భాగవత మహా పురాణము
3- యముడు భగవన్నామమహిమను వర్ణించుట
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ధర్మదేవత, సకలజీవులు తన వశమునందు గలవాడు అగు యమధర్మరాజుయొక్క ఆదేశము ఈ విధముగా త్రోసిపుచ్చబడినది. ఆ వృత్తాంతమును భటులు వర్ణించి చెప్పగా ఆయన విని, మురారి (ముర అనే రాక్షసుని సంహరించినవాడు) యొక్క - భటులచే త్రోసిపుచ్చబడిన ఆ కింకరులనుద్దేశించి ఏమి బదులు పలికెను?
ఓ శుకమహర్షీ! ఇంతవరకు యమదేవుని శిక్షకు ఎవని వలనైననూ భంగము కలిగినదని వినియుండలేదు. ఈ విషయమై జనులలో ఉండే సందేహమును నీవు తప్ప మరియొకరు తీర్చలేరని నా నమ్మకము.
శ్రీశుక ఉవాచ ।
శ్రీ శుకమహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! శ్రీహరి అనుచరులు తమ ప్రయత్నమునకు విఘాతమును కల్గించగా, యమదూ తలు తమ ప్రభుడగు యమునకు ఇట్లు విన్నవించుకొనిరి. యముడు సంయమనీ నగరమునకు ప్రభువు. .
యమదూతా ఊచుః ।
యమదూతలిట్లు పలికిరి --- ఓ ప్రభూ! జీవులు పుణ్యకర్మలు, పాపకర్మలు, పుణ్యపాపమిశ్రమకర్మలు అనే మూడు విధముల కర్మలను చేసి, క్రమముగా ఉత్తమలోకము, నరకము, మనుష్యలోకము అనే మూడు విధముల కర్మఫలములను పొందుచుందురు. ఈ జీవసమూహ మును శాసిస్తూ, వారికి కర్మఫలములు ప్రకటమగుటకు కారణమైనవారు ఈ సృష్టిలో ఎందరు గలరు?
లోకములో శిక్షలను వేసే శాసకులు అనేకులున్నచో, నరకము గాని, స్వర్గము గాని ఎవనికి లభించును? ఎవనికి నిరాకరించబడును?
ఈ లోకములో కర్మలను చేయువారలు ఆ ఏకులున్నారు గనుక, శాసకులు కూడ అనేకులుండుట సమంజసమే యన్నచో, వారికి ఉండే అధి కారము సామంతరాజుల అధికారము వలె నామమాత్రపై యగును.
కావున ప్రాణులకు, ఆయా ప్రాణుల ప్రభువులకు కూడ నీవే సర్వే శ్వరుడవు. మానవుల పుణ్యపాపములను నిర్ణయించి వారికి శిక్షలను వేసే శాసకుడవు నీవే.
అట్టి నీవు వేసిన శిక్ష ఈనాడు త్రోసిపుచ్చబడినది. ఇప్పుడు లోక మునందు నీ అధికారము చెల్లుట లేదు. ఆశ్చర్యమును కలిగించే నల్గురు సిద్ధపురుషులు నీ ఆజ్ఞను ఉల్లంఘించినారు.
నీ ఆదేశముననుసరించి మేము యాతనలను పెట్టే స్థానమునకు ఒక పాపిని కొనిపోవుచుండగా, వారు బలాత్కారముగా నీ పాశములను తెగగొట్టి వానిని విడిపించుకొని పోయిరి.
మాకు మంచిదని నీవు తలచే పక్షములో మేము వారిని గురించి తెలుసుకొన గోరుచున్నాము. ఓ నారాయణా! అని ఆ పాపి పలుకగానే, భయపడకుము అంటూ వీరు వెంటనే వచ్చినారు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ప్రాణులను శాసించే ఆ యమ దేవుని దూతలిట్లు ప్రశ్నించగా, ఆయన సంతోషించి, శ్రీహరి పాదపద్మము లను స్మరించి, వారికి ఇట్లు బదులు చెప్పెను.
