భాగవత మహా పురాణము
20 - విస్తృతమగు భువనకోశ వర్ణనము
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ పైన నేను ప్లక్షము మొద లగు ద్వీపముల పరిమాణమును, వాటి లక్షణములను, స్థితిని, ఆకార మును వర్ణించి చెప్పెదను.
మేరుపర్వతము చుట్టూ జంబూద్వీపము ఉన్నట్లుగానే, ఈ జంబూద్వీపము చుట్టూ ఆ ద్వీపముతో సమానమగు పరిమాణ వైశాల్య ములు గల ఉప్పు సముద్రము గలదు. అగడ్డ చుట్టూ ఉండే ఉద్యానవ నము వలే ఆ ఉప్పు సముద్రము చుట్టూ కూడ దానికి రెండు రెట్లు వైశా ల్యము గల ప్లక్షద్వీపము గలదు. జంబూద్వీపమునందలి నేరేడు చెట్టుతో సమానమగు పరిమాణము గల ప్లక్ష (జువ్వి ) అనే బంగరు చెట్టు ఉండుట చేతనే ఆ ద్వీపమునకు ప్లక్షద్వీపము అని పేరు వచ్చినది. అచట ఏడు జిహ్వల (కాలి, కరాలి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్పులింగిని, విశ్వరుచి) తో ప్రజ్వరిల్లే అగ్ని ఆ చెట్టుకు దగ్గరలో నుండును. ప్రియవ్రతుని కుమారుడగు ఇద్మజిహ్వుడు ఆ ద్వీపమునకు ప్రభువు. ఆయన తన ద్వీప మును ఏడు ఖండములుగా విభజించి, ఆ ఖండముల పేర్లు గల తన ఏడురు కొడుకులకు వాటిని పంచి యిచ్చి, ఆయన తాను ఆత్మనిష్ఠుడై లోకవ్యవహారములనుండి విరమించెను.
శివము, యవసము, సుభద్రము, శాంతము, క్షేమము, అమృ తము మరియు అభయము అనునవి ఆ వర్షముల పేర్లు. వాటిలో ప్రసిద్ధ ములైన పర్వతములు ఏడు, నదులు కూడ ఏడు గలవు.
మణికూటము, వజ్రకూటము, ఇంద్ర సేనము, జ్యోతిష్మంతము, సుపర్ణము, హిరణ్యస్థీవము, మేఘమాలము అనే పర్వతములు ఆ ఖండ ముల హద్దులను నిర్ధారించుచున్నవి. అరుణ, నృష్ణ, ఆంగిరసి, సావిత్రి, సుప్రభాత, ఋతంభర, సత్యంభర అను గొప్ప నదులు ప్లక్షద్వీపమునందు గలవు. అచట హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్యాంగ అనే పేర్లు గల నాలుగు వర్ణముల వారు గలరు. ఆ నదీజలములలో స్నానమును చేయుట చే, వారియందలి రజోగుణ తమోగుణములు కడిగివేయబడినవి. వేయి సంవత్సరములు జీవించే ఆ జనులకు దేవతల వలె అలసట గాని, చెమట పట్టుటు గాని ఉండదు. మరియు, వారు సంతానోత్పత్తియందు కూడ దేవత లను పోలియుందురు. వేదప్రతిపాద్యుడగు సూర్యభగవానుని వేదోక్తమగు ఉపాసనననుసరించి ఆరాధించువారికి సూర్యుడు స్వర్గముననుగ్రహించు ను. వారు సూర్యుని ఆత్మరూపముగా ఆరాధించెదరు.
కాలాతీతుడగు విష్ణువుయొక్క రూపమే సూర్యమండలము. ఋతము (శాస్త్రానుసారముగా నిశ్చయించబడిన కర్తవ్యము), సత్యము (వాక్కాయములతో నిర్వహించబడిన కర్తవ్యము), వేదము, మోక్షము మరియు మరణములకు అధిష్టానము సూర్యుడే. ఆ సూర్యుని మేము శరణు వేడుచున్నాము, అని వారు స్తుతించెదరు.
