భాగవత మహా పురాణము
2 - అజామీలుడు వైకుంఠమును పొందుట
శ్రీశుక ఉవాచ ।
ఏవం తే భగవదూతా యమద్దూతాభిభాషితమ్ ।
ఉపధార్యాథ తాన్ రాజన్ ప్రత్యాహుర్నయకోవిదాః ॥
శ్రీ శుకమహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! ఆ విష్ణు దూతలు ధర్మనిర్ణయములో పండితులు. వారా యమదూతల ప్రసంగ మును సావధానముగా విని, తరువాత వారికి ఇట్లు బదులు చెప్పిరి.
విష్ణుదూతా ఊచుః ।
అహో కష్టం ధర్మదృమధర్మస్స్పృశతే సభామ్ ।
యత్రిదండ్యేష్వపా పేషు దండో యెర్ధ్రియతే వృథా ॥
విష్ణుదూతలు ఇట్లు పలికిరి --- అయ్యో! కష్టము వచ్చినది! ధర్మ వేత్తల సభలో అధర్మము ప్రవేశించుచున్నది. ఏలయనగా, అచట వారిచే శిక్షించదగని నిరపరాధులకు శిక్ష వేయబడుచున్నది.
ప్రజానాం పితరో యే చ శాస్తారస్సాధవస్సమాః ।
యది స్యాత్తేషు వైషమ్యం కం యాంతి శరణం ప్రజాః ॥
ప్రజలను తండ్రివలె సమబుద్దితో పాలించ వలసిన సత్పురుషుల యందే వైపరీత్యము వచ్చినచో, ఆ ప్రజలు ఎవనిని శరణు పొందెదరు?
యద్యదాచరతి శ్రేయానితరస్తత్తదీహతే ।
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥
శ్రేష్ట పురుషుడు దేనిని చేస్తే, సామాన్యజనులు దానినే చేయుదు రు. ఆతడు దేనిని ధర్మమని ప్రమాణీకరిస్తే, దానినే జనులు అనుసరిస్తారు.
యస్యాం కే శిర ఆధాయ లోకస్స్వపితి నిర్వృతః ।
స్వయం ధర్మమధర్మం వా న హి వేద యథా పశుః॥
అజ్ఞానియగు సామాన్యమానవుడు తాను ధర్మాధర్మములను ఎరుంగడు. సామాన్యజనుడు ఒక గొప్పవానిని నమ్మి, ఆతని ఒడిలో తల నుంచి సుఖముగా నిద్రించును.
స కథం న్యర్పితాత్మానం కృతమైత్రమచేతనమ్ ।
విశ్రాంభణీయో భూతానాం సఘృణో ద్రోగ్ధుమర్హతి ॥
అజ్ఞానులగు జనులు ఎవనినైతే నమ్మి మైత్రిని నేరపి తమను తాము పూర్తిగా సమర్పించుకొందురో, అట్టి నమ్మదగిన మరియు దయ గల నాయకుడు, వారికి ద్రోహము చేయుటకు ఎట్లు తగును? తగడు.
అయం హి కృతనిర్వేశో జన్మకోట్యాంహసామపి ।
యద్వ్యాజహార వివశో నామ స్వస్త్యయనం హరేః ॥
ఈతడు కోటి జన్మల పాపములకైననూ నిశ్చయముగా ప్రాయశ్చి త్తమును చేసుకున్నాడు. ఏలయనగా, ఈతడు కల్యాణములకు నిలయమగు శ్రీహరి నామమును, ఉద్దేశ్యపూర్వకముగా కాకున్ననూ, పలికినాడు.
ఏతేనైవ హ్య ఘోనోకస్య కృతం స్యాదఘనిష్కృతమ్ ।
యదా నారాయణాయేతి జగద చతురక్షరమ్ ॥
ఈతడు ఎప్పుడైతే, నారాయణా! రమ్ము అని నాలుగు అక్షర ముల నామమును ఉచ్చరించినాడో, అప్పుడు దానిచేతనే ఈ పాపియొక్క పాపములకు నిష్కృతి కలిగినది. ఇది నిశ్చయము.
