శ్రీ మద్భాగవతము - ద్వాదశ (12వ) స్కందము
6 - పరీక్షిత్తునకు ముక్తి, జనమేజయుని సర్పయాగము, వేదశాఖలు
సూత మహర్షి యిట్లు పలికెను --- శ్రీహరి అనుగ్రహముచే రక్షించబడి జన్మించిన ఆ పరీక్షిన్మహారాజు వ్యాసపుత్రుడైన శుకమహర్షి చేసిన ఉపదేశమును వినేను. సర్వమును ఆత్మరూపముగా దర్శినిచే సమదర్శనుడైన మహర్షి పాదముల వద్ద ఆయన తల వంచి నమస్కరించెను. రాజు దగ్గరకు వచ్చి దోసిలి యొగ్గి ఆ మహర్షితో నిట్లనెను.
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- దయామయులగు తమరు సాక్షాత్తు ఆద్యంతములు లేని శ్రీహరినీ గురించి నాకు వినిపించి, నన్ను కృతకృత్యుని చేసి అనుగ్రహించితిరి.
అజ్ఞానులగు ప్రాణులు సంసారతాపముచే పీడితులై యుందురు. అచ్యుతునియందు లగ్నమైన మనస్సు గల మహాత్ములు వారియందని అనుగ్రహమును చూపుట గొప్ప అద్భుతమని నేను భావించుట లేదు.
మేము తమరినుండి ఈ భాగవతపురాణమును వింటిమి. దీనియందు గొప్ప కీర్తిగల శ్రీహరి భగవానుడు నిరంతరముగా వర్ణించబడుచున్నాడు.
ఓ పూజనీయా! తక్షకుడు మొదలైన మరణ హేతువుల వలన నేను భయపడుట లేదు. ఎందుకంటే, నీచే చూపించబడిన పరబ్రహ్మయందు నేను ప్రవేశించినాను. ఆ పరబ్రహ్మయందు భయము, దుఃఖము లేవు.
ఓ మహర్షీ! నాకు అనుమతినిమ్ము. నేను వాక్కును విరమించి, కామవాసనలను విడిచి పెట్టిన.మనస్సును, ప్రత్యక్షాదిప్రమాణగోచరుడు కాని శ్రీహరియందు ప్రవేశ పెట్టి, ప్రాణములను విడిచి పెట్టుచున్నాను.
శాస్త్రార్ధపరిజ్ఞానము, ఆత్మానుభవములయందలి నిష్ఠచే నా అజ్ఞానము పరాస్తమైనది. తమరు నాకు అత్యంతికక్షేమమైన భగవత్స్వరూపమును చూపించినారు.
సూత మహర్షి యిట్లు పలికెను -- పరీక్షిన్మహారాజు ఇట్లు పలికి పూజనీయుడు, వ్యాసపుత్రుడు అగు శుకమహర్షిని పూజించెను. ఆ మహర్షి రాజు అనుమతి తీసుకొని, సన్న్యాసులతో గూడి వెళ్లాను.
పరీక్షిన్మహారాజు ఋషియే, ఆయన మనస్సును నిశ్చయబుద్ధితో తన స్వరూపమునందు విలీనము చేసి, చెట్టు వలే ప్రాణస్పందన లేనివాడై, పరమాత్మను ధ్యానించెను.
గొప్ప యోగియగు పరీక్షిత్తునకు సకలసంశయములు తొలగిపోయెను. ఆయన అసంగుడై గంగానదీతీరమునందు తూర్పు కొనలు గల దర్భల పై ఉత్తరముఖముగా కూర్చుని పరబ్రహ్మయందు విలీనమయ్యెను.
ఓ శౌనకాది మహరులారా! శృంగి మహర్షి పుత్రుడు కోపముతో యిచ్చిన శాపముచే ప్రేరితుడై తక్షకుడు పరీక్షిన్మహారాజును చంపుటకు వెళ్లుచుండెను. అతనికి దారిలో కశ్యపుడనే బ్రాహ్మణుడు కనబడెను.
