్ణమైన మనోరథములు గల శ్రీహరి సర్వమునందు సమముగా ప్రకటమగుచున్నాడు. ఆ శ్రీహరిని కాకుండా, మరియొక సామాన్యుని శరణుపొందే వ్యక్తి, కుక్క తోక పట్టుకొని సముద్రమును తరించ గోరుచున్నాడు.
యస్యోరుశృంగే జగతీం స్వనావం
మనుర్యథాऽऽబధ్య తతార దుర్గమ్ ।
స ఏవ నస్త్వాష్ట్రభయాద్దురంతాత్ ।
త్రాతాऽऽశ్రీతాన్ వారిచరోఽపి నూనమ్ ॥
ఆ మత్స్యమూర్తియొక్క పెద్ద కొమ్మునకు మనువు పడవ రూపములోనున్న పృథివిని కట్టి సునాయాసముగా మహాభయమునుండి బయట పడెను. త్వష్టయొక్క పుత్రుడగు వృత్రుని వలని భయమునకు అంతము కానరాదు. ఆ శ్రీహరియే శరణు వేడిన మమ్ములను కూడ నిశ్చయముగా ఈ భయమునుండి రక్షించగలడు.
పురా స్వయంభూరపి సంయమాంభ-
స్యుదీర్ణవాతోర్మిరవైః కరాలే ।
ఏకోऽరవిందాత్పతితస్తతార
తస్మాద్భయాద్యేన స నోఽస్తు పారః ॥
పూర్వము ప్రళయజలములయందు పెద్ద గాలులు వీచి తరంగములు పుట్టి మహాశబ్దముతో భయమును గొల్పుచుండగా, ఒంటరియగు స్వయంభువుడు నాభికమలమునుండి పడిపోయేను. ఆయన ఆ భయము నుండి శ్రీహరి అనుగ్రహముచే బయట పడెను. మమ్ములను కూడ ఆ శ్రీహరి రక్షించు గాక!
య ఏక ఈశో నిజమాయయా నః
ససర్జ యేనానుసృజామ విశ్వమ్ ।
వయం న యస్యాపి పురస్సమీహతః
పశ్యామ లింగం పృథగీశమానినః ॥
అద్వితీయుడు, ఈశ్వరుడు అగు శ్రీహరి తన మాయచే మమ్ములను సృష్టించగా, ఆపైన మేము ఆయన అనుగ్రహము చేతనే జగత్తును సృష్టించుచున్నాము. మేము ఆయన కంటే భిన్నులము, మేము ప్రభువులము అనే అభిమానము మాకు గలదు. కావుననే, ఆయన మా యెదుటనే తన లీలలను చేయుచున్ననూ, మేము ఆయన స్వరూపమును తెలియలేకున్నాము.
యో నస్సపత్నైర్భృశమర్ద్యనాన్
దేవర్షితిర్యఙ్నృషు నిత్య ఏవ ।
కృతావతారస్తనుభిస్స్వమాయయా
కృత్వాఽఽత్మసాత్సాతి యుగే యుగే చ ॥
ఆ శ్రీహరి కాలమునకు అతీతుడు. అయిననూ, ఆయన తన మాయాశక్తిచే యుగయుగమునందు దేవతలు, మహర్షులు, పశువులు, మనుష్యుల రూపముగా అవతరించి, శత్రువులచే మిక్కిలి పీడింపబడుచున్న మమ్ములను తన వారినిగా భావించి రక్షించుచున్నాడు.
తమేవ దేవం వయమాత్మ దైవతం
పరం ప్రధానం పురుషం విశ్వమన్యమ్ ।
వ్రజామ సర్వే శరణం శరణ్యం
స్వానాం స నో ధాస్యత శం మహాత్మా ॥
ఈ సృష్టికి ఉపాదానము, నిమిత్తము కూడ ఆ శ్రీహరియే. ఆయనయే జగద్రూపముగా ప్రకటమైననూ, జగత్తుకంటె విలక్షణముగానున్నాడు. శరణు జొచ్చినవారిని కాపాడే ఆయనయే మా ఉపాస్యదైవము. మేమందరము ఆ భగవానుని శరణు వేడుచున్నాము. సర్వాత్మస్వరూపుడగు ఆయన మాకు సుఖమును కలిగించ గలడు.