ప్లక్షద్వీపము మొదలగు అయిదు ద్వీపములయందు జనులకు ఆయుర్దాయము, ప్రజనన సామర్థ్యము, మనోబలము, ఇంద్రియపాటవ ము, శరీరబలము, బుద్ధిబలము, పరాక్రమము అనే లక్షణములు అందరిలో సమానముగా సహజసిద్ధములై యుండును. –
ప్లక్షద్వీపము చుట్టూ దానితో సమానమైన వైశాల్యము గల చెరుకు రసపు సముద్రము చుట్టువారి యున్నది. అదే తీరున, ప్లక్షమునకు రెట్టింపు వైశాల్యము గల శాల్మల ద్వీపము కూడ, తనతో సమానమైన వైశాల్యము గల మదిరా సముద్రముచే చుట్టువారబడి అంతటా విరాజిల్లుచున్నది.
శాల్మల ద్వీపమునందు జువ్వి చెట్టుతో సమానమైన నిడివిగల బూరుగు (శాల్మల) చెట్టు కానవచ్చును. దానిని బట్టియే ఆ ద్వీపమునకు ఆ పేరు వచ్చినది. తన అవయవములగు వేదమంత్రములతో శ్రీహరిని స్తుతించే పక్షిరాజగు గరుత్మంతుని నివాసము ఆ చెట్టుపైననే ఉన్నదని పెద్దలు చెప్పెదరు.
ఆ ద్వీపమునకు ప్రియవ్రతుని పుత్రుడగు యజ్ఞబాహుడు ప్రభువు. ఆయనకు ఏడ్గురు కొడుకులు గలరు. ఆయన ఆ ద్వీపమును సురోచనము, సౌమనస్యము, రమణకము, దేవవర్షము, పారిభద్రము, ఆప్యాయనము, అజ్ఞాతము అనే ఏడు ఖండములుగా విడగొట్టి తన ఏడురు కొడుకులకు పంచి యిచ్చెను. వారి పేర్లే ఆ వర్షములకు వచ్చినవి.
వాటియందు స్వరసము, శతశృంగము, వామదేవము, కుందము, ముకుందము, పుష్పవర్షము, సహస్రశ్రుతి అనే ఏడు వర్ష పర్వతములు, అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహు, రజని, నంద, రాక అనే ఏడు నదులు ప్రసిద్ధములైనవి.
ఆ వర్షములయందు శ్రుతధరులు, వీర్యధరులు, వసుంధరులు, ఇషంధరులు అనే పేర్లు గల వర్ణముల జనులు వేదస్వరూపుడైన చంద్ర భగవానుని వేదమంత్రములతో ఆత్మరూపునిగా ఆరాధించెదరు.
కృష్ణ శుక్ల పక్షములలో చంద్రుడు తన కిరణములతో పితృదేవత లకు ఆహారమును పంచి యిచ్చును. ప్రజలందరికీ రాజు (ఆహ్లాదకరుడు) అగు ఆ చంద్రుడు మాకు ప్రసన్నుడగు గాక! అని వారు ప్రార్థించెదరు.
ఇదే విధముగా, మదిరా సముద్రమునకు బయట దానికి రెట్టింపు విశాలమైన కుశద్వీపము గలదు. దానికి కూడ, శాల్మలీ ద్వీపమునకు చుట్టూ ఉన్నట్లే, అదే వైశాల్యము గల నేయి సముద్రము చుట్టూ ఉన్నది. ఆ ద్వీపమునందు ఈశ్వరునిచే రచించబడిన దర్భ (కుశ) మొక్క, రెండవ అగ్ని వలె, తన లేత పరకల కాంతిచే దిక్కులను ప్రకాశింప జేయుచున్నది. దానిని బట్టియే ఆ ద్వీపమునకు కుశద్వీపమని పేరు వచ్చినది.
ఓ పరీక్షిన్మహారాజా! హిరణ్యరేతసుడని ప్రసిద్ధి గాంచిన ప్రియవ్ర తపుత్రుడు ఆ ద్వీపమునకు ప్రభువు. వసువు, వసుదానుడు, దృఢరుచి, నాభిగుప్తుడు, స్తుత్యవ్రతుడు, వివిక్తుడు, వామదేవుడు అని ప్రసిద్ధి గాంచిన తన ఏడురు కొడుకులకు ఆయన తన ద్వీపమును వారి వారి భాగములను వారికి పంచియిచ్చెను. అపుడాయన తాను తపస్సు చేసుకొనెను.
వారి వర్షములయందు చక్రము, చతుశ్శృంగము, కపిలము, త్రికూటము, దేవానీకము, ఊర్ద్వరోమము, ద్రవిణము అని ప్రసిద్ధి గాంచిన ఏడు పర్వతములు సీమలను నిర్ధారించును. రసకుల్య, మధుకుల్య, మిత్ర వింద, శ్రుతవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల అని ప్రసిద్ధి గాంచిన ఏడు నదులు క్రమముగా ఆ వర్షములయందు ప్రవహించును.