ఆ కశ్యపుడు విషమునకు విరుగుడు చేయగలడు. తక్షకుడు ఆయనకు చాల ధనమునిచ్చి తృప్తి పరచి వెనుకకు మళ్లునట్లు చేసెను. తనకు నచ్చిన రూపమును దాల్చే తక్షకుడు ఎవ్వరూ గుర్తు పట్టలేని బ్రాహ్మణవేషములో వెళ్లి పరీక్షిన్మహారాజును కరిచెను.
ఋషియైన పరీక్షిన్మహారాజు బ్రహ్మలీనుడాయెను. ఆయన దేహమును పాముయొక్క విషముయొక్క అగ్ని వెంటనే, సకలప్రాణులు చూచుచుండగా, బూడిదగా చేసెను.
భూలోకము, ఆకాశము, దిక్కులు అంతటా పెద్ద హాహాకారము బయల్వెడలెను. దేవతలు, అసురులు, మానవులు, సిద్ధులు మొదలగువారు అందరూ ఆశ్చర్యచకితులైరి.
దేవదుందుభులు మ్రోగెను. గంధర్వులు, అప్సరసలు గానము చేసిరి. బాగు, బాగు అంటూ దేవతలు పూల వానలను కురిపించిరి.
తన తండ్రిని తక్షకుడు కరిచినాడని విని జనమేజయుడు చాల కోపించెను. ఆయన బ్రాహ్మణులతో గూడి సత్రయాగము చేసి, దానిలో నాగులను యథావిధిగా అగ్నిలో హోమము చేసెను.
సర్పసత్రయాగమునందు అగ్నిని బాగా ప్రజ్వరిల్ల జేసి, దానిలో పెద్ద సర్పములను కాల్చివేయుచుండుటను చూచి తక్షకుండు భయభీతుడాయెను. ఆతడు ఇంద్రుని శరణు జొచ్చెను.
పరీక్షిత్తు పుత్రుడగు జనమేజయునకు ఆ యజ్ఞాగ్నియందు తక్షకుడు కనబడలేదు. అపుడాయన బ్రాహ్మణులతో, సర్పములలో అధముడగు తక్షకుడు ఏల దహించబడుట లేదు? అని అడిగెను.
ఓ మహారాజా! ఇంద్రుడు శరణు జొచ్చిన తక్షక సర్పమును గట్టిగా పట్టుకుని రక్షిస్తున్నాడు. కావుననే, ఈతడు అగ్నియందు పడుట లేదు.
పరీక్షిత్తు యొక్క పుత్రుడగు జనమేజయుడు గంభీరమైన బుద్ది గలవాడు. వారు చెప్పిన మాటలు విని ఆయన ఋత్విక్కులతో నిట్లనెను -- ఇంద్రునితో సహా తక్షకుని అగ్నియందు మీరు ఏల పడ వేయుట లేదు ?
ఆ మాటను విని వేదవేత్తలు యజ్ఞములో ఇంద్రునితో సహా తక్షకుని ఆవాహనమును చేసిరి -- ఓ తక్షకా! మరుద్గణములతో గూడిన ఇంద్రునితో సహా వెంటనే ఈ అగ్నిగుండమునందు పడుము.
ఈ విధముగా బ్రాహ్మణులు ఆకర్షకమంత్రములనుచ్చరించగా విమానములోనున్న ఇంద్రుడు తక్షకునితో సహా తన స్థానమునుండి కదిల్చి వేయబడెను. అప్పుడాయన మనస్సులో చాల కంగారు పడెను.
అంగిరసుని పుత్రుడగు బృహస్పతి, విమానము మరియు తక్షకునితో సహా ఆకాశమునుండీ పడిపోవుచున్న ఆ ఇంద్రుని చూచెను. అపుడాయన ఆ జనమేజయ మహారాజుతోనిట్లనెను.
