శ్రీ మద్భాగవతము - ద్వాదశ (12వ) స్కందము

2 - కలి యుగ ధర్మములు

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! కాలము బలీయమైనది. కలియుగము నడిచే కొలదీ ధర్మము, సత్యము, దేహ-అంతఃకరణముల పవిత్రత, సహనము, దయ, ఆయుర్దాయము, శరీరబలము, స్మరణశక్తి నశించును.

కలియుగములో మానవులకు ఉత్కర్ష ధనమును బట్టియే గాని వంశము, శీలములను బట్టి కాదు. పైగా, ధర్మన్యాయముల వ్యవస్థయందు బలమైన కారణము ధనమే యగును. ఇది నిశ్చయము.(ధనవంతుడు చేసినదే ధర్మము, చెప్పినదే న్యాయము).

దాంపత్యమునకు హేతువు స్త్రీపురుషుల మధ్య పరస్పరము నచ్చుబాటే (ధర్మవృద్ది కాదు). ఇచ్చి పుచ్చుకునే లోకవ్యవహారమునందు మోసమే హేతువు (నిష్కపటత్వము కాదు). ఆడదాని అందమునకు, మగ వాని మగదనమునకు సంభోగమే కొలబద్ద (శీలము కాదు). జందెము గల వాడే బ్రాహ్మణుడు (శౌచసంతోషములను బట్టి కాదు). ఇది నిశ్చయము.

బ్రహ్మచారి-సన్న్యాసి మొదలగు ఆశ్రమములకు హేతువు దండము మొదలైన బాహ్యచిహ్నములే గాని శీలము గాదు. ఒక ఆశ్రమమునుండి పై ఆశ్రమమును ప్రవేశించుట కేవలము బాహ్యచిహ్నములను బట్టియే గాని గుణసంపదను బట్టి కాదు. పరస్పరము నమస్కారాదులు వేషమును బట్టియే (శీలమును బట్టి కాదు). ధనమును ఖర్చు చేయకుంటే న్యాయము లభించదు. అధికముగా వాగువాడే పండితుడుగా చెలామణీ యగును.

డబ్బు లేనివాడే నేరగాడు. డాంబీకము చేయువాడే సత్పురుషుడు. స్త్రీపురుషులు పరస్పరము అంగీకరించుటయే వివాహము (వైదికవిధి కాదు). స్నానము దేహముయొక్క మురికిని తొలగించుటకే గాని జపతపాదుల కొరకు, అంతఃకరణశుద్ధి కొరకు కాదు.

దూరమునందలి జలాశయమే తీర్థము (తల్లిదండ్రులు, గురువు కాదు). కేశాలంకారమే సౌందర్యము (అంతస్సౌందర్యముతో పని లేదు). పురుషార్థము పొట్ట పోసుకొనుటయే (ధర్మాదులు కావు). వ్యర్థమగు హఠము చేయువాడు చెప్పేదే సత్యము (సౌమ్యముగా చెప్తే అది సత్యము కాదు). ఇది నిశ్చయము.

కుటుంబపోషణమే నైపుణ్యము (ధర్మసంపాదనము కాదు). జనులు కీర్తి కొరకు ధర్మకార్యములను చేయుదురు (చిత్తశుద్ధి కొరకు కాదు). బ్రాహ్మణ క్షత్రియవైశ్యశూద్రులలో ఎవడు బలవంతుడో వాడే రాజు అగును.

లోభులైన పాలకులు దయ లేకుండా బందిపోట్ల ప్రవృత్తిని కలిగియుందురు. పొరు ప్రజల భార్యలను, ధనమును లాగుకొనెదరు. ప్రజలు కొండకోనల పాలై కాయలు, వేళ్లు, మాంసము, తేనె, పళ్లు, పుష్పములు, గింజలు అనువాటిని తింటూ బ్రదికెదరు.

ప్రజలను కరువు, పన్నులు పీడించును. అనావృష్ఠి, చలి, గాలి, ఎండ, వరదలు, మంచు అనువాటిచే ప్రజలు నశించేదరు. వారిలో వారికి ఘర్షణలచే కూడ ప్రజలు నశించేదరు.

జనులు ఆకలి, దప్పిక, వ్యాధులు, మనోవేదనలచే సంతాపమును పొందెదరు. కలియుగములో మానవుల ఆయుష్షు ఏభై యేళ్లు మాత్రమే.

అసత్యము మొదలైన కలిదోషముల వలన ప్రాణుల దేహములు క్షీణించును. వర్ణాశ్రమములకు చెందిన మానవుల ధర్మము -- వేదములచే బోధించబడినది -- లుప్తమగును.

వేదవిరుద్ధమైన ధర్మము ప్రచారములోనికి వచ్చును. పాలకులు బంది పోట్లవంటివారు అగుదురు. జనులలో చౌర్యము, అసత్యము, నిరపరా ధులను హింసించుట, అనేకములైన తప్పుడు పనులు పెచ్చు పెరుగును.