కుశద్వీపములో నివసించే నాల్గు వర్ణముల వారికి కుశలురు, కోవి దులు, అభియుక్తులు, కులకులు అని పేర్లు. వారు ఆ నదుల జలములలో స్నానము చేసి, యజ్ఞాదికర్మలయందు తమకు గల నేర్పుతో అగ్నిరూప ములోనున్న భగవానుని ఆరాధించుచున్నారు.
సర్వజ్ఞుడవు సర్వవ్యాపకుడవు అగు ఓ అగ్నీ! నీవు సాక్షాత్తుగా పరబ్రహ్మకు హోమద్రవ్యములను గొనిపోవుదువు. దేవతలందరు ఆ పూర్ణ బ్రహ్మయొక్క అవయవములే. కావున, వారికి మేము సమర్పించే హవి స్సులతో నీవు పూర్ణుడగు ఆ పరబ్రహ్మను ఆరాధించుము, అని వారు స్తుతించెదరు.
అదే విధముగా, నేయి సముద్రమునకు బయట రెట్టింపు వైశా - ల్యము గల. క్రౌంచద్వీపము గలదు. కుశద్వీపము చుట్టూ నేయి సము ద్రము ఉన్నట్లే, క్రౌంచద్వీపము చుట్టూ ఈశ్వరునిచే పాల సముద్రము రచించబడి యున్నది. క్రౌంచము అని ప్రసిద్ధి గాంచిన గొప్ప పర్వతము. ఉండుట చేతనే, ఆ ద్వీపమునకు క్రౌంచద్వీపము అని పేరు వచ్చినది.
ఈ పర్వతమును కుమారస్వామి శక్తితో గొట్టగా, దాని మధ్యభా గము మరియు అచటి పొదరిళ్లు కకావికలయ్యెను. కాని, పాల సముద్రము దీనిని అంతటా తడుపుచున్నది. వరుణదేవుడు కూడ దీనిని బాగా రక్షించు చుండును. కావుననే, ఈ పర్వతము నిర్భయమైనది.
ఘృతపృష్ఠుడని ప్రసిద్ధి గాంచిన ప్రియవ్రత పుత్రుడు ఆ ద్వీపము నకు ప్రభువు. ఆయన తన ఆ ద్వీపమును ఏడు ఖండములుగా విభజించి, వాటికి తన ఏడ్గురు పుత్రులను అధిపతులుగా చేసెను, వారి పేర్లే ఆ వర్ష ములకు కూడ వచ్చినవి. పూజనీయుడగు ఆ ఘృతపృష్ఠుడు తాను సకల ప్రాణులలో ఆత్మరూపుడై యున్న శ్రీహరి భగవానుని పాదపద్మమును శరణు వేడెను. శ్రీహరియొక్క కీర్తి పరమమంగళకరము గదా!
ఆముడు, మధురుహుడు, మేఘపృష్ణుడు, సుధాముడు, భ్రాజిష్ణు డు, లోహితార్ణుడు, వనస్పతి అనువారలు ఘృతపృష్ఠుని కుమారులు. శుక్ల ము, వర్ధమానము, భోజనము, ఉపబల్షిణము, నందము, నందనము, సర్వ తోభద్రము అనునవి వారి వర్షములలో ప్రసిద్ధిగాంచిన పర్వతములు. అభ య, అమృతోఘ, ఆర్యక, తీర్థవతి, వృత్తిరూపవతి, పవిత్రవతి, శుక్ల అని ప్రసిద్ధి గాంచిన ఏడు నదులు ఆ వర్షములలో గలవు.
ఆ నదులలోని నీరు పావనము, స్వచ్చము. దానిని సేవించే ఆ వర్షములలోని నాలుగు వర్ణముల జనులకు క్రమముగా పురుషులు, ఋష భులు, ద్రవిణులు, దేవకులు అని పేర్లు. వారు జలముల రూపములోనున్న ఈశ్వరుని నీటితో నింపిన దోసిళ్లతో అర్ఘ్యమునిచ్చి ఆరాధించెదరు.
