శ్రీ మద్భాగవతము - ద్వాదశ (12వ) స్కందము
8 - మార్కండేయ మహర్షియొక్క తపస్సు, స్తుతి
శౌనక మహర్షి ఇట్లు పలి కెను --- ఓ సూత మహర్షి! నీవు ప్రవక్తలలో శ్రేష్ఠుడవైన సత్పురుషుడవు. అంతము లేని - అజ్ఞానమనే చీకటిలో పరిభ్రమిస్తున్న మానవులకు ఆవలి తీరమును చూపే మహాత్ముడవు, మాకు ఒక విషయమును చెప్పుము.
జనులు మృకండుమహర్షియొక్క పుత్రుడగు మార్కండేయుడు చిరంజీవియని చెప్పెదరు. కల్పాంతము ఈ జగత్తును మ్రింగివేసినా, ఆ మహర్షి మిగిలియే యుండును.
భృగువంశీయులలో శ్రేష్ఠుడగు ఆ మార్కండేయుడైతే ఈ కల్పములో మా వంశములో పుట్టినవాడు. ఇప్పటికీ కూడా ప్రాణులయొక్క ప్రళయమేదీ -- నైమిత్తికము గాని, ప్రాకృతికము గాని -- కలుగటనే లేదు.
అంతా సముద్రమే అయి ఉన్న ప్రళయకాలజలములయందు తిరుగాడుతూ మార్కండేయుడు రావి ఆకు దొన్నెయందు పరుండిన పురుషాకారము గల ఒక అద్భుతబాలకుని చూచెనట.(అది యెట్లు?)
ఓ సూతమహర్షీ! నీవు గొప్ప యోగివి. మాకు తెలియాలనే ఉత్కంఠ గలదు. కావున, మా ఈ సంశయమును ఛేదించుము. నీవు పౌరాణికులలో, కూడ సమ్మానమునందినవాడవు.
సూత మహర్షి ఇట్లు పలికెను --- ఓ శౌనకమహర్షీ! నీవు వేసిన ఈ ప్రశ్న జనుల భ్రమలను పోగొట్టును. దీనియందు కలియొక్క దోషమును పోగొట్టే నారాయణుని గాథ గానము చేయబడినది.
మార్కండేయుడు తండ్రినుండి జాతకర్మ ఇత్యాది క్రమములో ఉపనయనసంస్కారమును పొందెను. అపుడాతడు ధర్మబద్దముగా వేదములనధ్యయనము చేసి, తపస్సునందు, స్వాధ్యాయమునందు నిష్ఠను కలిగియుండెను.
నైష్ఠికబ్రహ్మచర్యవ్రతమును దాల్చిన ఆ మార్కండేయుడు శాంతుడై జటలను ధరించెను. ఆతడు నారబట్టలను కట్టి కమండలము, దండము, ముంజగడ్డితో చేసిన మొలత్రాడు, యజ్ఞోపవీతములను దాల్చెను.
ఆతడు ధర్మవృద్ధి కొరకై కృష్ణ మృగచర్మమును, జపమాలను, దర్బలను ధరించి, రెండు సంధ్యలయందు అగ్ని, సూర్యుడు, గురువు, బ్రాహ్మణుడు, ఆత్మ (తన స్వరూపము) లయందు శ్రీహరిని పూజించెను.
ఆతడు మౌనమును పాటిస్తూ ఉదయము, సాయంకాలము భిక్షాన్నమును తెచ్చి గురువునకు నివేదించెడిపోడు. గురువు అనుమతితో ఒక్కసారి భుజించెడివాడు. అనుమతి లేనిచో ఉపవసించెడివాడు.
ఈ విధముగా ఆతడు తపస్సునందు, వేదాధ్యయనమునందు నిష్ఠ గలవాడై పది కోట్ల సంవత్సరములు నిరంతరముగా ఇంద్రియాంతర్యామియగు శ్రీహరిని ఆరాధించెను. సుతరాము జయించ శక్యము కాని మృత్యువునాతడు జయించేను.
మార్కండేయుని ఆ మృత్యుజయముచే బ్రహ్మదేవుడు, భృగువు, శివుడు, దక్షుడు మొదలైన బ్రహ్మదేవుని పుత్రులు, మానవులు, దేవతలు, పితృదేవతలు, ఇతరప్రాణులు కూడ అధికమగు విస్మయమును పొందిరి.
