భాగవత మహా పురాణము
12 - రహూగణ జడభరత సంవాదము - జగన్మిథ్యాత్వ నిరూపణము
రహూగణ ఉవాచ ।
రహూగణుడు ఇట్లు పలికెను --- ఓ మహాయోగీ! నీవు కారణజన్ముడవు. నీవు ఆత్మజ్ఞానముచే భేదదృష్టిని నిరాకరించితివి. నీవు సర్వకాలములలో ఆత్మనిష్టుడవై యుందువు. కాని, నీవు బ్రాహ్మణాధముని వేషములో నుండుటచే, ఆ సంగతి అతిరహస్యముగా నున్నది. నీకు అనేక నమస్కారములు.
జ్వరముతో పీడను పొందియున్న వానికి జ్వరబాధను పోగొట్టే మందు ఎట్టిదో, ఎండ వేడిచే తాపమును పొందియున్నవానికి చల్లని నీరు ఎట్టిదో, పాపముచే పీడించబడువానికి గంగాజలము ఎట్టిదో, కుత్సితమైన శరీరమునందు నేను అనే అభిమానముగల నాకు మీ మాటలు అట్టివి. పాము విషమువంటి ఈ దేహాభిమానము నా వివేకమును నశింపజేసినది. అట్టి నాకు మీ మాటలు అమృతము, మందుల వంటివి.
అందువలన, నాకు సందేహము గల విషయములను నేను తమరిని తరువాత ప్రశ్నించెదను. మీరు అధ్యాత్మయోగము (ఆత్మస్వరూపము యొక్క జ్ఞానము) తో గూడిన ఉపదేశమును చేసియుంటిరి. నా మనస్సులో దానిని తెలుసుకోవాలనే ఉత్కంఠ గలదు. కావున, ఇప్పుడు తమరు నాకా విషయము చక్కగా తెలిసే విధముగా వివరించుడు.
ఓ మహాయోగీ! ప్రత్యక్ష-అనుమాన ప్రమాణములచే తెలియ వచ్చే సుఖదుఃఖాది కర్మఫలము యథార్థమనియే తోచును. సత్యముగా భాసించే లోకవ్యవహారమునకు ఈ అనుభవమే మూలము. కాని, ఈ క్రీయాఫలములు కేవలము నామరూప (మిథ్యాభూతమగు) వ్యవహారము మాత్రమే మూలముగా గలది అనియు, పరమార్థతత్త్వముయొక్క విచారము ముందు ఇది నిలబడేది గాదనియు తమరు సెలవిచ్చిరి. ఈ అంశములో నా మనస్సు భ్రమకు గురియగుచున్నది.
బ్రాహ్మణ ఉవాచ ।
జడభరతుడిట్లు పలికెను --- ఓ మహారాజా! వ్యక్తియని ప్రసిద్దిని గాంచిన ఈ దేహము ఏదో ఒక కారణముగా నేలపై నడుచుచున్నది. అయిననూ, ఇది కేవలము పృథివియొక్క వికారము (జడము) , మాత్రమే. దేహము అనేది కూడ రెండు పాదములు, వాటిపై చీలమండలు, పిక్కలు, మోకాళ్లు, తొడలు, నడుము, వక్షఃస్థలము, మెడ మరియు భుజములు అనే అవయవముల కలయిక మాత్రమే. దేహము అనే స్వతంత్రమైన తత్త్వమే దియు లేదు.
భుజముపై చెక్కతో చేసిన పల్లకీ ఉన్నది. దానిలో సౌవీరదేశపు రాజు అనే నామరూపములు మాత్రమే ఉన్నవి. ఆ నామరూపముల యందు నేను అనే అభిమానము నీయందు దృఢముగా నాటుకొని యున్న ది. అట్టి దేహాభిమానివియగు నీవు, నేను సింధుదేశపు రాజును అనే చెడ్డ గర్వముతో కన్ను మిన్ను కానరాకుండ నున్నావు.
అధికమగు కష్టమును చేస్తూ దీనులైయున్న ఈ కూలీలను చూచి నచో దుఃఖము కలుగును. దయనెరుంగని నీవు వీరికి కూలినిచ్చి పల్లకీని మోయించుచున్నావు. పైగా, నేను, జనులను రక్షించువాడను అని బీరములు పలికెదవు. నీవంటి గర్విష్టి మహాత్ముల సన్నిధిలో శోభిల్లడు.
కదిలే మరియు కదలని ప్రాణులు అన్నీ పృథివినుండియే. పుట్టి, పృథివియందే మనుగడను సాగించి, పృథివియందే విలీనమగుచున్నవని మనకు తెలియుచునే యున్నది. ఇట్టి స్థితిలో ప్రాణిదేహములన్నియు పృథివీ వికారములు మాత్రమే అయి ఉండగా, లోకవ్యవహారమునకు మూలమునందు నామరూపములకంటే భిన్నమైన సత్యతత్త్వము ఒకటి ఉన్నదని నిర్దేశించుట పొసగదు. వాటియందు ప్రకటమయ్యే క్రియలను బట్టి వాటికి మూలమగు సత్యతత్త్వము గలదని ఊహించుటయు పొసగదు.
పృథివియైననూ తనకు కారణములు, అవ్యక్షములు అగు పరమాణువులలో విలీనమగును. కావున, పృథివి అనే నామముచే నిర్దేశించబడే రూపముకంటే భిన్నముగా సత్యతత్త్వము ఒకటి గలదని చెప్పుట పొసగదు. ఈ పరమాణువులు కూడ అజ్ఞానముచే మనస్సు కల్పించినవియే. అవి ఒకచో ప్రోగుపడి, పృథివి అనే ఒక మిథ్యారూపమే ఒక విశిష్టపదార్థ ముగా కానవచ్చుచున్నది.