సకలవర్ణముల జనులు ఇంచుమించు శూద్రులవలె (విహితకర్మహీనులు) అగుదురు. పాలిచ్చే ఆవులు మేకలవలెనుండి తక్కువ పాలను యిచ్చును. వానప్రస్థులు, సన్న్యాసులు ఇంచుమించు గృహస్థులవలెనే (భోగప్రధానులై) ఉండెదరు. భార్య, పిల్లలు తప్ప మిగిలినవారు బంధువులే కాదా యన్నట్లు అగును.

పంట మొక్కలు చాల చిన్నవి (నేలంటు) అగును, చెట్లు జమ్మి చెట్ల వలే చిన్నవియై ముళ్లతో నిండి ఉండును. మేఘములలో మెరుపుల హడావుడి యే గాని నీరు తక్కువ. అతిథి-అభ్యాగతులు, పిల్లపాపలు లేకుండుటచే గృహములు శూన్యములై ఉండును.

ఈ విధముగా కలియుగము ఇంచుమించు పూర్తియగుసరికి గాడిదల వంటి జనుల చేష్టలు సహించ శక్యము కాకుండనుండును. అప్పుడు శ్రీహరి భగవానుడు సత్త్వగుణప్రధానమైన రూపముతో అవతరించును.

సర్వవ్యాపకుడు, సకలప్రాణులలో ఆత్మరూపుడు అగు పరమేశ్వరుడు స్థావరజంగమాత్మకమగు జగత్తునకు తండ్రి. ఆయన ధర్మమును రక్షించి, సత్పురుషుల కర్మబంధనివృత్తి (మోక్షము) కొరకు అవతరించును.

సంభలగ్రామములో శ్రేష్ఠుడైన విష్ణుయశసుడనే బ్రాహ్మణుడు ఉండును. ఆ మహాత్ముని భవనములో కల్కి అవతరించగలడు.

కల్కి ఎనిమిది సిద్దులు, సకలసద్గుణములతో కూడిన జగన్నాథుడు. వేగముగా పరుగెత్తే గుర్రమును దేవతలు ఆయనకు ఇచ్చెదరు. సాటి లేని కాంతి గల ఆయన వేగవంతమగు ఆ గుర్రమునెక్కి దుష్టులను మర్దిస్తూ భూమిపై సంచరించును. అధికారముతో ప్రజలను దోచుకుంటూ రాజ చిహ్నములను ధరించిన చోరులనాయన కోట్లాదిగా కత్తితో దునుమాడును.

రాజుల రూపములోనున్న ఆ చోరులందరు నిశ్చయముగా సంహరించబడెదరు. అప్పుడు వాసుదేవుని శరీరమునకు అలదిన పరమపవిత్రమైన చందనముయొక్క పరిమళము గల వాయువుయొక్క స్పర్శచే ఆ జనుల మనస్సులు నిశ్చయముగా నిర్మలములగును.

సత్త్వగుణమూర్తియగు వాసుదేవభగవానుడు హృదయములో నిలిచి యున్న కారణముగా, ఆ ప్రజలకు విస్తృతమైన సంతానము కలుగును.

ఎప్పుడైతే ధర్మమును పాలించే శ్రీహరి భగవానుడు కలి యై అవతరించునో, అప్పుడు కృతయుగము ఆరంభమై, జనులకు సత్త్వగుణప్రధానమైన సంతానము కూడ కలుగును.

ఎప్పుడైతే చంద్రుడు, సూర్యుడు, గురువు పుష్యనక్షత్రములో ప్రవేశించి ఒకే రాశిని పొందునో, అది కృతయుగముయొక్క ఆరంభము.

భూతవర్తమానభవిష్యత్కాలములకు చెందిన సూర్యచంద్రవంశములకు చెందిన రాజులను గురించి నేను నీకు సంక్షేపముగా చెప్పితిని.

నీ (పరీక్షిత్తుయొక్క) పుట్టుక మొదలుకొని నందుని పట్టాభి షేకము వరకు ఇది వేయి నూట పది హేను సంవత్సరముల కాలము గడుచును.

రాత్రి నక్షత్రమండలములో సప్తర్షిమండలమునకు చెందిన ఏడు నక్షత్రములలో రెండు మున్ముందుగా ఉదయించును. వాటి మధ్యలో రెండింటికీ సమానదూరములో ఒక నక్షత్రము కానవచ్చును.

సప్తర్షి నక్షత్రములు మానవుల గణనలో వంద సంవత్సరములు ఆ (మధ్య) నక్షత్రముతో కూడియే యుండును. నీవు పుట్టినప్పుడు, ఇప్పుడు కూడ సప్తర్షి నక్షత్రములు మఘానక్షత్రమును ఆశ్రయించి ఉన్నవి.

శ్రీహరి భగవానునియొక్క ఈ శ్రీకృష్ణుడనే పేరు గల అవతారము వైకుంఠమునకు వెళ్లినది. అప్పుడు కలి మానవలోకములో ప్రవేశించెను. కావుననే, మానవులు పాపము చేయుటయందు ప్రీతిని కలిగియున్నారు.

