శ్రీ మద్భాగవతము - ద్వితీయ (2వ) స్కందము

3 - తృతీయోధ్యాయః

            శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను: మనుష్యజన్మను పొందియున్న జీవులలో వివేకము గలవారు మరణించ బోయే సమయములో చేయదగిన పని యేది? అని నీవు నన్ను ప్రశ్నించితివి. దానికి సమాధానముగా శాస్త్ర ముయొక్క సందేశమును నేను నీకు చెప్పితిని. అట్టి వారు హరికథా శ్రవ ణము మొదలగు వాటియందు ఈ విధముగా కాలమును గడుప వలెనని శాస్త్రము విధించుచున్నది.

            బ్రహ్మతేజస్సును కోరు వ్యక్తి వేదములకు అధిపతియగు బ్రహ్మ గారిని, ఇంద్రియపాటవమును కోరువాడు ఇంద్రుని, సంతానమును కోరు వాడు దక్షుడు మొదలగు ప్రజాపతులను ఉపాసించ వలెను.

సంపత్తిని కోరువాడు దుర్గాదేవిని, తేజస్సును కోరువాడు అగ్నిని, ధనమును కోరువాడు వస్తువులను ఆరాధించ వలెను. వీరత్వమును కోరు వ్యక్తి ఉత్సాహముతో రుద్రులను ఉపాసించ వలెను. సమృద్ధమగు అన్న మును మాత్రమే గాక, మంచి జీర్ణశక్తిని కూడ కోరు వ్యక్తి అదితిని, స్వర్గ మును కోరువాడు ద్వాదశాదిత్యులను, రాజ్యాధికారమును కోరువాడు విశ్వేదేవతలను, దేశప్రజలను తన స్వాధీనములోనికి తెచ్చుకోవాలని కోరే వ్యక్తి (లేదా, వ్యాపారమును చేయగోరు వ్యక్తి) సాధ్యులను, ఆయుర్దాయ మును కోరువాడు అశ్వినీ దేవతలను, పుష్టిని కోరువాడు పృథివీ దేవతను, తన స్థానమును నిలబెట్టుకోవాలని కోరే వ్యక్తి (లోకమునందు పేరు ప్రతిష్ట లను కోరువాడు) సకలప్రాణులకు ఆధారభూతులైన భూలోక-స్వర్గలోక ముల అధిష్టాన దేవతలను ఉపాసించ వలెను.

సౌందర్యమును కోరు వ్యక్తి గంధర్వులను, భార్యను కోరువాడు ఊర్వశి అనే అప్సరసను, జనులందరిపై పెత్తనమును కోరువాడు బ్రహ్మ గారిని కొలువ వలెను.

కీర్తిని కోరువాడు యజ్ఞరూపుడగు శ్రీహరిని, ధనమును ప్రోగు , చేయ గోరువాడు వరుణుని, విద్యను కోరువాడు శంకరుని, దాంపత్యజీవిత ములో అన్యోన్యానురాగమును కోరువారు పతివ్రతయగు పార్వతీదేవిని ఉపాసించ వలెను.

ధర్మమును కోరువాడు ఉత్తమమగు కీర్తిగల శ్రీహరిని, సంతానమును అధికముగా కోరువాడు పితృదేవతలను, రక్షణను (బాధలనుండి విముక్తిని) కోరువాడు యక్షులను, బలమును కోరువాడు మరుద్గణములను ఆరాధించ వలెను.

క్షత్రియజన్మను కోరువాడు మన్వంతరాధిపతులను, శత్రువినాశ మును కోరువాడు నిరృతిని, భోగములను కోరువాడు చంద్రుని, విరాగి పర , మపురుషుడగు శ్రీహరిని కొలువ వలెను.

ఉన్నతమగు బుద్ధి గల వ్యక్తి కామములు లేకున్ననూ, లేక అన్నిం టినీ కోరువాడైననూ, లేక మోక్షమును మాత్రమే కోరువాడైననూ, తీవ్ర మగు భక్తియోగముతో పరమపురుషుడగు శ్రీహరిని కొలువ వలెను.

సాధకునకు ఈశ్వరారాధన వలన లభించే మహాఫలమేమనగా, భగవద్భక్తులతో సంగమము ఏర్పడి, తద్ద్వారా భగవంతునియందు నిశ్చల మగు భక్తి కుదురుటయే. దాని వలన సాధకునకు పరమపురుషార్థమగు మోక్షము లభించును.

            శ్రీహరియొక్క గాథలను వినువానికి జ్ఞానోదయమై త్రిగుణముల కార్యములగు రాగద్వేషాదుల వెల్లువల పరంపరలనుండి మనస్సు ఉపసం హరింపబడుటచే, ఆ మనస్సు ప్రసన్నమగును. అట్టి ప్రసన్నమగు మన స్సులో విషయభోగములపై వైరాగ్యము ఉదయించును. ఆ తరువాత ఆ మనస్సులో భక్తియోగము ఉదయించును. ఈ భక్తియోగము మోక్షమార్గ మని మహాత్ములు ఉద్దేషించుచున్నారు. అట్టి శ్రీహరియొక్క గాథలలోని మాధుర్యమును చవి చూచినవాడు ఎవడు వాటియందు ప్రీతిని చేయకుం డును?

            శౌనకమహర్షి ఇట్లు పలికెను: శుకమహర్షి చెప్పిన ఈ విషయ మును విని, భరతవంశశ్రేష్ఠుడగు పరీక్షిన్మహారాజు మరల. ఆయనను ఇంకనూ ఏమని ప్రశ్నించెను?