ఈ విధముగా మార్కండేయుడు తపస్సు, స్వాధ్యాయము, ఇంద్రియనిగ్రహములచే చిత్తములోని క్లేశములను (అవిద్య, అస్మిత మొదలైనవి) నశింపజేసెను. ఆయన ప్రత్యక్షాది . ప్రమాణములకు గోచరము కాని శ్రీహరిని ఏకాగ్రమగు చిత్తముతో ధ్యానించెను.
గొప్ప తపశ్శాలియగు ఆ మార్కండేయుడు ఈ విధముగా గొప్ప ఏకాగ్రతతో కూడిన చిత్తముతో శ్రీహరిని ధ్యానించుచుండగా, అరు మన్వంతరముల పరిమాణము గల పెద్ద కాలము గడిచిపోయెను.
ఓ శౌనక మహర్షీ! ఈ విషయము శత్రుపురములను నశింపజేసే ఇంద్రునకు ఈ ఏడవ వైవస్వతమన్వంతరములో తెలిసెనట. అప్పుడాతడు ఈ మార్కండేయుని తపస్సుచే తన పదవికి మూడు వాటిల్లునేమో ననే ఆశంకతో ఆయన తపస్సుకు విఘ్నమును కలిగించుటకుపక్రమించెను.
ఇంద్రుడు మార్కండేయమహర్షి తపస్సు చెడగొట్టుటకై గంధర్వులను, అప్సరసలను, మన్మథుని, వసంతుని, మలయమారుతమును, రజోగుణముయొక్క సంతానమైన లోభమును, గర్వమును పంపించెను.
ఓ మహర్షీ! వారైతే హిమవత్పర్వతమునకు ఉత్తరపార్శ్వమునందున్న ఆ మహర్షియొక్క ఆశ్రమమును గురించి వెళ్లిరి. అచట పుష్పభద్ర అనే నది, చిత్ర అనే శిల గలవు.
పవిత్రమైన ఆ మహర్షి యొక్క ఆశ్రమస్థానమును పవిత్రమైన (రావి ఇత్యాది) చెట్లు, తీగలు (విష్ణుక్రాంతము ఇత్యాది) పూజించుచుండెను. పవిత్రమైన (రామచిలుక మొదలైన) పక్షుల గుంపులతో ఎడము లేని ఆ ఆశ్రమమునందు పవిత్రమైన, స్వచ్ఛమైన నీరు గల చెరువు ఉండెను.
మత్తెక్కిన తుమ్మెదల సంగీతముతో, పొగరెక్కిన కోకిలల కుహూరావ ములతో, గర్వించిన నెమళ్ల నాట్యముతో ఆ ఆశ్రమము హడావుడిగా నుండెను. మదించిన పక్షుల గుంపులు అంతటా నిండియుండెను.
చల్లని కొండకాలువల నీటి తుంపరలను మోసుకొని వచ్చుచున్న గాలి ఆ ఆశ్రమములో ప్రవేశించి పువ్వులను కౌగిలించి, కామవికారమును ఉద్దీపింపజేస్తూ వీవజొచ్చెను.
ఆ ఆశ్రమమునందు సాయంసంధ్యలో చంద్రుడు ఉదయిస్తూంటే పుష్పములకు నెలవగు వసంతుడు ప్రకటమయ్యెను. చిగుళ్ల గుత్తుల వరు సలు గల లతల గుంపులు, చెట్ల కొమ్మలు వంగి నేలను తాకుచుండెను.
అప్సరసల గణమునకు నాయకుడైన మన్మథుడు ధనుస్సు పై బాణము నెక్కు పెట్టి ఆ ఆశ్రమమునందు దర్శనమిచ్చెను. ఆతనిని గాయకులు మరియు వాద్యగాండ్రగు గంధర్వులు గుంపులుగా అనుసరించిరి. .
ఇంద్రుని సేవకులైన మన్మథుడు మొదలగువారికి ఆ మహర్షి కనబడెను. ఆయన హోమమును చేసి చక్కగా కన్నులను మూసుకొని కూర్చుండెను. ఆయన రూపు దాల్చిన అగ్ని వలె తిరస్కరించ శక్యము కానివాడై ఉండెను.