స్తేనస్సురాపో మిత్రధ్రుగ్ బ్రహ్మహా గురుతల్పగః ।
స్త్రీరాజపితృగోహంతో యే చ పాతకినోకపరే ॥
సర్వేషామప్యఘవతామిదమేవ సునిష్కృతమ్ ।
నామవ్యాహరణం విష్ణోర్యతస్తద్విషయా మతిః ॥
బంగారమును దొంగిలించినవాడు, మద్యము త్రాగువాడు, మిత్రు నకు ద్రోహమును చేసినవాడు, వేదవేత్తను చంపినవాడు, గురువుయొక్క భార్యను కోరినవాడు, స్త్రీని రాజును తల్లిని తండ్రిని ఆవును లేదా ఎద్దును చంపినవాడు అను వారే గాక ఇంకనూ ఇతరములైన పాపములను చేసిన వారందరికి విష్ణువుయొక్క నామమును ఉచ్చరించుటయే చక్కటి ప్రాయశ్చిత్తము. నామమునుచ్చరించుట వలన వీని మనస్సు భగవదాకారము అగును. లేదా, భగవానునకు వీడు గుర్తుకు వచ్చి వీనిపై అనుగ్రహము కలుగును.
న నిష్కృతైరదితైర్భ్రహ్మవాదిభిః
తథా విశుద్ద్యత్యఘవాన్ ప్రతాదిభిః ।
యథా హరేర్నామపదైరుదాహృతైః
తదుత్తమశ్లోకగుణోపలంభకమ్ ॥
వేదవేత్తలు పాపనిష్కృతికై వ్రతములు మొదలగు ప్రాయశ్చిత్తము లను చెప్పినారు. కాని కేవలము శ్రీహరి పేర్ల రూపములో నుండే పదము లను ఉచ్చరించి పాపి ఎట్టి విశేషమగు శుద్ధిని పొందుతున్నాడో, అట్టి విశుద్ధి ఆ ప్రాయశ్చిత్తములచే కలుగుట లేదు. పావనమగు కీర్తి గల శ్రీహరి పేరును ఉచ్చరించుట వలన, ఆయన గుణములు మనస్సునకు వచ్చును.
నైకాంతికం తద్ధి కృతేపి నిష్కృతే
మనః పునర్ధావతి చేదసత్పధే,
తత్కర్మనిరారమభీప్సతాం హరే
ర్గుణానువాదః ఖలు సత్త్వభావనః ॥
ప్రాయశ్చిత్తమును చేసిన తరువాత మరల మనస్సు చెడు మార్గ ములోనికి వెళ్లినచో, ఆ ప్రాయశ్చిత్తము వాని అంతఃకరణమును పూర్తిగా శుద్దము చేసినట్లు కానే కాదు. కావున, కర్మబంధమునుండి ఆత్యంతికమగు విముక్తిని కోరువారు శ్రీహరి గుణములను కీర్తించినచో, వారి అంతఃకరణము పూర్తిగా విశుద్ధమగును (తద్ద్వారా మోక్షము లభించును)
అథైనం మాపనయత కృతా శేషాఘనిష్కృతమ్ ।
యదసౌ భగవన్నామ ప్రియమాణస్సమగ్రహీత్ ॥
ఈతడు మరణిస్తూ భగవానుని నామమును చక్కగా ఉచ్చరించి, ఆ విధముగా తన పాపములన్నింటికీ ప్రాయశ్చిత్తమును చేసుకున్నాడు. కావున, మీరీతనిని నరకమార్గముగుండా కొనిపోవద్దు.
సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేలనమేవ వా ।
వైకుంఠనామగ్రహణమ శేషాఘహరం విదుః ॥
వైకుంఠవాసి (బుద్దియందు చైతన్యమై ఉండువాడు) యగు శ్రీహ రియొక్క నామమును ఇంకొకరి పేరును పిలిచినప్పుడు గాని, పరిహాసము కొరకు గాని, పాటలో ఊతపదముగా గాని, ఒకనిని గేలి చేయుటకు గాని ఉచ్చరించినా, పాపములన్నియు నశించునని మహాత్ములు ఎరుగుదురు.
