భాగవత మహా పురాణము
13 - ఇంద్రుడు బ్రహ్మహత్యాపాపమునుండి విముక్తుడగుట
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- గొప్ప దాతవగు ఓ పరీక్షిన్మహా రాజా! వృత్రుడు సంహరించబడగా, ఇంద్రుడు తప్ప ముల్లోకముల వారికి వెంటనే సంతాపము తొలగి, మనస్సులు సుఖమును పొందెను.
తరువాత దేవతలు, మహర్షులు, పితృదేవతలు, భూతగణములు, దైత్యులు, దేవతల అనుచరులగు విద్యాధరాదులు తమ తమ నెలవులకు వెళ్లిరి. అప్పుడు బ్రహ్మగారు, రుద్రుడు, ఇంద్రుడు మొదలగువారు తాము కూడ తమ స్థానములకు వెళ్లిరి.
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు ప్రశ్నించెను --- ఓ మహర్షీ! ఇంద్రుడు సుఖమును పొందకుండుటకు గల కారణమును నేను వినగోరుచున్నాను. వృత్రుని సంహారము వలన దేవతలు సుఖించిరి. ఇంద్రునకు దుఃఖము కలుగుటకు కారణమేమి?
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- దేవతలందరు వృత్రుని పరాక్రమమునకు భయపడి, మహర్షులతో గూడి, వృత్రుని సంహరించుమని ఇంద్రుని ప్రార్థించిరి. కాని, బ్రహ్మహత్యాపాపము వలన భయపడిన ఇంద్రుడు దానికి ఇష్టపడ లేదు.
ఇంద్ర ఉవాచ ।
ఇంద్రుడిట్లు పలికెను --- విశ్వరూపుని వధ వలన కలిగిన బ్రహ్మ హత్యాపాపమును స్త్రీలు, భూమి, నీరు, చెట్లు పంచుకొని నన్ను అనుగ్రహించినవి. వృత్రుని హత్య చేసినచో, నేను ఆ పాపమును ఎక్కడ క్షాళన చేసుకొన వలెను?
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- మహర్షులు ఆ మాటను విని మహేంద్రునితో నిట్లనిరి --- నీకు మంగళమగు గాక! నీచే అశ్వమేధ యాగమును చేయించేదము. భయపడకుము.
పూర్ణుడు, అంతరతమమగు ఆత్మస్వరూపుడు, జగన్నాథుడు అగు నారాయణ దేవుని అశ్వమేధయాగముతో ఆరాధించినచో, జగత్తునంతనూ సంహరించిన పాపమునుండి కూడ విముక్తి కలుగును.
బ్రాహ్మణుని, తండ్రిని, గోవును, తల్లిని లేదా ఆచార్యుని చంపిన పాపి, కుక్క మాంసమును తినే కసాయి కూడ నారాయణుని కీర్తించినచో, పాపవిముక్తులగుదురు.
మేము అశ్వమేధము అనే గొప్ప యాగము ననుష్టించెదము. దానితో నీవు శ్రద్దతో ఆ నారాయణుని ఆరాధించుము. అప్పుడు బ్రహ్మగారితో సహా సకల చరాచరజగత్తును సంహరించిన పాపము కూడ నిన్ను స్పృశించ లేదు. దుష్టుని సంహరించుట వలన కలిగే పాపము గురించి ఇక చెప్పునదేమున్నది?
శ్రీశుక ఉవాచ ।
ఈ విధముగా మహర్షులు ప్రేరేపించగా, ఇంద్రుడు తన శత్రువగు వృత్రుని సంహరించెను. వృత్రుడు సంహరించబడగానే, బ్రహ్మహత్యా పాపము ఇంద్రుని పట్టుకొనెను.
ఆ బ్రహ్మహత్యా పాపముచే ఇంద్రుడు పీడను సహించుచుండెను ఆయనకు సుఖము లేకుండెను. వినయశీలియగు వ్యక్తి నిందించదగిన స్థితిని చేరుకున్నచో, ఆతని సద్గుణములు కూడ ఆతనికి సుఖమునీయలేవు.
కసాయిదానివంటి రూపము గల ఆ బ్రహ్మహత్య తన వెంట పరుగెత్తుచుండగా ఇంద్రుడు చూచెను. క్షయరోగము పట్టుకున్న ఆమె శరీరము ముసలిదనముచే వణుకుచుండెను. ఆమె వస్త్రము రక్తపు మరకలను కలిగి యుండెను. తెల్లని జుట్టు విరబోసుకొని, ఆమె నిలు నిలు అని పలుకుచుండెను. ఆమె పీల్చి విడిచే గాలి చేపల కంపు గలదియై, దారి అంతా దుర్వాసన వ్యాపించుచుండెను.