శ్రీశుక ఉవాచ ।
ఇతి తేషాం మహారాజ సురాణాముపతిష్ఠతామ్ ।
ప్రతీచ్యాం దిశ్యభూదావిశ్శంఖచక్రగదాధరః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధముగా ఆ దేవతలు స్తుతించుచుండగా, పడమర దిక్కునందు శంఖము, చక్రము, గదలను ధరించిన శ్రీహరి ప్రకటమయ్యెను.
ఆత్మతుల్యైష్షోడశభిర్వినా శ్రీవత్సకౌస్తుభౌ ।
పర్యుపాసితమున్నిద్రశరదంబురు హేక్షణమ్ ॥
దృష్ట్వా తమవనౌ సర్వ ఈక్షణాహ్లాదవిక్లబాః ।
దండవత్పతితా రాజన్ శనైరుత్థాయ తుష్టువుః ॥
ఓ మహారాజా! ఆ శ్రీహరిని చుట్టువారి పదునార్గురు అనుచరులు సేవించుచుండిరి. శ్రీవత్సమనే మచ్చను, కౌస్తుభమాణిక్యమును మినహాయించి, వారు శ్రీహరినే పోలియుండిరి. వికసించిన శరత్కాలపద్మముల వంటి కన్నులు గల ఆ శ్రీహరిని చూచి దేవతలందరు ఆ ఆనందముచే వివశులైరి. వారు సాష్టాంగ దండప్రణామము నాచరించి, మెల్లగా లేచి నిలబడి స్తుతించిరి.
దేవా ఊచుః ।
నమస్తే యజ్ఞవీర్యాయ వయసే ఉత తే నమః ।
నమస్తే హ్యస్తచక్రాయ నమస్సుపురుహూతయే ॥
దేవతలిట్లు పలికిరి --- కాలస్వరూపుడవగు నీవే యజ్ఞఫలదాతవు. శత్రువులపై చక్రమును ప్రయోగించే నీకు చక్కని నామములు చాల గలవు. నీకు అనేక నమస్కారములు.
యత్తే గతీనాం తిసౄణామీశితుః పరమం పదమ్ ।
నార్వాచీనో విసర్గస్య ధాతర్వేదితుమర్హతి ॥
ఓ పాలకుడా! జీవులు పొందే ఉత్తమ (స్వర్గాది)- మధ్యమ (మనుష్య)- అధమ (నరకాది) గతులను శాసించేది నీవే. నీ సర్వాతీశాయి స్వరూపమును తెలియుటకు సృష్టి తరువాత వచ్చిన మావంటివారు తగరు.
ఓం నమస్తేస్తు భగవన్ నారాయణ వాసుదేవాదిపురుష మహాపురుష మహానుభావ పరమమంగల పరమకల్యాణ పరమకారుణిక కేవల జగదాధార లోకైకనాథ సర్వేశ్వర లక్ష్మీనాథ పరమహంసపరివ్రాజకైః పరమేణాత్మయోగసమాధినా పరభావితపరిస్ఫుటపార మహంస్యధర్మేణోద్ఘాటితతమఃకపాటద్వార చిత్తే ऽపావృత ఆత్మలోకే స్వయముపలబ్ధఖనిజసుఖానుభావో భవాన్ ॥
ఓ నారాయణ భగవానుడా! నీకు నమస్కారమగు గాక! వాసుదేవా! పురుషోత్తమా! జగత్కారణమగు చైతన్యము నీవే. నీ మహిమ గొప్పది. పరమమంగళమగు నీ రూపము భక్తులకు గొప్ప కల్యాణముల నిచ్చును. ఓ అద్వయా! కరుణామయుడవగు నీవే జగత్తునకు అధిష్ఠానమగుచున్నావు. లోకములను శాసించి రక్షించే ఏకైకప్రభుడవు నీవే. ఓ లక్ష్మీపతీ!