యమ ఉవాచ ।
యముడిట్లు పలికెను --- నాకంటె మరియొకడు సర్వోత్కృష్టుడు గలడు. స్థావరజంగమాత్మకమగు జగత్తునకు ఆయనయే ప్రభుడు. వస్త్రము దారమునందువలె, ఈ జగత్తు ఆయనయందే పడుగు పేకగా నున్నది. ఆయన అంశ వలననే ఈ జగత్తుయొక్క సృష్టిస్థితిలయములు సంపన్నమగుచున్నవి. ముక్కు త్రాడు వేయబడిన ఎద్దు వలె, ఈ లోకము ఆయన వశములో నున్నది.
పొడవాటి త్రాటికి ఎద్దులను చిన్న త్రాళ్లతో కట్టివేసే విధముగా, ఆయన ప్రాణులను తననుండి ప్రాదుర్భవించిన వేదవాక్కు అనే త్రాటి యందు నామరూపములనే చిన్న త్రాళ్లతో బంధించినాడు. (అనగా, ప్రాణులు ఆయా నామరూపములయందాత్మభావము గలవారై వేదము నందు నిరూపితములైన ధర్మాధర్మములను చేస్తూ, సుఖదుఃఖములననుభ వించుచున్నారు). ఈ విధముగా నామరూపములు, కర్మలు అనే త్రాళ్లతో బంధించబడి భయభీతులై యున్న అట్టి ఈ జనులు ఆయా కర్మలను చేసి ఆ సర్వేశ్వరుని ఆరాధించుచున్నారు.
నేను, మహేంద్రుడు, నిరృతి, వరుణుడు, చంద్రుడు, అగ్ని, శివు డు, వాయువు, సూర్యుడు, బ్రహ్మగారు, ద్వాదశాదిత్యులు, విశ్వేదేవతలు, వస్తువులు, సాధ్యులు, మరుద్గణములు, రుద్రగణములు, సిద్ధులు, రజో గుణ తమోగుణముల స్పర్శ లేని భృగువు మొదలగు ప్రజాపతులు, మరియు ఇతరులగు దేవనాయకులు అనే వీరందరు సత్త్వగుణప్రధానులే. కాని, ఆ సర్వేశ్వరుని మాయయొక్క ప్రభావమునకు లోనై వీరు కూడ ఆయన లీలలను తెలియలేకున్నారు. ఇక, సామాన్యజనులు తెలియలేరని వేరుగా చెప్పనేల?
కంటిచే దర్శించబడే రూపములు తమకంటె అతీతముగానుండే కన్నును చూడలేవు. అదే విధముగా, జీవుల హృదయము లోపల ఆత్మ రూపుడై ఉండే ఆ శ్రీహరి ఇంద్రియాదులకు అతీతుడు. కావుననే, ఆత్మ - రూపుడగు శ్రీహరి ప్రాణుల జ్ఞానేంద్రియములకు గాని, కర్మేంద్రియము లకు గాని, సంకల్పవికల్పాత్మకమగు మనస్సునకు గాని, నిశ్చయాత్మక మగు బుద్ధికి గాని, వాక్కులకు గాని గోచరుడు కాడు.
స్వతంత్రుడు, అధీశ్వరుడు, సర్వాతిశాయి అగు శ్రీహరి మాయాశ క్తికి అధిపతి. సర్వమునకు ఆత్మరూపుడగు ఆయన దూతలు కూడ ఆయన వంటి రూపము గుణములు స్వభావము గలవారై మనోహరముగా నుందు రు. వారీ లోకములో తరచుగా సంచరించుచుందురు.
దేవతలచే పూజించబడే విష్ణుదూతల దర్శనము చాల దుర్లభము. గొప్ప ఆశ్చర్యమును కలిగించే ఆ దూతలు ఆ శ్రీహరి భక్తులగు మానవు లను శత్రువులనుండి మాత్రమే గాక నానుండి, సర్వమునుండి కూడ అన్ని దేశకాలములలో రక్షించుచుందురు.