ఓ సూతమహర్షీ! నీవు విద్వాంసుడవు. ఈ విషయమును మేము వినగోరుచున్నాము. కావున, నీవు చెప్పదగును. సత్పురుషుల సభలో ఘటిల్లే ప్రసంగములు శ్రీహరి గాథలలోనికి మాత్రమే పరిణమించును గదా! .

పాండవుల మనుమడు, మహారథుడు అగు ఆ పరీక్షిన్మహారాజు గొప్ప భగవద్భక్తుడు. ఆయన చిన్నతనములో ఆటబొమ్మలతో ఆడే సమయములో శ్రీకృష్ణుని లీలలకు సంబందించిన ఆటలను ఆడుకొనెడివాడు.

వ్యాసపుత్రుడు, పూజ్యుడు అగు శుకమహర్షి కూడ గొప్ప శ్రీకృష్ణ భక్తుడు. ఇట్టి సత్పురుషుల సమావేశములో భగవానుని గుణములను వర్ణించే గాథలు ముచ్చటించ బడును గదా!

ఎవడైతే క్షణకాలమైననూ ఉత్తమమగు కీర్తిగల భగవానుని ప్రసంగ ముచే గడుపునో వానికి తప్ప, మిగిలిన వారందరికీ సూర్యభగవానుడు ఉద యిస్తూ, అస్తమిస్తూ ఆయుర్దాయమును హరించి వేయుచుండును.

చెట్లు బ్రతుకుట లేదా? కొలిమి తిత్తులు గాలిని పీల్చుట లేదా? గ్రామమునందు బ్రతికే ఇతరజంతువులు తిని, సంతానమును కనుట లేదా? భక్తి లేని మానవజీవితము వాటి వలె నిస్సారమైనది అని భావము.

చెవి (శ్రవణము) ద్వారా ఎవని హృదయము లోనికి ఒక్కనాడై ననూ శ్రీకృష్ణభగవానుడు ప్రవేశించ లేదో, అట్టి పురుషాకారములోనున్న పశువును మహాత్ములు తిరస్కారయోగ్యుడగుటచే కుక్కలలో, కలుషితములగు భోగములయందు ఆసక్తి గలవాడగుటచే గ్రామములోని పందులలో, దుఃఖ హేతువగు మార్గమునందు పయనించుచుండుటచే ఒంటెలతో, సంసారభారమును మోయుచుండుటచే గాడిదలతో సమానుడని పరిగణిం చినారు. లేదా, మనలో ఒక్కొక్కరిలో గల గుణములను అన్నింటినీ వీడు కలిగియున్నాడని ఆయా పశువులు వానిని స్తుతించునని భావము.

వామనావతారములో మూడు అడుగులలో విశ్వమును కొలిచిన శ్రీహరియొక్క పరాక్రమగాథలను వినని మానవుని చెవి దొప్పలు వ్యర్థ మగు రంధ్రములు మాత్రమే. అయ్యో! వేదములలో పలువిధములుగా కీర్తించబడే పరమేశ్వరుని గాథలను ఎవని నాలుక కీర్తించదో, అది కప్ప నాలుక వలె వ్యర్థముగా కటువగు శబ్దములను చేయుటకు మాత్రమే పనికి వచ్చును.

శ్రీహరికి నమస్కరించని తల పట్టు తలపాగతో మరియు కిరీట ముతో అలంకరించబడి యున్ననూ, అది కేవలము బరువు మాత్రమే శ్రీహరియొక్క పూజను చేయని చేతులు బంగరు కంకణములతో అలంకరించబడి ప్రకాశించుచున్ననూ, శవముయొక్క చేతులతో సమానము.

శ్రీహరియొక్క మూర్తిని, ఆయనను గుర్తుకు తెచ్చే తీర్థములు మొదలగు వాటిని దర్శించని మానవుల కన్నులు నెమలి ఈకల కన్నుల వలె నిరర్థకములు. శ్రీహరియొక్క క్షేత్రములకు యాత్రలను చేయని మానవుల పాదములు ఎక్కడికైననూ కదలని చెట్ల వలె వ్యర్థములు.

            ఏ మానవుడైతే ఒక్కనాడైననూ భగవద్భక్తుల పాదధూళిని తన శిరస్సు పై ధరించడో, వాడు నడయాడే శవముతో సమానము. భగవంతుని పాదములయందు సమర్పించబడి, శ్రీవిష్ణుపది అని పేరు గాంచిన తుల సియొక్క గంధమును ఎవడైతే భక్తిపూర్వకముగా ఆఘ్రాణించి అభినందిం చడో, వాడు గాలిని పీలుస్తూ ఉండే శవముతో సమానము.

            ఓ సూతా! శ్రీహరియొక్క నామములను తాను ఉచ్చరించి గాని, ఇతరులు ఉచ్చరించగా విని గాని, ఎవని హృదయములో వికారము కలుగదో, వాని ఆ హృదయము రాయి వలె కఠినమైనది. నామమును విన్న వెంటనే కలిగే వికారముయొక్క లక్షణమేమనగా, కన్నుల వెంబడి ఆనంద బాష్పములు రాలుట, మరియు రోమాంచము కలుగుట.

ఓ సూతా! పరీక్షిన్మహారాజు చక్కగా ప్రశ్నించినాడు. ఆత్మజ్ఞాన ములో దిట్ట, భగవద్బక్తులలో మొదటివాడు మరియు వ్యాసుని పుత్రుడు అగు శుకమహర్షి ఆయనకు చెప్పిన విషయమును నీవు మాకు చెప్పుము. నీవు చెప్పే మాటలు మా మనస్సులకు ఆనందమును కలిగించుచున్నవి.

శ్రీమద్బాగవత మహాపురాణములోని రెండవ స్కంధములో మూడవ అధ్యాయము ముగిసినది.