పరమహంస పరివ్రాజకులు సర్వోత్కృష్టమగు ఆత్మనిష్ఠయందు ఏకాగ్రత గలవారై యుందురు. ఆ విధముగా పరిశుద్ధము చేయబడిన వారి అంతఃకరణమునందు సర్వసంగపరిత్యాగుల శమదమాది ధర్మము చక్కగా స్ఫురించుచుండును. దానిచే, చిత్తము అనే మోక్షద్వారమునకు ఉండే అజ్ఞానపు తలుపులు తెరుచుకొనును. అట్టి చిత్తమునందు ఆత్మరూపుడవైన నీవు చక్కగా ఆవిర్భవించెదవు. అట్టి ఆత్మసాక్షాత్కారమునందు తనంత తానుగా ప్రకటమయ్యే బ్రహ్మానందానుభవము నీ స్వరూపమే.
దురవబోధ ఇవ తవాయం విహారయోగో యదశరణ్వేఽశరీర ఇదమన వేక్షితాస్మత్సమవాయ ఆత్మ నైవావిక్రియమాణేన సగుణమగుణస్సృజసి పాసి హరసి ॥
నీ ఈ లీలాపద్ధతి బుద్ధికి అంతు పట్టుటనే లేదు. ఏలయన, నీకు ఆశ్రయము గాని, శరీరము గాని, గుణములు గాని లేవు. మా సాహాయ్యమును నీవు అపేక్షించవు, నీ స్వరూపములో వికారములేవియు రావు. అయిననూ, నీవీ త్రిగుణముల కార్యమగు జగత్తును సృష్టించి, పాలించి, ఉపసంహరించుచున్నావు.
అథ తత్ర భవాన్ కిం దేవదత్తపదిహ గుణవిసర్గపతితః పారతం త్ర్యేణ స్వకృతకుశలాకుశలం ఫలముపాదదాత్యాహోస్విదా త్మారామ ఉపశమశీలస్సమంజసదర్శన ఉదాస్త ఇతి హ వావ న విదామః ॥
నీవు ప్రాకృతజీవుని వలె ఈ లోకములో త్రిగుణకార్యమగు దేహాదులయందు ఆత్మభావము గలవాడవై పరాధీనుడవై మంచి-చెడు కర్మలను చేసి వాటి ఫలములగు సుఖదుఃఖములననుభవించుచున్నావా? లేక, ఆత్మారాముడవు, శాంతస్వభావుడవు, కర్తృత్వ భోక్తృత్వములకు అతీతమగు బ్రహ్మాత్మ దర్శనము గలవాడవు అగు కేవల సాక్షివై యున్నావా? ఇది మాకు అంతు పట్టరాకున్నది.
న హి విరోధ ఉభయం భగవత్యపరిగణితగుణగణే ఈశ్వ రేఽనవగాహ్యమాహాత్మ్యేఽర్వాచీనవికల్పవితర్కవిచారప్రమాణాభాసకుతర్క శాస్త్రకలిలాంతఃకరణాశ్రయదురవగ్రహవా దినాం వివాదానవసర ఉపరతసమస్తమాయామయే కేవల ఏవాత్మమాయామంతర్ధాయ కో న్వర్ధో దుర్ఘట ఇవ భవతి స్వరూపద్వయాభావాత్ ॥
సర్వమును శాసించే భగవానుని గుణగణములను లెక్కించుట శక్యము కాదు. తెలియ శక్యము కాని మహిమ గల ఆ భగవానుని విషయములో, దురాగ్రహమునకు నిలయమై దూషితమైన బుద్ధి గల వాదులు కొంగ్రొత్తగా కల్పించే చెడు తర్కముల శాస్త్రములలోని వికల్పములకు (ఇదా? అదా? అనే సంశయములు), విరు ద్ధతర్కములకు, విచారములకు (వాదనలు), ప్రమాణములు (జ్ఞానసాధనములు) వలె కన్పట్టే అప్రమాణములకు తావు లేదు. మాయాకల్పితమగు సంసారము అద్వితీయుడగు ఆ భగవానునియందు నిరస్తమైనది. భగవానునియందు సగుణము-నిర్గుణము, కర్త-అకర్త మొదలగు పరస్పర విరుద్ధములగు అంశములు మాయాశక్తిని మధ్యలో నుంచుకున్నచో అసంగతములు కానే కావు. మాయాశక్తిచే పొసగనిది ఒకటి ఉన్నదా! వాస్తవములో సర్వమునకు అతీతమగు అద్వయ బ్రహ్మయందు కర్తృత్వము గాని, అకర్తృత్వము గాని, సగుణత్వము గాని, నిర్గుణత్వము గాని ఉండవు. పరబ్రహ్మ సకలద్వంద్వ విలక్షణము.