ఓ నరపతీ! ఈ సర్పరాజగు తక్షకుని వధించుట నీకు తగదు. ఈతడు - అమృతమును త్రాగెను. కావున, ఈతనికి వృద్ధాప్యము, మృత్యువు లేవు.
జీవునకు తన కర్మచేతనే జీవితము, మరణము, పరలోకము లభించును. ఒకనికి సుఖదుఃఖములనిచ్చువాడు మరియొకడు కాడు.
పాములు, చోరులు, అగ్ని, మెరుపులు, ఆకలి, దప్పిక, రోగము, ఇతరములైన ఉపద్రవములు మొదలగువాటి వలన ప్రాణులు ప్రాణములను కోల్పోవుచున్నవి. అందువలన, జీవుడు ప్రారబ్ధకర్మను మాత్రమే అనుభవించుచున్నాడు.
ఓ రాజా! జీవులు తమ తమ ప్రారబ్ధకర్మను అనుభవించును. కావున, దహించబడిన సర్పముల అపరాధము లేదు. కాబట్టి, ఈ శత్రుమారణరూపమగు సత్రయాగమును సమాప్తి చేయుము.
సూత మహర్షి ఇట్లు పలికెను --- బృహస్పతి మహర్షి ఇట్లు పలుకగా ఆ మాటను మన్నించి ఆ మహారాజు సర్పములను చంపే సత్రయాగమునాపివేసి, బృహస్పతిని పూజించెను.
ఆ ఈ శ్రీహరియొక్క మాయ ఊహకు అందదు. దీనిని తప్పించుకొన శక్యము కాదు. శ్రీహరియొక్క అంశలే అయిన జీవులు ఈ మాయ నిమిత్తముగా కామక్రోధాది గుణవృత్తులచే దేహాదులయందు ఆత్మభావము గలవారై మోహమును పొందుచున్నారు.
ఫలానా వ్యక్తి కపటము గలవాడు అనే బుద్దియందు పలుమార్లు అనుభవమునకు వచ్చే ఉన్న వ్యామోహమే మాయ. ఆత్మవిచారము చేయువారు ఆత్మవిచారము చేయునప్పుడు, మాయ ఆ శ్రీహరి స్వరూపమును నిర్భయముగా ఆశ్రయించి ప్రకాశించుచున్నదని నిరూపితము కాదు. మాయను ఆశ్రయించి ప్రవర్తి వివిధములైన వివాదములు శ్రీహరి స్వరూపములో లేవు. నిర్విశేష పరమాత్మయందు సంకల్పవికల్పాత్మకమైన మనస్సు కూడ ప్రవర్తిల్లదు.
చేయబడే కర్మ, కర్మసామగ్రియైన కారకములు, ఆ రెండింటిచే సంపాదించబడే కర్మఫలము, ఈ మూడింటితో (కర్మ-కారకములు-ఫలము, జాగ్రత్స్వప్నసుషుపులు, సత్త్వరజస్తమోగుణములు) కూడిన జీవోపాధియగు అహంకారము అనేవి పరమాత్మయందు లేవు. ఆ ఈ పరమాత్మ దేనిచేనైననూ (ద్వైతముచే) బాధించబడదు, తాను దేనికీ (ప్రతీతివిషయమగు ద్వైతమునకు) బాధకము (విరోధి) కాదు. మననశీలుడగు సాధకుడు సుఖదుఃఖములు, జరామరణములు, ఆకలిదప్పికలు అనే తరంగములను నిషేధించి, స్వయముగా ఆ ఆత్మస్వరూపమునందు విశేషముగా నిష్ఠను కలిగి రమించవలెను.