ఓ జలములారా! మీయందు ఈశ్వరుని శక్తి గలదు. కావుననే, మీరు భూర్భువస్సువర్లోకములను పావనము చేయుచున్నారు. స్వరూపము చేతనే పాపములను పోగొట్టే మీరు, మిమ్ములను స్పృశించు చున్న మా దేహములను పవిత్రము చేయుదురు గాక! అని వారు స్తుతిం చుచున్నారు.
ఇదే విధముగా, పాల సముద్రమునకు ముందట చుట్టూ ఇరవై రెండు లక్షల యోజనముల నిడివి గల శాకద్వీపము ఈశ్వరునిచే రచించ బడినది. అంతే వైశాల్యము గల పెరుగు సముద్రము దానిని చుట్టువారి యున్నది. ఆ ద్వీపమునందు శాకము (టేకు) అని ప్రసిద్ధి గాంచిన చెట్టు గలదు. దాని వలననే,. ఆ ద్వీపమునకు ఆ పేరు వచ్చినది. దాని గొప్ప మనోహరమైన పరిమళముచే ఆ ద్వీపమంతయు సుగంధభరితమై యుండును.
ఆ శాకద్వీపమునకు కూడ ప్రియవ్రతుని కుమారుడే ప్రభువు. ఆయన పేరు మేధాతిథి. ఆయన కూడ ఆ ద్వీపమును ఏడు ఖండము లుగా విభజించేను. ఆయనకు పురోజవుడు, మనోజవుడు, పవమానుడు, ధూమ్రానీకుడు, చిత్రరేఫుడు, బహురూపుడు, విశ్వధారుడు అనే ఏడురు పుత్రులు గలరు. ఆయన వారిని ఆ ఏడు ఖండములకు అధిపతులుగా నియమించేను. ఆ ఖండములకు వారి పేర్లే వచ్చినవి. అపుడాయన తాను తన మనస్సును అనంత భగవానునియందు ఏకాగ్రము చేసి, తపస్సు కొరకై అడవికి వెళ్లెను.
ఈశానము, ఉరుశృంగము, బలభద్రము, శతకేసరము, సహస్రన్రో తము, దేవపాలము, మహానసము అనే ఏడు పర్వతములు ఈ వర్షముల హద్దులను నిర్ధారించును. అనఘ, ఆయుర్ధ, ఉభయస్పృష్ఠి, అపరాజిత, పంచపది, సహస్రస్రుతి, నిజధృతి అనే ఏడు ప్రధానమైన నదులు కూడ ఆ ద్వీపమునందు ప్రవహించుచుండును.
ఆ వర్షములలోని నాల్గు వర్ణముల వారికి క్రమముగా ఋతవ్రతు లు, సత్యవ్రతులు, దానవ్రతులు, అనుప్రతులు అని ప్రసిద్ధి. వారందరు ప్రాణాయామమును చేసి, తమలోని రజస్తమోగుణములను నిర్మూలించు కున్నవారే. వారు తీవ్రమగు ఏకాగ్రతతో వాయురూపములోనున్న భగవా నుని ఆరాధించుచుందురు.
ఈశ్వరుడు ప్రాణుల లోపల ప్రవేశించి తన ప్రాణాపానాదివృత్తు లతో ప్రాణులను నిలబెట్టుచున్నాడు. సాక్షాత్తు అంతర్యామి (లోపలనుండి నియంత్రించువాడు) యై ఉన్న ఆయన మమ్ములను రక్షించు గాక! ఈ దృశ్య జగత్తు ఆయన వశములో నున్నది.
ఇదే విధముగా, పెరుగు సముద్రము. తరువాత దాని చుట్టూ దానికి రెట్టింపు వైశాల్యము గల పుష్కరద్వీపము ఈశ్వరునిచే రచించబడి యున్నది.ఆ ద్వీపమునకు బయట చుట్టూ దానితో సమానమగు వైశా ల్యము గల తియ్యని నీటి సముద్రము గలదు. ఆ ద్వీపమునందు పెద్ద పద్మము రచించబడి యున్నది. అది పద్మమే ఆసనముగా గల బ్రహ్మదే వుని గొప్ప ఆసనము. దానికి అగ్నిజ్వాలల వలె స్వచ్ఛమైన పది కోట్ల రేకులు గలవు.