సమవిషమమతీనాం మతమనుసరసి యథా రజ్జుఖండస్సర్పాదిధియామ్ ॥
ఒకే త్రాడు ముక్క యథార్థమగు దర్శనము గలవానికి త్రాడుగను, విరుద్ధదర్శనము గలవారలకు పాము మాల మొదలగు రూపములలోను కొనవచ్చును. అదే విధముగా, సమదర్శనము (అద్వయబ్రహ్మాత్మజ్ఞానము) గలవారలకు సర్వరూపుడువుగను, భేదదృష్టి గలవారలకు భేదములు గలవాడివగను కానవచ్చేది నీవే.
స ఏవ హి పునస్సర్వవస్తుని వస్తుస్వరూపస్సర్వేశ్వరస్సకలజ గత్కారణకారణభూతస్సర్వప్రత్యగాత్మత్వాత్సర్వగుణాభాసో పలక్షిత ఏక
ఏవ పర్యవ శేషితః ॥
మరల విచారించినచో, సర్వజగన్నాథుడగు ఆ భగవానుడు సకల జగత్తునకు కారణములగు పంచభూతములకు కూడ కారణము. కావున, సకలప్రపంచముయొక్క పరమార్థ (కేవల-అఖండసత్తా) స్వరూపము ఆయనయే. ఆయనయే సకలప్రాణులలో అంతరతమమగు ఆత్మస్వరూపముగా ఉండి, గుణకార్యములగు ఇంద్రియములనన్నింటినీ ప్రకాశింప జేయుచున్నాడు. ఆయా ఇంద్రియప్రకాశములు ఆ సర్వేశ్వరునే సంకేతముగా చూపుచున్నవి. ఈ కార్యప్రపంచమును సర్వమును నిషేధించగా (కారణముకంటే భిన్నముగా లేదని తెలుసుకొని కారణములో విలీనముచేయగా), మిగిలి ఉండేది ఆ అద్వయ పరమేశ్వరుడు మాత్రమే.
అథ హ వావ తవ మహిమామృతరససముద్రవిప్రుషా సకృదవలీ ఢయా స్వమనసి నిష్యందమానానవరతసుఖేన విస్మారితదృష్టశ్రు తవిషయసుఖలేశాభాసాః పరమభాగవతా ఏకాంతినో భగవతి సర్వ భూతప్రియసుహృది సర్వాత్మని నితరాం నిరంతరం నిర్వృతమ నసః కథము హ వా ఏతే మధుమథన పునస్స్వార్థకుశలా హ్యాత్మ ప్రియసుహృదస్సాధవస్త్వచ్చరణాంబుజాను సేవాం విసృజంతి న యత్ర పునరయం సంసారపర్యావర్తః ॥
ఓ మధుసూదనా! కావుననే, భగవద్భక్తశిఖామణులకు నీ మహిమ అనే అమృతరససముద్రముయొక్క బిందువును ఒక్కసారి ఆస్వాదించినంతనే వారి మనస్సునందు అఖండానందము జాలువారును. దానిచే వారు అంతవరకు చూచిన మరియు విన్న ఇంద్రియభోగములయందలి అల్పమగు సుఖముయొక్క ప్రతీతి మరుగున పడిపోవును. సకలప్రాణులకు ఆత్మరూపుడవు, హితకారివి, సర్వముయొక్క పరమార్థరూ పుడవు, భగవానుడవు అగు నీయందు అనన్యభక్తి గల ఆ సాధుపురుషుల మనస్సు సుఖముగా నిలిచియుండును. తమ పురుషార్థము విషయములో నిపుణులగు ఈ భక్తులు ఆత్మయందే ఆనందఘనుడు హితకరుడు అగు పరబ్రహ్మను దర్శించేదరు. అట్టి మహాత్ములు మరల నీ పాదపద్మముల నిరంతర సేవను ఏ విధముగా విడిచిపెట్టెదరు? (విడిచిపెట్టరు). దాని వలన మానవునకు మరల ఈ సంసారములో పరిభ్రమణము తొలగి పోవును.