సాధకులు అనాత్మయందలి ఆసక్తిని విడిచి పెట్టి, నేతి నేతి అని అనాత్మను నిషేధించి ఆత్మస్వరూపమును సర్వాతిశాయియగు విష్ణు (సర్వవ్యాపకపరమేశ్వర) స్వరూపమునుగా వర్ణించుచున్నారు. సాధకులు ఏకాగ్రమగు చిత్తము గలవారై, అనాత్మలగు దేహాదులయందు ఆత్మభావమును విడిచి పెట్టి, ఆ ఆత్మతత్త్వమును ధ్యానమార్గములో హృదయముచే కౌగిలించి స్వరూపముగా స్వీకరించెదరు.
ఎవరికైతే దేహమునందు నేను అని, ఇంటియందు సోది అని దురభిమానము లేదో వారీ ఆత్మతత్త్వమును పొందుచున్నారు. సర్వవ్యాపకుడగు పరమేశ్వరుని సర్వాతిశాయి స్వరూపమదియే.
నిందావచనములను సహించవలెను. ఎవనినైననూ అవమానించరాదు. ఈ దేహమునందు అభిమానముతో ఎవనితోనైననూ వైరము చేయరాదు.
అనంతజ్ఞానసంపన్నుడగు ఆ శ్రీకృష్ణ (వ్యాస భగవానుని కొరకు నమస్కారము. నేను పద్మములవంటి ఆయన పాదములను ధ్యానించుట వలననే ఈ భాగవత పురాణమును అధ్యయనము చేయగల్గితిని.
శౌనకమహర్షి ఇట్లు పలి కెను --- ప్రియదర్శనుడవగు ఓ సూతమహర్షి! వ్యాసుని శిష్యులై వేదములకు ఆచార్యులైన పైలుడు, వైశంపాయనుడు మొదలగు మహాత్ములు వేదములను ఎన్ని విధములుగా విభజించిరి? మాకీ విషయమును చెప్పుము.
సూత మహర్షి యిట్లు పలికెను --- ఓ శౌనక మహర్షి! సకలజగదధీశుడగు బ్రహ్మదేవుడు ఏకాగ్రచిత్తుడై ఉండగా, ఆయన హృదయములోని చిదాకాశమునుండి నాదము పుట్టెను. చెవులను మూసుకోని మనస్సును ఆత్మ చైతన్యమునందు విలీనము చేసి) మనము కూడ ఆ (అనాహత) నాదమును అనుభవించవచ్చును.
ఓ మహర్షీ! అధ్యాత్మ (దేహేంద్రియాదులు)-అధిభూత (పంచభూత ములు)-అధిదైవ (దేవతలు) ములనే నానాత్వమే అంతఃకరణముయొక్క మాలిన్యము. యోగులా నాదమును ఉపాసించి దానిని కడిగివేసి, మరల పుట్టుక లేని మోక్షము (అద్వయ-ఆత్మజ్ఞానము) ను పొందుచున్నారు.
ఆ నాదమునుండి మూడు మాత్రల ఓంకారము ఆవిర్భవించెను. హృదయములో స్వయముగా ప్రకాశించే ఓంకారముయొక్క ఆవిర్భావము స్పష్టముగా తెలిసేది కాదు. వ్యక్తియొక్క అంతరతమమగు ఆత్మయై పూజనీయమైన పరబ్రహ్మకు ఆ ఓంకారము జ్ఞాపకము (చిహ్నము).
వినికిడి లుప్తమైనా ఆంతరమగు చైతన్యము అవ్య క్తనాదమును విను చునే యుండును. ఇంద్రియముల ప్రవృత్తి లేని సుషుప్తియందు దానికి సాక్షి యై నిలిచేది ఆత్మచైతన్యమే. ఆ ఆత్మ చైతన్యమునుండి హృదయా కాశములో అభివ్యక్తమైన ఓంకారముచే శబ్దప్రపంచమంతయు ప్రకటమగుచున్నది.
ఓంకారము తనకు ఆశ్రయమైన పరబ్రహ్మ-పరమాత్మకు సాక్షాత్తుగా అభిధానము. సకలమంత్రములకు, ఉపనిషత్తులకు, - వేదములకు మూలము సనాతనమైన ఓంకారమే.