పతితః స్థలితో భగ్నస్సందష్టస్తప్త ఆహతః ।
హరిరిత్యవశేనాహ పుమాన్నార్హతి యాతనామ్ ॥
మానవుడు పడినప్పుడు గాని, జారినప్పుడు గాని, అవయమే దైనా విరిగినప్పుడు గాని, ఏదైనా కరిచినప్పుడు గాని, ఎండ మొదలగు వాటి తాపము కలిగినప్పుడు గాని, కర్ర మొదలగువాటి దెబ్బ తగిలిన ప్పుడు గాని, బుద్ధిపూర్వకముగా కాకపోయినా, హరి అనే నామ మునుచ్చరించినచో, ఆతడు నరకయాతనలకు అర్హుడు కాడు.
గురూణాం చ లఘూనాం చ గురూణి చ లఘూని చ ।
ప్రాయశ్చిత్తాని పాపానాం జ్ఞాత్వోక్తాని మహర్షిభిః ॥
మహర్షులు విచారణ చేసియే పెద్ద పాపములకు పెద్ద ప్రాయశ్చిత్త ములను, చిన్నవాటికి చిన్నవాటిని చెప్పిరి.
తైస్తాన్యఘాని పూయంతే తపోదానజపాదిభిః ।
నాధర్మజం తద్ధృదయం తదపీశాంఘి సేవయా ॥
తపస్సు, దానము, జపము మొదలగు ప్రాయశ్చిత్తములచే పాప ములు వినాశమును పొందవచ్చును. కాని, అధర్మసంకల్పమునకు జన్మని చ్చిన అంతఃకరణము శుద్దము కాదు. ఈశ్వరుని పాదములను సేవించిన చో, అంతఃకరణము కూడ శుద్ధమగును.
అజ్ఞానాదథవా జ్ఞానాదుత్తమశ్లోకనామ యత్ ।
సంకీర్తితమఘం పుంసో దహేదేదో యథావనలః ॥
మానవుడు తెలిసి గాని, తెలియక గాని పవిత్రకీర్తియగు శ్రీహరి నామము నుచ్చరించినచో, అది వాని పాపమును, నిప్పు కట్టెను వలె తగు లబెట్టును.
యథాగదం వీర్యతమముపయుక్తం యదృచ్ఛయా ।
అకౌనతోప్యాత్మగుణం కుర్యాన్మంత్రోపుదాహృతః ॥
మంచి శక్తి గల మందును ఒకడు తెలియక..తానే అనుకోకుండా (ఈశ్వరేచ్చచే) వాడినచో, ఆ మందు తన గుణమును రూపును. అదే విధ ముగా, హరినామమంత్రము నుచ్చరిస్తే, దాని ప్రభావము కనబడి తీరును.
శ్రీశుక ఉవాచ ।
త ఏవం సువినిర్జీయ ధర్మం భాగవతం నృప ।
తం యామ్యపాశాన్నిర్ముచ్య విప్రం మృత్యోరమూముచన్॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! వారీ విధముగా భగవద్భక్తి అనే ధర్మమును చక్కగా వివరముగా నిర్ధారించి, ఆ అజామి లుని యమదూతల పాశమునుండీ మాత్రమే గాక, మరణమునుండి కూడ విముక్తుని చేసిరి.
ఇతి ప్రత్యుదితా యామ్యా దూతా యాత్వా యమాంతికే ।
యమరాజ్ఞే యథా సర్వమాచచక్షురరిందమ ॥
అంతశ్శత్రువులను నియమించిన ఓ రాజా! విష్ణుదూతలీ విధ ముగా బదులీయగా, యమదూతలు యముని వద్దకు వెళ్లి, జరిగిన వృత్తాం తమునంతను పూస గుచ్చినట్లు చెప్పిరి.