త్రిభువనాత్మభవన త్రివిక్రము త్రినయన త్రిలోకమనోహరాను భావ తవైవ విభూతయో దితిజదనుజాదయశ్చాపి తేషామను పక్రమసమయోఽయమితి స్వాత్మమాయయా సురనరమృగ మిశ్రితజలచరాకృతిభిర్యథాపరాధం దండం దండధర దధర్థ
ఏవమేనమపి భగవన్ జహి త్వాష్ట్రముత యది మన్యసే ।
ఓ భగవానుడా! ఈ ముల్లోకములే నీ నివాసము. ఈ ముల్లోకములకు నీవే ఆత్మ మరియు ఆశ్రయము. నీవీ ముల్లోకములను మూడు అడుగులతో కొలిచినావు. ముక్కంటివి నీవే. నీ మహిమలు (లీలలు) ముల్లోకములలో మనోహరములైనవి. దితి దనువుల సంతానమగు రాక్షసులు కూడ నీ విభూతులే. అయిననూ, వారు ఉద్యమించే కాలము ఇది కాదని భావించిన సందర్భములలో, నీవు నీ స్వరూపములో అంతర్గతమైన మాయాశక్తిచే దేవత (వామనుడు), మానవుడు (శ్రీరాముడు), మృగము (వరాహము), నరసింహముల కలయిక, జలచరము (మత్స్యము) ల రూపములో అవతరించి, వారి అపరాధములకు తగ్గట్లుగా వారికి శిక్షను అమలు చేసితివి. అదే విధముగా, నీకు అంగీకారమైనచో, త్వష్టయొక్క పుత్రుడగు ఈ వృత్రుని కూడ సంహరించుము.
అస్మాకం తావకానాం తవ నతానాం తత తతామహ తవ
చరణనలినయుగలధ్యానానుబద్ధహృదయనిగడానాం స్వలింగవి వరణేనాత్మసాత్కృతానామనుకంపాఽనురంజితవిశదరుచిరశిశి
రస్మితావలోకేన విగలితమధురముఖరసామృతకలయా
చాంతస్తాపమనఘార్హసి శమయితుమ్ ॥
కర్తృత్వాది దోషములు లేని ఓ శ్రీహరీ! మాకు తండ్రివి, తాతవు నీవే. మేము నీ వారము. నీకు నమస్కరించుచున్నాము. మా హృదయములు నీ పాదపద్మముల జంటకు ధ్యానము అనే సంకేలచే కట్టి వేయబడినవి. నీవు నీ మూర్తిని మా ముందు ప్రకటించి మమ్ములను నీవారినిగా స్వీకరించినావు. నీ అందమగు నిర్మలమైన చిరునవ్వు దయతో అనురాగముతో కూడి చల్లగా నుండును. అట్టి చిరునవ్వుతో కూడిన చూపుతో, మరియు నీ నోటినుండి వెలువడే మధురమగు వాక్కు అనే అమృతబిందువుతో మా మనస్తాపమును చల్లార్చుట నీకు తగును.