భృగువంశశ్రేష్ఠుడవగు ఓ శౌనక మహర్షీ! ఆ ఓంకారమునకు అ, ఉ, మ అనే మూడు అక్షరములు గలవు, అవి సత్త్వరజస్తమోగుణములను, ఋగ్-యజుస్-సామలనే నామము (వేదము) లను, భూః-భువః-సువః అనే మూడు అర్థము (లోకము) లను, జాగ్రత్-స్వప్న-సుషుపులనే మూడు వృత్తుల (అవస్థల) ను నిలబెట్టుచున్నవి.
స్వయంభువుడగు బ్రహ్మదేవుడు ఆ ఓంకారమునుండియే అక్షరముల సముదాయము (మా హేశ్వరసూత్రముల) ను సృష్టించెను. అంతఃస్థలు (యరలవ), ఊష్మలు (శషసహ), అచ్చులు, వర్గాక్షరములు, హ్రస్వ ములు, దీర్ఘములు, అనుస్వార మొదలైనవి దాని స్వరూపమై యున్నవి.
సర్వసమర్థుడగు ఈ బ్రహ్మదేవుడు ఆ అక్షరసమామ్నాయమును ఆధారముగా చేసుకొని తన నాలుగు ముఖములనుండి ఓంకారముతో, భూః-భువః-సువః అనే వ్యాహృతులతో కూడిన నాలుగు వేదములను ప్రకటించెను. హోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ అనే నలుగురు ఋత్విక్కుల కర్మలను ఆ వేదములు బోధించుచున్నవి.
బ్రహ్మదేవుని పుత్రులైన మరీచి మొదలగువారు వేదోచ్చారణసమర్థులైన బ్రహ్మవేత్తలు. బ్రహ్మదేవుడు వారినే ఆ వేదములను అధ్యయనము చేయించెను. ధర్మమునుపదేశించే ఆ మహర్షులు తమ పుత్రులగు కశ్యపాదులకు ఆ వేదములనుపదేశించిరి.
తరువాత వారి వారి శిష్యులు ప్రతనియమములను పాటిస్తూ పరంపర గా నాలుగు యుగములయందు ఆ వేదములను ప్రవర్తిల్ల జేసిరి. ద్వాపర యుగముయొక్క ఆరంభములో వాటిని మహర్షులు విభాగము చేసిరి.
బ్రహ్మర్షులు కాలప్రభావము వలన ఆయుర్దాయము, బలము క్షీణించి జనులు మందమతులగుటను గాంచిరి. హృదయమునందుండే శ్రీహరి ప్రేరణచే వారు వేదములను విభాగము చేసిరి.
ఓ శౌనక మహర్షీ! ఈ వైవస్వత మన్వంతరములో కూడ లోకములకు అభ్యుదయమునిచ్చే శ్రీహరి " భగవానుని లోకములను పాలించే బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు మొదలగువారు ధర్మమును కాపాడుమని కోరిరి.
ఓ మహాత్మా! శౌనకా! సర్వసమర్థుడగు శ్రీహరి భగవానుడు పరాశర మహర్షి వలన సత్యవతియందు, మాయాశక్తియొక్క అంశయగు సత్త్వ గుణముయొక్క అంశచే అవతరించి, వేదమును నాలుగుగా విభజించెను.
ఆయన మంత్రముల రాశులను వర్గములుగా పైకి తీసి ఆ మంత్రములతో ఋగ్వేద-అథర్వవేద-యజుర్వేద-సామవేదముల సంహితలను నాలుగింటిని " చేసెను. అవి వేర్వేరు మణుల సముదాయములు వలె ఉన్నవి.
ఓ మహర్షీ! గొప్ప బుద్ధిశాలి, సర్వజ్ఞుడు అగు ఆ వ్యాసుడు నలుగురు శిష్యులను దగ్గరకు పిలిచి, ఆ సంహితలలో ఒక్కొక్కదానిని ఒక్కొక్కరికి ఉపదేశించెను.