ఓ పరీక్షిన్మహారాజా! వేయి కన్నుల వేల్పు ఆకాశములో దిక్కులన్నీ తిరిగి, వెంటనే ఈశాన్యదిక్కులోని మానస సరోవరమును ప్రవేశించెను.
ఆ ఇంద్రుడు పద్మపు తూడు లోపలి త్రాళ్లయందు వేయి సంవత్సరములు దాగియుండెను. ఇంద్రునకు హవ్యమును అందించే అగ్ని నీటిలో ప్రవేశించలేడు గనుక, ఆయనకు ఆ కాలములో ఆహారాది భోగములు లేకుండెను. ఆ లోపల ఆతడు బ్రహ్మహత్యనుండి విముక్తిని పొందే ఉపాయమును గురించియే చింతిల్లుచుండెను.
।
ఆ కాలమునందు స్వరమును నహుషుడు శాసించెను. ఆయన విద్య, తపస్సు, యోగశక్తుల ప్రభావము గలవాడే. కాని, సంపద అధికారముల వలన కలిగిన గర్వముచే ఆతని వివేకశక్తి లోపించెను. ఇంద్రుని భార్యయగు శచీదేవి కల్పించిన శాపముచే ఆతడు సర్పమై జన్మించెను.
తరువాత సత్యసంకల్పుడగు శ్రీహరియొక్క (సత్యమును ప్రకా . శింపజేసే) ధ్యానమును చేయుటచే ఇంద్రుని పాపము తొలగిపోయెను. బ్రహ్మ గారు కబురు చేసి ఆహ్వానించగా, ఆయన తిరిగి స్వర్గమునకు వెళ్లే ను. బ్రహ్మహత్యాపాపముయొక్క బలమును ఈశాన్యదిక్కునకు అధిదేవత యగు ఈశానుడు నశింప జేసెను. పైగా, విష్ణుపత్నియగు లక్ష్మి ఇంద్రుని రక్షించెను. ఆ విధముగా, ఆ పాపము ఆతనిని పీడించుట మానివేసెను.
భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! అపుడు బ్రహ్మర్షులు విచ్చేసి, శ్రీహరియొక్క ఆరాధన గల అశ్వమేధ యాగమునకు ఇంద్రుని దీక్షితుని చేసిరి.
ఓ పరీక్షిన్మహారాజా! బ్రహ్మవేత్తలతో గూడి మహేంద్రుడు అశ్వమే ధయాగముననుష్ఠించి, సర్వదేతాస్వరూపుడగు పురుషోత్తముని ఆరాధించేను. దానిచే, త్వష్టయొక్క పుత్రుడగు వృత్రుని సంహరించుట వలన కలిగిన పెద్ద పాపపు ముద్ద కూడ, సూర్యునిచే పొగమంచు వలె, నిశ్చయ ముగా నిశ్శేషముగా నశింపజేయబడెను.
స
ఆ మహేంద్రుడు మరీచి మొదలగువారిచే యథావిధిగా అనుష్టించబడిన అశ్వమేధయాగముచే యజ్ఞేశ్వరుడు, పురాణపురుషుడు అగు శ్రీహరిని ఆరాధించి, పాపమును నశింప జేసుకొని, పూజనీయుడాయెను.
గంగకు జన్మనిచ్చిన పాదములు గల శ్రీహరిని కీర్తించి, భక్తజనుల చరితమును వర్ణించి, భక్తికి ఉత్కర్షను కలిగించే ఈ గొప్ప గాథ సకలపాపములను ప్రక్షాళన చేయును. దీనియందు మహేంద్రుని పాపవిముక్తి, అధిక మగు జయము వర్ణించ బడినవి.
కల్యాణములకు నిధానమగు ఈ ఉపాఖ్యానము ఇంద్రియపాటవ మును, ధనమును, కీర్తిని, సకలపాపములనుండి విముక్తిని, శత్రువులపై విజయమును మరియు ఆయుర్వృద్ధినీ ఇచ్చును. కావున, విద్వాంసులు దీనిని అన్ని కాలములలో, లేదా పర్వదినములయందు పఠించెదరు, లేదా శ్రవణము చేసెదరు.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో ఇంద్రుడు బ్రహ్మహత్యాపాపమునుండి విముక్తిని పొందుటను వర్ణించే పదమూడవ అధ్యాయము ముగిసినది (13).
Summary of chapter 13 of the Bhāgavata Mahā Purana is as follows:
Despite defeating Vṛtrāsura and saving the heavenly realm, Indra becomes deeply tormented by the sinful reaction (*Brahma-hatyā*) of slaying a learned sage and devotee, personified as a horrifying, decrepit hag chasing him everywhere. Indra flees Svargaloka and hides within the subtle stem of a lotus flower in Mānasa Lake for a thousand years, during which King Nahusha temporarily rules heaven until Indra is purified through grand horse sacrifices (*Aśvamedha*) performed by great rishis under the grace of Bhagavān Vishṇu.