ద్విజః పాశాద్వినిర్ముక్తో గతభీ ప్రకృతిం గతః ।
వవందే శిరసా విష్ణోః కింకరాన్ దర్శనోత్సవః ॥
మృత్యుపాశమునుండి విముక్తుడైన అజామిలునకు విష్ణువు యొక్క అనుచరులను చూచుటచే ఆనందము కలిగెను. భయము తొలగి ఆతనికి స్వస్థత చిక్కెను. అపుడాతడు వారికి తల వంచి నమస్కరించెను.
తం వివక్షుభిప్రేత్య మహాపురుషకింకరాః ।
సహసా పశ్యతస్తస్య తత్రాంతర్దధిరేనఘ ॥
పుణ్యాత్ముడవగు ఓ మహారాజా! ఆ అజామిలుడు ఏదో చెప్పబో తున్నాడని గమనించిన పురుషోత్తముని అనుచరులు వెంటనే, ఆతడు చూచుచుండగనే అచట అంతర్ధానమైరి.
అజామీలోప్యథాకర్ణ్య దూతానాం యమకృష్ణయోః ।
ధర్మం భాగవతం శుద్ధం త్రైవిద్యం చ గుణాశ్రయమ్ ॥
భక్తిమాన్ భగవత్యాశు మాహాత్మ్యశ్రవణాద్ధరేః ।
అనుతాపో మహానాసీత్స్మరత్వోశుభమాత్మనః ॥
వేదోక్తమైనది, సత్త్వరజస్తమోగుణాత్మకమగు సంసారమే ఆశ్రయ ముగా గలది అగు ప్రవృత్తిధర్మమును యమదూతలు చెప్పిరి. విశుద్ధమగు భాగవత ధర్మమును విష్ణుదూతలు చెప్పిరి. ఈ రెండింటినీ అజామీలుడు వినెను. శ్రీహరియొక్క మహిమను గురించి వినుటచే ఆతనికి అపుడు వెంటనే భగవద్భక్తి ఉదయించెను. ఆతడు తన పాపములను గుర్తుకు తెచ్చుకొని, అధికమగు పశ్చాత్తాపమును పొందెను.
అహో మే పరమం కష్టమభూదవిజితాత్మనః ।
యేన విప్లావితం బ్రహ్మ వృషల్యాం జాయతాత్మనా ॥
అయ్యో! మనోజయము నెరుంగని నాకు పెద్ద ఆపద కలిగినది. నేను దాసియందు పుత్రుని రూపములో జన్మించి (పుత్రుని కని), వేదధర్మ మును నాశము జేసితిని.
ధీజాం విగర్హితం సద్భిర్దుష్కృతం కులకజ్జలమ్ ।
హిత్వా బాలాం సతీం యోహం సురాపామసతీమగామ్ ॥
పాపినియగు నేను సత్పురుషులచే నిందించబడితిని. వంశము నకు కలంకమగు నాకు ధిక్కారమగుగాక! అమాయకురాలు, పతివ్రత అగు భార్యను విడిచి, నేను మద్యమును త్రాగే దుష్టురాలిని పొందితిని.
వృద్దావనాథౌ పితరౌ నాన్యబంధూ తపస్వినౌ ।
అహో మయావధునా త్యక్తావకృతజ్ఞేన నీచవత్ ॥
అయ్యో! మరో రక్షకుడు గాని, ఇంకో బంధువులు గాని లేనివారై పరితపిస్తూ ఉండే నా తల్లిదండ్రులను కృతఘ్నుడనగు నేను ఆ కాలములో ఆమెను కలిసిన వెంటనే విడిచి పెట్టితిని. నేను నీచుడను.
సోऽహం వ్యక్తం పతిష్యామి నరకే భృశదారుణే ।
ధర్మఘ్నాః కామినో యత్ర విందంతి యమయాతనాః ॥
అట్టి నేను ఖచ్చితముగా మిక్కిలి దారుణమగు నరకములో పడెద ను. అచట ధర్మమును చెడగొట్టే కాముకులు యమయాతనల ననుభవించెదరు.