అనేకములైన ఋక్ (ఛందోబద్ధ)-మంత్రముల సముదాయమైన ఋగ్వేదమునకే బహ్వృచమని పేరు. దానిని వ్యాసుడు పైలునకు ఉపదేశించెను. యజుర్ (గద్యరూపమైన మంత్రముల సముదాయము యజుర్వేదము. దానిని ఆయన వైశంపాయనుడనువానికి ఉపదేశించెను.
అదే విధముగా వ్యాసమహర్షి ఛందోగము (మంత్రము గానము చేయబడేది) అనే సామవేదసంహితను తన శిష్యుడగు జైమినికీ, అథర్వాంగిరసమని ప్రసిద్ధిచెందిన సంహితను సుమంతునికి చెప్పెను.
భృగువంశీయుడవగు శౌనక మహర్షీ! పైల మహర్షి తన శాఖకు చెందిన సంహితను రెండుగా విభజించి ఇంద్రప్రమితి, బాష్కలుడు అనే శిష్యులకు బోధించెను. ఆ బాష్కలుడు కూడ ఆ సంహితను నాలుగుగా విభాగము చేసి, తన శిష్యులైన బోధ్యుడు, యాజ్ఞవల్క్యుడు, పరాశరుడు, అగ్ని మిత్రులకు బోధించెను. స్థిరచిత్తు డైన ఇంద్రప్రమితి తన శాఖాసంహీతను ప్రతిభాశాలియగు మాండూకేయ మహర్షికి బోధించేను. ఆయన శిష్యుడు దేవమిత్రుడు. దేవమిత్రుడు సౌభరి మొదలగువారికి బోధించేను.
ఆ మాండూకేయ మహర్షి యొక్క పుత్రుడగు శాకల్యుడు తన సంహితను ఐదుగా విభాగము చేసి వాత్యుడు, ముద్గలుడు, శాలీయుడు, గోఖల్యుడు, శిశిరుడు అనువారికి బోధించెను.
శాకల్యుని మరియొక శిష్యుడైన జాతూకర్ణ్య మహర్షి కూడ తన సంహితాశాఖను మూడుగా విభజించెను. ఆయన వాటిని నిరుక్తము (పదములను నిర్వచించే వేదాంగము) తో సహా బలాకుడు, పైజుడు, వైతాలుడు, విరజుడు అనువారలకు బోధించెను.
బాష్కలుని పుత్రుడగు బాష్కలి అన్ని శాఖలనుండి వాలఖిల్యమనే ఒక శాఖను నిర్మించేను. దానిని బాలాయని, భజ్యుడు, కాసారుడు గ్రహించిరి.
ఇవి బహ్వృచములనే ఋగ్వేదశాఖలు. ఈ బ్రహ్మర్షులు వీటిని నిశ్చయముగా అధ్యయనము చేసిరి. ఈ వేదసంహితల విభాగమును గురించి విన్న మానవుని సకలపాపములు పూర్తిగా దూరమగును.
వైశంపాయనుని శిష్యులకు చరకాధ్వర్యులు (వ్రతమును చేసిన ఋత్విక్కులు) సార్థకనామము గలవారు. ఏలయన, వారు తమ గురువు యొక్క బ్రహ్మహత్యాపాపమును పోగొట్టే వ్రతమును అనుష్ఠించిరి.
ఆ వైశంపాయనుని శిష్యుడగు యాజ్ఞవల్క్యుడు ఆయనతో నిట్లనెను -- అయ్యా! పూజనీయా! అల్పమగు శక్తి గలవారల వ్రతానుష్ఠానముచే కలిగే ప్రయోజనమెంత? (అల్పము). నేను సుతరాము అనుష్ఠించ శక్యము కాని వ్రతముననుష్ఠించెదను.