ఎంతవరకైతే లక్ష్మీపతియగు శ్రీకృష్ణుని పాదపద్మములు నేలపై నడచెనో, అంతవరకు కలికి భూలోకమును ఆక్రమించి తన వశము చేసుకునే శక్తి లేకుండెను.

ఎప్పుడైతే సప్తర్షి నక్షత్రములు మఘయందు సంచరించునో, అప్పుడు కలియుగము ప్రారంభమై పన్నెండు వందల సంవత్సరముల కాలము (దేవమానము?) నడచును.

ఎప్పుడైతే సప్తర్షులు మఘానక్షత్రమునుండి పూర్వాషాఢనక్షత్రము లోనికి ప్రవేశించునో, అది నందుని రాజ్యకాలము. అప్పటినుండి ఈ కలి బాగా పెరిగి పోవును.

ఏనాడైతే శ్రీకృష్ణుడు వైకుంఠమునకు వెళ్లినో, అదే రోజు అదే సమయ ములో కలియుగము ఆరంభమైనదని ఇతిహాసవేత్తలు చెప్పుచున్నారు.

వేయి దివ్యసంవత్సరముల తరువాత నాల్గవదియగు కలియుగము అంతమై కృతయుగము ఆరంభమగును. ఆ యుగములో మానవుల మనస్సులు శుద్ధములై ఆత్మతత్త్వమును ప్రకాశింపజేయును.

ఈ విధముగా భూలోకములో వైవస్వతమనువుయొక్క వంశమును నేను సంక్షేపముగా చెప్పితిని. ఇదే విధముగా, ప్రతి యుగమునందు బ్రాహ్మణవైశ్యశూద్రుల ఆయా వంశములను గురించి తెలియదగును.

మహాత్ములైన ఈ పురుషుల కీర్తి మాత్రమే ఇప్పుడు భూలోకములో మిగిలి ఉన్నది. మనకు వారు పేర్లను బట్టి మాత్రమే తెలియును. వారి గాథలు మాత్రమే మిగిలియున్నవి. (సర్వము వినాశి అని వైరాగ్యబోధ)

శంతనుని సోదరుడగు దేవాపీ, ఇక్ష్వాకువంశమునందు పుట్టిన మరువు అనే యిద్దరు కలాపగ్రామములోనున్నారు. వారికి గొప్ప యోగశక్తి గలదు.

వారిద్దరికి శ్రీకల్కి భగవానుడు ఉపదేశమును చేయును. వారు కలియు గాంతమునందు ఇచటకు (ఆర్యావర్తము) వచ్చి వర్ణాశ్రమములతో కూడిన ధర్మమును గడచిన కృతయుగములో వలెనే విస్తరింప జేయగలరు.

భూలోకములో ప్రాణులయందు కృతవ్రేతాద్వాపరకలులనే ఈ నాలుగు యుగముల సముదాయము (చతుర్యుగము) ఇదే వరుసలో ప్రవర్తిల్లును.

ఓ పరీక్షిన్మహారాజా! నేను వర్ణించిన ఈ మహారాజులు మరియు ఇతరరాజులు ఈ భూమీపై మమకారమును చేసిరి. వారు దేహాంతమునందీ భూమిని విడిచి పెట్టి మృత్యువు ఒడిలో చేరిపోయిరి.

రాజు అనే పేరు గల వ్యక్తి కూడా మరణించిన తరువాత దేహమును కప్పి పెట్టినచో క్రిమి అని, వదిలివేసినచో పక్షులకాహారమై వాటి రెట్ట అని, కాల్చినచో బూడిద అని పేరును పొందును. అట్టి దేహము కొరకై ప్రాణులకు ద్రోహమును చేయువాడు పురుషార్థము తెలిసినవాడేనా? కాదు. ప్రాణులకు ద్రోహమును చేయుట నరకమునకు దారి.

ఆ ఈ భూమిని నా పూర్వీకులైన రాజులు అఖండముగా పాలించిరి. ఇప్పుడు నేను కూడ పోరి సరసన చేరబోవుచున్నాను. కానీ, ఈ భూమి నా పుత్రునకు, మనుమనికి, లేదా నా వంశములో పుట్టినవానికి లభించవలేను. అది యెట్లో గదా?(అని మమకారమును చేయుదురు).

అవివేకులైన రాజులు అగ్ని-జలములు-పృథివి అనువాటిచే నిర్మితమైన ఈ దేహమునే తమ స్వరూపముగా (అహంకారము), ఈ భూమిని నాది అని (మమకారము) స్వీకరించిరి. వారు మరణసమయములో రెండింటినీ వీడిచి పెట్టి కానరాని లోకాలకు వెళ్లిపోయిరి.

ఓ పరీక్షిన్మహారాజా! ఏయే రాజులు భూమిని పౌరుషముతో పాలించుచున్నారో, వీరినందరినీ కూడ కాలము కేవలము కథాప్రవచనములయందలి గాథలుగా మార్చివేయును.

శ్రీమద్బాగవత మహాపురాణము పన్నెండవ స్కంధములో కలియుగ ధర్మములను వర్ణించే రెండవ అధ్యాయము ముగిసినది (2).