ఈ ద్వైతప్రపంచములో చిక్కియున్నది, లావుగా నున్నది, చిన్నది, పెద్దది, కారణము, కార్యము, ప్రాణము గలది, ప్రాణము లేనిది అంటూ అనేకములగు తేడాలు కానవచ్చుచున్నవి. ఈ భేదజాతమంతయు పృథివి వలెనే కేవలము నామరూపములు మాత్రమేనని తెలియుము. మాయాశ క్రియే పంచభూతములు, వివిధప్రాణుల స్వభావములు, వాటి సంస్కారము లు, కాలము, కర్మఫలము మొదలగు నామములను దాల్చి, ఈ నానాత్వ మును కల్పించుచున్నది (లేకున్ననూ కానవచ్చునట్లు చేయుచున్నది).
ఈ నానాత్వముకంటె విలక్షణమైన యథార్థతత్త్వమే పరబ్రహ్మ (అఖండసత్త). అది కర్తృత్వభోక్తృత్వాది దోషములు లేని జ్ఞప్తి (నిర్విశేష జ్ఞానము, లేక చైతన్యము) యే స్వరూపముగా గలది. సర్వవ్యాపకమగు దానియందు బయట, లోపల అనే భేదములు లేవు. జీవుని అంతరతమ మగు స్వరూపము వికారములు లేని ఆ పరబ్రహ్మయే. దానికే భగవానుడని పేరు. మహాత్ములు ఆ పరబ్రహ్మనే వాసుదేవుడు (సర్వజగత్తునకు అధిష్ఠానమైన చైతన్యము) అని వ్యవహరించెదరు.
ఓ రహూగణా! సాధకుడు ఈ పరమాత్మతత్త్వమును నీటిలో నిలబడి చేసే తపస్సుచే గాని, పంచాగ్నుల (నాలుగు దిక్కులలో మంటలు, పైన ఎండ) మధ్యలో చేసే తపస్సుచే గాని, యజ్ఞముచే గాని, అన్నాదులను దానము చేయుట వలన గాని, సంతానప్రాప్తి మొదలగు గృహస్థధర్మములను పాటించుట వలన గాని పొందజాలడు. మహాత్ముల పాదముల ధూళితో తలపై అభిషేకము వలన మాత్రమే ఈ పరమాత్మతత్త్వము సాధ కునకు లభించును.
మహాత్ముల సన్నిధిలో పవిత్రకీర్తియగు శ్రీహరియొక్క గుణముల ప్రస్తావము ప్రవర్తిల్లుచుండును. దాని వలన భోగములకు సంబంధించిన ప్రసంగములకు అడ్డుకట్ట పడును. మోక్షమును గోరు సాధకుడు అట్టి ప్రవచనములను ప్రతిదినము సేవించుచున్నచో, వాని అంతఃకరణము శుద్దమై, వాసుదేవునియందు లగ్నమగును.
నేను పూర్వజన్మయందు భరతుడని ప్రసిద్ది చెందిన రాజును. మానవుడు కంటితో చూచి, చెవితో విని భోగములయందు ఆసక్తిని పెంచు కొనును. కాని, నేను అట్టి ఆసక్తి అనే బంధమునుండి బయట పడితిని. ఇహ లోక పరలోకములయందలి భోగములపై ఆసక్తిని విడిచి నేను భగవంతుని ఆరాధించెడివాడను. కాని, ఇంతలో ఒక లేడి పిల్లపై ఆసక్తిని పెంచుకొను టచే, ఆ ప్రయోజనము దెబ్బ తినెను. అపుడు నేను లేడినై పుట్టితిని.
ఓ వీరుడా! శ్రీకృష్ణుని పూజించుట వలన లేడి జన్మయందు కూడ పూర్వజన్మస్మృతి నన్ను విడిచి పోలేదు. కావుననే, నేను జనులతోడి సంగము వలన భయపడువాడనై, ఏకాకిగా నా అసలు స్థితి ఇతరులకు తెలియకుండగా, సంచరించుచున్నాను.
కావున, మానవుడు సంసారాసక్తిని వీడి, అట్టి మహాత్ములతో చక్కని సత్సంగమును చేయవలెను. అట్లు చేయు సాధకునకు ఆత్మజ్ఞా నము ఉదయించును. ఆత్మజ్ఞానము అనే కత్తి ఆతనికి ఈ జన్మయందే సంసారవ్యామోహమును నశింపజేయును. శ్రీహరియొక్క లీలలను చెప్పుట, వినుట వలన ఆతడు సంసారమార్థమునకు అతీతముగా పరమల క్ష్యమైన శ్రీహరిని ఆత్మరూపముగా పొందును.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి పంచమస్కంధములో రహూగణ జడభరత సంవాదములో జగన్మిథ్యాత్వ నిరూపణము అనే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).
Summary of chapter 12 of the Bhāgavata Mahā Purana is as follows:
Deeply humbled and enlightened by Jaḍa Bharata's words, King Rahūgaṇa dismounted from his palanquin and surrendered at the feet of the saint, begging forgiveness for his arrogant demeanor. Jaḍa Bharata mercifully accepted the king, dispelling all his doubts regarding the difference between the temporary material body and the eternal, blissful soul, inspiring Rahūgaṇa to abandon worldly pride and embrace pure devotional service.