యాజ్ఞవల్క్యుడిట్లు పలుకగా గురువైన వైశంపాయనునకు కోపము వచ్చి ఆయనతో నిట్లనెను -- పొమ్ము, శిష్యుడవై ఉండి వేదవేత్తలనవమానించిన నీతో ప్రయోజనమేమి? నానుండి నేర్చుకున్న విద్యను వెంటనే విడిచి పెట్టుము.
దేవరాతుని పుత్రుడగు ఆ యాజ్ఞవల్క్యుడు కూడ యజుర్మంత్రముల గణములను క్రక్కివేసి అక్కడనుండి వెళ్లిపోయేను. తరువాత, మహర్షులు ఆ యజుర్మంత్రముల గణములను చూచిరి.
ఆ యజుర్మంత్రముల పై అధికమగు లాలసచే ఆ మహర్షులు తిత్తిరి పక్షులుగా అయి వాటిని స్వీకరించిరి. కావుననే, మిక్కిలి రమ్యమైన యజుర్మంత్రములు తైత్తిరీయములని ప్రసిద్ధి గాంచినవి.
ఓ శౌనక మహర్షీ! తరువాత యాజ్ఞవల్క్యుడు తన గురువగు వైశంపాయనుని వద్ద లేని అధికమైన మంత్రములను పొందగోరెను. ఆతడు వేదములకు నాథుడగు సూర్యదేవుని గొప్పగా స్తుతించెను.
యాజ్ఞవల్క్య మహర్షి ఇట్లు స్తుతించెను --- ఓంకారస్వరూపుడైన సూర్యభగవానుని కొరకు నమస్కారము. మానవులు మొదలైన జరాయుజములు, పక్షులు మొదలైన అండజములు, క్రిమికీటకములు, చెట్టు చేమలు అని ప్రాణులు నాలుగు సమూహములుగానున్నవి. బ్రహ్మదేవుని మొదలుకొని గడ్డిపోచ వరకు గల అట్టి సకలప్రాణుల హృదయముల లోపల నీవు ఆత్మస్వరూపుడవై ఉన్నావు. బయట కూడ నీవు కాలరూపుడవై ఉన్నావు. క్షణము, లవము, నిమిషము మొదలైన అంశలచే వర్ధిల్లజేయబడే సంవత్సరముల సముదాయమే ఆ కాలము. నీవు ఆకాశము వలె ఈ ఉపాధులచే పరిచ్చిన్నుడవు కావు. అద్వితీయుడవగు నీవు నీటిని ఆవిరిగా చేసి మరల వర్షరూపముగా ఇస్తూ ప్రాణుల జీవనయాత్రను నిర్వహించుచున్నావు.(తత్సవితుర్వరేణ్యమ్).
దేవతలలో శ్రేష్ఠుడవై తపించే ఓ సూర్యదేవా! ప్రతిదినము మూడు సంధ్యలయందు వేదోక్తవిధానముచే నిన్ను స్తుతించువారలయొక్క సకలపాపములను, దుఃఖములను, పాపకారణమైన అజ్ఞానమును నీవు నశింప జేసెదవు. పూజనీయుడవగు నీయొక్క ఏ ఈ తపించే మండలము గలదో, దానిని మేము అభిముఖముగా బాగుగా ధ్యానించుచున్నాము.
ఈ లోకమునందలి స్థావరజంగమాత్మకమగు ప్రాణుల సముదాయ ములకు ఆశ్రయము నిశ్చయముగా నీవే. నీవు స్వయముగా ఆ ప్రాణుల ఆత్మవై అంతర్యామివై మనస్సు, ఇంద్రియములు, ప్రాణములు అనే జడ-అనాత్మలను ప్రేరేపించుచున్నావు.(ధియో యో నః ప్రచోదయాత్).