కిమిదం స్వప్న ఆహోస్విత్ సాక్షాదృష్టమహాద్భుతమ్ ।
క్వ యాతా అద్య తే యే మాం వ్యకర్షన్ పాశపాణయః ॥
నేను చూసిన ఈ అద్భుతము స్వప్నమా యేమి? లేక, నేను ఇక్కడ ప్రత్యక్షముగనే చూచితినా? చేతులలోని పాశములతో నన్ను లాగి వేసిన ఆ కింకరులు ఎక్కడకు వెళ్లినారు?
అథ తే క్వ గతాస్సిద్ధాశ్చత్వారశ్చారుదర్శనాః ।
వ్యమోచయన్నీయమానం బద్ధ్వా పాశైరధో భువః ॥
మరియు ఆ నల్గురు సుందరాకారులను సిద్ధపురుషులు ఎచటకు వెళ్లినారు? త్రాళ్లతో కట్టి పాతాళమునకు కొనిపోబడుచున్న నన్ను వారు విడిపించిరి.
అథాపి మే దుర్చగస్య విబుధోత్తమదర్శనే ।
భవితవ్యం మంగలేన యేనాత్మా మే ప్రసీదతి ॥
అయిననూ, దురదృష్టవంతుడనగు నాకు దేవతోత్తముల దర్శ నము కలిగినది. అట్టివారిని దర్శించుటచే మనస్సు ప్రసన్నమగును. నాలో ఏదో ఒక పూర్వపుణ్యము ఉండి యుండవలెను.
అన్యథా ప్రియమాణస్య నాశుచేర్వృషలీపతేః ।
వైకుంఠనామగ్రహణం జిహ్వా వక్తుమహార్హతి ॥
దాసీభర్తనగు నాయందు శౌచము లేదు. పూర్వపుణ్యము లేనిచో, మరణించుచున్న నా నాలుక మనస్సును కట్టివేసే శ్రీహరినామమును పలికి యుండెడిది గాదు.
క్వ చాహం కితవః పాపో బ్రహ్మ ఘ్నో నిరపత్రపః ।
క్వ చ నారాయణేత్యేతద్భగవన్నామ మంగలమ్ ॥
మోసగాడను, పాపిని, సిగ్గు లేకుండా వేదధర్మమును చెడగొట్టిన వాడను అగు నేనెక్కడ? ఓ నారాయణా! అనే ఈ మంగళకరమగు భగవ న్నామమెక్కడ? (నా పూర్వపుణ్యము చేతనే నాకీ నామము దక్కినది).
సోహం తథా యతిష్యామి యతచిత్తేంద్రియానిలః ।
యథా న భూయ ఆత్మానమంధే తమసి మజ్జయే ॥
అట్టి నేను ఉచ్చ్వాసనిశ్శ్వాసలను (ప్రాణాయామము), ఇంద్రియ ములను (ప్రత్యాహారము), మనస్సును (ధారణ) నియంత్రించి సాధన చేసి, మరల మోహపూర్ణమగు నరకములో మునిగిపోకుండా నన్ను నేను కాపాడుకొనెదను.
విముచ్య తమిమం బంధమవిద్యాకామకర్మజమ్ ।
సర్వభూతసుహృచ్ఛాంతో మైత్రః కరుణ ఆత్మవాన్ ॥
మోచయే గ్రస్తమాత్మానం యోషిన్మయ్యాత్మమాయయా।
విక్రీడితో యయైవాహం క్రీడామృగ ఇవాధమః ॥
ఆత్మస్వరూపము తెలియకుండుట, దాని వలన కోరికలు, వాటి వలన కర్మలు, వాటి వలన బంధము కలుగును. అట్టి ఈ బంధమును విడి చిపెట్టి, నేను సకలప్రాణుల హితమును కోరుతూ, శాంతముగా స్నేహశీల ముతో దయాగుణముతో ఇంద్రియజయము కలిగి యుండెదను. స్త్రీరూప ములోనున్న శ్రీహరియొక్క మాయ అధముడనగు నన్ను పట్టుకొని, కోతిని చేసి యాడించినది. ఆ మాయనుండి నన్ను నేను విడిపించు కొనెదను.