అథ భగవంస్తవాస్మాభిరఖిలజగదుత్పత్తిస్థితిలయనిమత్తాయ
మానదివ్యమాయావినోదస్య సకలజీవనికొయానామంతర్హృద యేషు బహిరపి
చ బ్రహ్మప్రత్యగాత్మస్వరూపేణ ప్రధానరూపేణ చ యథాదేశకాలదేహావస్థానవిశేషం తదుపాదానోపలం భకతయాఽనుభవతస్సర్వప్రత్యయసాక్షిణ ఆకాశశరీరస్య సాక్షాత్పరబ్రహ్మణః పరమాత్మనః కియానిహ వా అర్థవిశేషో విజ్ఞాపనీయస్స్యాద్విస్ఫులింగాదిభిరివ హిరణ్యరేతసః ॥
ఓ భగవానుడా! నీవు గురువులకు గురుడవు. నిన్ను శరణు పొందినవారికి వివిధదుఃఖములతో కూడియున్న సంసారమునందలి అధికమగు శ్రమను నీ పాదపద్మముల నీడ ఉపశమింప జేయుచుండును. మేము ఒక కోరికతో అట్టి నీ పాదములను పట్టుకున్నాము. కావున, నీవు స్వయముగా మాకా కోరికను సంపాదించి పెట్టుము.
అథో ఈశ జహి త్వాష్ట్రం గ్రసంతం భువనత్రయమ్ ।
గ్రస్తాని యేన నః కృష్ణ తేజాంస్యస్త్రాయుధాని చ ॥
ఓ ఈశ్వరా! కృష్ణా! కావున, ఇప్పటికే మా శక్తులను అస్త్రములను ఆయుధములను మ్రింగివేసి, ముల్లోకములను కూడ మ్రింగి వేయుచున్న త్వష్టయొక్క పుత్రుడగు ఆ వృత్రుని నీవు సంహరించుము.
హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ
కృష్ణాయ మృష్టయశ సే నిరుపక్రమాయ ।
సత్సంగ్రహాయ భవపాంథనిజాశ్రమాప్తా-
వంతే పరీష్టగతయే హరయే నమస్తే ॥
శ్రీభగవానుడిట్లు పలికెను --- ఓ దేవతోత్తములారా! మీరు నన్ను ఉద్దేశించి చేసిన స్తుతి తత్త్వజ్ఞానముతో కూడియున్నది. నేను ప్రసన్నుడనైతిని. ఈ స్తుతి వలన మానవులకు నాయందు భక్తి కూడ ఉదయించి, ఆత్మరూపుడనగు నా ఈశ్వరభావము స్మృతిలో నుండును.
కిం దురాపం మయి ప్రీతే తథాపి విబుధర్షభాః ।
మయ్యేకాంతమతిర్నాన్యన్మత్తో వాంఛతి తత్త్వవిత్ ॥
ఓ దేవతోత్తములారా! నేను ప్రసన్నుడనైనచో లభించనిది ఏమి ఉండును? అయిననూ, నాయందు అనన్యమగు భక్తిగల తత్త్వవేత్తలు నానుండి (భక్తిని తక్క) ఇతరమును దేనినీ కోరరు.
న వేద కృపణశ్శ్రేయ ఆత్మనో గుణవస్తుదృక్ ।
తస్య తానిచ్ఛతో యచ్ఛేద్యది సోఽపి తథావిధః ॥
త్రిగుణకార్యమగు జగత్తునందు సత్యత్వబుద్ధి గల వ్యక్తి సంసారాసక్తుడై యుండును. వానికి తన హితము ఏదో తెలియదు. వాడు కోరే భోగ.
స్వయం నిశ్శ్రేయసం విద్వాన్ న వక్త్యజ్ఞాయ కర్మ హి ।
న రాతి రోగిణోఽపథ్యం వాంఛతో హి భిషక్తమః ॥
మోక్షసాధనమగు ఆత్మజ్ఞానమును పొందిన మహాత్ముడు అజ్ఞానికి కామనలను తీర్చే కర్మల నుపదేశించడు. హితము కాని ఆహారమును రోగి కోరిననూ, మంచి వైద్యుడు ఆతనికి దానిని ఈయడు గదా!