ఆ పుష్కర ద్వీపమునకు మధ్యలో తూర్పు పడమర వర్షములకు హద్దును నిర్ధారిస్తూ, మానసోత్తరము అని ప్రసిద్ధి గాంచిన ఒకే ఒక పర్వ తము గలదు. దాని ఎత్తు, నిడివి కూడ పదివేల యోజనములు ఉండును. దానియందు నాలుగు దిక్కులలో ఇంద్రుడు మొదలగు లోకపాలకుల నాలుగు నగరములు గలవు. దానికి పైన మేరువు చుట్టూ సూర్యుని రథము తిరుగుచుండును. ఆ రథమునకు సంవత్సరకాలమే చక్రము. ఆ చక్రములో సగము ఉత్తరాయణము, సగము దక్షిణాయనము. అవియే దేవ తలకు క్రమముగా పగలు మరియు రాత్రి అగుచుండును.
ఆ ద్వీపమునకు ప్రభువు వీతిహోత్రుడని ప్రసిద్ధి గాంచిన ప్రియవ్ర తుని పుత్రుడే. ఆయనకు రమణకుడు, ధాతకి అని ఇద్దరు పుత్రులు గలరు. ఆయన వారిద్దరిని రెండు వర్షములకు ప్రభువులుగా నియమించి, తాను తన పూర్వీకుల వలె భగవంతుని ఆరాధించుటయే స్వభావముగా గల వాడు ఆయెను.
ఆ వర్షములలోని జనులు సకామకర్మలతో బ్రహ్మగారి రూపము లోని భగవానుని ఆరాధిస్తూ, ఈ క్రింది మంత్రమును కూడ జపించెదరు.
అద్వయము, శాంతము అగు పరబ్రహ్మయే బ్రహ్మగారి రూప ములో సృష్టికర్మయందు నిష్ఠమై యున్నది. దానిని అర్చించువాడు బ్రహ్మ జ్ఞానమును పొందును. పరబ్రహ్మయందు మాత్రమే నిష్ఠను కలిగియున్న ఆ బ్రహ్మగారి రూపమును జీవుడు పూజించవలెను. ఆ రూపములోనున్న భగవానునకు నమస్కారము, అని వారు జపించెదరు.
ఋషిరువాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఆ శుద్దజల సముద్రము తరు వాత లోకాలోకమని ప్రసిద్ధి గాంచిన పర్వతము గలదు. సూర్యకాంతిగల దేశమునకు, సూర్యకాంతి చొరని దేశమునకు మధ్యలో చుట్టూ ఆ పర్వ తము ఈశ్వరునిచే స్థాపించబడి యున్నది.
మేరు పర్వతమునుండి మానసోత్తర పర్వతమువరకు గల భూమి ప్రాణి సంచారమును కలిగియున్నది. ఆపైన ఉన్నది బంగరు భూమి. అది అద్దము పై భాగమును పోలిన సమప్రదేశము. దానియందు పడిన పదార్థ మేదియు తిరిగి లభించదు. కావుననే, దానియందు ఏ విధమైన ప్రాణిసం చారమైననూ కానరాదు.
లోకాలోకపర్వతము లోకము (సూర్యకాంతి గల దేశము) నకు, అలోకము (సూర్యకాంతి లేని దేశము) నకు మధ్యలోనున్నదై వ్యవస్థను చేయుచుండుటచే, ఈ పర్వతమునకు ఆ పేరు వచ్చినది.
ఆ లోకాలోక పర్వతము ముల్లోకములకు అంతమునందు చుట్టూ ఈశ్వరునిచే రచించబడి యున్నది. సూర్యునితో మొదలిడి ధ్రువనక్షత్రము వరకు గల నక్షత్రముల గణముల కాంతులు ఆ పర్వతమునకు ఈవల నుండే ముల్లోకములను అంతటా ప్రకాశింప జేయుచుండును. కాని, ఆ కీర ణములు ఏ నాడైననూ ఆ పర్వతమును దాటి ప్రసరించుటకు సమర్థములు కావు. దాని ఎత్తు, వైశాల్యము అంతటివి.
ఈ విధముగా విద్వాంసులు లోకముల విస్తారమును కొలత, లక్ష ణములు మరియు స్థితులు అను అంశములుగా విచారించి నిశ్చయించిరి. అట్టి ఈ లోకాలోక పర్వతము భూమండలములో నాల్గవ వంతు ఉన్నది. భూమండలము ఏభై కోట్ల యోజనముల విస్తారమును కలిగియున్నది.
స్వయంభువుడు, సకలజగత్తునకు తండ్రి అగు బ్రహ్మగారు ఆ లోకాలోక పర్వతమునకు పైన నాలుగు దిక్కులయందు, ఋషభుడు, పుష్కరచూడుడు, వామనుడు, అపరాజితుడు అనే నాలుగు గొప్ప ఏనుగు లను స్థాపించెను. ముల్లోకములను అవియే నిలబెట్టుచున్నవి. .