సాక్షాత్తుగా భగవానునిచే బోధించబడిన ధర్మమును మహర్షులు, దేవతలు, సిద్ధులలో ప్రముఖులు సైతము తెలియలేక పోవుచున్నారు. ఇట్టి స్థితిలో అసురులు, మానవులు, విద్యాధరులు, చారణులు, కిన్నరులు మొదలగువారు ఎట్లు తెలియగలరు?
స్వయంభువుడగు బ్రహ్మగారు, సొరదుడు, శివుడు, సనత్కుమా రుడు, కపిల భగవానుడు, స్వాయంభువ మనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలి, వ్యాసపుత్రుడగు శుకుడు మరియు నేను అనే ఈ పన్నెండు మంది మాత్రమే భగవానునిచే చెప్పబడిన రహస్యమగు ధర్మమును తెలి యుచున్నాము. సత్త్వగుణప్రధానమగు ఈ ధర్మమును తెలియుట చాల కష్టము. దీనిని తెలుసుకున్న మానవుడు మోక్షమును పొందును.
భగవానుని నామమునుచ్చరించుట మొదలగువాటిచే భగవానుని యందు భక్తియోగము (భక్తిని అభ్యసించుట) మాత్రమే ఈ లోకములో మానవులకు సర్వోత్క్రుష్టమగు ధర్మమని మహర్షులచే చెప్పబడినది.
పుత్రులారా! శ్రీహరి నామమునుచ్చరించుటలోని మహిమను గమనించుడు. అజామిలుడు కూడ కేవలము నామమునుచ్చరించి మరణ పాశమునుండి విముక్తిని పొందినాడు.
మానవులకు పాపములను నశింప జేయుటకు భగవానుని గుణ ములను, లీలలను, నామములను చక్కగా కీర్తించిన చాలును. ఏలయన గా, పాపియగు అజామీలుడు కూడ మరణించబోతూ కొడుకును, ఓ సారా యణా ! అని బిగ్గరగా పిలిచి, మోక్షమును పొందినాడు.
అయ్యో! ఈ మహావిద్వాంసుడు మాయాశక్తిచే మిక్కిలి వ్యామో హితమైన బుద్ధి గలవాడై, తియ్యని ఆకర్షణీయమైన అర్థవాదవాక్యములతో కూడిన వేదమునందు దృఢముగా లగ్నమైన బుద్ధి గలవాడై, పెద్ద పెద్ద యజ్ఞరూపములైన కర్మలను చేయుటకు నడుము బిగించునే గాని, తర చుగా అట్టి ఈ భాగవత ధర్మమును తెలుసుకొనుట లేదు.
వివేకవంతులీ విధముగా విచారించి అనంత భగవానుని పూర్తిగా శరణు జొచ్చి భక్తియోగమునభ్యసించేదరు. వారు నేను వేసే శిక్షకు పాత్రులు కారు. ఒకచో వారియందు - పాపము ఉన్ననూ, వేదాదులలో గొప్పగా కీర్తించబడే భగవానుని కీర్తించుట వలన అది కూడ నశించును.
సర్వమునందు ఈశ్వరుని దర్శిస్తూ ఈశ్వరుని శరణు పొంది యున్న సత్పురుషుల చరితములను దేవతలు, సిద్ధులు కూడ కీర్తించెదరు. అట్టివారిని శ్రీహరి తన గదతో అన్ని విధములుగా రక్షించుచుండును. కావు న, మీరు వారి జోలికి పోకుడు. వారిని శిక్షించుటకు మనము సమర్థులము కాము; కాలము కూడ సమర్థము కాదు.
భక్తిసారమునెరింగిన పరమహంసల గణములు తమ వద్ద సంప దలేమీ లేకున్ననూ, మోక్షప్రదాతయగు శ్రీహరియొక్క పాదపద్మముల మకరందముయొక్క రసమును సేవించుచుందురు. కాని, దుష్టులు ఆ భక్తి రసము నేవగించుకొనెదరు. అట్టి దుష్టులు గృహమునందలి భోగముల యందు గట్టిగా తగుల్కొన్న దురాశ గలవారై ఉందురు. ఆ దురాశయే నర కమునకు దారి. అట్టివారిని మీరు ఇచటకు తీసుకొని రండు.