మమాహమితి దేహాదౌ హిత్వా మిథ్యార్థధీర్మతిమ్ ।
ధాస్యే మనో భగవతి శుద్దం తత్కీర్తనాదిభిః ॥
భోగ్యములగు విషయములు అనిత్యములు. నా బుద్ది వాటి యందు తగుల్కొని యుండెను. నేను దేహమునందు, మనస్సునందు నేను మరియు నాది అనే ధారణను విడిచి పెట్టెదను. భగవానుని కీర్తించుట మొదలగు సాధనలచే అంతఃకరణమును విశుద్దమొనర్చుకొని, నేను నా మనస్సును భగవానునిపై నిలిపెదను.
శ్రీశుక ఉవాచ ।
ఇతి జాతసునిర్వేదః క్షణసంగేన సాధుషు ।
గంగాద్వారము పేయాయ ముక్తసర్వానుబంధనః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా కొద్ది సేపు సత్పురుషులతోడి సంగము వలన ఆతనికి చక్కని వైరాగ్యము కలిగెను. ఆతడు సంసారవిషయములన్నింటియందు ఆసక్తిని విడిచి పెట్టి, హరిద్వార మును చేరుకొనెను.
స తస్మిన్ దేవసదన ఆసీనో యోగమాశ్రితః ।
ప్రత్యాహృతేంద్రియగ్రామో యుయోజ మన ఆత్మని ॥
ఆతడు ఆ దేవస్థానమునందు కూర్చుండి యోగమార్గమును స్వీక రించెను. ఆతడు ఇంద్రియ సముదాయమును విషయములనుండి ఉపసం హరించి (ప్రత్యాహారము) మనస్సును ఆత్మయందు విలీనము చేసెను.
తతో గుణేభ్య ఆత్మానం వియుజ్యోత్మసమాధినా ।
యుయుజే భగవద్ధామ్ని బ్రహ్మణ్యనుభవాత్మని ॥
ఆతడు క్రమముగా మనస్సును గుణకార్యములగు దేహేంద్రియ మనోవృత్తులనుండి వివిక్తము చేసి ఆత్మనిష్ఠుడయ్యెను. భగవానుడు హృద యమునందు నిర్విశేష జ్ఞానరూపుడై యున్నాడు. అట్టి బ్రహ్మ-అభిన్న మగు ఆత్మయందు ఆతడు మనస్సును విలీనము చేసెను.
యర్హ్యుపారతదీస్తస్మిన్నద్రాక్షీత్పురుషాన్ పురః ।
ఉపలభోపలబ్ధాన్ ప్రాగ్ వవందే శిరసా ద్విజః ॥
అజామిలుడు భగవానునియందు మనస్సును లగ్నము చేసియుం డగా, ఆతనికి తన యెదుట. శ్రీహరి అనుచరులు కనబడిరి. వారు ఆతడు ఇదివరలో చూచినవారే. అపుడాతడు వారిని గుర్తు పట్టి, తల వంచి నమ స్కరించెను.
హిత్వా కలేవరం తీర్దే గంగాయాం దర్శనాదను ।
సద్యస్వరూపం జగృహే భగవత్పార్శ్వవర్తినామ్ ॥
వారి దర్శనము తరువాత ఆతడు హరిద్వారములోని గంగ ఒడ్డున దేహమును విడిచి పెట్టి, వెంటనే భగవంతుని అనుచరుల రూప మును స్వీకరించెను.
సాకం విహాయసా విప్రో మహాపురుషకింకరైః।
హైమం విమానమారుహ్య యయా యత్ర శ్రియః పతిః ॥
అజామిలుడు శ్రీహరి పారదులతో బాటుగా బంగరు విమానము నెక్కి ఆకాశమార్గములో లక్ష్మీపతి ఉన్న స్థానము (వైకుంఠము)నకు వెళ్లాను.