ఆ మహర్షి యెదుట అప్సరసలు నాట్యమాడగా గంధర్వులు గానము చేసిరి. మద్దెళ్లు, వీణలు, తప్పెటలతో వారు మనస్సునకు ఉల్లాసమునిచ్చే సంగీతధ్వనిని చేసిరి.
అప్పుడు మన్మథుడు శోషణము (ఎండ గొట్టునది), మోహనము (మోహ పెట్టునది), సందీపనము (కామనను ఉద్దీపింపజేయునది), అపనము (తపింపజేయునది), ఉన్మాదనము (పిచ్చేక్కించునది) అనే అయిదు ముఖములు గల అస్త్రమును ధనుస్సునందు ఎక్కు పెట్టెను. ఇంద్రుని సేవకులగు వసంతుడు, రజోగుణముయొక్క సంతానమైన లోభము మొదలగువారు ఆ మహర్షి మనస్సును విచలితము చేసిరి.
పుంజికస్థలి అనే అప్సరస బంతులతో ఆడుచుండెను. స్తనముల భారముచే ఆమె నడుము మిక్కిలి వెరపు జెందినట్లుండెను. ఆమె జుట్లునుండి పూల మాల జారిపడెను. ఆమె బంతిని అనుసరించి ఇటునటు చూస్తు గెంతుచుండగా మొలనూలు తెగిపోయెను. వాయువు ఆమె నాజూకైన వస్త్రమును తీసుకొని పోయెను.
మన్మథుడు అదే సమయములో బాణమును విడిచి, తాను ఆ మహర్షిని జయించితినని తలపోసెను. కాని, ఆయన విషయములో ఆ సర్వము -- భాగ్యహీనుడైన అసమర్థుని ఉద్యమము వలె -- వ్యర్థమాయెను.
ఓ శౌనక మహర్షీ! ఈ విధముగా వారు మార్కండేయ మహర్షికి ప్రతికూలమునాచరించబోగా, ఆయన తేజస్సుచే వారు తాపమునకు గురి చేయబడిరి. త్రాడు అనుకొని ఆడబోయి పామును గుర్తించిన పిల్లలు వలె, వారు వెంటనే వెనుదిరిగి వెళ్లిపోయిరి.
ఓ మహర్షీ! ఈ విధముగా ఇంద్రుని అనుచరులు ఆ మహర్షికి అపకార మునే చేసిరి. కాని, ఆయనలో అహంకారముయొక్క వికారమైన కోపము కలుగలేదు. మహాత్ముల విషయములో ఇట్టి చరితము చిత్రము కానే కాదు.
సైన్యముతో సహా తిరిగి వచ్చిన మన్మథుని ముఖములో తేజస్సు లేదు. ఆతనిని చూచి, పూజనీయుడగు ఇంద్రుడు మార్కండేయ మహర్షియొక్క మహిమను గురించి వినెను. స్వర్గాధిపతియగు ఇంద్రుడు చాల ఆశ్చర్యమును పొందెను.
ఈ విధముగా ఆ మహర్షి తపస్సు, స్వాధ్యాయము, ఇంద్రియ సంయమములచే చిత్తమును ఈశ్వరునిపై ఏకాగ్రము చేయుచుండగా, నరనారాయణరూపుడగు శ్రీహరి అనుగ్రహించుటకై ఆవిర్భవించెను.
వారిలో నరుడు తెల్లనివాడు, నారాయణుడు నల్లనివాడు. నాలుగు చేతులు గల వారిద్దరి కన్నులు అప్పుడే వికసించిన పద్మములను పోలి యుండెను. వారు కృష్ణమృగచర్మమును, సౌర వస్త్రములను ధరించిరి. వారు చేతులయందు దర్భముడులను, కమండలమును, తిన్న నైన వెదురు దండమును ధరించి, మూడు పేటల యజ్ఞోపవీతమును దాల్చిరి.
పొడవాటి వారిద్దరు పద్మపు గింజల జపమాలను, చీమలు మొదలగు వాటిని తొలగించే చేతి రుమాలును, వేదమును కూడ ధరించిరి. సాక్షాత్తు రూపు దాల్చిన తపస్సువలెనున్న వారిద్దరు ప్రకాశించే మెరుపును పోలిన పచ్చని రంగు గలవారు. వారిని దేవనాయకులు పూజించుచుండిరి.