ఎవరి నాలుక భగవానుని గుణములను నామములను కీర్తించదో, ఎవరి మనస్సు భగవానుని పాదపద్మమును స్మరించదో, ఎవరు తల వంచి శ్రీకృష్ణునకు ఒకనాడైననూ నమస్కరించరో, ఎవరు శ్రీహరిని పూజాదిక ముచే ఆరాధించరో, అట్టి దుష్టులను మీరు ఇచటకు తీసుకొని రండు.
అయ్యో! అజ్ఞానులగు నా కింకరులు అపరాధమును చేసిరి. నేను, నా కింకరులు చేతులు జోడించి నమస్కరించుచున్నాము. కాలాతీతుడు, పూర్ణ చైతన్యస్వరూపుడు అగు ఆ నారాయణ భగవానుడు మా దోషమును క్షమించు గాక! గొప్పవారియందు క్షమాగుణము ఉండును. సర్వవ్యాపకుడే అయిననూ, సకలప్రాణుల హృదయములో ఆత్మరూపముగా నివసించే ఆ నారాయణునకు నమస్కారము.
కుతువంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! కావున, ప్రాణులకు కల్యాణములనిచ్చే విష్ణుసంకీర్తనము పెద్ద పాపములను కూడ సమూల ముగా నిర్మూలించే సర్వోత్తమమగు ప్రాయశ్చిత్తమని తెలియుము.
శ్రీహరియొక్క పరాక్రమ చరితములు చాల గొప్పవి. వాటిని విను వారికీ, కీర్తించువారికి భక్తి తేలికగా అబ్బును. ఆ భక్తి వలన అంతఃకరణము పరిశుద్ధమయ్యేటంతగా, ప్రతాదులచే పరిశుద్ధము కాదు.
శ్రీకృష్ణుని పాదపద్మముల మకరందమును సేవించు భక్తుడు మాయాగుణకార్యములగు విషయభోగములను విడిచి పెట్టును. దుఃఖమునే కలుగజేసే ఆ భోగములయందు ఆతడు మరల ప్రీతిని పొందడు. దీనికి భిన్నముగా, కోరికలచే పరాభూతుడైన అభక్తుడు అంతఃకరణములోని పాప ములను నిర్మూలించుటకై కర్మలను చేయును. కాని, ఆ కర్మల వలన అంతఃకరణములో కోరికలకు కారణమగు రజోగుణదోషము మరల నిర్మాణ మగును.
ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధముగా యముడు బోధించిన భగవా నుని మహిమను విని ఆ యమకింకరుల మనస్సులు ఆశ్చర్యముతో నిండి పోయెను. అప్పటినుండి వారు తమకు కీడు మూడునేమో యను శంకచే, అచ్యుతుని శరణు జొచ్చిన వారల జోలికి పోరు. వారా బోధను చక్కగా గుర్తులోనుంచుకొని, భక్తులకేసి కన్నెత్తి చూచుటకైననూ భయపడుదురు.
మలయపర్వతముపై శ్రీహరిని ఆరాధిస్తూ నివసించే పూజనీయు డగు అగస్త్య మహర్షి ఈ రహస్యమగు వృత్తాంతమును నాకు చెప్పెను.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో యముడు భగవన్నామమాహాత్మ్యమును వర్ణించే మూడవ అధ్యాయము ముగిసినది (3).
Summary of chapter 3 of the Bhāgavata Mahā Purana is as follows:
Upon returning empty-handed to the subterranean city of Saṁyamanī, the humbled Yamadūtas question Yamarāja regarding the higher authority that overruled their cosmic jurisdiction. Yamarāja offers profound prayers acknowledging Bhagavān Vishṇu as the sole, supreme sovereign controller of all universal creators and administrators, revealing the confidential truth of Bhāgavata-dharma. Yamarāja issues a strict decree instructing his messengers never to approach those who have taken shelter of the holy name of Śrī Kṛshṇa, as their sins are already neutralized, ordering them to bring only those impious souls whose tongues never chant the holy name and whose hearts remain void of devotion.