మఘవన్ యాత భద్రం వో దధ్యంచమృషిసత్తమమ్ ।
విద్యావ్రతతపస్సారం గాత్రం యాచత మా చిరమ్ ॥
ఓ ఇంద్రా! దధీచి మహర్షివద్దకు శీఘ్రముగా వెళ్లుడు. మీకు మంగళమగు గాక! ఉపాసన, వ్రతములు, తపస్సులచే దృఢమైన ఆయన శరీరమును కోరుడు.
స వా అధిగతో దధ్యఙ్ఙశ్విభ్యాం బ్రహ్మ నిష్కలమ్ ।
యద్వా అశ్వశిరో నామ తయోరమరతాం వ్యధాత్ ॥
నిరవయవమగు పరబ్రహ్మయొక్క జ్ఞానము ఆ దధీచునకు గలదు, అశ్వశిరము అని ప్రసిద్ధి గాంచిన ఆ జ్ఞానమును ఆయన అశ్వినీ కుమారులకు ఉపదేశించగా, వారు జీవన్ముక్తులైరి.
దధ్యఙ్ ఙాథర్వణస్త్వష్ట్రే వర్మాభేద్యం మదాత్మకమ్ ।
విశ్వరూపాయ యత్ప్రాదాత్త్వష్టా యత్త్వమధాస్తతః ॥
అథర్వవేదీయుడగు దధీచి నా స్వరూపమగు కవచమును త్వష్టకు ఇచ్చెను. ఆ కవచము దుర్భేద్యమైనది. దానిని త్వష్ట తన పుత్రుడగు విశ్వరూపునకీయగా, ఆయన వద్దనుండి నీవు పొంది ధారణ చేసితివి.
యుష్మభ్యం యాచితోఽశ్విభ్యాం ధర్మజ్ఞోఽoగాని దాస్యతి ।
తత స్తైరాయుధశ్రేష్ఠో విశ్వకర్మవినిర్మితః ।
యేన వృత్రశిరో హర్తా మత్తేజఉపబృంహితః ॥
అశ్వినీ దేవతలు కోరినచో, ధర్మము తెలిసిన దధీచి తన అవయవములను మీకు ఈయగలడు. వాటితో విశ్వకర్మ గొప్ప ఆయుధమును నిర్మించును. నా తేజస్సుచే వర్ధిల్లజేయబడిన నీవు దానితో వృత్రుని తలను నరుకగలవు.
తస్మిన్ వినిహతే యూయం తేజోఽస్త్రాయుధసంపదః ।
భూయః ప్రాప్స్యథ భద్రం వో న హింసంతి చ మత్పరాన్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే షష్ఠస్కంధే
వృత్రాసురోత్పత్తివర్ణనం నామ నవమోऽధ్యాయః ॥
ఆ వృత్రుడు సంహరించబడగానే మీకు తేజస్సు, అస్త్రశస్త్రములు, సంపదలు మరల లభించగలవు. మీకు మంగళమగు గాక! నా భక్తులను ఎవరైననూ హింసించలేరు.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో వృత్రాసురుని
జననమును వర్ణించే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).
Summary of chapter 9 of the Bhāgavata Mahā Purana is as follows:
Indra discovers that Vishvarūpa was secretly offering sacrificial oblations to the asuras out of maternal affection for his mother's demonic lineage, whereupon an enraged Indra decapitates Vishvarūpa's three heads. To avenge his son's murder, Tvashṭā performs a dark sacrificial ritual, from which arises Vṛtrāsura, a mountain-like titan whose immense body and cavernous mouth threaten to consume the three worlds. Vṛtrāsura routs the heavenly armies and swallows their weapons, driving the terrified devatās to offer desperate prayers of surrender to Bhagavān Vishṇu.