సాక్షాత్తు శ్రీహరి భగవానుని అవతారములైన ఆ నరనారాయణమహర్షులను చూచి మార్కండేయ మహర్షి పెద్ద ఆదరముతో లేచి నిలబడి సాష్టాంగనమస్కారమును చేసెను.
వారిద్దరి చక్కని దర్శనము వలన ఆ మార్కండేయ మహర్షికి ఆనందము కలిగి దేహము, ఇంద్రియములు, మనస్సు శాంతములాయెను. ఆయన దేహము పులకించి, కన్నులు నీటితో నిండెను. ఆయన కన్నులను పైకెత్తి వారిని చూడ లేకపోయెను.
మార్కండేయ మహర్షి పైకి లేచి దోసిలి యొగ్గి నిలబడి వినయముతో వంగి, ఉత్కంఠతో కౌగిలించగోరుచున్నాడా యన్నట్లుండెను. ఆయన బొంగురు వోయిన కంఠముతో నరనారాయణదేవులనుద్దేశించి, నమస్కారము, నమస్కారము అని పలికెను.
ఆయన వారిద్దరికి ఆసనమునిచ్చి పాదములను నీటితో కడిగి, అర్ఘ్యము, చందనలేపము, ధూపము, పుష్పమాలలనిచ్చి పూజించెను.
మిక్కిలి పూజనీయులైన నరనారాయణ మహర్షులు సుఖమగు ఆసనముల పై కూర్చుండి ఆ మార్కండేయ మహర్షిని అనుగ్రహించుటకు సిద్దముగా నుండిరి. ఆయన వారిద్దరి పాదములకు మరల నమస్కరించి ఇట్లు పలికెను.
మార్కండేయుడు పలికెను - ప్రభూ! స్వయంభువుడగు బ్రహ్మదేవున కు, ప్రళయకారకుడగు రుద్రునకు, సకలప్రాణులకు, నాకు కూడ ప్రాణము నీచే ప్రేరితమై ప్రవర్తిల్లుచున్నది. దానిననుసరించి వాక్కు, మనస్సు, ఇంద్రియములు ప్రవర్తిల్లుచున్నవి. అట్టి నిన్ను నేను ఏమని వర్ణించవలెను? అయినప్పటికీ, నీవు భక్తులకు భక్తిభావముచే వశమయ్యే ఆత్మబంధుడవు.
భగవానుడా! పూజ్యుడవగు నీ ఈ మూర్తులు రెండు ముల్లోకములకు అధ్యాత్మ-అధిభూత-అధిదైవ - తాపములను పోగొట్టి, క్షేమమునిచ్చి, మృత్యుజయము (మోక్షము) ను కూడ కలిగించును. ఇదే విధముగా, నీవు అనేకములగు ఇతరరూపములను దాల్చి ఈ జగత్తును రక్షించెదవు. నీవు సాలె పురుగు వలె సర్వమును నీనుండి సృష్టించి నీలో లీనము చేసెదవు.
శ్రీహరి చరాచరజగత్తును అంతర్యామియై రక్షించుచున్నాడు. ఆయన పాదముల మూలమును ఉపాసించువానిని కర్మలు, గుణములు, కాలములయొక్క క్లేశములు స్పృశించవు. వేదతాత్పర్యమునెరింగిన మహర్షులు ఆ పాదముల మూలమును పొందుటకై దానినే స్తుతించి, నిష్ఠతో నమస్కరించి, మరల మరల ఆరాధించి, ధ్యానించుచున్నారు. నేను అట్టి పాదముల మూలమును సేవించుచున్నాను.
ఓ ఈశ్వరా! అంతటా భయము గల మానవునకు నీ పాదములను శరణు వేడుట కంటే మరియొక క్షేమము కనబడదు, రెండు పరార్ధముల కాలము పదవిలో ఉండే బ్రహ్మదేవుడు కూడ నీ రూపమైన కాలము వలన మిక్కిలి భయపడుచుండును. కాబట్టి, ఆయన సృష్టించిన ప్రాణులు భయపడెదరని వేరుగా చెప్పవలయునా?