సర్వోత్కృష్టుడు, పురుషోత్తముడు, సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతు డు అగు శ్రీహరి భగవానుడు సకలజగత్తును లోపలనుండి నియమించుచు న్నాడు. ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఈశ్వరభావము మొదలగు మహా సిద్దులను బట్టి ఆయన మహిమను మనము జగత్తులో గుర్తించవచ్చును. ఆయన రజస్తమోగుణముల కలయిక లేని శుద్ధసత్త్వమే ఉపాదానముగా గల రూపమును దాల్చి, ఆ గొప్ప లోకాలోకపర్వతమంతటా విహరించు ను. గొప్ప ఆయుధములతో విరాజిల్లే దండములవంటి భుజములతో గూడి యున్న ఆ రూపమును ఆయన అన్ని లోకముల కల్యాణము కొరకై ఆవి ష్కరించుచున్నాడు. ఆయన అనుచరులలో ప్రముఖులగు విష్వక్సేనుడు మొదలగువారు ఆయనను చుట్టువారి సేవించుచుందురు. ఆయన ఆ దిగ్గ జములకు, తన అంశలైన దిక్పాలకులకు కూడ అనేకవిధములైన పరాక్రమ మును ఈ తీరున వర్దిల్ల జేయుచుండును.
ఆ పర్వతమునందు అంతటా ఉండును అనగా అర్థమేమనగా --- ఈ భగవానుడు మూడు గుణముల కలయికయగు తన మాయాశక్తిచే రచించబడిన సకలలోకముల యాత్రను రక్షించుట కొరకై కల్పము అంత మగు వరకు ఈ విధమగు వేషమును దాల్చియున్నాడు.
లోకాలోక పర్వతమునకు లోపలనుండే ముల్లోకముల విస్తారము చెప్పబడినది. లోకాలోక పర్వతమునకు ఆవలనుండే అలోకము (కాంతి లేని స్థానము) యొక్క విస్తారము కూడ అంతే ఉండును. ఆ అలోకము తరువాతిది యోగేశ్వరుల మిక్కిలి పవిత్రమైన గతి (పొందే స్థానము) యని చెప్పెదరు.
స్వర్గలోక భూలోకములకు మధ్యలో బ్రహ్మాండముయొక్క కేంద్ర స్థానమునందు సూర్యుడు గలడు. సూర్యునకు, బ్రహ్మాండగోళకము (అవ ధి) నకు మధ్యలో ఇరవై అయిదు కోట్ల యోజనముల నిడివి గలదు.
ఈ సూర్యునకు, అచేతనమగు ఈ బ్రహ్మాండములో ప్రకటమై నాడు (ఆ తీరున జీవకోటికి హేతువు అయినాడు) గనుక మార్తాండుడని యు, తేజోమయమగు బ్రహ్మాండమునుండి చక్కగా ఆవిర్భవించినాడు గనుక హిరణ్యగర్భుడనియు, పేరు వచ్చెను.
దిక్కులు, ఆకాశము, అంతరిక్షము, భూమి, స్వర్గము, బ్రహ్మలోక ము, నరకములు, రసాతలము మొదలగు లోకములు, మరియు సర్వప్రకా రముల భాగములు సూర్యునిచే విభాగము చేయబడుచున్నవి.
దేవతలు, పశుపక్ష్యాదులు, ప్రాకే జంతువులు, చెట్టుచేమలు మొదలగు సకలప్రాణిసమూహములకు సూర్యుడే స్వరూపము. కంటి చూపునకు అధిష్టాన దేవత సూర్యుడే.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో విస్తారముగా భువనకోశమును వర్ణించే ఇరువదియవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 20 of the Bhāgavata Mahā Purana is as follows:
Śrī Śukadeva Gosvāmī described the six concentric island continents surrounding Jambūdvīpa, namely Plakṣadvīpa, Śālmalīdvīpa, Kuśadvīpa, Krauñcadvīpa, Śākadvīpa, and Puṣkaradvīpa, each encircled by distinct oceans of saltwater, sugarcane juice, liquor, clarified butter, milk, and sweet water. He detailed the vast dimensions, lifespan, and worshipful forms of Bhagavān adored by the peaceful inhabitants of these outer realms.