నీవు గొప్ప దయామయుడవు. చీకటి మిక్కిలి భయంకరమగు నోరు గల కొండ చిలువవంటిది. అది పట్టుకొని మ్రింగివేయగా, ఈ లోకము (మనిషి) మరణించినదా యన్నట్లు అచేతనముగా పడియుండును. దానిని నీవు దయతో చూపులోనే లేవగొట్టెదవు. ప్రతిదినము మూడు సంధ్యల యందు నీవు మానవుని స్వధర్మమనే పేరుతో ఆత్మరూపుడైన ఈశ్వరుని ఆరాధించుట అనే మోక్షసాధనమునందు ప్రవర్తిల్లజేయుచున్నావు. మహారోజు దుష్టులకు భయమును కలిగిస్తూ రాజ్యమునందు సంచరించునట్లుగా నీవు అంతటా సంచరిస్తున్నావు. ఆయా స్థానములయందు దిక్పాలకులు నీకు పద్మపు మొగ్గలవంటి దోసిళ్లతో అర్ఘ్యమునిచ్చుచున్నారు.
ఓ భగవానుడా! కావుననే, నేను ఇంతవరకు ఎవ్వరికీ తెలియని యజు ర్మంత్రములను గోరి నీ పాదములను సేవించుచున్నాను. ముల్లోకముల లోని పెద్దలు పద్మములవంటి నీ పాదములకు నమస్కరించుచున్నారు.
యాజ్ఞవల్క్య మహర్షి ఈ విధముగా స్తుతించగా, ఆ సూర్యభగవానుడు ప్రసన్నుడై, గుర్రము రూపములో ఆయనకు యజుర్మంత్రములను ఉపదేశించెను. అవి అంతవరకు ఎవ్వరికీ తెలియని మంత్రములు.
సర్వము దెలిసిన యాజ్ఞవల్క్యుడు. వందలాది యజుర్మంత్రములతో పది హేను శాఖలను చేసెను. గుర్రము రూపములో సూర్యునిచే ఈయబడుటచే వాటికి వాజసనేయ సంహితలని పేరు. వాటిని కాణ్వుడు, మాధ్యందినుడు మొదలగువారు అధ్యయనము చేసిరి.
సామవేదమును అధ్యయనము చేసిన జైమినికి సుమంతు మహర్షి అనే పుత్రుడు ఉండెను. ఆ సుమంతుని పుత్రుడు సున్వంతుడు. జైమిని తన పుత్రునకు, మనుమనికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంహితను బోధించేను.
ఆ జైమిని శిష్యుడు సుకర్మ మహర్షి గొప్పవాడు. ఆయన ఆ సామవేదమనే చెట్టునుండి సొమమంత్రములయొక్క వేయి శాఖల విభాగమును చేసెను.
కోసలదేశీయుడగు హిరణ్యనాభుడు, పౌష్యంజి, వేదవేత్తలలో శ్రేష్ఠు డగు ఆవంత్యుడు కూడ సుకర్మ శిష్యులై ఆ సంహితలను గ్రహించిరి.
పౌష్యంజికి, ఆవంత్యునకు అయిదు వందల మంది ఉత్తరదేశీయులగు శిష్యులు ఉండిరి. వారు సొమవేదశాఖలనధ్యయనము చేసిరి. వారిని కాలమును బట్టి ప్రాచీనమవేదీయులని కూడ వ్యవహరించెదరు.
పౌష్యంజియొక్క శిష్యులైన లౌగాక్షి, మాంగలి, కుల్యుడు, కుసీదుడు, కుక్షి ఒక్కొక్కరు వందేసి సంహితలను అధ్యయనము చేసిరి.
హిరణ్యనాభుని శిష్యుడగు కృతుడు ఇరవై నాలుగు సంహితలను, గొప్ప సంయమి యగు ఆవంత్యుడు మిగిలిన వాటిని, తమ తమ శిష్యులకు ఉపదేశించిరి.
శ్రీమద్బాగవత మహాపురాణము పన్నెండవ స్కంధములో పరీక్షిత్తు యొక్క విముక్తిని, జనమేజయుని సర్పయాగమును, వేదశాఖలను వర్ణించే ఆరవ అధ్యాయము ముగిసినది (6).