దేహేంద్రియాదులు మిథ్య, నశించేవి, కేవలము ప్రతీతి మాత్రము. వాటియందలి ఆసక్తి వలన ఆత్మస్వరూపము కప్పివేయబడును. కావున, నేనీ దేహేంద్రియాదులయందలి అభిమానమును విడిచి పెట్టుచున్నాను. నీవు సత్యసంకల్పుడవు, . జీవునకు అంతర్యామివగు ఈశ్వరుడవు. అందువలన, నేను నీ పాదముల మూలమును నిశ్చయముగా సేవించుచున్నాను. అట్లు చేసినప్పుడు మాత్రమే మానవుడు సకలములైన అభీష్టపదార్థములను పొందును.
ఆత్మబంధుడవగు ఓ ఈశ్వరా! మాయాశక్తి యొక్క సత్త్వరజస్తమో గుణములు .. క్రమముగా ఈ జగత్తు యొక్క స్థితిసృష్టిలయములకు కారణములు. నీవు వాటిని లీల కొరకై అవలీలగా , స్వీకరించితివి. అయినప్పటికీ, నీ సత్త్వప్రధానమగు మూర్తియే మానవులకు ప్రకృష్టమైన శాంతిని ఇచ్చుచున్నది. ఇతరగుణముల వలన మానవులకు లభించేవి దుఃఖము, మోహము, భయములే గాని శాంతి కాదు.
ఓ భగవానుడా! సత్త్వగుణము శాంతిదాయకమగుట వలన, ఈ వివేకమును చేసిన తరువాత, ఈ లోకములో వివేకులు నీ సత్త్వప్రధానమగు రూపమును సేవించుచున్నారు. ఈ రూపము నీ భక్తుల మనస్సు నకు ప్రియమైనది. సాత్త్వికరూపమే భగవానుని వాస్తవరూపమని భక్తులు భావించెదరు. దాని వలననే సాధకులకు వైకుంఠ (ఆత్మ) లోకము, అభయ ము, ఆత్మానందము కూడ లభించును. రజస్తమోగుణముల వలన కాదు.
నారాయణ మహర్షి పూజనీయుడు, పూర్ణుడు, వ్యాపకుడు, జగద్రూపుడు, జగద్గురువు, దేవదేవుడు, శుద్దుడు. వాగింద్రియమును నియంత్రించిన ఆయన వేదమార్గమును ప్రవర్తిల్ల జేసెను. ఆయనకు, మానవోత్తముడైన నరమహర్షికి నమస్కారము.
ఇంద్రియగోచరములయ్యే విషయములు అసత్యములు. వాటిచే అజ్ఞానియొక్క బుద్ది విక్షిప్తమగును. ఆ నీ మాయ మానవుని బుద్ధిని కప్పివేయును. కావుననే, తన ఇంద్రియములయందు, ప్రాణములయందు, హృదయమునందు, ఇంద్రియగోచరములగు విషయములయందు కూడ ఉన్న నిన్ను మానవుడు తెలియకున్నాడు. అదే మానవుడు ముందు అజ్ఞానియే అయినా, జగద్గురుడవగు నీచే ప్రవర్తిల్లే జేయబడిన వేదమనే జ్ఞానరాశిని పొంది నిన్ను సాక్షాత్కరించుకొనును. ఆ వేదమును సృష్టిలో మొట్టమొదటివాడగు బ్రహ్మదేవుడు నీనుండి పొందినాడు.
నిన్ను సాక్షాత్కరించి నీ స్వరూపరహస్యమును ప్రకటించే జ్ఞానము వేదమునందు గలదు. నీ స్వరూపము విషయములో బ్రహ్మదేవుడు మొదలగు పండితులు కూడా ప్రయత్నించి కూడ మోహమును పొందుచున్నారు. నీ స్వభావము (మాయ) సాంఖ్యాది సకలమతములకు విషయమైన భేదాదులకు అనురూపముగా నుండును. జ్ఞానస్వరూపుడవగు నీవు దేహాదులచే కప్పివేయబడుచున్నావు. పురుషోత్తముడవగు నిన్ను నేను నమస్కరించుచున్నాను.
శ్రీమద్బాగవత మహాపురాణము పన్నెండవ స్కంధములో మార్కండేయ మహర్షి యొక్క తపస్సును, స్తుతిని వర్ణించే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).
