భాగవత మహా పురాణము
15 - గయుని చరితము
శ్రీశుక ఉవాచ ।
శుకమహర్షి ఇట్లు పలికెను --- భరతుని పుత్రుడు సుమతి అనే పేరుతో ప్రసిద్దిని గాంచినాడు. ఆయనను గురించి ఇదివరలో చెప్పడమైనది. ఆయన ఋషభుని మార్గమునే అనుసరించెను. కాని, పాపభూయిష్టమగు కలియుగమునందు వేదవిరోధులగు దుష్టులు తమ బుద్దికి తోచిన విధముగా ఆయనయే దేవతయని, వేదముల బోధతో సంబంధము లేకుండా కల్పించెదరు.
ఆయనకు వృద్ద సేన అనే భార్యయందు దేవతాజిత్తు అని ప్రసిద్దిని గాంచిన పుత్రుడు కలిగెను.
తరువాత దేవతాజిత్తునకు ఆసురియందు దేవద్యుమ్నుడు అనే పుత్రుడు, ఆ దేవద్యుమ్నునకు ధేనుమతియందు పరమేష్ఠీ అనే పుత్రుడు, ఆ పరమేష్ఠికి సువర్చలయందు ప్రతీహుడు అనే పుత్రుడు కలిగిరి.
ఆ ప్రతీహుడు తాను అంతఃకరణశుద్ధిని పొంది, ఆత్మజ్ఞానమును ప్రవచించి, పురుషోత్తముని ఆత్మరూపముగా సాక్షాత్కరించుకొనెను.
ప్రతీహునకు సువర్చలయందు ప్రతిహర్త, ప్రస్తోత మరియు ఉద్గాత అనే ముగ్గురు కొడుకులు కలిగిరి. వారు యజ్ఞయాగాదులలో నిపు ణులు. ప్రతిహర్తకు స్తుతియందు అజుడు, భూమ అనే కొడుకులు కలిగిరి.
భూమకు- ఋషికుల్యయందు ఉద్గీథుడు అనే హృదయమునుండి పుట్టే కొడుకు కలిగెను. ఉద్గీథునకు దేవకుల్యయందు ప్రస్తావుడు, ప్రస్తావు నకు నియుత్సయందు విభుడు, విభునకు రతియందు పృథు షేణుడు, పృథు షేణునకు ఆకూతియందు నక్తుడు, నక్తునకు ద్రుతియందు గయుడు అనే పుత్రులు కలిగిరి. రాజర్షులలో శ్రేష్ఠుడగు గయుడు గొప్ప కీర్తిని పొందేను. ఆయన సాక్షాత్తుగా, జగత్తును రక్షించే కోరికతో సత్త్వగుణమును స్వీక రించియున్న విష్ణుభగవానుని అంశయే. సంయమము మొదలగు లక్షణ ములు గల ఆ గయుడు సర్వమానవులలో గొప్పవాడు ఆయెను.
ప్రజలను పాలించి పోషించుట, వారికి ప్రీతిని కలిగించుట, వారిని ప్రేమతో లాలించుట మరియు వారిని అనుశాసనములో నుంచుట అనునవి రాజునకు స్వధర్మము. యజ్ఞములను చేయుట కూడ రాజధర్మమే. ఆ గయ మహారాజు ఇట్టి తన ధర్మమును చక్కగా అనుష్ఠించి, దానిని పురుషోత్తముడు, సర్వాతిశాయి అగు శ్రీహరికి సమర్పించెను. కార్యకారణరూపుడై సర్వమునకు ఆత్మ అయి ఉన్న భగవానునకు ఇట్లు సమర్పించుట వలన స్వధర్మము పరమపురుషార్థమగు మోక్షమునకు దారి తీయును. ఇట్టి స్వధర్మముచే గయుని అంతఃకరణము నిరంతరముగా. సంస్కరించబడినదై మిక్కిలి పరిశుద్దమయ్యెను. పైగా, ఆయన బ్రహ్మవేత్తల పాదములను సేవించి భక్తియోగమును కూడ సంపాదించెను. దీని వలన ఆయనకు అంతఃకరణములో అనాత్మయగు దేహాదులయందుండే ఆసక్తి తొలగిపోయేను. ఆయనకు బుద్ధియందు బ్రహ్మాత్మైక్యజ్ఞానము ఉదయించి, ఆయన ఆత్మసాక్షాత్కారమును పొందెను. అయిననూ, ఆయన అభిమానశూన్యుడై భూమిని పాలించెను. పరబ్రహ్మహృదయములో ఆత్మరూపముగా సర్వకాలములలో ఉపలభ్యమగుచునే యుండును గదా!
పాండువంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఆ గయుని మహి మను బోధించే ఈ శ్లోకములను ఇతిహాసజ్ఞులు గానము చేయుచుందురు.
కర్మల విషయములో గయునితో సమానుడైన రాజు ఎవడు గలడు? యజ్ఞములను చేసి ఆత్మాభిమానము గలవాడై గొప్ప పండితుడై ధర్మమును రక్షిస్తూ సంపదలను పొంది సత్పురుషుల సమాజములో అగ్రగణ్యుడై సత్పురుషులను సేవించే రాజు కూడ గయునితో సమానుడు కాలేడు. గయుడు భగవంతుని అంశయే.
దక్షుని కుమార్తెలు పతివ్రతలు. వారి ఆశీర్వచనములు యథార్థములగును. వారు గంగ మొదలగు నదీదేవతలు తోడు కాగా, గొప్ప ఆనంద ముతో గయుని జలములతో అభిషేకించిరి. గయుడు నిష్కాముడు. ఆయన గుణములచే ప్రసన్నురాలైన భూదేవి ఆయన రాజ్యములోని ప్రజల కోరికలను పరిపూర్ణము చేసెను.
గయుడు నిష్కాముడు. కాని, వేదములు ఆయనకు భోగ్యవస్తువులను కర్మఫలరూపముగా సమృద్ధిగా నిచ్చినవి. మరియు, యుద్ధరంగము నందు ఆయన రాజులను బాణములతో సత్కరించగా, వారాయనకు కప్పములను కట్టిరి. ఆయన ధర్మముగా వేదవేత్తలను పాలించగా, వారు ఆయనకు పరలోకములో ఫలించే తమ పుణ్యములో ఆరవ వంతును అర్పించిరి.
ఆయన యజ్ఞములో అధికమగు సోమమును పానము చేసిన ఇంద్రునకు మత్తు కలిగెను. ఆయన చేసే భక్తిసాధన శ్రద్ధచే మిక్కిలి శుద్దమై నది మరియు అచంచలమైనది. ఆయన ఆ విధమగు భక్తితో యజ్ఞఫలమును సమర్పించగా, యజ్ఞస్వరూపుడగు శ్రీహరి భగవానుడు స్వయముగా స్వీకరించెను.
సర్వాంతర్యామి, స్వరూపమునందు ఆనందఘనుడు అగు భగవానుడు ప్రీతిని చెందినచో, బ్రహ్మగారితో మొదలిడి దేవతలు మనుష్యులు పశుపక్ష్యాదులు చెట్టుచేమలు గడ్డి వరకు గల ప్రాణులు వెనువెంటనే ప్రీతిని చెందును. అట్టి శ్రీహరి గయుని యజ్ఞములో అధికప్రీతిని పొందెను.
గయునకు భార్యయగు గయంతియందు చిత్రరథుడు, సుగతి, అవరోధనుడు అనే ముగ్గురు కుమారులు కలిగిరి. చిత్రరథునకు ఊర్ణ యందు సమ్రాట్టు అనే కొడుకు పుట్టెను.
సమ్రాట్టునకు ఉత్కలయందు మరీచి, మరీచికి బిందుమతియందు బిందుమంతుడు, బిందుమంతునకు సరఘయందు మధువు అని ప్రసిద్ది జెందినవాడు, మధువునకు సుమనసయందు వీరవ్రతుడు, వీరవ్రతునకు భోజయందు మంథుడు మరియు ప్రముంథుడు, మంథునకు సత్యయందు భౌవనుడు, భౌవనునకు దూషణయందు త్వష్ట, త్వష్ణకు విరోచనయందు విరజుడు, విరజునకు విషూచియందు శతజిత్తు మొదలగాగల వందమంది కొడుకులు మరియు ఒక కూతురు పుట్టిరి.
ఆ విరజుని గురించి ఇట్టి ప్రసిద్ధి గలదు --- ప్రియవ్రతుని వంశ ములో (తన వరకు గల పరంపరలో) ఆఖరున పుట్టిన విరజుడు తన కీర్తితో ఆ వంశమును, విష్ణువు వామనుడై దేవతల గణమును వలె, అధికముగా అలంకరించేను.
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో గయుని మహిమను వర్ణించే పదునైదవ అధ్యాయము ముగిసినది (15).
Summary of chapter 15 of the Bhāgavata Mahā Purana is as follows:
Śrī Śukadeva Gosvāmī summarized the royal dynasty descended from King Bharata, highlighting pious and heroic monarchs such as Sumati, Devatājit, Parameṣṭhī, and Pratīha who maintained the righteous order and ruled Bhāratavarṣa. He explained how these kings performed great Vaidika sacrifices, protected their subjects, and ultimately achieved spiritual perfection by directing their hearts toward Bhagavān Viṣṇu.