ఏవం స విప్లావితసర్వధర్మా
దాస్యాః పతిః పతితో గర్హ్యకర్మణా ।
నిపాత్యమానో నిరయే హతవ్రతః
సద్యో విముక్తో భగవన్నామ గృహ్ణాన్ ॥
ఈ విధముగా అజామిలుడు దాసీకి భర్త ధర్మములనన్నింటినీ నాశము చేసుకొని, నిందించదగిన కర్మలచే పతితుడై, చెడిన వ్రతములు గలవాడయ్యెను. ఆతనిని నరకములో పడద్రోయుటకు యమదూతలు సిద్ద మైరి. అట్టి స్థితిలో ఆతడు భగవానుని నామమునుచ్చరించి, వెంటనే మోక్ష మును పొందెను.
నాతః పరం కర్మనిబంధకృంతనం
ముముక్షతాం తీర్థపదానుకీర్తనాత్ ।
న యత్పునః కర్మసు సజ్ఞతే మనో
రజస్తమోభ్యాం కలిలం తత్యోన్యథా ॥
కావున, మోక్షమును కోరువారలకు కర్మబంధమును (కర్మలకు మూలమగు అజ్ఞానమును) తెగగొట్టుటకు పవిత్రమగు పాదములు గల శ్రీహరిని నిరంతరముగా కీర్తించుట కంటే గొప్ప ఉపాయము మరియొకటి లేదు. ఏలయనగా, దీని వలన మనస్సు మరల కర్మలయందు ఆసక్తి గలది. కాదు. దీనికి భిన్నమగు ఉపాయముల ననుష్ఠించినచో, మనస్సు రజస్తమో గుణములచే మలినమగుట తప్పదు.
య ఏవం పరమం గుహ్యమితిహాసమఘాపహమ్ ।
శృణుయాచ్ఛ్రద్ధయా యుక్తో యశ్చ భక్త్యానుకీర్తయేత్॥
న వై స నరకం యాతి నేక్షితో యమకింకరైః ।
యద్యప్యమంగలో మర్త్యో విష్ణులోకే మహీయతే ॥
పాపియే అయిననూ ఏ మానవుడైతే పాపములను పోగొట్టే ఈ గొప్ప రహస్యమగు ఇతిహాసమును శ్రద్ధతో వినునో, మరియు భక్తితో నిరం తరముగా భగవానుని కీర్తించునో, అట్టివాడు నరకమును పొందే ప్రసక్తియే లేదు. యమకింకరులు వానివైపు కన్నెత్తి చూడరు. అట్టివాడు విష్ణులోక ములో మహిమ గాంచును.
ప్రియమాణో హరేర్నామ గృణన్ పుత్రోపచారితమ్ ।
అజామిలో కప్యగాద్ధామ కిం పునశ్శ్రద్ధయా గృణన్ ॥
ఇతి శ్రీమద్భాగవతే షష్ఠస్కంధే అజామిలస్య
వైకుంఠప్రాప్తిర్నామ ద్వితీయోకధ్యాయః ॥
మహాపాపియగు అజామీలుడు కూడ తన కొడుకుకు పెట్టుకున్న శ్రీహరి పేరును మరణసమయములో ఉచ్చరించి వైకుంఠమును పొందెను. శ్రద్ధతో శ్రీహరి నామమునుచ్చరించువాడు మోక్షమును పొందునని వేరుగా చెప్పవలయునా?
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో అజామీలుడు వైకుంఠమును పొందుటను వర్ణించే రెండవ అధ్యాయము ముగిసినది (2).
Summary of chapter 2 of the Bhāgavata Mahā Purana is as follows:
The Vishṇudūtas deliver a decisive verdict to the Yamadūtas regarding the supreme, independent potency of the holy name of Bhagavān. They explain that chanting the holy name—even inadvertently, helplessly, or in reference to another person or object—completely eradicates the accumulated karmic reactions of millions of past lives, destroying sin at its root just as a potent medicine cures disease regardless of the patient's technical awareness. Overhearing this divine discourse, Ajāmila is granted a second lease on life, whereupon he renounces all worldly ties, travels to Haridvāra in deep repentance, and achieves complete spiritual liberation through exclusive devotional absorption upon Bhagavān Vāsudeva.